Saturday, November 14, 2020

మురారి చమత్కారం

 మురారి చమత్కారం




సాహితీమిత్రులారా!

అనర్ఘరాఘవ నాటకాన్ని రచించిన మురారి గొప్పదనాన్ని

వివరించే పద్యం ఇది చూడండి-


దేవీం వాచ ముపాసతేహి బహవ స్సారంతు సారస్వతం
జానీతే నితరామసౌ గురుకులక్లిష్టో మురారిః కవిః
అబ్దిర్లంఘిత ఏవ వానరభటైః కింత్వస్యగంభీరతా
మాపాతాళనిమగ్న పీవరతను ర్జానాతి మంథాచలః


ఎందఱో కవులు కవితా సరస్వతిని ఉపాసించువారున్నారు
కానిీ అత్యంతమైన గురుకులక్లేశమును అనుభవించి విద్యలు
సాధించిన ఒక్క మురారికవి మాత్రమే సారస్వతసారమును
చాలా బాగా పూర్తిగా తెలిసివున్నాడు. వానర గణాలకు
సముద్రమును పైపైనదాటి పోవడం మాత్రమే తెలుసు.
పాతాళం వరకు మునిగిన మందరగిరి మాత్రమే సముద్రంయొక్క
గాంభీర్యాన్ని లోతును తెలిసినది. అనగా చపలచిత్తులైన
వానరులవలె కవితా చాపల్యముగల యితరకవులు తమ భావాలకు
అనుగుణమైన నైఘంటికార్థాలు గల పదాలను వాడి పద్యరచన పూర్తి
చేసికొని ఆనందిస్తారేకాని, పద పదై కదేశ ప్రకృతిప్రత్యయాదుల
అర్థవిశేషాలను సమర్థతతో తెలుసుకొని సుష్ఠుప్రయోగాలను చేయలేరని
- శ్లోకభావం.

దీన్ని బట్టి కేవలం కవిత్వం నిఘంటువుల్లోని పదాలను వాడటమేకాదు
కవి అనేవాడు ఆ పదాలకు సంబంధించిన లోతైన విషయాలనుకూడా
తెలిసి వుండాలని శ్లోకాంతరార్థం. మరియు ఇది కేవలం మురారి కవికేకాదు
అందరు కవులకు సంబంధించినది.

No comments:

Post a Comment