Monday, August 12, 2019

అమృతమస్తు


అమృతమస్తు

సాహితీమిత్రులారా!

మొదట్లో శిష్యుడిగా చేరినప్పుడు ఆనందుడికి తథాగతుడు ఇచ్చిన మాట: ఆనందుడు ఎప్పుడైనా భగవానుడి ప్రసంగం వినలేకపోతే మరోసారి తన ఒక్కడి కోసం ఆ ప్రసంగం పుర్తిగా చేయాలి. భగవానుడు సంఘంలో ప్రసంగిస్తున్నప్పుడు ఎక్కడికో పనిమీద బయటకి వెళ్ళి తిరిగి వచ్చిన ఆనందుడి కోసం ఇచ్చిన మాట ప్రకారం మరోసారి పూర్తి ప్రసంగం ముగించాక అన్నాడు, “రేపే మనం కుశీనగరానికి బయల్దేరుతున్నాం.”

“మీ ఆరోగ్యం అంత సరిగా లేదు కదా, ప్రయాణం మానుకుని ఇక్కడే ఉంటే బాగుంటుందేమో?”

“లేదు లేదు, వెళ్ళే సమయం ఆసన్నమైంది. వెళ్లాక ఎందుకో నీకే తెలుస్తుంది. రేపే బయల్దేరుదాం.”

భగవానుడి ఇష్టప్రకారమే కుశీనగరం చేరాక ఆనందుడు చెప్పాడు, “చుందుడనే కమ్మరి ఈ రోజు తన ఇంటికి పిలిచాడు. మీ ఆరోగ్యం దృష్ట్యా ఆయన ఇవ్వబోయే ఆహారం మీకు పడదేమో అని కొంచెం సందేహం.”

మౌనంగా ఏదో ఆలోచిస్తున్నట్టూన్న భగవానుడు చెప్పేడు, “నా కోసం ఏమీ ప్రత్యేకమైన ఆహారం తయారుచేయాల్సిన పనిలేదు. ఆయనకి ఉన్నంతలో ఏది కూర్చి వండి పెట్టగలడో, అదే చాలు. ఏమీ సందేహించకుండా, మనం ఆయన ఇంటికి వస్తున్నామని చెప్పు.”

ఏదో అనబోయిన ఆనందుడు భగవానుడి మొహంలో చిరునవ్వు చూసి ఇంక మాట్లాడక ఊరుకున్నాడు.

చుందుడి ఇంట్లో ధర్మభోధన అయ్యాక ఆ రోజు వడ్డించబడిన ఆహారం అన్నం, మద్దవ అనే పంది మాంసపు కూర. ఈ మధ్య ఆరోగ్యం విషమిస్తున్న భగవానుడు, అసలు ఈ వంటకం దేనితో తయారుచేశారో అని కూడా చూడకుండా అది అమృతం అన్నట్టూ అంత తృప్తిగా ఎలా తిన్నాడో ఆనందుడికి ఆశ్చర్యం.

మర్నాటికి భగవానుడి ఆరోగ్యం మరింత విషమించిన వార్త చుందుడికి చేరింది. తన ఇంటిలో ఇవ్వబడిన ఆహారం వల్ల తథాగతుడి ఆరోగ్యం పాడైనందుకూ, అప్పటికే వయసు పైబడిన భగవానుడికి తాను సరైన ఆహారం ఇవ్వలేకపోయినందుకూ తనని తనే నిందించుకుంటూ ఆనందుణ్ణి చూడబోయేడు.

చుందుడు బాధపడుతున్న విషయం తెలిసి భగవాన్ ఇచ్చిన సమాధానం: “ఆనందా, చుందుడు ఇచ్చిన ఆహారం వల్ల నాకు ఇలా అయిందనే విషయాన్ని మనసులో పెట్టుకోవద్దని చెప్పు. నా జీవితంలో నేను తీసుకున్న ఆహారాల్లో రెండే రెండు అమృత తుల్యమైనవి. మొదటిది నిర్వాణం పొందే సమయంలో సుజాత ఇచ్చిన పాయసం, రెండోది ఇప్పుడు పరినిర్వాణానికి చేరువలో చుందుడి ఇంట్లో తిన్న పంది మద్దవ.”

పరినిర్వాణం అనే మాట భగవాన్ నోటిలోంచి రాగానే ఆనందుడికి తాము బయల్దేరేముందు ‘కుశీనగరం వెళ్ళాక ఎందుకో నీకే తెలుస్తుంది’ అని భగవానుడు అనడం గుర్తు వచ్చింది.

చుందుడికి నచ్చచెప్పి పంపించాక ఆనందుడు అడిగాడు, “భగవాన్, సుజాత పెట్టిన పాయసం సరే, మరి చుందుడు వడ్డించిన పంది మద్దవ వల్ల మీ ఆరోగ్యం పూర్తిగా పాడైంది కదా? అది అమృత తుల్యంగా పరిగణించడం ఎలా?”

“మొదటిసారి సుజాత ఇచ్చిన పాయసం వల్ల నా ప్రాణలు నిలిచి గౌతముడినైన నేను జ్ఞానోదయంతో ధర్మాన్ని కనుక్కోగలిగాను. ఆ రోజు సుజాత పాయసం ఇచ్చి ఉండకపోతే తథాగతుడే లేడు. బుద్ధత్వం పొందాక ప్రారంభించిన ధర్మ చక్ర పరివర్తనం ఈ రోజుకి దాదాపు పూర్తైంది. సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు; ప్రతీ ప్రాణీ అంతమై తీరుతుంది. ఆ క్రమంలోనే ఈ పరివర్తనం అనేది ఎప్పుడో ఒకసారి అంతమవ్వవల్సిందే కదా? అనేకానేక జన్మలు ఎత్తి ఇప్పటికి జనన మరణాల చక్రంలోంచి తప్పించుకున్న నాకు ఈ శరీరం చీమూ రక్తంతో కూడిన అశుద్ధమైన ఒక పంజరం. ఈ పంజరం లోంచి బయటపడి అఖండానందంలో నిరంతరం తేలడానికి, ఈ శరీరం విడిచిపెట్టడానికి ఏదో ఒక అనారోగ్యం వచ్చి తీరాలి. దానికి చుందుడు సమర్పించిన ఆహారం ఓ సాధనం. ఇప్పుడు చెప్పు ఆనందా, చుందుడు నాకు సమర్పించిన ఆహారం పంది మద్దవ, ఎటువంటిది?”

“అమృతమస్తు!” ఈ సారి ఏమీ సంకోచం లేకుండా ఆనందుడు చెప్పేడు.
-----------------------------------------------------
రచన: ఆర్. శర్మ దంతుర్తి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment