Saturday, September 14, 2019

మన వాళ్ళొట్టి వెధవాయిలేనా?


మన వాళ్ళొట్టి వెధవాయిలేనా?




సాహితీమిత్రులారా!

ఏమివాయ్‌ మై డియర్‌ షేక్స్పియర్‌! మళ్ళీ ముఖం వేలవేసినావ్‌?? సొర్గానికి పోయినా సవితి పోరు తప్పనట్టు అమరలోకం లాటి అమెరికాకి వచ్చినా ఒక టెలుగూస్‌ కీ మరో టెలుగూస్‌ కి మధ్యన ఐకమత్యం అనే పదార్థం మీ నాన్న బుర్రలో మోడరన్‌ థాట్స్‌ వున్న సైజులో కూడా లేదే అని గుక్క పట్టి దుఃఖిస్తున్నావా? నాన్సెన్స్‌!! డబ్బుల హోదా కులాల బాధా కన్న దేశంలో కన్నా యీ “ఉన్న” దేశంలోనే మిక్కుటవని ఖేదపడుతున్నావా? డబుల్‌ నాన్సెన్స్‌!! ఎవరో అన్నట్టు మనవాళ్ళొట్టి వెధవాయిలోయ్‌!!

ఎవరో కాదా ఆ మాటన్నది నేనేనా? చూశావా నాతో మాట్టాడ్డవే ఓ ఎడ్యుకేషన్‌ అంటే విన్నావు గావు. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అంటూ నా మాటలు వినక యీ అమెరికాకి వచ్చి తగలడ్డావ్‌.. మన అగ్రహారం చుట్టూ వున్న ఐదెకరాల ప్రపంచాన్నంతా ఆపోశనం బట్టిన యీ గిరీశం గారి వాదాన్ని కాదని ఆ (బారిస్టర్‌) పార్వతీశం స్టయిల్లో నానా తిప్పలూ పడ్డావ్‌.. మై డియర్‌ వెంకటేశం! ఇంత భగీరథప్రయత్నానికి గాను ఫలితంగా నీకు దక్కిందేవిషీ ఓ యూనివర్సిటీ పట్టా, ఓ పట్టాన యీ దేశాన్ని వదల్లేక అంటిపట్టుకు వేల్లాడే దురవస్థా తప్ప?

ఐనా అసలు తెలుగు వాళ్ళకి ఐకమత్యం అవసరం అన్న వాజెమ్మెవడో చెబితే వాడి జేజెమ్మ క్కూడా బేజారెత్తేలా ఒక్క ఘంట బిగిన ఏకధాటిగా లెక్చరిద్దును! దాంతో వాడు డంగై పోయి నాలిక్కటుకూ కటుకూ కరుచుకుని హన్నన్నా తొందరపడి పోయి మాటే గదా మన సొమ్మేం బోయిందని రెXంత మాటన్నానూ అని ఊళ్ళో వాళ్ళందరికీ మందువిందు యిచ్చి మరీ ప్రాయశ్చిత్తం చేసేసుకోడూ? కాకపోతే ఏవిటయ్యా ఐకమత్యంలో వున్న గొప్పతనం? తెలుగు వాడిని చూస్తే తెలీదూ నిజానికి ఐకమత్యం వల్ల వొచ్చేది గొప్పతనం కాదు గొప్ప పతనం అని! అసలూ, బృహన్నారదీయం పదహారో ఆశ్వాసంలో ఏమన్నాడూ “కాంపిటీషన్‌ ఈజ్‌ ద ఎస్సెన్స్‌ ఆఫ్‌ ప్రోగ్రెస్‌ ” అని కాదూ? అందుకే మనం ఊరుకో ఇరవై తెలుగు సంఘాలన్నా పెట్టి పోటీలు పడకపోతే చకచకా ప్రోగ్రెస్‌ సాధించటం మనవల్లయ్యే పనేనా?

మొన్ననో పొగరుమోతుబరి గారు మన ప్రొఫయిల్‌ ని దూరం నించే చూసి డంగై పోయి “గిరీశం గారూ ఎటూ యిందాకా వొచ్చారు మా యింటి దాకా వొచ్చి దాన్నీ మమ్మల్నీ పావనం చేసి పుణ్యం కట్టుకోండి” ఆవటాని కాళ్ళా వేళ్ళా బడితే కనికరంతో సరేనని వాళ్ళింటికి పార్టీకి వెళ్ళాం గుర్తుంది గదా! అక్కడ చూశావుగా మనవాళ్ళ “ఏకత్వంలోనే భిన్నత్వం” ఈస్ట్‌ మన్‌ కలర్‌ భారీప్రదర్శన? ఒహడు చెప్పింది ఇంకొహడు చచ్చినా ఒప్పుకోడు అది నిజంగానీ కాకపోనీ. అసలు ఒహడు చెప్పింది ఇంకొహడు వింటాడా అనా నీ ధర్మసందేహం?

మై డియర్‌ వెంకటేశం! నువ్వింత బ్రిలియంట్ల వెధవ్వి ఎప్పుడయ్యావోయ్‌ నాకు తెలీకుండా, నాకు తెలీకడుగుతాను? మరి నీలాటి ఉత్తమ(బ్బు) స్టూడెంట్‌ అడిగినా కూడా చెప్పకుండా వుండటం నా తరవా? ఇప్పుడూ, ఈ “వినటం” అన్నది చూశావూ ఇది బ్రహ్మపదార్థం లాంటిదోయ్‌ ఓ పట్టాన చేతికి చిక్కి చావదు. నేన్నీకు ఇప్పుడు చెబుతున్నదంతా నువు వింటున్నట్టు జోరుగా బుర్రూపేస్తున్నావు గదా మరి నేను చెప్పిందంతా అప్పజెప్పు చూస్తాను యీ లెక్చరు చదవకుండా! ఏవిటా వెర్రి చూపులూ నువ్వూను? ఇంతకాలంగా నీ చెవి కింద అమెరికన్‌ జోరీగ లాగా అమెరికాలోనే తెలుగు వాళ్ళ కధ రాయాలనుకునే వాడి బుర్రలో వెర్రిమొర్రి ఆలోచనల్లాగా తరతరాల తెలుగు వాడి వెధవాయిత్వంలాగా తెలుగు వాళ్ళ బుర్రల్లో పేరుకున్న కులగోత్రాల జిడ్డు మడ్డి లాగా ఎంతకీ కదలని యీ వాక్యం లాగా వదలకుండా పట్టుకుని వున్న నా మాటలే నువ్వు “విననప్పుడు” ఎక్కడో పుట్టి యిక్కడో పార్టీలో ఒక చెట్టు కింద మెట్టి నంత మాత్రాన తెలుగు వాళ్ళంతా చెట్టపట్టాలేసుకుని జట్టుకట్టాలంటం బేస్‌ బార్బేరియన్‌ థాట్‌ !!

చూశావా అలవాటు కొద్దీ అన్నం వొదిలేసి ఆవకాయ తిన్నట్టు అసలు విషయం వొదిలేసి అటేటో పోతున్నాం? అందుకే నాతో మాట్టాడ్డవే ఓ ఎడ్యుకేషన్‌ !

తెలుగు వాళ్ళ ఐకమత్యం గురించి గదూ మనం మాట్టాడుతుంటా! అసలు నువ్వు ఆశ పడుతున్నట్టు అంతా ఐకమత్యంగా వుండి పోయి ఒహడి నెత్తిన మరొహడు అస్తమానూ చెయ్యెయ్యకుండా “మనవంతా ఒకటే కుటుంబం” అని అదేదో బైస్కోపులో తెరపట్టని హీరో తాండవం జేస్తూ పాడినట్టు పాడుకుంటూ వుండిపోతే యీ లోకవంతా ఏవైపోను? కులగిరులు కూలిపోవటాలూ కులసతులు గ్రహగతులు తప్పించెయ్యటాలూ సప్తసముద్రాలు పొంగటాలూ స్టాక్‌ మార్కెట్లు కుంగటాలూ అప్పుడు మళ్ళీ ఆ “సంభవామి యుగేయుగే” అన్నాయన అర్జంటుగా పామ్మీంచి లేచి పనిగట్టుకు కొత్త వేషం వేసుకు రావటాలు పోట్లాటలు గట్రా సృష్టించి ధర్మాన్నుద్ధరించటాలు ఎందుకొచ్చిన సంత ఇదంతా? అంత కథా కమామీషు లేకుండా మనవంతా హాయిగా ఆనందంగా తిట్టుకుంటూ కొట్టుకుంటూ కులాల పేరుతోనూ శాఖల పేరుతోనూ “అస్తి నాస్తి” విచికిత్సల్తోనూ ఏదీ దొరక్కపోతే (యింటి)పేర్లు వేరయినందు వల్లనో కాకపోతే కాకపోయినందు వల్లనో అడ్డుగోడలు కట్టుకుంటూ రోజుల్ని నెట్టుకుంటూ వున్నామా యింకేవుందీ కోయిల్లు కూస్తాయి పువ్వులు పూస్తాయి కులవ్యవస్థ సుస్థిరంగా నిలుస్తుంది తరతరాల సంస్కృతి కాలరెత్తుకుని (మారు)మూలస్థంభంలా నిలబడుతుంది!

అసల్నన్నడిగే వాడు నువ్వుగాక ఎవడన్నా వుంటే వాడి తల మీదే ఢంకా బద్దలు కొట్టేసి చెబుదును ఐకమత్యం కావాలనే వాళ్ళందర్నీ కట్టగట్టి ఏ నయాగరాలోనో గిరాటేస్తే తప్ప యిక్కడి తెలుగు జాతికి విముక్తి లేదని. సరేగాని మై డియర్‌ వెంకటేశం! పొద్దున్నే పరగడుపున ఐకమత్యం లాంటి అగాయిత్తెం మాటల్తో నోరు చెడిపోయింది గాని ఆచమనానికి నీదగ్గరేమైనా అమృతంగాని వుందా?

(గురజాడ వారి అడుగు జాడల్లో గిరీశాన్ని పరుగులు తీయించిన ముళ్ళపూడి వారి దారిలో తప్పటడుగులు)
------------------------------------------------------
రచన: మాటల మల్లన్న, 
ఈమాట సౌజన్యంతో

Thursday, September 12, 2019

పూర్వజన్మ వాసన


పూర్వజన్మ వాసన




సాహితీమిత్రులారా!

అతను స్టీలు కుర్చీలో నిస్త్రాణగా వాలి కూర్చు నున్నాడు. ఆమె అతని కుర్చీకి కొంచెం ఏటవాలుగా మోడా మీద ఒద్దిగ్గా కూర్చు నుంది. స్కూల్లో మిగతా స్టాఫంతా ఇళ్ళకి వెళ్ళిపోయి చాలా సేపైంది. ఆమెకి ఎకౌన్‌టెన్సీలో డౌట్లున్నా యంటే స్కూలు పన్లు పూర్తయ్యాక పాఠం చెప్పటానికి కూర్చున్నాడు. టీచర్లందర్నీ పైకి చదవమని అతను ప్రోత్సహిస్తుంటాడు. చేతనైన సహాయమూ చేస్తుంటాడు. ఆర్థికంగానే కాక తనకొచ్చిన సబ్జెక్ట్‌లకి అప్పుడప్పుడూ పాఠం చెప్పటం కూడా. ఇదేం కొత్త కాదు.

రెండో లెక్క పూర్తి కావస్తుండగా కరంటు పోయింది. ఆ గదిలో కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. అతనికి పూర్తిగా అలవాటైన గదే తన శరీరం తెలిసినంత సన్నిహితంగా తెలుసతనికి ఆ గది. ఎక్కడ ఏముందో, ఏ సొరలో ఏం దాగుందో. అతను లేచి తడుముకోకుండానే అలమారు దగ్గరికి పోయి రెండో అరలో వున్న మొద్దుపాటి కొవ్వొత్తిని అందుకున్నాడు. చొక్కా జేబులోంచి సిగరెట్‌లైటర్‌తీశాడు. జుప్పనే నిట్టూర్పుతో వెలిగిందది, బొటనవేలి విరుపుతో. మంట నించి మంట “ఫ్రమ్‌ ద లైటర్‌ టు ద కేండిల్‌” మొద్దుపాటి కొవ్వొత్తి నుంచి సన్నపాటి వెలుగు. లైటర్‌ని జేబులో వేసుకుంటుంటే గోల్డ్‌ఫ్లేక్‌ పేకెట్‌ చేతికి తగిలింది. పన్నెండేళ్ళ విదేశీ వాసానికి గుర్తుగా ఈ అలవాటొకటీ ఇంకా మిగిలి పోయింది. “పూర్వ జన్మ వాసన”లని వాళ్ళ అమ్మ అంటుండేది. ఈ అలవాటు నిజంగా పూర్వ జన్మ వాసనే! అలవాటా, లేక అలవాటుకి బానిసత్వమా?

స్వదేశానికి తిరిగొచ్చి, ఎప్పుడో తెగి పోయాయనుకున్న వేళ్ళని తిరిగి ఈ భూమిలో పాతుకోడానికి చేసిన ప్రయత్నం తనకి పునర్జన్మే! ద్విజుడయ్యే ఆ మహా యజ్ఞంలో అతను తన చాలా అలవాట్లని సమిధలుగా ఆహుతిచ్చాడు వాళ్ళ తాతయ్య కాశీకి వెళ్ళి తనకి అత్యంత ప్రియమైన వంకాయని వొదులుకున్నట్టు వొదిలేశాడు. ఆ అలవాట్లన్నీ ” పుట్టినప్పుడు లేనివి ” ఎక్కణ్ణిం చొచ్చిన అలవాట్లు? ఆకలి పుట్టించిన అలవాట్లు. అప్పుడెప్పుడో ” రెండు జన్మల కిందట కాబోలు ” ఆ చిన్న పట్నంలో అమ్మ దగ్గర పెరుగుతున్నప్పుడు ” ఆవిడ “నీకు ఆక లెక్కువరా” అంటుండేది. ఆవిడ అన్నది క్షుద్బాధ గురించి మాత్రం కాదు ” ఇంకో ఆకలి, జఠరాగ్ని లాంటిదే ” కాకపోతే నిలువెల్లా దహించేస్తుంది. ఆ అగ్నిలో కాలి కాలి, సుత్తి దెబ్బలు తిని తిని, రాటు దేలాడు. పదునెక్కాడు. ఆకలి తీర్చుకునే సామర్య్ధం నేర్చుకున్నాడు. అవసరమైన దార్లు, అడ్డమైన వైనా సరే, తొక్క గల తెగింపు అలవరుచు కున్నాడు. అలవాటు చేసుకున్నాడు .. ఆకలి తీర్చే అలవాట్లు. ఒక్కొక్కటే, ఇటుక మీద ఇటుకలా పేర్చుకుంటూ ” మెట్టు పై మెట్టుగా” పైకి సాగుతున్న తన స్థాయికీ, హోదాకీ, స్మారక సౌధంగా నిర్మించు కున్నవి. మత్తెక్కించే మలయ మారుతంలాంటి సెంట్లు, మెత్తటి పట్టులా గొంతులోకి జారి కవ్వించే వైన్‌లు, నాలికని మురిపించి మరపించి గిలిగింతలు పెట్టే అంతర్జాతీయ క్యూయిసీన్‌లు, వొంటికి పూసినట్టు అమరిపోయే వూలెన్‌సూట్లు, పాదాలతోనే పుట్టి పెరిగాయా కర్ణుడి కవచంలా అనిపించే బూట్లు బహు జాగ్రత్తగా ఎంచెంచి ఏర్చి కూర్చి ఏర్పరచుకున్న అలవాట్లు తన సొఫిస్టికేషన్‌ని లోకానికి బాకాల్లా చాటింపు వేసే ప్రచార సాధనాలు! అన్నీ మాతృభూమికి మరలి వచ్చే మహాప్రస్థానంలో, ఝంఝామారుతంలో దూది పింజల్లా ఎగిరి పోయాయి. ఇదొక్ఖటీ మిగిలి పోయింది.

అతనికి ఒక సిగరెట్‌ కాల్చుకోవా లనిపించింది. కానీ ఆ పిల్లను ఒక్కదాన్నీ అక్కడ చీకట్లో వదిలి బయటికి వెళ్ళడం ” ఊహు. పోనీ, ఇక్కడే .. తన స్కూల్లో తానే విధించి అమలు పరుస్తున్న తన ఆజ్ఞని తానే ఉల్లంఘిస్తూ .. ఇక్కడే కాల్చేస్తే ” తనని అడ్డేదెవరు? ఎంత వెలిగించగానే నాల్గు పీల్పుల్లో .. బూడిదై పోతుంది. వేళ్ళు చకచకా పేకెట్‌ తెరిచి ఒక సిగరెట్‌ని బయటికి కూడా తీశాయి. ఎడం చేతిలో అడ్డంగా పట్టుకున్న పేకెట్‌ మీద కుడి చూపుడు, బొటన వేళ్ళ మధ్య సుతారంగా పట్టుకునున్న సిగరెట్‌ని ముచ్చటగా మూడు సార్లు తాటించి .. పూజకి ముందు సంకల్పం చెప్పుకున్నట్టు సిగరెట్‌ నొట్లో స్థాపించే ముందు అదొక రిచువల్‌ ఏదో సినిమాలో హంఫ్రీ బోగార్ట్‌స్టైల్లో .. ఆర్‌ వాజిట్‌క్లార్క్‌గేబుల్‌? డజన్‌ట్‌ మేటర్‌! సిగరెట్‌కాల్చడంతో పాటు ఈ రిచువల్‌కూడా జాగ్రత్తగా అలవరుచుకున్న అలవాటే కదూ, తన నాగరికతకి సూచనగా. టప్‌. టప్‌. టప్‌.. మూడు సార్లు ముచ్చటగా.

ఆగు! ఒక్క క్షణం ఆగు!! వ్హాటెబౌట్‌దట్‌గాల్‌ నీ బలహీనతని ఆ పిల్ల ముందు ఇలా .. తామందరి కంటే నువ్వెంతో అధికుడివని నిన్నొక అందలమ్మీద కెక్కించి ఆరాధించే నీ స్టాఫ్‌కి ప్రతినిధి ఐన ఆ అమ్మాయి ముందు “నువ్వు విధించిన నియమాన్ని నువ్వే అతిక్రమిస్తూ ” నీ బలహీనతని చూపించు కుంటావా? వొద్దు వొద్దు. ఆ మాత్రం నిగ్రహం వుంది. ఇట్‌ కెన్‌ వైట్‌ ” టిల్‌ ద లెసనీజ్‌ ఓవర్‌! తన జేబులో సిగరెట్‌ పేకెట్‌ని తన స్టాఫ్‌ చాలా సార్లే చూసి వుంటారు ” ఈ అమ్మాయీ చూసే వుంటుంది, అదేం రహస్యం కాదుగా. ఐనా ఎందుకో వాళ్ళ ముందు తన అలవాటుని .. తన బలహీనతని .. తన బలహీన అలవాటుని చూపించుకోవటం అతనికి ఎప్పుడూ మనస్కరించ లేదు. ఇప్పుడూ మనస్కరించ లేదు. పేకెట్‌తెరిచి సిగరెట్‌ని అందులోకి తోసేసి జేబులో వేసుకుని, కొవ్వొత్తి పట్టుకొచ్చి ఆమెకి దగ్గరగా బల్ల మీద పెట్టాడు. పెట్టి తన కుర్చీలో చతికిల బడ్డాడు.

“ఇంకేముంది? చెప్పింది అర్థ మైంది గదా! అలా ఆ లెక్క పూర్తి చెయ్యి. ఈలోగా కరంటు రాకపోతే ఇక ఇవ్వాళ్టికి ఇక్కడ ఆపుదాం,” అన్నాడు తన కోసమే చూస్తున్న ఆమెతో.

ఆమె వొళ్ళో పెట్టుకున్న నోట్‌బుక్‌మీదికి వంగి లెక్క పూర్తి చేస్తోంది. అతను తన కుర్చీకి చేరబడి, అనాలోచితంగా ఆమెవేపే చూస్తూ కూర్చున్నాడు.

తను స్కూలు టీచర్లకి విధించిన యూనిఫాం లో వుంది ఆమె. లేత గులాబి రంగులో సాధారణమైన వాయిల్‌చీర, అదే రంగు జాకెట్టు బోర్డరన్నా లేకుండా, నిరాడంబరతకి నిదర్శనంలా. పల్చటి ఒంటిపేట గొలు సొకటి మెడలో తెల్లగా మెరిసింది. వెండిదల్లే వుంది. వెండిదో సత్తుదో? వాళ్ళ బతుకులకి వెండే బంగారం! సన్నపాటి వొళ్ళు తీగలాగా వొంగి వుంది. పైట కప్పని కుడి భుజమ్మీద ఎముక పైకి పొడుచుకు రావటాన్ని చర్మం ఆపలేక పోతోంది, జాకెట్టు దాచనూ లేక పోతోంది. నిరంతరం కరువు దేవత తాండవమాడే పుణ్య భూమిలో పుట్టి ఆమె పాలనలో పెరిగిన వాళ్ళు. పెరిగే పిల్లలకి ” పోషకాహారం మాట దేవుడెరుగు కడుపునిండా ఏదో ఒక తిండి పెట్టడమే మహా ప్రళయం ఐన స్థితిలో ” ఉన్న కాస్తా రేపు తలకి కొరివి పెట్టాల్సిన మగ పురుష సన్తానానికి పెట్టుకోక, నేడో రేపో ఎవడో ఒక అయ్యని కట్టుకుని లేచిపోయే ఆడముండలకి పెట్ట గలదా ఏ తల్లైనా? పెట్టి మన గలదా? లింగ ధారులకి నైవేద్యం పెట్టుకోగా మిగిలిన కుండ గీకుడే గతి కూతుళ్ళకైనా, ఆ తల్లికైనా!

ఇదంతా మనసు కొచ్చి అతని రక్తం సలసలా మరిగి పోయింది. తను మాత్రం ఏం చేశాడు ? బళ్ళో ఏర్పాటు చేసిన మధ్యాన్నం భోజనం పిల్లలకే గాని టీచర్లకి లేదే! ఛ ఛ!! ఈ తప్పు వెంటనే సవరించాలి. ఈ పిల్లే కాదు, మిగతా టీచర్లూ ఇంచు మించు ఈ వయసు వాళ్ళే ” అందరూ ఇలాగే వుంటారు. ఈ విషయం తను ఇంతకు ముందెప్పుడూ గమనించ లేదేం ? పోన్లే ! ఇప్పుడైనా దృష్టి కొచ్చింది. ఈ పూటే ఇంటి కెళ్ళే ముందు ఈ విషయమై మెమో టైప్‌చేసేసి రేపణ్ణించే అమలు పరచాలి. ఈ నిర్ణయాని కొచ్చాక అతను కొంచెం స్థిమిత పడ్డాడు.

ఈ సారి కొంచెం ప్రసన్నంగా చూశాడు ఆమె వంక. ఆమె తల వంచుకునే దీక్షగా లెక్క పూర్తి చేసే ప్రయత్నంలో లీనమై వుంది. ఊగిస లాడుతున్న దీపం వెలుగు ఆమె మొహమ్మీద వెలుగు నీడల కెలైడోస్కోప్‌ఆడిస్తోంది.

జుట్టు కొంచెం రేగి వుంది, తల మీద వింత కిరీటంలా. నుదుటి మీదా, చెక్కిళ్ళ పైనా, దవడల దగ్గరా లేత చర్మం బిగదీసి బిగించి నట్టుంది. బుగ్గ మీద మీటితే కాకతీసిన డప్పు మోగినట్టు మోగుతుందేమో. నల్లటి వొళ్ళు నిగనిగ లాడి పోతోంది కనుకొలుకుల్లోనూ, బుగ్గల మీదా. మెడా భుజమూ కలిసే చోట కాయ కష్టం తీర్చి దిద్దిన కండరాలు మెలి తిరుగుతూ జాకెట్‌లోకి అదృశ్య మవుతున్నాయి. వయసు వొరవడి బక్కచిక్కిన తనంలోనూ చక్కదనాన్ని ప్రకటిస్తోంది. కొద్దిగా తలవాల్చుకున్న ఆమెని ఈ ఏంగిల్‌లో చూస్తుంటే .. చాలా పాత హిందీ సినిమాల్లో నిమ్మీలా .. ఆ మొహం, గువ్వ పిట్టలా .. సినిమాల్లోనా ? ఆ మొహం, పొందిగ్గా .. ఆర్యూ షూర్‌? లీలగా, కలలో లాగా ” కలల్లో రంగులు కనబడవట! బ్లాక్‌ అండ్‌ వైట్‌లో, ఇలాంటి సీన్లోనే, ఇదే ఫీలింగ్స్‌ తోటే .. బ్లాక్‌ అండ్‌ వైట్‌ సీన్లో గ్రే కలర్‌ ఫీలింగ్స్‌తో ” ఇదివర కెప్పుడో ” పూర్వ జన్మలోనేమో ” చూసిన, అనుభవించిన ఫీలింగ్‌ .. పునః పునః .. డీజా వు ?

అతను అధాట్టున లేచాడు. ఆ విసురుకి కూర్చునున్న స్టీలు కుర్చీ కీచుమంటూ మూలిగి రెండడుగులు వెనక్కి జారింది. ఆ చప్పుడుకి ఆమె వులిక్కి పడి తలెత్తి చూసింది. లేచిన విసురుతోనే అతను కుడి చేత్తో ఆమె ఎడమ జబ్బ పట్టుకుని పైకి గుంజాడు. ఆమె వొళ్ళో వున్న పుస్తకాలు అస్తవ్యస్తంగా నేలకి రాలిపోయాయి. రెండు బుజాలూ పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఎడమ చెయ్యి పెనవేసి ఆమె వంటిని తన వంటికి నొక్కేస్తుంటే కుడి చెయ్యి ఆమె మెడ వెనక జుట్టు పట్టుకుని తలని వెనక్కి వంచుతూ .. అతని తల ఆత్రంగా ఆమె మొహమ్మీదికి వాల్తున్నప్పుడు .. అతని గుండెలో అగ్ని పర్వతాల విస్ఫోటనాల చప్పుడు. ఆ నిప్పులు ఎగజిమ్మి అతని కళ్ళలోకి ఎర్రటి లావాగా ప్రవహిస్తుంటే .. విచలితమైన ఆమె మొహంలో ఆ కళ్ళు బెదరిన లేడిపిల్ల కళ్ళల్లే. ఆవు తల తగిలించుకుని ఇన్నాళ్ళూ తిరిగిన పెద్దపులి నిజస్వరూపాన్ని మొదటిసారిగా చూస్తున్న లేడి కళ్ళు ” నరమాంసపు రుచి మరిగిన పెద్దపులి ఆకలికి పదే పదే నైవేద్యమయ్యే మనిషి కళ్ళు యుగ యుగాలగా తర తరాలుగా దౌర్జన్యం దాడి చేసినప్పుడు అలవాటుగా ఆత్మార్పణ చేసుకోడం తప్ప ఎదురు తిరిగి పోరాడటం తెలియని ఒక ప్రాణి కళ్ళు .. ఆ కళ్ళల్లో తన ఆకళ్ళ నీడల్ని అతని కళ్ళు చూస్తూనే వున్నై, కానీ ఏమీ కనబళ్ళేదు.

అతని మొహం ఆమె మొహమ్మీదికి వొంగింది. ఉద్రేకంతో విచ్చుకుని వొణికి పోతున్న అతని ముక్కు పుటాలకి ఒక పల్చటి వాసన సోకింది. ఘ్రాణనాడి తీగల్లో ఒక అపస్వరం ” జ్ఞాపకాల పొరల్లో ఒక అలజడి మరుపు పడిందనుకున్న ఒకానొక వాసనని గుర్తుకి తెస్తూ. ఎప్పుడో .. చాలా కాలం క్రితం .. కిందటి జన్మలోనేమో .. ఇలాగే .. బ్లాక్‌ అండ్‌ వైట్‌ సీన్‌లో గ్రే కలర్‌ ఫీలింగ్స్‌తో .. ఇదే వాసన తన ముక్కు పుటాల్లో ఘాటుగా, తల దిమ్మెక్కించేస్తూ. ఆ దిమ్ముకి అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగి నిప్పు జీరలు చల్లారి పోయి ఆమె మొహం మొదటిసారిగా ఉన్న దున్నట్టుగా కనబడింది. అతని చేతులు నిర్జీవంగా వాడి వాలి పోయాయి. పెదవులు మాత్రం అస్పష్టంగా గొణుగుతున్నై .. అయామ్‌ సారీ .. అయామ్‌ సారీ .. ఆమె అతన్నొక సారి ఎగా దిగా చూసి దొర్లిపోయిన మోడాని లాక్కుని కూర్చుని పుస్తకాల్ని ఏరుకుని వొళ్ళో పెట్టుకుని లెక్క తెరిచింది, అతను గుచ్చి పట్టుకున్న చోట జబ్బని తడుముకుంటూ.

వుస్సురని తన స్టీలు కుర్చీలో కూలబడ్డాడు. అర చేతుల్లో మొహం దాచుకున్నాడు. ఎప్పుడో అంతరించిం దనుకున్న జన్మ తాలూకు ఆ వాసన .. ఆ వాసన్నీ, ఆ జ్ఞాపకాల్నీ ” ఆ జన్మనే” కప్పెట్టెయ్యటానికి చాలా శ్రమ పడ్డాడతను ఆ రోజుల్లో. మళ్ళీ ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి ఆ వాసన తగిలింది. ఆ జన్మ తలెత్తింది. కూడదు! వీల్లేదు!! ఆ జన్మ మళ్ళీ జీవం పోసుకోడానికి వీల్లేదు!!! ఆ రోజుల్లో ఆ జన్మనే కప్పెట్టేసేందుకు ఆ వాసన్ని బలవంతంగా మర్చిపోయాడు. ఈ రోజున ” అది పునర్జన్మించ కుండా వుండేందుకు ” ఈ వాసన్ని ఎప్పుడూ, ఎల్లప్పుడూ, ఈ జన్మాంతం గుర్తు పెట్టుకుంటాడు. ఆ నిశ్చయంతో స్థిమిత పడిన ముక్కు పుటాల్ని విప్పారించి లోతుగా గాలి పీల్చుకున్నాడు. ఆ పూర్వ జన్మ వాసన అతని అస్తిత్వ్తాన్నంతా నింపేసింది.

అదిక మరపు రాదు. ఆ పూర్వ జన్మకి మరుజన్మ లేదు.
---------------------------------------------------------
రచన: ఎస్‌. నారాయణస్వామి, 
ఈమాట సౌజన్యంతో

Monday, September 9, 2019

జీవితానందం ఎక్కడున్నది?


జీవితానందం ఎక్కడున్నది?





సాహితీమిత్రులారా!

జీవితానందం ఎక్కడున్నది? ఇప్పుడు ఈ రోజు ఈ క్షణం మాత్రం వీలయినంత లేనితనంలో ఉందనిపిస్తుంది. ప్రతి పుస్తకం, ప్రతి కలం అతి బరువుగా తోస్తుంది. మరి పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, కాగితాలు అనే మాటలు బహువచనాలుగా ఇంకా ఇంకా బెంబేలెత్తిస్తున్నాయి. ఒకప్పటి నా కల మహా అయితే రెండు జతల బట్టలు ఒక లుంగీ. నిజానికి ఒక చొక్కా లుంగీ మీదే జీవితాన్ని లాగించేయవచ్చు. ఇవాళ బీరువా నిండా దరిద్రం నింపుకున్నంతగా జతలు జతలు నింపుకున్నానెందుకో? ఎందువెనుక పరిగెత్తుకుంటూ పడి ఇన్నిన్ని పుస్తకాల చెత్త కొన్నానో నాకు అర్థం అవ్వడంలేదు. గంటల తరబడి నెట్‌కు అతుక్కుపోయి ఎక్కడెక్కడి పుస్తకాల కోసం ఎక్కడెక్కడికి పరిగెత్తి కొన్నానో! ఎంతెంత డబ్బు అప్పులు చేసి కొన్నానో! చిన్న బొమ్మ నచ్చి, పుస్తకం కవర్ నచ్చి, పేజీలు రెపరెపలాడిస్తే సూటిగా తగిలిన వాక్యం నచ్చి… కట్టలుకట్టలుగా కొన్న పుస్తకాలు, బుర్రకంతా ఎక్కించుకున్న ఎంగిలి తెలివితేటల్ని దేవి దేవి కక్కెయ్యబుద్ధిగా ఉన్నది. కట్ట కట్టి అవే పుస్తకాలను ఇప్పుడు ఎక్కడికయినా కంటికి కానరానంత దూరం పంపించేద్దామని, కాకపోతే కొరివి పెట్టి నిప్పులో రగిలెయ్య కోరుతుంది మనసు. అపుడు ఒక దాని కోసం ఆరాటపడ్డం దేనికని? అది దొరికాక ఇపుడు దాన్ని వదిలించుకుందామని ఏవిటీ? ‘లేనిది కోరేవు ఉన్నది వదిలేవు, ఎందుకు వలచేవొ ఎందుకు వగచేవొ ఎందుకు రగిలేవొ ఏమై మిగిలేవో’ అని ఈ ఇంత మాయ ఎప్పుడూ ఎందుకు కమ్మేసుకుంటుంది?

వీలయినంత ఖాళీగా ఉంటే ఎంత బావుంటుంది. ఇల్లు కాని, వళ్ళు కాని, మనసు కానీ… నేను ప్రతిసారీ కొత్తగా ఉంటే ఎంత బావుంటుంది? తెలిసిన ప్రతి ఒక్కరిని తెలీక కొత్తగా చూస్తుంటే ఎంత బావుంటుంది? అసలు ఎవరినీ చూడక తలదించుకుని రస్తా కొలుచుకుంటూ అలా వెళ్ళవలసిన చోటికి ఖాళీగా వెళ్ళిపోయి ఖాళీగా మరలి తిరిగి మధ్యలో తప్పనిసరిగా ఎవరైనా పలకరిస్తే, పలకరించిన ప్రతి మనిషిని ప్రతిసారి కొత్త ఏంజల్‌ని అప్పుడే కలిసినట్లు! మిమ్మలనే ఇంతకాలంగా వెతుకుతూ వస్తున్నా! ఎక్కడున్నారు ఇన్నాళ్ళు? అని చూపులతో ప్రతిసారి ప్రతి పాతమనిషిని కొత్తగా పరిచయం చేసుకుని మరిచిపోయి మళ్ళీ పరిచయం చేసుకుని మళ్ళీ మరిచిపోయి మళ్ళీ ఖాళీగా అచ్చం అప్పుడే పుట్టిన కొత్త శిశువులా…

జీవితానందం ఎక్కడున్నది? ఎప్పుడూ ఏ క్షణం అయినా బొమ్మల్లో ఉందనిపిస్తుంది. ఎంత బావుంటుంది బొమ్మ తాలుకు శ్రమ! తొందర తొందర అస్సలు బావోదు. తొందర రతికి మల్లే. గీసిన గీతలపై మరో గీత తాకీ తాకనంత సుతారంగా పరుచుకుంటూ. బొమ్మని తనలా పదే పదే చూసుకుంటూ, రంగుపై మరో రంగు మచ్చ అద్ది దాని రిఫ్లెక్షన్ కంటిపాపలో నింపుకుని తెగ ఆనందపడిపోయి. బొమ్మ పూర్తయ్యాకా ఎంత మహాశాంతిగా ఉంటుందో! ఇక చాలు ఇప్పటికిప్పుడు చచ్చిపోయి మళ్ళీ మరో బొమ్మ గీయడానికి లేవకుండా ప్రశాంతపు నిద్ర. ఎంత బావుంటుంది కదా! అలా లేదనుకో ఏమవుతుంది? బొమ్మలపై బొమ్మలుగా రచన సాగుతూనే ఉంటుంది. ఎవరో రావాలని, నన్నూ నా బొమ్మలనూ చూడాలని, ఆపై నన్నూ బొమ్మలనూ తన చెరో భుజానికి హత్తుకోవాలని ఉంటుంది. ‘మళ్ళీ బొమ్మ ఎపుడు గీస్తావు? నీ బొమ్మ చూడ్డం కోసం కాదు, నిన్ను హత్తుకోడానికైనా నాకో కారణం కావా’లని ఎవరైనా పిచ్చ ప్రేమగా అడగాలని ఉంటుంది. ఎంత కాలం అద్దం నాతో ఈ మాట అంటుంది? వట్టి గాజు తళకు లోకమా ప్రపంచంలో రక్త మాంసమంతా ఏవయ్యింది? ప్రతిసారి ఇంతేనా? సరేలే! ఇట్స్ ఒకే! ఐ విల్ లవ్ మి ఎనఫ్ ఫర్ ది బోత్ ఆఫ్ అజ్. అని చెప్పుకుంటూ అలానే ఉండి పోవాలా? ఇట్స్ నాట్ ఓకేబ్బా!

ఒకసారి మదరాసులో బాపుగారి ఇంట్లో ఆయన కలిసీ కలవగానే కొత్త బొమ్మలు ఏఁవేశారు? ఏవి చూపించండి? అని అడిగారు. అవి చూసి మురిసి ‘ఓయ్ వెంకట్రావ్ ఇలా రావయ్యా అన్వర్ బొమ్మలు చూడు ఎంత బావున్నాయో!’ అని ఆయనకు చూపించి ఆపై ‘ఏవండి, ఈ దగ్గరే మా గురువుగారు గోపులుగారి ఇల్లు. ఆయన్ని వెళ్ళి కలవండి ఈ బొమ్మలు చూపించండి చాలా సంతోషపడతా’రని అన్నారు. నాకు బాగా గుర్తున్నది, అది నాకు జ్ణానోదయం కలిగిన క్షణం. ఏవిటి ఈ చూపించడాలు? వారు మెచ్చుకోడాలు! ఆపై ఏం జరుగుతుంది? ఫలానా వారు మెచ్చుకున్న చిత్రకారుడిగా ఒక మూర్ఛబిళ్ళ ధరించి ఊరేగడం. ఛీ! నా మీద నాకు ఎంత అసహ్యం కలిగిందో, ఈ అడుక్కుతిని తిరిగే బ్రతుక్కు విముక్తి లేదా? ఏం పొందుదామని నా బొమ్మని ఇంటింటికీ మనిషి మనిషి దగ్గరకీ కోతిలా తిప్పి చూపించి? కుంచెని గారడీకర్రలా ధరించి విన్యాసాల పిల్లిమొగ్గలు వేయిస్తే? థూ! ఏం అసహ్యం ఈ జన్మ! ఎంత కంపరంగా అనిపించిందో ఆ వేళ నుండి నాపై నాకు. నా మట్టుకు నాకు ఎంత బావుంటుంది బొమ్మలు చూడ్డం! ఎంత బావుంటుంది వెండ్లిగ్ బొమ్మలు చూడ్డం. టొప్పి బొమ్మలు చూడ్డం, బట్టాగ్లియా బొమ్మలు చూడ్డం, విక్టర్ ఆంబ్రూస్ బొమ్మలు చూడ్డం, మనెల్లి బొమ్మలు చూడ్డం, బ్రయన్ హేడల్ బొమ్మలు, ఆస్టిన్ బ్రిగ్స్ బొమ్మలు, పింటర్ బొమ్మలు, తోమర్ హనుకా బొమ్మలు, జాన్ క్యూనో బొమ్మలు, నా ఈ వందలాది ప్రియతముల బొమ్మలు చూడ్డం, మళ్ళీ మళ్ళీ పదే పదే చూడ్డం, ఆ మంత్రజాలంలో మునకలెయ్యడం. మైమరచిపోడం… అలా నాకులాగే విపరీతంగా బొమ్మల్ని ప్రేమించే వారెవరైనా నేనెవరో తెలీక నా బొమ్మ తెలిసి లేదా నేనూ నా బొమ్మ తెలిసీ నన్ను మరింత ప్రేమించి నా పనిని ముద్దించి మురిపం చూపి నా కోసం నా బొమ్మ కోసం ద్వారం దగ్గర నిల్చి వెళ్ళబోతూ ‘మళ్ళీ బొమ్మ ఎపుడు గీస్తావు? నీ బొమ్మ చూడ్డం కోసం కాదు, నిన్ను హత్తుకోడానికి రావాలి కదా మళ్ళీ మళ్ళీ’ అనే ఒక అద్దం కాని కోసం…

జీవితానందం ఎక్కడున్నదో తెలుసా? అంతటిని వదలడంలో ఉన్నది, దేనిని పోందకపోవడంలో ఉన్నది. అందడం పొందడం అనే స్పృహ అసలు లేకపోవడంలో ఉన్నది. దేని లెక్కలోను లేకపోవడంలో ఉన్నది. చూసిందంతా ఒక కలలా దిగ్గున మళ్ళీ మళ్ళీ లేచి కూచోడంలో ఉన్నది. పొందడం ఏనాడూ ఆనందం కాదు. అది ఏనాటికయినా వెళ్ళిపోయేదేననే కొత్త ఆలోచన ఇచ్చే భయం. ఖోనేవాలేహీ పానేవాలే హోతేహై సూత్రాన్ని కూడా కాదని దేనిని ఎవరిని ఆశించకపోవడంలో ఉన్నది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఒక ఊహ ఉదయిస్తుంది. ప్రతి ఉదయం ఆ ఊహ తను ఒక పిట్ట రూపు ధరించి నా మంచం కోడుపై వాలి ఇలా పాడుతుంది: టుడేస్ సాడ్‌నెస్ హాజ్ బీన్ కాన్సల్‌డ్!
-------------------------------------------------
రచన: అన్వర్, 
ఈమాట సౌజన్యంతో

Saturday, September 7, 2019

ఇండియన్‌ వేల్యూస్‌


ఇండియన్‌ వేల్యూస్‌



సాహితీమిత్రులారా!

ఆ మధ్యాన్నమంతా దట్టంగా పేరుకున్న టెన్షన్‌ ఒక్ఖసారిగా బద్దలైనట్టు వేసవి కాలపు థండర్‌ స్టార్మ్‌ నగరం మీద విరుచుకు పడిపోయింది. వాసంతి దాన్ని లక్ష్యపెట్టకుండా బ్రాడ్వే వెంబడి నడుస్తోంది.

“ఇండియన్‌ వేల్యూసంటే ఏవిటే నీరూ, నీ వుద్దేశంలో?” అనడిగింది వాసంతి.

నీరూ అనబడే నీరజ టీపాట్‌ లోనించి గ్రీన్‌టీని నిదానంగా తన కప్పులోకి వొంచుకుని అప్పుడు తలెత్తింది. స్నేహితురాల్ని పరిశీలనగా చూసి, “నీ వాలకం చూస్తుంటే నీ ప్రశ్న వెనక ఏదో పెద్ద కథే వున్నట్టుంది. ముందు ఆ కథ చెప్పు,” ఆదేశించింది నీరజ.

“కథే ననుకో. మా అమ్మా నాన్నా పెళ్ళి గురించి చేస్తున్న గోల తెలుసుగా. మొన్న క్రిస్మస్‌ బ్రేక్‌కి ఇంటికెళ్ళి నప్పుడు అన్నారు, మేట్రిమోనియల్‌ ఏడ్‌ వేస్తామని. పోయేదేముందిలే అని సరేనన్నా. వేశారు, ఇండియా ఎబ్రాడ్‌లోనూ, వాటిల్లో ..”

“వెయిటె మినిట్‌. ఏడ్‌ నువ్వు రాశావా, వాళ్ళు రాశారా?”

“వాళ్ళే రాశారు. ఎనీవే, దాని ద్వారా ఒక సంబంధం వచ్చింది. అతను న్యూయార్కులోనే కొలంబియాలో కార్డియాలజీ ఫెలోషిప్‌ చేస్తున్నాడు. అతని పేరెంట్స్‌ ఫిల్లీలో వుంటారు. వాళ్ళు ఏడ్‌ చూసి మా పేరెంట్స్‌తో మాట్లాడారు .. ”

“మీ వాళ్ళు నీ నెంబరూ అదీ ఇస్తే, వాళ్ళది వాళ్ళబ్బాయికిస్తే, అతను నిన్ను పిలిస్తే .. ”

నీరజ కథని ఫాస్ట్‌ ఫార్వర్డ్‌ చెయ్యబోయింది.

“ఏబ్బే, అలా జరిగితే అసలు కథేముందీ!” అని సస్పెన్స్‌ పెంచడానికా అన్నట్టు ఆగింది వాసంతి. జరిగిన సంఘటనలు గుర్తొచ్చి వాసంతి పెదాలమీద చిలిపి చిర్నవ్వు చిగురించింది.

“మరేమైంది, తొందరగా చెప్పూ, చంపక, ” హడావుడి పడిపోయింది నీరూ.

“ముందు అతని పేరెంట్సే వచ్చారు నాతో డేట్‌కి!” వాసంతి నీరజ మొహమ్మీద పరుచుకుంటున్న విభ్రాంతిని చూసి, ఆపుకోలేక పైకే నవ్వేసింది. నీరజ మాత్రం సీరియస్‌గా, “ఏయ్‌ వాస్‌ యువార్‌ కిడింగ్‌ మీ, రైట్‌?” అంది, అనుమానంగా చూస్తూ.

“నో! ఐ స్వేర్‌!!” కుడి చెయ్యి నెత్తిన పెట్టుకుని ప్రమాణం చేసింది వాసంతి.

“వాళ్ళు ఫిల్లీ నుంచల్లా వొచ్చారు నన్ను చూసేందుకు. మొదట మా అమ్మా నాన్నా నాకీ మాట చెప్పినప్పుడు నేనూ నిర్ఘాంత పోయా. కానీ కొంచెం ఆలోచిస్తే .. ఇది బాగానే వుందనిపించింది. సరేనన్నా. సరే ఏవిటి, వాళ్ళని ఇమ్ప్రెస్‌ చేసి పారెయ్యటానికి ప్రెపేర్‌ కూడా అయ్యాను. ”

“హు, ఇంత బతుకూ బతికి .. చివరికిలా తయారయ్యావా! ఎమ్బీఏ చదివావ్‌ వాల్‌ స్ట్రీట్‌లో పెద్ద వుద్యోగం వెలగబెడుతున్నావ్‌.. నీకు కావల్సిన వాణ్ణి నువ్వు సెలెక్ట్‌ చేసుకోకుండా .. ఇలా పేరమ్మల్నీ తాయారమ్మల్నీ ఇమ్ప్రెస్‌ చేసేందుకు తంటాలు పడుతూ .. ”

“హే, హేయ్‌ ఒక్క క్షణం అక్కడే ఆగు. మొగుణ్ణి వెతుక్కోడానికి మిగతా పద్ధతులు మాత్రం ఇంతకంటే గొప్పగా వుండి ఏడిచినయ్యా? ఎంత సేపూ సింగిల్స్‌ బార్లూ, నైట్‌ క్లబ్బులూ పట్టుకు తిరగడం, నిద్దర దండగ, డబ్బులు దండగ. ఇంతా తిప్పలు పడీ నీకు నచ్చిన వాడెవడన్నా దొరుకుతాడని గారంటీ లేదు. తీరా దొరికినా .. వాడెట్లాంటి వాడో, వాడి హిస్టరీ ఏవిటో, వాడి క్లోసెట్‌లో ఎన్ని కంకాళాలున్నయ్యోనని హడిలి చావటం .. ”

“వోకే, వోకే. పాత చింతకాయ పచ్చడమ్మ గారూ, వొప్పుకున్నాం. నువ్వు మీ కాబోయే అత్తగార్ని ఇమ్ప్రెస్‌ చేసి పారేశావ్‌ తరవాత ? ”

“తరవాత, ఏముందీ, హీరోనే ఫోన్‌ చేశాడు. రెండు సార్లు డిన్నర్‌కి కలుసుకున్నాం. ”

“హమ్మయ్య, కథ మొదలైన అరగంటకి దయ చేశారు హీరో గారు. ఇంతకీ నీ హీరోకి పేరన్నా వుందా ? చూడ్డానికి ఎలా వున్నాడు? ”

“పేరు కృష్ణకుమార్‌. ఎలా ఉన్నాడంటావా? బానే వున్నాడు. నాటె గ్రేట్‌ లుకర్‌, బట్‌ .. లుక్స్‌ ఫిట్‌ అండ్‌ స్మార్ట్‌. ”

“వోకే, లుక్స్‌ బి ప్లస్‌. మరి డ్రెస్‌ ? ”

“నీ ఆలోచన ఎటు పోతోందో నాకు తెలుసు. కాసేపుండి, అతని సాక్సు పేంటుకి మేచ్‌ అయ్యాయా, ఇంకోటి ఇంకో దేనికో మేచ్‌ఐందా అని మొదలెడతావు. కట్‌ ఇటౌట్‌! స్మార్ట్‌గా ఉన్నాడన్నానా?”

“వోకే, వోకే. జీస్‌, నువ్వతన్ని వెనకేసుకు రావడం చూస్తే నీకు బాగానే నచ్చాడల్లే వుంది. అసలు అది చెప్పు .. నచ్చాడా ?”

“మ్‌మ్‌.. రెండు సార్లు కలవడంతోనే నచ్చాడో లేదో ఎలా చెప్పడం? ”

“అమ్మయ్య. పరవాలేదు, నిన్నింకా రక్షించొచ్చు ! ”

“ఐనా మొదటి చూపులకి నచ్చాడనే అనుకో ! ”

“మరింక ఏవిటి ప్రాబ్లం? ప్రొసీడైపో ! ”

“అదే అదే .. అక్కడే వచ్చింది ఈ ఇండియన్‌ వేల్యూస్‌ క్వశ్చెన్‌.”

“ఇండియన్‌ వేల్యూస్‌ ? వాట్‌ ఇండియన్‌ వేల్యూస్‌ ” ఆమాట మొదటి సారి వింటున్నట్టు అయోమయంగా మొహం పెట్టింది నీరజ.

మన్‌హాటన్‌లో పేరున్న రెస్టరాంట్‌ ఆ రాత్రి కూడా విపరీతమైన రద్దీ. ఐనా వాళ్ళ టేబుల్‌ రెడీగా వుంది. ముందే రిజర్వ్‌ చేసివుంచాలన్న కృష్ణకుమార్‌ ముందు చూపుని మనసులోనే అభినందించింది వాసంతి. షి హాడ్‌సీన్‌ మచ్‌వర్స్‌! వెయిటర్‌ డ్రింక్స్‌ ఆర్డర్‌ తీసుకోడానికి వచ్చినప్పుడు అతను ఐస్‌డ్‌ టీ కోసం అడిగాడు, ఆమె ఫ్రెష్‌ లెమనేడ్‌ ఆర్డరిచ్చింది.

మొదలైనయ్యి పరిచయాల కబుర్లు ఇంక .. భోజనం కోసం ఎదురు చూస్తూ, భోజనం చేస్తూ, భోజన మయ్యాకా ఒకరి అభిప్రాయాల నొకరు, ఒకరి అభిలాషల నొకరు, ఒకరి నొకరు మాటల ద్వారా చెప్పుకుంటూ, వింటూ, విన్నదాంట్లో ఇంపార్టెంట్‌అనుకున్నవి తరవాత తీరిగ్గా నెమరు వేసుకోవడానికి మెమొరీ ఫోల్డర్లో ఎప్పటి కప్పుడు నీట్‌గా ఫైల్‌ చేసేస్తూ. అవును మరి, ఇదేగా మొదటి సారి కలుసుకోవడం. హడావుడి ఏమీ లేదు. ముందు పరిచయాలు పెరగాలి, నెమ్మదిగా ఒకరి నొకరు తెలుసుకోవాలి, నింపాదిగా ఒకరి నొకరు అర్థం చేసుకోవాలి, ఆ అర్థమైనదేదో ఇద్దరికీ నచ్చాలి, ఆ తర్వాత … ఆ తరవాత సంగతి ఇప్పుడే ఎందుగ్గానీ, ఇక్కడ ప్రస్తుతంలో .. కృష్ణ ఏదో అంటున్నాడు.

” .. అలా హైస్కూలు ప్తూౖరెంది. వెల్‌ నాకు మొదణ్ణించీ మెడిసిన్‌ చెయ్యాలనే. డాడీకి మాత్రం నన్నో పెద్ద బిజినెస్‌ మేన్‌గా చూడాలని కోరిక. ముందు ప్రీమెడ్‌ చెయ్యి, తరవాత చూద్దాం అన్నారు. హి థాట్‌ హి కుడ్‌స్టిల్‌ కన్‌విన్‌స్‌మీ .. అదేం కుదర్దని చెప్పేసి, నేను రట్జర్స్‌లో ఆరేళ్ళ మెడికల్‌ ప్రోగ్రాంలో చేరిపోయాను. హి వాజ్‌ ప్రెట్టీ హార్ట్‌ బ్రోకెన్‌. ..” అని చిన్నగా నవ్వాడు. వాసంతి అసక్తితో వింటూ అర్థమైనట్టు బదులు నవ్వింది. అతను కంటిన్యూ చేశాడు.

“వెల్‌, దెన్‌, షికాగోలో ఇన్‌టర్న్‌రెండేళ్ళు. దానికి మా అమ్మ చాలా గోల పెట్టింది, అంత దూరం పోతున్నానని. బట్‌ ఇట్‌ వాజ్‌ ఏనెక్సలెంట్‌ ఆపర్చ్యూనిటీ. సో ఐ టోల్డ్‌ హర్‌, నువ్వూ డాడీ ఇండియా నుంచి ఇంత దూరం వచ్చారు గదా, నేను జస్ట్‌ షికాగో వెళ్తే ఏం దూరం అని. షి వోన్‌ట్‌ ఎగ్రీ, బట్‌ ఐ వెన్‌ట్‌ ఎనీవే. ఇప్పుడు, ఇక్కడ న్యూయార్క్‌లో రెండేళ్ళుగా ఉన్నానని, షి ఈజ్‌ హాపీ ఫర్‌ నౌ.” అదీ నా కథ, ఇక నీ కథ చెప్పు అన్నట్టు అతను ఆగాడు.

వాసంతి తన వంతు కథ చెప్పింది.

“నేను కేలిఫోర్నియాలో పెరిగాను, నీకు తెలిసే వుంటుంది. కానీ, నా కాలేజ్‌ చదువంతా ఈస్ట్‌ కోస్ట్‌లోనే గడిచింది. ముందు కార్నెల్లో ఇంజనీరింగ్‌. కొన్నాళ్ళు న్యూజెర్సీలో పని చేశాక అది బోరు కొట్టింది. ఐ వాజ్‌ లుకింగ్‌ ఫరె గుడ్‌ ఛాలెంజ్‌. అందుకని జాబ్‌ వొదిలేసి, ఎంబీఏ చేద్దా మనుకున్నాను. కంప్లీటెడ్‌ దట్‌ ఫ్రమ్‌వ్హార్టన్‌ అ కపులాఫ్‌ యియర్స్‌ ఎగో ..”

“వెల్‌, నువ్వు వ్హార్టన్‌ ఎంబీఏ వా? మై డాడ్‌ మస్ట్‌ హావ్‌ బీన్‌ ప్రెటీ థ్రిల్డ్‌, మీటింగ్‌ యు!”

వాసంతికి ఆ రోజు గుర్తొచ్చి సన్నగా నవ్వి బదులిచ్చింది.

“ఐ థింక్‌ హి వాజ్‌. మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం, బిజినెస్‌, ఆర్స్ట్‌.. యువర్‌ మామ్‌ టూ. షి సీమ్‌డ్‌ టు నో ఎవ్రీ వన్‌ .. ఐ మీన్‌ ఫిల్లీ ఏరియాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ తెలుసునల్లే వుంది.”
“వెల్‌ వాళ్ళు అక్కడ తెలుగు ఎసోసియేషన్లో చాలా ఏక్టివ్‌లే. మా అమ్మ చెయ్యి పడకుండా అక్కడ తెలుగు ప్రోగ్రామేదీ జరగదు. నువ్వెప్పుడన్నా ఆ ఎసోసియేషన్‌కి వెళ్ళుంటే ..”

“ఎక్కడా, నా ప్రోగ్రామే చాలా బిజీగా వుండేది. ఏదన్నా కొంచెం ఖాళీ దొరికితే .. వీలైనప్పుడు, శ్ర్తి వాళ్ళు జరిపే కచ్చేరిలకి మాత్రం వెళ్ళేదాన్ని. ఓ రియల్లీ? వెల్‌ నేను అటువంటి ప్రోగ్రామ్‌స్‌ .. ఊహూ. ఐ సే, గివ్‌మీ బాస్కెట్‌బాల్‌ ఎనీ టైమ్‌. నీకెలా దీంట్లో ఇంట్రెస్ట్‌?”

“మా నానమ్మ మూలంగానేమో, చాలా ఫ్రీక్వెంట్‌గా ఇండియా వెళ్ళేవాళ్ళం నా చిన్నప్పుడు. ఆవిడ నన్ను దగ్గర కూర్చో పెట్టుకుని ఎన్నో చెబుతూ చూపిస్తూ వుండేది. ఆవిడ దగ్గరే మొదట అలవాటాఇండి, మ్యూజిక్‌లోనూ, మైథాలజీలోనూ ఇంట్రెస్ట్‌. కొన్నాళ్ళు బాగా శ్రద్ధగా నేర్చుకున్నా. తరవాత స్కూల్‌ స్టడీస్‌, కెరీర్‌ .. ఇవన్నీ చుట్టుముట్టేసి దేర్‌ వాజ్‌ లిటిల్‌ టైమ్‌ ఫర్‌ ఎనీథింగ్‌ ఎల్స్‌!”

“ఈవెన్‌ ఫర్‌ డేటింగ్‌?” కేజువల్‌గా అడిగాడు కృష్ణ.

“ఏక్చువల్లీ, దట్‌ టూ. దానికి తోడు మా అమ్మ .. హై స్కూల్లోనూ, కాలేజ్‌లోనూ డేటింగ్‌ చెయ్యొద్దూ, మొగ పిల్లలకి దూరంగా వుండూ అని ఒకటే లెక్చర్లు. అఫ్‌ కోర్స్‌, ఐ హేడ్‌ నో టైమ్‌ నార్‌ద ఇన్‌క్లినేషన్‌.” నవ్వేసింది వాసంతి.

“వెల్‌, ఈ దేశంలో వున్నా, చక్కటి ఇండియన్‌వేల్యూస్‌తో నిన్ను పెంచిన నీ తల్లిదండ్రులని నిజంగా అభినందించాలి!” మెచ్చుకోలుగా అన్నాడు కృష్ణ.

వాసంతికి ఇదేదో కాంప్లిమెంట్‌ లాగానే వుందనిపించి, “థాంక్స్‌” అంది కొద్దిగా ఆస్చర్య పడుతూనే. ప్రశ్నని అతని వేపు మళ్ళిస్తూ, “మరి నీ సంగతేమిటి? డేటింగ్‌ చెయ్యలే? ఇండియన్‌ అమ్మాయిని చేసుకోవాలని నీకెలా అనిపించింది?” అనడిగింది. కృష్ణ సాలోచనగా చెప్పడం మొదలెట్టాడు,

“వెల్‌, యు సీ, పెళ్ళి అని ఆలోచించడం మొదలు పెట్టగానే .. ఎన్నో కాన్‌ఫ్లిక్టింగ్‌ ఇష్యూస్‌… కొంచెం డీప్‌గా చూస్తే .. ఏముంది? నాకు ఒకటే దారి కనిపించింది .. చేసుకుంటే ఇండియన్‌ పేరెంటేజ్‌ ఇండియన్‌ వేల్యూస్‌తో పెరిగిన అమ్మాయినే చేసుకోవాలని. .. అలాగని నేనేదో ఇండియన్‌ షావినిస్ట్‌ ననుకోకు ఫార్‌ఫ్రమిట్‌. దీని వెనకాల చాలా ప్రాగ్మాటిక్‌ రీజనింగ్‌ వుంది.”

“రీజనింగ్‌ ఏదైనా, మీ పేరెంట్స్‌ చాలా సంతోషించి నట్టున్నారు ఈ డెసిషన్‌తో!”

“వెల్‌, అఫ్‌ కోర్స్‌. కానీ, ఈ డెసిషన్‌ తీసుకోవడంలో వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు ఇది పూర్తిగా నా స్వార్థమే ననుకో!” అని చిన్నగా నవ్వాడు కృష్ణ. “వెల్‌, దీన్తో ఒక ప్రాబ్లం కూడా వచ్చింది .. ఇలాంటి క్వాలిటీస్‌ వున్న అమ్మాయిని నా అంతట నేను వెదికి పట్టుకోవటం .. విత్‌ మై స్కెడ్యూల్‌ .. చాలా కష్టం .. అనిపించింది. మై పేరెంట్స్‌ ఆఫర్‌డ్‌ టు హెల్ప్‌ ఐ సెడ్‌ ఓకే ఇట్‌ సీమ్‌డ్‌ ద సెన్సిబుల్‌ థింఘ్‌ టు డూ. ..”

డిసర్ట్‌ తినటం పూర్తయ్యాక కృష్ణ బిల్లు తనే పే చేస్తానన్నాడు, కానీ వాసంతి ఒప్పుకోలేదు తన వంతు సగం తానే కడతానని పట్టుబట్టింది.

“వెల్‌, వాసంతీ, నీ ఎక్సలెంట్‌ కంపెనీ .. నీకిలా డిన్నర్‌ ఇవ్వగలగడం .. ఇట్స్‌ మై ప్లెజర్‌, ” అని కృష్ణ మృదువుగానే ప్రొటెస్ట్‌ చేశాడు. కానీ వాసంతి పట్టు వొదల్లేదు.

“నేనూ నీ కంపెనీ ఎంజాయ్‌చేశాను. కాక ఈ రోజుల్లో ఇంకా అబ్బాయే అన్ని ఖర్చులూ పెడతా ననడం టెర్రిబ్లీ ఓల్డ్‌ ఫేషన్డ్‌ .. కాదూ? తరవాత ఫ్యూచర్లో ఇంకెన్ని సార్లో కదా, ఈసారికి ఇలా కానీ,” అన్నది తన వంతు ముప్ఫై ఐదు డాలర్లనీ బిల్‌ వాలెట్లో పెడుతూ. కృష్ణకి ఆమె అన్నదాంట్లో భవిష్యత్తుకి ఏదో ఆహ్వానం వినిపించి ఆ మేటర్ని అలా వొదిలేసి తన వాటా కూడా చేర్చాడు.

రెస్టరాంట్‌ లోంచి బయటి కొచ్చాక మాత్రం, “పద, నిన్ను ఇంటిదాకా దిగబెడతా” నన్నాడు, ఈ విషయం మాత్రం నెగోషియబుల్‌ కాదన్నట్టు. వాసంతీ సరేనంది. ఆహ్లాద కరమైన వసంతకాలపు పిల్లగాలిలో .. బస్సూ ట్రైనూ వొద్దనుకుని ఇద్దరూ నడిచే వెళ్ళారు పది బ్లాకులు, వాసంతి వుండే అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌వరకూ. అతని దగ్గర స్నేహంగా సెలవు పుచ్చుకుని వాసంతి బిల్డింగ్‌ లోపలి కెళ్తూ, “పరవాలేదు, రెండో డేట్‌కి వెళ్ళొచ్చు”” అనుకుంది. ఆమె లోపలికి వెళ్ళిపోబోతూ చివరి సారి వీధిలోకి చూసి కృష్ణకి చెయ్యి వూపుతుంటే అతను రెండంగల్లో నాలుగు మెట్లూ ఎక్కేసి ఆమె దగ్గరికి చేరుకున్నాడు. తలుపు మీద ఆనించి వున్న వాసంతి చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నొక్కి, “నేను నిజంగా అదృష్టవంతుణ్ణి. నీలాగ ఇండియన్‌ వేల్యూస్‌ని పుణికి పుచ్చుకున్న అమ్మాయి ఇన్నాళ్ళకైనా నాకు పరిచయమైనందుకు.” అన్నాడు వాసంతి కళ్ళల్లోకి చూస్తూ. అనేసి చకచకా మెట్లు దిగి వీధి మలుపు తిరిగేసి కనుమరుగై పోయాడు.

వాసంతి మాత్రం “ఇదేవిటమ్మా చోద్యం” అన్నట్టు అలా నిల్చుండి పోయింది ఒక నిముషం పాటు, అతను వెళ్ళిన దిక్కుకే చూస్తూ.

“ఇండియన్‌ వేల్యూస్‌? వాట్‌ ఇండియన్‌ వేల్యూస్‌ ” ఆమాట మొదటి సారి వింటున్నట్టు అయోమయంగా మొహం పెట్టింది నీరజ.

“ఏడిచినట్టే వుంది. అక్కడే కదే ఈ కథ మొదలైంది !” వాసంతి విసుక్కుంది.

“ఓ, యా. చెప్పు, ఈ ఇండియన్‌ వేల్యూస్‌ గోలేవిటి ?”

“ఇద్దరమూ బానే మాట్లాడుకున్నాం మొదటి సారి, హాబీ లేవిటి, ఇష్టాయిష్టా లేవిటి, ఎట్సెట్రా. అతను నన్ను ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్ళబోతూ “ఇండియన్‌ వేల్యూస్‌తో పెరిగిన నువ్వు నాకు పరిచయమవడం నా అదృష్టం” అనేసి వెళ్ళిపోయాడు. అదేవిటో నాకు అర్థం కాలేదు. ”

“అర్థం కాకపోవడని కేముందీ ? నువ్వు సంగీతమూ అదీ వెలగ బెట్టావుగా కొన్నాళ్ళు. అది మీ వాళ్ళు గొప్పగా చెప్పి ఉంటారు.”

“కొంచెం ఆలోచిస్తే నాకూ అదే తట్టింది. రెండో సారి కలుసుకున్నప్పుడు, అతనికి సంగీతం, నాట్యం ఇష్టమేమోనని వాటిని గురించి మాట్లాడ్డం మొదలెట్టా. తీరా అతనికి బాలమురళి గాత్రం పాడతాడనీ, రమణి ఫ్లూట్‌ వాయిస్తాడనీ కూడా తెలీదు. అసలు వాళ్ళ పేర్లే అతనికి తెలిసినట్టు లేదు !”

“హూ. ఇది విచిత్రంగానే వుంది. పోనీ ఇండియన్‌ వేల్యూసంటే అతని వుద్దేశం హిందూ ట్రెడిషన్‌ అనేమో .. యు నో .. పండగలూ ఎట్‌సెట్రా. ”

“ఊహూ. అదీ ఐంది. అతనికి వాటిని గురించీ పెద్దగా తెలియదూ, అసలు ఇంట్రస్టూ చూపించలేదు. కానీ రెండో మీటింగ్‌లో నాలుగు సార్లన్నా అన్నాడు, “ఈ దేశంలో ఈ జెనరేషన్‌లో ఇండియన్‌ వేల్యూస్‌తో పెరిగిన నా లాంటి అమ్మాయి దొరకటం అతని అదృష్టం” అని. ఆ అనడం కూడా ప్రతి సారీ చాలా సిన్సియర్‌గా అంటాడు, అదేదో అతనికి చాలా ఇమ్పార్టెంట్‌ అయినట్టు.”

“వావ్‌. ఇదేదో నిజంగా మిస్టరీయే. లెట్‌ మీ థింక్‌ ” అనేసి నీరజ కొద్ది సేపు ఆలోచనలో పడిపోయింది. సడన్‌గా తలెత్తి, “మీ వాళ్ళు పేపర్లో వేసిన ఏడ్‌ వుందా?” అనడిగింది.

“యా. ఐ థింక్‌ సో. ” అని వాసంతి తన బేగ్‌లో వెదికి ఒక చిన్న కటౌట్‌ తీసి నీరజ ముందు పెట్టింది. నీరజ దాన్ని చకచకా చదివి విజయం సాధించినట్టు బల్లమీద చరిచింది.

“ఇట్‌ సేస్‌ రైట్‌ హియర్‌. పేరెంట్స్‌ ఇన్వైట్‌ బ్లా బ్లా బ్లా, యాడి యాడ యాడా .. రైజ్‌డ్‌ విత్‌ ఇండియన్‌ వేల్యూస్‌ ..”

“ఏడ్‌లో ఏం రాసి వుందో నాకు తెలుసునోయ్‌ మా వాళ్ళు నాకు సంగీతం అవీ వొచ్చు అని డబ్బా కొట్టుకోటానికి అలా రాసి వుంటారు. అటువంటి విషయాల్లో ఏవీ పర్సనల్‌ ఇంట్రస్ట్‌ లేని కృష్ణకి దీని గురించి అంత పట్టింపెందుకు అనేది నా ప్రశ్న !”

“దట్‌ ఐ డొన్నో. అతన్నే అడగలేక పోయావా ? మీరిద్దరూ బాగానే ఫ్రెండ్స్‌ ఐనట్టుందిగా !” అని ఉచిత సలహా పారేసింది నీరజ.

“మే బి ఐ విల్‌ !” అంది వాసంతి నిశ్చయంగా.

అనడమైతే నిశ్చయంగా అనేసింది గానీ వాసంతికి కృష్ణని ఈ ప్రశ్న అడగడం అనుకున్నంత సులభంగా సాధ్య పడలేదు. రెండు నెలల పరిచయంలో కృష్ణని క్షుణ్ణంగా పరిశీలించింది. ఆమె గమనించినంతలో కృష్ణ చాలా ఇండిపెండెంట్‌ మనస్తత్వం కల వ్యక్తి. తన కెరీర్‌కి సంబంధించి గానీ, వ్యక్తిగతంగా గానీ అతను తీసుకునే నిర్ణయాలలో తన అభిరుచులపై రాజీ పడని మనిషి. అలాగని బొత్తిగా నిరంకుశుడూ కాదు. తమ మధ్య కంపాటిబిలిటీ గురించి కూడా ఆమెకేమీ ఇబ్బంది కలగలేదు. పెళ్ళయ్యాక ఎన్నో సమస్యలు ఎదురవ్వచ్చు వాటిని పరస్పర అవగాహనతో ఇద్దరూ కలిసి పరిష్కరించుకో గలము అన్న నమ్మకం కలిగింది. ఇండియన్‌ వేల్యూస్‌ ప్రశ్న మాత్రం ఎటూ తెగలేదు. ఆమె చూసినంత వరకూ కృష్ణకి భారతీయ సాంస్కృతిక, మత, రాజకీయ సాంఘిక విషయాల మీద పెద్ద అవగాహనా లేదూ, మోజు అంతకన్నా లేదు. పర్సనల్‌గా ఇదో పెద్ద ప్రాబ్లం కాదు వాసంతికి. కానీ వాళ్ళు కలుసుకున్న ప్రతిసారీ అతని నోటి వెంట ఈ ఇండియన్‌ వేల్యూస్‌ ప్రసక్తి రెండు మూడు సార్లు వస్తూనే వుంది. ఆ విషయమై అతన్ని ఎలా ప్రశ్నించడమా అని వాసంతి తటపటాయిస్తూనే వుంది.

జులై నెల్లో ఒక శని వారం మధ్యాన్నం ఇద్దరూ కలిసి లంచ్‌చేసి, మెట్రోపాలిటన్‌ మ్యూజియంలో వేన్‌గో స్పెషల్‌ ఎగ్జిబిషన్‌ చూడ్డానికి వెళ్ళారు. వేసవై కాలపు ఉక్క ఊపిరి సలపనంతా దట్టంగా చుట్టుకుని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటే, ఏసీ చేసిన మ్యూజియం హాల్లోకి అడుగు పెట్టగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది ఇద్దరికీ. వాసంతికి వేన్‌గో చిత్రాలంటే ప్రాణం. కృష్ణకి ఆర్ట్‌ మీద పెద్ద మోజులేక పోయినా వాసంతి ప్రతిపాదనని మన్నించి వచ్చాడు. ఆమె అంతకు ముందు శనివారం అతనితో యాంకీస్‌ బాల్‌గేమ్‌కి వెళ్ళింది దానికిది “క్విడ్‌ ప్రో క్వో” అనుకోండి! అఫ్‌కోర్స్‌ ఉడికిపోతున్న ఆ వేసవి మధ్యాన్నం ఏసీ మ్యూజియంలో గడపటమే మేలని కూడా అతను అనుకుని వుండచ్చు.

టిక్కెట్లు కొనుక్కుని ఇద్దరూ మూడు గంటల పాటు ఎగ్జిబిషన్‌ చూశారు. వాసంతి వేన్‌గో సృష్టించిన రంగుల వలలో చిక్కుకు పోయి తనని తాను మరిచిపోయింది. కృష్ణ కూడా, ఎగ్జిబిషన్‌ వాళ్ళు ఇచ్చిన ఆడియో కామెంటరీతో బొమ్మల్ని బాగానే ఎంజాయ్‌ చేసినట్టున్నాడు, ఒక్కొక్క బొమ్మ దగ్గరా చాలా సేపు నిలబడి పరిశీలిస్తూ ఉన్నాడు. ఎగ్జిబిషన్‌నుంచి బయటికొచ్చి ఇద్దరూ మ్యూజియం కేఫ్టీరియాకి వెళ్ళారు. వీళ్ళు కాఫీలు కొనుక్కుని టేబుల్‌ కోసం చూస్తుంటే, “హాయ్‌వాస్‌, ఓవర్‌ హియర్‌” అంటూ నీరజ గొంతు వినిపించింది. వాసంతి నీరజని గమనించి అటువేపు కదిల్తే కృష్ణ ఆమెని ఫాలో అయ్యాడు. నీరజ పక్కన కూర్చున్న ఒక తెల్ల యువకుడు లేచి వీళ్ళిద్దర్నీ ఆహ్వానించాడు. అతన్ని తన ఫ్రెండ్‌ డేవిడ్‌గా పరిచయం చేసింది నీరజ. పరిచయాలయ్యాక ఒక ఐదు నిమిషాలసేపు సరదా కబుర్లు నడిచాయి.

నీరజ ఆ పూట మాంఛి మూడ్‌లో ఉన్నట్టుంది డేవిడ్‌ని బాగా ఆట పట్టిస్తూ గోల చేస్తోంది. అతన్ని కొడుతూ, గిచ్చుతూ, మధ్య మధ్య అతను కోపం నటిస్తే వెంటనే గట్టిగా కావలించుకుని, ముద్దు పెట్టి బుజ్జగిస్తూ హంగామా చేసి పారేస్తోంది. వాసంతికి నీరజ చిన్నప్పణ్ణించీ స్నేహం కాబట్టి ఈ ప్రవర్తన కొత్త కాదు. కానీ, కొద్ది సేపట్లో కృష్ణ సంభాషణలో పాల్గొనకుండా ముభావంగా ఉండిపోవడం, తన కుర్చీలో ఇబ్బందిగా కదుల్తూ ఉండడం, వాసంతి గుర్తించింది. ఏదో విషయం అతన్ని ఇబ్బంది పెడుతోందని వూహించి, నీరజతో తమకి ఇంకో ఎంగేజ్‌మెంట్‌ ఉందని చెప్పి టేబుల్‌ దగ్గర్నుంచి లేచింది. కృష్ణ నీరజకీ డేవిడ్‌కీ ముక్తసరిగా గుడ్‌ బై చెప్పి ఆమె వెనకనే లేచాడు.

మ్యూజియంలోంచి బయటికి వస్తూనే ఘనీభవించినట్టున్న ఉక్క చుట్టుముట్టి చెమటలు కక్కించింది. తూరుపు దిక్కున ఆకాశంలో నల్లటి మబ్బుల కూటమి నగరం మీద విరుచుకు పడడానికి మొహరించిన సైన్యంలా వుంది. “థండర్‌ స్టార్మ్‌ వచ్చేట్టుంది” అనుకుంది వాసంతి చిన్న రుమాలుతో నుదురు అద్దుకుంటూ. పక్కన నడుస్తున్న కృష్ణతో, “సో, వాట్‌ డు యూ థింక్‌ ?” అనడిగింది. అతను అప్పటిదాకా బలవంతంగా అణిచి పెట్టిన ఆలోచనల్ని ఇక ఉండబట్టలేనట్టు దురుసుగా అనేశాడు. “ఆ పిల్ల నీ ఫ్రెండ్‌అంటే నమ్మలేకుండా ఉన్నాను. ఎంత షేమ్‌లెస్‌గా బిహేవ్‌చేస్తోంది ఆ గోరాగాడితో .. బొత్తిగా మన వేల్యూస్‌ తెలీకుండా పెరిగి నట్టుంది ..”

వాసంతికి ముందు ఆశ్చర్యమూ, వెను వెంటనీ బాగా కోపమూ వచ్చేశాయి. ఐనా నడివీధిలో ఉన్నామన్న సంగతి గుర్తించుకుని నిదానంగానే, “కృష్ణా, నీతో కొంచెం వివరంగా మాట్లాడాలి. ఇలా వీధిలో కాదు. అటు సెంట్రల్‌ పార్కులో కెళ్దాం పద !” అంది.

ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మౌనంగానే కొద్ది సేపట్లో సెంట్రల్‌ పార్కు చేరారు. నిర్మానుష్యంగా వున్న ఓ మూల బెంచీ మీద కూర్చున్నారు. వాసంతి కృష్ణ వేపుకి తిరిగి కూర్చుని మొదలు పెట్టింది.

“చూడు కృష్ణా, నీరజని ఇదే మొదటి సారి నువ్వు చూడ్డం. తన గురించీ, తన ఫేమిలీ గురించీ నీకు ఇంతకు ముందేమీ తెలియదు. ఐనా కేవలం పది నిమిషాల పరిచయంలోనే నీరజ వేల్యూస్‌ గురించి అంత హీనమైన అభిప్రాయం .. నీకెలా అసలు అలాంటి ఆలోచన వచ్చిందో నాకర్థం కావటల్లేదు.”

“వెల్‌, ఒకళ్ళ కేరెక్టర్‌ ఎలాంటిదో గ్రహించడానికి వాళ్ళ జీవితమంతా తెలియక్కర్లేదు. సరైన సందర్భంలో పది నిమిషాలు .. ఊహు, ఒక్క నిమిషం చాలు .. తెలిసి పోవడానికి. ప్రవర్తనకి పునాది చిన్నతనంలోనే పడుతుంది. తన మొగుడు కాని ఒక మొగాడితో .. ఒక తెల్లతోలు గాడితో .. అలా విచ్చలవిడిగా విరగబడుతున్న ఆ పిల్ల తీరు .. ఆమె పెంపకం ఎలాంటిదో చెప్పకనే చెబుతోంది.”

“మొదట, ఆ పిల్లకో పేరుంది నీరజ ! రెండో విషయం, తను నాకు చిన్నప్పణ్ణించీ బెస్ట్‌ ఫ్రెండ్‌ తన పేరెంట్స్‌ కూడా నాకు బాగా తెలుసు. వాళ్ళెవ్వరి గురించీ నీ దగ్గర్నించి నేను నేర్చుకోవాల్సిన పని లేదు.”

వాసంతికి తన మాటలు బాగా కోపం తెప్పించాయని అప్పటికి తట్టినట్టుంది కృష్ణకి. ఆమె చేతిని తన రెండు చేతుల్లోకీ తీసుకుంటూ అనునయంగా అన్నాడు, “వెల్‌, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. నీ సంగతే చూడు. ఈ దేశంలో పెరిగినా ఆ నీరజ నీకు బెస్ట్‌ ఫ్రెండే ఐనా నువ్వు చక్కటి ఇండియన్‌ వేల్యూస్‌తో పెరగలేదూ? నిన్ను కలుసుకుని, మన పరిచయం ఇలా పెరగడం .. ”

“.. నీ అదృష్టం. యా యా, ఈ మాట ఇప్పటికి చాలా సార్లే చెప్పావు. నాకు తెలీక అడుగుతాను, అంత చక్ఖటి ఇండియన్‌ వేల్యూస్‌ ఏవిటి కృష్ణా? ప్లీజ్‌ ఎన్‌లైటెన్‌ మీ!” అంది వాసంతి తీవ్రంగా.

“వెల్‌, కమాన్‌. నీకు నిజంగానే తెలీక అడుగుతున్నావా? నీకున్న వేల్యూసేవిటో నీకే తెలుసు.”

“నాకున్న వేల్యూసేవిటో నాకు తెలుసు. ఆన్‌ ద కాంట్రరీ, ఆ వేల్యూస్‌ పట్ల నీ అభిప్రాయం ఏవిటో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. నీరజలో లేనివీ, నాలో వున్నవీ ఆ మహత్తరమైన ఇండియన్‌ వేల్యూస్‌ ఏవిటో చెప్పి కొంచెం పుణ్యం కట్టుకో!”

వాసంతి గొంతులో ధ్వనించిన వెటకారం కృష్ణకి వినిపించినట్టు లేదు .. నాలికకి చేదు తగిల్నట్టు మొహమంతా వికారంగా పెట్టి, “ఛ ఛ, దానితో నీకు పోలికేవిటి .. పరాయి మొగాళ్ళతో అలా మీదపడి బుజాలు రుద్దుకూంటూ .. అసహ్యంగా .. అదేం పోలిక? ఆడ కుక్కలాగ వెంట పడిన మొగాడితోనల్లా సరసాలాడ్డం, ఎంత మందితో పడుకుందో యిప్పటికి ..”

వాసంతి అతని చేతుల్లోంచి తన చేతిని చివాల్న వెనక్కి లాక్కుంది. కృష్ణ మనస్తత్వం హఠాత్తుగా మకిలి తుడుచుకుపోయిన అద్దంలో ప్రతిబింబంలాగా స్పష్టంగా కనిపించింది ఆమెకి. ఆ గుర్తింపుకి మెదడు హోరెత్తి పోతుంటే, కళ్ళు జ్యోతుల్లా వెలిగిపోతుంటే, పళ్ళు బిగించి బుస కొట్టినట్టు అంది, “ఈజ్‌దటిట్‌ వర్జినిటీ .. ఈజ్‌దటిట్‌ .. యువర్‌ ఇండియన్‌ వేల్యూ? నీకు అతి ప్రియమైన .. ఆరాధ్యమైన ఇండియన్‌ వేల్యూ .. కన్యాత్వం?”

వాసంతి ఎందుకంత ఉద్రేక పడుతోందో కృష్ణకింకా అర్థమైనట్టు లేదు.

వాదిస్తున్నట్తుగా అన్నాడు, “వెల్‌, అందులో తప్పేముంది? అది నిజమైన ఇండియన్‌ వేల్యూ. దురదృష్ట వశాత్తూ ఈ దేశంలో ఈ రోజుల్లో ఇండియన్స్‌లో కూడా కరువై పోతున్నది.”

“అంటే .. నాతో పరిచయంలో నీకు కలిగిన మహదానందం అంతా .. నేను కన్యని కావటం .. కాదు కాదు .. నేను ఇండియన్‌ వేల్యూస్‌తో పెరగడం వల్ల నేను ఖచ్చితంగా కన్యనే అని నీకున్న నమ్మకం .. అందుకే నీకు నా మీద ఇంట్రస్టు. నాకున్న మిగతా అర్హతలేవీ దాని ముందు లెక్కకి రావు. అంతేనా?” కృష్ణ ఒక్క క్షణం పాటు మౌనంగా ఉండిపోయాడు. తన ఆలోచనలని కూడ గట్టుకుని గంభీరంగా అన్నాడు,
“నా వుద్దేశం అర్థం చేసుకోవడనికి ప్రయత్నించు. మనం ఈ దేశంలో మన జీవితాలు స్థిరపరుచు కున్నాం. ఇక్కడే కుటుంబ జీవితం మొదలుపెట్టి ఈ సామాజిక వాతావరణంలో పిల్లల్ని పెంచబోతున్నాం. నా పిల్లలకి భారతీయ సామ్ప్రదాయాల విలువలు తెలిసి అలవాటవ్వాలంటే .. వాళ్ళ తల్లి .. నా భార్య .. ఆ విలువల్ని గౌరవించి పాటించేదిగా వుండాలని నేను గట్టిగా నమ్ముతున్నాను. పెళ్ళి కాక ముందు ఆడపిల్ల మొగాళ్ళతో విచ్చలవిడిగా తిరగడం ఖచ్చితంగా ఇండియన్‌ వేల్యూ కాదు. అటువంటి స్త్రీ నా పిల్లలకి తల్లిగా బాధ్యత నెరవేర్చ లేదు. నా భార్య ఇలా వుండాలీ అని ఆశించే హక్కు నాకుందని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. వ్హెన్‌ యు ఆస్క్‌ లైక్‌ దట్‌, యెస్‌, ఐ వుడ్‌ లైక్‌ మై ఫ్యూచర్‌ వైఫ్‌ టుబీ ఎ వర్జిన్‌.” చేతనైతే ఈ వాదనని ఖండించమని సవాలు కనిపించింది అతని మొహంలో వాసంతికి. ఆమె నెమ్మదిగా బెంచి మీదనించి లేచి కృష్ణకి అభిముఖంగా నిలబడింది.

“కృష్ణా, నువ్వు చెప్పింది చాలా బావుంది. ఇంత వివరంగా చెప్పినందుకు నీకు నేను చాలా ఋణపడి వుంటాను. నీకా హక్కుందని గూడా నేను ఒప్పుకుంటాను. ఐతే నిన్ను ఇంకొక్క ప్రశ్న మాత్రం అడుగుతాను. నిజం చెబుతావని ఆశిస్తాను. .. ఆర్యూ ఎ వర్జిన్‌?”

వాసంతి అటువంటి ప్రశ్న అడిగే సాహసం చేస్తుందని కృష్ణ ఊహించినట్టు లేదు. అతని గాంభీర్యం కొద్దిగా చెదిరి, ఒక్క క్షణం పాటు మొహం వివర్ణమవ్వడం అతన్నే నిశితంగా పరిశీలిస్తున్న వాసంతి దృష్టిని దాటిపోలేదు. అతను కొమ్చెం కుదుట పడి నోరుతెరిచే లోపు ఆమే తిరిగి అంది వారింపుగా, “వొద్దు కృష్ణా! నువ్వు చెప్పక్కర్లేకుండానే నువ్వు చెప్పబోయే జవాబేవిటో నాకు తెలిసి పోయింది. ఆ జవాబు నాకు ఇంపార్టెంట్‌ కాదు, అది నన్ను బాధ పెట్టదు. నన్ను బాధపెడుతున్న దల్లా నీ డబుల్‌ స్టాండర్డ్‌. ఐ హేట్‌ డబుల్‌ స్టాండర్స్డ్‌. గుడ్‌ బై కృష్ణా!”

ఆ మధ్యాన్నమంతా దట్టంగా పేరుకున్న టెన్షన్‌ ఒక్ఖసారిగా బద్దలైనట్టు వేసవి కాలపు థండర్‌ స్టార్మ్‌ నగరం మీద విరుచుకుపడిపోయింది. వాసంతి దాన్ని లక్ష్యపెట్టకుండా బ్రాడ్వే వెంబడి నడుస్తోంది తేలిక పడ్డ అడుగులతో.
------------------------------------------------------
రచన: ఎస్‌. నారాయణస్వామి, 
ఈమాట సౌజన్యంతో

Thursday, September 5, 2019

దౌలత్


దౌలత్




సాహితీమిత్రులారా!

ఊరికి ఒక మూలగా పెద్దపెద్ద రాళ్లు విసిరేసినట్లుండే చోట ఉంటుంది మా ఇల్లు. ఆ చుట్టుపక్కల పెద్ద రోడ్లూ ఏవీ లేవు. మా ఇంటికి పోవాలంటే ఒక చిన్న గుట్ట ఎక్కాలి. ఆ గుట్ట నిండా రాళ్లే. మేమున్న బస్తీ చివర పప్పాజీ కార్ఖానా కనిపిస్తుంది. పప్పాజీ కార్ఖానాలో తయారు చేసిన గణేశ్‌జీ, కాళీమా, హనుమాన్‌జీ, శివ్‌జీ విగ్రహాలను పనివాళ్లు ట్రక్కులెక్కిస్తూ ఉంటారు. వాళ్ళ అరుపులు వినబడనంత దూరం వస్తే అక్కడ కుడివైపు గుట్ట మీదకి పోయే మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్లకు రెండువైపులా కొన్ని ఇళ్లు చెల్లాచెదురుగా ఆ రాళ్ళ మధ్య మొలిచినట్లే కనిపిస్తాయి. యాభైరెండో మెట్టు దగ్గర ఎడమవైపుకు తిరిగి ఎదురుగా వున్న గడపలో అడుగుపెడితే మా ఇంటి లోపలికి వచ్చినట్లే.

పేరుకి మా ఇల్లు అన్నానే గానీ అది ఇల్లులా ఉండేది కాదు. కొన్ని పాతగదులు గుంపుగా చేరి కబుర్లాడుకుంటున్నట్టు ఉండేది. రోడ్డుకు దూరంగా ఉన్నందువలన ఇంటి చుట్టూ నిశ్శబ్దంగా ఉండేది. మా ఇంటి కాంపౌండు అంటూ కచ్చితంగా చెప్పడానికి ఇంటి చుట్టూ కంచె గానీ గోడ గానీ ఉండేవి కావు. పాతకాలం ఇల్లు కాబట్టి ఎప్పుడో ఏవో కొన్ని బండరాళ్ళను చూపించి అదే ప్రహరీ అయుంటుంది అనేవాడు చాచా. మా చాచా ఏం చెప్పినా నేను నమ్మేసేవాణ్ని. కానీ అది ప్రహరీనో కాదో కచ్చితంగా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు.

మా ముత్తాతకు ముత్తాతకు ముత్తాత ఔరంగజేబు సైన్యంలో పని చేసేవారట. ఎవరూ ఆయనను గురించి ఏకవచనంలో సంబోధించినట్లుగా నాకు గుర్తులేదు. అందుకే ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఒక్కణ్ణే గాక ఆయన చుట్టూ అచ్చం ఆయన లాంటి లెక్కలేనంత మంది మనుషులని చేతుల్లో కత్తీ డాలులతో, కొందరిని చేతుల్లో కొన్ని బరిసెలతో, ఇంకొందరిని నాటు బాంబులతో (ఇవి అప్పటికి ఉన్నాయో లేదో తెలీదు), కొన్ని గుర్రాలనీ, ఏనుగులనీ ఊహించుకునేవాణ్ణి. ఔరంగజేబు సైన్యంలో వీరిని ఆత్మాహుతి దళం అనేవారంట. ప్రతి యుద్ధంలోను వీరిని ముందు వరసలో నిలబెట్టేవారు కాబట్టి, యుద్ధానికి వెళ్ళడం అంటే వారు చనిపోయినట్లే లెక్క.

ఆ చావును తప్పించుకుని మా పెద్దముత్తాత ఇలా ఈ ఊరికి రావడం గురించి ఒక కథ ఉంది. అప్పటి హైదరబాదు నిజామ్‌పై దండెత్తి వచ్చాడు ఔరంగజేబు. ఇక్కడ గెలిచి వెళ్ళిపోతున్నప్పుడు, కొంత సైన్యాన్ని వదిలి నిజామ్‌నే తన సామంతునిగా నియమించి తిరిగి దిల్లీ పోతుండగా, మధ్యదారిలోనే ఔరంగజేబుకు జబ్బుచేసి చనిపోయాడు. వెంటనే నిజామ్ ప్రభువు తనను తాను రాజుగా తిరిగి ప్రకటించుకున్నాడు. మిగిలిన సైన్యం అంతా తన సైన్యం అయిపోయింది. కాని, ఈ ఆత్మాహుతి దళంలోని కొందరు హిందువులని మతం మార్చుకొమ్మని ఆదేశించాడు నిజామ్. మరాఠా వంశస్థులుగా చెప్పుకునే మావాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. నిజామ్ వారందరినీ కోటకు బైట మేము ప్రస్తుతం ఉన్నచోట ఉండమని ఆజ్ఞాపించాడు. అలా ఇక సైన్యంలో చోటు పోయేసరికి మా వంశంవారు విగ్రహాలు చేయడం వృత్తిగా చేసుకున్నారు.

కథ సంగతి ఏమో గానీ మా ఇల్లు ఎంత పాతదో మా పప్పాజీకి కూడా తెలీదు. కానీ ఇది వాళ్ళ తాతల కాలం నుంచి ఉన్నదని చెప్పేవారందరూ. ఈ ఇల్లు కట్టకముందు ఎక్కడ ఉండేవాళ్ళం అనేది ఎవరికీ తెలీదు. నా చిన్నప్పుడు మా చినాన్న ఒక పాతకాలం నాటి చురకత్తిని తుడుస్తూ ఉండడం మాత్రం నాకు గుర్తుంది. అయితే ఇంట్లో వచ్చే పెద్ద పెద్ద ఇబ్బందులకి ఏవేవో చిన్నచిన్న రిపేర్లు చేయిస్తూ నడిపేసేవారు పప్పాజీ. పెచ్చులూడుతున్న గోడలకు కాస్త మట్టి అద్దడం, వాడిన నీళ్లను మళ్లించడం, వర్షాకాలంలో పైకప్పు కురవకుండా సున్నం పూయడం–ఇలాంటి పనులుండేవి. పప్పాజీ అటువంటి పనులు చేస్తున్నప్పుడు చినుగుల బనియన్‌ లోంచి పొంగిన ఆ భుజాలూ, చేతి కండలూ వెక్కిరిస్తూ నవ్వుతున్నట్లుండేవి.

ఇప్పుడైతే నేను ఇంటిని మళ్ళీ కట్టించాను. కానీ నా కారును ఇప్పటికీ గుట్ట కింద పప్పాజీ కార్ఖానా షెడ్డులోనే పెడతాను. సిటీలోకి పోయి బతకొచ్చన్న ఆలోచన ఇప్పటివరకూ మాకెవ్వరికీ రాలేదు.

చెప్పానుగా మేమున్న ప్రాంతం అంతా రాళ్ళేనని. రాళ్లంటే చిన్నవి కాదు. పెద్దపెద్దవి. ఒక్కొకటి ఐదు నుంచి పాతిక అడుగుల వరకూ ఎత్తుంటాయి. కొన్ని రాళ్లు నేల మీద పరుచుకుని ఉండేవి. మాఁ పొద్దున్నే లేచి చపాతీ చేస్తే నేను ఇంటిముందున్న ఒక రాయి పైన కూర్చుని తినేవాడ్ని. బడేపప్పాజీ వచ్చినా ఇంటిలోకి రాకుండా ఇంటి ముందున్న రాయి మీదే కూర్చుని మాట్లాడేవాడు. మాఁ కూడా బట్టలు ఉతికి బండరాళ్ళ మీదనే ఆరేసేది. ఇంటికి వచ్చే దారిలో ఉన్న మెట్లు పడక ముందు ఆ రాళ్లు ఎక్కే ఇంటికి వచ్చేవాళ్లమని చెప్పేవారు పప్పాజి.

మా పాతింటి వంటగది వెనుక మాఁ గిన్నెలు తోముకోడానికి కాస్త స్థలం ఉండేది. అది దాటి నాలుగు అడుగులకు ఒక చిన్న లోయ ఉండేది. చిన్నప్పుడు మాఁ ఇచ్చిన చాయ్ తాగుతూ దూరంగా కనిపిస్తున్న పెద్ద గుట్టకేసి చూస్తుండటం అలవాటుగా ఉండేది నాకు.

చుట్టుపక్కల ఎన్ని గుట్టలున్నా మా ఇంటి వెనుక నుంచి కనిపించే గుట్ట అన్నిటికన్నా పెద్దది. ఆ గుట్టలో ఏదో రహస్యం ఉన్నట్టు ఎప్పుడూ అనిపించేది. ఒకే ఒక్క పెద్ద రాయి గుట్టలా ఉంటుంది కాబట్టి దానిని రాయి గుట్ట అంటారు… అది దూరం నుంచి చూస్తే ఒక పెద్ద జారుడు బండలా కనిపిస్తుంది. ఆ గుట్ట పై అంచున ఇంకొక గుండ్రటి రాయి ఉంది. అది దొర్లిపోబోతూ హఠాత్తుగా మనసు మార్చుకుని అంచున ఆగినట్లు ఉంటుంది. చిన్నప్పుడు అది పడిపోతుందేమోనని ఎదురుచూసేవాణ్ణి.

నాకిప్పటికీ గుర్తు. చిన్నప్పుడోసారి బాగా వర్షం పడింది. ఆ తరవాత గాలి కూడా వచ్చింది. ఆ రాత్రంతా ఆ రాయి పడిపోతుందేమో అని నిద్రలో ఉలికులికిపడి లేస్తూనే ఉన్నాను. పొద్దున్నే లేచి భయంభయంగా చూస్తే ఆ రాయి అలానే ఉన్నది. ఆ రోజు నేను తాగుతున్న చాయ్ చప్పగా అనిపించింది… ఒకసారి భూకంపం వచ్చినప్పుడు మా గుట్టలో ఇళ్లు కొన్ని కదిలిపోయాయి గాని, ఆ రాయి మాత్రం అలానే ఉంది.

ఇక నాకు పదిహేనేళ్ళొచ్చి నేను ఎన్‌.సి.సిలో జాయిన్ అయినప్పుడు ఆ గుట్టను ఎక్కాలన్న ఆలోచన వచ్చింది. ఆ సమయంలో పప్పాజీ మా చాచాతో పేచీపడి కోర్టు చుట్టూ తిరుగుతుండేవారు. మాఁకి ఏదో ఒకటి చెప్పితే నమ్మేసేది. కానీ నా దగ్గర ఎన్‌.సి.సిలో ఇచ్చిన వస్తువులేమీ లేవు. ఏదేమైనా సరే, నేనూ నా స్నేహితుడూ కలిసి ఆ గుట్ట మీదకి పోదామనుకున్నాం.

చూడడానికి దగ్గరగానే అనిపించినా గుట్టను చేరడానికి ఇరవై నిముషాల పైనే పట్టింది. గుట్ట పైకి ఎక్కుతున్నప్పుడు హఠాత్తుగా గుట్ట మీది రాయి రెండుగా చీలిపోయి కనిపించింది. చీలిపోయిన ఆ రాళ్ల మధ్య ఏడు అడుగుల దూరం ఉంటుంది. ఒక మనిషి దానిని దాటాలంటే రెండే దారులు: అయితే ఒక నిచ్చెన లాంటి దాన్ని వంతెనగా వాడాలి. లేదంటే దూరంగా వెనక్కిపోయి పరుగెట్టుకుంటూ వచ్చి ఎగిరి దూకాలి. కానీ సరిగ్గా దూకకపొతే ఆ చీలికలో పడిపోవచ్చు. దాని లోతు ముప్పై అడుగులపైనే ఉంటుంది. ఆ చీలిక లోతు పెరుగుతున్నకొద్దీ రెండు రాళ్ళ మధ్య దూరం సన్నమవుతోంది. అందులో ఇరుక్కునేంత సాహసం చేయలేకపోయాం. అక్కడే కాసేపు కూలబడ్డాం. వెనక్కి వస్తుండగా నేను ఆ గుట్టను బలంగా తన్నాను.

ఆ తర్వాత నాకు పదిహేడేళ్లు వచ్చేవరకూ మళ్ళీ అటువైపు వెళ్ళలేదు. కానీ నేను రోజూ చాయ్ తాగే సమయంలో వంటగది వెనుకకు పోయి చూడడం మాత్రం మానలేదు. ఆ రాయి అలాగే ఠీవిగా అతివాది మతగురువులా మొండిగా నిలబడే ఉండేది. కొన్నిసార్లు పంటి కింద నలగని వగరు వక్కపలుకులా అనిపించేది. ఆ తర్వాత నేను నా చదువు వలన ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చింది.

నా పరీక్షలైపోయి నేను తిరిగి ఇంటికొచ్చాక పరిస్థితులు మారిపోయాయి. పప్పాజీ చాచా మీద వేసిన కోర్టు కేసులో మేము ఓడిపోయాం. పప్పాజి ఆ ఉదయం నుంచి మాఁ మీద అరుస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం మేం భోంచేస్తోంటే మాఁ వడ్డిస్తోంది. పప్పాజి మళ్ళీ కూర తక్కువ ఉందని మాఁని తిట్టారు.

“ఉన్న ఆస్తి పోగొట్టుకున్నారు. ఇక తినడానికి ఉండటమే ఎక్కువ! నా పిల్లలకోసం కాస్త ఇదైనా మిగిల్చాను…” నెమ్మదిగానే అంది.

పప్పాజీ ఎడం చేత్తో ఆమె జుట్టు పట్టుకుని ఎంగిలి చేత్తోనే మాఁని కొట్టడం మొదలు పెట్టాడు. నేనిక భరించలేకపోయాను. పప్పాజీ ఎత్తిన చెయ్యిని గట్టిగా పట్టుకుని మెలితిప్పి రెండో చేతి పిడికిలి బిగించి మొహం మీద కొట్టబోతూ ఆయన్ని చూశాను. మాఁ నన్ను పట్టుకుని ఆపింది. ఆమె రెండో చెయ్యి పప్పాజి కొట్టిన చెవి మీదనే ఉంది. పప్పాజి మొహంలో ఏ భావమూ లేదు.

నేను ఎత్తిన చేతిని దించాను. మాఁ నెత్తిమీద కొంగును కప్పుకుంటూ లేచి వంటగది వైపు వెళ్ళింది. నేను గబగబా బయటపడ్డాను. నా మనసులో అర్ధం కాని కళ్ళతో దీనంగా చూస్తున్న మాఁ కదులుతోంది. అలా నడుస్తూ నడుస్తూ ఉన్నట్టుండి ఆగి చూస్తే నేను ఆ గుట్టకు ఎదురుగా నిలబడి ఉన్నాను. ఏ భావమూ లేని పప్పాజీ చూపు గుర్తొచ్చింది. నా వంట్లో రక్తం మరిగి ఉరకలెత్తింది. ఇక ఆగలేదు. ఈ మూడేళ్ళలో నా చేతులు గట్టిపడ్డాయి, భుజాలు పొంగాయి. నా వేగం పెరిగింది. ఆ గుట్టమధ్య ఉన్న చీలిక దగ్గరకు రాగానే రెండు అడుగులు వెనక్కి వేసి ఒక్కసారిగా ముందుకు పరిగెత్తుతూ వచ్చి, ఊపిరి బిగపట్టి గబుక్కున దూకాను.

కళ్ళు తెరిచి చూసేసరికి నేను అవతల గుట్ట మీద ఉన్నాను. గుట్ట మీదెక్కుతూ నేనారోజు ఏమాలోచించానో గుర్తులేదు. మా ఇంటి వైపు చూసి గుర్తుపట్టడానికి చేసిన ప్రయత్నం మాత్రమే గుర్తుంది. దూరంగా ఏటవాలుగా కనిపించిన గుట్ట దగ్గర్నుంచి చూస్తే అంత వాలుగా ఏమీ లేదు. కొన్ని చోట్ల చదునుగా ఉండి నడిచినా, ఇంకొన్ని చోట్ల చిన్న సాహసాలు చేస్తూ ఎక్కవలసి వచ్చింది. ఎక్కుతున్నకొద్దీ నాలో ఏదో అడవిగుర్రాన్ని అదుపులోకి తెచ్చుకుంటున్నట్టు అనిపించింది.

అయితే గుట్ట పైఅంచుకు చేరాలంటేనే ఇబ్బంది. ఆ గుట్ట పైన మొత్తం రాయి ఆక్రమించి ఉంది. దాని చుట్టుకొలత ఇంచుమించుగా పాతిక అడుగుల పైనే ఉంటుంది. గుట్ట పై అంచున సరిగ్గా నిలబడలేకపోవడమో లేక గుట్టపై రాయి నాకన్నా ఎక్కువ ఎత్తులో ఉండటం వల్లనో, ఏదో మరి, ఆ రాయి అడుగున నించున్న నాకు ఎందుకో చిన్నతనంగా ఉండింది. ఆ గుట్టను రెండు చేతులతో పట్టుకుందామని నా తలానించాను. అందులోంచి ఏమైనా వినబడుతుందా? సాయంత్రం సూర్యుడితో వేడిక్కిన రాయి బుగ్గను చుర్రుమనిపించినా బాగుందనిపించి అలానే ఉండిపోయా. తలెత్తి చూశాను. నా ఎత్తుకు ఇంకో మూడింతలు ఉంటుంది ఆ రాయి. పైన ఏదో చెక్కినట్లుగా ఉంది. అంటే నాకన్నా ముందే ఎవరో ఈ రాయి ఎక్కారా? వెళ్లి ఆ రాయిని ఆనుకుని కూర్చున్నా.

ఇంకాసేపటిలో చీకటి పడిపోతుంది. ఈ రోజుకింతే. కానీ రేపు మళ్ళీ వెలుగొస్తుంది, దాని తర్వాత మళ్ళీ చీకటి! నాకెందుకో ఆ సమయంలో వెలివేయబడ్డ నా ముత్తాత గుర్తుకువచ్చాడు. అతను నాలానే నాలుగొందల ఏళ్ళ క్రితం ఈ రాయిని ఆనుకుని ఇలా సాయంకాలం పూట సూర్యుణ్ణి చూసి ఉంటాడా, ఆయన చేతిలో ఉన్న బరిసెను పక్కన పడేసి? డాలు వేసుకుని, నెత్తిమీద శకటం పెట్టుకుని పెద్దమీసాలు, విశాలమైన ఛాతి ఉన్న తాత కూలబడి ఉండడు. నుంచునే ఉంటాడు. అన్ని యుద్ధాలు చేసిన వ్యక్తి ఈ రాయి ఎక్కలేపోయుంటాడా? ఈ రాయి పైకెక్కి తనవాళ్లకు అండగా ఇక్కడ నిలబడి తన వంశస్థుల పహారా కాస్తుండేవాడా? అన్ని యుద్దాలలో రాటుదేలిన మనిషి విగ్రహాలు తయారుచేస్తూ ఎలా రాజీ పడ్డాడు? చీకటి పడుతుండగా ఇంటికి తిరిగి వచ్చాను. నిద్రలో ఆ రాతి పైన అస్పష్టమైన అక్షరాలు కనిపించాయి. ఆ గుట్ట కింద ఒక తోడేలు కనిపించింది. పొద్దున్నే చిన్న నెమలి పిల్ల, ఒక ముంగీస కూడా కనిపించింది. అది ముంగీస కాదేమో… ఉడుము కూడా అయ్యుండొచ్చు.

పొద్దున్నే నా పాత దోస్తు ఇంటికి వెళ్లాను. అంత పొద్దున్నే వచ్చిన నన్ను చూసి వాడు ఆశ్చర్యపోయినా నా వెనుకే వచ్చాడు. ఇద్దరం అదే గుట్టకు వెళ్ళాము. ఈసారి ఆ ఏడు అడుగులూ దాటేయడం సులువైపోయింది. నా స్నేహితుడు పెద్దగా మాట్లాడడు. అయినాగాని పైకి ఎక్కుతున్నప్పుడు నిన్నటి నిశబ్దం దూరమైపోయినట్లుంది.

గుట్ట మీద రాయి, అడుగేసే ముందు కాలెత్తి గాలిలోనే ఆగినట్లు, కొద్దిగా పైకి లేచి ఉంది. గుట్టకూ, రాయి లేచిన చోటుకూ మధ్య మూడు నాలుగు అడుగుల స్థలం ఉంది. అక్కడ హాయిగా పడుకోవచ్చు. కానీ రాయిని పూర్తిగా చూస్తే పడుకునే సాహసం చేయలేం. ఆ రాయి పైకి ఎక్కడానికి ప్రయత్నించి విఫలమైతే అప్పుడైనా వెనక్కి జారి వెనక్కి రావొచ్చు అనిపిస్తుంది. నేను ఆ రాయి చుట్టూ తిరగడానికి వెళ్ళాను. పది అడుగులు వేశాక గుట్ట వెనుక లోయ కనిపించింది. అక్కడ కాలు మోపే స్థలం కూడా లేదు. గుట్ట పైనున్న రాయి అక్కడి అంచువరకు పరుచుకుని వుంది. నేను వెనక్కి వచ్చాను. ఇద్దరం రాయి పైన చెక్కిన అక్షరాలను అర్ధం చేసుకునే ప్రయత్నం చేశాం. ఆ అక్షరాలను చెక్కి, పైన తెల్ల రంగు పూశారు. నా స్నేహితుడు గబాగబా గుట్ట దిగివెళ్లి కొంత దూరం నడిచాడు. నేను మళ్లీ గుట్ట మీదనుంచి మా ఇల్లు కనిపెట్టే పనిలో పడ్డాను.

కింద నుంచి వాడు రాయి విసిరి నన్ను రమ్మన్నట్టు సైగ చేశాడు. భూమిలోనుంచి తన్నుకు వచ్చే నీటిబుగ్గకు కాలు అడ్డం పెట్టినట్లుంది వాడి మొహం. కిందకు వెళ్ళగానే గుట్టపైన రాయిని చూపించాడు. నా కళ్లు పెద్దవయ్యాయి. ఇద్దరం మళ్ళీ ఒకరినొకరం చూసుకుని మళ్ళీ ఆ రాయి వైపు చూశాం. రాతి పైన చెక్కిన పేర్లు తిరగబడి ఉన్నాయి.

తిరిగి గుట్టను దాటి వెనక్కి వచ్చేప్పుడు ఆ రాయి నాకు మరింత దగ్గర మనిషిలా మారినట్లు అనిపించింది. ఎప్పటి పరిచయస్తుడో నా అక్కనో చెల్లినో చేసుకుని నాకు అతి దగ్గర బంధువయేముందు కలిగే వాత్సల్యం వంటిది ఆ రాయిపై కలిగింది.

రాత్రి కార్ఖానా నుండి పప్పాజీ ఇంటికి వచ్చేవరకు ఎదురు చూసి, రాగానే అడిగాను. “ఆ రాయిగుట్ట పైన ఉన్నది మీ పేరేనా?”

పప్పాజీ తన పాంటు నుంచి లుంగీకి మారబోతూ మాట్లాడకుండా కాసేపు ఉన్నారు. నేను మళ్ళీ అడిగాను. ఎంత దాచిపెట్టుకుందామనుకున్నా నా గొంతులో గాభరా నాకే వినిపిస్తుంది. లుంగీ కట్టుకుంటూ పప్పాజి నా వైపు చూపొకటి విసిరారు: “అవును నేనే!”

మాఁ తీసుకొచ్చిన చాయ్ అందుకుని ఆయనకు అందించాను. అంతకన్నా ఎక్కువగా మాట్లాడుకోవడం మా ఇద్దరికీ అలవాటు లేదు. ఆయన ఎప్పుడూ గంభీరంగా ఉండేవారు మాతో. ఆయన చాయ్ తాగుతుండగా మళ్ళీ అడిగాను.

“మరి ఆ ఇంకో పేరు? చాచాదేనా?”

“అవును, మీ చాచానే.” పప్పాజీ పడక్కుర్చీలో కూర్చుని న్యూస్ పేపర్ల వైపు చూశారు. పేపరు అందించి వచ్చాను.

గదిలో ఉన్న పప్పాజీ నాకు మదపుటేనుగును లొంగదీసిన మావటిలా అనిపిస్తున్నారు. ఆయన గురించి నాకు గర్వం, ఈర్ష్య ఒకేసారి కలిగాయి.

“ఎలా ఎక్కారు?” రాత్రి ఆయన రేడియోలో వార్తలు వినడం పూర్తవగానే అడిగాను.

“అలానే ఎక్కాం.”

“అదే ఎలా?”

“అలానే. కష్టమైంది కానీ ఎక్కాం.”

“ఒక్కసారేనా…”

“లేదు. మూడునాలుగుసార్లు.”

ఆ తర్వాత గుట్ట మీదకు పదేపదే వెళ్లి ఆ రాయిని ఎక్కడానికి ప్రయత్నించాము. నెమ్మదిగా కొన్ని రోజులకు ఎక్కే సులువు అర్థమైంది. ఆ రాయి పైన ఉన్న చిన్న చిన్న గరుకు అంచులను పట్టుకుని పైకి పాకడం వచ్చింది. రోజూ పొద్దున్న సాయంత్రం ఇదే పని నాకు.

ఒకరోజు పొద్దున్న చాయ్ తాగుతున్నప్పుడు ఆ గుట్టను ఇంటివెనుక నుంచి ఎప్పటిలానే చూశాను. ఆ రాయి మీద తెలుపురంగు చూస్తున్నప్పుడే ఈరోజు రాయి పైకి పోతాననిపించింది నాకు. స్నానం చేసి మేము ఉంటున్న గుట్ట కింద ఆంజనేయస్వామి గుడికి వెళ్లాను. అక్కడ నూటపదహారుసార్లు హనుమాన్ చాలీసా చదివితే అనుకున్న పనులవుతాయని మా ఇంట్లో నమ్మకం.

సాయంత్రం మూడింటికి నా స్నేహితుడితో కలిసి వెళ్లాను. రాయి పైకి ఎక్కాక తాగడానికి కొద్దిగా గుడుంబా, మిక్చర్ తీసుకున్నాం. ఒక గంట కష్టపడ్డాక ఇద్దరమూ పైకి చేరాం. ఆపకుండా దౌడు తీసిన గుర్రం చెరువు దగ్గరకొచ్చి విశ్రాంతి తీసుకున్నంత హాయిగా ఉండింది. మా ముందు దూరంగా మా గుట్టకున్న వంద మెట్లు కనిపించాయి. గుట్ట మీద అడ్డదిడ్డంగా కట్టిన మెట్లు ఇక్కడినుంచి చూస్తే మాత్రం వరసగా పేర్చిన పేకముక్కల్లా ఉన్నాయి. మాకు ఎడమ వైపు అస్తమిస్తున్న సూర్యుడు. మాతో తెచ్చుకున్న గుడుంబా తాగి పడుకుని నీలంగా ఉన్న ఆకాశాన్ని చూశాం కాసేపు ఏమీ మాట్లాడుకోకుండా. నేను నెమ్మదిగా ప్రక్కకు తిరిగి పప్పాజీ పేరున్న వైపు చేరాను. బోర్లా పడుకుని పప్పాజీ పేరును తాకాను చేతితో. దానికిందనే చాచా పేరు. పప్పాజీ మొహం నా కళ్ళముందు మెదిలింది. ఆయన ఏం ఆలోచిస్తారో ఆమొహంలో ఎప్పుడూ తెలిసేది కాదు. రాయి మీద పేరు రాసుకున్న చాచాకీ ఇప్పుడున్న చాచాకీ మధ్య తేడానే పప్పాజీ కోపమేమో. నెమ్మదిగా ఆ రాయిని ముద్దుపెట్టుకున్నాను. చీకటిపడుతూ ఉంది. పోదామన్నట్టు చూశాడు నా స్నేహితుడు. లేచి రాయి మీద నించుని గట్టిగా ఊపిరి తీసుకున్నాను.

పొద్దున్న నిద్ర లేచి పప్పాజీ దగ్గరకు పోయాను. నావైపు ఏమిటన్నట్టు చూసి మళ్ళీ తన పనిలో పడిపోయారు. “పప్పాజీ!” అన్నా ఊపిరి బలంగా తీసుకుని. “నేను ఆ రాయి ఎక్కాను. నిన్న.”

పప్పాజి ఏమీ మాట్లాడలేదు. చిన్నగా సకిలించినట్లు చప్పుడు చేశారు. “మంచిది” అన్నారు న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుంటూ…

“కానీ… మీ పేర్లు ఎలా రాశారు?”

పప్పాజి న్యూస్ పేపర్ చూడబోయేవాడల్లా ఆగి నా వైపు చూశారు. “ఊరికే రాస్తే పోతుందనీ ముందు చెక్కాం. తర్వాత పెయింటు పూశాం.”

“ఎలా?”

“ఎలా ఏంటి? జేబులో సుత్తి, ఉలి, చిన్న పెయింట్ డబ్బా పెట్టుకున్నాము. పైకి ఎక్కాక మీ చాచా నా కాళ్ళు పట్టుకుంటే నేను కిందకి జారి చెక్కాను. తర్వాత నే పట్టుకుంటే తను చెక్కాడు. దానిపైనే పెయింట్ వేశాం.”

రాయిపై చెక్కిన అక్షరాలు తిరగబడి ఉండడానికి కారణం తెలిసింది.

నేను పిచ్చివాడిలా చూశాను. ఆ పేర్లు రాయి పైభాగం నుంచి కనీసం రెండు అడుగుల కింద ఉన్నాయి.

ఆ తరువాత కొన్నేళ్ళకు నేను నా ఉద్యోగంలో పడిపోయాను. అయినా కొండలెక్కే పిచ్చి తగ్గలేదు. నా ఎన్‌.సి.సి అనుభవం వలన నేను కాడెట్ కోచ్‌గా మారిపోయాను. నేను పనిచేసే సంస్థ నన్ను విదేశాలలో ఒక కోర్సు చేయడానికి పంపించింది. అందులో భాగంగా ఆస్ట్రేలియాలో మౌంట్ మెక్‌క్లింటాక్ ఒకణ్నే ఎక్కి వచ్చాను. ఈసారి, నా స్నేహితులు నన్ను వదిలిపెట్టలేదు. నా జర్నలిస్టు స్నేహితుడు నాపై వార్త రాస్తానన్నాడు. దానికి నా ఫోటో కావాలి.

పర్వతాలపై ఉన్న ఫోటో ఒకటి కూడా లేదు నా దగ్గర. కోచ్‌గా పనిచేస్తున్నప్పుడు తీసినవి బాలేవన్నాడు. అప్పుడు ఇంటి వెనుక గుట్ట గుర్తుకు వచ్చింది.

ఆ ఏడు అడుగుల చీలిక దాటడానికి క్లయింబర్లు వాడే నిచ్చెనతో సహా ఈసారి నా దగ్గర చాలా పరికరాలు ఉన్నాయి. నాకిప్పుడున్న అనుభవంతో కొన్ని తాళ్లు పట్టుకుని ఎక్కడం అంత ఇబ్బంది కాలేదు. నా స్నేహితుడు ముందు చెప్పినట్లుగానే గుట్టకు ఒక కిలోమీటరు దూరం నుంచి దాని ఎత్తు తెలిసేలా ఫోటో తీశాడు.

కొన్నిరోజులకు నా ఫోటో న్యూస్ పేపర్‌లో వచ్చిందని నా స్నేహితులూ సహోద్యోగులూ నాకు ఫోన్లు చేసి మెచ్చుకున్నారు. అప్పటికి నేను ఇంకో బాచ్‌కి కాడెట్ కోచ్‌గా ఊరికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. నా జర్నలిస్టు స్నేహితుడు వాట్సాప్‌లో ఆ వార్తను నాకు పంపాడు కానీ నెట్‌వర్క్ సరిగ్గా అందక నేను చూడలేకపోయాను. ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఆరున్నర అయింది. మెట్ల నుండి ఎడమ వైపుకి తిరిగి ఇంట్లోకి అడుగు పెడుతుండగానే పప్పాజీ ఎదురు వచ్చారు.

“నీ గురించి పేపర్‌లో పడింది.” పప్పాజీ చేతులు వణుకుతున్నాయి.

“అవును పప్పాజీ…” పప్పాజి చేతిలో ఇంకా పేపర్ ఉంది. ఎప్పటినుంచి పట్టుకుని వున్నారో!

“నా స్నేహితులెందరో ఆ రాయి మీదకు వెళ్ళడానికి ప్రయత్నించారు. కొందరైతే పైకి ఎక్కి మా పేర్లు కొట్టేయాలని ప్రయత్నించారు కూడా… కానీ ఎవరూ అక్కడిదాకా ఎక్కలేకపోయారు.” పప్పాజి చేతి ఊపుకి న్యూసుపేపరు గరగరలాడింది. “ఎవరూ ఎక్కలేకపోయారు కాని నువ్వు ఎక్కగలిగావు.” పప్పాజి నన్ను చూసి నవ్వడానికి ప్రయత్నించారు. ఆయన కళ్ళలో నీటి పొర ట్యూబ్ లైట్ కాంతిలో మెరుస్తోంది.

న్యూస్ పేపర్ తీసి చూశాను.

మా ఇంటి వెనుక గుట్ట, దానిపై రాయి, ఆ రాయి పైన పప్పాజి పేరు, కింద చాచా పేరు, రాయి మీద కూర్చున్న నేను, పక్కనే అస్తమిస్తున్న సూర్యుడూ…

పప్పాజి మళ్ళీ వందోసారి ఆ ఫోటో చూస్తున్నట్టు ఉంది. ఎండిన ఆ కళ్ళలో చెమ్మ చేరుతోంది.

“ఎవరూ ఎక్కలేకపోయారు. నువ్వు ఎక్కగలిగావు! నా తర్వాత!” పప్పాజి నా భుజాన్ని తట్టి తల వెనక్కి విసిరి నీళ్లు నిండిన కళ్ళతో నవ్వుతూ చూశారు.
(2018 నాటా సువనీరులో ప్రచురించిన ప్రతికి పరిష్కృత పాఠాంతరం.)
----------------------------------------------------
రచన: అపర్ణ తోట, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, September 3, 2019

భేదోపాయం


భేదోపాయం




సాహితీమిత్రులారా!

చీకటి పడుతోంది.
ఊరి బయట కాలవ గట్టు.
కోదండరామయ్య గారు వాచ్‌ కేసి మరోమారు చూసుకున్నారు విసుగ్గా.
భగ్గుమంటున్న వారి హృదయం ఎదురుగా ఆకాశంలో ప్రతిఫలిస్తోంది.
ఎలాగో నిముషాల్ని గంటలుగా గడిపి మామూలు సమయానికి అందరితో పాటు ఆయనా లేచేరు.
అందరూ లేచి ఇళ్ళకి బయల్దేరేరు.
పైకి నవ్వుతూ మాట్లాడుతున్నారే గాని వారి మనసులో లావా సముద్రాలు సుడులు తిరుగుతున్నాయి.
ఇంటికి ఎలా వచ్చి పడ్డారో వారికే తెలీలేదు.
అవమాన జ్వాలలు ఒళ్ళంతా కాల్చేస్తుంటే తమ ఏ.సి. ఆఫీసు రూమ్‌ లోకి వెళ్ళి ఆశీనులయేరు.

ఐతే
జీవితంలో ఎంతో కాలాన్ని గడ్డు సమస్యల పరిష్కారంలో గడిపి అందులో ఆరితేరిన వారు గనక కొంచెం స్థిమితంగా ఆలోచించటం మొదలెట్టేరు.
క్రమక్రమంగా ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకున్నారు.
వచ్చిపడ్డ సమస్య మీద తమ మేధస్సుని కేంద్రీకరించేరు.

ఇప్పుడు తాము పరిష్కరించాల్సిన సమస్య స్వరూప స్వభావాలు ఏమిటంటే
పదేళ్ళ క్రితం తాము డిస్ట్రిక్ట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు తమ దగ్గర యుడిసిగా పనిచేసేవాడు వెంకట్రావు. తను రెండేళ్ళ క్రితం రిటైరైతే, అతను ఏడాదినాడు రిటైరయ్యాడు. అనుకోకుండా యిద్దరూ క్రితం వేసవిలో అమెరికాలో కలుసుకున్నారు, కొడుకుల్ని చూడటానికి వెళ్ళి.

కోదండరామయ్య గారి అబ్బాయి సురేష్‌, వెంకట్రావు గారి అబ్బాయి శేఖర్‌, యిద్దరూ ఒక వూళ్ళోనే వుంటున్నారు అమెరికాలో. శేఖర్‌ రెండేళ్ళ క్రితం ఓ ఇంటర్నెట్‌ కంపెనీలో పనిచేసి ఆ కంపెనీని మరో కంపెనీ నాలుగు బిలియన్లకి కొంటే ఆ దెబ్బలో తనూ ఓ నాలుగు మిలియన్లు సంపాయించుకున్నాడు. సురేష్‌, అతని భార్య పద్మ కూడా యిద్దరూ ఉద్యోగాలు చేస్తూ బాగానే సంపాయించేరు కాని, శేఖర్‌ వాళ్ళు మిలియన్‌ డాలర్ల యింట్లో వుంటూ టాప్‌ ఆఫ్‌ ది లైన్‌ మెర్సెడీస్‌ కార్లలో తిరుగుతుంటే సురేష్‌ వాళ్ళు మూడు లక్షల యింట్లో వుంటూ హోండా ఎకార్డుల్లో తిరుగుతున్నారు.

అలా అనుకోకుండా అమెరికాలో కలిసిన కోదండరామయ్యా, వెంకట్రావు గార్లు ఇండియాకి తిరిగొచ్చాక కూడా అప్పుడప్పుడు కలుసుకుని పిచ్చాపాటీ మాట్లాడుకోవటం మొదలెట్టేరు.

కోదండరామయ్య గారికి ఆరోగ్యం మీద అమిత శ్రద్ధ. భోజనం, వ్యాయామం విషయాల్లో చాలా జాగ్రత్త. అంచేత, రిటైరైన దగ్గర్నుంచీ రోజూ సాయంత్రం రెండు మైళ్ళు నడవటం అలవాటు చేసుకున్నారు. అలా నడుస్తూండగా యింకొంతమంది యిలాటివాళ్ళే తారసపడటం, అందరూ కలిసి వూరికి దూరంగా వున్న కాలవ దాకా వెళ్ళి అక్కడ గట్టు మీద కొంచెంసేపు కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకోవటం ఆనవాయితీ అయ్యేయి.

ఓ రోజు వెంకట్రావు తమని చూడటానికి వచ్చే సమయానికి కోదండరామయ్య గారు నడవటానికి బయల్దేరుతున్నారు. తమతో పాటు రాకూడదా అని వెంకట్రావునీ ఆహ్వానించేరు. అప్పట్నుంచి రోజూ వెంకట్రావు గారు కూడా ఆయన్తో పాటే నడవటం సాగించేరు.

ఐతే యీ పద్ధతి వల్ల కోదండరామయ్య గారికి ఎదురుచూడని తలనొప్పి ఒకటి తయారయ్యింది. ఎందుకంటే

వాళ్ళతో పాటు సాయంత్రం నడిచే బృందంలో దాదాపు అందరికీ కొడుకులో కూతుళ్ళో అమెరికాలో వుండటం వల్ల, వాళ్ళ సంభాషణలు తరుచుగా అమెరికా చుట్టూ తిరగసాగేయి. వాటిలో ఎక్కువ సమయం తమ తమ అమెరికా ప్రయాణాలూ, అక్కడ తాము కన్న, విన్న, (టీవీలో) చూసిన విశేషాల గురించిన విషయాల్తో గడుస్తోంది. ఐతే, అలా మొదలైన ఆ సంభాషణలు సహజంగానే తమ కొడుకుల, కూతుళ్ళ, అల్లుళ్ళ సంపాదనలు, వాళ్ళ యిళ్ళూ, కార్లూ, ఖర్చులూ యిలాటి ఆసక్తికరమైన విషయాల మీదికి మళ్ళటానికి ఎక్కువ కాలం పట్టలేదు.

ఆ రకం సంభాషణల్లోంచి తమ బృందంలోని అందరి సంతానాల్లోనూ వెంకట్రావు సంతానం ఆర్థికంగా వున్నత స్థాయిలో వుందని తేలిపోవటానికీ, దానికి అందరూ అంగీకరించటానికీ కూడ ఆట్టే పట్టలేదు.

దాంతో, సంకల్పితంగానో అసంకల్పితంగానో ఆబృందంలో వెంకట్రావుకి ఒక ప్రత్యేక గౌరవం కలుగుతున్నట్టు కోదండరామయ్య గారికి అనిపించటమూ మొదలయ్యింది.

అప్పటివరకు, వున్నత పదవుల్లో వుండి రిటైరైన తమకు సంక్రమించిన గౌరవస్థానాన్ని, తమకంటే ఎంతో తక్కువ పదవుల్లో వుండి రిటైరైన వెంకట్రావు ఆక్రమించేస్తున్నట్టు ఆయనకు చూచాయగా నమ్మకం కూడ కుదిరిపోయింది.

ఈ పరిస్థితులు యిలా వుండగా

పులి మీద పుట్ర లాగా సురేష్‌కీ, వాళ్ళావిడ పద్మకీ ఒకేసారి ఉద్యోగాలు వూడేయి, అమెరికాలో ఆర్థికమాంద్యం పుణ్యమా అని.

ఐతే ఆ అగ్నికి ఆజ్యం యెలా కలిసిందంటే ఈ విషయం కోదండరామయ్య గారి చెవికి చేరింది వెంకట్రావు గారి ద్వారా! అందులోనూ తమ బృందం అందరూ కాలవగట్టు మీద కూర్చుని మాట్టాడుకుంటున్నప్పుడు!

కోదండరామయ్య గారికి జీవితంలో యెప్పుడూ రానంత వుద్రేకం వచ్చింది అలా అది విన్నప్పుడు.

వెంకట్రావు ఆ విషయం తమతో విడిగా అని వుండొచ్చును.
అసలు ఆ విషయంతో అతనికి ఎలాటి సంబంధమూ లేదు గనక బుద్ధిగా నోరు మూసుకుని వూరుకుంటే యింకా బాగుండును.
సురేష్‌ తనే స్వయంగా తమకి చెప్పేవాడో లేకపోతే యిలాటి విషయాలు చెప్పటం యెందుకులే అని తనలోనే దాచుకునే వాడో!

వెంకట్రావు ఆ విషయం అందర్లోనూ చెప్పటమే కాదు, ఆ చెప్పటం కూడా వెక్కిరింత ధోరణిలో, తమకి అవమానం కలిగించే విధంగా చెప్పాడని కోదండరామయ్య గారికి గట్టి అభిప్రాయం కలిగింది.
పైగా, అతను కావాలనే అలా చేశాడని కూడా ఆయనకి అర్థమై పోయింది.
వెంకట్రావు కొడుకు బోలెడు సంపాయించి అన్ని రకాల భోగభాగ్యాలూ అనుభవిస్తూ వుంటే తమ కొడుకూ కోడలూ ఉద్యోగాలు ఊడిపోయి ఊసురోమంటూ తిరుగుతున్నారని చెప్పి అలా తను (వెంకట్రావు) తమ (కోదండరామయ్య) కన్నా ఎంతో ఎత్తున వున్నానని చూపించుకునే యీధోరణిని ఎలాగైనా సరే అరికట్టటం తక్షణ కర్తవ్యంగా వారికి స్పష్టమయింది.

ఇదీ ఇప్పుడు ఆయనకి ఎదురైన సమస్య!

ఇలా తమంతటి వాణ్ణి పట్టుకుని అందరి ముందూ తలెత్తుకోకుండా చేసిన వెంకట్రావు కళ్ళు ఆకాశం నుంచి భూమ్మీదికి దించటం ఎలా?

ఎంతో సేపు అలా ఆలోచిస్తూనే వుండిపోయేరు కోదండరామయ్య గారు.
ఎన్నెన్నో మార్గాలు స్ఫురించేయి కానీ యేదీ తృప్తికరంగా కనిపించలేదు.
ఈలోగా ఆయన భార్య సరస్వతమ్మ గారు ఎన్నో సార్లు వచ్చి తొంగి చూసి, ఆయన చాలా దీర్ఘాలోచనలో వుండటం గమనించి వెనుదిరిగి వెళ్ళిపోయేరు.

కొంతసేపయాక కోదండరామయ్య గారు కూడా లేచి వెళ్ళి మౌనంగా మంచం మీద పడుకుని మళ్ళీ ఎంతోసేపు ఆలోచనల్లో మునిగిపోయేరు. అలా వుండగానే కునుకుపట్టటం, యెప్పుడో హఠాత్తుగా మెలకువ రావటం జరిగేయి. బహుశా నిద్రలో కూడా అదే విషయాన్ని గురించి ఆలోచించటం వల్ల కాబోలు, నిద్రలోనే ఒక పథకం రూపుదిద్దుకో సాగింది. మెలకువ రావటం తోనే ఆయన కళ్ళ ముందు మెదిలిందా ఆలోచన. వెంటనే దాన్ని అన్ని కోణాల్నుంచి జాగ్రత్తగా పరిశీలించి తృప్తి చెందేక గాని హాయిగా నిద్రకి ఉపక్రమించ లేక పోయేరు వారు.

మర్నాడు యథాప్రకారంగా సాయంత్రం షికారు కెళ్ళినప్పుడు తమ బృందం సభ్యులందరూ వచ్చేక తమ పథకంలోని తొలి పావుని కదిపేరు కోదండరామయ్య గారు. కొడుకులు అమెరికాలో వుంటున్న వాళ్ళని వుద్దేశించి మాట్టాడుతూ, అమెరికాలో వుంటున్న కుటుంబాల్లో యెలా ఆడవాళ్ళకి ప్రాధాన్యత యెక్కువో అక్కడ వుండగా తాము గమనించిన కొన్ని సంగతులు వివరించేరు. మగపిల్లల తల్లిదండ్రుల కన్నా ఆడపిల్లల తల్లిదండ్రులే పదేపదే అమెరికాకి వెళ్ళే అవకాశాలు యెందువల్ల యెక్కువో విశ్లేషించేరు.
దాంతో, ఉత్సాహం తెచ్చుకున్న మిగిలిన వాళ్ళు కూడ తమ అనుభవాల్ని వినిపిస్తూ ఓ చెయ్యి సాయం వేసేరు, వాళ్ళకి తెలీకుండానే.
పనిలో పనిగా కొడుకుల మీద కోడళ్ళ పెత్తనాల మూలంగా వియ్యంకులకి కొమ్ములు బారుగా పెరుగుతున్న వైనాన్ని కూడా ఉద్ఘాటించేరు.

అలా రంగం సిద్ధమయాక కోదండరామయ్య గారు అప్పటిదాకా భద్రంగా దాచిపెట్టిన ఒక అస్త్రాన్ని బయటికి తీసి వెంకట్రావు మీదికి గురిపెట్టి సంధించేరు
“మనందర్లోనూ వెంకట్రావు గారు అదృష్టవంతులండీ! వాళ్ళ వియ్యంకులు ఎంతో ఆస్తిపరులైనా ఆయన్ని యిప్పటికీ ఎంతో గౌరవంగా చూస్తారు” అన్నారు ఎంతో నిజాయితీని ధ్వనింపజేస్తూ. (ఐతే వెంకట్రావు గారికీ వాళ్ళ వియ్యంకులకీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని, దాన్ని ఆసరాగా చేసుకునే తమ పథకాన్ని ఆయన రూపొందించారనీ మనకి తెలుసు గాని వెంకట్రావు గారికి తెలీదు కదా! అంచేత )

కళ్ళు మిరుమిట్లు గొలిపే అగ్నిలోకి కళ్ళు మూసుకుని దూసుకు వెళ్ళే శలభంలా ముందూ వెనకా చూచుకోకుండా దూకేశారు వెంకట్రావు గారు.
“అయ్యయ్యో, మా వియ్యంకుల సంగతి మీకు తెలీదండి సార్‌! అంత త్రాష్టులు ఈ భూప్రపంచంలో మరొకరుండరు. ఏదో పెద్ద ఆస్తి వున్నట్టు అంతా నాటకం. లోపలంతా డొల్లే. అప్పుడెప్పుడో వున్న ఆస్తంతా అతగాడి తిరుగుళ్ళతో మట్టిగొట్టుకు పోయింది. ఆ మహానుభావుడికి లేని మంచిగుణాలు లేవు. ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్న ఆర్భాటం వెనక వుందంతా నా కొడుకు కష్టార్జితం. అక్కడ వాడు రాత్రుళ్ళూ పగళ్ళూ కష్టపడి సంపాయించిందాన్ని నా కోడలు మహాతల్లి తెచ్చిపోస్తుంటే యిక్కడ వీళ్ళు కులుకుతున్నారు గాని యిది సొంతం కాదు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నా కొడుకు వట్టి చవట. వాడి పెళ్ళాం వాడి చెవులు పట్టుకుని ఆడిస్తుంది. అదంతా చూసి వొళ్ళు మండేగా ఆర్నెల్లు వుందామని వెళ్ళినవాణ్ణి రెణ్ణెల్ల లోనే తిరిగొచ్చేశాను!..” ఆవేశంగా ఎన్నాళ్ళుగానో కడుపులో దాచుకున్న తన అక్కసునంతా వెళ్ళగక్కేరు వెంకట్రావు గారు.

ఆ మాటలకి సానుభూతితో కదులుతున్న అక్కడి తలల్ని చూసేసరికి యింకా రెచ్చిపోయి తన వియ్యంకుల్ని ఎడాపెడా కడిగి పారేసి కసి తీర్చుకున్నాక గాని పూర్తిగా శాంతించలేక పోయారు వెంకట్రావు గారు.
“ఊరుకోండి వెంకట్రావు గారూ! మీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇది మనందరికీ వున్న బాధే కదా! ఐనా మీ వియ్యంకుల్ని యిలా అందరి ముందూ మరీ అంతగా తిట్టకండి. పొరపాటున ఈ విషయం గనక వాళ్ళ చెవుల్లో పడితే మీ సంబంధాలు యింకా దెబ్బతింటయ్‌!” అన్నారు కోదండరామయ్య గారు, ఆయన్ని యింకా రెచ్చగొడుతూ.
“దెబ్బ తిన్నివ్వండి, యింత కన్నా యింకా ఏం దెబ్బతింటయ్‌? ఇప్పటికి మేం ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుని రెండేళ్ళయింది. ఎప్పుడన్నా శుభకార్యాలకి పిలవటం మానేసి కూడా ఎంతో కాలమైంది. ఇంకా ఎందుకండీ వాళ్ళ గురించి వెనక్కి తగ్గటం?” అంటూ మళ్ళీ విరుచుకు పడిపోయారు.

అలా కోదండరామయ్య గారి పథకంలో తొలిఘట్టం విజయవంతంగా ముగిసింది. ఇక యీ సమాచారాన్నంతా, కొంత సొంత కవిత్వంతో సహా, వెంకట్రావు గారి వియ్యంకుడు వీరశంకరం గారికి తరలించటం పెద్ద కష్టం కాలేదు కోదండరామయ్య గారికి. ఐతే ముందు జాగ్రత్తగా తమ చేతికి మట్టి అంటకుండా నమ్మకమైన మరొకరి ద్వారా వీరశంకరం గారి తమ్ముడు ఉమాశంకరరావు గారికి చేర్పించారు. ఆయన వూహించినట్టే అక్కడినుంచి యింకా చిలవలు పలవలు చేర్చుకుని అవి అప్పటికప్పుడే వీరశంకరం గారికి చేరేయి. వారు వీరావేశంతో ఆ విషయం తన భార్య సుందరమ్మ గారికి చెప్పటంలో ఆ మాటలకి ఇంకాస్త పదును, మరికొంచెం వెటకారం, కొత్తగా కలిపిన వ్యంగ్యం కూడా చేరేయి.

దాంతో ఆ రాత్రికి వాళ్ళమ్మాయి శిరీష అమెరికా నుంచి ఫోన్‌ చేసే సమయానికి సుందరమ్మ గారు రూపం ధరించిన కోపంలా వున్నారు. మామూలుగానే మనసులో మాట దాచుకునే అలవాటు లేని సుందరమ్మ గారు ఆరోజు తమకున్న భాషా పరిజ్ఞానం అంతటినీ వుపయోగించి తమ మనసుని కూతురి ముందు పరిచేరు.

అలా, ముచ్చటగా మూడు రోజుల్లో వెంకట్రావు గారు తమ వియ్యంకుల్ని విమర్శిస్తూ అన్న మాటలు కొత్త కొత్త వేషాలు వేసుకుని వింత వింత రంగులు పూసుకుని వారి కోడలు గారిని చేరేయి.
ఇండియాలో ఒక కాలవగట్టున పడ్డ నిప్పురవ్వ అమెరికాలో శేఖర్‌ వాళ్ళింట్లో దావానలంగా ఎదిగింది.

ఆ రోజు సాయంత్రం శేఖర్‌ యింటికి వచ్చేటప్పటికి శిరీష కాళికావతారంలో వుంది. శేఖర్‌ తండ్రి తన తల్లిదండ్రుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడటానికి వాళ్ళు చేసిన అంతపెద్ద నేరం ఏమిటో చెప్పితీరాల్సిందే అని పట్టుపట్టింది.
ఎంతో గొప్ప కుటుంబంలో పుట్టిన తనని వెంకట్రావు లాంటి లేకివాళ్ళ కుటుంబంలోకి యివ్వటమే వాళ్ళు చేసిన మొట్టమొదటి పెద్ద నేరమని తనే సమాధానం కూడ చెప్పింది.
తమ పెళ్ళయిన యీ పదేళ్ళలోనూ వెంకట్రావు తనని, అంటే వాళ్ళ యింటి కోడల్ని, ఎంత అమర్యాదగా, అగౌరవంగా చూశాడో పది ఉదాహరణలు వల్లించి మరీ వివరించింది.
ఇప్పుడిలా ఏ కారణమూ లేకుండా తన తల్లిదండ్రుల్ని పురుగులు కింద తీసిపారేస్తూ పదిమంది పెద్దమనుషుల మధ్య తిట్టిన వాడితో యింకా తనకి బంధుత్వం ఎందుకు వుండాలని నిగ్గదీసింది.
అలాటి వాడి యింటిగడప తను మళ్ళీ తొక్కేది లేదని శపథం చేసింది.
అతను యింక తన గడప తొక్కితే సహించేది లేదని కూడా స్పష్టం చేసింది.
ఇక చివరగా, తన కొడుకు (అంటే శేఖర్‌) యిక్కడి నుంచి నెలనెలా బోలెడంత డబ్బు పంపుతుంటే తేరగా తింటున్నది అరక్క యిలాటి విపరీత ప్రవర్తనకి దారితీస్తోంది గనక యిక నుంచి అతనికి నయాపైసా పంపినా తను విడాకులిచ్చేది ఖచ్చితమని ఖరాఖండిగా చెప్పేసింది.
చెప్ప వలసిందంతా చెప్పేసి భోరున ఏడుస్తూ పడగ్గదిలోకి పరిగెత్తి తలుపేసుకుంది.

అప్పటిదాకా అవాక్కై విన్న శేఖర్‌కి అంతా అయోమయంగా వుంది. అర్థమయీ కానట్టుగా వుంది. గజిబిజిగా వుంది. ఏం చెయ్యాలో తోచకుండా వుంది.
ముందుగా, బిక్కుబిక్కుమంటూ చూస్తున్న మూడేళ్ళ కొడుకు వినయ్‌ని బుజ్జగించి ఓ కార్టూన్‌ డీవీడి పెట్టి టీవీ యెదురుగా కూర్చోబెట్టేడు.
తరవాత వెళ్ళి శిరీషని సమాధానపరచటానికి ప్రయత్నించేడు.
ఎక్కిళ్ళ మధ్య ఆమె చెప్పిందంతా విన్నాడు.

వెంటనే యింటికి ఫోన్‌ చేసేడు. తండ్రితో మాట్లాడేడు. నిదానంగా విషయం అంతా రాబట్టేడు. శిరీష చెప్పింది నిజమేనని నిర్ధారణకి వచ్చేడు.
ఆమెకి వచ్చినంత కాకపోయినా అతనికీ బాగానే కోపం వచ్చింది.
శిరీషని పెళ్ళి చేసుకోవటం వల్ల ఆమె కుటుంబం ద్వారా తనకి అందిన స్థాయి వల్లనే తను యింతదూరం రాగలిగేనని అతని నమ్మకం. ఆ విషయం తన తండ్రికి ఎందుకు అర్థం కాదో అతనికి అర్థం కాలేదు. తలుచుకునే కొద్ది తన తండ్రి ఎంత గర్విష్టిగా మారేడో, ఎంత ఫూలిష్‌గా ప్రవర్తిస్తున్నాడో అతనికి తెలిసొచ్చింది. శిరీష చెప్పినట్టు అతని ఈ ప్రవర్తనకి ముఖ్య కారణం తన దగ్గర్నుంచి తేలిగ్గా క్రమం తప్పకుండా అందుతున్న డబ్బేనని కూడ అర్థం చేసుకున్నాడు.

అలా జ్ఞానోదయం కలిగాక మళ్ళీ తండ్రికి ఫోన్‌ చేసేడు.
జీవితంలో తొలిసారిగా ఆయనకి ఘాటైన చీవాట్లు పెట్టేడు. తన కుటుంబం ఎంత ఉన్నత స్థితికి వచ్చినా తన వెనకటి గుణాన్ని మాత్రం మానుకోలేకపోతున్నాడనీ, ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో యింత వయసొచ్చినా నేర్చుకోలేక పోయాడనీ ఫోన్లోనే గనక ముందుగా అనుకున్న కంటే యింకాస్త గట్టిగానే మందలించేడు. తన యీ ప్రవర్తనని మార్చుకోకుండా యిలాగే తన (శేఖర్‌) పరువు పోగొడుతుంటే తమ మధ్య సంబంధాలు దెబ్బతింటాయని కూడా హెచ్చరించేడు. కోపంగా ఫోన్‌ పెట్టేసేడు.

అదంతా చూసి, విన్న తర్వాత గాని శిరీషకి కొంత ఊరట కలగలేదు.
“ఇకనుంచి మీ నాన్నకి నెలకో వందడాలర్లకి మించి పంపితే మాత్రం నేనూరుకునేది లేదు. అలాగే, మళ్ళీ ఇక్కడికి విజిట్‌కి రమ్మని పిలవకండి” అంటూ తీవ్రంగా ఆర్డర్‌ వేసింది శేఖర్‌కి.
“ఔను. అలా చేస్తేనే గాని ఆయన కాస్త నేల మీద నడవడు” అని ఒప్పేసుకున్నాడతను.

ఇదంతా జరిగి తమకు నెలనెలా వచ్చే ఐదు వందల డాలర్లు కాస్తా వందకి దిగజారిపోయాక కాని తన పరిస్థితి తెలిసిరాలేదు వెంకట్రావు గారికి.
అప్పట్నుంచి ఆయన బుద్ధి తెచ్చుకుని తన హద్దుల్లో మెలగసాగేడు.
కాలవగట్టుకి నడకకి వెళ్ళటం మానేసి కిళ్ళీకొట్టు దగ్గర కబుర్లు చెప్పటం మొదలెట్టేడు.

అలా, కోదండరామయ్య గారి పథకం దివ్యంగా ఫలించింది.
కాని వెంకట్రావు పతనం వెనక వున్నది తమ హస్తమేనని చెప్పుకోవటానికి మాత్రం వారు కొన్నాళ్ళు తటపటాయించేరు.
ఎందుకంటే, “ఆఫ్టరాల్‌ ఒక యూడీసీ” ని కిందికి లాగటానికి తమంత వారు పూనుకోవాల్సి రావటం వారి కీర్తికి వన్నె తెస్తుందో లేక మచ్చ ఔతుందో వారు తేల్చుకోలేకపోయేరు.
------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు, 
ఈమాట సౌజన్యంతో

Sunday, September 1, 2019

తీరా నేను విముక్తమయ్యాక!


తీరా నేను విముక్తమయ్యాక!





సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి............

పొందినది పోగొట్టుకోకూడదని పాకులాడిన నాకు
అసలు నువ్వు పొందినదేమీ లేదని
తెలియజెప్పిన నువ్వు

గూడు నాదేనన్న భ్రమలో
మాయాద్వీపపు పక్షినై విహరించిన నాకు
బంధం కేవలం భావనే అన్న ఎరుక కలిగించిన నువ్వు

నీ కళ్ళలో నా నీడ కోసం
వెతికి వెతికి ఓడిపోయాక
ఇప్పుడు నా బొమ్మ ఎదురుగా నువ్వు

చెలిమి ఊసులు చెప్పే చెలికాని కోసం
మాటల మాలలు కూర్చుకొని
మమతల తావినై మనసంతా నిండిపోవాలని
పరితపించి పరితపించి పరాజయం పాలయ్యాక
చేతిలో దండతో నువ్వు

నీ దాహం తీర్చాలన్న తపనతో
నదిగా ప్రవహించినా గుర్తించని నువ్వు
సాగరంగా విశ్రమించాక
గొంతు ఎండిపోయేలా దుఃఖిస్తూ

తీరా నేను విముక్తమయ్యాక!

జీవితమంతా ఆత్మీయ స్పర్శ కోసం అలమటించిన నేను
హిమ శీతల స్పర్శలో సేద తీరాక!
---------------------------------------------------
రచన: నల్లపనేని విజయలక్ష్మి, 
ఈమాట సౌజన్యంతో