Saturday, March 25, 2023

మద్యం అలవాటు లేనివారు ఏ బ్రాండుతో మొదలు పెట్టాలి?

 మద్యం అలవాటు లేనివారు

ఏ బ్రాండుతో మొదలు పెట్టాలి?




సాహితీమిత్రులారా!

మానసిక ఒత్తిడితో ఆరోగ్యం చెడగొట్టుకోవడం కంటే మద్యం సేవించడమే ఉత్తమం. కానీ మీరు ఎంచుకునే బ్రాండ్ల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి.

ముందుగా మీరు యండమూరి, మధుబాబు బ్రాండ్లతో మొదలు పెట్టండి. ఆ రెండు బ్రాండ్లూ ముప్పై, నలభై యేళ్ళుగా చాలా రిలయబుల్ బ్రాండ్లుగా పేరుమోసినవి. చాలామంది వాటితోనే మత్తులో జోగడం మొదలు పెట్టారు. ఆ మత్తు మహత్తు తెలిశాక, ఇంకా ఎక్కువ మత్తిచ్చే వాటికోసం వెతుక్కుని మరీ వెళ్ళేవారు. అలానే కాసేపు హాయిగా ఊహాలోకాల్లో విహరించాలంటే యద్దనపూడి బ్రాండు వాడండి. అక్కడనుండి మళ్ళా ఈలోకంలో దభీమని పడాలంటే రంగనాయకమ్మ బ్రాండు పుచ్చుకోండి. కిక్కుతో పాటూ భాష కూడా రావాలంటే మల్లాది, శ్రీపాద బ్రాండ్లు వాడండి. ఇవి ఏమాత్రం కల్తీలేని అచ్చతెలుగు బ్రాండ్లు. ఇక పాతబడే కొద్దీ ఎక్కువ కిక్ ఇవ్వడానికి గురజాడ బ్రాండ్, తాగేకొద్దీ మీ రక్తం ఎరుపెక్కి పోవాలంటే శ్రీశ్రీ బ్రాండ్‌ వాడండి. ఒకవేళ ఎరుపుతో పాటూ కాసింత లాలిత్యం కూడా కావాలంటే దాశరథీ బ్రాండ్‌ వాడండి. మీరు మొదట్లోనే విశ్వనాథ, చలం వంటి బ్రాండ్ల జోలికి పోకండి. అవి చాలా కాస్ట్‌లీ బ్రాండ్లు. వాటిని ఒకసారి టేస్ట్ చూస్తే ఇక వదిలి పెట్టడం కష్టం. అంతే కాక ఆ రెండింటి టేస్ట్‌లూ పూర్తిగా డిఫరెంట్ కూడా. వాటిలో విశ్వనాథ బ్రాండ్‌కు బ్రాండ్ సమ్రాట్ అనే టాగ్ లైన్ కూడా ఉంది.

Rajan PTSK గారికి ధన్యవాదాలు


1 comment:

  1. మీ ఈ పోస్ట్ టైటిల్ చూడగానే అసలెందుకు కొత్తగా మొదలెట్టడం అందామనుకున్నాను. కానీ మీ పోస్ట్ “సారాం”శం చదివాక తమాషాగా బాగా వ్రాసారనిపించింది 👌.

    ఆనాటి పాఠకులకు మీరన్నట్లు అంత “కాస్ట్లీ బ్రాండ్” అలవాటు చేసిన మహానుభావుడు చలం గారి సమాధి అరుణాచలంలో ఓ ఫుట్-పాత్ మీద పడి ఉంటుంది. మొన్నీ మధ్య ఆ ఊరు వెళ్ళినప్పుడు ప్రత్యేకించి వాకబు చేసి వెళ్ళి చూడగానే ….. మత్తంతా దిగిపోయి ఆవేదన కలిగింది. రమణ ఆశ్రమం లోని కొంత మంది జనాలు చలం గారి పేరు తెలియనట్లే ఉంటారు 😧.

    https://www.google.com/search?hl=en-GB&rlz=1CDGOYI_enIN917IN917&cs=0&output=search&q=chalam+gari+samadhi&ludocid=1175199576424704479&gsas=1&ibp=gwp;0,7&lsig=AB86z5WBFPOwFctcmzd846iiILrv&kgs=2e35d3ed670b82d3&shndl=-1&source=sh/x/kp/local/3








    ReplyDelete