Wednesday, May 3, 2023

క్రీడాభిరామం కథ

క్రీడాభిరామం కథ




సాహితీమిత్రులారా!

కొన్ని వందల సంవత్సరాలుగా ఎన్నో విమర్శలను తట్టుకుని, చెక్కుచెదరకుండా నిలబడిన కావ్యం క్రీడాభిరామం.

ఈ క్రీడాభిరామం 295 పద్య గద్యాలతో ఒకే ఒక్క ఆశ్వాసంలో రచించబడిన ఓ వీథి నాటకం. దీనిని రచించింది వినుకొండ వల్లభరాయుడని కొందరు పండితులంటే, కాదు అతని పేరుతో శ్రీనాథుడే ఈ రచన చేశాడని మరికొందరు పండితులు అభిప్రాయపడ్డారు. పరిశోధక పరమేశ్వరులైన వేటూరి ప్రభాకరశాస్త్రిగారైతే.. ఈ కావ్యకర్త శ్రీనాథుడేనంటూ అందుకు ఎన్నో కారణాలు కూడా చూపించారు. 

ఇక ఈ క్రీడాభిరామం సుమారు 600 సంవత్సరాల క్రితం రచించబడిన కావ్యం. అప్పట్లో ఓరుగల్లు పట్టణం ఎలా ఉండేదో? అక్కడ ప్రజల ఆచార వ్యవహారాలు ఎటువంటివో? ఆ కాలంనాటి నమ్మకాలు, మూఢనమ్మకాలు, వినోదాలు ఇలా ఎన్నో విషయాలు ఈ కావ్యం మన కళ్లకు కట్టిస్తుంది. కాకపోతే.. ఇందులో శృంగారం పాళ్లు చాలా ఎక్కువ. అందుకే వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఉత్తమ స్థాయి పండితులకు, పాఠకులకు, విమర్శకులకు తప్ప మిగిలిన వారికి ఇది అందుబాటులో ఉండటం అంత మంచిది కాదన్నారు. అయితే వాళ్ళకు మాత్రం ఈ కావ్యం అవసరం ఏముంది? అన్నవారికోసం ఆయనో మాట చెప్పారు. నాభి, ఉల్లిపాషాణం వంటి విష పదార్థాలు తెలిసి తీసుకున్నా, తెలియకుండా తీసుకున్నా ప్రాణాలు తీసేస్తాయి. కానీ అవే విషపదార్థాలను వైద్యంలో సరైన మోతాదులో వాడితే, దీర్ఘరోగాలను, ప్రాణాంతక రోగాలను తగ్గిస్తాయి. ఈ ప్రపంచంలో నిరుపయోగమైన వస్తువంటూ ఏదీ లేదు. కాకపోతే ఆ వస్తువును వినియోగించే మనిషిని బట్టి దాని ప్రభావం, ఫలితం మారిపోతాయి. ఈ క్రీడాభిరామం కావ్యం కూడా అటువంటిదేనన్నది ప్రభాకరశాస్త్రిగారి అభిప్రాయం. మనం కూడా శాస్త్రిగారి మాటను శిరసావహిస్తూ ఈ కావ్యంలోని వర్ణనల్ని విడిచిపెట్టి కేవలం కథను మాత్రమే చెప్పుకుందాం. మొత్తం క్రీడాభిరామం చదవాలనన్న ఆసక్తి ఉన్న పాఠకులకు ఈ కావ్య ప్రతి ఎలానూ ఇంటర్నెట్‌లో ఉచితంగా అందుబాటులో ఉండనే ఉంది.

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు 

No comments:

Post a Comment