Monday, January 9, 2017

నీవు కవికాదుగదా! అనుమానంగా ఉంది


నీవు కవికాదుగదా! అనుమానంగా ఉంది




సాహితీమిత్రులారా!

కొంచెం ఛందోజ్ఞానం ఉన్నవాళ్ళంతా
కవులమని చెప్పుకొని తిరిగే
నాటిరోజుల్లో శ్రీనాథుడు అన్యాపదేశంగా
గాడిదను సంబోధిస్తూ చెప్పిన పద్యం ఇది
చూడండి-

బూడిదబుంగవై యొడలు పోడిమి దప్పి మొగంబువెల్లనై
వాడల వాడలం దిరిగి వచ్చెడి వారలు చొచ్చొచోయనన్
గోడల గొందులందొదిగి కూయుచునుండెడి కొండవీటిలో
గాడిద! నీవుసుం గవివి గావుగదా! యనుమానమయ్యెడిన్

ఒంటినిండా బూడిదపూసుకొని, కళతప్పి,
ముఖం తెల్లగా పాలిపోయి వీధులన్నీ తిరుగుతూ,
ఎదురు వచ్చేవారు చొచ్చో అని అదిలిస్తుండగా
గోడలకు ఒదిగి ఓండ్రపెడుతున్నావు.
కొండవీటి పట్టణంలోని ఓ గార్దభమా!
నీవు కూడ కవివి కావు గదా!  నాకెందుకో
అనుమానంగా ఉందిసుమా అని
శ్రీనాథుడు కవిమ్మన్యులను ఎత్తి పొడిచాడు.
కేవలం గణయతి ప్రాసలు తెలిసి పద్యాలు
రాసినంతమాత్రాన ఎవరూ కవులుగాదని
ఆ కవులకు తెలియజెప్పడానికి గాడిద
నుద్దేశించి ఈ పద్యం చెప్పాడు. 

No comments:

Post a Comment