వజ్జాలగ్గం(వ్రజ్యాలగ్నం)
సాహితీమిత్రులారా!
హాలుని గాథాసప్తశతి వలెనే ప్రాకృతగాథల సంకంలనగ్రంథం
వజ్జాలగ్గం(వ్రజ్యాలగ్నం) దీన్ని శ్వేతంబరముని జయవల్లభుడు సంగ్రహపరిచాడు.
వజ్జా లేక వ్రజ్యా అంటే మార్గం లేక పద్ధతి. దీనిలో ధర్మ-అర్థ-కామాల నిరూపణం చేయబడింది.
ప్రస్తుతం దీనిలో 795 గాథలున్నాయి.
అందులోని కొన్ని ఉదాహరణలు ఇక్కడ గమనిద్దాం.
1. అప్పహియం కాయవ్వం జఇ సక్కఇ పరహియం చ కాయవ్వం,
అప్పహియపరహియాణం అప్పహియం చేవ కాయవ్వం
తనకేది హితమో అది చేసుకోవాలి. వీలయితే పరహితం చెయ్యాలి. తన హితమా పరహితమా అన్నపుడు తన హితమే ముఖ్యమైనది.
2. కో ఇత్థ సయా సుహిఓ కస్స వ లచ్ఛీ థిరాఇ పేమ్మాఇం
కస్సవ న హోఇ ఖలణం భణ కో హు న ఖండిఓ విహిణా
ఎల్లప్పుడూ ఎవడు సుఖంగా ఉంటాడు? లక్ష్మి ఎవరివద్ద స్థిరంగా ఉంటుంది?
ఎవరి ప్రేమ స్థిరం? తప్పు పని చేయనివాడెవడు? దైవంచేత బాధింపబడనివాడెవడు?
3. తిణతూలం పి హు లహుయం దేణం దఇవేణ నిమ్మియం భువణే
వాఏణ కిం న నీయం అప్పాణం పత్థణభయేణ
దేవుడు దీనుణ్ణి తృణంకంటే దూదికంటే కూడ తేలికగా ఉండేటట్లు సృష్టించాడు
అయితే వానిని గాలి ఎందుకు ఎగరకొట్టంలేదు తనను కూడ ఏమైనా యాచిస్తాడేమో అనే భయంచేత
4. భుంజఇ భుంజియసేనం సుప్పఇ సుప్పమ్మి పరియణే సయలే,
పఢమం చేయ విబుజ్జఇ ఘరస్స లచ్ఛీ న మా ఘరిణీ
ఏ ఇల్లాలు అందరూ తినగా మిగిలింది తింటుందో, అందరూ నిద్రపోయిన తరువాత నిద్రపోతుందో, అందరికంటే ముందు లేస్తుందో ఆమె ఇల్లాలు కాదు, లక్ష్మి
5. వహణమ్మిససీ మహణమ్మి సురతరూ మహణసంభవా లచ్ఛీ,
సుయణో ఉణ కహసు మహం న యాణిమో కత్థ సంభూఓ
పాలసముద్రం మథించగా చంద్రుడు పుట్టాడు, కల్పవృక్షం పుట్టింది, లక్ష్మి పుట్టింది. అయితే సుజనుడు ఎక్కడ పుట్టాడో చెప్పు.
వజ్జాలగ్గానికి క్రీ.శ.1335లో రత్నదేవగణి సంస్కృతంలో ఒక వ్యాఖ్య కూర్చారు.
-ప్రాకృతభాషావాఙ్మయచరిత్ర నుండి
No comments:
Post a Comment