భావచమత్కారం
సాహితీమిత్రులారా!
చమత్కారాలలో భావ చమత్కారమొకటి
చెప్పదలచుకొన్న భావాన్ని సూటిగా
చెప్పకుండా చిత్రమైన మలుపు త్రిప్పి
చమత్కారంగా చెప్పటాన్ని
భావచమత్కారం
అంటారు.
ఇద్దరు ప్రేమికులు గోదావరీతీరంలో
ప్రతిదినం ఒక పూలతోటలో ప్రొద్దున్నే
కలుసుకొంటున్నారు. అదే సమయానికి
ఒక బైరాగి పూలకోసం అక్కడికి వచ్చేవాడు.
ఆ సన్యాసివేషం చూచి కుక్క ఒకటి
మొరుగుతూ అతని మీదికి వచ్చేది.
కుక్క మీదికి రావటం అతనికి ఇబ్బంది.
అతడు అక్కడికి రావడం ఈ ప్రేమికులకు
ఇబ్బంది. ప్రేమికులైన యువతీయువకు
లిద్దరు ఆ సన్యాసిని అక్కడకు రాకుండా
చెయ్యాలనుకున్నారు. అట్లని,
బైరాగీ నీవు రావద్దని
అతనితో ఎలా చెప్పగలరు
యువతి ఆలోచించించింది-
అతణ్ణి రాకుండా చెయ్యటానికి --
ఇచ్చకొలఁదిఁ దిరుగు మింక బైరాగి గో
దావరీతటమున దట్డమైన
పొదలఁ జేరి యొక్క పొగరైన సింగ మా
కుక్కపోతు నిపుడె కూల్చి చంపె
(గాథా సప్తశతి)
అని చెప్పింది.
ఆ బైరాగి ఇక స్వేచ్ఛగా రావచ్చట
అతణ్ణి ఇబ్బంది పెడుతున్న కుక్కను
అక్కడే దట్టమైన పొదల్లో ఉన్న పొగరైన
సింహం ఇప్పుడే కూల్చి చంపిందట
కుక్కతోనే ఇబ్బంది పడుతున్న సన్యాసి
ఇక వస్తాడా రానే రాడు. కాని, ఆమె
ఆ సన్యాసిని రావద్దని చెప్పిందా
చెప్పలేదే. అట్లని రావద్దని చెప్పలేదా
చెప్పింది. చెప్పకుండా చెప్పింది.
ఆ సన్యాసి మనస్సు నొచ్చుకోకుండా
చెప్పింది. దీన్నే భావ చమత్కారం అంటారు.
No comments:
Post a Comment