Tuesday, March 10, 2020

నేడు మసలదు తల్లీ

నేడు మసలదు తల్లీ





సాహితీమిత్రులారా!

అబ్బూరి వరదరాజేశ్వరరావు 
కవితా సంచిక నుండి-

నిరుడు విరిసిన నీలగగనం
నేడు కనపడదమ్మా!
నిరుడు విరిసిన శీతవాయువు
నేడు మసలదు తల్లీ!

నీలిరెక్కల కాలవిహంగం
నీడ జిక్కితి తల్లీ!
జాలికన్నుల కారుచీకటి
మ్రోల నిలిచితి నమ్మా!

ఖంగుమన్నవి మృత్యుదేవత
కాలి యందెలు తల్లీ!
చరమ రాత్రించరుల సన్నిధి
జలదరించితి నమ్మా!

కలల బతుకున గాలిమేడలు
కరిగిపోయిన వమ్మా!
వెలితి కన్నుల వెలుగు కోసము
వెదకికొందును తల్లీ!

స్వేచ్ఛకోరిన పేదరక్తం
వెల్లబారిన దమ్మా!
జనసమరమున పరాజితుడను
సెలవొసంగుము తల్లీ!

ద్వేషబుద్ధిని ధిక్కరిస్తే
దోషమెవరిది తల్లీ!
తిరుగులేనిది నేటి లోకము
నేర మెవరి దమ్మా!

దీన్ని శ్రీశ్రీ రాసిన  "ఏవి తల్లీ" కవితతో పోల్చండి-

ఖడ్గసృష్టి లోని ఈ కవిత చూడండి.
("THE SNOWS OF YESTER YEAR" )
 (ఇది F. Villon  అనుసరణ.)

చక్రవర్తి అశోకుడెచ్చట?
జగద్గురు శంకరుండెచ్చట?
ఏవి తల్లీ! నిరుడు కురిసిన
హిమ సమూహములు?

కాళిదాస మహా కవీంద్రుని 
కవన వాహినిలో కరంగిన
ఉజ్జయిని నేడెక్కడమ్మా
ఉంది? చూపించు?

షాజహాన్ అంత:పురములో
షట్పదీ శింజాన మెక్కడ!
ఝాన్సీ లక్ష్మీదేవి ఎక్కిన
సైంధవం నేడేది తల్లీ?

రుద్రమాంబా భద్రకాళీ
లోచనోజ్వల రోచులేవీ!
ఖడ్గతిక్కన కదనకాహళ
కహకహ ధ్వనులెక్కడమ్మా?

ఎక్కడమ్మా కృష్ణరాయని
బాహు జాగ్రద్బాడబగ్నులు?
బాలచంద్రుని బ్రహ్మనాయని
ప్రాణవాయువు లేవి తల్లీ?

జగద్గురువులు, చక్రవర్తులు, 
సత్కవీశులు, సైన్యనాధులు
మానవీరులగు మహారాజ్ఞులు
కానరారేమీ?

పసిడిరెక్కలు విసిరికాలం
పారిపోయిన జాడలోవీ?
ఏవి తల్లీ! నిరుడు కురిసిన
హిమ సమూహములు?

No comments:

Post a Comment