Thursday, March 30, 2023

క రాజు కథలు - సింగీతం శ్రీనివాసరావు గారు

 క రాజు కథలు - సింగీతం శ్రీనివాసరావు గారు




సాహితీమిత్రులారా!

సింగీతం శ్రీనివాసరావు గారు…

ఈ పేరు వినగానే కొందరికి ఆదిత్య 369, భైరవద్వీపం సినిమాలు గుర్తుకువస్తాయి. ఇంకొందరికి పుష్పక విమానం, విచిత్ర సోదరులు, అమావస్య చంద్రుడు, మైఖేల్ మదన కామరాజు గుర్తుకువస్తే, మరికొందరికి మయూరి, పంతులమ్మలు గుర్తుకువస్తాయి. మొత్తంగా చూస్తే భారతీయ సినిమాని వైవిద్యభరితమైన మార్గాలలో కొత్తపుంతలు తొక్కించి ఘన విజయాలు అందుకున్న దిగ్దర్శకుడాయన. సింగీతం గారి సినిమాలలో గీతం, సంగీతం కూడా ఉత్తమ స్థాయిలోనే ఉంటాయి. వరుస విజయాల దర్శకుడు క్రిష్, ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ వంటి ఎందరో దర్శకులకు స్ఫూర్తి మూర్తీ ‘సింగీతం’గారే. ఇప్పుడున్న పాత, కొత్తతరం దర్శకులలో సింగీతంగారితో సరిపోలే స్థాయి ఉన్నవారిని చూపించడం కొంచెం కష్టమేనేమో!

తొంభై ఏళ్ళ వయస్సు అన్నది ఆయనకు అస్సలు పట్టని విషయం. బహుశా అదే ఆయన ఆరోగ్య రహస్యం. ఈ-టీవి ‘పుష్పక విమానం’ కార్యక్రమంలో ఆయన తన సినిమా సంగతులు చెప్పే విధానం చాలా ఆహ్లాదభరితంగా ఉండేది. ఆయా సినిమాలకు తనతో కలిసి పనిచేసిన టెక్నీషియన్స్‌ని తలచుకుంటూ, వారు తన సినిమాల విజయాలకు ఎలా భాగస్వాములయ్యారో వివరించే తీరు ఆయన వినమ్రతకు, స్వచ్ఛమైన హృదయానికి అద్దం పడుతుంది.

“మీ సినిమాలకు మీరే మాటలు రాస్తే బావుంటుంది” అని జంధ్యాల గారు నాతో చాలాసార్లు చెప్పారు. ఆయన మాటల్ని కాదనలేక “పుష్పక విమానం” తీశాను. అన్న చతురత సింగీతం గారిది. ఇటువంటి హాస్య చతురుడు కథా రచనకు పూనుకుంటే మరి ఆ కథలకు హాస్యం అంటకుండా ఎలా ఉంటుంది? ఒకలా చెప్పాలంటే ఇప్పటి సమాజం పోకడల మీద సింగీతం గారు సంధించిన సెటైరాస్త్రం ఈ ‘క రాజు’ కథలు. ఇందులో 21 కథలున్నాయి. ఒక్కో కథా ఒక్కో తీరుగా చిరుమందహాసాల, మందహాసాల మార్గాలలో సాగుతుంది. ప్రతీ కథ చివరా ‘క రాజు’ తన మంత్రికి చెప్పే విషయాలన్నీ మనం మన చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థ చేసుకోవడానికి ఉపయోగపడే ధర్మసూక్ష్మాలే.

జీవిత సత్యాలని తేలిక మాటల్లో చెక్కి, వాటిని హాస్యపు తొడుగులలో చుట్టి కథలుగా అచ్చేసిన పుస్తకమిది. ఈ పుస్తకం నాకు నచ్చడానికైనా, మీకూ నచ్చతుంది అనడానికైనా ఇంతకుమించి కారణమేముంటుంది!! 

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

No comments:

Post a Comment