Saturday, September 14, 2019

మన వాళ్ళొట్టి వెధవాయిలేనా?


మన వాళ్ళొట్టి వెధవాయిలేనా?




సాహితీమిత్రులారా!

ఏమివాయ్‌ మై డియర్‌ షేక్స్పియర్‌! మళ్ళీ ముఖం వేలవేసినావ్‌?? సొర్గానికి పోయినా సవితి పోరు తప్పనట్టు అమరలోకం లాటి అమెరికాకి వచ్చినా ఒక టెలుగూస్‌ కీ మరో టెలుగూస్‌ కి మధ్యన ఐకమత్యం అనే పదార్థం మీ నాన్న బుర్రలో మోడరన్‌ థాట్స్‌ వున్న సైజులో కూడా లేదే అని గుక్క పట్టి దుఃఖిస్తున్నావా? నాన్సెన్స్‌!! డబ్బుల హోదా కులాల బాధా కన్న దేశంలో కన్నా యీ “ఉన్న” దేశంలోనే మిక్కుటవని ఖేదపడుతున్నావా? డబుల్‌ నాన్సెన్స్‌!! ఎవరో అన్నట్టు మనవాళ్ళొట్టి వెధవాయిలోయ్‌!!

ఎవరో కాదా ఆ మాటన్నది నేనేనా? చూశావా నాతో మాట్టాడ్డవే ఓ ఎడ్యుకేషన్‌ అంటే విన్నావు గావు. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అంటూ నా మాటలు వినక యీ అమెరికాకి వచ్చి తగలడ్డావ్‌.. మన అగ్రహారం చుట్టూ వున్న ఐదెకరాల ప్రపంచాన్నంతా ఆపోశనం బట్టిన యీ గిరీశం గారి వాదాన్ని కాదని ఆ (బారిస్టర్‌) పార్వతీశం స్టయిల్లో నానా తిప్పలూ పడ్డావ్‌.. మై డియర్‌ వెంకటేశం! ఇంత భగీరథప్రయత్నానికి గాను ఫలితంగా నీకు దక్కిందేవిషీ ఓ యూనివర్సిటీ పట్టా, ఓ పట్టాన యీ దేశాన్ని వదల్లేక అంటిపట్టుకు వేల్లాడే దురవస్థా తప్ప?

ఐనా అసలు తెలుగు వాళ్ళకి ఐకమత్యం అవసరం అన్న వాజెమ్మెవడో చెబితే వాడి జేజెమ్మ క్కూడా బేజారెత్తేలా ఒక్క ఘంట బిగిన ఏకధాటిగా లెక్చరిద్దును! దాంతో వాడు డంగై పోయి నాలిక్కటుకూ కటుకూ కరుచుకుని హన్నన్నా తొందరపడి పోయి మాటే గదా మన సొమ్మేం బోయిందని రెXంత మాటన్నానూ అని ఊళ్ళో వాళ్ళందరికీ మందువిందు యిచ్చి మరీ ప్రాయశ్చిత్తం చేసేసుకోడూ? కాకపోతే ఏవిటయ్యా ఐకమత్యంలో వున్న గొప్పతనం? తెలుగు వాడిని చూస్తే తెలీదూ నిజానికి ఐకమత్యం వల్ల వొచ్చేది గొప్పతనం కాదు గొప్ప పతనం అని! అసలూ, బృహన్నారదీయం పదహారో ఆశ్వాసంలో ఏమన్నాడూ “కాంపిటీషన్‌ ఈజ్‌ ద ఎస్సెన్స్‌ ఆఫ్‌ ప్రోగ్రెస్‌ ” అని కాదూ? అందుకే మనం ఊరుకో ఇరవై తెలుగు సంఘాలన్నా పెట్టి పోటీలు పడకపోతే చకచకా ప్రోగ్రెస్‌ సాధించటం మనవల్లయ్యే పనేనా?

మొన్ననో పొగరుమోతుబరి గారు మన ప్రొఫయిల్‌ ని దూరం నించే చూసి డంగై పోయి “గిరీశం గారూ ఎటూ యిందాకా వొచ్చారు మా యింటి దాకా వొచ్చి దాన్నీ మమ్మల్నీ పావనం చేసి పుణ్యం కట్టుకోండి” ఆవటాని కాళ్ళా వేళ్ళా బడితే కనికరంతో సరేనని వాళ్ళింటికి పార్టీకి వెళ్ళాం గుర్తుంది గదా! అక్కడ చూశావుగా మనవాళ్ళ “ఏకత్వంలోనే భిన్నత్వం” ఈస్ట్‌ మన్‌ కలర్‌ భారీప్రదర్శన? ఒహడు చెప్పింది ఇంకొహడు చచ్చినా ఒప్పుకోడు అది నిజంగానీ కాకపోనీ. అసలు ఒహడు చెప్పింది ఇంకొహడు వింటాడా అనా నీ ధర్మసందేహం?

మై డియర్‌ వెంకటేశం! నువ్వింత బ్రిలియంట్ల వెధవ్వి ఎప్పుడయ్యావోయ్‌ నాకు తెలీకుండా, నాకు తెలీకడుగుతాను? మరి నీలాటి ఉత్తమ(బ్బు) స్టూడెంట్‌ అడిగినా కూడా చెప్పకుండా వుండటం నా తరవా? ఇప్పుడూ, ఈ “వినటం” అన్నది చూశావూ ఇది బ్రహ్మపదార్థం లాంటిదోయ్‌ ఓ పట్టాన చేతికి చిక్కి చావదు. నేన్నీకు ఇప్పుడు చెబుతున్నదంతా నువు వింటున్నట్టు జోరుగా బుర్రూపేస్తున్నావు గదా మరి నేను చెప్పిందంతా అప్పజెప్పు చూస్తాను యీ లెక్చరు చదవకుండా! ఏవిటా వెర్రి చూపులూ నువ్వూను? ఇంతకాలంగా నీ చెవి కింద అమెరికన్‌ జోరీగ లాగా అమెరికాలోనే తెలుగు వాళ్ళ కధ రాయాలనుకునే వాడి బుర్రలో వెర్రిమొర్రి ఆలోచనల్లాగా తరతరాల తెలుగు వాడి వెధవాయిత్వంలాగా తెలుగు వాళ్ళ బుర్రల్లో పేరుకున్న కులగోత్రాల జిడ్డు మడ్డి లాగా ఎంతకీ కదలని యీ వాక్యం లాగా వదలకుండా పట్టుకుని వున్న నా మాటలే నువ్వు “విననప్పుడు” ఎక్కడో పుట్టి యిక్కడో పార్టీలో ఒక చెట్టు కింద మెట్టి నంత మాత్రాన తెలుగు వాళ్ళంతా చెట్టపట్టాలేసుకుని జట్టుకట్టాలంటం బేస్‌ బార్బేరియన్‌ థాట్‌ !!

చూశావా అలవాటు కొద్దీ అన్నం వొదిలేసి ఆవకాయ తిన్నట్టు అసలు విషయం వొదిలేసి అటేటో పోతున్నాం? అందుకే నాతో మాట్టాడ్డవే ఓ ఎడ్యుకేషన్‌ !

తెలుగు వాళ్ళ ఐకమత్యం గురించి గదూ మనం మాట్టాడుతుంటా! అసలు నువ్వు ఆశ పడుతున్నట్టు అంతా ఐకమత్యంగా వుండి పోయి ఒహడి నెత్తిన మరొహడు అస్తమానూ చెయ్యెయ్యకుండా “మనవంతా ఒకటే కుటుంబం” అని అదేదో బైస్కోపులో తెరపట్టని హీరో తాండవం జేస్తూ పాడినట్టు పాడుకుంటూ వుండిపోతే యీ లోకవంతా ఏవైపోను? కులగిరులు కూలిపోవటాలూ కులసతులు గ్రహగతులు తప్పించెయ్యటాలూ సప్తసముద్రాలు పొంగటాలూ స్టాక్‌ మార్కెట్లు కుంగటాలూ అప్పుడు మళ్ళీ ఆ “సంభవామి యుగేయుగే” అన్నాయన అర్జంటుగా పామ్మీంచి లేచి పనిగట్టుకు కొత్త వేషం వేసుకు రావటాలు పోట్లాటలు గట్రా సృష్టించి ధర్మాన్నుద్ధరించటాలు ఎందుకొచ్చిన సంత ఇదంతా? అంత కథా కమామీషు లేకుండా మనవంతా హాయిగా ఆనందంగా తిట్టుకుంటూ కొట్టుకుంటూ కులాల పేరుతోనూ శాఖల పేరుతోనూ “అస్తి నాస్తి” విచికిత్సల్తోనూ ఏదీ దొరక్కపోతే (యింటి)పేర్లు వేరయినందు వల్లనో కాకపోతే కాకపోయినందు వల్లనో అడ్డుగోడలు కట్టుకుంటూ రోజుల్ని నెట్టుకుంటూ వున్నామా యింకేవుందీ కోయిల్లు కూస్తాయి పువ్వులు పూస్తాయి కులవ్యవస్థ సుస్థిరంగా నిలుస్తుంది తరతరాల సంస్కృతి కాలరెత్తుకుని (మారు)మూలస్థంభంలా నిలబడుతుంది!

అసల్నన్నడిగే వాడు నువ్వుగాక ఎవడన్నా వుంటే వాడి తల మీదే ఢంకా బద్దలు కొట్టేసి చెబుదును ఐకమత్యం కావాలనే వాళ్ళందర్నీ కట్టగట్టి ఏ నయాగరాలోనో గిరాటేస్తే తప్ప యిక్కడి తెలుగు జాతికి విముక్తి లేదని. సరేగాని మై డియర్‌ వెంకటేశం! పొద్దున్నే పరగడుపున ఐకమత్యం లాంటి అగాయిత్తెం మాటల్తో నోరు చెడిపోయింది గాని ఆచమనానికి నీదగ్గరేమైనా అమృతంగాని వుందా?

(గురజాడ వారి అడుగు జాడల్లో గిరీశాన్ని పరుగులు తీయించిన ముళ్ళపూడి వారి దారిలో తప్పటడుగులు)
------------------------------------------------------
రచన: మాటల మల్లన్న, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment