గుడిపూడి జంగాలు
సాహితీమిత్రులారా!
“ఒరే, ఘోరం రా! వందన ఈ రోజు ఎవరితోనో బైక్ మీద పోతుంది”
“దీన్లో ఘోరం ఏముంది నేను మొన్న సినిమా హాల్ లో చూశా ఎవడితోనో”
“మరి నాకెందుకు లైనేసినట్టు?”
“నీకు లైన్ వేయడం దండగని ఇప్పటికైనా తెలుసుకుంది”
“అంటే నీ ఉద్దేశ్యం ఏంట్రా?”
“నీకోసం పాపం ఆ అమ్మాయి గత సంవత్సరంగా ట్రై చేసింది. నువ్వేమో హాయ్ అంటే హాయ్ అంటావే గాని ఎప్పుడైనా పబ్బు కు గాని, పిజ్జా కి గాని తీసుకెళ్లావా?”
“అంటే పబ్బు కెళ్తేనే, పిజ్జా తినిపిస్తేనే ప్రేమించినట్టా? ”
“మరి కాదా?”
“ఇదెక్కడి ఘోరంరా బాబు ఆ అమ్మాయ్ అడగందే? ”
“ఆ .. అడుగుతారు రా .. నీలాంటోళ్లు బోలెడుమంది క్యూ కట్టి లైన్ లో ఉంటే, బాబూ నన్ను సినిమాకి తీసుకెళ్ళు అని ఆమ్మాయి నిన్నడుగుతుంది నీలాంటి వేస్ట్ గాడికి లైన్ వేయడం వేస్ట్ అని చాలా ఆలస్యంగా తెలుసుకుంది పాపం పిచ్చి పిల్ల.”
“అసలేంటిరా నువ్వనేది?”
“ఏముందిరా ఎన్నిసార్లు ఆ అమ్మాయి నిన్ను బయట కలవాలంది? ఆమె అడిగిన ప్రతి సారి నువ్వు ఓ వెధవ ఫోజిచ్చి బిజీ అంటుంటే ఎంతకాలమని నీకోసం ఎదురుచూస్తుంది చెప్పు”
“అంటే బయటికి రమ్మంటే రాలేదని వేరే ఎవర్నో చూసుకోవడమేనా?”
కొంచం సేపు ఆలోచించి మళ్లీ మొదలెట్టాడు “ఇప్పుడు అమ్మాయిలు ఎలా తయారయ్యారో తెలుసా? ఉదయం బయలుదేరి నప్పటినుంచి తిరిగి రాత్రికి గూడు చేరే వరకు పైసా ఖర్చు లేకుండా ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఒకడితో, లంచ్ కుదిరితే ఆ బ్రేక్ ఫాస్ట్ వాడితో లేదంటే వేరే ఇంకొకడి తో, తరవాత సాయంత్రం మంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో నచ్చిన ఐటం, ఆతరువాత డిన్నర్ ఇంకో బకరాతో, ఈ మధ్య ఏదైనా కొత్త సినిమా రిలేజ్ ఐతే దానికింకోడితో ఇలా రోజుకు మినిమం ఇద్దరు ముగ్గురితో ఖర్చు చేయించడమే వాళ్ల అలవాటు, “ఫేసేదయినా, పర్సెవరిదైనా పనిజరగడం ముఖ్యం, రోజు గడవడం ముఖ్యం” అనుకుంటున్నార్రా అమ్మాయిలు, అలాటప్పుడు ఖర్చుకి వెనకాడావంటే ఇక అంతే. ఆ క్షణం నుంచి నువ్వెవరో తెలియదు వాళ్లకి. ఇంటిదగ్గరనుంచి వొచ్చే డబ్బులు బ్యూటీపార్లల్స్ ,డ్రస్సులు కొనుక్కోవడానికి సరిపోతాయ్ . ఇంకా ఎవరైనా మంచి బకరా దొరికితే అవికూడా వాడే భరిస్తాడు. ప్రేమకీ అభిమానానికీ ఎటువంటి విలువా లేదు రా ఇప్పుడు” ఎంతో అనుభవమున్న వాడిలా చెప్పాడు.
“ఛీ … నిజంగా తల్చుకుంటేనే బాధ గా ఉందిరా. ఓ పది పదిహేను రోజులనుంచి ఆమె నేను కనిపించినా అసలెవరో తెలియనట్టు వెళ్లిపోతుంటే బహుశా ఎగ్జాంస్ టైం కదా చదువుకుంటుందేమో అనుకున్నా. ఈ రోజు ఎవడితోనో చూసానుకాబట్టి సరిపోయింది లేదంటే ఇంకా ఆమె గురించే ఆలోచిస్తూ నా టైం వేస్ట్ చేసుకునేవాడ్ని .. అది సరే మొన్నెప్పుడో సినిమాహాల్లో చూసినోడివి ఇన్నాళ్లూ నాకెందుకు చెప్పలేదురా?”
“చెప్పినా నువ్వు నమ్మవ్ కదరా! ఎప్పుడో ఒకప్పుడు నీకళ్ళతో నువ్వే చూస్తావ్ లే అని చూస్తున్నా”
వర్మ, కిరణ్ ల సంభాషణ కడ్డుతగులుతూ వొచ్చి పడ్డారు వినయ్ , ప్రసాద్ లు.
“ఏరా ఎంతసేపైంది రూంకొచ్చి?” అడిగాడు వినయ్
“ఓ అరగంటవుతుంది. ఏంటీ ఈ రోజు విశేషాలు?” వర్మ
“ఏమున్నయ్ రా షరా మామూలే రొటీన్ ఐపోతుంది వెధవ జీవితం” ప్రసాద్
కూర్చుంటూ పక్కనే ఉన్న ఆరోజు పేపర్ లో ఫోటో చూస్తూ “అదిసరే రా ఇంతకీ ఆ ప్రత్యూష ది హత్యా ఆత్మహత్యా?” ఆదుర్దాగా అడిగాడు వినయ్
“అది తెలుసుకోలేకే అటు డాక్టర్లూ ఇటు పోలీసోళ్లూ తెగ తంటాలు పడిపోతున్నారు” కిరణ్
“మంచి హీరోయిన్ రా…..” ప్రసాద్
“ఐతే ఇప్పుడేం చేద్దాంరా?” ప్రశ్నించాడు వర్మ
“అదేరా మనలాంటి యువకులే .. ఏమీ చేయలేమని చేతులు కట్టుక్కూర్చుంటే ఇంకెవరు రా అన్యాయాన్ని ఎదిరించేది?” ప్రసాద్ అన్న మాటలకు షాక్ తగిలినట్లు మిగిలిన ముగ్గురూ అతనివైపు తిరిగి “ఏంటినాయనా నువ్వు యువకుడివా?” అనరిచారు ఒక్కసారిగా.
“అరే నీ వందన కనిపించిందీ రోజు ..”టాపిక్ చేంజ్ చేస్తూ వర్మ వైపు తిరిగి చెప్పాడు ప్రసాద్
“నీకూ కనిపించిందా? ఇక దాని గురించి ఆలోచించడం వేస్ట్ ” బాధ తో కూడిన స్వరంతో చెప్పాడు వర్మ
“ఏంటినాయనా ఓ దేవదాసు మాదిరి ఫోజు పెడుతున్నావ్ ? నిజంగా అంతలవ్వుందా ఏమిటి?”అడిగాడు కిరణ్
“బాబూ ఇంక ఆటాపిక్ మారుస్తారా?”కోపంగా అన్నాడు వర్మ
“అంతలేదు బాబు కొంచం తగ్గు” ప్రసాద్
“ప్చ్ .. “చిన్న నిట్టుర్పు తో “ఇందాకే ఇంటికి ఫోను చేశా. ఇంట్లో వాళ్లు ఫీలవుతున్నారు ఇంకా జాబ్ రాలేదని” చిన్నగా చెప్పాడు కిరణ్
“బాధ పడుతుంది వాళ్లు కదరా! నీకా బాధలేదు గా?”
“అంతేరా, నాబాధ మీకేమర్ధమవుతుంది..”
“నిజమేరా, మేమందరం తెగ జాబులు చేసేస్తున్నాం నీకొక్కడికి జాబ్ లేక పోయె. బాధ నీక్కాక మాకుంటదా?” చమత్కరించాడు ప్రసాద్
“నువ్వు ఆస్ట్రేలియా పోతావా చెప్పు….జస్ట్ 2 లక్షలు వితిన్ సిక్స్ మంత్స్ లో ఆస్ట్రేలియా లో ఉంటావ్ ” నమ్మకంగా చెప్పాడు కిరణ్
“రెండు లక్షలు కట్టి ఆస్ట్రేలియా వెళ్ళాలా? లక్షా యాభై వేల తో న్యూజిలాండ్ పంపడానికి రెడీ గా ఉన్నారు బోలెడు మంది” ప్రసాద్
“ఇరవై ఐదు వేలకి స్టడీ వీసా తో జర్మనీ పంపిస్తానని నా ఫ్రెండొకడు రోజూ ఫోను చేస్తున్నాడు” మరలా కిరణ్ . “ఇప్పుడే రమేష్ గాడు ఫోను చేసాడు 1.2 లాక్స్ కడితే ఐర్లాండ్ డంపింగ్ అట ఫస్ట్ 10 వేలు కడితే ప్రోసెసింగ్ స్టార్ట్ చేస్తారట. ఒకవేల రిజెక్ట్ ఐతే 5 వేలు వాపస్ ఇస్తారంట. ఇక మీ ఇష్టం” ఈ విషయం ఇప్పుడే తెలిసిందో లేదో గాని పెద్ద బిల్డప్ ఇచ్చి చెప్పాడు కిరణ్
“అంతలేదు బాబు. లక్షా ఇరవై వేలు కట్టి అక్కడి కి పోయి జాబ్ వెతుక్కోవాలా? ఇక్కడ గత మూడు సంవత్సరాలు గా కష్టపడుతున్నా రానిది .. ” ఇంకా ఏదో చెప్పబోతుంటే వర్మ అడ్డు పడ్డాడు
“సుబ్బారావ్ గాడు మళ్లీ మలేషియా వెళ్లాడంట” అంటూ.
“ఎప్పుడూ?” ఆత్రంగా అడిగాడు ప్రసాద్
“నాకూ ఈ రోజే తెలిసింది. మొన్న మంగళవారం వెళ్లాడంట..” వర్మ
“వాడికింకా బుద్ధి రాలేదు రా ఓ సారి వెళ్ళి అన్ని ఇబ్బందులు పడి కూడా మళ్లీ అక్కడికే వెళ్లాడంటే నిజంగా వాడికి పిచ్చే” చెప్పాడు ప్రసాద్
“ఇంతకు ముందేమైంది రా?” అడిగాడు విషయం తెలియని కిరణ్
“ఓ అదో పెద్ద కత బాబు” అంటూ మొదలు పెట్టాడు వర్మ
“ఇది రెండు సంవత్సరాల క్రితం మాట. సాఫ్ట్ వేర్ కి మంచి డిమాండ్ ఉన్న రోజులు. సుబ్బారావ్ యం. సి. ఎ. ఐపోగానే అందరూ హైదరాబాద్ లో జాబులు వెతుక్కుంటుంటే తను మాత్రం అబ్రాడ్ జాబ్స్ గురించే ఆలోచించేవాడు. ఎవరో కన్సల్టెన్సీ వాళ్లు డెబ్భై ఐదు వేలిస్తే విజిటింగ్ వీసాతో సింగపూర్ పంపిస్తామనడం తో ఎగిరిగంతేసి డబ్బు కట్టాడు. నెలరోజుల విజిటింగ్ వీసా కాలం లో సింగపూర్ మలేషియాల్లో ఉండోచ్చు. కన్సల్టెంట్ కండిషన్ ఏమంటే వీసా వొచ్చిన రోజే విమానం ఎక్కాలి. అలాగే బయలుదేరాడు సుబ్బారావ్ .
వెళ్ళిన తరవాత ఓ పదిహేను రోజులు సింగపూర్లో ఉండి జాబ్ రావడం కొంచెం కష్టం గా ఉండడం తో మలేషియా వెళ్ళి మూడో రోజే జాబ్ లో చేరాడు. సుబ్బారావ్ తో పాటు మరో నలుగురున్నారు. అందరికీ ఉద్యోగాలు రావడంతో మలేషియాలో చిన్న ఫ్లాట్ లో ఉంటూ కాలం హాపీ గా గడుపుతున్నారు. సుబ్బారావ్ మిత్రుల్లో ఒకడు ఓ రోజు చెకింగ్ లో పట్టుబడ్డాడు. ఎందుకంటే వాళ్ళకిచ్చినవన్నీ దొంగ వీసాలు! ఎలాగోలా చావుతప్పి కన్ను లొట్టబోయి బయటపడ్డాడు. అప్పటినుంచి మొదలైనయ్ వీళ్ళ కష్టాలు. ఎక్కడికి పోవాలన్నా భయం. ఏమి చేయాలన్నా భయం. అదే టైం లో వీళ్లను తీసుకెళ్లిన కన్సల్టెంట్ కూడా పట్టు బడడం తో వీళ్ళ తో పాటు మరో 55 మంది ఇలాటివాళ్ళు ఉన్నారని తేలింది. ఇక వీళ్ల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకల టైపు. ఇంతలో సుబ్బారావ్ కి సింగపూర్ లో జాబ్ రావడంతో సింగపూర్ వర్క్ పర్మిట్ వొచ్చింది. అష్టకష్టాలు పడి దొంగదారిన సింగపూర్ చేరేటప్పటికి ఆ కంపెనీ మూసేశారని తెలిసింది. ఇక లాభం లేదని మెల్లగా ఇండియా చేరాడు. తరవాత డూప్లికేట్ పాసుపోర్ట్ తో లండన్ ప్రోసెసింగ్ అని ఓ లక్ష తగలెట్టాడు. అదీ మునిగిపొయ్యాక ఇక వాడూ చేతులెత్తాడు. సంవత్సరం నుంచి ఇక్కడ ట్రై చేసి ఇక లాభం లేదని ఇప్పుడు మళ్లీ మలేషియా వెళ్ళాడన్న మాట” సుబ్బారావ్ కథని వివరించాడు.
“ఏంది ఆ సుబ్బారావ్ వెనక ఇంత కతుందా? .. అవున్రా ఎవరో నీకు తెలిసినతను 25 వేలకి స్టడీ వీసా తో జర్మనీ పంపిస్తాడన్నావ్ కదా! అతనెక్కడుంటాడు?” అడిగాడు వర్మ
“ఇప్పుడైతే ఇంట్లో ఉంటాడు. ఇల్లు మాత్రం నాకు తెలియదు” చెప్పాడు కిరణ్
“జోకా?!” సీరియస్ ఫేసు పెట్టి అడిగాడు వర్మ
“అంతలేదు గాని రేపు నిన్నతనికి పరిచయం చేస్తాలే”
“అవునురా, మన రాంబాబు గాడు వాళ్ల మిసెస్ జాబ్ మాన్పించాడంట …” అప్పుడే గుర్తొచ్చినట్లు చెప్పాడు వర్మ
“నీకెవడు చెప్పాడు?”కిరణ్
“వాడే ఇందాక కనిపించాడు. వాడి వీసా రిజక్ట్ ఐందంట అందుకని ఇప్పుడు వాళ్ల మిసెస్ కి ప్రోసెసింగ్ మొదలెడుతున్నాడంట. ఫ్రెండ్ ఎవరో అక్కడ లేడీస్ కి ఉద్యోగం రావడం ఈజీ అన్నాడంట, అందుకోసం ఆమె చేత రిజైన్ చేయించాడంట”
“వాడికేం పోయే కాలం రా? జనమంతా ఉద్యోగాల్లేక చస్తుంటే హాయి గా పెళ్ళాం జాబ్ చేస్తుంటే తిని తిరగక ఇప్పుడామెతో కూడా రిజైన్ చేయిస్తే ఏమి తిందామని?”
“అమ్మాయిల కైతే ఈజీ గా వీసాలొస్తున్నాయని. ఇప్పుడు వీడు డిపెండెంట్ గా వెళ్ళాలట”
“ఆ .. సంవత్సరం నుంచి వాడి ప్రోసెసింగ్ అని తిరిగాడు. ఇప్పుడు మిసెస్ ప్రోసెసింగని తిరుగు తాడు. అదృష్టవంతుడు రాబాబు! మంచి జాబ్ చేసే అమ్మాయి దొరికితే హాయి గా పెళ్ళి చేసుకుంటే ఏబాధా లేకుండా బతికేయొచ్చు” సాలోచనగా చెప్పాడు ప్రసాద్
“ఆ .. సిగ్గులేకుండా పెళ్ళాం మీద ఆధార పడి బతకడానికి డిపెండెంట్ వీసా అనేది ముద్దు పేరు” అడ్డు తగులుతూ చెప్పాడు వినయ్
“ఆహా .. ఏమాలోచనరా ..? అమ్మాయిలంత పిచ్చోళ్లనుకుంటున్నావా నీకు జాబ్ లేకపోయినా నిన్ను చేసుకోవడానికి? వాడిదంటే ఏదో కాలేజిలో లవ్వు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎప్పుడో చీపురుకట్ట తిరగేసేది” చెప్పాడు వర్మ
“అంతేనంటావా?” ప్రసాద్
ఈ సంభాషణ నచ్చనట్టు మధ్య లో దూరాడు వినయ్..
“అవున్రా ఎవడో కన్సల్టెంట్ కి లక్షలు తగలబెట్టే బదులు మనమే ఓ కన్సల్టెన్సీ మొదలెడితే పోలా?” తనకొచ్చిన చచ్చు ఐడియా వెంటనే చెప్పాడు.
“పోకేం, అంతా పోద్ది. అందరూ బోర్డులు తిరగేస్తుంటే ఇప్పుడొచ్చిందండి వీడికి ఐడియా” ఫేసదోలా పెట్టి అన్నాడు కిరణ్
“ఏరా కిరణ్ ఈ వారం లో ఊరికెళ్తానన్నావ్ ఎప్పుడెళ్ల బోతున్నావ్ ?” అడిగాడు వర్మ
“అదే ఆలోచిస్తున్నాన్రా, వెళ్లాలా వొద్దాని”
“ప్రాబ్లం ఏందిరా?” బహుశా చార్జీకి లేక అడగడానికి ఫీలవుతున్నాడేమోనని అడిగాడు ప్రసాద్
“వెళ్లడానికి నాకేమి ప్రాబ్లం లేదురా. కాక పోతే ఊరులో వాళ్లే! నేను వెళ్లినప్పటినుంచి తిరిగొచ్చే వరకు వాళ్లకు నాదే హాట్ టాపిక్ ”
“నీదే కాదురా బాబు, నా పరిస్థితీ అంతే. లాస్ట్ టైం నేనూరెళ్లినప్పుడే డిసైడై పోయా జాబ్ వొచ్చేదాకా ఊరెళ్ల కూడదని” వినయ్ మాటలకడ్డుతగిలాడు వర్మ
“మంచి డెసిషన్ రా ఇంకీ జన్మలో నువ్వూరెళ్లే పనిలేదు”
“ఏడిచావులేగాని …”అంటూ మొదలెట్టాడు “నిజంగా ఊర్లో వాళ్లకి పనేమీ ఉండదేమోరా! ఎవరేం చేస్తే వాళ్లకెందుకు, కనపడ్డ ప్రతి ఒక్కడూ అడిగే వాడే ఏంచేస్తున్నావ్ అని. తెలిసికూడ కావాలని అడుగుతార్రా బాబు! బజార్లో కనిపించినప్పుడు నన్నడుగుతారు. తరవాత మళ్ళీ ఇంటికొచ్చి అదే విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పి ఎవరో జాబ్ చేసే వాణ్ణి ఎగ్జాంపుల్ గా చెప్పి నామీద జాలి చూపిస్తుంటే బాప్‌రే నిజంగా ఆ పరిస్థితి తలచుకుంటేనే భయమేస్తుంది రా. ఇంతకీ వాళ్ళకెందుకురా నేనేం చేస్తుంటే? వాడినేమైనా నేను పిల్లనివ్వమని అడిగానా చెప్పు ? ఊర్లో పనిలేని ప్రతి పోసుకోలోడికి మనదే రా టాపిక్ ”
“అది తల్చుకునే ఇంటికెళ్లాలా వొద్దాని ఆలోచిస్తున్నా”
“అరే! వాళ్లందరిని పోసుకోలోళ్లన్నావే, ఊర్నుంచి నెల నెల వచ్చే డి . డి లతోనే గత ఐదారేళ్లుగా కాలం గడుపుతున్న మనల్నేమనాలి?” కొంచెం సేపాలోచించి చురకవేశాడు ప్రసాద్
“ఆ .. నువ్వూ పెద్ద మాట్లాడేవాడివే లేరా, నువ్వొచ్చినప్పుడు మన రూమ్ ఓనర్ కూతురుకి సరిగ్గా మాటలే రాలేదని నువ్వే చెప్పావు. ఇప్పుడా పిల్ల పైటేసుకు తిరుగుతుంది. నీకు బొజ్జ పెరుగుతుంది గాని బుద్ధి పెరగడంలేదు రా”
“అరే ఇంతకీ ఈ పూట తిండి పరిస్థితేంది?” గడియారం వైపు చూస్తూ అడిగాడు ప్రసాద్ . అప్పటికి టైం రాత్రి 11 దాటింది.
“అవును కదా, ఈ రోజు చేయాల్సిందొకటి మిగిలి పోయింది” వర్మ
“రూంలో బియ్యం లేవు” చావు కబురు చల్లగా చెప్పాడు కిరణ్
“నిజమా? మరి ఉదయమే ఎందుకు చెప్పలేదురా?” ఈ రోజు పస్తు పడుకోవాల్సొస్తుందేమో అన్న బాధ వినయ్ ఫేసులో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
“ఇప్పటికైనా చెప్పాడు కదా ముందా పని చూడు” వర్మ
“రైసుకు డబ్బులివ్వండి, కొట్లుంటయ్యో లేదో” గొనుక్కుంటూ అడిగాడు వినయ్
“అవిలేకే ఎవడికి వాడు కాం గా కూర్చున్నారు” చెప్పాడు
కిరణ్ సెల్ ఫోను రింగవడం మొదలెట్టింది. కిరణ్ ఫోనందుకోబోతుంటే
“కడుపులో బెల్లు మోగుతున్నా జేబులో సెల్లు కేమితక్కువలేదు. తిండి కి పదిరూపాయల్లేవు గాని సెల్లుకావాల్సొచ్చింది రా వీడికి” వినయ్ అన్నమాట ఛెళ్లుమని తగిలింది కిరణ్ కి. సీరియస్ గా ఓ చూపు చూసి ఫోను తీసుకుని బయటకు నడిచాడు.
-----------------------------------------------------
రచన: కె . యస్ . వరప్రసాద్,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment