Thursday, September 5, 2019

దౌలత్


దౌలత్
సాహితీమిత్రులారా!

ఊరికి ఒక మూలగా పెద్దపెద్ద రాళ్లు విసిరేసినట్లుండే చోట ఉంటుంది మా ఇల్లు. ఆ చుట్టుపక్కల పెద్ద రోడ్లూ ఏవీ లేవు. మా ఇంటికి పోవాలంటే ఒక చిన్న గుట్ట ఎక్కాలి. ఆ గుట్ట నిండా రాళ్లే. మేమున్న బస్తీ చివర పప్పాజీ కార్ఖానా కనిపిస్తుంది. పప్పాజీ కార్ఖానాలో తయారు చేసిన గణేశ్‌జీ, కాళీమా, హనుమాన్‌జీ, శివ్‌జీ విగ్రహాలను పనివాళ్లు ట్రక్కులెక్కిస్తూ ఉంటారు. వాళ్ళ అరుపులు వినబడనంత దూరం వస్తే అక్కడ కుడివైపు గుట్ట మీదకి పోయే మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్లకు రెండువైపులా కొన్ని ఇళ్లు చెల్లాచెదురుగా ఆ రాళ్ళ మధ్య మొలిచినట్లే కనిపిస్తాయి. యాభైరెండో మెట్టు దగ్గర ఎడమవైపుకు తిరిగి ఎదురుగా వున్న గడపలో అడుగుపెడితే మా ఇంటి లోపలికి వచ్చినట్లే.

పేరుకి మా ఇల్లు అన్నానే గానీ అది ఇల్లులా ఉండేది కాదు. కొన్ని పాతగదులు గుంపుగా చేరి కబుర్లాడుకుంటున్నట్టు ఉండేది. రోడ్డుకు దూరంగా ఉన్నందువలన ఇంటి చుట్టూ నిశ్శబ్దంగా ఉండేది. మా ఇంటి కాంపౌండు అంటూ కచ్చితంగా చెప్పడానికి ఇంటి చుట్టూ కంచె గానీ గోడ గానీ ఉండేవి కావు. పాతకాలం ఇల్లు కాబట్టి ఎప్పుడో ఏవో కొన్ని బండరాళ్ళను చూపించి అదే ప్రహరీ అయుంటుంది అనేవాడు చాచా. మా చాచా ఏం చెప్పినా నేను నమ్మేసేవాణ్ని. కానీ అది ప్రహరీనో కాదో కచ్చితంగా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు.

మా ముత్తాతకు ముత్తాతకు ముత్తాత ఔరంగజేబు సైన్యంలో పని చేసేవారట. ఎవరూ ఆయనను గురించి ఏకవచనంలో సంబోధించినట్లుగా నాకు గుర్తులేదు. అందుకే ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఒక్కణ్ణే గాక ఆయన చుట్టూ అచ్చం ఆయన లాంటి లెక్కలేనంత మంది మనుషులని చేతుల్లో కత్తీ డాలులతో, కొందరిని చేతుల్లో కొన్ని బరిసెలతో, ఇంకొందరిని నాటు బాంబులతో (ఇవి అప్పటికి ఉన్నాయో లేదో తెలీదు), కొన్ని గుర్రాలనీ, ఏనుగులనీ ఊహించుకునేవాణ్ణి. ఔరంగజేబు సైన్యంలో వీరిని ఆత్మాహుతి దళం అనేవారంట. ప్రతి యుద్ధంలోను వీరిని ముందు వరసలో నిలబెట్టేవారు కాబట్టి, యుద్ధానికి వెళ్ళడం అంటే వారు చనిపోయినట్లే లెక్క.

ఆ చావును తప్పించుకుని మా పెద్దముత్తాత ఇలా ఈ ఊరికి రావడం గురించి ఒక కథ ఉంది. అప్పటి హైదరబాదు నిజామ్‌పై దండెత్తి వచ్చాడు ఔరంగజేబు. ఇక్కడ గెలిచి వెళ్ళిపోతున్నప్పుడు, కొంత సైన్యాన్ని వదిలి నిజామ్‌నే తన సామంతునిగా నియమించి తిరిగి దిల్లీ పోతుండగా, మధ్యదారిలోనే ఔరంగజేబుకు జబ్బుచేసి చనిపోయాడు. వెంటనే నిజామ్ ప్రభువు తనను తాను రాజుగా తిరిగి ప్రకటించుకున్నాడు. మిగిలిన సైన్యం అంతా తన సైన్యం అయిపోయింది. కాని, ఈ ఆత్మాహుతి దళంలోని కొందరు హిందువులని మతం మార్చుకొమ్మని ఆదేశించాడు నిజామ్. మరాఠా వంశస్థులుగా చెప్పుకునే మావాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. నిజామ్ వారందరినీ కోటకు బైట మేము ప్రస్తుతం ఉన్నచోట ఉండమని ఆజ్ఞాపించాడు. అలా ఇక సైన్యంలో చోటు పోయేసరికి మా వంశంవారు విగ్రహాలు చేయడం వృత్తిగా చేసుకున్నారు.

కథ సంగతి ఏమో గానీ మా ఇల్లు ఎంత పాతదో మా పప్పాజీకి కూడా తెలీదు. కానీ ఇది వాళ్ళ తాతల కాలం నుంచి ఉన్నదని చెప్పేవారందరూ. ఈ ఇల్లు కట్టకముందు ఎక్కడ ఉండేవాళ్ళం అనేది ఎవరికీ తెలీదు. నా చిన్నప్పుడు మా చినాన్న ఒక పాతకాలం నాటి చురకత్తిని తుడుస్తూ ఉండడం మాత్రం నాకు గుర్తుంది. అయితే ఇంట్లో వచ్చే పెద్ద పెద్ద ఇబ్బందులకి ఏవేవో చిన్నచిన్న రిపేర్లు చేయిస్తూ నడిపేసేవారు పప్పాజీ. పెచ్చులూడుతున్న గోడలకు కాస్త మట్టి అద్దడం, వాడిన నీళ్లను మళ్లించడం, వర్షాకాలంలో పైకప్పు కురవకుండా సున్నం పూయడం–ఇలాంటి పనులుండేవి. పప్పాజీ అటువంటి పనులు చేస్తున్నప్పుడు చినుగుల బనియన్‌ లోంచి పొంగిన ఆ భుజాలూ, చేతి కండలూ వెక్కిరిస్తూ నవ్వుతున్నట్లుండేవి.

ఇప్పుడైతే నేను ఇంటిని మళ్ళీ కట్టించాను. కానీ నా కారును ఇప్పటికీ గుట్ట కింద పప్పాజీ కార్ఖానా షెడ్డులోనే పెడతాను. సిటీలోకి పోయి బతకొచ్చన్న ఆలోచన ఇప్పటివరకూ మాకెవ్వరికీ రాలేదు.

చెప్పానుగా మేమున్న ప్రాంతం అంతా రాళ్ళేనని. రాళ్లంటే చిన్నవి కాదు. పెద్దపెద్దవి. ఒక్కొకటి ఐదు నుంచి పాతిక అడుగుల వరకూ ఎత్తుంటాయి. కొన్ని రాళ్లు నేల మీద పరుచుకుని ఉండేవి. మాఁ పొద్దున్నే లేచి చపాతీ చేస్తే నేను ఇంటిముందున్న ఒక రాయి పైన కూర్చుని తినేవాడ్ని. బడేపప్పాజీ వచ్చినా ఇంటిలోకి రాకుండా ఇంటి ముందున్న రాయి మీదే కూర్చుని మాట్లాడేవాడు. మాఁ కూడా బట్టలు ఉతికి బండరాళ్ళ మీదనే ఆరేసేది. ఇంటికి వచ్చే దారిలో ఉన్న మెట్లు పడక ముందు ఆ రాళ్లు ఎక్కే ఇంటికి వచ్చేవాళ్లమని చెప్పేవారు పప్పాజి.

మా పాతింటి వంటగది వెనుక మాఁ గిన్నెలు తోముకోడానికి కాస్త స్థలం ఉండేది. అది దాటి నాలుగు అడుగులకు ఒక చిన్న లోయ ఉండేది. చిన్నప్పుడు మాఁ ఇచ్చిన చాయ్ తాగుతూ దూరంగా కనిపిస్తున్న పెద్ద గుట్టకేసి చూస్తుండటం అలవాటుగా ఉండేది నాకు.

చుట్టుపక్కల ఎన్ని గుట్టలున్నా మా ఇంటి వెనుక నుంచి కనిపించే గుట్ట అన్నిటికన్నా పెద్దది. ఆ గుట్టలో ఏదో రహస్యం ఉన్నట్టు ఎప్పుడూ అనిపించేది. ఒకే ఒక్క పెద్ద రాయి గుట్టలా ఉంటుంది కాబట్టి దానిని రాయి గుట్ట అంటారు… అది దూరం నుంచి చూస్తే ఒక పెద్ద జారుడు బండలా కనిపిస్తుంది. ఆ గుట్ట పై అంచున ఇంకొక గుండ్రటి రాయి ఉంది. అది దొర్లిపోబోతూ హఠాత్తుగా మనసు మార్చుకుని అంచున ఆగినట్లు ఉంటుంది. చిన్నప్పుడు అది పడిపోతుందేమోనని ఎదురుచూసేవాణ్ణి.

నాకిప్పటికీ గుర్తు. చిన్నప్పుడోసారి బాగా వర్షం పడింది. ఆ తరవాత గాలి కూడా వచ్చింది. ఆ రాత్రంతా ఆ రాయి పడిపోతుందేమో అని నిద్రలో ఉలికులికిపడి లేస్తూనే ఉన్నాను. పొద్దున్నే లేచి భయంభయంగా చూస్తే ఆ రాయి అలానే ఉన్నది. ఆ రోజు నేను తాగుతున్న చాయ్ చప్పగా అనిపించింది… ఒకసారి భూకంపం వచ్చినప్పుడు మా గుట్టలో ఇళ్లు కొన్ని కదిలిపోయాయి గాని, ఆ రాయి మాత్రం అలానే ఉంది.

ఇక నాకు పదిహేనేళ్ళొచ్చి నేను ఎన్‌.సి.సిలో జాయిన్ అయినప్పుడు ఆ గుట్టను ఎక్కాలన్న ఆలోచన వచ్చింది. ఆ సమయంలో పప్పాజీ మా చాచాతో పేచీపడి కోర్టు చుట్టూ తిరుగుతుండేవారు. మాఁకి ఏదో ఒకటి చెప్పితే నమ్మేసేది. కానీ నా దగ్గర ఎన్‌.సి.సిలో ఇచ్చిన వస్తువులేమీ లేవు. ఏదేమైనా సరే, నేనూ నా స్నేహితుడూ కలిసి ఆ గుట్ట మీదకి పోదామనుకున్నాం.

చూడడానికి దగ్గరగానే అనిపించినా గుట్టను చేరడానికి ఇరవై నిముషాల పైనే పట్టింది. గుట్ట పైకి ఎక్కుతున్నప్పుడు హఠాత్తుగా గుట్ట మీది రాయి రెండుగా చీలిపోయి కనిపించింది. చీలిపోయిన ఆ రాళ్ల మధ్య ఏడు అడుగుల దూరం ఉంటుంది. ఒక మనిషి దానిని దాటాలంటే రెండే దారులు: అయితే ఒక నిచ్చెన లాంటి దాన్ని వంతెనగా వాడాలి. లేదంటే దూరంగా వెనక్కిపోయి పరుగెట్టుకుంటూ వచ్చి ఎగిరి దూకాలి. కానీ సరిగ్గా దూకకపొతే ఆ చీలికలో పడిపోవచ్చు. దాని లోతు ముప్పై అడుగులపైనే ఉంటుంది. ఆ చీలిక లోతు పెరుగుతున్నకొద్దీ రెండు రాళ్ళ మధ్య దూరం సన్నమవుతోంది. అందులో ఇరుక్కునేంత సాహసం చేయలేకపోయాం. అక్కడే కాసేపు కూలబడ్డాం. వెనక్కి వస్తుండగా నేను ఆ గుట్టను బలంగా తన్నాను.

ఆ తర్వాత నాకు పదిహేడేళ్లు వచ్చేవరకూ మళ్ళీ అటువైపు వెళ్ళలేదు. కానీ నేను రోజూ చాయ్ తాగే సమయంలో వంటగది వెనుకకు పోయి చూడడం మాత్రం మానలేదు. ఆ రాయి అలాగే ఠీవిగా అతివాది మతగురువులా మొండిగా నిలబడే ఉండేది. కొన్నిసార్లు పంటి కింద నలగని వగరు వక్కపలుకులా అనిపించేది. ఆ తర్వాత నేను నా చదువు వలన ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చింది.

నా పరీక్షలైపోయి నేను తిరిగి ఇంటికొచ్చాక పరిస్థితులు మారిపోయాయి. పప్పాజీ చాచా మీద వేసిన కోర్టు కేసులో మేము ఓడిపోయాం. పప్పాజి ఆ ఉదయం నుంచి మాఁ మీద అరుస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం మేం భోంచేస్తోంటే మాఁ వడ్డిస్తోంది. పప్పాజి మళ్ళీ కూర తక్కువ ఉందని మాఁని తిట్టారు.

“ఉన్న ఆస్తి పోగొట్టుకున్నారు. ఇక తినడానికి ఉండటమే ఎక్కువ! నా పిల్లలకోసం కాస్త ఇదైనా మిగిల్చాను…” నెమ్మదిగానే అంది.

పప్పాజీ ఎడం చేత్తో ఆమె జుట్టు పట్టుకుని ఎంగిలి చేత్తోనే మాఁని కొట్టడం మొదలు పెట్టాడు. నేనిక భరించలేకపోయాను. పప్పాజీ ఎత్తిన చెయ్యిని గట్టిగా పట్టుకుని మెలితిప్పి రెండో చేతి పిడికిలి బిగించి మొహం మీద కొట్టబోతూ ఆయన్ని చూశాను. మాఁ నన్ను పట్టుకుని ఆపింది. ఆమె రెండో చెయ్యి పప్పాజి కొట్టిన చెవి మీదనే ఉంది. పప్పాజి మొహంలో ఏ భావమూ లేదు.

నేను ఎత్తిన చేతిని దించాను. మాఁ నెత్తిమీద కొంగును కప్పుకుంటూ లేచి వంటగది వైపు వెళ్ళింది. నేను గబగబా బయటపడ్డాను. నా మనసులో అర్ధం కాని కళ్ళతో దీనంగా చూస్తున్న మాఁ కదులుతోంది. అలా నడుస్తూ నడుస్తూ ఉన్నట్టుండి ఆగి చూస్తే నేను ఆ గుట్టకు ఎదురుగా నిలబడి ఉన్నాను. ఏ భావమూ లేని పప్పాజీ చూపు గుర్తొచ్చింది. నా వంట్లో రక్తం మరిగి ఉరకలెత్తింది. ఇక ఆగలేదు. ఈ మూడేళ్ళలో నా చేతులు గట్టిపడ్డాయి, భుజాలు పొంగాయి. నా వేగం పెరిగింది. ఆ గుట్టమధ్య ఉన్న చీలిక దగ్గరకు రాగానే రెండు అడుగులు వెనక్కి వేసి ఒక్కసారిగా ముందుకు పరిగెత్తుతూ వచ్చి, ఊపిరి బిగపట్టి గబుక్కున దూకాను.

కళ్ళు తెరిచి చూసేసరికి నేను అవతల గుట్ట మీద ఉన్నాను. గుట్ట మీదెక్కుతూ నేనారోజు ఏమాలోచించానో గుర్తులేదు. మా ఇంటి వైపు చూసి గుర్తుపట్టడానికి చేసిన ప్రయత్నం మాత్రమే గుర్తుంది. దూరంగా ఏటవాలుగా కనిపించిన గుట్ట దగ్గర్నుంచి చూస్తే అంత వాలుగా ఏమీ లేదు. కొన్ని చోట్ల చదునుగా ఉండి నడిచినా, ఇంకొన్ని చోట్ల చిన్న సాహసాలు చేస్తూ ఎక్కవలసి వచ్చింది. ఎక్కుతున్నకొద్దీ నాలో ఏదో అడవిగుర్రాన్ని అదుపులోకి తెచ్చుకుంటున్నట్టు అనిపించింది.

అయితే గుట్ట పైఅంచుకు చేరాలంటేనే ఇబ్బంది. ఆ గుట్ట పైన మొత్తం రాయి ఆక్రమించి ఉంది. దాని చుట్టుకొలత ఇంచుమించుగా పాతిక అడుగుల పైనే ఉంటుంది. గుట్ట పై అంచున సరిగ్గా నిలబడలేకపోవడమో లేక గుట్టపై రాయి నాకన్నా ఎక్కువ ఎత్తులో ఉండటం వల్లనో, ఏదో మరి, ఆ రాయి అడుగున నించున్న నాకు ఎందుకో చిన్నతనంగా ఉండింది. ఆ గుట్టను రెండు చేతులతో పట్టుకుందామని నా తలానించాను. అందులోంచి ఏమైనా వినబడుతుందా? సాయంత్రం సూర్యుడితో వేడిక్కిన రాయి బుగ్గను చుర్రుమనిపించినా బాగుందనిపించి అలానే ఉండిపోయా. తలెత్తి చూశాను. నా ఎత్తుకు ఇంకో మూడింతలు ఉంటుంది ఆ రాయి. పైన ఏదో చెక్కినట్లుగా ఉంది. అంటే నాకన్నా ముందే ఎవరో ఈ రాయి ఎక్కారా? వెళ్లి ఆ రాయిని ఆనుకుని కూర్చున్నా.

ఇంకాసేపటిలో చీకటి పడిపోతుంది. ఈ రోజుకింతే. కానీ రేపు మళ్ళీ వెలుగొస్తుంది, దాని తర్వాత మళ్ళీ చీకటి! నాకెందుకో ఆ సమయంలో వెలివేయబడ్డ నా ముత్తాత గుర్తుకువచ్చాడు. అతను నాలానే నాలుగొందల ఏళ్ళ క్రితం ఈ రాయిని ఆనుకుని ఇలా సాయంకాలం పూట సూర్యుణ్ణి చూసి ఉంటాడా, ఆయన చేతిలో ఉన్న బరిసెను పక్కన పడేసి? డాలు వేసుకుని, నెత్తిమీద శకటం పెట్టుకుని పెద్దమీసాలు, విశాలమైన ఛాతి ఉన్న తాత కూలబడి ఉండడు. నుంచునే ఉంటాడు. అన్ని యుద్ధాలు చేసిన వ్యక్తి ఈ రాయి ఎక్కలేపోయుంటాడా? ఈ రాయి పైకెక్కి తనవాళ్లకు అండగా ఇక్కడ నిలబడి తన వంశస్థుల పహారా కాస్తుండేవాడా? అన్ని యుద్దాలలో రాటుదేలిన మనిషి విగ్రహాలు తయారుచేస్తూ ఎలా రాజీ పడ్డాడు? చీకటి పడుతుండగా ఇంటికి తిరిగి వచ్చాను. నిద్రలో ఆ రాతి పైన అస్పష్టమైన అక్షరాలు కనిపించాయి. ఆ గుట్ట కింద ఒక తోడేలు కనిపించింది. పొద్దున్నే చిన్న నెమలి పిల్ల, ఒక ముంగీస కూడా కనిపించింది. అది ముంగీస కాదేమో… ఉడుము కూడా అయ్యుండొచ్చు.

పొద్దున్నే నా పాత దోస్తు ఇంటికి వెళ్లాను. అంత పొద్దున్నే వచ్చిన నన్ను చూసి వాడు ఆశ్చర్యపోయినా నా వెనుకే వచ్చాడు. ఇద్దరం అదే గుట్టకు వెళ్ళాము. ఈసారి ఆ ఏడు అడుగులూ దాటేయడం సులువైపోయింది. నా స్నేహితుడు పెద్దగా మాట్లాడడు. అయినాగాని పైకి ఎక్కుతున్నప్పుడు నిన్నటి నిశబ్దం దూరమైపోయినట్లుంది.

గుట్ట మీద రాయి, అడుగేసే ముందు కాలెత్తి గాలిలోనే ఆగినట్లు, కొద్దిగా పైకి లేచి ఉంది. గుట్టకూ, రాయి లేచిన చోటుకూ మధ్య మూడు నాలుగు అడుగుల స్థలం ఉంది. అక్కడ హాయిగా పడుకోవచ్చు. కానీ రాయిని పూర్తిగా చూస్తే పడుకునే సాహసం చేయలేం. ఆ రాయి పైకి ఎక్కడానికి ప్రయత్నించి విఫలమైతే అప్పుడైనా వెనక్కి జారి వెనక్కి రావొచ్చు అనిపిస్తుంది. నేను ఆ రాయి చుట్టూ తిరగడానికి వెళ్ళాను. పది అడుగులు వేశాక గుట్ట వెనుక లోయ కనిపించింది. అక్కడ కాలు మోపే స్థలం కూడా లేదు. గుట్ట పైనున్న రాయి అక్కడి అంచువరకు పరుచుకుని వుంది. నేను వెనక్కి వచ్చాను. ఇద్దరం రాయి పైన చెక్కిన అక్షరాలను అర్ధం చేసుకునే ప్రయత్నం చేశాం. ఆ అక్షరాలను చెక్కి, పైన తెల్ల రంగు పూశారు. నా స్నేహితుడు గబాగబా గుట్ట దిగివెళ్లి కొంత దూరం నడిచాడు. నేను మళ్లీ గుట్ట మీదనుంచి మా ఇల్లు కనిపెట్టే పనిలో పడ్డాను.

కింద నుంచి వాడు రాయి విసిరి నన్ను రమ్మన్నట్టు సైగ చేశాడు. భూమిలోనుంచి తన్నుకు వచ్చే నీటిబుగ్గకు కాలు అడ్డం పెట్టినట్లుంది వాడి మొహం. కిందకు వెళ్ళగానే గుట్టపైన రాయిని చూపించాడు. నా కళ్లు పెద్దవయ్యాయి. ఇద్దరం మళ్ళీ ఒకరినొకరం చూసుకుని మళ్ళీ ఆ రాయి వైపు చూశాం. రాతి పైన చెక్కిన పేర్లు తిరగబడి ఉన్నాయి.

తిరిగి గుట్టను దాటి వెనక్కి వచ్చేప్పుడు ఆ రాయి నాకు మరింత దగ్గర మనిషిలా మారినట్లు అనిపించింది. ఎప్పటి పరిచయస్తుడో నా అక్కనో చెల్లినో చేసుకుని నాకు అతి దగ్గర బంధువయేముందు కలిగే వాత్సల్యం వంటిది ఆ రాయిపై కలిగింది.

రాత్రి కార్ఖానా నుండి పప్పాజీ ఇంటికి వచ్చేవరకు ఎదురు చూసి, రాగానే అడిగాను. “ఆ రాయిగుట్ట పైన ఉన్నది మీ పేరేనా?”

పప్పాజీ తన పాంటు నుంచి లుంగీకి మారబోతూ మాట్లాడకుండా కాసేపు ఉన్నారు. నేను మళ్ళీ అడిగాను. ఎంత దాచిపెట్టుకుందామనుకున్నా నా గొంతులో గాభరా నాకే వినిపిస్తుంది. లుంగీ కట్టుకుంటూ పప్పాజి నా వైపు చూపొకటి విసిరారు: “అవును నేనే!”

మాఁ తీసుకొచ్చిన చాయ్ అందుకుని ఆయనకు అందించాను. అంతకన్నా ఎక్కువగా మాట్లాడుకోవడం మా ఇద్దరికీ అలవాటు లేదు. ఆయన ఎప్పుడూ గంభీరంగా ఉండేవారు మాతో. ఆయన చాయ్ తాగుతుండగా మళ్ళీ అడిగాను.

“మరి ఆ ఇంకో పేరు? చాచాదేనా?”

“అవును, మీ చాచానే.” పప్పాజీ పడక్కుర్చీలో కూర్చుని న్యూస్ పేపర్ల వైపు చూశారు. పేపరు అందించి వచ్చాను.

గదిలో ఉన్న పప్పాజీ నాకు మదపుటేనుగును లొంగదీసిన మావటిలా అనిపిస్తున్నారు. ఆయన గురించి నాకు గర్వం, ఈర్ష్య ఒకేసారి కలిగాయి.

“ఎలా ఎక్కారు?” రాత్రి ఆయన రేడియోలో వార్తలు వినడం పూర్తవగానే అడిగాను.

“అలానే ఎక్కాం.”

“అదే ఎలా?”

“అలానే. కష్టమైంది కానీ ఎక్కాం.”

“ఒక్కసారేనా…”

“లేదు. మూడునాలుగుసార్లు.”

ఆ తర్వాత గుట్ట మీదకు పదేపదే వెళ్లి ఆ రాయిని ఎక్కడానికి ప్రయత్నించాము. నెమ్మదిగా కొన్ని రోజులకు ఎక్కే సులువు అర్థమైంది. ఆ రాయి పైన ఉన్న చిన్న చిన్న గరుకు అంచులను పట్టుకుని పైకి పాకడం వచ్చింది. రోజూ పొద్దున్న సాయంత్రం ఇదే పని నాకు.

ఒకరోజు పొద్దున్న చాయ్ తాగుతున్నప్పుడు ఆ గుట్టను ఇంటివెనుక నుంచి ఎప్పటిలానే చూశాను. ఆ రాయి మీద తెలుపురంగు చూస్తున్నప్పుడే ఈరోజు రాయి పైకి పోతాననిపించింది నాకు. స్నానం చేసి మేము ఉంటున్న గుట్ట కింద ఆంజనేయస్వామి గుడికి వెళ్లాను. అక్కడ నూటపదహారుసార్లు హనుమాన్ చాలీసా చదివితే అనుకున్న పనులవుతాయని మా ఇంట్లో నమ్మకం.

సాయంత్రం మూడింటికి నా స్నేహితుడితో కలిసి వెళ్లాను. రాయి పైకి ఎక్కాక తాగడానికి కొద్దిగా గుడుంబా, మిక్చర్ తీసుకున్నాం. ఒక గంట కష్టపడ్డాక ఇద్దరమూ పైకి చేరాం. ఆపకుండా దౌడు తీసిన గుర్రం చెరువు దగ్గరకొచ్చి విశ్రాంతి తీసుకున్నంత హాయిగా ఉండింది. మా ముందు దూరంగా మా గుట్టకున్న వంద మెట్లు కనిపించాయి. గుట్ట మీద అడ్డదిడ్డంగా కట్టిన మెట్లు ఇక్కడినుంచి చూస్తే మాత్రం వరసగా పేర్చిన పేకముక్కల్లా ఉన్నాయి. మాకు ఎడమ వైపు అస్తమిస్తున్న సూర్యుడు. మాతో తెచ్చుకున్న గుడుంబా తాగి పడుకుని నీలంగా ఉన్న ఆకాశాన్ని చూశాం కాసేపు ఏమీ మాట్లాడుకోకుండా. నేను నెమ్మదిగా ప్రక్కకు తిరిగి పప్పాజీ పేరున్న వైపు చేరాను. బోర్లా పడుకుని పప్పాజీ పేరును తాకాను చేతితో. దానికిందనే చాచా పేరు. పప్పాజీ మొహం నా కళ్ళముందు మెదిలింది. ఆయన ఏం ఆలోచిస్తారో ఆమొహంలో ఎప్పుడూ తెలిసేది కాదు. రాయి మీద పేరు రాసుకున్న చాచాకీ ఇప్పుడున్న చాచాకీ మధ్య తేడానే పప్పాజీ కోపమేమో. నెమ్మదిగా ఆ రాయిని ముద్దుపెట్టుకున్నాను. చీకటిపడుతూ ఉంది. పోదామన్నట్టు చూశాడు నా స్నేహితుడు. లేచి రాయి మీద నించుని గట్టిగా ఊపిరి తీసుకున్నాను.

పొద్దున్న నిద్ర లేచి పప్పాజీ దగ్గరకు పోయాను. నావైపు ఏమిటన్నట్టు చూసి మళ్ళీ తన పనిలో పడిపోయారు. “పప్పాజీ!” అన్నా ఊపిరి బలంగా తీసుకుని. “నేను ఆ రాయి ఎక్కాను. నిన్న.”

పప్పాజి ఏమీ మాట్లాడలేదు. చిన్నగా సకిలించినట్లు చప్పుడు చేశారు. “మంచిది” అన్నారు న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుంటూ…

“కానీ… మీ పేర్లు ఎలా రాశారు?”

పప్పాజి న్యూస్ పేపర్ చూడబోయేవాడల్లా ఆగి నా వైపు చూశారు. “ఊరికే రాస్తే పోతుందనీ ముందు చెక్కాం. తర్వాత పెయింటు పూశాం.”

“ఎలా?”

“ఎలా ఏంటి? జేబులో సుత్తి, ఉలి, చిన్న పెయింట్ డబ్బా పెట్టుకున్నాము. పైకి ఎక్కాక మీ చాచా నా కాళ్ళు పట్టుకుంటే నేను కిందకి జారి చెక్కాను. తర్వాత నే పట్టుకుంటే తను చెక్కాడు. దానిపైనే పెయింట్ వేశాం.”

రాయిపై చెక్కిన అక్షరాలు తిరగబడి ఉండడానికి కారణం తెలిసింది.

నేను పిచ్చివాడిలా చూశాను. ఆ పేర్లు రాయి పైభాగం నుంచి కనీసం రెండు అడుగుల కింద ఉన్నాయి.

ఆ తరువాత కొన్నేళ్ళకు నేను నా ఉద్యోగంలో పడిపోయాను. అయినా కొండలెక్కే పిచ్చి తగ్గలేదు. నా ఎన్‌.సి.సి అనుభవం వలన నేను కాడెట్ కోచ్‌గా మారిపోయాను. నేను పనిచేసే సంస్థ నన్ను విదేశాలలో ఒక కోర్సు చేయడానికి పంపించింది. అందులో భాగంగా ఆస్ట్రేలియాలో మౌంట్ మెక్‌క్లింటాక్ ఒకణ్నే ఎక్కి వచ్చాను. ఈసారి, నా స్నేహితులు నన్ను వదిలిపెట్టలేదు. నా జర్నలిస్టు స్నేహితుడు నాపై వార్త రాస్తానన్నాడు. దానికి నా ఫోటో కావాలి.

పర్వతాలపై ఉన్న ఫోటో ఒకటి కూడా లేదు నా దగ్గర. కోచ్‌గా పనిచేస్తున్నప్పుడు తీసినవి బాలేవన్నాడు. అప్పుడు ఇంటి వెనుక గుట్ట గుర్తుకు వచ్చింది.

ఆ ఏడు అడుగుల చీలిక దాటడానికి క్లయింబర్లు వాడే నిచ్చెనతో సహా ఈసారి నా దగ్గర చాలా పరికరాలు ఉన్నాయి. నాకిప్పుడున్న అనుభవంతో కొన్ని తాళ్లు పట్టుకుని ఎక్కడం అంత ఇబ్బంది కాలేదు. నా స్నేహితుడు ముందు చెప్పినట్లుగానే గుట్టకు ఒక కిలోమీటరు దూరం నుంచి దాని ఎత్తు తెలిసేలా ఫోటో తీశాడు.

కొన్నిరోజులకు నా ఫోటో న్యూస్ పేపర్‌లో వచ్చిందని నా స్నేహితులూ సహోద్యోగులూ నాకు ఫోన్లు చేసి మెచ్చుకున్నారు. అప్పటికి నేను ఇంకో బాచ్‌కి కాడెట్ కోచ్‌గా ఊరికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. నా జర్నలిస్టు స్నేహితుడు వాట్సాప్‌లో ఆ వార్తను నాకు పంపాడు కానీ నెట్‌వర్క్ సరిగ్గా అందక నేను చూడలేకపోయాను. ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఆరున్నర అయింది. మెట్ల నుండి ఎడమ వైపుకి తిరిగి ఇంట్లోకి అడుగు పెడుతుండగానే పప్పాజీ ఎదురు వచ్చారు.

“నీ గురించి పేపర్‌లో పడింది.” పప్పాజీ చేతులు వణుకుతున్నాయి.

“అవును పప్పాజీ…” పప్పాజి చేతిలో ఇంకా పేపర్ ఉంది. ఎప్పటినుంచి పట్టుకుని వున్నారో!

“నా స్నేహితులెందరో ఆ రాయి మీదకు వెళ్ళడానికి ప్రయత్నించారు. కొందరైతే పైకి ఎక్కి మా పేర్లు కొట్టేయాలని ప్రయత్నించారు కూడా… కానీ ఎవరూ అక్కడిదాకా ఎక్కలేకపోయారు.” పప్పాజి చేతి ఊపుకి న్యూసుపేపరు గరగరలాడింది. “ఎవరూ ఎక్కలేకపోయారు కాని నువ్వు ఎక్కగలిగావు.” పప్పాజి నన్ను చూసి నవ్వడానికి ప్రయత్నించారు. ఆయన కళ్ళలో నీటి పొర ట్యూబ్ లైట్ కాంతిలో మెరుస్తోంది.

న్యూస్ పేపర్ తీసి చూశాను.

మా ఇంటి వెనుక గుట్ట, దానిపై రాయి, ఆ రాయి పైన పప్పాజి పేరు, కింద చాచా పేరు, రాయి మీద కూర్చున్న నేను, పక్కనే అస్తమిస్తున్న సూర్యుడూ…

పప్పాజి మళ్ళీ వందోసారి ఆ ఫోటో చూస్తున్నట్టు ఉంది. ఎండిన ఆ కళ్ళలో చెమ్మ చేరుతోంది.

“ఎవరూ ఎక్కలేకపోయారు. నువ్వు ఎక్కగలిగావు! నా తర్వాత!” పప్పాజి నా భుజాన్ని తట్టి తల వెనక్కి విసిరి నీళ్లు నిండిన కళ్ళతో నవ్వుతూ చూశారు.
(2018 నాటా సువనీరులో ప్రచురించిన ప్రతికి పరిష్కృత పాఠాంతరం.)
----------------------------------------------------
రచన: అపర్ణ తోట, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment