తిష్యరక్షిత
సాహితీమిత్రులారా!
క్రీ.పూ. 236. పాటలీపుత్ర, మహారాణి తిష్యరక్షిత అంతఃపురం
“తిష్యా, కుణాలుడి పట్ల నీ మోహం అర్థరహితం, అది మీకేమన్నా అర్థమవుతుందా?”
“నాకు కాదే ముసలి మాలతీ, నీకే అర్థం కావడం లేదు. నేనేమన్నా పదహారేళ్ల పడుచునా, ఆయన మీద మోహపడటానికి? నా మోహమంతా ఎప్పుడూ అధికారం కోసమే. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక్కడి దాకా వచ్చాను. ఇక్కడికి అడుగుపెట్టినప్పుడు నేను కేవలం మిత్రకు పరిచారికను. ఇప్పుడు చూడు నేనే మహరాణిని. అది అందుకోవడానికి ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు కదా. ఎప్పుడో చేరుకోవలసిన స్థానం ఇది, మిత్రపైన ప్రేమతో వదులుకున్నాను. మాయోపాయంతో మిత్రను తొలగించి ఉంటే ఇరవై ఏళ్ల వయసుకే మహరాణి పీఠం ఎక్కి ఉండేదాన్ని. నేనలా ధర్మం తప్పి ప్రవర్తించలేదు కదా! నా ఎదురుగా ఇప్పుడు మరో అవకాశం. దాన్ని వదులుకోవడమే అర్థరహితం. అయినా నాకూ అతనికి ఏమంత తేడా వయసులో? కేవలం ఏడేళ్లు చిన్నవాడు. వయసులో ఉన్నవాడు. అశోకుడు ఆరిపోతున్న దీపం. అలాంటి దాన్ని అందిపుచ్చుకోవడానికే ఉంపుడుగత్తెవన్నా భరించాను, సహజీవనం అన్నా ఒప్పుకున్నాను. నువ్వు కూడా హేళన చేసేదానివి కదా! ఈ రోజు చూడు మహరాణి అనే సరికి నేను నిద్రపోయినా నా కాళ్లు వత్తుతూనే ఉంటావు. నీకు గుర్తుందే ముసలిదానా, ఆ పెద్ద మట్టిబాన మోయలేక క్రిందపడి ఆ బాన పగిలినప్పుడు, నా కాలి పైన నువ్వు కర్రకాల్చి పెట్టిన వాత? అప్పుడు మిత్రనే కదా నన్ను వైద్యుడి వద్దకు పంపింది. అదే కదా నేను వైద్యంలో మెలుకువలు నేర్చుకోవడానికి కారణమైంది.”
“తిష్యా, నేను చెప్పిందానికి మీరు చెప్తున్నదానికి ఏమన్నా సంబంధం ఉందా?”
“ఉందే మాలతీ, ఇద్దరం అధికారం గురించే చెప్తున్నాం. దాన్ని ఎక్కువ కాలం నిలుపుకోవడం కోసం నేను ముందుకు అడుగు వేద్దామనుకుంటున్నా, నువ్వు వెనక్కి లాగుదామనుకుంటున్నావు. కుణాలుడు ఈ రాజ్యానికి సూర్యుడై వెలగబోతున్నవాడు. దీనిలో కష్టనష్టాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆడది మగవాడి చిరకాల బలహీనత. అయినా మగవాడి గురించి నీకు నాకు ఎవరైనా చెప్పాలే ముసలి మాలతీ!” పరిహాసమైన నవ్వు తిష్యరక్షిత పెదాలపైన.
“ఇదంతా ఎందుకో నాలో అనేక భయాలకు కారణమవుతోంది. నా మాట విను తిష్యా.”
“భయపడకు మాలతీ, కుణాలుడిని ఒక్కసారి నా బాహువులతో బలంగా బంధించి నా శృంగార సామ్రాజ్యంలోకి ఆహ్యానించితే చాలు, మరణించేదాకా నేనే ఈ మగధకు మహరాణిని.”
“రాజకుటుంబాలలో అనైతికత సాధారణమే తిష్యా, కాని కొడుకు వరస… ధర్మమేనా?”
“అధికారానికి ధర్మాధర్మాలు ఉండవు మాలతీ, అధికారమే అసలైన ధర్మం.”
“అతను కాదంటే?”
“అమంగళం పలకకు ముసలీ! తిష్య కోరుకుంటే కాదన్న మగవాడు ఈ భూమి మీద ఇంకా పుట్టి ఉండడు.”
క్రీ.పూ. 234. పాటలీపుత్రానికి ముప్పై క్రోసుల దూరంలో హిరణ్యబాహు నదీతీరంలో ఒక నిర్జనప్రాంతం.
“ఇంకో రెండు ఘడియలు విజయా” అశ్వాన్ని పక్కన చెట్టుకు కట్టివేస్తూ అన్నాడు ధర్మమహామాత్ర యశపాలుడు.
“చేయబోయేది స్త్రీ హత్య. దానికో ప్రత్యేకదళం, ధర్మమహామాత్రల పర్యవేక్షణ, ఇంత ప్రణాళిక అవసరమంటావా మామా?” గత మాసం రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ ఇరవయ్యేళ్ల విజయుడికి విసుగును కలుగచేస్తున్నాయి.
“అది హత్య కాదు విజయా, శిక్ష. కొడుకుగా దీవించాల్సిన యువరాజును కామించి, అది నెరవేరక ఆగ్రహించి అతన్ని అంధుడిని చేసి అశోక మహారాజు హృదయాన్ని ముక్కలు చేసిన స్త్రీకి విధించిన శిక్ష అది” అక్కడ ఉన్న బండపైన కూర్చొని మంటను ఎగదోశాడు యశపాలుడు.
“అదేమిటి మామా! కొడుకును కామించిందా? కాదన్నందుకు కన్నులు తీయించిందా? ఏమైనా పొరపాటు పడి ఇలాంటి శిక్ష విధించలేదు కదా మీ పరిషత్!”
“ఆమె గురించి తెలిస్తే నువ్విలా అనవు విజయా. తెగువ, అంతకు మించిన తెలివి ఉండబట్టే అశోక మహరాజుతోనే రాజ్యాభిషేకం చేయించుకొని ఆయన సింహాసనంపైనే కూర్చొని ఈ సువిశాల మగధరాజ్యానికి మహరాణిగా ఏడురోజులు పరిపాలన చేయగలిగింది.”
“మగధను పరిపాలించిందా! అసలేమిటి మామా ఆమె కథ?” అన్నాడు విజయుడు ఆసక్తిగా.
“తిష్యరక్షిత, మహారాణి అసంధమిత్ర తన పుట్టింటి నుంచి తీసుకొచ్చుకున్న ఇష్టసఖి. పన్నెండేళ్ల వయసులోనే అంతఃపురం లోనికి అడుగుపెట్టింది. మహారాణి ఆమెకు చదువు చెప్పించింది, నాట్యం, వైద్యం నేర్పించింది. ఆమెకుండే ఆసక్తి వలన వాటిలో గొప్ప ప్రావీణ్యత సంపాదించింది. వయసు పెరిగేకొద్ది ఇక్కడి అంతఃపుర వైభోగాలు, స్వేచ్ఛా ఆమెలో అనేక ఆశలను, కోరికలను పెంచాయి. మహారాణికి ఆంతరంగికురాలిగా ఉంటూనే మరోపక్క తన అందచందాలతో నాట్యకళతో అశోక మహారాజును ఆకట్టుకుంది. ఆయనెప్పుడైనా అనారోగ్యంగా ఉంటే వెన్నంటి ఉండి పరిచర్యలు చేస్తూ దగ్గరయ్యింది. ఇరవైతొమ్మిది సంవత్సరాలు ప్రతి విషయంలో చేదోడువాదోడుగా ఉన్న మహారాణి అసంధమిత్ర మరణం తరువాత విషాదంలో ఉన్న మహారాజుకి తిష్యరక్షితే ఓ పెద్ద ఓదార్పుగా మారింది. చివరికి అరవై రెండేళ్ల వయసులో మహారాజు చేసుకున్న వివాహం మౌర్య సామ్రాజ్యానికే శాపంగా మారింది. రాణిగా మారిన క్షణం నుంచే మహారాజును తన అదుపులో ఉంచుకోవడంపైన దృష్టి పెట్టింది తిష్యరక్షిత. మహారాజుకి బౌద్ధం మీద ఉండే భక్తి, ఆదరణ, చేసే దానాలు ఆమెలో బౌద్దం పట్ల ఎంత వ్యతిరేకతను పెంచాయంటే బుద్ధ భగవానుడు సంబోధి పొందిన బోధి వృక్షాన్నే విషప్రయోగంతో చంపాలనుకునేంత! క్షీణిస్తున్న బోధివృక్షంతో పాటు అనారోగ్యం పాలైన మహారాజు కోసం ఆ దేవవృక్షాన్ని మళ్లీ బతికింపచేసింది. అశోక మహారాజు పైన తీవ్రమైన ప్రేమనే చూపించేది. కాని వారిద్దరి మధ్య వయోబేధం ఆమెలో అసంతృప్తికి కారణమయ్యినట్లుంది. తరచుగా తండ్రితో సంభాషించడానికి తన అంతఃపురానికి వస్తున్న అశోకుని మూడో భార్య పద్మావతిదేవి కుమారుడు, కాబోయే మహారాజు దర్మవివర్ధుని పట్ల ఆకర్షితురాలైంది తిష్యరక్షిత. కుణాల పక్షికి ఉండేంత అందమైన కన్నులు ఉండటం చేత అశోక మహారాజు అతడిని కుణాలుడని ప్రేమగా పిలుచుకునేవాడు. బౌద్దం పట్ల అతనికి తండ్రిని మించిన భక్తి. ఆచార్య ఉపగుప్తుడి శిష్యుడిగా చిన్నవయస్సు నుంచే త్రిపిటకలను అధ్యయనం చేసేవాడు. సమర్థుడు, ఉత్తముడు, సాధు ప్రవర్తనుడైన కుణాలుడి విషయంలో తన మోహాన్ని, ప్రేమను అదుపు చేసుకోలేకపోయింది తిష్యరక్షిత. ఉద్యానవనంలో ధ్యానంలో ఉన్న అతనిని కౌగిలించుకొని తన కోరికను వెల్లడించింది. కుణాలుడు ఆమెను సున్నితంగానే తిరస్కరించాడు. తల్లిలాంటి దానివి అని ఆమె పాదాలకు నమస్కరించి వెళ్లిపోయాడు. తండ్రికి కూడా ఈ విషయాన్ని తెలియనివ్వలేదు. ఇక పాటలీపుత్రలో ఉండటం మంచిది కాదని తక్షశిలలో చెలరేగిన తిరుగుబాటును సాకుగా చూపి దాన్ని అణిచివేయడానికి అని తన భార్య కాంచనమాలతో సహా అక్కడకి వెళ్లిపోయాడు. తిష్యరక్షిత అతని మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయింది. కోరుకున్నవాడు కాదనడం ఆమె అహాన్ని దెబ్బతీసిందో, అతను కాబోయే మహారాజు అనే విషయం ఆమెను భయపెట్టిందో తెలియదు కాని అతనిని ఎలాగైనా దెబ్బతీయాలనుకుంది.
ఆ అవకాశం ఆమెకు మహారాజుకి కలిగిన వింతవ్యాధి రూపంలో వచ్చింది. ఎందరు వైద్యులు శ్రమించినా నయం కాని ఆ వ్యాధిని తిష్యరక్షిత అత్యంత చాకచక్యంతో నయం చేయగలిగింది. దానికి కృతజ్ఞతగా మహారాజు ఏడురోజులు ఆమెకు రాజ్యాన్ని పరిపాలించే అవకాశం ఇచ్చాడు. తక్షశిలలో రాజప్రతినిధిగా ఉన్న కుణాలుడి అన్ని అధికారాలను తొలగించి, అతని కన్నులు పీకించి రాజభవనం నుంచి వెళ్లగొట్టాల్సిందిగా నాటకీయంగా మహారాజు పేరుతోనే తక్షశిలకు ఆదేశాలు పంపింది. ఇదంతా అశోకుని ఆదేశంతోనే అని అందరు నమ్మేట్టు చేయడంతో ఆ విషయం మహారాజుకి చేరలేదు.
రాజ్యాభిషేకం చేసుకోవాల్సిన కుణాలుడు గుడ్డివాడై పాటలు పాడుకుంటూ మాసిపోయిన చింపిరి దుస్తులతో పెరిగిపోయిన గడ్డంతో భార్యతో సహా బిచ్చమెత్తుకుంటూ ఊరూరూ తిరుగుతూ రెండు సంవత్సరాల తరువాత పాటలీపుత్రానికి వచ్చినప్పుడు అతని పాట విని కుణాలుడిని గుర్తుపట్టిన అశోక మహారాజు అతని పరిస్థితి చూసి దుఃఖంతో నిర్ఘాంతపోయాడు. విషయాలన్నీ తెలిసి తిష్యరక్షితని నరకకూపం లాంటి అశోకచెరసాలలో బంధించి చిత్రహింసలకు గురిచేసి చంపమని ఆజ్ఞాపించాడు. కాని కుణాలుడు అడ్డం పడ్డాడు. చిత్రహింసల నుంచి తప్పించగలిగాడు గాని ఆమె మరణశిక్షను ఆపలేకపోయాడు. కుణాలుడి కోరిక మేరకు బుద్దుడు సంచరించిన ప్రాంతంలో కాకుండా పాటలికి దూరంగా ఓ లక్కగృహాన్ని నిర్మించి ఆమె మత్తులో ఉన్నప్పుడు దాన్ని అగ్నికి ఆహుతి చేయాలని న్యాయపరిషత్ నిర్ణయించింది. దానికి అనుగుణంగా మరికాసేపట్లో ఆమె జీవితం ముగియబోతుంది విజయా. ఆ లక్కగృహ నిర్మాణం కోసమే నిన్ను కళింగ నుంచి ఇక్కడికి పిలిపించాను.”
“అశోక మహారాజు శాసనాలు గురించి తప్ప ఈ విషయాలేమీ తెలియదు నాకు. ఈ బాధ్యతను అప్పగించినప్పుడు కూడా దీని నిర్మాణం గురించి తప్ప ఇంకేమీ చెప్పలేదు. ఈ విషయాలన్నీ చాలా ఆశ్చర్య పరుస్తున్నాయ్ మామా!”
హిరణ్యబాహు నది ఒడ్డున దూరంగా వెన్నెల్లో లక్కగృహం మెరుస్తుంది. దాని చుట్టూ సైనికులు వలయంలా నిలబడి కాపలా కాస్తున్నారు. ఆ గృహానికి బయట నిర్మించబడ్డ పెద్ద వేదికపైన రకరకాల సంగీత వాయిద్యాలు పట్టుకొని కళాకారులు, ఓ పక్కన ఓ పెద్ద బల్లమీద రకరకాల ఆహర పదార్థాలు, పానీయాలు. వెన్నెలతో పోటీపడుతున్న మేనిచ్ఛాయతో దవళవస్త్రాలు ధరించిన తిష్యరక్షిత నెమ్మదిగా నడచి వచ్చి తన ఆసనంలో ఆసీనురాలైంది. ఆమె ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించడం లేదు. ఆమె ఇష్టసఖి మధులలిత నృత్యాన్ని ఆరంభించింది. ఒక్కసారిగా తిష్యరక్షిత లేచి మధులలితతో తన అడుగులు కలిపింది. వాయిద్యాలు, గాయకుల స్వర గమకాలతో ఆమె కదలికలు పోటీపడుతున్నాయి. నలభై మూడేళ్ల వయసులో కూడా మెరుపుతీగలా కదులుతుంది తిష్యరక్షిత.
“ఆమేనా మామా తిష్యరక్షిత? ఎంత అద్భుతమైన నృత్యం!” అన్నాడు విజయుడు కన్నార్పకుండా చూస్తూ.
“అవును విజయా, నృత్య కార్యక్రమం ముగిసిన తరువాత ఆమెకు వడ్డించే ఆహారపదార్థాలలో మత్తుమందు కలిపి ఉంది. ఆ తరువాత లక్కగృహదహనం.”
తిష్యరక్షిత మరణం తరువాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. అంధుడైన కుణాలుడుని చూస్తూ అశోకుడు మానసికంగా కృంగిపోయాడు. కుణాలుడి కుమారుడు సంప్రతిని యువరాజుగా, మరో మనవడు దశరథుడిని దక్షిణ సరిహద్దులలోని సువర్ణగిరి రాజ ప్రతినిధిగా నియమించాడు. పాటలిలో ఉండలేనని చెప్పి కుణాలుడు తక్షశిలకు వెళ్లిపోయాడు.
క్రీ.పూ. 232, పాటలీపుత్ర, అశోకుని శయన మందిరం.
“ముప్పై ఏడేళ్ల పరిపాలన చివరిదశకు వచ్చినట్లుంది రాధాగుప్తా!” మంచంలో పడుకొని ఉన్న అశోకుడు తన చేతిలో మిగిలిన సగం ఉసిరిక ముక్కను చూస్తూ అన్నాడు.
“ఇంకో పదేళ్లైనా ఈ సువిశాల మగధ సామ్రాజ్యానికి ప్రభువు మీరే మహారాజా!” వినమ్రంగా అన్నాడు రాధాగుప్తుడు.
తెరలుతెరలుగా నవ్వు అశోకుని ముఖంలో. కిటికీ పరదాలనుండి పడుతున్న వెలుగువైపు చూస్తూ కాసేపు అలానే ఉండిపోయాడు.
“ఈ విశాల భూమండలాన్ని నేను ధర్మంతో జయించాననుకున్నాను. కాని ఈ సగం ఉసిరిక చివరకు నేను మాత్రమే నీకు మిగిలాను అనే సత్యాన్ని నాకు చెబుతుంది రాధాగుప్తా. దీనిని తీసుకెళ్లి కుక్కుటారామంలోని ఆచార్యులకు సంఘానికి నేను చేస్తున్న నా చివరిదానంగా స్వీకరించమనండి. ప్రజలను నా సొంతబిడ్డలుగా భావించి రాజ్యం నలుమూలలా అనేక ధర్మలిపులను రాయించాను. కాని నా బిడ్డలే ఇప్పుడు నన్ను ఈ గదికి పరిమితం చేశారు. సుదత్తుని నూరుకోట్ల బంగారు నాణాల దానాన్ని చేరుకోవాలనే నా ఆకాంక్షను నేను ఇప్పుడిక నేరవేర్చుకోలేనేమో!”
“కుక్కుటారామానికి మీరు చేస్తున్న దానాలు యువరాజు సంప్రతిని భయపెడుతున్నాయి మహారాజా! మీకు అందుబాటులో ఉన్న ప్రతిదానిని, ఆఖరుకి మీకు ఆహారం పెట్టడానికి పంపిన బంగారు పళ్లాలతో సహా దానం చేస్తుండటంతో చివరికి ఇలా బంధించవలసి వచ్చిందని యువరాజు కూడా బాధపడుతున్నాడు.”
“ఏది నిజం రాధాగుప్తా, నేను ఈ భూమండల చక్రవర్తినా లేక ఈ శయన మందిరంలో బందీనా?”
“భూమండల చక్రవర్తే నిజం మహారాజా!”
“అయితే విను రాధాగుప్తా, నేను నా సమస్త రాజ్యాన్ని సంఘానికి దానంగా ఇస్తున్నట్లు రాజపత్రాన్ని వెంటనే సిద్దంచేసి తీసుకురండి. నేను దానంగా ఇవ్వాలనుకున్న నాలుగుకోట్ల బంగారు నాణాలు సంఘానికి ఇచ్చాకనే సంప్రతికి రాజ్యాభిషేకం!” వార్ధక్యంతో వణుకుతున్నప్పటికీ అశోకుని గొంతులో స్థిరనిశ్చయం కనిపిస్తుంది.
“అలా భారతదేశ చరిత్రలో ఓ అద్భుతమైన అశోకుని శకం ముగిసిపోయింది మధూ! గొప్ప వ్యవస్థలను ఏర్పరిచి, ఏ చక్రవర్తీ పరిపాలించనంత భూభాగాన్ని పరిపాలించిన అశోకుడు గృహనిర్భంధంలో మరణించాడు.”
“హ్మ్, ఆయన కోరిక తీరిందా మరి?”
“తీరింది మధూ, యువరాజు సంప్రతి నాలుగు కోట్ల బంగారు నాణేలు కుక్కుటారామానికి చెల్లించి ఆ తరువాతనే రాజ్యాభిషేకానికి సిద్దమయ్యాడు. కాకుంటే తరువాత కాలంలో బౌద్ధం కంటే కొంచెం జైనమతం వైపు మొగ్గుచూపినట్లున్నాడు.”
“అవునా, అయినా ఈ తిష్యరక్షిత కథ సారంగధర కథను పోలి ఉన్నట్లుంది కదబ్బాయ్!”
“హాఁ, కొన్ని పోలికలు ఉంటాయి మధూ. మహాభారతంలో లక్కగృహదహనం, ఇంకా ఊర్వశి అర్జునుడిని కోరుకున్న సందర్భం లాంటి చోట్ల కూడా అలాంటి పోలికలు కనిపిస్తాయి. కాని మనదేశంలో చారిత్రిక ఆధారాలతో లభ్యమయ్యేవాటిలో ఈమె కథ కొంతవరకు వాస్తవానికి దగ్గరైనది, వాటికంటే ప్రాచీనమైనది.”
“ఈ కథలు ఎక్కడ నుంచి తీసుకున్నావబ్బాయ్, పురాణాల నుంచా, అశోకుడి శాసనాల నుంచా?”
“పురాణాలలో అశోకుడి ప్రస్తావన చాలా చాలా తక్కువ మధూ. విష్ణు, మత్స్య పురాణాలు మాత్రమే ఆయన్ను రేఖామాత్రంగా ప్రస్తావిస్తాయి. ఇక శాసనాలలో ఆయన తన ప్రజలను ఉద్దేశిస్తూ ఎలా జీవించాలో చెప్పిన మాటలే అధికం. అవి ఆయన వ్యక్తిత్వాన్ని, సున్నితత్వాన్ని, పశువులు, జంతువుల వంటి వాటి పట్ల ఆయన దయను, ప్రజలు పాటించాల్సిన నైతిక విలువల వంటివాటిని తెలియచేస్తాయే కాని ఆయన జీవితం గురించి పెద్దగా చెప్పవు. అశోకుడి జీవితానికి సంబంధించి చెప్పే కథలన్నీ దివ్యావధాన (అశోకావధాన), మహావంశ, ద్వీపవంశ అనే శ్రీలంక గ్రంథాల నుంచి తీసుకోవలసిందే ఎవరైనా. దివ్యావధాన సంస్కృతంలో రాయబడితే, మహావంశ, ద్వీపవంశ పాళీ భాషలో రాయబడ్డాయి. వీటిలో సత్యాలు, కల్పితాలతో కూడిన అనేక కథలు చారిత్రిక అంశాలతో కలగలసి పోయుంటాయి. చరిత్రకారులు వీటిని పరిశీలించి వాస్తవం ఏమై ఉండచ్చో ఊహించే ప్రయత్నం చేస్తారు. ఇంకొంతమంది వీటికి మసిపూసో, మెరిపించో పాఠకుడిని ఒక అయోమయంలోకి నెట్టేసి వారికి అనుకూలమైన ఒక మాయా చరిత్రను సృష్టిస్తుంటారు.”
“ఇలా మాయా చరిత్రల అవసరం ఎందుకో చరిత్రకారులకి!”
“ఇది క్లిష్టమైన ప్రశ్న మధూ. సత్యాన్ని అన్వేషించడం, స్వీకరించడం, ఒప్పించడం అనేవి ఎంతో శ్రమతో కూడుకున్నవి. అంతే కాకుండా సత్యం చాలాసార్లు స్వీయప్రయోజనాలకు పనికివచ్చేదిగా కూడా ఉండదు. అందుకే ఈ రోజుల్లో చరిత్రకారులు చెప్పే కథలు ఎలా ఉంటాయంటే, ఒకప్పుడు ప్రపంచమంతా తెలుగు అని చెప్పడం అతని టార్గెట్ అయితే ఆఫ్రికాలో నైలు నదికి ఆ పేరు రావడానికి తెలుగులో నీళ్లు అనే పదానికో నీలం అనే పదానికో సంబంధం అంటగట్టడం దగ్గర వాదం మొదలుపెడతారు. దాని చుట్టూ అనుకూలమైన వాదనలు నిర్మించుకుంటూ వస్తారు. నమ్మే ఆరాధకులు నమ్ముతారు. తెలుగు అంటే పిచ్చి ఉన్నవాళ్లు దాన్నే ప్రచారం చేసుకుంటూ తమ ఛాతీ యాభైఆరు అంగుళాలకు పెరిగిందనుకుంటారు. చరిత్రకారులు వాళ్లు తెలివైనవాళ్లు అని నిరూపించుకోవడం కోసం మాత్రమే ఎక్కువగా ఇలా చేస్తుంటారు. కాని ఈ మాయా చరిత్రల అవసరం రాజకీయాలకు, మతాలకు ప్రజల మూఢత్వాన్ని పెంచడం కోసం ఎక్కువ అవసరం.”
“హ్మ్, అయినా ఈ కోట్ల బంగారు నాణాల దానం ఏంటి, నిజంగానే అంతంత దానాలు చేసేవారా?”
“బౌద్దమతం దానాలను విపరీతంగా ప్రోత్సహించింది. బుద్ధుడి కాలం నుంచి కూడా సంఘానికి దానం అన్నిటికంటే ఉత్తమమైనది అనే ప్రచారం బలంగా చేసేది. శ్రావస్తికి చెందిన అనాథ పిండకుడు అనే ఓ వ్యాపారి బుద్ధుడి కోసం కోసల రాజు ప్రసేనజిత్తు కుమారుడు ఒకరి దగ్గర నుంచి ఓ స్థలాన్ని కొంటాడు. బౌద్ధ వాఙ్మయంలో జేతవనంగా ప్రసిద్ధి పొందిన ఆ ప్రాంతాన్ని అనాథ పిండకుడు వందకోట్ల బంగారు నాణాలను భూమి మీద పరిచి, చేజిక్కుంచుకొని బుద్దుడికి దానం చేస్తాడు. అనాథపిండకుడి కంటే ఎక్కువ సొమ్ము దానం చేయాలనే ఆకాంక్ష అశోకుడిది. తిష్యరక్షిత ఒక రకంగా మౌర్యసామ్రాజ్యాన్ని దెబ్బతీస్తే, అశోకుడి అతిదానాలు ఇంకో రకంగా దెబ్బతీశాయి. అశోకుడి తరువాత అనేక కారణాలవల్ల కేవలం యాభై సంవత్సరాలలోనే మౌర్య సామ్రాజ్యం పూర్తిగా పతనమైపోయింది.”
“ఈ కథలో ఏం చెప్పాలనుకున్నావు నువ్వు? ఈ దేశంలో అధికారం చెలాయించిన తొలి మహిళ తిష్యరక్షిత అనా, లేదా మౌర్యసామ్రాజ్య పతనానికి కారణం ఓ ఆడది అనా?”
“ప్రాచీన భారతీయ చరిత్రను మలుపు తిప్పిన మహిళగా తిష్యరక్షితను గుర్తుంచుకోవాలనేమో అమ్మాయ్!”
“ఒకవేళ ఆ కుణాలుడు తిష్యరక్షిత ప్రతిపాదనను అంగీకరించి ఉంటే…”
“ఆ వెంటనే అశోకుడి మరణం, కుణాలుడి రాజ్యాభిషేకం జరిగిపోయేవేమో! సమర్థుడైన కుణాలుడు రాజై ఉంటే బలమైన మౌర్యసామ్రాజ్యం ఇంకొన్ని వందల సంవత్సరాలు మనగలిగేది. కాకుంటే తండ్రికి, కొడుకుకి ఒకే రాణి ఉండే ఓ దౌర్భాగ్య స్థితిలోకి భారతీయ చరిత్ర నెట్టబడకుండా కుణాలుడు మౌర్యసామ్రాజ్యాన్ని పణంగా పెట్టాడనుకోవాలి.”
“దేవుడా! ఇక చాల్లేబ్బాయ్ తిష్యరక్షిత కథ, పద వెళ్దాం ఇక” అంది మధు మూడో కాఫీ కప్పును పక్కన పెడుతూ.
(ఈ - మాట అంతర్జాల మాసపత్రిక నుండి
రచయిత - భాస్కర్ కొండ్రెడ్డి)
No comments:
Post a Comment