Thursday, October 15, 2020

ఆలోచనా లోచనాలు

 ఆలోచనా లోచనాలు




సాహితీమిత్రులారా!



దాశరథి గారి ఈ కవిత వీక్షించండి-

ఇది ఆలోచనా లోచనాలు సంకలనంలోనిది.


చీకటి చీర కట్టుకొని

ఆకలి రైక తొడుక్కొని

శోకంతో కుమిలిపోతున్న లోక కన్యను

చెరపడుతున్నాడు కాల రాక్షసుడు


చుక్కలు చూస్తున్నాయి

నక్కలు కూస్తున్నాయి

ఆదుకోలేక అమాయక జీవులు

అడుగు వెనక్కు వేస్తున్నాయి


నిరాశలు నిప్పుమంటలై రేగుతున్నాయి

దురాశలు దుందుభులై మోగుత్తన్నాయి

ఆశకు ఆయువు తీరిపోయిందా?

అవని అశాంతి యవనికలో  దాగిపోయిందా?


ఇది కథకాదు, కాలుతున్న సొద

ఇది యెదలో సాగుతున్న రొద

దీన్ని కలకాలం భరించలేం కద?

అందుకే సమరం సాగింతాం,  పద!


చూపుల సెర్చిలైట్లకు అడ్డంగా

దాపురించిన ఈ అంధకార గంగ

ఆలోచనా లోచన కాంతిపథంలో 

అదృశ్యమైపోతుంది ఒక్క క్షణంలో


ఈ భయంకర బాధామయ ధాత్రి

ఇక ప్రియంకరమౌతుంది ఈ  రాత్రి;

వ్యాపిస్తున్నై నవకాంతి జ్వాలలు

అవి మానవతా మందార మాలలు!!

1 comment:

  1. Sir, can you please post the complete version of Dasarathi gari work - "maaTlaaDani mallemogga maadirigaa naDaciraa, niSSabdam eruganaTTi nimnaga vale viDacipO" ? I have been trying to get it without much success.

    Thanks and Regards,

    ReplyDelete