Monday, September 16, 2019

మధ్య వ్యవధిలో నీడలు


మధ్య వ్యవధిలో నీడలు




సాహితీమిత్రులారా!

అంత కష్టమైన పనేమీ కాదు. తను సారీ చెప్పేస్తాడు. మళ్ళీ ఇట్లా జరగదని ప్రమాణం చేస్తాడు. స్వాతి కూడా సారీ చెప్పేస్తుంది. అంతే. మళ్ళీ అంతా మామూలుగా అవుతుంది. ఇంత మాత్రానికే నెలరోజులపైగా తను లేనిపోని పట్టుదలతో స్వాతికి పోటీగా బిగుసుకు కూర్చున్నాడు.

ఇప్పుడంతా సిల్లీగా కనిపిస్తుంది. ఇంత సరళమైన సంబంధాన్ని ఎందుకింత క్లిష్టం చేసుకున్నట్లు?

అతని మనసెంతో తేలికయింది. బలంగా నిట్టూర్చి సన్నగా నవ్వుకుంటూ బాత్‌ రూములోకి నడిచాడు. అద్దం ముందు నుంచుని నెమ్మదిగా అన్నాడు ‘నన్ను క్షమించు!’ నవ్వొచ్చిందతనికి. ఆర్యూ టాకింగ్‌ టు మీ? అంటూ రాబర్ట్‌ డీ నీరో గుర్తొచ్చాడు.

ఫర్లేదు, అంత నాటకీయంగా లేదు. అయినా ‘సారీ!’ అనడం తేలిక. పెద్ద తేడా ఏముంది?

గడ్డం గీసుకునే సామగ్రి పక్కనే స్వాతి కాస్మెటిక్స్‌ గూడా.. ఇవన్నీ వొదిలేసి ఎట్లా వెళ్ళిపోయింది? కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ వాళ్ళ ఫ్రండ్‌ కారెక్కి వెళ్ళిపోవడమే గుర్తొస్తూంది. ఆ కోపంలో ఏమీ అనిపించలేదు కానీ తర్వాత బాధేసింది. తిరిగి వచ్చేస్తుందనుకున్నాడు కోపం తగ్గాక. కాల్‌ చేస్తుంటే దొరకదు. తను వెళితే తన మొహం కూడా చూడకుండా తనెవరో తెలీనట్లు పోజు..ఎవరో ఫ్రండొచ్చి చెప్పిందాకా తనకు తెలీలేదు డైవోర్స్‌ కోసం లాయర్‌ దగ్గరకు కూడా వెళ్ళొచ్చిందని. తనను భయపెట్టడానిక్కాకపోతే.. ఎంత పొగరు? ఏం చూసుకుని ఈ దేశం కాని దేశంలో?

అంత మొండితనమేమిటి? వారం రోజులు సవరదీశాక మొత్తానికి తనతో మాట్లాడడానికి మాత్రం ఒప్పుకుంది. అదీ ఇక్కడికి రాకుండా మళ్ళీ ఎక్కడో … cloud server . ఏమిటంత బెట్టు? ఇదే ఇండియాలో అయితే ఈపాటికి వాళ్ళ పెద్దాళ్ళు నాలుగు చీవాట్లు పెట్టి తిరిగి పంపేవారు కాదా తన దగ్గరకు?

ఫోన్‌ మోగింది.

“హలో!”

“నేనురా కుమార్‌ ను!”

“ఆ, ఏమిటి సంగతులు?”

“నువ్వే చెప్పాలి! ఏమిటి నేను విన్నది నిజమేనా?”

ఒక క్షణం మౌనం. “ఏం విన్నావు?”

“అదే, నువ్వూ, స్వాతీ ఏదో గొడవ పడ్డారనీ, విడాకులదాకా వచ్చిందనీ… ”

“అవున్నిజమే!”

“అదేంట్రా, తను ఇక్కడికొచ్చి రెండు నెలలు కూడా కాలేదు! అంత సర్దుకుపోలేని పొరపొచ్చాలేమొచ్చాయి మీ ఇద్దరి మధ్యా? ”

“నన్నేం చేయమంటావు, తనే కావాలని వెళ్ళిపోతే? తిరిగి రావడం, రాకపోవడమన్నది తన ఇష్టం!”

“భార్యభర్తలన్నాక పట్టూవిడుపులుండాలిరా! తెగేదాకా లాగకూడదు! తప్పెవరిదయినా ఇద్దరూ కలిసి దిద్దుకోవాలి! ”

మొదలుపెట్టాడు హితబోధ.. తిట్టుకున్నాడతను… అందరికీ మంచి అవకాశం..

“ఐ డోంట్‌ కేర్‌ నాకంటే నష్టపడేది తనే కదా! నేను చస్తే రమ్మని అడగను. తిరిగి వస్తుందో విడాకులే ఇస్తుందో తేల్చుకోవలసింది తనే!”

“నాకేం అర్థం కావడం లేదు. చిన్నవిషయానికే రాధ్ధాంతం చేసుకుని మరీ దూరం పోతున్నారు. పోనీ నేను రానా?”

“వొద్దు.. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోవడం నాకిష్టం లేదు! వొదిలెయ్‌. ఇంకా ఏమిటి సంగతులు?”

అటునుంచి అరక్షణం నిశ్శబ్దం.

“సరే! ఫ్రండ్‌ గా నేను చెప్పాల్సింది చెప్పాను. నీకేమైనా అవసరమనిపిస్తే తప్పకుండా కాల్‌ చెయ్యి!”

“సరే, బై!”

పెట్టేశాడు.

చిరాకు. అసహనం. అందరికీ తను లోకువే. ప్రతి ఒకడూ నీతులు చెప్పేవాడే. అప్పటికి తనే మూర్ఖంగా తమ కాపురాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నట్లూ… వీళ్ళంతా తనకంటే మెరుగని చూపెట్టుకునే ప్రయత్నాలు..అసలీ పరిస్థితిలోకి తనను నెట్టిన ఆమెననాలి.

ప్చ్‌ వాడట్లాంటి వాడు కాడు. కానీ ఎవడికీ చెప్పుకోలేని బాధ తనది. ఏమైనా అనుకున్నాడా? అనుకోనీ, ఇప్పుడెవడికి పట్టింది? అప్పుడే వీడికి ఎవరు చేరవేశారు? ఇంటికి కూడా చేరుతుందా ఈ వార్త కొంపదీసి? ఈలోగా అంతా కుదుటపడితే బావుణ్ణు.

అయినా అలా చెప్పాడేమిటి తను.. చస్తే రమ్మని పిలవడా.. మరికొన్ని గంటల్లో సారీ చెప్పి తిరిగి రమ్మని బ్రతిమిలాడబోతూ అట్లా ఎందుకన్నాడు?

రిమోట్‌ అందుకుని టీవీ ఆన్‌ చేశాడు సోఫాలో నిలువుగా జారిగిల పడుతూ. కాసేపు ఛానెల్స్‌ అటూ ఇటూ మార్చాక ఫుట్‌ బాల్‌ గేం కనిపిస్తే అందులో లీనమై పోయాడు.

* *

అయిదింటికల్లా పార్కుకు చేరుకున్నాడు. కారు పార్క్‌ చేసి దిగుతూనే చుట్టూ చూసుకుంటూ గజీబో కేసి నడిచాడు. అక్కడ కూడా లేదామె. నిరాశ. మనసు చివుక్కుమంది. ఆమె తనకన్నా ముందొచ్చి తన కోసం ఎదురుచూస్తూ ఉండివుంటుందని ఊహించుకుంటున్నాడిప్పటిదాకా.

గజీబోలో కూర్చున్నాడు.

వేడి ఇంకా తగ్గలేదు. గాలికూడా బిగదీసుకుంది. ఉక్క. చెమట.

కొంచెం ముందొస్తే తన సొమ్మేం పోయింది? తను కాళ్ళావేళ్ళాబడి దేబిరిస్తే వచ్చి కటాక్షిస్తున్నట్లా?

తనే వెళ్ళి పికప్‌ చేసుకుని ఉండవలసింది. వాళ్ళ ఫ్రండ్‌ రైడిస్తుందని చెప్పడంతో సరేనన్నాడు. అసలామె ఫ్రండ్‌ ఎపార్ట్‌ మెంట్‌ కు వెళ్లడం కూడా ఇష్టం లేదు తనకి. ఆమె సాయమూ, ప్రోద్బలంతోటే కదా స్వాతి ఇంతకు తెగించింది?

అయిదు నిముషాలు గడిచాయి. ఇంకా రాలేదు.

స్వాతికి బాగా నచ్చిందీ చోటు. ఒక్కసారే వచ్చారిక్కడికి తామిద్దరూ కలిసి. చుట్టూ పచ్చటి లాన్‌ దాని మీద పొడవాటి నీడలతో పెద్ద పెద్ద మేపుల్‌ ఓక్‌ చెట్లూ.. కొద్ది దూరంలో స్లైడ్స్‌ మీద జారుతూ, ఉయ్యాలలూగుతూ పిల్లలూ, వాళ్ళను కనిపెట్టుకుని వాళ్ళ తల్లిదండ్రులూ… దూరంగా లీలగా రోడ్డు మీదపోతున్న కార్ల చప్పుడూ..ఇంకా రాలేదేమిటి స్వాతి?

తల తిప్పి చూసేసరికి అల్లంత దూరంలో వస్తూ స్వాతి.

హమ్మయ్య, వచ్చేసింది. కొంచెం రిలీఫ్‌ ఏ మూలో భయం అసలు రాదేమోనని.

సిమెంట్‌ రంగు చీర, అదే రంగు జాకెట్‌. కుచ్చిళ్ళను తన్నుకుంటూ… ఆ అలవాటు మానమని చెప్తే వినదు.. పోనీ చీర బదులు ఏదయినా డ్రస్‌ వేసుకొమ్మన్నా లక్ష్యపెట్టదు.

ఏటవాలు సాయంత్రపుటెండలో మెరిసిపోతుంది. పొడవు. సన్నం. బంగారు రంగు. కళగల మొహం. అందుకనేగదా తను చేసుకుంది చూసిన నలుగురమ్మాయిల్లోనూ ఎంచుకుని. ఫ్రండ్సంతా కుళ్ళుకున్నారు “లక్కీ ఛాన్స్‌ కొట్టేశావోయ్‌”, “మూడు వారాల్లోనే ఎట్లా మానేజ్‌ చేశావు గురూ నెలరోజులు తిరిగి తీరైన పిల్ల దొరక్క మేం బాచిలర్స్‌ గానే తిరిగొస్తుంటే” అంటూ.

స్వాతి దగ్గరకొస్తుంటే ఆమె మొహం వంకే చూస్తూ కూర్చున్నాడు. దగ్గరకొచ్చాకగానీ తల పైకెత్తలేదామె. ఆమె తనవైపు చూడగానే నవ్వబోయి నొక్కేసుకున్నాడు ఆమె మొహం లోని సీరియస్‌ నెస్‌ చూసి. అట్లాగే తనూ మొహం పెట్టి “రా కూర్చో! ” అన్నాడు. ఆపాటికే ఆమె కొంచెం దూరంగా కూర్చుంది.

“చెప్పండి!” అంది.

ఏమిటి ఈమె ఉద్దేశం “అండీ అని సంబోధించడంలో “శ్రీ”, “నువ్వూ” అని పిలిచే ఆ ఎర్రటి పల్చటి పెదాలతోటే?

ఒక నిట్టూర్పు. తప్పదు.

“జరిగిందేదో జరిగిపోయింది. ఇంటికి వెళదాం పద!”

హమ్మయ్య! తన బాధ్యత తీరిపోయింది. అరె, “నన్ను క్షమించు” అనలేదే? అనాలా వద్దా? పోనీ సారీ? ఫర్లేదు, ఇంకా టైముందిలే!

“మీకది ఏదో జరిగిపోయినట్లుండొచ్చుగానీ నాకదేమీ చిన్న విషయం కాదు. ఏదో క్షణికావేశంలో బయటికొచ్చేశానేమోగానీ ఎంత ఆలోచించినా మనం విడిపోవడమే సబబనిపిస్తుంది!”

రాకాసి! కాళ్ళమీదపడి బావురుమని ఏడవాలా ఏమిటి?

“దాన్నే పట్టుకు ఎందాక వేళ్ళాడుతావు? దాన్ని అంతటితో వొదిలేయడం ఇద్దరికీ మంచిది!” ముఖ్యంగా నీకు!

“నాకు ఊహ తెలిసినప్పటినుంచీ ఒక దెబ్బ తిన్న గుర్తు లేదు.. ఇంట్లోనూ, స్కూల్లోనూ! ఇవాళ తాళి కట్టించుకున్న పాపానికి మీ చేత దెబ్బ తినవలసి వచ్చింది. అదెంత అవమానమో మీకు తెలీదు. మీకు నాపైన ఎంత గౌరవముందీ తెలిసిపోలేదా? ఒకసారి జరిగింది మరో సారి జరగదని నమ్మకమేమిటి? నమ్మకమూ, గౌరవమూ లేకపోయాక కాపురమేమిటి? ”

“డోంట్‌ మేకిట్‌ ఎ బిగ్‌ డీల్‌ ఏదో ఒకసారి కోపమాపుకోలేక ఓ దెబ్బ వేస్తే దానికి నువ్వేదేదో అంటగట్టి అనవసరపు ఇంపార్టన్స్‌ ఇస్తున్నావు. అయినా ఇందులో నా ఒక్కడి తప్పేనా ఉంది? నన్నంతగా రెచ్చగొట్టడం నీ తప్పుగాదా? అసలది..”

బీప్‌.బీప్‌. బీపర్‌ గొడవ.. తీసి విసిరి పారేయాలనిపించిందతనికి. నొక్కి చూశాడు. ఆఫీస్‌ నుంచి.. బాచ్‌ జాబేదో ఎబ్నార్మల్‌ గా ముగిసిందని. డామిట్‌ ఇదా సమయం దీనికి? ఒక వంక జీవిత సమస్యతో కొట్టుకు చస్తుంటే…

“మాటా మాటా అనుకున్నంత మాత్రాన కొట్టాలనేం లేదు! మీ ఫ్రండ్స్‌ తో తగువొచ్చినప్పుడు ఇట్లాగే కొట్టారా వాళ్ళను? నాకూ వచ్చింది కోపం! అట్లాగని నేనూ మీమీద చేయి చేసుకుంటే దానికి ఏం అర్థం చెప్పేవారు?”

మౌనం..మౌనం.. మాటలు దొరకవు.. అవసరానికి పనికిరావు.. ఏం చెప్పాలి తను? ఏమీ లేదు. ఏమిటి చేయడం? ఏమీ లేదు. అమ్మ గుర్తొస్తూంది. చెప్పూ..చెప్పూ.. అసంబధ్ధంగా.. చుట్టాలంతా గుర్తొస్తున్నారు..హరినారాయణ ఏమంటాడు? మరీ జాతకాలు కూడా చూపించకుండానే… పెద్దమ్మ పెద్ద గొంతేసుకుని ..నేనప్పుడే చెప్పా వాళ్ళకూ మనకూ కలవదురా… ఆఫీస్‌ లో?

ప్చ్‌ అనుకున్న దారిలో నడవడం లేదు సంభాషణ! ఎక్కడో తప్పుదారి పట్టి బోల్తా కొట్టింది. ముందే క్షమాపణ చెప్పి ఉండవలసిందా?

“ఇది మామూలే చాలా కాపురాల్లో! కలిసి బతుకుతున్నాక కోపతాపాలు రాకుండా ఎట్లా ఉంటాయి? నీ మీద నీకే కోపం ఎన్ని సార్లు వచ్చింది? సర్దుబాట్లు లేనిదే ఏ సంసారమూ నిలబడదు!”

“ఎప్పుడూ నేనే ఎందుకు సర్దుకుపోవలసి వచ్చింది? ఇదొక్కటే నేనీ నిర్ణయానికి రావడానికి కారణమనుకుంటే పొరబాటు. ఇంకా చాలా ఉన్నాయి, కనీసం మీ గమనింపుకు కూడా రానటువంటివి! ”

“సరే నేను మాత్రం సర్దుకుపోయినవెన్ని లేవు? .. ” ఇంకా ఏదో అనబోయి ఆగాడు. ఈ వాదాలన్నీ ఎందుకు? నిష్ప్రయోజనం. . తను తప్పొప్పుకుందుకు వచ్చీ మళ్ళీ ఎందుకిలా? ఎక్కడో ఏవో అహంభావపు తెరలు అడ్డుపడుతున్నాయి. సంబంధాలు ఎందుకింత క్లిష్టమవుతాయి చూస్తూండగానే?

“ఎందుకీ వాదనలు? ఏం చేయమంటావు నన్నిప్పుడు?”

“మీరేం చేయబోతున్నదీ నాకనవసరం! నా నిర్ణయం మార్చుకునే ప్రసక్తి లేదనే నేను స్పష్టం చేస్తున్నది!”

“ఎట్లా బతుకుదామనుకున్నావు ఇక్కడ? నీ వీసా స్టేటస్‌ గురించి ఆలోచించుకున్నావా? ఏ మొహం పెట్టుకు తిరిగి ఇంటికి వెళదామనుకుంటున్నావు?” బెదిరింపా? ఆ ముసుగులో అభ్యర్థనా? ఎక్కడ్నుంచో కోపం.

“అవన్నీ నా సమస్యలు. నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను.”

మళ్ళీ మౌనం. ఇక క్షమాపణ చెప్పి ఏమి లాభం? ముందే నిర్ణయించుకు వచ్చింది. నమ్మబుధ్ధి కావడం లేదు. ఒక చిన్న దెబ్బను కారణంగా చేసుకుని.. అన్యాయం… అసలు పూర్తి ఇష్టంతోటే తనతో పెళ్ళికి ఒప్పుకుందా?

అంతేనా.. రెండు నెలలు తనతో బతికిన ఈమెకూ, తనకూ ఇక ఏ సంబంధమూ ఉండదా? ఇండియా వెళ్ళి వెతుక్కుని ఏరి కోరి చేసుకున్న పెళ్ళికి అర్థం ఏమిటి? ఇంత తేలికగా తన జీవితాన్నుంచి విడిపోతుందా? ఇన్ని రాత్రులు తనను నగ్నంగా పెనవేసుకున్న ఈమె… ఏదో దిగులు..

“మనం పంచుకున్న తియ్యటి క్షణాలన్నీ అంత తేలికగా ఎట్లా మర్చిపోతావు? మనం కన్న కలలు.. ఏదో ఆవేశంలో ఇట్లా మాట్లాడుతున్నావు. ఇఫ్‌ యు వాంట్‌ టు టేక్‌ మోర్‌ టైం .. ” ఇంకా ఏదో ఆశా? తనకేం పట్టింది?

“ఆవేశాన్నుంచి బయటపడి ఆలోచనలన్నీ అయ్యాకే ఈ నిర్ణయానికి వచ్చింది.”

ప్చ్‌ వినదు. మొండి. కొరుకుడు పడదు.

“మరెందుకు వచ్చినట్లు? ఆ సంగతేదో ఫోనులోనే ఏడవొచ్చుగా!”

కోపం తన్నుకొస్తూంది. ఇట్లాంటి మూర్ఖురాలితో బతకడం కష్టమే.. పీడ విరగడ అవనీ!

“నా జోలికింక రావొద్దని చెప్పడానికీ, నేనేదో తిరిగొస్తానని భ్రమలో పడొద్దని చెప్పడానికీ, ఆ విడాకుల పనేదో సామరస్యంగా పూర్తి చేసుకుందామని చెప్పడానికీ…”

ఆమె లేచింది. “ఇక వెళతాను. ఇంకా ఏమైనా చెప్పవలసి ఉందా?”

ఓడిపోతున్న ఫీలింగ్‌ ఉక్రోషం.

“అప్పుడే ఇంకో చెంప కూడా ఎందుకు పగలగొట్టలేదా అని బాధపడుతున్నా! ”

అరక్షణమయాకగానీ అర్థం కాలేదు తనేమన్నాడో! అప్పటికే ఆలస్యమయింది. ఏం వాగాడు తను? అనాలని అన్నది కాదు. ఏదో నోటికొచ్చింది. ఆమెను గాయ పర్చాలనే. అంత క్రూరుడు కాడు తను.

“నాకు తెలుసు. నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదు. మీరు చేసింది తప్పు అనే స్పృహలో కూడా లేరు మీరు”

ఆమె తన వంక కూడా చూడటం లేదు. వెళ్ళిపోతూంది.

“నీ బొంద” అనాలనుకున్నాడు.

లేచి ఆమె గొంతు నులమాలనుకున్నాడు.

అట్లాగే కూచుని ఆమె వెళ్ళిపోవడం చూస్తున్నాడు. హూ కేర్స్‌

బీప్‌.. బీప్‌.. బీపర్‌ మళ్ళీ గొడవ.. విసురుగా లేచాడు.
---------------------------------------------------
రచన: చంద్ర కన్నెగంటి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment