Thursday, November 3, 2016

చంద్రుని విడిచి నిన్ను పట్టుకుంటాడు


చంద్రుని విడిచి నిన్ను పట్టుకుంటాడు



సాహితీమిత్రులారా!


నాయిక విరహం చూస్తూనే ఉంటాము
నాయక విరహం ఎలాఉంటుందో
శృంగారతిలకంలోని
ఈ శ్లోకం చెబుతుంది
చూడండి-

ఝటితి ప్రవిశ గేహే మా బహిస్తిష్ఠ కాన్తే
గ్రహణ సమయవేలా వర్తతే శీతరశ్మే:
తవముఖ మకలంకం వీక్ష్య నూనం స రాహు
ర్గ్రసతి తవ ముఖేందుం పూర్ణచంద్రం విహాయ


ఇది మేళ్ళచెర్వు భానుప్రసాదరావుగారి వ్యాఖ్య-

గ్రహణసమయంలో ఇంటిముంగిట్లో కూర్చున్న
నవవధువును లోనికి రమ్మని పిలుస్తున్నాడు ప్రియుడు.
వచ్చి కౌగిట్లో కరిగిపొమ్మంటున్నాడు
తొందర చేస్తున్నాడు.
ఇది రసధ్వనితో కూడిన నాయక విరహం-

ఓ చంద్రముఖీ! ఇలా బయట కూర్చోకు.
చటుక్కున లోపలికిరా! ప్రమాదం పొంచి ఉంది.
దుష్టుడు రాహువు వస్తాడు 
అందుచేత లోనికిరా! 
రాకుంటే ఆ పాడు రాహువు 
ఈ పున్నమినాటి సకలంక చంద్రుని 
వదలి  మచ్చలేని నీముఖచంద్రబిబాన్ని 
చూచి పరవశించి ఒడిసి
పడతాడు జాగ్రత్త లోనికిరా!  - అని శ్లోక భావం.

అసలు విషయం-
భార్య ముఖబింబం చంద్రునికన్న మనోజ్ఞంగా ఉన్నది. చంద్రకిరణాలు 
అతన్ని ఒకచోట నిలువనీయడంలేదు. దానికితోడు ఆ వెన్నెల రాత్రిలో
ఆ రతిరూప సుందరికి ఎవరైనా వలపులవల విసరుతారేమోనని భయం.
భార్యా రక్షణ భర్త కర్తవ్యంకదా మరి అందుకే ఆమె త్వరగాలోనికి వస్తే
తానే రాహువై తన బాహువుతో ఆమెలోని అణువణువూ ఆక్రమించాలని
మధురబాధను రగిలించాలని ఆత్రుత. లోపలికి తోందరగా రాకుంటే 
తన దుడుకుతనం బయటపడుతుందని అతని బెంగ. ప్రియా విరహం
క్షణమొక యుగం కదా రాత్రి సుఖానికి సఖి అభీష్టాన్ని దేశకాల
విశేషాలను గుర్తించి వర్తించటం రసజ్ఞుని లక్షణం.   


దాన్ని ఆపడం ఎవరివల్లా కాదు


దాన్ని ఆపడం ఎవరివల్లా  కాదు



సాహితీమిత్రులారా!



ఈ నీతిశాస్త్ర శ్లోకం చూడండి

న పుష్పగన్ధో పటివాతమేతి
న చన్దనం తగరం మల్లికానాం
సతంచ గన్ధో పటివాతమేతి
సచ్చాదిసా సప్పురి సోనవాతి


గంధం, మల్లెలు, తగరం మొదలైన
సుగంధ భరితమైన వాటి మీద నుంచి
వీచిన గాలి తనతో కూడ వాటి సౌరభాన్ని
మోసుకొచ్చి అందరికీ పంచి పెడుతుంది.
కాని వాటిలోని సహజ గంధాన్ని ఎగరగొట్ట గలదా?
అలాగే సజ్జనుల సత్కార్యాల వల్ల వారి కీర్తి
అన్నిచోట్లా వ్యాపిస్తుంది.
దాన్ని ఆపడం ఎవరితరం కాదు కదా - అని శ్లోక భావం.

Wednesday, November 2, 2016

స్త్రీలు అబలలు కారా?


స్త్రీలు అబలలు కారా?



సాహితీమిత్రులారా!


మనం స్త్రీలను అబలలని
పిలుస్తుంటాము కదా
ఈ నీతిశాస్త్రశ్లోకం చూస్తే
అది నిజమా కాదా తేలుతుంది
చూడండి-

స్త్రీణాం ద్విగుణ మాహారం
బుద్ధిశ్చాపి చతుర్గుణమ్
సాహసం షడ్గుణం చైవ
కామో ష్టగుణ ముచ్యతే

పురుషుల కంటె స్త్రీలకు రెండు రెట్ల
ఆహారం తీసుకోగల సత్తా ఉంటుంది.
అలాగే చాతుర్యంలో నాలుగు రెట్లెక్కువ.
సాహసంలో ఆరు రెట్లు ఎక్కువవారు.
ఇక కామం అనేది మగవారికంటే
ఎనిమిది రెట్లు ఎక్కువ - అని శ్లోక భావం

దీన్ని ఎక్కువ మంది అంగీకరించరు
అంగీకరించకపోయినా ఇది నిజం.
ఇది ప్రకోపించి ప్రభావం చూపిందా
పురుషులపని గోవిందా

టుక్డేజో మాంగ్తాహై సోహై వోభీ ఆద్మీ


టుక్డేజో మాంగ్తాహై సోహై వోభీ ఆద్మీ




సాహితీమిత్రులారా!


ఉర్దు సాహిత్యంలో  నజీర్ అనే కవి
కవితలో యదార్థము, దేశభక్తి, ప్రజాజీనవ పరిజ్ఞానము,
మానవ ప్రేమ, సహృదయత, సరళత కనిపిస్తాయి.
ఇవి ప్రాచీనకవుల కవితలలో కనిపించవు.

ఈ కవి "ఆద్మీనామా" లోని కొన్ని భాగాలు చూడండి-

దున్యామె బాదుషాహై సోహో వోభీ ఆద్మీ
ఔర్ ముఫ్లి సో గదాహై సోహై వోభీ ఆద్మీ
జర్ దార్ బేనవాహై సోహై వోభీ ఆద్మీ
నేమత్ జో ఖారహాహై సోహై వోభీ ఆద్మీ
    టుక్డేజో మాంగ్తాహై సోహై వోభీ ఆద్మీ

ప్రపంచంలో పాదుషా మానవుడే
బీదవాడగు ఫకీరు మానవుడే
ధనవంతుడును, ధనహీనుడును మానవుడే
దివ్యాన్నము తిన్నవాడు మానవుడే
రొట్టెముక్కలు అడుక్కొనే వాడూ మానవుడే


మస్జిద్ భీ ఆద్మీనె బనాయీహై యాఁ మియాఁ
బన్తేహై ఆద్మీహి ఇమామ్, ఔర్ బుత బా - ఖాఁ
పడ్తేహైఁ ఆద్మీహి ఖురాన్ ఔర్ నమాజ్ యాఁ
            జో ఉన్కో తాడ్తాహై సోహై వోభీ ఆద్మీ


మసీదు మానవుడే కట్టించాడు
మానవుడే ఇమానముగా ఖుతుబా 
చదివేవాడుగా వ్యవహరిస్తాడు.
మానవుడే ఖురాను చదువుతాడు, 
నమాజు చేస్తాడు - మానవుడే 
అట్లా చేసేవాళ్ళ చెప్పులు దొంగిలిస్తాడు. 
అలా దొంగిలించినది తెలుసుకునేవాడూ మానవుడే.


యాఁ ఆద్మీపె జాన్కొ వారేహై ఆద్మీ
ఔర్ ఆద్మీపె తేగ్ కొ వారేహై ఆద్మీ
పగ్దీభీ ఆద్మీకి ఉతారే హై ఆద్మీ
చిల్లాకె ఆద్మీకొ పుకారే హై ఆద్మీ
   ఔర్ సున్కే దౌడ్తాహై సోహై వోభీ ఆద్మీ

మానవుడే మానవుని కోసం ప్రాణాలిస్తాడు
మానవుడే మానవునిపై కత్తి విసురుతాడు
మానవుని మానవుడే అవమానిస్తాడు
మానవుడే మానవుని ఎలుగెత్తి పిలుస్తాడు
ఆ పిలుపువిని పరుగెత్తేవాడూ మానవుడే

Tuesday, November 1, 2016

కవిత్వ విమర్శ అంటే?


కవిత్వ విమర్శ అంటే?



సాహితీమిత్రులారా!


బైచరాజు వేంకటనాథుని
పంచతంత్రలోని
ఈ పద్యం చూడండి-

రస విస్ఫూర్తి గొరంత దీనికిది పూర్వ చ్ఛాయ యిచ్చోట ద
ప్పసదిప్పట్టున నర్థ పుష్టి పసలేదిచ్చోట నశ్లీలమ
ద్దెస నాదిక్కున దుస్సమాస మిది సందేహాస్పదం బీడనం
చుసుమాళంబున బాండి తుల్నెరపు నీచు న్రోత వాక్రువ్వగన్


కవిత్వంపై విమర్శ చేయడంవలన
దానికి విలువ పెరుగుతుంది.
విమర్శ అంటే దానిలోని గుణదోషాల
వివేచనమాత్రమే కాని కొందరు
కవిత్వంలోని తప్పులను ఎంచడమే
పనిగా పెట్టుకుంటారు వారిని
దోషైకదృక్కులు అంటారు.
అలాంటి వారిని గురించి చెప్పే పద్యం ఇది.

దీనిలో రసం అంతగా ప్రకాశించలేదు.
ఇది పూర్వకవుల రచనకు నకలుగాఉంది.
ఇక్కడ దోషం ఉంది. ఇది అందంగాలేదు.
దీనిలో అర్థం సరిగాలేదు. దీనిలో అశ్లీలత ఉంది.
 అక్కడ దుష్టసమాసం వేయబడింది.
ఈ విషయం సందేహం కలిగేదిగా ఉంది అంటూ
వీరావేశంతో  తప్పులనుపడుతూ,
తమ పాండిత్యాన్ని ప్రదర్శించే నీచులను
గురించి చెప్పాలంటేనే అసహ్యం కలుగుతుందని తీవ్రంగా
నిరసించినాడు ఈ కవి.

అంటే తప్పులను చూడవద్దనికాదు
కేవలం తప్పులనే చూడవద్దని కవి భావన

ఇలాంటి వారు చెడిపోతారు


ఇలాంటి వారు చెడిపోతారు



సాహితీమిత్రులారా!


ఈ నీతిశాస్త్రశ్లోకం చూడండి-

అసంతుష్టో ద్విజో నష్ట స్సంతుష్ట ఇవ పార్ధివ:
సలజ్జా గణికా నష్టా నిర్లజ్జేవ కులాఙ్గనా

నీతిశాస్త్ర ప్రకారం  ఇది చెడిపోయేవారి జాబితా
1. తృప్తిలేని బ్రాహ్మణుడు,
2. తృప్తి చెందిన రాజు,
3. సిగ్గు ఉన్న వేశ్య
4. సిగ్గులేని కులస్త్రీ
వీరు చెడిపోతారని శాస్త్రం చెబుతోంది.

Monday, October 31, 2016

నొసటిగీతను ఎవరుమార్చగలరు?


నొసటిగీతను ఎవరుమార్చగలరు?



సాహితీమిత్రులారా!

ఈ నీతిశాస్త్రశ్లోకం చూడండి-

హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి
లలాట లిఖితా రేఖా పరిమార్ష్టుం నశక్యతే

విష్ణువుగాని, శివుడుగాని, బ్రహ్మగాని,
దేవతలుగాని, ఎవరైనను నుదుట వ్రాసిన
వ్రాతను తుడువలేరు అని శ్లోకభావం.

ఇది ఎంత కష్టమైనదో
నొసటన్ వ్రాసిన వ్రాత కలదా నూరేళ్లు చింతించినన్ 
అన్నడొక కవి. అది నిజమేకదా!