Saturday, August 3, 2019

ఖుదా కీ కసమ్


ఖుదా కీ కసమ్



సాహితీమిత్రులారా!


ఈ అనువాదకథను ఆస్వాదించండి....................

అటువైపు నుండి ముస్లిములు, ఇటువైపు నుండి హిందువులు ఇంకా వస్తూ పోతూనే ఉన్నారు. క్యాంపులకు క్యాంపులు నిండిపోతున్నాయి. ఇసక వేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయున్నాయి. అయినా కూడా, వాటిల్లోకి ఇంకా జనాలను కుక్కుతూనే ఉన్నారు. ధాన్యం సరిపోయేంత లేదు. పారిశుద్ధ్యానికి ఎలాంటి ఏర్పాట్లూ లేవు. రోగాలు వ్యాపిస్తున్నాయి. ఇవన్నీ ఎవరికీ పట్టినట్టూ లేదు. అవసరాలూ నిర్లక్ష్యమూ రెండూ ఎక్కువగానే ఉన్న వింత వాతావరణం అది.

అది 1948. మార్చి నెల దరిదాపుల్లో. అటూ ఇటూ, రెండు వైపులా ‘లేపుకెళ్ళబడిన’ ఆడవాళ్ళని, ఆడపిల్లలని వెతికి పట్టుకొని రజాకార్ల సహాయంతో ఎగుమతి, దిగుమతి చేయించే పవిత్రమైన పని మొదలయింది. కోట్లాదిమంది మగవాళ్ళు, ఆడవాళ్ళు, మగపిల్లలు, ఆడపిల్లలు ఈ మంచిపనిలో పాలుపంచుకున్నారు. వాళ్ళ ఉత్సాహం చూసి నాకు ఆశ్చర్యంతో కూడిన సంతోషం కలిగింది. మరి మనుషులే మనుషులు చేసిన పాపాన్ని కడిగేయడానికి శ్రమిస్తుంటే! ఎందుకని? పోయిన శీలాలు మరీ పాడైపోకుండా పోయిన మానం మళ్ళీ మళ్ళీ కొల్లగొట్టబడకుండా కాపాడాలని. ఎందుకని? ఎందుకంటే వాళ్ళ బట్టలపై పడిన ఆ మరకలు, ఆ మకిలి అలాగా ఉండకూడదని. ఎందుకని? వాళ్ళు నెత్తుటితో తడిసిన వేళ్ళని త్వరత్వరగా నాకి తుడుచుకొని, తన కుటుంబంతో, తనవాళ్ళతో దస్తర్‌ఖాన్ మీద కూర్చొని కలిసి భోంచేయాలని. ఎందుకని? మానవత్వమనే సూదీ దారం తీసుకొని, ఆ రెండో కన్ను రెప్పవాల్చినంత సేపట్లో ఈ చిరిగిన శీలాలకు అతుకులు వేసి బాగుచేయాలని. నాకు ఇవేమీ అర్థంకాటల్లేదు. కాని, ఆ రజాకార్లు పడుతున్న శ్రమను మాత్రం మెచ్చుకోవలసివస్తుంది. వాళ్ళు సవాలక్ష కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది, వేయిన్నొక్క అడ్డంకులు ఎత్తిపారేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆడవాళ్ళని, ఆడపిల్లల్ని ఎత్తుకొచ్చిన వాళ్ళు పాదరసంలా ఇవ్వాళ ఇక్కడ, రేపు అక్కడ. ఒకసారి ఈ ఊరిలో, ఇంకోసారి ఇంకో ఊరిలో. ఎంత కష్టం ఆ ఆడవాళ్ళను వెతకటం. పైగా దగ్గర్లో ఉన్న మగవాళ్ళు కూడా ఎవరూ సాయం చేయడానికి వచ్చేవారు కారు.

వింత వింత కథలన్నీ వినిపించేవి.

ఒకసారి… కాస్త కనికరం ఉన్న రజాకారు ఒకడు సహరన్‌పూర్‌లో ఇద్దరు అమ్మాయిలు పాకిస్తానులో ఉన్న అమ్మానాన్నల దగ్గరకి వెళ్ళడానికి నిరాకరించారని, వాళ్ళని అక్కడే ఒదిలిపెట్టేశానని నాకు చెప్పాడు. జలంధరులో ఒక అమ్మాయిని తాము బలవంతాన తీసుకెళ్ళినప్పుడు, అక్కడున్న కుటుంబాలన్నీ ఎవరి ఇంటి కోడలో దూరప్రయాణానికి వెళ్తున్నట్టు వీడ్కోలు చెప్పారని, ఒక రజాకారు చెప్పాడు. చాలామంది అమ్మాయిలు అమ్మానాన్నలంటే హడలుపుట్టి దారిలోనే ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది ఆ దెబ్బను తట్టుకోలేక పిచ్చివాళ్ళయిపోయారు. మందుకి అలవాటు పడిపోయిన అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళకి దాహమేస్తే మంచినీళ్లకి బదులు మందు తాగి, పచ్చిబూతులు తిడతారు.

నేను అలా దొరికిన ఆడవాళ్ళ, అమ్మాయిల గురించి ఆలోచిస్తే నాకు వాళ్ళ ఉబ్బిన కడుపులు మాత్రమే కళ్ళముందు కనిపిస్తాయి. ఈ కడుపులన్నీ ఏమవుతాయి? వాటిలో నిండినవాటికి బాధ్యత ఎవరిది? కారణం ఎవరు, పాకిస్తానా? హిందుస్తానా? వీళ్ళు పడే ఈ తొమ్మిదినెలల కష్టానికి ఖరీదు పాకిస్తాను కడుతుందా, హిందుస్తానా? లేదూ క్రూరప్రకృతికి బలి అయిన ఈ ప్రాణాలన్నీ ఎవరికీ చెందని అనాథ ఖాతాలలో నమోదు అవుతాయా? అనాథ ఖాతాలు ఎప్పుడైనా ఖాళీ అవుతాయా?

అలా లేపుకెళ్ళబడి దొరికిన ఆడవాళ్ళు, ఎగుమతయ్యేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. దిగుమతయ్యే ఆడవాళ్ళు వస్తూనే ఉన్నారు.

ఈ ఆడవాళ్ళని ‘లేపుకెళ్ళబడిన’వారిగా ఎందుకంటారోనని ఆలోచించేవాణ్ణి. వీళ్ళని ఎవరు బలవంతాన ఎత్తుకెళ్ళారని? ఎవరు వీరికి మాయమాటలు చెప్పి లేపుకెళ్ళారని? అలా లేపుకెళ్ళడం అనేది రొమాంటిక్‌గా ఉన్నా అది ఒక పెద్ద అబద్ధం. దానిలో ఆడామగా ఇద్దరూ పాల్గొంటారు. ఆ లోయ లోకి దూకబోయేముందు రెండు మనసులూ తీగల్లా ఆవేశంతో వణికిపోతాయి కాని అది అందమైన లోయ కాదు. అది నిజానికి చేతిలో ఆయుధం లేని వాళ్ళని పట్టుకొని ఒక చిన్న గదిలో తాళం పెట్టడం లాంటిది.

కానీ ఆ రోజుల్లో ఈ ఆలోచనలు, చర్చలు, వేదాంతం ఎవరికీ పనికిరాని విషయాలు. ఆ రోజుల్లో జనాలు వేసవిలో కూడా ఎలా తలుపులు, కిటికీలు మూసుకొని పడుకునేవారో, అలానే నేను కూడా మనసుకి, మెదడుకి ఉన్న అన్ని కిటికీలు, తలుపులు మూసేశాను. వాటిని తెరిచి ఉంచుకోవాల్సిన అవసరం అప్పుడే ఎక్కువ ఉంది. కానీ, నేనేం చేస్తాను, ఏమైనా చేయాలని నాకేం తోచను కూడా తోచలేదు.

అలా లేపుకెళ్ళబడి దొరికిన ఆడవాళ్ళు, ఎగుమతయ్యేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. దిగుమతయ్యే ఆడవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇలా అందరూ తమ సొత్తును తాము తెచ్చుకుంటున్నారు, వారి సొత్తును వారికి పంపుతున్నారు, అన్ని వ్యాపారనియమాలూ పాటిస్తున్నట్టే ఉన్నారు. పత్రికలవారు, కథారచయితలు, కవులు కలాలు ఎత్తి వీరి వెతల వేటలో నిమగ్నమయ్యారు. వార్తలు, కథలు, కవితలు వెల్లువలా ఎగసిపడ్డాయి. అప్పటికీ సరిపోలేదు. తమ రాతలకు వస్తువులు ఇంకా ఎన్నేసి ఉన్నాయో చూస్తున్న కలాలకు మతిపోయింది. తన బాణాలకన్నా ఎక్కువగా ఉన్న జింకలను చూసిన వేటగాళ్ళలా అవి తడబడిపోయాయి.

ఒకసారి ఆ మంచి రజాకారు నన్ను ఆరా తీయడం మొదలెట్టాడు: “మేం చేస్తున్న ఈ పని నీకు నచ్చదు కదూ?”

నేనేం సమాధానం చెప్పలేదు.

“మాయమైపోయిన ఆడవాళ్ళని వెతకడానికి మేం కాళ్ళరిగేలా తిరుగుతున్నాం. ఒక ఊరినుండి ఇంకో ఊరికి. ఇంకో ఊరికి. అలా ఇంకోదానికి. బస్తీ బస్తీ, గలీ గలీ, సందుగొందులు. అలా ఎంతో కష్టపడితే కాని వెతుకుతున్న సిరి చేతికి దొరకదు!”

నేను మనసులో అనుకున్నాను. ఈ సిరి ఏమిటి, ఈ వెతకడం ఏమిటని.

అతడో కథ చెప్పడం మొదలెట్టాడు: “నీకు తెలీదు, మేమెన్ని కష్టాలు పడతామో… ఎందుకనుకున్నావు? అది సరే. పోనీ, ఇది విను. మేమీ పనిలో బార్డరుకి అవతల సవాలక్ష చుక్కర్లు కొట్టొచ్చాం. వెళ్ళిన ప్రతీసారీ ఒక ముస్లిమ్ ముసిలిది కనిపించేది. నడివయసు దాటింది. మొదటిసారి ఆమెని జలంధర్ బస్తీలలో చూశాను. కంగారుపడిపోతూ ఉంది. ఎదురుంగా ఏముందో కూడా చూసుకోకుండా ఉంది. మన లోకంలోనే ఉన్నట్టు లేదు. కళ్ళు గాజుకళ్ళలాగా జీవం లేకుండా ఉన్నాయి. మాసిపోయిన బట్టలు, దుమ్ముపడి ఎండిపోయిన తల. తనమీద తనకు ధ్యాసే లేదు. కాని, ఆ కళ్ళల్లో ఒక్కటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఆమె ఎవరినో వెతుకుతోంది.

‘ఆ ముసలిది అనుకోనిదేదో జరిగి ఆ షాక్‌తో పిచ్చిదైపోయింది. పటియాలాలో ఉండేది. ఒక్కగానొక్క కూతురు తప్పిపోయింది. ఆమె కూతుర్ని వెతకడానికి మేమూ చాలా ప్రయత్నించాం కానీ లాభం లేకపోయింది. అల్లర్లలో చనిపోయి ఉండచ్చని అనుకున్నాం, కానీ ఆమె ఒప్పుకోదు!’ అని నాకు మా అక్క ఒకసారి మాటల్లో చెప్పింది. రెండోసారి నేను ఆ ముసలామెను సహరన్‌పూర్ లారీల అడ్డాలో చూశాను. ఆమె పరిస్థితి ముందుకన్నా అధ్వాన్నం అయిపోయుంది. బట్టలు చిరిగిపోయి వున్నాయి. పెదాలు ఎండిపోయి పెచ్చులుకట్టి వున్నాయి. జుట్టు సన్యాసులకు లాగా అట్టలు కట్టుకుపోయింది. నాకు జాలి వేసింది. ఆ ముసలామెకు ఎలాగో నచ్చచెప్పి ఆమెను ఈ వెతుకులాట ఆపేలా చేద్దామనుకున్నాను. ఆమెతో మాట్లాడ్డానికి ప్రయత్నించాను. గుండె రాయి చేసుకొని ఆమెతో అన్నాను: ‘మాయీ, మీ కూతురిని ఎవరో హత్య చేసి చంపేశారు.’

ఆ పిచ్చామె నా వైపు చూసింది: ‘హత్యా?! లేదు…’ అంది. ఆమె మనసులో నమ్మకం ఇనుప స్తంభం పాతినట్టు పాతుకుపోయుండాలి. ‘లేదు, నా బిడ్డ బతికే ఉంది. ఎవరూ హత్య చేయలేరు… నా బిడ్డను ఎవరూ హత్యచేయలేరు…’ అంటూ, ఆ బిడ్డను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. భ్రమలో ఈ ముసలామె ఎంతకాలం ఇలా వెతుకుతుందో! అనుకున్నాను. ఒకటి వెతుకులాట, ఇంకోటి ఆ అమ్మాయి ఇంకా బతికేవుందన్న అబద్ధపు నమ్మకం. కానీ ఆ పిచ్చిదానికి ఎందుకంత నమ్మకం ఆమె కూతురిపై ఎవరూ ఏ కత్తి ఎత్తుండరని? పదునైన బాకో, చాకో ఆమె పీక మీదకు వచ్చుండదని? చనిపోకుండా ఉందేమిటి? కూతురా? కూతురు మీద ప్రేమా? కూతురు మీద మమకారం ఎప్పటికీ చచ్చిపోదు. అవును. కాని, ఆమె వెతికేది దేన్ని? ఆమె తన మమకారాన్ని వెతుక్కుంటుందా? ఎక్కడైనా పారేసుకుందా దాన్ని?

మూడోసారి ఆమెని మళ్ళీ చూశాను. ఇప్పుడామె పూర్తిగా పాడైపోయి వుంది. బట్టలన్నీ పీలికలైపోయి, దాదాపుగా వంటిమీద నూలుపోగు లేకుండా వుంది. నేను ఆమెకి బట్టలు ఇచ్చాను, కానీ ఆమె తీసుకోలేదు. నేను ఆమెతో అన్నాను: ‘మాయీ, నేను నిజమే చెప్తున్నాను. మీ అమ్మాయిని పటియాలాలో హత్య చేశారు.’

‘నువ్వు అబద్ధం చెప్తున్నావు.’ ఆమె అదే నమ్మకంతో అంది.

నేను నా మాటను నమ్మించాలని మళ్ళీ అన్నాను: ‘లేదు. నేను నిజమే చెప్తున్నాను… బాగా వెతికి వెతికీ దెబ్బతిన్నావు. పద, నాతో రా, నేను నిన్ను పాకిస్తానుకి తీసుకెళ్తాను.’

ఆమె నా మాటలను వినిపించుకోలేదు. ఏదో బడబడా మాట్లాడ్డం మొదలుపెట్టింది. అలా అర్థం లేకుండా పెద్దగా మాట్లాడుతూ ఉన్నట్టుండి ఉలిక్కిపడినట్టయింది. అంతకుముందు కన్నా నమ్మకం మరింత గట్టిపడిన గొంతుతో అంది: ‘లేదు, నా కూతుర్ని ఎవరూ చంపలేరు…’

నేను అడిగాను: ‘ఎందుకు చంపలేరు?’

ఆ ముసలామె మెల్లిమెల్లిగా చెప్పింది: ‘అది అందంగా ఉంటుంది… ఎంత అందమంటే దాన్ని ఎవరూ చంపలేరు… కనీసం లెంపకాయ కూడా కొట్టలేరు!’

నేను ఆలోచించటం మొదలుపెట్టాను. ‘ఆమె నిజంగానే అంత అందగత్తా… ప్రతి తల్లికీ తన బిడ్డ ఈద్ కా చాంద్ లాగానో, నిండు చందమామ లాగానో కనిపిస్తుంది కదా. పోనీ ఆమె నమ్మలేనంత అందగత్తె అయ్యుండచ్చు అనుకున్నా ఈ తుఫానులో, ఏ అందం మనుషుల మొరటు చేతుల్లో నలిగిపోకుండా ఉంది? ఈ పిచ్చిది ఆ నిజాన్ని నమ్మలేక ఇంకా వెతుకుతున్నట్టుంది. మనల్ని మనం మభ్యపెట్టుకోవడానికి లక్ష దారులుంటాయి. కానీ బాధ కూడలి లాంటిది. నాలుగు కాదు, నాలుగు లక్షలు కాదు, కోట్ల కోట్ల దారులు దాని చుట్టూరా వుంటాయి నిజం నుంచి తప్పించుకొని పోవడానికి.

అలా బార్డరు దగ్గర్లో నావి చాలా చక్కర్లు అయ్యాయి. ప్రతి చక్కరులో నేను ఆ పిచ్చిదాన్ని చూశాను. రానురానూ ఎముకల కుప్పలా తయారయ్యింది. కంటిచూపు మందగించింది. వంగిపోతూ తూలిపోతూ నడుస్తోంది. అయినా వెతుకుతూనే వుంది వెర్రిగా. ఆమె కూతురు బతికే ఉందన్న నమ్మకం పోలేదు, ఆమెని ఎవరూ చంపలేరన్న నమ్మకం కూడా.

ఈ సంగతే చెప్తే మా అక్క అంది: ‘ఆమెకి నచ్చచెప్పటం అనవసరం. ఉన్న మతి పూర్తిగా పోయింది. నువ్వు ఎలాగోలా ఆమెను పాకిస్తానుకి తీసుకెళ్ళి, ఏదో ఒక పిచ్చాసుపత్రిలో చేరిస్తే మంచిది.’

నాకది సరిగ్గా అనిపించలేదు. ఆమె ఇంకా బతికివుండడానికి ఒకే కారణం ఆమె పిచ్చి వెతుకులాట. దాన్ని ఆమె నుండి లాగేసుకోవాలని నాకనిపించలేదు. ఈ లోకం కూడా ఒక పెద్ద పిచ్చాసుపత్రి. దానిలో ఆ ముసలామె కాళ్ళు బొబ్బలెక్కి అరిగిపోయేలా ఎంతైనా నడవచ్చు. అలాంటి ఆమెను తీసుకువెళ్ళి ఒక చిన్న ఇరుకుగదిలో ఎలా పెడతాను? ఆమెను అలా ఒక జైలులో పెట్టాలనిపించలేదు.

సరే, నేను ఆమెని చివరిసారిగా చూసింది అమృత్‌సర్‌లో. ఆరోజు ఫరీద్ చౌక్ అటూ ఇటూ నడుస్తున్న జనాలతో బాగా రద్దీగా ఉంది. నేను మా అక్కతో ఒక దుకాణం ముందు కూర్చొని ఎవరో లేపుకెళ్ళిన ఒకమ్మాయి గురించి చెప్తున్నాను. అక్క వెంటనే ఉప్పందించింది–ఆ అమ్మాయి సబ్బులమ్మే బజారులో ఒక బనియా ఇంట్లో ఉందని. కబుర్లు అయ్యాక, ఇక వెళ్ళొస్తానని లేచినప్పుడు చూశాను ఆ ముసలామెను. ఆమె ఆ చౌక్ లోనే నిలుచొని, తన సగం సగం గుడ్డికళ్ళతో అటూ ఇటూ చూస్తోంది. ఆమె చివరికి ఎలా అయిపోయిందంటే ఆమెను చూడగానే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నేను వెంటనే అనుకున్నాను–ఇక ఆమెను పాకిస్తానుకు తీసుకువెళ్ళి పిచ్చాసుపత్రిలో చేర్చక తప్పదని. ఆమె వైపు నడిచాను, ఎలానోలా నచ్చచెప్పి ఒప్పించి ఆమెను పాకిస్తాను తీసికెళదామని. అప్పుడే ఒక జంట అటుగా వెళ్ళింది.

ఆడమనిషి చీరకొంగు తల మీదగా కప్పుకొనుంది. ఆమెతో పాటు ఒక సిక్కుమనిషి వున్నాడు. మనిషి మంచి సరదాగా, ఆరోగ్యంగా, చెక్కినట్టుగా అందంగా ఉన్నాడు. అలా ముసలామె ముందుకు రాగానే అతని అడుగు టక్కున ఆగిపోయింది. రెండడుగులు వెనకకు వేశాడు. తనతో ఉన్న ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ఆమె తడబడింది. ఈ తత్తరపాటులో ఆమె తలమీదుగా కప్పుకున్న కొంగు జారిపోయి మొహం కనిపించింది. దుమ్మూ, జనపనార పట్టలతో నిండిపొయున్న ఆ చౌక్‌లో నాకు ఉన్నట్టుండి ఒక లేత గులాబీపూవును చూసినట్టయింది. ఆ అందాన్ని ఎలా వివరించాలో నాకు మాటలు లేవు. నేను అప్పుడు వాళ్ళకి చాలా దగ్గరలోనే ఉన్నాను.

సిక్కు యువకుడు ఆ అతిలోక సుందరితో, ఆ పిచ్చిదాని వైపుకి సైగ చేస్తూ గుసగుసగా చెప్పాడు: ‘మీ అమ్మ!’

ఆ గులాబీ పువ్వు ఒక్కసారి పిచ్చిదానివైపు చూసింది. తలమీదుగా కప్పుకోబోతున్న పైటను ఒదిలేసింది అలాగే. వెంటనే ఆ సిక్కు మగవాడి జబ్బ పట్టుకొని కీచుగొంతుతో అరిచింది. ‘పద, పద!’

ఆపై వాళ్ళిద్దరు రోడుకి అటువైపుగా చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. పిచ్చిది అరిచింది: ‘భాగ్ భరీ… భాగ్ భరీ!’

ఆమె గాలిలో ఆకులా కదిలిపోతోంది. నేను దగ్గరకి వెళ్ళి అడిగాను: ‘ఏమైంది మాయీ?’

ఆమె వణికిపోతూ చెప్పింది: ‘కనిపించింది. నేను చూశాను. నేను చూశాను.’

నేను అడిగాను: ‘ఎవర్ని?’

ఆమె నుదుటి కింద రెండు గుంతల్లో రెండు వెలుగులేని కళ్ళు కదిలాయి. ‘నా కూతుర్ని… నా భాగ్ భరీని.’

నేను అన్నాను: ‘ఆమె ఎప్పుడో చచ్చిపోయింది మాయీ.’

ఆమె అరుస్తూ అంది: ‘నువ్వు అబద్ధం చెప్తున్నావు.’

నేను ఈసారి ఆమెకి నమ్మకం కలిగించడానికని అన్నాను: ‘నేను ఖుదా మీద ఒట్టేసి చెప్తున్నాను, నీ కూతురు చచ్చిపోయింది.’

అది వింటూనే ఆ పిచ్చిది అక్కడే కుప్పకూలిపోయింది.”
----------------------------------------------------------
రచన: పూర్ణిమ తమ్మిరెడ్డి,
మూలం: సాదత్ హసన్ మంటో,
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment