Tuesday, April 19, 2022

ఆత్రేయ - శాంతి పద్యాలు

 ఆత్రేయ - శాంతి పద్యాలు




సాహితీమిత్రులారా!



ఆత్రేయ కూర్చిన పద్యాలలో శాంతి - ని గురించిన 

పద్యాలు కొన్ని ఇక్కడ గమనిద్దాం-


పువ్వులో - పసిపాపాయి నవ్వులోన

దివ్వెలో - తారల వెలుగు రవ్వలోన

నవ్వగల ప్రతిమనిషి మనస్సులోన

నిన్నె కాంతును శాంతి నా నిత్యకాంతి


మెరుపు మబ్బుల చాటున మెరిసినపుడు

ఉరుము దూరాన ఎక్కడో యురుమినపుడు

చల్లగా వాన చిరుజల్లు చల్లినపుడు

నిన్నె కాంతును శాంతి నా నిత్యకాంతి


పలుకరించిన పలుకని అలుకలోన

అలుక తీరిన చిరునవ్వు తళుకులోన

తళుకులీనెడి కన్నుల చెలిమిలోన

నిన్నె కాంతును శాంతి నా నిత్యకాంతి


తల్లి యొడిలోన తారాడు పిల్లలందు

పిల్లయల్లరికి మురియు తల్లులందు

ఇద్దరిచ్చి పుచ్చుకొనెడి ముద్దులందు

నిన్నె కాంతును శాంతి నా నిత్యకాంతి


గున్నమామిడి చివురులో కోకిలమ్మ

కొసరిపాడెడి పాటలో కోర్కెలేవొ

గునిసియాడెడి గుండెలో దినదినమ్ము

నిన్నె కాంతును శాంతి నా నిత్యకాంతి


No comments:

Post a Comment