Tuesday, May 23, 2023

వాత్స్యాయన కామసూత్ర

 వాత్స్యాయన కామసూత్ర



సాహితీమిత్రులారా!

“దృష్టం కిమపి లోకేఽస్మిన్ న నిర్దోషం న నిర్గుణమ్” అన్నది పెద్దలు చెప్పిన మాట. ఈ ప్రపంచంలో ఇది పూర్తిగా మంచిదీ అని గానీ ఇది పూర్తిగా చెడ్డదీ అనిగానీ ఏదీ లేదు. మంచితో పాటూ చెడూ, చెడుతో పాటూ మంచీ ఉంటూనే ఉంటాయి..  కత్తితో మనం ఎంత చెడు చెయ్యొచ్చో అంత మంచీ చెయ్యొచ్చు. కత్తి అమాయకుల్నీ చంపుతుంది, దుర్మార్గుల్నీ చంపుతుంది. అలానే  ప్రాణం తీసే విషం కూడా వైద్యంలో ప్రాణాలు నిబెట్టడానికి ఉపయోగపడుతుంది. అంటే ఏ వస్తువైనా, పదార్థమైనా ఉపయోగించే విధానాన్ని బట్టే ఫలితాన్నిస్తుంది. అంతేకానీ ఒక వస్తువు చెడు కూడా చేస్తుందన్న భావనతో, దానిని పూర్తిగా పక్కన పెట్టేస్తే.. ఆ వస్తువు వల్ల పొందాల్సిన మంచిని కూడా మనం పొందలేం. ఈ భావాన్ని మనసులో ఉంచుుని మనం వాత్స్యాయన కామసూత్రాలలోకి ప్రవేశిద్దాం.


 భార్యాభర్తల దాంపత్య జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగిపోవడానికి,  మనిషిలో ఉండే చెడు కామాన్ని తొలగించి, దాన్ని ధర్మబద్ధమైన పురుషార్థంగా వినియోగించుకోవడానికీ.. వాత్స్యాయన మహర్షి ఈ గ్రంథం రచించారు. ఇందులో ఆయన చెప్పదలుచుకున్న విషయాలను సుమారు 1700 సూత్రాలుగా వ్రాశారు. అందుకే ఈ గ్రంథానికి వాత్స్యాయన కామసూత్రాలనే పేరొచ్చింది. మహాకవి కాళిదాసు, మహా శాస్త్రవేత్త వరాహమిహిరుడు మొదలైనవారంతా వాత్స్యాయనుణ్ణి కీర్తించినవారే. వాత్స్యాయనుడికి పూర్వం కూడా దత్తకుడు, చారాయణుడు, కుచుమారుడు, సువర్ణనాభుడు మొదలైన కొంతమంది  కామశాస్త్ర గ్రంథాలు వ్రాశారు కానీ.. అవేవీ సమగ్రమైనవి కావు. అందుకే వాత్స్యాయనుడు ఏ కాలం స్త్రీ పురుషులకైనా ఉపయోగపడే విధంగా, చాలా క్లుప్తంగా ఉండే సూత్రాలతో, పరిపూర్ణత్వం ఉట్టిపడేలా ఈ కామశాస్త్ర గ్రంథాన్ని రచించాడు.


 సంభోగానికి మొదటి మెట్టయిన కౌగిళ్లలో ఉన్న నాలుగు రకాల గురించి, ఎనిమిది రకాల నఖ క్షతాల గురించి, అనేక రకాల దంత క్షతాల గురించి, 21 రకాల బంధనాల గురించి, కామోద్రేకం కలిగించే విధానాల గురించి, చుంబన రహస్యాల గురించి, భారతదేశంలో ఏ ప్రదేశానికి చెందిన స్త్రీ పురుషులు ఎటువంటి కోరికలను కలిగి ఉంటారో, వారిని రతి సమయాలలో ఆహ్లాదపరచడం ఎలానో మొదలైన విషయాల గురించి, సంభోగానికి ముందు చేయవలసిన పనులు, సంభోగానికి తరువాత చేయవలసిన పనుల గురించి, వశీకరణ రహస్యాలు, రతి విశేషాలు, గర్భనిరోధక విధానాలు ఇలా ఈ వాత్స్యాయన కామశాస్త్రంలో కామ సంబంధమైన ప్రతీ విషయం గురించీ సూత్రాలున్నాయి. వివాహమైన స్త్రీలు, పురుషులు ఇద్దరూ కూడా ఈ శాస్త్రాన్ని కచ్చితంగా నేర్చుకునే తీరాలన్నాడు వాత్స్యాయనుడు. కామశాస్త్రం తెలియని దంపతులు ఔషధం ఎలా ఉపయోగించాలో తెలియని వైద్యులవంటి వారని కూడా అన్నాడు.



రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు


No comments:

Post a Comment