Wednesday, June 19, 2019

సౌందర్యం


సౌందర్యం

సాహితీమిత్రులారా!

నందుడికి కాలూ చేయీ ఆడటం లేదు, మరో రెండు రోజుల్లో తన పెళ్ళి. తనకి నచ్చిన అతిలోక సుందరి జనపద కల్యాణి ఒప్పుకుంది. కళ్ళు మూసుకున్నా తెరిచినా కల్యాణి రూపం మనసు లోంచి పోవడంలేదు. తాను అతి అదృష్టవంతుడనడానికి అనేక కారణాలు. మొదటిది తాను సిద్ధార్థుడికి తమ్ముడిగా పుట్టినా, ఆయన సన్యసించడం వల్ల తనకి రాజపదవి లభించబోతోంది. రెండోది, ఎప్పట్నుంచో తాను రాజ్యంలో సుందర నందుడిగా పిలువబడుతున్నాడు, తన అందం వల్ల. మూడోది ఇంత అందగాడైన తనకి అతిలోక సుందరి అయిన జనపద కల్యాణి భార్యగా రాబోతోంది. ఇంతకన్నా కావాల్సిందేముంది ఎవరికైనా?

ఆలోచనల్లో ఉన్న నందుడికి లోపలకి వచ్చిన సేవకుడు చెప్పేడు. “రేపు తథాగతుడు భిక్షకోసం వస్తున్నారుట. ఆ తర్వాత మీకూ కుటుంబానికీ ఆశీర్వచనం, మిగతా విషయాలూ చూస్తారని వినికిడి.”

నందుడు తల పంకించాడు.

మర్నాడు తమ్ముణ్ణి చూడ్డానికొచ్చిన బుద్ధుడికి అలంకరణతో వెలిగిపోతున్న నందుడు కనిపించేడు. ప్రజాపతిని, తండ్రిని పలకరించి యశోధరనీ, రాహులుణ్ణీ కూడా చూశాక భోజనాలు వడ్డించబడ్డాయి. కూడా తెచ్చుకున్న కమండలం పక్కనే పెట్టి కావలిసినది మాత్రమే మితంగా భుజించాక శిష్యులతో పాటూ వెళ్ళడానికి లేచాడు భగవానుడు. గుమ్మం దాటుతుంటే ఏదో మర్చిపోయినట్టున్నాడు, నందుణ్ణి పిలిచి చెప్పాడు, “భోజనం చేసిన చోట, కమండలం మరిచాను. కాస్త తీసుకొస్తావా?”

నందుడు కమండలం పట్టుకుని వచ్చేసరికి తథాగతుడు గుమ్మం దాటి బయటకు, అక్కడ నుంచి తన విహారానికి వెళ్ళిపోయాడు. నందుడు కమండలం పట్టుకుని విహారానికి వచ్చాక తథాగతుడు చెప్పాడు, “ఎవరి జీవితంలోనైనా సరే రెండే రెండు విషయాలు తప్పకుండా జరిగేవి. జననం, మరణం. పెళ్ళీ, పిల్లలూ, బంధువులూ, స్నేహితులూ ఎవరూ మనకూడా రారు. ఏ జనపద కల్యాణి అతిలోక సుందరి అనుకుంటున్నావో ఆమే కొన్నేళ్ళు గడిచేసరికి నీకు మరో వికారమైన రూపంలో కనిపిస్తుంది. అందం అనేది అతి చంచలమైనది. ఈ పెళ్ళివల్ల నీకేదో సౌఖ్యం, ఆనందం సమకూరుతుందనుకుంటున్నావు కానీ దానితో సంసారంలో పీక లోతు కూరుకుంటున్నావు. దీనికి తరుణోపాయం సన్యసించడం, అర్హతుడవడమూను. నీకు కావాల్సింది ఆనందమే అయితే అది సన్యసించడంలో ఉంది కానీ పెళ్ళిచేసుకోవడంలో లేదు. చెప్పు నందా, నీకు కావాల్సింది నిజమైన శాశ్వతానందమా లేకపోతే ఏదో కొన్నేళ్ళు మాత్రం ఉండే శారీరికానందమా? ఇది అడగడానికే నిన్ను విహారానికి రప్పించాను. రాజ భవనంలో అయితే ప్రజాపతి, మహారాజు నేను చెప్పినదానికి ఏ పరిస్థితుల్లోనూ ఒప్పుకోరని తెలిసిందే కదా?”

“అన్నా, శాశ్వతానందమే కావాలని ఉంది కానీ అతిలోక సుందరి జనపద కల్యాణిని మర్చిపోవడం ఎలా?”

“సరే అయితే ఇలా కూర్చుని కళ్ళు మూసుకో. నీకు కనిపించే విషయాలు చూస్తూ నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఉండు. నీకే తెలుస్తుంది ఏమి చేయాలో.”

భగవానుడి ఎదురుగా పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకున్న నందుడికి మొదటగా కనిపించినది, కాలుతున్న ఇనప స్తంభం. దానిమీదకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్న ఒక కోతి. స్తంభం మీద చేయి వేసినప్పుడల్లా కోతి చేయి కాలుతోంది. చేయి వెనక్కి తీసుకోవడం మళ్ళీ మళ్ళీ ఎక్కడానికి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో కోతి కాళ్ళూ చేతులూ నోరూ చెవులూ కాల్తున్నాయి. అదేమి వింతో, ఎర్రగా కాలుతున్న స్తంభం ముట్టుకునేకొద్దీ వళ్ళు కాలుతున్న కోతి నెప్పితో అరుస్తున్నా మరింత కురూపిలా తయారౌతోంది కానీ స్తంభం ఎక్కడం మాత్రం ఆపడం లేదు. ఈ లోపునే పక్కనుంచి తథాగతుని వాక్కు వినిపిస్తోంది నందుడికి.

“జనపద కల్యాణి ఈ కోతికన్నా అందంగా ఉంటుందా?”

“ఈ కోతి కన్నా లక్షకోట్ల రెట్లు అందంగా ఉంటుంది, అసలు పోలికే లేదు.”

“సరే మరోసారి దృష్టి కేంద్రీకరించి చూడు, ఇప్పుడేం కనిపిస్తోందో?”

నందుడికి ఈ సారి ఊర్ధ్వలోకాలు కనిపించడం మొదలుపెట్టాయి. భూలోకం కాదని తెలుస్తూనే ఉంది. ఏదో సభలో ఉన్నట్టుంది. అందంగా అలంకరించుకున్న స్త్రీలు పానీయాలు అందిస్తూ చిరునవ్వులు చిందిస్తున్నారు. ప్రతీ స్త్రీ కళ్ళు తిప్పుకోలేని సౌందర్యరాశి. నందుడు అలా చూస్తుంటే భగవాన్ స్వరం మరోసారి వినిపించింది.

“ఈ స్త్రీల సౌందర్యం అంత బాగుంటుందా, జనపద కల్యాణి సౌందర్యం?”

“లేదు. ఈ సౌందర్యరాశులతో పోలిస్తే జనపద కల్యాణి ముందు నాకు కనిపించిన వళ్ళు కాలిపోయిన కోతిలా ఉంది. ఇక్కడ కూడా పోలికే లేదు.”

తన ప్రయత్నం లేకుండా కళ్ళు తెరుచుకున్న నందుడు భగవానుడి కేసి చూశాడు ఈ సారి ఆశ్చర్యంగా. తథాగతుడు స్థిరంగా అన్నాడు. “ఇప్పుడు చెప్పు నందా, నీకు జనపద కల్యాణి కావాలా లేకపోతే ఈ సౌందర్య రాశులు కావాలా? ఈ సౌందర్యరాశులు స్వంతం అవ్వాలంటే సన్యసించి తీరాలి మరి.”

వేరు ఆలోచన లేకుండా చెప్పేడు నందుడు, “ఈ సౌందర్య రాశులు నా స్వంతం అవుతారంటే జనపద కల్యాణికి వదులుకోవడానికి నేను సిద్ధం! ఇప్పుడే సన్యసిస్తాను.”

తథాగతుని మొహంలో కనీకనిపించని చిరునవ్వు. మర్నాడు పెళ్ళి చేసుకోబోయే నందుడు, భగవానుడి మొహం చూడగానే సన్యసించాడనే వార్త శుధ్ధోధన మహారాజు రాజ్యంలో దావానలంలా వ్యాపించింది.

నాలుగేళ్ళు గడిచాక ఓ రోజు విహారంలో బుద్ధుడు ఇచ్చే ప్రసంగం కోసం వచ్చిన స్త్రీలని, వాళ్ల సౌందర్యాన్ని ఇంకా కామంతో చూస్తున్న నందుడు ఆనందుడి కంటపడ్డాడు.

“సన్యసించినా మనసు అదుపులో పెట్టుకోలేని నువ్వు అర్హతుడవడానికి పనికిరానివాడివి.” అన్నాడు కోపంతో ఆనందుడు.

ఈ మాట ముల్లులా మనసులో గుచ్చుకున్నప్పుడు నందుడు మరోసారి భగవానుడిని చూడబోయేడు. ఎప్పుడు తనకి బుద్ధుడు ధ్యానంలో చూపించిన సౌందర్య రాశులు స్వంతం అవుతారో, తన మనసు ఇంకా ఆ అందం మీదనుంచి వెనుతిరగడం లేదో కనుక్కోవడానికి.

అంతా విన్న తథాగతుడు అడిగేడు, “నందా నీకు కనిపించిన కాలుతున్న ఇనుప స్తంభం, ఆ కోతి, ఏమిటో తెలుసా?”

“తెలియదు.”

“ఆ ఇనుప స్తంభం ఈ సంసారం. అది ఎవరినీ వదలదు. ఆ కోతి నీ మనసు. ఈ సంసారం ఎంత భాధిస్తున్నా దాన్ని వదలడానికి మనసు ఒప్పుకోదు. అందువల్ల ఇప్పుడు నీ మనసు ఇంకా ఆ సంసారం మీదే ఉంది. అలా నీ వళ్ళు ఇంకా కాలుతూనే ఉంది. ఎప్పుడైతే నీ మనసుని సంసారం మీద నుంచి లోపలకి మరల్చావో అప్పుడు అది నీకు మరింత సంతోషం ఇవ్వడం మొదలుపెడుతుంది. ఓ సారి ఆ ఆనందం అనుభవం లోకి వచ్చాక నీకే తెలుస్తుంది.”

“అలా మనసుని మళ్ళించడం ఎలా?”

“సజ్జన సాంగత్యం వలనా, సంఘంలో ఉండి బాహ్య ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఉండడం వలనా.”

“సజ్జన సాంగత్యం ఎటువంటిది, దానివల్ల నాకు ఉపయోగం ఏమిటి?”

“సరే, సజ్జన సాంగత్యం గురించి నాలుగు విషయాలు విను.

యదృచ్ఛయాప్యు పానీతం, సకృత్సజ్జన సంగతం
భవత్యచల మత్యంతం నాభ్యాసక్రమమీక్షతే.

అనుకోని విధంగా అయినా సరే ఒకసారి సజ్జన సాంగత్యం కలిగితే అది స్థిరమై ఉండిపోతుంది తప్ప ఆ సాంగత్యం స్థిరం అవడానికి మాటిమాటికీ పరిచయాలని అది ఆపేక్షించదు.

న సజ్జనాద్దూరచరః క్వచిద్భవేద్భజేత సాధూన్ వినయక్రమానుగః
స్పృశంత్య యత్నేన హి తత్సమీపగం విసర్పిణస్తద్గుణ పుష్పరేణువః

ఎప్పుడైనా సరే వినయంగా సజ్జనులని సేవిస్తూ ఉండాలి. సజ్జనుల సమీపంలో ఉన్నవారికి అప్రయత్నంగానే వాళ్లకున్న మంచిగుణాలు, పుష్పరేణువులు అంటుకున్నట్టూ సోకుతాయి.

రథానృపాణాం మణిహేమభూషణా వ్రజంతి దేహశ్చ జరావిరూపతాం
సతాం తు ధర్మం న జరాభివర్తతే స్థిరానురాగా హి గుణేషు సాధనః

బంగారం, మణులతో చేసినా రాజుల రథాలు చివరకి వాడకం వల్ల పాతబడ్డట్టే మనిషి శరీరం కూడా ముసలితనం వల్ల కురూపమవుతుంది. కానీ సజ్జనులు ఆచరించే ధర్మానికి ముసలితనం అనేది లేదు. అందువల్లే ధర్మం మీద స్థిరమైన అనురాగం అలవరచుకోవాలి.

నభశ్చదూరే వసుధాతలాచ్చ పారాదవారం చ మహార్ణవస్య
అస్తాచలేంద్రాదుయతోస్తతోపి ధర్మః సతాం దూరతరే సతాంచ

గగనానికి భూమికీ ఎంత దూరమో, మహాసముద్రానికున్న ఇవతలి ఒడ్డుకీ అవతలి ఒడ్డుకీ ఎంతదూరమో, ఉదయాచలానికీ అస్తాచలానికీ ఎంత దూరమో, దానికన్నా ఎక్కువగా ఉంటుంది, సజ్జనులకీ దుష్టులకీ మధ్య ఉన్న దూరం. అందువల్ల సజ్జన సాంగత్యంతోనే మనసు మరల్చుకోవచ్చు.”

ఈ సుభాషితాలు విన్న నందుడు మరింత పట్టుదలతో సాధన చేసి అర్హతుడయ్యేక మనసులో కలిగిన ఆనందాన్ని తలుచుకుని, మొదట్లో పెళ్లవబోతున్న తనని భగవానుడు విహారానికి బలవంతంగా తీసుకొచ్చి సన్యసించమనడం గుర్తొచ్చింది. తనలో తాను నవ్వుకున్నాడు, ఇప్పుడున్న తన ఆనందంతో పోలిస్తే, జనపద కల్యాణిని పెళ్ళి చేసుకుని ఉంటే ఏమై ఉండేది? ఒళ్ళు జలదరించింది.

“ఏమిటి నందా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు?” ఎప్పుడొచ్చాడో నందుడి వెనకకి తథాగతుడు, అడుగుతున్నాడు,

“నా లోనే ఉన్న అఖండానందం చూసుకోకుండా నేను వివాహం తలపెట్టుకుంటే భగవానుడు నన్ను సన్యసించమనడం, ధ్యానంలో పైలోకంలో ఉన్న సౌందర్యరాశులని చూపించడం గుర్తొచ్చి నవ్వు వచ్చింది.” చెప్పాడు నందుడు.

“చూశావు కదా? జనన మరణ చట్రం లోంచి తప్పుకోవడం ముఖ్యం కానీ ఈ రోజు ఉండి రేపు హరించిపోయే క్షణికానందం కోసం బతకకూడదు. నీలో ఉన్న ఆనందమే మొదట్లో నేను చూపబోయిన ఆ సౌందర్యం. పైలోకాలు ఉన్నాయా లేదా అనేది అటుంచితే, అఖండానందం ఉన్నది సరిగ్గా ఇక్కడే, నీలోనే. నిరంతరం బాహ్యంగా ఉన్న ప్రపంచాత్మకమైన దృష్టి ఎప్పుడైతే అంతరంగా చూడ్డం మొదలుపెడుతుందో అప్పుడు ఆ దారికి అలవాటు పడి బయటకి రావడానికి ఇష్టపడదు. ఆ అంతర్దృష్టి అందుకోవడానికి చేసే మొదటి ప్రయత్నం కోరిక విడిచిపెట్టడం. దానికి మొదటి దారి సన్యసించడం. మామూలుగా సన్యసించమంటే ఎవరికీ ఇష్టం ఉండదు కనక ఎక్కడో పైలోకాల్లో సౌందర్యరాశులున్నారని నమ్మించడం మొదలుపెట్టి, అంతర్దృష్టితో లోపలకి చూడడం మొదలుపెట్టగానే తనలోనే అఖండానందం ఉందని తెలుసుకోగలుగుతున్నాం. మోక్షంమీద కోరికతోనో మరోదానికో సన్యాసంతో ఓ సారి అలా లోపలకి చూడ్డం మొదలుపెట్టాక చివరి అడుగు మోక్ష సన్యాసం–ఏ కోరికతో సన్యసించామో ఆ కోరిక కూడా వదులుకోవడం. ఎప్పుడయితే కోతి ఇనుప స్తంభాన్ని వదిలిందో అప్పుడే దానికి సంతోషం. ఇదంతా అర్థమయింది కదా?”

“సంఘంలో ఉంటూ ఆనందుడు, మిగతా శిష్యుల సజ్జన సాంగత్యంతోనే నేను ఈ జ్ఞానం సంపాదించుకోగలిగాను; మీరు చెప్పిన సతాం తు ధర్మం న జరాభివర్తతే అన్నది పూర్తిగా అర్థమైంది.” నందుడు చేతులు జోడించాడు.

మొహంలో చిరునవ్వు కదలాడుతుండగా భగవానుడు ముందుకి కదిలేడు.
--------------------------------------------------------
రచన: ఆర్. శర్మ దంతుర్తి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment