అభినవ పోతన అభివ్యక్తి సొగసు
సాహితీమిత్రులారా!
సీ.
తనయను గౌగిట దార్చుచు జనని యౌ
దల మూర్కొనుచు వీపు కలయనిమిరి
యుప్పొంగి వచ్చు దుఃఖోర్మి మత్తడి దూక
నెన్నడు నను వీడి ఎఱుగదనుచు
గంటి నేనాడొ యత్తింటి సొమ్మిద్ది మా
యింటనుండిన దని యెంతుననుచు
గవ్వంబులన్ బెట్టి కడుపులో నెవ్వరో
చల్ల చేయుదురు నా యుల్లమనుచు
తే.
కుడుమనన్ బండుగను వట్టి గోలయనుచు
గాంచి ప్రాణమెత్తుగ బెంచి కన్న కడుపు
నీ చెయింబెట్టితిమి పాలనేని ముంచు
నీటనే ముంచు భారమ్ము నీదె యనుచు
సీ.
అంబికాసతియట్టు లాత్మేశ్వరున కెప్పు
డర్ధాంగివై ప్రేమ నలరుచుండి
వాణీసతి విధమ్ము ప్రాణవల్లభునోట
నాలుకవై కూర్మి గ్రాలుచుండి
శ్రీకాంత యట్టులు నీ కాంతు హృదయమ్ము
దమి నాక్రమించి నిత్యము వసించి
పూత గంగాసతీ పుణ్యవర్తనమట్లు
నాథుండు తలదాల్ప నడచుకొనుచు
తే.
ప్రియునికి దనుమనోవాక్య త్రికరణముల
నెలమి స్వాధీన మొనరించి యెంతొ భక్తి
యతిథి గురుబంధుజన పూజ లాచరించి
మించి యుభయవంశము లుద్ధరించవమ్మ!
ఇవి రెండూ అప్పగింత పద్యాలు. పిల్లను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని అత్తమామల చేతుల్లో ఉంచి, తల్లి ‘ఇక ఈ అమ్మాయి మా పిల్లగాదు, మీ పిల్ల! ఎట్లా చూసుకుంటారో. దీనికి ఏమీ తెలియదు, ఒట్టి అమాయకురాలు’ అని బాధను దిగమింగే ప్రయత్నం చేస్తూ చెప్పే సన్నివేశంలోది మొదటి పద్యం. కూతురుకు అత్తవారింట్లో ఎట్లా మెలగాలో, భర్తతో ఎలా ఉండాలో, కొత్త కోడలి బాధ్యతలెలాంటివో బోధించేది రెండో పద్యం. చక్కటి తెలుగుదనం శోభిస్తున్న పద్యాలు. తెలుగునాట అప్పగింతల వేళ ఇది సాధారణ దృశ్యమే. ఆ మాటకొస్తే లోకంలో ఎక్కడైనా, గువ్వలా పెంచుకున్న కూతుర్ని గూటి అవతలకి పంపేటప్పుడు కన్నవారి గుండెలు అలా బరువెక్కుతూ ఉండటం స్వాభావికమే. తెలుగు పెండ్లిళ్ళలో స్నాతకమనీ, నాగబలి అనీ, తలంబ్రాలు అనీ, మాంగల్యధారణ అనీ ఉండేవి కేవలం లాంఛనాలు అయితే కావచ్చునేమో గాని అప్పగింతల సమయం మాత్రం గొప్ప హృదయస్పర్శి అయిన సన్నివేశం. పెండ్లి చూడ్డానికి వచ్చినవాళ్ళకు అదొక తంతుగా కనిపించొచ్చు గాని, వధువుకూ, ఆమెని కన్నవారికీ మాత్రం అది వారికే అనుభవైకవేద్యమైన బాధ. కణ్వుని లాంటి మహర్షి కూడా పెంచిన మమకారంతో శకుంతలను అత్తవారింటికి పంపేటప్పుడు ఎంత ఆర్ద్రంగా విచలితుడైనాడో కాళిదాసు హృదయంగమంగా వర్ణించాడు. అమ్మాయి కూడా అంతే. కంటితడితో వధువు పుట్టింటి జ్ఞాపకాల ఇంద్రధనువు. అవంతే. కొన్ని అనుభవాలనూ బాధలనూ ఆనందాలనూ వింగడించలేము.
పద్యాల సందర్భం ఏమిటంటే, ఒక పెద్దాయన దేశ సంచారం చేస్తూ ఏకశిలానగర ప్రాంతంలోని బమ్మెర అనే గ్రామసమీపంలో పొలం పని చేసుకుంటున్న ఒక యువకుని పరిచయం చేసుకుంటాడు. పోతరాజు అనే ఆ యువకుడు నియోగి బ్రాహ్మణుడు. ఆయన్నూ, ఆయన పరివారాన్నీ ఆతిథ్యధర్మంగా తమ ఇంటికి తీసుకెళ్ళి తండ్రి కేసనమంత్రికి పరిచయం గావిస్తాడు. ఆ తండ్రీకొడుకులిద్దరికీ, వచ్చిన పెద్దాయన మూర్తితో అదే తొలి పరిచయమేమోగాని–ఆయన పేరు అప్పటికే జగద్విఖ్యాతమైనందున–ఆయన కీర్తితో బాగా పరిచయమే. ఎంతో గౌరవంతో వారు శ్రీనాథ మహాకవిని ఆహ్వానించి ఆతిథ్యం నెరపుతారు. పోతరాజు కూడా కవిత్వం వ్రాస్తాడు. సహజంగా కవులకుండే ఆసక్తితో తను వ్రాసిన పద్యాలు శ్రీనాథునికి చూపించడమూ, ఆయన మెచ్చుకొని ప్రశంసించడమూ జరుగుతుంది. పోతన వినయ విధేయతలనూ, సత్ప్రవర్తననూ చూసి, తినా కుడవా ఇబ్బంది లేని సంసారాన్ని చూసి, తన చెల్లెలును పోతనకు ఇవ్వాలని నిశ్చయించుకుంటాడు శ్రీనాథుడు. తానుండేదేమో తూర్పు సముద్ర తీరాన కాల్పట్టణం ప్రాంతాల్లో. ఈ వూరేమో పశ్చిమాంధ్ర ప్రాంతం మధ్యలోని ఏకశిలానగర సమీపాన. దూరాభారమైనా సంబంధం బాగుంది కాబట్టీ, తనకు తండ్రి లేనందున పెత్తనమూ బాధ్యతా తనదే అయినందునా, శ్రీనాథుడు అందరి అంగీకారంతో ఆ పెళ్ళి జరిపిస్తాడు. అప్పుడు వధువును అత్తమామలకు అప్పగించే సందర్భంలో చెప్పిన పద్యాలు అవి.
ఎంత స్వభావరమ్యంగా ఉన్నాయో చూడండి ఆ పద్యాలు. తల్లి కూతుర్ని కౌగిట్లోకి తీసుకుని, తలను ముద్దుపెట్టుకుంటూ, వీపు కలయ నిమురుతూ, ఆపుకోలేని దుఃఖం పైకి దూకుతుండగా వియ్యపురాలితో అంటుంది: ఎప్పుడూ నా కొంగు పట్టుకొని వీడదు. నన్నొదిలి నిముషం కూడా వుండలేదు. అసలిది మా పిల్ల కానే కాదు. మీ సొమ్ము. ఎల్లాగో మా ఇంట్లో నా కడుపున పడింది. మీ సొమ్మును మీకే అప్పగిస్తున్నాను. ఏందో తల్లీ, కడుపులో కవ్వంతో చిలుకుతున్నట్లు కలగుండు పడిపోతున్నది నా మనసంతా, పిల్లను వదిలి వుండాలంటే. కుడుమంటే పండగనే వట్టి అమాయకురాలు (గోల). ప్రాణానికొక ఎత్తుగా పెంచుకున్నాము. ఇవ్వాళ మీ చేతుల్లో పెడుతున్నాము. పాలముంచుతారో, నీట ముంచుతారో మీదే భారమిక.
కన్నవారి గుండెల్లోని వియోగ భయం ఎంతో బాగా వ్యక్తపరుస్తూ ఉన్నాయి. కౌగిట్లోకి తీసుకోవడమూ, మూర్థం ముద్దుపెట్టుకోవడమూ, వెన్ను కలయనిమరడమూ, కళ్ళనీళ్ళతో మాట్లాడటమూ ఎంతో స్వభావోక్తిరమ్యంగా కళ్ళముందు నిలుస్తాయి. ఆ తల్లి పలికే పలుకులూ ఎంతో సహజసుందరంగా కరుణాజనకంగా ఉన్నాయి. కడుపులో కవ్వం పెట్టి చిలుకుతున్నట్లున్నదని చెప్పడం అనే జాతీయం, వియోగ బాధా తీవ్రతను త్రవ్విపోస్తున్నాది. కుడుమంటే పండగనే గోల అట ఆ అమ్మాయి. ఇది అచ్చమైన తెలంగాణా పలుకుబడి. అలాగే ప్రాణమొక ఎత్తుగా పెంచుకొనడం, పాల ముంచుతారో నీట ముంచుతారో అనటమూ— అన్న జాతీయాలుకూడా ఎంత వేదనారమ్యంగానో ఉన్నాయి.
ఈ పద్యం, బాధ తొలిజల్లు సమయాన తల్లి అప్పగింతల వేళటి రోదనాగర్భిత వేదనార్భటి అయితే, రెండో పద్యం ఆ తొలి జల్లు కురిసిపోయిన తరువాత కొంత నిలకడగా వధువుకు మంచీచెడూ చెప్పే సన్నివేశం. పైగా తొలి పద్యంలోవి తల్లి పలుకులు. రెండో పద్యంలోవి అన్నగారి మాటలు. ఆ అన్నగారు మహాకవి గూడానూ. తొలి పద్యం సహజ సుందరంగా ఉంటే, ఈ పద్యం ఉపమాన రమ్యంగా ఉంది. భక్తితో ‘అతిథి, గురు, బంధుజన పూజలు’ ఆచరించి, దానివలన వచ్చే ఆశీర్వాద బలంవల్లా, కీర్తివల్లా ఉభయవంశాలనూ ఉద్ధరించమని చెపుతున్నారు అన్నగారు.
ఇక భర్తతో కలిసిమెలసి సహజీవనం సాగించడమే కదా దాంపత్య సాఫల్యం. సాధారణంగా భార్యాభర్తలు శివపార్వతుల్లాగా, లక్ష్మీనారాయణుల్లాగా, విరించీవాగ్దేవి లాగా, గంగాశంకరుల్లాగా ఉండాలని అంటూంటారు. అలా దీవిస్తారు. నీ భర్తతో నీవు వారిలాగా ఉండు తల్లీ అని చెప్పడం ముఖ్యం ఇక్కడ. అయితే ఈశ్వరునికి అర్ధాంగి లాగానూ, భర్త నోట్లో నాలుక లాగానూ, కాంతుని హృదయంలో నివాసముండే విధంగానూ, భర్త తనను తలదాల్చేటట్లూ సంసారం సాగించమని చెపుతున్నాడు అన్న. అన్నగారు మహాకవి. కవి ఏది చెప్పినా ధ్వనిపూర్వకంగానే చెపుతాడు. పార్వతి శివుని అర్ధాంగి. అర్ధాంగి అంటే భార్య అనేది సాధారణార్థం. నిజానికి భర్త సగం దేహం ఆక్రమించి అర్ధాంగి అనే పదాన్ని సార్థకం చేసిన సతి శివాని. ఇది విశేషార్థం. సరస్వతీదేవిని బ్రహ్మ తన నాలుక మీద ఉంచుకున్నాడనేది పురాణ ప్రసిద్ధం. వాగ్దేవిలాగా నువ్వూ తలలో నాలుకలాగా ఉండాలి అని చెప్పడం ధ్వనిసుందరంగా ఉండటమేకాక, ‘తలలో నాలుకగా ఉండటం’ అనే అందమైన జాతీయం అక్కడ పొంకంగా కుదిరిపోయింది. భర్త తనని గుండెల్లో దాచుకోవాలని చెప్పడానికి లక్ష్మీనారాయణుల పోలిక సరిగ్గా అతికింది. అలాగే భర్త తనను తలదాల్చే విధంగా ఉండాలి అనే సాధారణ భావాన్ని గంగను తలమీద ధరించిన శివునితో రూపించి చెప్పడం జరిగింది. అలా ఒక సామాన్యార్థమూ, ఒక విశేషార్థమూ, వాటితో కమ్మని జాతీయాల గుబాళింపూ–ఇలా ఈ పద్యం ఒక ముప్పేట గొలుసులాగా సొగసుగా నిర్మితమైంది. ఇలా ఈ రెండు పద్యాలూ ఒక మహాశిల్పి కల్పించిన చిత్రికలై శబ్దార్థాల సంయోగం సాధించాయి.
శ్రీమాన్ వానమామలై వరదాచార్యులు సృష్టించిన పోతన చరిత్రము అనే మహాకావ్యంలోని పద్యాలు ఇవి. ఆధునిక మహాకావ్యాలను లెక్కించాల్సివస్తే తొలి ఆరేడు కావ్యాల్లో నిస్సందేహంగా గణించి తీరవలసిన మహాకావ్యం పోతన చరిత్రము. 3705 గద్యపద్యాలతో, పన్నెండు ఆశ్వాసాల్లో విలసిల్లే బృహత్కావ్యం ఇది. ఎంత అద్భుతమైన పద్యాలండీ అన్నీనూ! ధార విషయంలో గానీ, సందర్భశుద్ధిలో గానీ, స్థానీయ పలుకుబడుల పరిమళపు గుబాళింపులో గానీ, సౌందర్య పరిపుష్టాలయిన జాతీయాలను యథేచ్ఛగా వాడటంలో గానీ–ఈ విశాల నిర్మితి సాధారణ కవిమాత్రునికి సాధ్యమయ్యేది కాదు. వారి వృత్తాలేమి, సీసాలేమి కొన్నిచోట్ల ఎంత ప్రౌఢంగా ఉంటవో, మరికొన్ని చోట్ల అంత సుకుమారంగానూ ఉంటాయి. అక్కడక్కడా ఉక్తి వైచిత్రి ముచ్చటగొలుపుతుంది. ఒక్కసారి ఈ పద్యం చూడండి.
హాసములందు ఫేనము లపాంగ నిరీక్షణలందు మీనముల్
భాసుర ఫాలమందున క్షపాకరునిన్ గురులందు శైవల
న్యాస మొనర్చి మన్మథుని హత్యయొనర్చిన కొండవీటి స
న్న్యాసి నిటాలవహ్ని శిఖలార్చి రతిం బతి గూర్చు నంబికా!
‘మన్మథుని హత్యయొనర్చిన కొండవీటి సన్న్యాసి’ అట. కామారి, అంగజవైరి, కంటిమంటతో కాల్చేశాడు లాంటి మాటలు వేలసార్లు విన్నాముగాని మన్మథుణ్ణి ‘హత్యయొనర్చడం’ అనే మాట ఎవరూ ప్రయోగించగా కనలేదు. వినలేదు. అభివ్యక్తి వైచిత్రి అలా చాలాచోట్ల తలలూపిస్తుంది.
నానృషిః కురుతే కావ్యం అనే వక్కణానికి నిక్కమైన చొక్కమైన ఇక్క ఈ మహాకావ్యం.
పోతన భోగినీ దండకం రచించాడనే ముచ్చట అందరికీ తెలిసిందే. భోగిని ఒక భోగకాంత. గొప్ప నర్తకి. ఆమె నాట్యాన్ని కవి రగడల్లో వర్ణించారు. రాగయుక్తంగా, తాళలయాన్వితంగా ఆ రగడలు దీర్ఘంగా వ్రాశారు. పుట్టపర్తివారి శివతాండవం గేయాల్లాగా ప్రసిద్ధి పొందాయి ఇవి. ఆచార్యులుగారు ఎప్పుడు ఏ సభలో కావ్యపఠనం చేసినా శ్రోతలు ఈ నాట్యభాగాలను అడిగి పాడించుకుని వినేవారట.
వెనువ్రాలి తన కాలి పెను వేలు స్పృశియించి
మునువ్రాలి రతిపతికి మ్రొక్కి శిరసును వంచి
విడిన పయ్యెద కొసలు పిఱుచుట్టురా జెక్కి
సడలు మువ్వలపేరు లెడనెడను ముడినొక్కి
యడలు చిఱు చెమ్మటల గడెగడెకు తడినద్ది
వడి జిక్కువడు సరము లొడుపుగా సరిదిద్ది
ఘలుఘల్లుమని కాలి గజ్జియలు రవళింప
తెలిచీరయంచు జలతారు ఝరి ప్రవహింప
గురులు కనుదమ్ములన్ బెరసె బంభరములై
కర మొరసె బిగి చనుల్ కంతు బొంగరములై
మరొకటి: వర్షార్భటి వర్ణన.
కొండగమిపై దండువెడలిన – సురల రథములె యురకలిడునో
వజ్రియే భండనమొనర్చునొ – వడి గిరుల ఖండనమొనర్చునొ
గిరిశిఖరములె దొరలిపడునో – కరులు ఘీంకృతి గలియబడునో
…
రివ్వుమని యిటువైపు పారుచు – జివ్వుమని యటువైపు దూగుచు
నుర్వినంతయు నూపివైచుచు – నుదధి జలముల నోపి వైచుచు
…
తెరపినీయక చరచికొట్టుచు – కరకసంహతి విసరిపెట్టుచు
మూగి కురియు ఘనాఘనమ్ములు – ముంచియెత్తె ధరం జలమ్ములు
శబ్దాలమీదా, ఛందస్సు మీదా గొప్ప ప్రభుత్వమున్న మహాకవి ఆచార్యులు. అంతేకాక కథాకథన నిర్మాణ నైపుణ్యం కూడా తెలిసిన కవి. అందుకే పోతన చరిత్రని కావ్యంగా నిర్మించగలిగారు. అయితే దీనిని వట్టి తారీఖులు దస్తావేజుల చరిత్రగా కాకుండా, భారతీయ పౌరాణిక సంప్రదాయ పద్ధతిలో తీర్చిదిద్దడం గొప్ప విశేషం. తెలుగులో భాగవతం అవతరించడాన్ని ఒక దైవకార్యంగా వారు చేసిన ఊహకి తెలుగు గుండెలు పులకరించక మానవు.
ఆచార్యులవారికి గానీ, వారి పోతన చరిత్రమునకు గానీ రావలసినంత గుర్తింపూ, కీర్తీ వచ్చాయా అంటే తృప్తికరమైన సమాధానం వస్తుందని నాకనిపించడంలేదు. అసలా మహాకావ్యాన్ని అచ్చు వేసుకోడానికే ఆయన చాలా శ్రమపడ్డారు. ఎంతకాలమో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పుస్తకం చేతపట్టుకుని ఊరూరూ తిరిగి సభలు పెట్టించుకుని, కావ్యపఠనం చేసి, లభించిన తృణమో పణమో ఏ మూలకూ చాలక–తనకు కలిగిన క్షయరోగ నివృత్తికి కూడా కావలసిన డబ్బుకు బాధపడుతూ–చివరకు ఎలాగో ముద్రించుకోగలిగారు. ఆహా! తమరు అంతవారు, ఇంతవారు అన్నవారే కాని సహాయం చేసినవారు తక్కువ. పుస్తకం ముద్రణ ఐన తర్వాత ఆయనకు కొంత గుర్తింపు వచ్చి, ప్రభుత్వంవారు యం.ఎల్.సి.ని చేసి గౌరవించారు. కానీ ఆ గుర్తింపు మాత్రమే వారికి సరియైన గుర్తుకాదు. ఇది ప్రచార యుగం. ప్రచారం లేనిదే దేనికీ గుర్తింపు రాదు. ప్రచారము అంటే ప్రాపగాండా అనే అల్పార్థంలో నేను చెప్పడంలేదు. ఉదాహరణకు విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షం గురించీ, నవలల గురించీ, నాటకాల గురించీ, ఆయన కవిత్వం గురించీ, ఆయన జయంతులకూ వర్ధంతులకూ ఎక్కడో ఒకచోట సాహిత్య సభలు జరుగుతాయి. సెమినార్లు జరుగుతాయి. కవనస్పర్థలు జరుగుతాయి. అలాగే జాషువాగారికి కూడాను. భావకవిత్వ ఉధృతి సమయంలో కృష్ణశాస్త్రిగారు తెలుగునాడు ఆ కొస నుంచి ఈ కొసదాకా పర్యటించి తనవే కాక చాలామంది కవుల పద్యాలు జనంలోకి తీసుకువెళ్ళినందుననే ఇవ్వాళ ఆ కవులంతా స్మరింపబడుతున్నారు. కానీ వరదాచార్యులవారూ, వారి కావ్యమూ తగినంత ప్రచారం పొందలేదనిపిస్తుంది. అందుకు ఏ వ్యక్తులో ప్రాంతమో కారణం అనుకోను. తెలుగువారు మహాకవులను గౌరవించుకోని అరసికులు కారు. మంచి కవిత్వం ఎక్కడున్నా ఆహ్వానించి గుండెలకద్దుకుంటారు. వరదాచార్యులవారిని గురించీ, వారి పోతన చరిత్రము గురించీ సభలు జరగాలి. విస్తృతంగా సాహిత్య సమావేశాలు జరగాలి. పెద్దలచేత ఉపన్యాసాలిప్పించాలి. సెమినార్లు నిర్వహించబడాలి. ప్రభుత్వాలకు ఇలాంటి పనులమీద ఆసక్తిగానీ, వారికంత తీరికగానీ ఉండవు. సాహిత్యప్రియులూ, రసికులూ, సంస్థలూ పూనుకొని ఆచార్యులవారిని కొద్దిపాటి సాహిత్య పరిజ్ఞానమున్నవారికి కూడా దగ్గరికి చేర్చాలి.
ఆచార్యులవారు మహాకవి. వారినీ వారి కవిత్వాన్నీ ఉపేక్షించడం తెలుగు జాతికి తగని పని. అది తెలుగువారి రసికతకు ఎంతమాత్రమూ కీర్తిప్రదం కాదు.
-------------------------------------------------------
రచన: చీమలమర్రి బృందావనరావు,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment