ఇండియన్ వేల్యూస్
సాహితీమిత్రులారా!
ఆ మధ్యాన్నమంతా దట్టంగా పేరుకున్న టెన్షన్ ఒక్ఖసారిగా బద్దలైనట్టు వేసవి కాలపు థండర్ స్టార్మ్ నగరం మీద విరుచుకు పడిపోయింది. వాసంతి దాన్ని లక్ష్యపెట్టకుండా బ్రాడ్వే వెంబడి నడుస్తోంది.
“ఇండియన్ వేల్యూసంటే ఏవిటే నీరూ, నీ వుద్దేశంలో?” అనడిగింది వాసంతి.
నీరూ అనబడే నీరజ టీపాట్ లోనించి గ్రీన్‌టీని నిదానంగా తన కప్పులోకి వొంచుకుని అప్పుడు తలెత్తింది. స్నేహితురాల్ని పరిశీలనగా చూసి, “నీ వాలకం చూస్తుంటే నీ ప్రశ్న వెనక ఏదో పెద్ద కథే వున్నట్టుంది. ముందు ఆ కథ చెప్పు,” ఆదేశించింది నీరజ.
“కథే ననుకో. మా అమ్మా నాన్నా పెళ్ళి గురించి చేస్తున్న గోల తెలుసుగా. మొన్న క్రిస్మస్ బ్రేక్‌కి ఇంటికెళ్ళి నప్పుడు అన్నారు, మేట్రిమోనియల్ ఏడ్ వేస్తామని. పోయేదేముందిలే అని సరేనన్నా. వేశారు, ఇండియా ఎబ్రాడ్‌లోనూ, వాటిల్లో ..”
“వెయిటె మినిట్. ఏడ్ నువ్వు రాశావా, వాళ్ళు రాశారా?”
“వాళ్ళే రాశారు. ఎనీవే, దాని ద్వారా ఒక సంబంధం వచ్చింది. అతను న్యూయార్కులోనే కొలంబియాలో కార్డియాలజీ ఫెలోషిప్ చేస్తున్నాడు. అతని పేరెంట్స్ ఫిల్లీలో వుంటారు. వాళ్ళు ఏడ్ చూసి మా పేరెంట్స్‌తో మాట్లాడారు .. ”
“మీ వాళ్ళు నీ నెంబరూ అదీ ఇస్తే, వాళ్ళది వాళ్ళబ్బాయికిస్తే, అతను నిన్ను పిలిస్తే .. ”
నీరజ కథని ఫాస్ట్ ఫార్వర్డ్ చెయ్యబోయింది.
“ఏబ్బే, అలా జరిగితే అసలు కథేముందీ!” అని సస్పెన్స్ పెంచడానికా అన్నట్టు ఆగింది వాసంతి. జరిగిన సంఘటనలు గుర్తొచ్చి వాసంతి పెదాలమీద చిలిపి చిర్నవ్వు చిగురించింది.
“మరేమైంది, తొందరగా చెప్పూ, చంపక, ” హడావుడి పడిపోయింది నీరూ.
“ముందు అతని పేరెంట్సే వచ్చారు నాతో డేట్‌కి!” వాసంతి నీరజ మొహమ్మీద పరుచుకుంటున్న విభ్రాంతిని చూసి, ఆపుకోలేక పైకే నవ్వేసింది. నీరజ మాత్రం సీరియస్‌గా, “ఏయ్ వాస్ యువార్ కిడింగ్ మీ, రైట్?” అంది, అనుమానంగా చూస్తూ.
“నో! ఐ స్వేర్!!” కుడి చెయ్యి నెత్తిన పెట్టుకుని ప్రమాణం చేసింది వాసంతి.
“వాళ్ళు ఫిల్లీ నుంచల్లా వొచ్చారు నన్ను చూసేందుకు. మొదట మా అమ్మా నాన్నా నాకీ మాట చెప్పినప్పుడు నేనూ నిర్ఘాంత పోయా. కానీ కొంచెం ఆలోచిస్తే .. ఇది బాగానే వుందనిపించింది. సరేనన్నా. సరే ఏవిటి, వాళ్ళని ఇమ్ప్రెస్ చేసి పారెయ్యటానికి ప్రెపేర్ కూడా అయ్యాను. ”
“హు, ఇంత బతుకూ బతికి .. చివరికిలా తయారయ్యావా! ఎమ్బీఏ చదివావ్ వాల్ స్ట్రీట్‌లో పెద్ద వుద్యోగం వెలగబెడుతున్నావ్.. నీకు కావల్సిన వాణ్ణి నువ్వు సెలెక్ట్ చేసుకోకుండా .. ఇలా పేరమ్మల్నీ తాయారమ్మల్నీ ఇమ్ప్రెస్ చేసేందుకు తంటాలు పడుతూ .. ”
“హే, హేయ్ ఒక్క క్షణం అక్కడే ఆగు. మొగుణ్ణి వెతుక్కోడానికి మిగతా పద్ధతులు మాత్రం ఇంతకంటే గొప్పగా వుండి ఏడిచినయ్యా? ఎంత సేపూ సింగిల్స్ బార్లూ, నైట్ క్లబ్బులూ పట్టుకు తిరగడం, నిద్దర దండగ, డబ్బులు దండగ. ఇంతా తిప్పలు పడీ నీకు నచ్చిన వాడెవడన్నా దొరుకుతాడని గారంటీ లేదు. తీరా దొరికినా .. వాడెట్లాంటి వాడో, వాడి హిస్టరీ ఏవిటో, వాడి క్లోసెట్‌లో ఎన్ని కంకాళాలున్నయ్యోనని హడిలి చావటం .. ”
“వోకే, వోకే. పాత చింతకాయ పచ్చడమ్మ గారూ, వొప్పుకున్నాం. నువ్వు మీ కాబోయే అత్తగార్ని ఇమ్ప్రెస్ చేసి పారేశావ్ తరవాత ? ”
“తరవాత, ఏముందీ, హీరోనే ఫోన్ చేశాడు. రెండు సార్లు డిన్నర్‌కి కలుసుకున్నాం. ”
“హమ్మయ్య, కథ మొదలైన అరగంటకి దయ చేశారు హీరో గారు. ఇంతకీ నీ హీరోకి పేరన్నా వుందా ? చూడ్డానికి ఎలా వున్నాడు? ”
“పేరు కృష్ణకుమార్. ఎలా ఉన్నాడంటావా? బానే వున్నాడు. నాటె గ్రేట్ లుకర్, బట్ .. లుక్స్ ఫిట్ అండ్ స్మార్ట్. ”
“వోకే, లుక్స్ బి ప్లస్. మరి డ్రెస్ ? ”
“నీ ఆలోచన ఎటు పోతోందో నాకు తెలుసు. కాసేపుండి, అతని సాక్సు పేంటుకి మేచ్ అయ్యాయా, ఇంకోటి ఇంకో దేనికో మేచ్‌ఐందా అని మొదలెడతావు. కట్ ఇటౌట్! స్మార్ట్‌గా ఉన్నాడన్నానా?”
“వోకే, వోకే. జీస్, నువ్వతన్ని వెనకేసుకు రావడం చూస్తే నీకు బాగానే నచ్చాడల్లే వుంది. అసలు అది చెప్పు .. నచ్చాడా ?”
“మ్‌మ్.. రెండు సార్లు కలవడంతోనే నచ్చాడో లేదో ఎలా చెప్పడం? ”
“అమ్మయ్య. పరవాలేదు, నిన్నింకా రక్షించొచ్చు ! ”
“ఐనా మొదటి చూపులకి నచ్చాడనే అనుకో ! ”
“మరింక ఏవిటి ప్రాబ్లం? ప్రొసీడైపో ! ”
“అదే అదే .. అక్కడే వచ్చింది ఈ ఇండియన్ వేల్యూస్ క్వశ్చెన్.”
“ఇండియన్ వేల్యూస్ ? వాట్ ఇండియన్ వేల్యూస్ ” ఆమాట మొదటి సారి వింటున్నట్టు అయోమయంగా మొహం పెట్టింది నీరజ.
మన్‌హాటన్‌లో పేరున్న రెస్టరాంట్ ఆ రాత్రి కూడా విపరీతమైన రద్దీ. ఐనా వాళ్ళ టేబుల్ రెడీగా వుంది. ముందే రిజర్వ్ చేసివుంచాలన్న కృష్ణకుమార్ ముందు చూపుని మనసులోనే అభినందించింది వాసంతి. షి హాడ్‌సీన్ మచ్‌వర్స్! వెయిటర్ డ్రింక్స్ ఆర్డర్ తీసుకోడానికి వచ్చినప్పుడు అతను ఐస్‌డ్ టీ కోసం అడిగాడు, ఆమె ఫ్రెష్ లెమనేడ్ ఆర్డరిచ్చింది.
మొదలైనయ్యి పరిచయాల కబుర్లు ఇంక .. భోజనం కోసం ఎదురు చూస్తూ, భోజనం చేస్తూ, భోజన మయ్యాకా ఒకరి అభిప్రాయాల నొకరు, ఒకరి అభిలాషల నొకరు, ఒకరి నొకరు మాటల ద్వారా చెప్పుకుంటూ, వింటూ, విన్నదాంట్లో ఇంపార్టెంట్‌అనుకున్నవి తరవాత తీరిగ్గా నెమరు వేసుకోవడానికి మెమొరీ ఫోల్డర్లో ఎప్పటి కప్పుడు నీట్‌గా ఫైల్ చేసేస్తూ. అవును మరి, ఇదేగా మొదటి సారి కలుసుకోవడం. హడావుడి ఏమీ లేదు. ముందు పరిచయాలు పెరగాలి, నెమ్మదిగా ఒకరి నొకరు తెలుసుకోవాలి, నింపాదిగా ఒకరి నొకరు అర్థం చేసుకోవాలి, ఆ అర్థమైనదేదో ఇద్దరికీ నచ్చాలి, ఆ తర్వాత … ఆ తరవాత సంగతి ఇప్పుడే ఎందుగ్గానీ, ఇక్కడ ప్రస్తుతంలో .. కృష్ణ ఏదో అంటున్నాడు.
” .. అలా హైస్కూలు ప్తూౖరెంది. వెల్ నాకు మొదణ్ణించీ మెడిసిన్ చెయ్యాలనే. డాడీకి మాత్రం నన్నో పెద్ద బిజినెస్ మేన్‌గా చూడాలని కోరిక. ముందు ప్రీమెడ్ చెయ్యి, తరవాత చూద్దాం అన్నారు. హి థాట్ హి కుడ్‌స్టిల్ కన్‌విన్‌స్‌మీ .. అదేం కుదర్దని చెప్పేసి, నేను రట్జర్స్‌లో ఆరేళ్ళ మెడికల్ ప్రోగ్రాంలో చేరిపోయాను. హి వాజ్ ప్రెట్టీ హార్ట్ బ్రోకెన్. ..” అని చిన్నగా నవ్వాడు. వాసంతి అసక్తితో వింటూ అర్థమైనట్టు బదులు నవ్వింది. అతను కంటిన్యూ చేశాడు.
“వెల్, దెన్, షికాగోలో ఇన్‌టర్న్‌రెండేళ్ళు. దానికి మా అమ్మ చాలా గోల పెట్టింది, అంత దూరం పోతున్నానని. బట్ ఇట్ వాజ్ ఏనెక్సలెంట్ ఆపర్చ్యూనిటీ. సో ఐ టోల్డ్ హర్, నువ్వూ డాడీ ఇండియా నుంచి ఇంత దూరం వచ్చారు గదా, నేను జస్ట్ షికాగో వెళ్తే ఏం దూరం అని. షి వోన్‌ట్ ఎగ్రీ, బట్ ఐ వెన్‌ట్ ఎనీవే. ఇప్పుడు, ఇక్కడ న్యూయార్క్‌లో రెండేళ్ళుగా ఉన్నానని, షి ఈజ్ హాపీ ఫర్ నౌ.” అదీ నా కథ, ఇక నీ కథ చెప్పు అన్నట్టు అతను ఆగాడు.
వాసంతి తన వంతు కథ చెప్పింది.
“నేను కేలిఫోర్నియాలో పెరిగాను, నీకు తెలిసే వుంటుంది. కానీ, నా కాలేజ్ చదువంతా ఈస్ట్ కోస్ట్‌లోనే గడిచింది. ముందు కార్నెల్లో ఇంజనీరింగ్. కొన్నాళ్ళు న్యూజెర్సీలో పని చేశాక అది బోరు కొట్టింది. ఐ వాజ్ లుకింగ్ ఫరె గుడ్ ఛాలెంజ్. అందుకని జాబ్ వొదిలేసి, ఎంబీఏ చేద్దా మనుకున్నాను. కంప్లీటెడ్ దట్ ఫ్రమ్‌వ్హార్టన్ అ కపులాఫ్ యియర్స్ ఎగో ..”
“వెల్, నువ్వు వ్హార్టన్ ఎంబీఏ వా? మై డాడ్ మస్ట్ హావ్ బీన్ ప్రెటీ థ్రిల్డ్, మీటింగ్ యు!”
వాసంతికి ఆ రోజు గుర్తొచ్చి సన్నగా నవ్వి బదులిచ్చింది.
“ఐ థింక్ హి వాజ్. మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం, బిజినెస్, ఆర్స్ట్.. యువర్ మామ్ టూ. షి సీమ్‌డ్ టు నో ఎవ్రీ వన్ .. ఐ మీన్ ఫిల్లీ ఏరియాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ తెలుసునల్లే వుంది.”
“వెల్ వాళ్ళు అక్కడ తెలుగు ఎసోసియేషన్లో చాలా ఏక్టివ్‌లే. మా అమ్మ చెయ్యి పడకుండా అక్కడ తెలుగు ప్రోగ్రామేదీ జరగదు. నువ్వెప్పుడన్నా ఆ ఎసోసియేషన్‌కి వెళ్ళుంటే ..”
“ఎక్కడా, నా ప్రోగ్రామే చాలా బిజీగా వుండేది. ఏదన్నా కొంచెం ఖాళీ దొరికితే .. వీలైనప్పుడు, శ్ర్తి వాళ్ళు జరిపే కచ్చేరిలకి మాత్రం వెళ్ళేదాన్ని. ఓ రియల్లీ? వెల్ నేను అటువంటి ప్రోగ్రామ్‌స్ .. ఊహూ. ఐ సే, గివ్‌మీ బాస్కెట్‌బాల్ ఎనీ టైమ్. నీకెలా దీంట్లో ఇంట్రెస్ట్?”
“మా నానమ్మ మూలంగానేమో, చాలా ఫ్రీక్వెంట్‌గా ఇండియా వెళ్ళేవాళ్ళం నా చిన్నప్పుడు. ఆవిడ నన్ను దగ్గర కూర్చో పెట్టుకుని ఎన్నో చెబుతూ చూపిస్తూ వుండేది. ఆవిడ దగ్గరే మొదట అలవాటాఇండి, మ్యూజిక్‌లోనూ, మైథాలజీలోనూ ఇంట్రెస్ట్. కొన్నాళ్ళు బాగా శ్రద్ధగా నేర్చుకున్నా. తరవాత స్కూల్ స్టడీస్, కెరీర్ .. ఇవన్నీ చుట్టుముట్టేసి దేర్ వాజ్ లిటిల్ టైమ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్!”
“ఈవెన్ ఫర్ డేటింగ్?” కేజువల్‌గా అడిగాడు కృష్ణ.
“ఏక్చువల్లీ, దట్ టూ. దానికి తోడు మా అమ్మ .. హై స్కూల్లోనూ, కాలేజ్‌లోనూ డేటింగ్ చెయ్యొద్దూ, మొగ పిల్లలకి దూరంగా వుండూ అని ఒకటే లెక్చర్లు. అఫ్ కోర్స్, ఐ హేడ్ నో టైమ్ నార్‌ద ఇన్‌క్లినేషన్.” నవ్వేసింది వాసంతి.
“వెల్, ఈ దేశంలో వున్నా, చక్కటి ఇండియన్‌వేల్యూస్‌తో నిన్ను పెంచిన నీ తల్లిదండ్రులని నిజంగా అభినందించాలి!” మెచ్చుకోలుగా అన్నాడు కృష్ణ.
వాసంతికి ఇదేదో కాంప్లిమెంట్ లాగానే వుందనిపించి, “థాంక్స్” అంది కొద్దిగా ఆస్చర్య పడుతూనే. ప్రశ్నని అతని వేపు మళ్ళిస్తూ, “మరి నీ సంగతేమిటి? డేటింగ్ చెయ్యలే? ఇండియన్ అమ్మాయిని చేసుకోవాలని నీకెలా అనిపించింది?” అనడిగింది. కృష్ణ సాలోచనగా చెప్పడం మొదలెట్టాడు,
“వెల్, యు సీ, పెళ్ళి అని ఆలోచించడం మొదలు పెట్టగానే .. ఎన్నో కాన్‌ఫ్లిక్టింగ్ ఇష్యూస్… కొంచెం డీప్‌గా చూస్తే .. ఏముంది? నాకు ఒకటే దారి కనిపించింది .. చేసుకుంటే ఇండియన్ పేరెంటేజ్ ఇండియన్ వేల్యూస్‌తో పెరిగిన అమ్మాయినే చేసుకోవాలని. .. అలాగని నేనేదో ఇండియన్ షావినిస్ట్ ననుకోకు ఫార్‌ఫ్రమిట్. దీని వెనకాల చాలా ప్రాగ్మాటిక్ రీజనింగ్ వుంది.”
“రీజనింగ్ ఏదైనా, మీ పేరెంట్స్ చాలా సంతోషించి నట్టున్నారు ఈ డెసిషన్‌తో!”
“వెల్, అఫ్ కోర్స్. కానీ, ఈ డెసిషన్ తీసుకోవడంలో వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు ఇది పూర్తిగా నా స్వార్థమే ననుకో!” అని చిన్నగా నవ్వాడు కృష్ణ. “వెల్, దీన్తో ఒక ప్రాబ్లం కూడా వచ్చింది .. ఇలాంటి క్వాలిటీస్ వున్న అమ్మాయిని నా అంతట నేను వెదికి పట్టుకోవటం .. విత్ మై స్కెడ్యూల్ .. చాలా కష్టం .. అనిపించింది. మై పేరెంట్స్ ఆఫర్‌డ్ టు హెల్ప్ ఐ సెడ్ ఓకే ఇట్ సీమ్‌డ్ ద సెన్సిబుల్ థింఘ్ టు డూ. ..”
డిసర్ట్ తినటం పూర్తయ్యాక కృష్ణ బిల్లు తనే పే చేస్తానన్నాడు, కానీ వాసంతి ఒప్పుకోలేదు తన వంతు సగం తానే కడతానని పట్టుబట్టింది.
“వెల్, వాసంతీ, నీ ఎక్సలెంట్ కంపెనీ .. నీకిలా డిన్నర్ ఇవ్వగలగడం .. ఇట్స్ మై ప్లెజర్, ” అని కృష్ణ మృదువుగానే ప్రొటెస్ట్ చేశాడు. కానీ వాసంతి పట్టు వొదల్లేదు.
“నేనూ నీ కంపెనీ ఎంజాయ్‌చేశాను. కాక ఈ రోజుల్లో ఇంకా అబ్బాయే అన్ని ఖర్చులూ పెడతా ననడం టెర్రిబ్లీ ఓల్డ్ ఫేషన్డ్ .. కాదూ? తరవాత ఫ్యూచర్లో ఇంకెన్ని సార్లో కదా, ఈసారికి ఇలా కానీ,” అన్నది తన వంతు ముప్ఫై ఐదు డాలర్లనీ బిల్ వాలెట్లో పెడుతూ. కృష్ణకి ఆమె అన్నదాంట్లో భవిష్యత్తుకి ఏదో ఆహ్వానం వినిపించి ఆ మేటర్ని అలా వొదిలేసి తన వాటా కూడా చేర్చాడు.
రెస్టరాంట్ లోంచి బయటి కొచ్చాక మాత్రం, “పద, నిన్ను ఇంటిదాకా దిగబెడతా” నన్నాడు, ఈ విషయం మాత్రం నెగోషియబుల్ కాదన్నట్టు. వాసంతీ సరేనంది. ఆహ్లాద కరమైన వసంతకాలపు పిల్లగాలిలో .. బస్సూ ట్రైనూ వొద్దనుకుని ఇద్దరూ నడిచే వెళ్ళారు పది బ్లాకులు, వాసంతి వుండే అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌వరకూ. అతని దగ్గర స్నేహంగా సెలవు పుచ్చుకుని వాసంతి బిల్డింగ్ లోపలి కెళ్తూ, “పరవాలేదు, రెండో డేట్‌కి వెళ్ళొచ్చు”” అనుకుంది. ఆమె లోపలికి వెళ్ళిపోబోతూ చివరి సారి వీధిలోకి చూసి కృష్ణకి చెయ్యి వూపుతుంటే అతను రెండంగల్లో నాలుగు మెట్లూ ఎక్కేసి ఆమె దగ్గరికి చేరుకున్నాడు. తలుపు మీద ఆనించి వున్న వాసంతి చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నొక్కి, “నేను నిజంగా అదృష్టవంతుణ్ణి. నీలాగ ఇండియన్ వేల్యూస్‌ని పుణికి పుచ్చుకున్న అమ్మాయి ఇన్నాళ్ళకైనా నాకు పరిచయమైనందుకు.” అన్నాడు వాసంతి కళ్ళల్లోకి చూస్తూ. అనేసి చకచకా మెట్లు దిగి వీధి మలుపు తిరిగేసి కనుమరుగై పోయాడు.
వాసంతి మాత్రం “ఇదేవిటమ్మా చోద్యం” అన్నట్టు అలా నిల్చుండి పోయింది ఒక నిముషం పాటు, అతను వెళ్ళిన దిక్కుకే చూస్తూ.
“ఇండియన్ వేల్యూస్? వాట్ ఇండియన్ వేల్యూస్ ” ఆమాట మొదటి సారి వింటున్నట్టు అయోమయంగా మొహం పెట్టింది నీరజ.
“ఏడిచినట్టే వుంది. అక్కడే కదే ఈ కథ మొదలైంది !” వాసంతి విసుక్కుంది.
“ఓ, యా. చెప్పు, ఈ ఇండియన్ వేల్యూస్ గోలేవిటి ?”
“ఇద్దరమూ బానే మాట్లాడుకున్నాం మొదటి సారి, హాబీ లేవిటి, ఇష్టాయిష్టా లేవిటి, ఎట్సెట్రా. అతను నన్ను ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్ళబోతూ “ఇండియన్ వేల్యూస్‌తో పెరిగిన నువ్వు నాకు పరిచయమవడం నా అదృష్టం” అనేసి వెళ్ళిపోయాడు. అదేవిటో నాకు అర్థం కాలేదు. ”
“అర్థం కాకపోవడని కేముందీ ? నువ్వు సంగీతమూ అదీ వెలగ బెట్టావుగా కొన్నాళ్ళు. అది మీ వాళ్ళు గొప్పగా చెప్పి ఉంటారు.”
“కొంచెం ఆలోచిస్తే నాకూ అదే తట్టింది. రెండో సారి కలుసుకున్నప్పుడు, అతనికి సంగీతం, నాట్యం ఇష్టమేమోనని వాటిని గురించి మాట్లాడ్డం మొదలెట్టా. తీరా అతనికి బాలమురళి గాత్రం పాడతాడనీ, రమణి ఫ్లూట్ వాయిస్తాడనీ కూడా తెలీదు. అసలు వాళ్ళ పేర్లే అతనికి తెలిసినట్టు లేదు !”
“హూ. ఇది విచిత్రంగానే వుంది. పోనీ ఇండియన్ వేల్యూసంటే అతని వుద్దేశం హిందూ ట్రెడిషన్ అనేమో .. యు నో .. పండగలూ ఎట్‌సెట్రా. ”
“ఊహూ. అదీ ఐంది. అతనికి వాటిని గురించీ పెద్దగా తెలియదూ, అసలు ఇంట్రస్టూ చూపించలేదు. కానీ రెండో మీటింగ్‌లో నాలుగు సార్లన్నా అన్నాడు, “ఈ దేశంలో ఈ జెనరేషన్‌లో ఇండియన్ వేల్యూస్‌తో పెరిగిన నా లాంటి అమ్మాయి దొరకటం అతని అదృష్టం” అని. ఆ అనడం కూడా ప్రతి సారీ చాలా సిన్సియర్‌గా అంటాడు, అదేదో అతనికి చాలా ఇమ్పార్టెంట్ అయినట్టు.”
“వావ్. ఇదేదో నిజంగా మిస్టరీయే. లెట్ మీ థింక్ ” అనేసి నీరజ కొద్ది సేపు ఆలోచనలో పడిపోయింది. సడన్‌గా తలెత్తి, “మీ వాళ్ళు పేపర్లో వేసిన ఏడ్ వుందా?” అనడిగింది.
“యా. ఐ థింక్ సో. ” అని వాసంతి తన బేగ్‌లో వెదికి ఒక చిన్న కటౌట్ తీసి నీరజ ముందు పెట్టింది. నీరజ దాన్ని చకచకా చదివి విజయం సాధించినట్టు బల్లమీద చరిచింది.
“ఇట్ సేస్ రైట్ హియర్. పేరెంట్స్ ఇన్వైట్ బ్లా బ్లా బ్లా, యాడి యాడ యాడా .. రైజ్‌డ్ విత్ ఇండియన్ వేల్యూస్ ..”
“ఏడ్‌లో ఏం రాసి వుందో నాకు తెలుసునోయ్ మా వాళ్ళు నాకు సంగీతం అవీ వొచ్చు అని డబ్బా కొట్టుకోటానికి అలా రాసి వుంటారు. అటువంటి విషయాల్లో ఏవీ పర్సనల్ ఇంట్రస్ట్ లేని కృష్ణకి దీని గురించి అంత పట్టింపెందుకు అనేది నా ప్రశ్న !”
“దట్ ఐ డొన్నో. అతన్నే అడగలేక పోయావా ? మీరిద్దరూ బాగానే ఫ్రెండ్స్ ఐనట్టుందిగా !” అని ఉచిత సలహా పారేసింది నీరజ.
“మే బి ఐ విల్ !” అంది వాసంతి నిశ్చయంగా.
అనడమైతే నిశ్చయంగా అనేసింది గానీ వాసంతికి కృష్ణని ఈ ప్రశ్న అడగడం అనుకున్నంత సులభంగా సాధ్య పడలేదు. రెండు నెలల పరిచయంలో కృష్ణని క్షుణ్ణంగా పరిశీలించింది. ఆమె గమనించినంతలో కృష్ణ చాలా ఇండిపెండెంట్ మనస్తత్వం కల వ్యక్తి. తన కెరీర్‌కి సంబంధించి గానీ, వ్యక్తిగతంగా గానీ అతను తీసుకునే నిర్ణయాలలో తన అభిరుచులపై రాజీ పడని మనిషి. అలాగని బొత్తిగా నిరంకుశుడూ కాదు. తమ మధ్య కంపాటిబిలిటీ గురించి కూడా ఆమెకేమీ ఇబ్బంది కలగలేదు. పెళ్ళయ్యాక ఎన్నో సమస్యలు ఎదురవ్వచ్చు వాటిని పరస్పర అవగాహనతో ఇద్దరూ కలిసి పరిష్కరించుకో గలము అన్న నమ్మకం కలిగింది. ఇండియన్ వేల్యూస్ ప్రశ్న మాత్రం ఎటూ తెగలేదు. ఆమె చూసినంత వరకూ కృష్ణకి భారతీయ సాంస్కృతిక, మత, రాజకీయ సాంఘిక విషయాల మీద పెద్ద అవగాహనా లేదూ, మోజు అంతకన్నా లేదు. పర్సనల్‌గా ఇదో పెద్ద ప్రాబ్లం కాదు వాసంతికి. కానీ వాళ్ళు కలుసుకున్న ప్రతిసారీ అతని నోటి వెంట ఈ ఇండియన్ వేల్యూస్ ప్రసక్తి రెండు మూడు సార్లు వస్తూనే వుంది. ఆ విషయమై అతన్ని ఎలా ప్రశ్నించడమా అని వాసంతి తటపటాయిస్తూనే వుంది.
జులై నెల్లో ఒక శని వారం మధ్యాన్నం ఇద్దరూ కలిసి లంచ్‌చేసి, మెట్రోపాలిటన్ మ్యూజియంలో వేన్‌గో స్పెషల్ ఎగ్జిబిషన్ చూడ్డానికి వెళ్ళారు. వేసవై కాలపు ఉక్క ఊపిరి సలపనంతా దట్టంగా చుట్టుకుని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటే, ఏసీ చేసిన మ్యూజియం హాల్లోకి అడుగు పెట్టగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది ఇద్దరికీ. వాసంతికి వేన్‌గో చిత్రాలంటే ప్రాణం. కృష్ణకి ఆర్ట్ మీద పెద్ద మోజులేక పోయినా వాసంతి ప్రతిపాదనని మన్నించి వచ్చాడు. ఆమె అంతకు ముందు శనివారం అతనితో యాంకీస్ బాల్‌గేమ్‌కి వెళ్ళింది దానికిది “క్విడ్ ప్రో క్వో” అనుకోండి! అఫ్‌కోర్స్ ఉడికిపోతున్న ఆ వేసవి మధ్యాన్నం ఏసీ మ్యూజియంలో గడపటమే మేలని కూడా అతను అనుకుని వుండచ్చు.
టిక్కెట్లు కొనుక్కుని ఇద్దరూ మూడు గంటల పాటు ఎగ్జిబిషన్ చూశారు. వాసంతి వేన్‌గో సృష్టించిన రంగుల వలలో చిక్కుకు పోయి తనని తాను మరిచిపోయింది. కృష్ణ కూడా, ఎగ్జిబిషన్ వాళ్ళు ఇచ్చిన ఆడియో కామెంటరీతో బొమ్మల్ని బాగానే ఎంజాయ్ చేసినట్టున్నాడు, ఒక్కొక్క బొమ్మ దగ్గరా చాలా సేపు నిలబడి పరిశీలిస్తూ ఉన్నాడు. ఎగ్జిబిషన్‌నుంచి బయటికొచ్చి ఇద్దరూ మ్యూజియం కేఫ్టీరియాకి వెళ్ళారు. వీళ్ళు కాఫీలు కొనుక్కుని టేబుల్ కోసం చూస్తుంటే, “హాయ్‌వాస్, ఓవర్ హియర్” అంటూ నీరజ గొంతు వినిపించింది. వాసంతి నీరజని గమనించి అటువేపు కదిల్తే కృష్ణ ఆమెని ఫాలో అయ్యాడు. నీరజ పక్కన కూర్చున్న ఒక తెల్ల యువకుడు లేచి వీళ్ళిద్దర్నీ ఆహ్వానించాడు. అతన్ని తన ఫ్రెండ్ డేవిడ్‌గా పరిచయం చేసింది నీరజ. పరిచయాలయ్యాక ఒక ఐదు నిమిషాలసేపు సరదా కబుర్లు నడిచాయి.
నీరజ ఆ పూట మాంఛి మూడ్‌లో ఉన్నట్టుంది డేవిడ్‌ని బాగా ఆట పట్టిస్తూ గోల చేస్తోంది. అతన్ని కొడుతూ, గిచ్చుతూ, మధ్య మధ్య అతను కోపం నటిస్తే వెంటనే గట్టిగా కావలించుకుని, ముద్దు పెట్టి బుజ్జగిస్తూ హంగామా చేసి పారేస్తోంది. వాసంతికి నీరజ చిన్నప్పణ్ణించీ స్నేహం కాబట్టి ఈ ప్రవర్తన కొత్త కాదు. కానీ, కొద్ది సేపట్లో కృష్ణ సంభాషణలో పాల్గొనకుండా ముభావంగా ఉండిపోవడం, తన కుర్చీలో ఇబ్బందిగా కదుల్తూ ఉండడం, వాసంతి గుర్తించింది. ఏదో విషయం అతన్ని ఇబ్బంది పెడుతోందని వూహించి, నీరజతో తమకి ఇంకో ఎంగేజ్‌మెంట్ ఉందని చెప్పి టేబుల్ దగ్గర్నుంచి లేచింది. కృష్ణ నీరజకీ డేవిడ్‌కీ ముక్తసరిగా గుడ్ బై చెప్పి ఆమె వెనకనే లేచాడు.
మ్యూజియంలోంచి బయటికి వస్తూనే ఘనీభవించినట్టున్న ఉక్క చుట్టుముట్టి చెమటలు కక్కించింది. తూరుపు దిక్కున ఆకాశంలో నల్లటి మబ్బుల కూటమి నగరం మీద విరుచుకు పడడానికి మొహరించిన సైన్యంలా వుంది. “థండర్ స్టార్మ్ వచ్చేట్టుంది” అనుకుంది వాసంతి చిన్న రుమాలుతో నుదురు అద్దుకుంటూ. పక్కన నడుస్తున్న కృష్ణతో, “సో, వాట్ డు యూ థింక్ ?” అనడిగింది. అతను అప్పటిదాకా బలవంతంగా అణిచి పెట్టిన ఆలోచనల్ని ఇక ఉండబట్టలేనట్టు దురుసుగా అనేశాడు. “ఆ పిల్ల నీ ఫ్రెండ్‌అంటే నమ్మలేకుండా ఉన్నాను. ఎంత షేమ్‌లెస్‌గా బిహేవ్‌చేస్తోంది ఆ గోరాగాడితో .. బొత్తిగా మన వేల్యూస్ తెలీకుండా పెరిగి నట్టుంది ..”
వాసంతికి ముందు ఆశ్చర్యమూ, వెను వెంటనీ బాగా కోపమూ వచ్చేశాయి. ఐనా నడివీధిలో ఉన్నామన్న సంగతి గుర్తించుకుని నిదానంగానే, “కృష్ణా, నీతో కొంచెం వివరంగా మాట్లాడాలి. ఇలా వీధిలో కాదు. అటు సెంట్రల్ పార్కులో కెళ్దాం పద !” అంది.
ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మౌనంగానే కొద్ది సేపట్లో సెంట్రల్ పార్కు చేరారు. నిర్మానుష్యంగా వున్న ఓ మూల బెంచీ మీద కూర్చున్నారు. వాసంతి కృష్ణ వేపుకి తిరిగి కూర్చుని మొదలు పెట్టింది.
“చూడు కృష్ణా, నీరజని ఇదే మొదటి సారి నువ్వు చూడ్డం. తన గురించీ, తన ఫేమిలీ గురించీ నీకు ఇంతకు ముందేమీ తెలియదు. ఐనా కేవలం పది నిమిషాల పరిచయంలోనే నీరజ వేల్యూస్ గురించి అంత హీనమైన అభిప్రాయం .. నీకెలా అసలు అలాంటి ఆలోచన వచ్చిందో నాకర్థం కావటల్లేదు.”
“వెల్, ఒకళ్ళ కేరెక్టర్ ఎలాంటిదో గ్రహించడానికి వాళ్ళ జీవితమంతా తెలియక్కర్లేదు. సరైన సందర్భంలో పది నిమిషాలు .. ఊహు, ఒక్క నిమిషం చాలు .. తెలిసి పోవడానికి. ప్రవర్తనకి పునాది చిన్నతనంలోనే పడుతుంది. తన మొగుడు కాని ఒక మొగాడితో .. ఒక తెల్లతోలు గాడితో .. అలా విచ్చలవిడిగా విరగబడుతున్న ఆ పిల్ల తీరు .. ఆమె పెంపకం ఎలాంటిదో చెప్పకనే చెబుతోంది.”
“మొదట, ఆ పిల్లకో పేరుంది నీరజ ! రెండో విషయం, తను నాకు చిన్నప్పణ్ణించీ బెస్ట్ ఫ్రెండ్ తన పేరెంట్స్ కూడా నాకు బాగా తెలుసు. వాళ్ళెవ్వరి గురించీ నీ దగ్గర్నించి నేను నేర్చుకోవాల్సిన పని లేదు.”
వాసంతికి తన మాటలు బాగా కోపం తెప్పించాయని అప్పటికి తట్టినట్టుంది కృష్ణకి. ఆమె చేతిని తన రెండు చేతుల్లోకీ తీసుకుంటూ అనునయంగా అన్నాడు, “వెల్, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. నీ సంగతే చూడు. ఈ దేశంలో పెరిగినా ఆ నీరజ నీకు బెస్ట్ ఫ్రెండే ఐనా నువ్వు చక్కటి ఇండియన్ వేల్యూస్‌తో పెరగలేదూ? నిన్ను కలుసుకుని, మన పరిచయం ఇలా పెరగడం .. ”
“.. నీ అదృష్టం. యా యా, ఈ మాట ఇప్పటికి చాలా సార్లే చెప్పావు. నాకు తెలీక అడుగుతాను, అంత చక్ఖటి ఇండియన్ వేల్యూస్ ఏవిటి కృష్ణా? ప్లీజ్ ఎన్‌లైటెన్ మీ!” అంది వాసంతి తీవ్రంగా.
“వెల్, కమాన్. నీకు నిజంగానే తెలీక అడుగుతున్నావా? నీకున్న వేల్యూసేవిటో నీకే తెలుసు.”
“నాకున్న వేల్యూసేవిటో నాకు తెలుసు. ఆన్ ద కాంట్రరీ, ఆ వేల్యూస్ పట్ల నీ అభిప్రాయం ఏవిటో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. నీరజలో లేనివీ, నాలో వున్నవీ ఆ మహత్తరమైన ఇండియన్ వేల్యూస్ ఏవిటో చెప్పి కొంచెం పుణ్యం కట్టుకో!”
వాసంతి గొంతులో ధ్వనించిన వెటకారం కృష్ణకి వినిపించినట్టు లేదు .. నాలికకి చేదు తగిల్నట్టు మొహమంతా వికారంగా పెట్టి, “ఛ ఛ, దానితో నీకు పోలికేవిటి .. పరాయి మొగాళ్ళతో అలా మీదపడి బుజాలు రుద్దుకూంటూ .. అసహ్యంగా .. అదేం పోలిక? ఆడ కుక్కలాగ వెంట పడిన మొగాడితోనల్లా సరసాలాడ్డం, ఎంత మందితో పడుకుందో యిప్పటికి ..”
వాసంతి అతని చేతుల్లోంచి తన చేతిని చివాల్న వెనక్కి లాక్కుంది. కృష్ణ మనస్తత్వం హఠాత్తుగా మకిలి తుడుచుకుపోయిన అద్దంలో ప్రతిబింబంలాగా స్పష్టంగా కనిపించింది ఆమెకి. ఆ గుర్తింపుకి మెదడు హోరెత్తి పోతుంటే, కళ్ళు జ్యోతుల్లా వెలిగిపోతుంటే, పళ్ళు బిగించి బుస కొట్టినట్టు అంది, “ఈజ్‌దటిట్ వర్జినిటీ .. ఈజ్‌దటిట్ .. యువర్ ఇండియన్ వేల్యూ? నీకు అతి ప్రియమైన .. ఆరాధ్యమైన ఇండియన్ వేల్యూ .. కన్యాత్వం?”
వాసంతి ఎందుకంత ఉద్రేక పడుతోందో కృష్ణకింకా అర్థమైనట్టు లేదు.
వాదిస్తున్నట్తుగా అన్నాడు, “వెల్, అందులో తప్పేముంది? అది నిజమైన ఇండియన్ వేల్యూ. దురదృష్ట వశాత్తూ ఈ దేశంలో ఈ రోజుల్లో ఇండియన్స్‌లో కూడా కరువై పోతున్నది.”
“అంటే .. నాతో పరిచయంలో నీకు కలిగిన మహదానందం అంతా .. నేను కన్యని కావటం .. కాదు కాదు .. నేను ఇండియన్ వేల్యూస్‌తో పెరగడం వల్ల నేను ఖచ్చితంగా కన్యనే అని నీకున్న నమ్మకం .. అందుకే నీకు నా మీద ఇంట్రస్టు. నాకున్న మిగతా అర్హతలేవీ దాని ముందు లెక్కకి రావు. అంతేనా?” కృష్ణ ఒక్క క్షణం పాటు మౌనంగా ఉండిపోయాడు. తన ఆలోచనలని కూడ గట్టుకుని గంభీరంగా అన్నాడు,
“నా వుద్దేశం అర్థం చేసుకోవడనికి ప్రయత్నించు. మనం ఈ దేశంలో మన జీవితాలు స్థిరపరుచు కున్నాం. ఇక్కడే కుటుంబ జీవితం మొదలుపెట్టి ఈ సామాజిక వాతావరణంలో పిల్లల్ని పెంచబోతున్నాం. నా పిల్లలకి భారతీయ సామ్ప్రదాయాల విలువలు తెలిసి అలవాటవ్వాలంటే .. వాళ్ళ తల్లి .. నా భార్య .. ఆ విలువల్ని గౌరవించి పాటించేదిగా వుండాలని నేను గట్టిగా నమ్ముతున్నాను. పెళ్ళి కాక ముందు ఆడపిల్ల మొగాళ్ళతో విచ్చలవిడిగా తిరగడం ఖచ్చితంగా ఇండియన్ వేల్యూ కాదు. అటువంటి స్త్రీ నా పిల్లలకి తల్లిగా బాధ్యత నెరవేర్చ లేదు. నా భార్య ఇలా వుండాలీ అని ఆశించే హక్కు నాకుందని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. వ్హెన్ యు ఆస్క్ లైక్ దట్, యెస్, ఐ వుడ్ లైక్ మై ఫ్యూచర్ వైఫ్ టుబీ ఎ వర్జిన్.” చేతనైతే ఈ వాదనని ఖండించమని సవాలు కనిపించింది అతని మొహంలో వాసంతికి. ఆమె నెమ్మదిగా బెంచి మీదనించి లేచి కృష్ణకి అభిముఖంగా నిలబడింది.
“కృష్ణా, నువ్వు చెప్పింది చాలా బావుంది. ఇంత వివరంగా చెప్పినందుకు నీకు నేను చాలా ఋణపడి వుంటాను. నీకా హక్కుందని గూడా నేను ఒప్పుకుంటాను. ఐతే నిన్ను ఇంకొక్క ప్రశ్న మాత్రం అడుగుతాను. నిజం చెబుతావని ఆశిస్తాను. .. ఆర్యూ ఎ వర్జిన్?”
వాసంతి అటువంటి ప్రశ్న అడిగే సాహసం చేస్తుందని కృష్ణ ఊహించినట్టు లేదు. అతని గాంభీర్యం కొద్దిగా చెదిరి, ఒక్క క్షణం పాటు మొహం వివర్ణమవ్వడం అతన్నే నిశితంగా పరిశీలిస్తున్న వాసంతి దృష్టిని దాటిపోలేదు. అతను కొమ్చెం కుదుట పడి నోరుతెరిచే లోపు ఆమే తిరిగి అంది వారింపుగా, “వొద్దు కృష్ణా! నువ్వు చెప్పక్కర్లేకుండానే నువ్వు చెప్పబోయే జవాబేవిటో నాకు తెలిసి పోయింది. ఆ జవాబు నాకు ఇంపార్టెంట్ కాదు, అది నన్ను బాధ పెట్టదు. నన్ను బాధపెడుతున్న దల్లా నీ డబుల్ స్టాండర్డ్. ఐ హేట్ డబుల్ స్టాండర్స్డ్. గుడ్ బై కృష్ణా!”
ఆ మధ్యాన్నమంతా దట్టంగా పేరుకున్న టెన్షన్ ఒక్ఖసారిగా బద్దలైనట్టు వేసవి కాలపు థండర్ స్టార్మ్ నగరం మీద విరుచుకుపడిపోయింది. వాసంతి దాన్ని లక్ష్యపెట్టకుండా బ్రాడ్వే వెంబడి నడుస్తోంది తేలిక పడ్డ అడుగులతో.
------------------------------------------------------
రచన: ఎస్. నారాయణస్వామి,
ఈమాట సౌజన్యంతో
50 % english sentences in the story. It is irritating to read english words in telugu script. Well yeah. Male caricature wants her partner to be a virgin. The girl calls his bluff and leaves him in his undergarments with her argument. Not again.
ReplyDelete