Thursday, November 3, 2022

వేదములు, ఉపనిషత్తులలో ఏముంది?

 వేదములు, ఉపనిషత్తులలో ఏముంది?




సాహితీమిత్రులారా!

చతుర్వేదములు - దశోపనిషత్తులు

వేదము అనే మాట విద్ అనే ధాతువు నుండి పుట్టింది. ఏది తెలుసుకుంటే మరేదీ తెలుసుకోవలసిన అవసరము లేదో ఆ పరిపూర్ణజ్ఞానమే వేదము. ప్రత్యక్ష ప్రమాణం చేతకానీ లేదా తర్కంచేత కానీ తెలుసుకోలేనటువంటి బ్రహ్మపదార్థాన్ని ఎలా తెలుసుకోవాలో ఈ వేదం చెబుతుంది. ఈ వేదాలనే శ్రుతులు అని కూడా పిలుస్తారు. అలానే వేదములకు భాష్యం వ్రాసిన సాయణాచార్యులవారు.. “ప్రతీజీవీ తనకు ఇష్టమైనవి పొందడానికి, ఇష్టములేనివాటిని తొలగించుకోవడానికి, మంత్రజపాలు, హోమాలూ వంటి అలౌకికములైన ఉపాయాలను తెలియజేసేదే వేదము” అన్నారు.  “అనంతా వై వేదాః” అన్న మాటను బట్టి ఈ వేదములు అనంతములు. అలానే ఇవి అపౌరుషేయములు. అంటే ఒకరిచేత వ్రాయబడినవో, పుట్టించబడినవో కావు. వేదములు సాక్షాత్తూ పరమాత్మయొక్క నిశ్వాసము. ఆ అనంతమైన వేదాలనుండి అతి కొద్ది భాగాన్నే మన మహర్షులు గ్రహించి లోకకల్యాణం కోసమై మానవాళికి అనుగ్రహించారు. వేదవ్యాసుల వారు ఆ కొద్దిపాటి వేదభాగాన్నే బుగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అనే పేర్లతో విభజించి మనకందించారు. ఈ ఋుగ్, యజుర్, సామ, అథర్వ వేదాలనూ, వాటి శాఖలనూ ప్రచారంలోకి తీసుకురావడానికి వాటిని వరుసగా తన శిష్యులైన పైలునికీ, వైశంపాయనునికీ, జైమినికీ, సుమంతునికీ అప్పగించాడు. పూర్వం ఈ నాలుగు వేదాలకూ కలిపి 1131 శాఖలు ఉండేవి. కానీ ఇప్పుడు వాటిలో కేవలం 7 శాఖలు మాత్రమే లభిస్తున్నాయి. అంటే మనకిప్పుడు లభిస్తున్న వేద విజ్ఞానం అసలులో  ఒక్కశాతం కూడా కాదన్న మాట.  ఈ వేదాలు మళ్ళీ మూడు భాగాలుగా ఉంటాయి. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము. వేదాల అంతరార్థాన్ని మంత్రాల రూపంలో చెప్పేవి సంహితలు. ఆ మంత్రాలలో ప్రతీ మాటకూ  అర్థం చెప్పి, వాటిని యజ్ఞంలో సరైన రీతిలో వాడడానికి ఉపయోగపడేవి బ్రాహ్మణాలు. సంహితలోని మంత్రాలకు, బ్రాహ్మణాలలోని కర్మలకూ వెనుకనున్న అంతరార్థాన్ని వివవరించేవి అరణ్యకాలు. అంటే ఒక కర్మ ఎలా చెయ్యాలో అన్నదానికంటే కూడా అసలు ఆ కర్మ ఎందుకు చెయ్యాలి? అన్నదానినే.. ప్రధానంగా చెప్పేది అరణ్యకం. ఈ అరణ్యకాల చివరిలోనే ఉపనిషత్తులుంటాయి. వేదాలకు చివరిలో ఉండేవి కనుక వీటినే వేదాంతములు అని పిలుస్తారు. మొత్తంగా చూస్తే ఈ వేదాలను కర్మకాండ, జ్ఞానకాండ అని రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు. సంహితలు, బ్రాహ్మణాలు కర్మకాండలోకి వస్తే.. ఉపనిషత్తులతో కూడిన అరణ్యకాలు జ్ఞానకాండలోనికి వస్తాయి.

కర్మకాండను అధ్యయనం చేసిన జైమినీ మహర్షి.. వేదములలో కర్మకాండ భాగమే గొప్పదన్నాడు. ఆయన చేసిన ఆ కర్మకాండ విశ్లేషణకే పూర్వమీమాంస శాస్త్రమని పేరు. అలానే జ్ఞానకాండను విశ్లేషించిన వేదవ్యాసుడు అదే వేదముల సారమన్నాడు. దానికే ఉత్తరమీమాంస అని పేరు. ఉపనిషత్తులతో పాటూ, బ్రహ్మసూత్రములు, భగవద్గీత కూడా ఉత్తరమీమాంసలోకే వస్తాయి.

వేదాల తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి యజ్ఞాలవంటి విధుల ద్వారా ఒక జీవనవిధానాన్ని చెబుతుంది కర్మకాండ. అలా చేయడం ద్వారా కొంతకాలానికి శరీరమూ, మనస్సూ శుద్ధి అవుతాయి. చిత్తశుద్ధి కలుగుతుంది. మన బుద్ధికి సత్యాన్ని గ్రహించే శక్తి లభిస్తుంది. అప్పుడు ఉపనిషత్తులను అధ్యయనం చేస్తే జీవాత్మ, పరమాత్మల అద్వైత స్థితి అనుభవంలోకి వస్తుంది. వేదముల పరమప్రయోజనం మానవుడు జీవన్ముక్తుడు అవ్వడమే, అంటే ఈలోకంలో ఉండగానే మోక్షాన్ని పొందడం.  అప్పుడు మాత్రమే వేదాల సారమైన నాలుగు మహావాక్యాలు విశదమవుతాయి.

ఇక ఇప్పుడు నాలుగు వేదాల గురించీ సంగ్రహంగా చెప్పుకుందాం. 


Rajan PTSK గారికి ధన్యవాదాలు

No comments:

Post a Comment