Sunday, August 19, 2018

సాహిత్యంలో శబ్ధము - నిశ్శబ్ధముసాహిత్యంలో శబ్ధము - నిశ్శబ్ధముసాహితీమిత్రులారా!

శబ్ధశక్తి అనంతం.
ఈ ప్రపంచమే శబ్ధమయం.
కొన్ని ప్రత్యేక శబ్ధాలకు,వాటి ఉచ్చారణకు ఉన్న శక్తి గురించి మన ప్రాచీనులు చెప్పిన విషయాలు మనకి తెలియనివి కావు.
శబ్ధాలకు ఉన్న అధిదేవతలను గురించిన నమ్మకం మనకు ఎరుకే. 
ఈ శబ్ధాలు,అక్షరాలై,వాటి సముదాయం పదాలై,పదాల సముదాయం వాక్యాలై,ఇదంతా ఒక ప్రత్యేక మానవ సమూహం వారిలో వారు ఒకరి భావాలు ఒకరితో పంచుకోవడానికి ఒక భాష అయ్యి భాసిల్లుతోంది.
ఈ భాష పరిణితి చెంది,ఉన్నత స్థాయిలో కళగా,సాహిత్యంగా రూపొందుతోంది.పాటలు,నాటకాలు,ప్రసంగాలు,కధలు,కవిత్వం ఇలా వివిధరూపాల్లో భాష కళకు వాహకం అవుతోంది.
అయితే ఈ భావాలు పంచుకోవడం శబ్దంతోనూ,నిశ్శబ్దంతోనూ చేయవచ్చు. Verbal and Non-verbal communication అన్న మాట. భావాలు పంచుకోవడమే కాదు,ఎదుటి వాడిని హేళన చెయ్యడానికి,కించపరచడానికి,అధికారం,కోపం,ధిక్కారం మొదలైనవి ప్రదర్శించడానికి ఈ భాష,సంకేతాలు,హావభావాలూ పనికొస్తాయి.

ఈ మాటల్లోని అర్ధాలు చెప్పే వ్యక్తి వయసుని,స్థాయిని,ఆడ,మగ వీటిని బట్టి, ఎదుటివాళ్ళు అంచనా వేసుకుని అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తారు.

ఆకలేస్తే అన్నం పెడతానంటుంది అమ్మ. ఆకలేస్తే అన్నం పెడతా. అని పాడుతుంది కథానాయిక.
ఒకే మాటకు రకరకాల అర్ధాలు. నానార్థాలు.

ఆకలి వేస్తే ఏడుస్తాడు పసివాడు. ఇది non-verbal communication.
నాటకాలు,సినిమాలు,నృత్యం వంటి దృశ్య రూపమైన కళల్లో కోపం,తిరస్కారం,ద్వేషం,ప్రేమ అన్నీ మాటలతో అవసరం లేకుండా అభినయించి చూపవచ్చు.తెలియజేయవచ్చు.

‘పుష్పక విమానం’ సినిమాలో సంభాషణలు లేకపోయినా సినిమా చక్కగా అర్ధం అవుతుంది దృశ్యం వల్ల.

సాహిత్యమే శబ్ధ ప్రపంచం. అనుభూతులు నిశ్శబ్ధ ప్రపంచానివి.
మరి ఈ నిశ్శబ్ధమైన అనుభూతులని మాటల్లోకి మార్చి చెప్పడం ఎలా?

ఒకసారి నసీరుద్దీన్ సంతకు వెళ్ళాడట. అక్కడ మాటలు నేర్చిన చిలకని అమ్ముతున్నాడట ఒకడు. మాటల చిలక! యాభై దీనార్లు! యాభై దీనార్లు! అంటూ.నసీరుద్దీన్ వెంటనే ఇంటికి వెళ్ళి తన టర్కీని తీసుకొచ్చి ఆ చిలక అమ్ముతున్న వాడి పక్కన కూచుని టర్కీ వంద దీనార్లు! వంద దీనార్లు! అని అరవడం మొదలు పెట్టాడట. నీ టర్కీ కూడా మాట్లాడుతుందా? అని అడిగాట్ట కొనుక్కోవడానికి వచ్చిన వాడు.ఒక్క ముక్క కూడా మాట్లాడదు అన్నాట్ట నసీరుద్దీన్. మాట్లాడకపోవడం కూడా గొప్పేనా? అని అడిగాట్ట వాడు ఆశ్చర్యపోతూ."మాట వెండి మౌనం బంగారం" అని మదరసాలో చెప్పలేదుట య్యా! అన్నాట్ట నసీరుద్దీన్ వంద దీనార్లు! వంద దీనార్లు అని ఇంకా పెద్దగా అరుస్తూ.

ఇస్మాయిల్ గారి మాటల్లో చెప్పాలంటే-

"మన చుట్టూ ఉన్న అనుభవిక ప్రపంచాన్ని ఆవిష్కరించటమే కవిత్వ లక్ష్యం. దీనికై సాధనాలు శబ్ధాలు లేక మాటలు. మాటలు మన మనస్సు సృష్టించినవి. అనుభవాలు పంచేంద్రియాలకు సంబంధించినవి. మాటలు అనుభవాన్ని యథాతధంగా అనుసరిస్తున్నాయని గ్యారంటీ ఏమిటి? సామాన్య భాష అనుభవాన్ని ఆవిష్కరించక పోగా, ఆచ్ఛాదించటం తరచూ చూస్తుంటాం. అనుభవాన్ని అనుభవంగానే ప్రత్యక్షం గా అందించటం కవిత్వం పని. అంటే, మనం సృష్టించుకున్న కొన్ని శబ్ధాలలోకి మనల్ని ఆవరించి ఉన్న మహా నిశ్శబ్ధాన్ని, అనుభవిక మహా ప్రపంచాన్ని, ప్రవేశ పెట్టటం కవిత్వ లక్ష్యమన్న మాట. ఈ పని కవిత్వం ఎలా నిర్వహిస్తోంది? మాటలు మనస్సు కల్పించుకున్నవి. అనుభవాలు ఇంద్రియాలకు సంబంధించినవి. మనకు ఐదు ఇంద్రియాలున్నాయి. ఇవే మన అనుభవ జ్ఞానానికి మూలాలు. దీన్ని ప్రత్యక్ష జ్ఞానమంటారు. మనస్సు వల్ల కలిగేది పరోక్ష జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానాన్ని పరోక్ష మైన శబ్ధాల్లోకి ఎలా దించటమన్నది ప్రశ్న. శబ్ధాల్లోకి నిశ్శబ్ధాన్ని ప్రవేశపెట్టటమెలా?

జటిలమైన అనుభూతి సామాన్య భాషకు అందదు. దాని పరిధి కావలి నిశ్శబ్ధ, ఆనుభవిక ప్రపంచంలోనిదిది. ఈ అనిర్వచనీయాన్నీ, నిశ్శబ్ధాన్నీ కావ్యంలోకి ప్రవేశపెట్టాలంటే కిటికీలూ, గుమ్మాలూ అవసరం. ఇవే పదచిత్రాలు. ఇవి లేకపోతే కావ్యం మూసుకుపోయి, చదువరికి ఊపిరాడదు.   సున్నితమైన అనుభూతులు శబ్ధ ప్రపంచానికి చెందినవి కావు. ఈ నిశ్శబ్ధాన్ని శబ్దంలోకి ప్రవేశపెట్టటమే కవిత్వం విశిష్ట లక్షణం. కవిత్వానికి శబ్ధమెంత ముఖ్యమో నిశ్శబ్దం కూడా అంతే."

తాదాత్మ్యతకు మాటలు లేవు. మౌనమే. పథేర్ పాంచాలి సినిమాలో రైలు దృశ్యం ఒకటి ఉంటుంది.రైలు శబ్దం ప్రతిధ్వని రావడం,గాలి రొద,రెల్లు పూలు,పొగలు కక్కుతూ రైలు రావడం,రైలు శబ్దం,పిల్లలు పరిగెత్తడం వీటన్నిటి వెనకాల ఒక గాఢమైన నిశ్శబ్దం ఉంటుంది.

ఈ అనుభూతుల్లోని గాఢతని మాటల్లోకి ఒంపాలని రచయితలు,కవులు ప్రయత్నిస్తుంటారు.వర్ణించడం ద్వారా.పోల్చడం ద్వారా.

ఉదాహరణకి, మొదటిది:

అతడు వికటాట్టహాసం చేసాడు.సముద్రం పొంగినట్టు.భూకంపం వచ్చినట్టు.పర్వతాలు కదిలినట్టు.
అతడు పెద్దగా నవ్వాడు.గది గోడలు వణికాయి.సీలింగ్ ఫాన్ ఊడి కిందపడింది.

ఏది బావుంది?       

నేను ఒక వింత రంగుల పువ్వుని చూసాను.నా మనసు సంభ్రమాశ్చర్యాలకు గురి అయింది.కనివిని ఎరుగని వస్తువుని చూసినప్పుడు కలిగే వింత అనుభూతి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.

నేను ఒక వింత రంగుల పువ్వుని చూసాను.మాటరాక కూచుండిపోయాను.

ఇది ఎలా ఉంది?

అనుభూతిని మాటలు కాక మాటల మధ్యలోని ఖాళీ చెప్పగలిగితే,అంటే పాఠకుడు స్వయంగా అనుభూతి చెందడానికి సమయం ఇవ్వగలిగితే అది మరింత ఉత్తమ స్థాయి సాహిత్యం అవుతుంది.   

శబ్ధం- నిశ్శబ్ధానికి పట్టం కట్టడం అన్న మాట.
-----------------------------------------------------------
రచన - ఇంద్రాణి పాలపర్తి
మధురవాణి అంతర్జాల పత్రిక సౌజన్యంతో

Friday, August 17, 2018

మొదటి భార్య(అనువాద కథ)


మొదటి భార్య(అనువాద కథ)

సాహితీమిత్రులారా!

కాలేజినుండి తిరిగొస్తుండగా వర్షం బలపడి, చివరి ఫర్లాంగ్ లో ముద్దగా తడిసిపోయింది రాజ్యలక్ష్మి. ఇది చాలదన్నట్టు రయ్యిమని పోతున్న సిటీబస్సొకటి బురద నీళ్లని వంటిమీద చిమ్మేసిపోయేసరికి ఇల్లు చేరేసరికి కోపం నషాళానికంటింది. పాలవాడు రాలేదు. మేనక ఇంటికి తాళం వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంట్లో టెలిఫోన్ ఆగకుండా మోగుతోంది. అమె కళ్ళల్లో కోపం తాండవిస్తోంది. గుప్పిళ్ళు బిగించడంతో, రక్తం స్థానచలనం చెంది మణికట్టు పాలిపోయింది.

రాజ్యలక్ష్మీ, కోపాన్నితగ్గించుకో. లేకపోతే బ్లడ్‌ప్రెషర్ తగ్గదు. పాలురాకపోతే పోనీ? మేనక లేట్ గా వస్తే రానీ? ఫోన్ అలా మోగి చావనీ..
మేనక భయపడుతూ సైకిల్ దిగింది.

రాజ్యలక్ష్మి కోపాన్ని ఇంకా పెంచింది. ఆ అమ్మాయి వేసుకున్న పాంటూ, గుండీలూ ఎగాదిగా పెట్టుకున్న షర్టు!

“ఎప్పుడొచ్చావమ్మా?”

“ఫోన్ మోగుతోంది.. తలుపు తియ్యి” అదిలించింది.

“ఈజీ మమ్మీ!”

“సరే పోవే.. తలుపు తియ్యి ముందు.. తర్వాత పెద్దవాళ్ళకి పాఠాలు చెప్దువుగానీ”

“లుక్ అట్ దిస్! నేనేం పాఠాల్చెప్పానని?”

తలుపు తీసి ఫోనుకోసం పరుగెట్టి తీసేలోపు మూగబోయింది.

“ఛా..”అని అసహనంగా సోఫాలో కూలబడింది.

“రిలాక్స్ అమ్మా! ముందు ఆ తడిచీర మార్చుకుంటావా?” అంది.

అంత కోపంలోనూ నల్లత్రాచులాంటి పొడవైన మేనక జడ రాజ్యలక్ష్మిని భయపెట్టింది. పెళ్ళి చెయ్యాలి. మంచి అబ్బాయిని చూసి.. నా మొగుడి లాంటివాడు కాకుండ.

ఫోన్ మళ్ళీ మోగింది. మేనక తీసింది.

“……?”

“రాంగ్ నంబర్” అంది.

అవతలివాళ్ళు మళ్ళీ ఏదో అడిగారు. మేనక, “అవును.. నంబర్ కరెక్టే. మీకెవరు కావాలి?”

“……?”

“మిసెస్ రామచంద్రన్ అని ఎవరూలేరిక్కడ”

“తప్పుకోవే..”అని ఫోన్ లాక్కుంది రాజ్యలక్ష్మి…

“ఎవరమ్మా మిసెస్ రామచంద్రన్?”

“రామచంద్రన్ మీ నాన్న పేరు” మేనకతో చెప్పి ఫోన్ అందుకోగానే రాజ్యలక్ష్మికి చేతులు వణికాయి.

“హలో… ఎవరు?”

“మిసెస్ ఏ.వీ. రామచంద్రన్ ఇల్లాండీ? నంబర్ ఇచ్చారు” అని వినిపించింది, మధ్యవయస్సు ఆడ గొంతులో.

“అవును. మీరు ఎవరు?”

“నేను ఎం.ఆర్. హాస్పిటల్నుండి మేట్రన్ ని మాట్లాడుతున్నాను”

“ఏంటి విషయం?”

“మీ హస్బెండ్ ఇక్కడ అడ్మిట్ అయ్యి, గత వారం రోజులుగా స్పృహలేకుండ పడి ఉన్నారు. అడ్మిషన్ రిజిస్టర్ లో అడ్రస్సూ ఫోన్ నెంబరూ ఉన్నాయి. చార్జీలేవీ ఎవరూ కట్టలేదు.. అందుకనే..”

“ఆయనకేమైంది?”

“త్రాంబోసిస్. స్పృహలేకుండ ఉన్నారు. టోమోగ్రఫి స్కాన్ తీయమని రాశారు డాక్టర్. అయితే, ఎవరూ డబ్బు కట్టలేదుకాబట్టి..”

మేనక రాజ్యలక్ష్మికేసి పరీక్షగాచూస్తూ ఉంది..

“అడ్రస్ చెప్పండి”

“ఎం.ఆర్. హాస్పిటల్ తెలియదా? పూందమల్లి హైరోడ్ లో ఈగా థియేటర్ దాటగానే…”

“రూం నెంబర్? ”

“పద్నాలుగులో పడుకున్నారు. వస్తున్నారా? క్యాష్ గా తీసుకొస్తే మంచిది.”

“ఎంత కట్టాల్సి ఉంటుంది?”

“సుమారు పదిహేడు వందలు”

“సరే.. వస్తాను” అంది రాజ్యలక్ష్మి.

“ఎవరమ్మా?”

“మీ నాన్న”

“ఏంటట?”

“హాస్పిటల్లో స్పృహలేకుండ ఉన్నారట”

“అయితే?”

“డబ్బులు కట్టాలంట.. డిస్చార్జ్ చేయించుకుని..”

“ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఎవడు వాడు? వాడిగురించి నీకు ఫోన్ చెయ్యడం ఏంటి?”

“వాడు వీడు అని అనకు.. ఎంతైనా మీ నాన్న”

“నో మమ్మీ, నో… ఆ మనిషి నిన్ను వదిలేసి ఎన్నేళ్ళైంది?”

అప్పుడు మేనక మూడేళ్ళ పాప.

“వాడి ముఖం కూడా తెలీదమ్మా. నిన్ను దిక్కులేనిదానిగా వదిలేసి.. ఎవతితోనో.. దాని పేరేదో చెప్పావే.. ఏంటి?”

“పునీతవల్లి”

రాజ్యలక్ష్మి తడిచీర మార్చుకుని, గబగబా తలదువ్వుకుని, పర్స్ లో డబ్బులు లెక్కపెట్టి, చెక్ బుక్ తీసి దగ్గర పెట్టుకుంది.

“మా, నేను చెప్తున్నది వినిపించట్లేదా?”

“ఏంటి?”

“అక్కడికి వెళ్తున్నావా?”

“అవును. నువ్వు కూడా వస్తున్నావు!”

“నో వే! అది ఈ జన్మలో జరగదు”

“మేనకా, ఈ చర్చలూ వితండవాదాలూ తర్వాత చెయ్యొచ్చు. ఇప్పుడు నాతో రావలసిందే. లోపలికొచ్చి చూడకపోయినా పరవాలేదు. హాస్పిటల్ వరకు రా”

“మమ్మీ, నీకు పిచ్చిపట్టిందా?”

పవుడర్ పూసుకుంటూ నుదుటిబొట్టుని కాస్త పెద్దది చేసుకుంటూ, “చూడు, మీ నాన్నో, నా మొగుడో కాదు ఒక స్ట్రేంజర్ అనుకుందాం..”

“మమ్మీ, యూ ఆర్ అన్‌బిలీవెబుల్! భారత నారి! ఏంటీ మదరిండియా వేషం?– పదిహేనేళ్ళుగా పట్టించుకోని వెధవకి”

“అంతకు ముందు పదిహేనేళ్ళుగా పరిచయం!”

“ఇది పిచ్చితనమే. నేను భరత్ కి ఫోన్ చేసి చెప్తాను”

“తర్వాత చెప్పొచ్చు. వస్తున్నావా, నేనొక్కదాన్నే వెళ్ళనా?”

ఆటోలో వెళ్తుండగా ఆగకుండ కురిసే వర్షానికి కాళ్ళ దగ్గర చీర కొంచం తడిచింది.మిట్లపల్లాలలో ఆటో కుదిపేస్తోంది, వర్షపు హోరు మధ్యలో మేనక చిరాగ్గా సణుగుతూనే వచ్చింది.

“అలాంటి మనిషికి ఇలాంటి పెళ్ళాం”

“వాగుడాపు. వెళ్ళి పరిస్థితేంటో కనుక్కుందాం ముందు”

“చచ్చుంటాడు. ఖాళీ గ్లాసు”

ఎందుకోసం అతన్ని చూడాటానికి వెళ్తున్నాను? నన్ను పెట్టిన హింసలకి, చేసిన ద్రోహానికి భగవంతుడు ఇచ్చిన శిక్షని స్వయంగా చూసి ఋజువు చేసుకోవాలనా? లేకుంటే, అపకారం చేసినవారు సిగ్గుపడేలా ఉపకారం చెయ్యడానికా.. ఎందుకిలా తాపత్రయపడిపోతున్నాను? ఎందుకని పదిహేనేళ్ళుగా చూడని భర్తకోసం వెళ్తున్నా?

“ఈ ఉత్తరం ఎవరు రాశారు? ”

“చదివావుగా.. చివర్లో ఏం రాసుంది – పునీతవల్లి అనేగా? ”

“ఎవరీ పునీతవల్లి?’’

“ఎవరైతే నీకేంటి?”

“ ఫ్రెండా?”

‘ఇప్పటికి అంతే’

‘తర్వాత?’

‘పెళ్ళి చేసుకునే చాన్స్ ఉంది.’

‘ఇలా గుండెల్లో పొడిచినట్టు తాళికట్టిన పెళ్ళానికే సూటిగా చెప్తున్నారు.. సిగ్గులేదూ? ఇదేమైనా న్యాయంగా ఉందా? మీకు నేను ఏం తక్కువ చేశానని?

‘ఏం తక్కువ చెయ్యలేదు రాజి.’

‘మరి ఇదేంటి?’

‘అదొక అవసరం రాజీ. నీకు చెప్పినా అర్థం కాదు. నీకు ఎలాంటి లోటూ లేకుండ..’

‘మీ నాన్నకి టెలిగ్రాం ఇచ్చి పిలిపించండి’

‘వెంటనే రప్పిస్తాను. నాకేం భయంలేదు’

‘నాకు దిక్కు లేదు, ధైర్యం లేదు, చదువు లేదు, సమర్థత లేదు.. ఒక ఉద్యోగం సద్యోగం చేసే వీల్లేదనేగా మీరిలా చేస్తున్నారు’

‘బీ రీజనెబుల్. దీనివల్ల నీకేం ఇబ్బంది రాదు. నీలో లోపం ఉందని కూడా నా ఉద్దేశం కాదు. ఎంతోమంది ఇద్దరు పెళ్ళాలతో సంతోషంగా ఉన్నారు, తెలుసుకదా? ఏడుకొండలవాడే శ్రీదేవి, భూదేవి అని..’

‘దీనికి నేనొప్పుకోను’

‘ఐనా ఇప్పుడు ఎవరు పెళ్ళి చేసుకుంటానన్నారు? మాటవరసకన్నానంతే. పిచ్చిదానా… వెళ్ళు, మొహం కడుక్కుని గుడికెళ్ళిరా..’

‘దయచేసి నాకు ద్రోహం తలపెట్టకండి. నాకు అమ్మానాన్నలు లేరు. అన్నయ్య ఇంట్లో నాకు చోటు లేదు. ఒంటరిగా ఈ సమాజంలో జీవించలేను. ప్లీజ్! నన్ను వదిలెళ్ళకండి.’

‘చీ, అలా ఏం జరగదు. పైకి లే.. కాళ్ళు పట్టుకోకు!’

మేనక రిసెప్షన్ లో ఉంటాను అంది. “నేను ఎవరినీ చూడాలనుకోవట్లేదు. అర్ధగంట సేపు కూర్చుంటా, అంతే” అంది.

“ఎక్కడికీ వెళ్ళకే బంగారం. ప్లీజ్, ఈ ఒక్క రోజు నా మాట విను”

“ఏడవకు, వెళ్ళు”

14వ నంబర్ గదిని చేరుకుంది రాజ్యలక్ష్మి. ఫ్యాన్ గాలికి ఊగుతున్న తెల్లని తెరకి అవతల, డ్రిప్ పెట్టి దుప్పటి కప్పిన మనిషి పడుకుని ఉన్నాడు. నోట్లో ట్యూబ్ పెట్టి ఉంది. గదిలో ఇంకెవరూ లేరు. రాజ్యలక్ష్మి బెడ్ దగ్గరకి వెళ్ళింది. తనకి తెలీకుండానే కళ్ళు చెమర్చాయి రామచంద్రన్ ని చూడగానే. వారంరోజుల మాసినగడ్డం. ఇంజెక్షన్ కోసం చాలా చోట్ల పొడిచిన గాయాల్లో రక్తపు మరకలు నల్లగాకనిపిస్తున్నాయి. నోరు తెరచుకుని ఉంది. ఊపిరి పీల్చుకునే శబ్దం వినిపిస్తుంది. కళ్ళు మూసుకుని ఉన్నాయి.

‘ఈ ముఖమా.. ఈ ముఖమేనా.. ఇతనేనా నన్ను తరిమేసిన భర్త?’

‘నేను ఎక్కువ రంగా? నువ్వు ఎక్కువ రంగా? చెప్పు?’

‘మీరేనండి. సందేహం దేనికి.’

‘చిన్నతనంలో చెవులకి పోగులేసుకుని.. సాగిపోయుంటాయి వజ్రాల బరువుకి. మా నాన్న పాపనాశం మైనర్. పేరుగాంచిన సరసుడు. వెయ్యి ఎకరాలు కరిగించేశాడు.’

“వచ్చేశారా?” అన్న మాట వినిపించి తిరిగింది. ఒక నర్స్ పరుగుకీ నడకకి మధ్య స్థాయిలో లోపలికొచ్చింది. ఆవిడ గర్భవతిలా ఉంది.

“ఇతనే.. ఇతనే..”

“మీరేనా అతని భార్యా?”

“అవునండీ”

“రాజ్యలక్ష్మి అంటే మీరేగా?”

నర్స్ చార్ట్ తీసుకుని చేయిపట్టుకుని గడియారం చూసుకుంటూ నిలబడింది.

“ఇప్పుడెలా ఉంది?”

“డాక్టర్ చెప్తార్లెండి. అయినా, వారం రోజులుగా ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఎవరో ఏంటో ఎలా తెలుస్తుంది మాకు? టోమోగ్రఫి స్కాన్ తీయాలని న్యూరాలజీ ఎన్.ఎస్. అరుస్తున్నారు”

“ఇప్పుడు పరిస్థితేంటి?”

“అదే చూస్తున్నారుగా. బెడ్‌సోర్స్ రాకుండ చూసుకుంటున్నాం అంతే”

“మాట్లాడుతారా?”

“గుండెలమీద కొంచం అదిమిపెట్టి రుద్దితే కళ్ళు తెరుస్తారు. ఆవిడ ఎవరు? ఈయన్నిక్కడ అడ్మిట్ చేశారే?”

రాజ్యలక్ష్మి జవాబివ్వలేదు.

“డిస్చార్జ్ చేయించి ఇంటికి తీసుకెళ్ళిపోవడం మంచిది. ఇక్కడ రోజుకి రెండువందలా యాభై అవుతుందిగా?”

“రామూ సార్” అని బలవంతంగా రామచండ్రన్ ని చాతిపైన గట్టిగా రుద్ది కదిలించింది నర్స్. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు.

“నేను వచ్చాను” అంది రాజ్యలక్ష్మి.

“దిండు మార్చేద్దామా?” అడిగింది నర్స్.

కళ్ళు చెమర్చాయి. చిక్కిపోయిన చేతులు పట్టుకుంది.

“రాజీని వచ్చాను” అంది.

కళ్ళు ఆమెను గుర్తుపట్టే ప్రయత్నం చేశాయా, గుర్తుపట్టాయా, గుర్తుపట్టాక దుఃఖించాయా.. ఏదీ స్పష్టంకాకుండానే మళ్ళీ మూసుకున్నాయి.

“మాట్లాడగలరా?” నర్స్ వైపు చూసి అడిగింది.

“లేదండి. మాటలు, కదలికలు ఏం లేవు. లంబార్ పంక్చర్ చేసినప్పుడు రక్తం క్లాట్ అయ్యి గడ్డలుగా ఉంది.”

“ఆహారం..?”

ఆన్నీ ట్యూబ్ ద్వారానేనండి. ఎన్.ఎస్. వచ్చాక అడగండి. డిస్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళి ఒక నర్సుని పెట్టుకోవడం మంచిది.”

“వాళ్ళు ఎవరూ రాలేదా?”

“ఎవరు? అడ్మిట్ చేసెళ్ళారు అంతే. ఒక తెల్లటి వ్యక్తి ఆవిడతో వచ్చాడు. వాళ్ళలోవాళ్ళే మాట్లాడుకున్నారు. ‘దాన్ని రమ్మని అప్పజెప్పేయ్’ అని వాదులాడుకున్నారు. వాళ్ళతో మేము కాస్త కటువుగా కూడా మాట్లాడాల్సివచ్చింది.. ఆవిడ పేరేదో చెప్పింది. రామూ రామూ అని పిలుస్తూనే ఉది.”

“పునీతవల్లి”

“ఇద్దరు భార్యలా? రామూ సార్, మీరు గొప్పోళ్ళండి” అని రామచంద్రన్ చెంపలమీద మెల్లగా తట్టింది నర్స్. తల కాస్త ఊగింది.

“మీరు మొదటి భార్యా?”

“అవును”

“ఎన్నాళ్ళనుండి ఇలా?”

రాజ్యలక్ష్మి ముఖం పక్కకి తిప్పుకుని మెల్లగా ఏడవసాగింది.

“ఎన్.ఎస్. వచ్చే టైం. ఏడవకండి. కోప్పడతారు”

కళ్ళు తుడుచుకుని “కింద నా కూతురు ఉంది, పేరు మేనక. రమ్మని చెప్తారా?”

“వార్డ్ బాయ్ తో కబురు చేస్తాను. డిస్చార్జ్ చేసికుని తీసుకెళ్ళిపోండి… ఖర్చుతగ్గుతుంది. నాకెందుకో పెద్ద నమ్మకం లేదు. బ్రెడ్ ఏమైనా కావాలంటే చెప్పండి”

“ఇతనా మా నాన్న?” అన్న మాటలు విని వెనక్కి తిరిగింది. అక్కడ మేనక నిల్చుని ఉంది.

“ఇతనేనా ఆ మనిషి?”

“గట్టిగా మాట్లాడకండి. పక్క గదుల్లో పేషెంట్లున్నారు. ఆమ్మాయీ, నువ్వు ఇతని కూతురివా?”

“నాకూ ఇప్పుడే తెలిసింది. మమ్మీ చూసేశావుగా? ఇక వెళ్దామా? లేట్ అయితే ఆటోలు, బస్ లు ఏవీ దొరకవు”

“ఉండు మేనకా. డాక్టర్ వస్తున్నారట. ఒకసారి కలిసి….”

“కలిసి..?”

“పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలిగా?”

“మమ్మీ, మనం ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు. నేను కింద రిసెప్షన్ లోఎన్‌క్వైరీ చేశాను. మూడు రోజులకి పేమెంట్ చేశారట. ఆ తర్వాత ఎవరూ రాలేదట. బాలెన్స్ ఇంకా పదిహేడు వందలు ఉంది. ఆది కడితేనే డిస్చార్జ్ చేస్తారు.”

“డబ్బు పెద్ద విషయం కాదు మేనకా”

“ఆవిడ వచ్చారా?” అని నర్స్ ని అడిగింది రాజ్యలక్ష్మి.

“చెప్పాను కదండి. మొదటి రోజు వచ్చారు. ఇద్దరూ ఏవేవో వాగ్వాదం చేసుకున్నారు. తర్వాత ఎవరూ రాలేదు ఇక్కడికి”

“వాళ్ళ అడ్రస్ ఉందా?” మేనక అడిగింది.

“రెజిస్టర్ లో లేదు”

“రెజిస్టర్లో మన అడ్రస్, ఫోన్ నంబర్ అంతా కరెక్ట్ గా ఇచ్చారమ్మా. క్లెవర్ గాచేశారంతా. ఆ పునీతవల్లి ఎక్కడుంటుందో తెలుసుకోవాలిప్పుడు”

“మైలాపూర్ లో ఎక్కడో. ఇప్పుడు ఎందుకు తెలుసుకోవడం?”

“ఎందుకంటావేంటి? ఈ మనిషిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి గుమ్మందగ్గర పడేసి రాడానికి”

“ఏంటి మేనకా?”

“అవునమ్మా. చెప్తున్నా విను. వీడ్ని ఇంటికి గింటికి తీసుకురావాలన్న ఆలోచనేమైనా ఉంటే ఈక్షణమే మానుకో. దొంగతనంగా మన ఇంటి అడ్రస్ ఇచ్చేసి మనమీద బాధ్యత వేసి ఎలావెళ్ళిపోతారు? దిస్ ఈజ్ నాట్ ఆన్.”

“మేనకా, ఈ సమయంలో వీటన్నిటి గురించి ఆర్గ్యూ చెయ్యడం అనవసరం అనిపిస్తుంది” అని నర్స్ వంక ఓర కంట చూస్తూ అంది రాజ్యలక్ష్మి.

“ఆర్గ్యూమెంట్కి కూడా ఆ ప్రసక్తే లేదు సిస్టర్. ఈ మనిషి మా అమ్మని ఎలా ట్రీట్ చేశాడో తెలుసా? మా అన్నయ్య భరత్ చెప్పాడు. అప్పుడు నాకు మూడేళ్ళట. వర్షంలో నిజంగానే సినిమాలో చూపించినట్టే వీధిలోకి తోసేసి తలుపేశాడట. ఒక మెడికల్ షాపులో వర్షం ఆగేంతవరకు తల దాచుకున్నామట. రాత్రి తిండిలేదు. వీళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళి తలుపు తడితే అతని పెళ్ళాం తలుపు తియ్యకుండానే వెళ్ళగొట్టిందట. ఇదంతా ఇమేజిన్ కూడా చేసుకోలేరు మీరు. రా మమ్మీ, వెళ్దాం.”

“అవునా రామూ సార్, అలాంటి మనిషివా నువ్వు?” అని నర్సు అతని చెంపమీద తట్టింది. అనువుగా తల ఆడించాడు.

“ఏ ధర్మం ప్రకారం ఈ మనిషిని మేం తీసుకెళ్ళాలో చెప్పండి”

“ఇప్పుడు ఇతను వేటికీ జవాబిచ్చే స్థితిలో లేడు. ఒక బస్తాలాగ ప్లాట్ఫారమ్మీద వదిలేసినా పడివుంటాడు అంతే”

“చెవులువినిపిస్తాయా?” – మేనక చార్ట్ చూసింది. బోలెడన్ని పేపర్లు, పది రోజుల చరిత్ర రాసుంది. సెరిబ్రల్ త్రాంబోసిస్.. ఎంబాలిజం అని ఏవేవో.

“వినిపించదు” – నర్స్ ఉన్నట్టుండి మాటలాపి చీఫ్ డాక్టర్ వస్తున్నట్టు సైగ చేసింది.

చీఫ్ డాక్టర్ కి పెద్ద వయసేమీ ఉండదు. ముప్పైఐదు ఉండచ్చు. తెల్లకోటు జేబు పక్కన ‘జీ. ఆర్. గోపినాథ్’ అని ఉంది. “హలో! అట్లాస్ట్ సంవన్.. ఏంటమ్మా ఈ మనిషిని అలా వదిలేసి వెళ్ళిపోయారు?”

“ఈమె మొదటి భార్య డాక్టర్”

“ఎవరైతేనేం రోజూ ఎవరో ఒకరు చూసుకోవాలి. అండర్స్టాండ్? మీరు డాటరా?”

మేనక తలూపింది.

“లుక్ యంగ్ లేడీ. యువర్ ఫాదర్ ఈజ్ రియల్లీ సిక్. కంట్రోల్ చెయ్యలేని డయాబెటీస్. హైపర్ టెన్షన్, ఆర్టీరియల్ తికెనింగ్, త్రాంబోసిస్ – బ్లడ్ క్లాట్ అయింది. అఫేషియా ఉంది. అన్ని కలగలిపి ఒక పక్కన అంతా పెరాలిసిస్ వచ్చేసింది. చాలా క్లాట్స్ ఉన్నాయి. అన్నిట్నీ కరిగించడానికే ఆపకుండ మందులిస్తున్నాము. ఒక సీ.టీ. స్కాన్ తీయాలి. ఎంత డామేజ్ అని తెలుసుకోడానికి.. ఇతని తాలూకువాళ్లు ఎవవరనిచూస్తే, అడ్మిట్ చేసినవాళ్ళు అసలు కనిపించట్లేదన్నారు. విచిత్రంగా ఉంది!”

“నేను చెప్తాను డాక్టర్”

“మేనకా, నువ్వూరుకో. డాక్టర్, ఇతని ప్రాణానికి ప్రమాదమా?”

“అలా ఏంలేదు. బెడ్ సోర్ లేకుండా చూసుకుని, మందులతోబాటు పూటపూటకీ ఆహారం పెట్టామంటే, పదిరోజుల్లో కొన్ని ఫేకల్టీస్ ని వెనక్కి తెచ్చుకోవచ్చు. లేచినడవలేకపోయినా రైట్ హ్యాండ్ కంట్రోల్లోకి వస్తుందని నమ్మకం ఉంది.

“డాక్టర్, దిస్ బాస్టర్డ్ ట్రీటెడ్ మై మదర్ లైక్ షిట్” అని చెప్పడం మొదలుపెట్టిన మేనకని నెమ్మదిగా తిరిగి చూసి, “లుక్ ఈ మనిషి నా దృష్టిలో ఒక పేషెంట్. ఇతను పర్సనల్ లైఫ్ లో ఎలా ఉండేవాడన్నది నాకనవసరం. ఒక హంతకుడు బెయిల్ మీద వచ్చినా నేను ఇదే ట్రీట్మెంట్ ఇచ్చేవాణ్ణి. నాకు ఇతను ఒక పల్స్, ఒక ఊపిరి, ఒక ఎక్స్రే, ఒక స్కాన్ ఇమేజ్, ఒక సిండ్రోం.. అంతే”

“స్కాన్ అని ఏదో అన్నారు. అది తీయడానికి ఎంత ఖర్చవుతుంది?”

“ఆఫీసులో అడగండి, చెప్తారు. రేపు తీయొచ్చు. ఇతణ్ణి ఇంకో పది రోజులైనా ట్రీట్ చేస్తే స్పృహ వస్తుంది. ఇప్పటీకే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఛాతిపైన గట్టిగా రుద్దితే లేచి చూస్తాడు”

డాక్టర్, “రమచంద్రన్ వేక్ అప్ రామచంద్రన్. వేక్ అప్. ఎవరు వచ్చారో చూడండి, వేక్ అప్” అని మొరటుగా కదిపాడు.

“పది రోజుల తర్వాత తను మాట్లాడుతాడా?” అడిగింది మేనక.

“మాటలు రావడానికి కొన్ని రోజులు పట్టొచ్చు”

“చెప్పింది అర్థం చేసుకోగలడా?” రామచంద్రన్ రెప్పలు తెరచుకుని కనుబొమ్మలు కదిలాయి.

“ఇప్పుడే చూచాయగా అర్థం అవచ్చు. ఏంటి రామచంద్రన్, ఈ అమ్మాయెవరో, చెప్పండి. మీ డాటర్”

“అతను పదిహేనేళ్ళుగా చూడలేదు డాక్టర్”

“అవునా? ఎక్కడైనా అమెరికాలో ఉండేదా?”

“లేదు. అశోక్ నగర్ లో” అంది మేనక.

ఇప్పుడు మేనకని పరీక్షగా చూసిన డాక్టర్, “సారీ, పర్సనల్ ట్రాజెడీలా ఉంది. కోలుకున్నాక నిలదీద్దాంలెండి” అన్నాడు.

డాక్టర్ వెళ్ళగానే నర్స్, “ఇతనేనండి ఇండియాలోనే పెద్ద న్యూరో సర్జన్. ఎంత యంగ్ గా ఉన్నారో చూడండి.” మేనక వినిపించుకోకుండ “మమ్మీ, వెళ్దామా?” అంది.

“లేదు. రాత్రికి నేనిక్కడే ఉంటాను. నువ్వెళ్ళి నాకు బట్టలు తీసుకురా. కాలేజీకి ఫోన్ చేసి చెప్పేయ్ నేను రావట్లేదని”

ఏం చెప్తున్నదో వినకుండా మేనక తల్లిని ఆశ్చర్యంగా చూస్తూ నిలుచుని “దిస్ లేడీ ఈజ్ అన్ బిలీవెబుల్” అంది.

“సిస్టర్, ఈ మనిషి పెట్టిన వాత తాలూకు మచ్చ ఉంది మా అమ్మ భుజమ్మీద”

“మేనకా, ఎక్కువ మాట్లాడకుండ వెళ్తావా లేదా?”

మేనక, పడుకునున్న రామచంద్రన్ ని చూసి “చూడవయ్యా భారతీయ సంస్కృతి.. డిస్గస్టింగ్!” అంటూ విసురుగా వెళ్ళిపోయింది.

మేనక వెళ్ళగానే నర్స్ “ఈ వయసులో అర్థం కాదులెండి” అని తన కడుపు తడిమి చూసుకుంది.

రోజూ ఉదయాన్నే మేనక ఆటోలో అవిష్కార్ రెస్టారెంట్ నుండి అమ్మకి టిఫిన్, కట్టుకోడానికి బట్టలు తెచ్చి ఇచ్చి కాలేజికి వెళ్ళేది. సాయంత్రం వచ్చేప్పుడు కాఫీ, టిఫిన్ తీసుకొచ్చేది. తల్లికీ కూతురికీ మధ్య పెద్దగా మాటలు లేవు. రాజ్యలక్ష్మి మాత్రం “ఈరోజు కళ్ళు తెరచి నన్ను చూశాడు” అని చెప్పేది. “గుర్తుపట్టినట్టు ఉన్నాడు. కళ్ళల్లో నీళ్ళొచ్చాయి!”

“మందుల రియాక్షన్ వల్ల అయుంటుంది మమ్మీ. నిన్నొకటి అడగాలి.”వాత మాట్లాడుకోవచ్చు. ముందు కోలుకుని లేచి నడవనీ”

“ఆ పునీతవల్లి గురించి ఏమైనా తెలిసిందా?”

“లేదు. ఆమె చేతులు దులుపుకుందనుకుంటాను”

“పీల్చిపిప్పి చేసి, ఈ మనిషిని అవతలకి ఉమ్మేసినట్టుంది. అది ఉమ్మేసినదాన్నిదాచుకుంటున్నావు మమ్మీ. నువ్వు ఏం నిరూపించుకోవాలని అనుకుంటున్నావు?”

“ఏం లేదు. మేనకా, ఏమీ నిరూపించుకోవాలని లేదు నాకు”

“ఇతను నిన్ను పెట్టిన హింసలన్నీ మరిచిపోయావా?”

“లేదు”

“మరెందుకు?”

“ఏదో ఒక అనాథకి చేస్తున్నా అనుకుంటున్నా. హ్యుమానిటీ అనుకోవచ్చు. దానికి తోడు పాత బంధం ఒకటుంది. అదేంటో మా జెనరేషన్ వాళ్ళకి అదొక తెగని బంధం అనిపిస్తుంది.”

“ఇన్‌క్రెడిబిల్ లేడీ” అని తల్లి దగ్గరకొచ్చి చెంపలు రాసుకుని వెళ్ళింది మేనక.

డాక్టర్ గోపినాథ్ ఊహించినట్టే ఎనిమిదో రోజు రామచంద్రన్ కి పూర్తి స్పృహ వచ్చి, కుడిచేయిని కదపడం వీలైంది. మనుషుల్ని గుర్తుపడుతున్నట్టు అతని చూపుల ద్వారా తెలుస్తోంది.

“నేనేవరో తెలుస్తోందా?” అంది రాజ్యలక్ష్మి.

కళ్ళల్లో నీళ్ళు కారుతుండగా తలమాత్రం ఆడించాడు.

“మాట్లాడలేరా?”

“మాటలు రావడానికి ఇంకా మూడు, నాలుగు రోజులు పట్టచ్చు”
అప్పుడే లోపలికొచ్చిన మేనకని చూసి డాక్టర్ నవ్వి, “మేనకా, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మీ నాన్నకి పూర్తి స్పృహ వచ్చింది. ఏవేవో అడగాలన్నావే? అడుగు. దిస్ మాన్ ఈజ్ లూసిడ్ నౌ.”

“సిస్టర్, ఈ రోజు వార్డ్ బాయ్ కి చెప్పి షేవింగ్ చెయ్యమనండి”

మేనక తండ్రిని కళ్ళార్పకుండ చూసింది.

“మాట్లాడుతున్నారా?”

“లేదు, అర్థం చేసుకుంటున్నారు. ఈమె ఎవరో గుర్తుపట్టారా?” నీళ్ళు తిరిగిన అతని కళ్ళు తేరిపారచూసి గుర్తుపట్టే ప్రయత్నం చేశాయి.

“మన మేనక! అప్పుడు మూడేళ్ళు. మీ కూతురు మేనక.. మేనక.”

రామచంద్రన్ కళ్ళు తన కూతుర్ని మెల్లగా చూపులతో తడిమాయి.

మేనక బెడ్ కి దగ్గరగా వచ్చి నిల్చుంది.

“చెప్పావామ్మా, ఎనిమిది రోజులుగా నువ్వు ఈయనకి చేసిన సేవలన్నీ? మలమూత్రాలతో సహా చూసుకున్నావని? చెప్పావా? నిన్ను నడివీధిలోకి గెంటేసినందుకు ఎలా మమ్మల్నిపెంచి పెద్ద చేశావో? చెప్పావామ్మా? ఎలా ఉద్యోగంలో చేరి మమ్మల్నిచదివించావో.. చెప్పమ్మా… ఈ మనిషికి బుద్ధొచ్చేట్టు చెప్పమ్మా!”

“మేనకా, అదంతా వద్దు. ఊరుకో”

రామచంద్రన్ చేయి మెల్లగా పైకెత్తి, మేనక చేతిలో వున్న నోట్ బుక్ ని చూపించాడు.

“ఏం చెప్తున్నాడు?”

“నోట్ బుక్ కావాలంటున్నాడు”

“పేపర్ కావాలని అడుగుతున్నట్టున్నాడు”

“ఏవైనా రాసిచూపించాలా?”

రామచంద్రన్ తలూపాడు. మేనక దగ్గర్నుండి నోట్ బుక్కూ పెన్నూ తీసుకుని అతని ఒడిలో పెట్టింది రాజ్యలక్ష్మి. రామచంద్రన్ వేళ్ళసందులో పెన్ను పెట్టగా, అతనుమెల్లగా రాశాడు.

“పునీతవల్లి ఎక్కడ?”
---------------------------------------------------------
మూలం: ప్రముఖ అరవ రచయిత సుజాత రాసిన 
“ముదల్ మనైవి” కథ,
అనువాదం: అవినేని భాస్కర్, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Thursday, August 16, 2018

స్కూలుకెళ్ళే ఆ పొద్దు


స్కూలుకెళ్ళే ఆ పొద్దు
సాహితీమిత్రులారా!

వాకిలి సాహిత్య పత్రికలో "డైరీ" శీర్షికలోని ఒక అంశం ఇది
ఆస్వాదించండి-

పిట్టగోడనానుకుని వున్న గన్నేరు చెట్టు మీద పిచుకలు తెగ అల్లరి చేస్తున్నాయి. బాయిలర్‌లోని వేడి నీళ్ళతో బాల్చీ నిండుతోంది.  రెండు చేతులూ పైకి చాచి ఓ సారి ఒళ్ళు విరుచుకుంది చిన్ని. పూలచెట్లని, నీళ్ళ కుండీలని రాసుకుంటూ చిట్టిదూడ గంతులు వేస్తూ పరిగెడుతోంది. దాన్నో కంట కనిపెడుతూ బుజాల మీద వాలిన రెండు జడలని పైకెత్తి వెనుకకి ముడివేసింది.

నిండిన వేడి నీళ్ళ బాల్చీని తీసుకెళ్ళేముందు తన వంతు న్యాయంగా బాయిలర్ గొట్టంలో వేసిన రెండు చెక్కముక్కలు చిటపటామంటూ వెలుగందుకున్నాయి. స్నానం కానిచ్చి – ఆవుదూడని తల్లి దగ్గరికి చేర్చే ప్రయత్నంలో పరుగులు పెడుతుంటే – అమ్మ వేసిన మూడో కేక ఇంటి లోపలికి నడిపించింది. వెళ్తూ వెళ్తూ తుంపుకెళ్ళిన ఒంటి రెక్క ఎర్ర మందారం అమ్మ జడలోకి చేరింది. పెద్దయ్యాక ఎవరేం చేస్తారు, ఏం చదువుతారు వంటి కబుర్లు నడుస్తున్నాయి చిన్నక్క చిన్నన్న నాన్నల మధ్య.

తడి ఒంటి మీద గౌను వేసుకోవద్దన్నానా అంటూ కాస్త చిరాకుపడి – ఇటుతిప్పి బొట్టూ కాటుక దిద్ది – అటుతిప్పి రెండు జడలు అల్లి పైకి కట్టి, ఆ పైన పెరుగన్నం పెట్టి వెళ్ళమంది అమ్మ. బ్యాగు బుజానికి తగిలించి “నాన్న! నేనైతే పెద్దయ్యాక చందమామకి బొమ్మలు వేస్తా” అంటూ బయటకి పరుగుతీసింది. రోజుకోటి చెబుతుంది అంటూ ఇంటిల్లిపాది నవ్వే నవ్వులు వెనకాలే వచ్చాయి కాసింత దూరం.

ఎడమవైపు ఆట మైదానం దాటి ఆ దిగువన పంట కాలువ పక్కనుండి  ఎడ్ల బండ్లు రెండు ఊర్లోకి వెళ్తున్నాయి. రెండో బండిలో ఎవరూ లేరు. ముందు బండి వెనకాలే అలా వెళ్ళిపోతోంది. నా వెనకే రా! – అంటూ ఎద్దులు కూడా మాట్లాడుకుంటాయా? ! కాస్సేపు ఆగి చూసి కదిలింది.

కొద్ది వాలులో వున్న మైసూరు రామస్వామిగారి ఇంటికెళ్ళే దారిలో రంగురాళ్ళు పైకొచ్చి మెరుస్తున్నాయి. నిన్నా, మొన్నా చూడలేదే అక్కడ? నాలుగు రాళ్ళని ఏరి గౌనుకి తుడిచి బ్యాగులో వేసుకుంది. ఇంతకు ముందు కష్టపడి ఏరి దాచుకున్న రాళ్ళని అమ్మ ఇల్లు సద్దుతూ చెత్తలోకి విసిరేసింది. వీటినెక్కడ దాచాలో!

మొక్కలకి నీళ్ళు పెడుతున్న రాచకొండ రమణ ఆంటీ  పలకరింపుగా చెయ్యి ఊపింది. కాలువ పక్కగా వున్న దర్జీ వాళ్ళ ఇంట్లోంచి బయటకి వచ్చిన ఆమె నీళ్ళ కోసం బిందె తీసుకుని కాలువలోకి దిగింది. ఆమె వెనకే వెళ్ళిన ఓ బుడ్డోడు పారే నీళ్ళ పక్కగా వున్న ఇసుక మేట పైన వాలి హాయిగా పడుకున్నాడు. వీడెప్పుడు స్కూలికోస్తాడో?

ఒకరినొకరు తరుముకుంటూ హెడ్మాస్టర్‌గారింటిలోనుండి వచ్చి కలిసారు చంటి, మోహన్. మైదానంలో ఉయ్యాల బల్లలు, జారుడుబండ సాయంత్రం కోసం ఎదురు చూస్తున్నాయి. పొడుగైన జండా కర్రకి ఆ చివరనున్న చక్రం గాలికి దానంతటదే గిరగిరా తిరుగుతోంది.

ముందు వెళ్తున్న కాంపౌండర్ ముత్యాలు వాళ్ళ రాణి వెనక్కి తిరిగి చూసి ఆగింది. “నీతానింకో పెన్సిలుందా? నాదేడ్నోబోయింది”. తలూపి బ్యాగ్ లోంచి కంపాస్ బాక్స్ తీసి తెరిచింది. పెన్సిల్ తీసుకుని బాక్స్ లోకి చూస్తూ అడిగింది రాణి “ఎందుకిన్ని గాలిబుగ్గలు (బెలూన్లు) ? ” . “ఉత్తినే!  ఊదుకోడానికి”.

రామలక్ష్మీ టీచర్ ఇంటి గుమ్మంలోనుండి తొంగి చూసిన ప్రమీల ఆగొద్దని, వెళ్ళిపోమ్మని సైగ చేసింది. తమ్ముడితో  కలిసి వస్తుంది కాబోలు.

ఇంటిముందు కనిపించని చంద్రకళ కోసం లోపలికి తొంగి చూస్తే – ఎదురొచ్చిన అయ్య  గంగారం “దోస్తులిద్దరు కల్సిపోతరా!” అంటూ నవ్వి బయటకెళ్ళిపోయాడు. “రా! రొట్టె తిందువు” అంటూ ఆప్యాయంగా పిలిచింది లక్ష్మీబాయి. పీట మీద కూర్చున్న ఆమె రెండు చేతుల మధ్య గిరగిరా తిరుగుతోందో పచ్చి జొన్న రొట్టె. ముందు పెనం మీద దోరగా కాలుతూ మరోటి. పక్కన  పింగాణీ పాత్రలో ఎర్రని పండు మిరపకాయ కారం. నోటిలో ఊరుతున్న నీటిని అణుచుకుంటూ “వద్దిప్పుడు, సాయంత్రం వస్తా”  అంటూ మాటిచ్చింది.

చంద్రకళ చెల్లెళ్ళు మున్నీ, రాజీ, తమ్ముడు శంకర్లతో కలిసి వచ్చేలోపు ముందేళ్తున్న గ్రేసు వెనక్కి వచ్చి -  ఆ రోజు సాయంత్రం ఆటలకి కొండ పైకి వెళ్ళడమా లేక మైదానంలోకా అని తేల్చుకుని వెళ్ళింది.

కాలువనానుకుని వున్న చెరుకు పంట మధ్యగా వున్న మట్టి రోడ్డు పైన ఎవరో సైకిల్ మీద వెళ్తున్నారు. ఆ పంట, మరింక ఆ దారి  అలా వెళ్ళి వెళ్ళి  – ఆ చివరన మబ్బుల్లో కలిసి పోయిన కొండల దాకా వున్నాయి. మరెంత దూరం వెళ్తాడతడు?

అలా అటుకేసి చూస్తుండగానే – వెనుకనుండి  ప్రమీల, సుబ్రమణ్యం వచ్చి కలిసారు. రఘునాధన్ మామి ఇల్లు కూడా దాటి – ఇంకో నలుగురు స్నేహితులని పోగేసుకుని కదిలిపోతుంటే – “ఆపా ఆరహై క్యా?” అంటూ ఆపింది జుబేద. “హా! వస్తోంది. పీచే” అంటూ వెళ్తుంటే జుబేద చెల్లెలు, ఇద్దరు  తమ్ముళ్ళు వచ్చి కలిసారు.

ఇల్లు మాయమై కొండ దారి మిగిలాకా – గుంపంతా కలిసి కొండ అంచునే ఈదరి నుండి ఆదరిన వున్న స్కూలుకి నడుస్తున్నారు. సరిగ్గా కొండ మధ్యకి వచ్చేటప్పటికి ప్రతి రోజులానే ప్రమీల తల పైకెత్తి ‘హచ్!’ అంటూ మూడు సార్లు తుమ్మింది. సీతాకోకచిలుకల గుంపోకటి వాళ్ళ తలల మీదుగా ఎగిరెళ్ళిపోయింది. ఇటునుంచి వెళ్తున్నవీళ్ళని అటునుంచి ఊర్లోకి వెళ్తున్నవాళ్ళు ఆగి మరీ చూస్తున్నారు.

కొండ మలుపు తిరిగింది. దూరంగా వెళుతున్న రామలక్ష్మీ టీచర్ని చూడాగానే కలిసి నడుస్తున్న గుంపునంతా వదిలి ఆమె కోసం పరిగెట్టింది. ఊ అన్నా , ఆ అన్నా కథలు చెప్పే ఆమె పక్కన నడవడం ఇష్టం మరి. వగరుస్తూ దగ్గరికి వెళ్ళి “నిన్నటి కథ… అదే… సగంలో…  ఆపేసారే…” అంటుండగానే – “ఏంటా పరుగు ఆ!” అంటూ మందలిస్తూనే చెప్పింది “కథ పూర్తి చేసేంత సమయం లేదమ్మాయ్! చూసావా! అదిగో స్కూల్ దగ్గరపడింది”.

“అయినా ఈరోజో కొత్త కథ ఎదురు చూస్తోందిలే” అందామె తిరిగి నవ్వుతూ. ఏ కథో అడగక ముందే “చూసావా?! ఈ చీర కొంగు. ఎంత పెద్దగా వేసుకున్నానో?”  అంటూ ఎదురు ప్రశ్న వేసింది.

“ఎందుకూ?”.

“పోయినసారి మూడు నెలల జీతాలు ఒకేసారి ఇచ్చారుగా. ఈసారి నాలుగు నెలలవి మరి! మూట కట్టుకుపోదామని”. ఓ సారి మొహంలోకి తొంగి చూసి ఆ నవ్వులో వంతకలిపిందే కానీ – ఈ కథ కానీ కథేదో నిజంగా కలవరపెట్టింది. ఆ కొంగుని తాకుతూ ఆమెకి మరింత దగ్గరగా నడుస్తుండగానే స్కూలోచ్చింది.
---------------------------------------------------------
రచన - విజయ కర్రా, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Wednesday, August 15, 2018

యుక్త వాక్యం – చివరి భాగం


యుక్త వాక్యం – చివరి భాగంసాహితీమిత్రులారా!


నిన్నటి తరువాయి..........

*మినీ బస్సుల ద్వారా గుర్తించిన మార్గాలనుండి రవాణా సేవలు అందిస్తాము.
*మార్గాలను మినీ బస్సుల ద్వారా గుర్తించారా?! కాదే. ఇక్కడ ‘మినీ బస్సుల’ను ‘రవాణా సేవలు’కు వర్తింపజేయాలి. కాని, ‘గుర్తించిన’కు వర్తింపజేశారు. కాబట్టి, ‘గుర్తించిన మార్గాల నుండి మినీ బస్సుల ద్వారా రవాణా సేవలు అందిస్తాము’ అని రాస్తేనే వాక్యం సవ్యంగా ఉంటుంది.

*నయీం సొంత టీవీ చానెల్ ను ఏర్పాటు చేసుకున్నాడు. దానికి సీఈవో గా తనను తొలుత వ్యతిరేకించిన వ్యక్తినే నియమించుకున్నాడు.
*ఈ వాక్యం చెప్తున్నదేమంటే, ఒక వ్యక్తి నయీం చానెల్ కు సీఈవోగా – అంటే సీఈవో హోదాలో – ఉండి నయీంను వ్యతికేకించాడనీ, తర్వాత అతడినే నయీం నియమించుకున్నడని. కాని, వాక్యరచయిత మనసులో ఉన్నది వేరే. తనను మొదట వ్యతిరేకించిన వ్యక్తినే తర్వాత సీఈవోగా నియమించుకున్నాడు, అన్నది చెప్పదల్చుకున్న భావం. ఏ గందరగోళానికీ తావివ్వకుండా ఉండాలంటే ఈ వాక్యాన్ని, ‘నయీం సొంత టీవీ చానెల్ ను ఏర్పాటు చేసుకున్నాడు. తనను తొలుత వ్యతిరేకించిన వ్యక్తినే దానికి సీఈవోగా నియమించుకున్నాడు’ అని మార్చాలి.

*పోలీసుల చేతిలో హతుడైన గ్యాంగ్ స్టర్ ఎన్నో హత్యలు చేశాడు.
*ఈ వాక్యంలో వ్యాకరణపరంగా పెద్ద దోషం లేనప్పటికీ, అర్థప్రసరణ అనే కోణం లోంచి చూసినప్పుడు, వాక్యనిర్మాణం కొంత అన్వయ రాహిత్యానికి దారి తీసినట్టు కనిపిస్తుంది. ఇంగ్లిష్ లో కూడా కొందరు ఈ విధంగానే రాస్తున్నారు, The slain gangster had committed many murders – అని. కాని, మొదటి నాలుగు పదాలను (పోలీసుల చేతిలో హతుడైన గ్యాంగ్ స్టర్) కలిపి ఒకటిగానే పరిగణించాల్సి వుంటుంది కనుక, హతుడయ్యాక హత్యలు చేసే అవకాశమే ఉండదు కదా అనిపిస్తుంది. కాబట్టి, ఏ అయోమయమూ లేకుండా ఉండాలంటే (ఫలానా) గ్యాంగ్ స్టర్ పోలీసుల చేతిలో హతుడు కాకముందు ఎన్నో హత్యలు చేశాడు అని రాయాలి. లేదా వాక్యాన్ని ఇట్లా రెండుగా విరగ్గొట్టి తికమకను నివారించవచ్చు: (ఫలానా) గ్యాంగ్ స్టర్ ఎన్నో హత్యలు చేశాడు. అతడు పోలీసుల చేతిలో హతుడయ్యాడు.

*ఈ ఫోటోలను రహస్యంగా నయీం అంగరక్షకులుగా వ్యవహరించే అమ్మాయిలే తీసేవారు.
*ఈ వాక్యంలోమొదటి మూడు పదాలు (ఈ ఫోటోలను రహస్యంగా) ‘వ్యవహరించే’కు వర్తిస్తాయి. కాని, అవి ‘తీసేవారు’కు వర్తించాలి. కాబట్టి, ఆ మొదటి మూడు పదాలను అక్కణ్నుంచి తీసి, ‘తీసేవారు’కు ముందు పెట్టాలి. నయీం అంగరక్షకులుగా అని కాక నయీంకు అంగరక్షకులుగా అని రాస్తేనే సవ్యంగా ఉంటుంది. అంతిమంగా వాక్యం ఇలా ఉండాలి: నయీంకు అంగరక్షకులుగా వ్యవహరించే అమ్మాయిలే ఈఫోటోలను రహస్యంగా తీసేవారు.

*ప్రభుత్వం నుంచి అనుమతి లభించగానే నయీంకు సహకరించిన రాజకీయ నేతలకు నోటీసులను జారీ చేయనున్నారు.
*ఇది కూడా పై వాక్యం లాగానే ఉంది. రాజకీయ నేతలు ప్రభుత్వం నుంచి అనుమతి లభించగానే నయీంకు సహకరించారా? కాదు కదా. అనుమతి లభించగానే నోటీసులు జారీ చేయడమన్నది ఈ వాక్యంలోని అసలైన ఉద్దేశం. ‘లభించగానే’ తర్వాత కామా ఉంటే అయోమయానికి అంతగా అవకాశముండేది కాదు. కనుక, ‘నయీంకు సహకరించిన రాజకీయ నేతలకు, ప్రభుత్వం నుంచి అనుమతి లభించగానే నోటీసులను జారీ చేయనున్నారు’ అనే వాక్యమే సరైనదిగా ఉంటుంది. కానీ ఈ వాక్యంలో కూడా ‘నేతలకు’ తర్వాత కామా పెట్టకపోతే ‘రాజకీయ నేతలకు ప్రభుత్వం నుంచి అనుమతి’ అన్నది గందరగోళాన్ని సృష్టిస్తుంది. కాబట్టి, అక్కడ కామా ఉండటం చాలా అవసరం.

*పౌర్ణిమ నాడూ, కొత్త చంద్రుడు ఉదయించే రోజూ ఈ రకమైన మానసిక వ్యాధుల రోగులు తమవద్దకు ఎక్కువగా వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు.
*ఇది ఒక ఆంగ్లవాక్యానికి చేసిన అనువాదమని గుర్తించడం కష్టమైన పని కాదు. ఈ వాక్యంలోని భాషాపరమైన అపసవ్యత New moon day ను కొత్త చంద్రుడు ఉదయించే రోజు అని తప్పుగా అనువదించడం వల్లనే ఏర్పడింది. ఇంగ్లిష్ లో పౌర్ణిమని Full moon day అనీ, అమావాస్యను New moon day అనీ అంటారు (No moon day, Nil moon day అనరు). కాని, New moon day ను ‘కొత్త చంద్రుడు ఉదయించే రోజు’ అంటూ ముక్కస్య ముక్కగా అనువదించడంతోనే పప్పులో కాలు వేయటం జరిగిందిక్కడ. కాబట్టి, పౌర్ణిమ నాడూ అమావాస్య నాడూ….. అని రాయాలి. కొందరు పౌర్ణిమకి బదులు పౌర్ణమి అని రాస్తారు. కాని, అది తప్పు. పౌర్ణిమ లేక పూర్ణిమ సరైన పదాలు.

*ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి.
*ఈ వాక్యంలోని భాషాదోషం ప్రాథమిక స్థాయికి చెందింది. ఇక్కడ ‘భాగస్వామ్యం కావాలి’కి బదులు ‘భాగస్వామి కావాలి’ అని ఉండాలి. లేదా, ప్రతి ఒక్కరూ భాగస్వామ్యాన్ని పంచుకోవాలి అనొచ్చు.

*మరింత ముందున్న సమాజ్ వాది పార్టీ సంక్షోభం.
*ఈ వాక్యం అసంపూర్ణంగా ఉంది. శీర్షికగా లేక ఉపశీర్షికగా రాసినప్పుడు దానికేం అభ్యంతరం లేదు. కాని, ‘సంక్షోభం’కు ‘మరింత ముందున్న’ వర్తిస్తుందిక్కడ. ఫలితంగా వాక్యంలో అపసవ్యత ఏర్పడింది. ఎందుకంటే, అంతకు ముందు ఏదైనా కొంత గురించి చెప్పకుండా మరింత అనే పదాన్ని వాడలేము. ‘మరింత ముదరనున్న …..’ అని రాస్తే అయోమయం ఉండదు. కాని, ముదరడం ఇక్కడ చెప్పదల్చుకున్న విషయం కాదు. ‘ముందుంది’ అన్నదే ప్రధానమైతే ‘మరింత’ను తీసేసి, సమాజ్ వాది పార్టీ ముందున్న సంక్షోభం అనవచ్చు.

*ఆలయ భూముల అన్యాక్రాంతాన్ని అడ్డుకోవాలి.
*‘అన్యాక్రాంతం’ విశేష్యమైతే (నామవాచకమైతే) ఈ వాక్యం సరిగ్గానే ఉందని ఒప్పుకోవచ్చు. కాని, అది నామవాచకం కాదు, విశేషణం (Adjective). ఆక్రాంతము పదం విశేషణము అని శబ్ద రత్నాకరము స్పష్టంగా చెప్తోంది. మరప్పుడు అన్యాక్రాంతాన్ని అడ్డుకోవాలి అన్నది ఎట్లా పొసగుతుంది? ‘మనమందరం మనసులలో స్వచ్ఛను నింపుకోవాలి’ అన్నట్టుంటుంది ఆ వాక్యం. కాని, స్వచ్ఛతను నింపుకోవాలి అని రాయాలి కదా. స్వచ్ఛత విశేష్యం, స్వచ్ఛ విశేషణం. There is beauty in her face అనాలి తప్ప There is beautiful in her face అంటామా?! కాబట్టి, పై వాక్యాన్ని ‘ఆలయ భూములు అన్యాక్రాంతం అవడాన్ని అడ్డుకోవాలి’ అని రాస్తేనే కరెక్టు. ఈ వాక్యంలో ‘అవడం’ క్రియాత్మక నామవాచకం కనుక, అపసవ్యత చోటు చేసుకునే అవకాశం లేదు.

*ఉగ్ర కుట్ర, ఉగ్ర దాడి, ఉగ్ర పోరు.
*ఈ పదబంధాలు తెలుగు లిపిలో మనకు తరచుగా కనిపిస్తుంటాయి. ఉగ్ర(ము) అన్నది తత్సమం (సంస్కృతసమ శబ్దం). కుట్ర, దాడి, పోరు అచ్చతెలుగు పదాలు. సంస్కృతసమం కాని పదాలను సంస్కృతసమ శబ్దాలతో కలిపి పదబంధాలను/సమాసాలను ఏర్పరచినప్పుడు వైరి (దుష్ట) సమాసాలు తయారై, వాటిలో తప్పక ఎబ్బెట్టుతనం చోటు చేసుకుంటుంది. భాషపట్ల, శబ్దంపట్ల మమకారం లేనివాళ్లకు ఏ ఎబ్బెట్టుతనమూ కనిపించదేమో! అసలు సమాసాలే వద్దు అనుకుంటున్న ఈ రోజుల్లో వైరి సమాసం అంటూ ఈ గోలేమిటండీ, అని కొందరు విసుక్కోవచ్చు. కాని, వాక్యం అందరికీ వినసొంపుగా ఉండాలంటే, వైరిసమాసాలను మానుకోవడం అవసరం. ఉగ్రకుట్ర అనే బదులు ఉగ్రవాదుల కుట్ర అనొచ్చు కదా. అదే విధంగా ఉగ్రవాదుల దాడి, ఉగ్రవాదుల పోరు అని రాయవచ్చు. ఎంతమాత్రం పొసగని కొన్ని దుష్ట సమాసాలను చదివినప్పుడు, విన్నప్పుడు కొత్తకోటు మీదికి పైజామా తొడుక్కున్నట్టుంటుంది అని ఇంతకు ముందొక వ్యాసంలో రాశాను నేను. మరి ఉగ్రవాదుల దాడి అంటే అట్లా అనిపించదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే, అనిపించదు అన్నది నా సమాధానం. అప్పుడది కొత్తకోటునూ, పైజామానూ హ్యాంగర్లకు తగిలించి పక్కపక్కన పెట్టినట్టుంటుంది, సమాసం చేసినప్పుడు మాత్రం తొడుక్కున్నట్టగా ఉంటుంది – అంటూ అదనపు వివరణను కూడా ఇవ్వొచ్చు! ఎందుకంటే ఉగ్రదాడి సమాసమవుతుంది కాని, ఉగ్రవాదుల దాడి సమాసం కాదు. సమాసం కానప్పుడు భాషాపరమైన అపసవ్యత చోటు చేసుకోదు. ఇక భూపంపిణీ అని రాసేబదులు భూమి పంపిణీ అని రాయొచ్చు. అట్లాగే భూసర్వేకు బదులు భూమి సర్వే అనీ, భూకబ్జాకు బదులు భూమి కబ్జా, అనీ, భూజగడంకు బదులు భూమి జగడం అనీ రాయొచ్చు.

*ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలన్నీ వంద శాతం నెరవేర్చుతాం.
*ఈ వాక్యంలో ‘వాగ్దానాలన్నీ’ అంటేనే మొత్తం వాగ్దానాలు అని అర్థం కనుక, మళ్లీ వంద శాతం అనే అవసరం లేదు. కాబట్టి, ‘ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను వంద శాతం నెరవేర్చుతాం’ అన్నది సరైన వాక్యం. లేదా, ‘ఎన్నికలకు ముందు చేసిన అన్ని వాగ్దానాలనూ నెరవేర్చుతాం’ అని రాస్తే ఇంకా బాగుండదా?

*భార్యను ఏలుకునేందుకు నిరాకరిస్తున్న ప్రభాకర్, తల్లిదండ్రులను అరెస్ట్ చేసి శిక్షించాలి.
*ఇక్కడ ప్రభాకర్ నూ, అతని తల్లిదండ్రులనూ (పోలీసులు) అరెస్టు చేయాలనేది అసలైన ఉద్దేశం. కాని, ఈ వాక్యంలో పోలీసులకు బదులు ప్రభాకర్ కర్త అవుతున్నాడు! ఎందుకంటే, తన తల్లిదండ్రులను ప్రభాకర్ అరెస్టు చెయ్యాలి అనే అర్థం వస్తోంది, వాక్యాన్ని చదివితే! కాబట్టి, ఏ విధమైన గందరగోళమూ ఉండొద్దనుకుంటే, ఇట్లా తిరగ రాయాలి ఈ వాక్యాన్ని: భార్యను ఏలుకునేందుకు నిరాకరిస్తున్న ప్రభాకర్ ను, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేసి, శిక్షించాలి.

*పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మాజీ సర్పంచ్ ను కాల్చి చంపారు.
*ఈ వాక్యంలో పోలీస్ ఇన్ఫార్మర్, నెపం – ఈ రెండు పదాలూ నామవాచకాలే. అయితే వీటి మధ్యన ‘అనే’ లేక ‘అన్న’ లేకపోతే కొంచెం ఏదోలా ఉన్నట్టనిపించడం లేదా? కొన్ని సందర్భాల్లో అటువంటి రెండు నామవాచక పదాల మధ్య అనుసంధానక పదమేదీ లేకపోయినా బాగానే ఉంటుంది. ఉదాహరణకు, మనిషి యొక్క కోరిక అనకుండా మనిషికోరిక అన్నప్పుడు అపసవ్యత కనిపించదు. కాని, ఇన్ఫార్మర్ నెపంతో అన్నప్పుడు తప్పక అపసవ్యత తోస్తుంది. ‘ఇన్ఫార్మర్ అనే నెపంతో’ అని రాస్తేనే అపసవ్యతను నివారించినవాళ్లమౌతాం.

*విషజ్వర పీడితులను ఆదుకోవాలని ఫిర్యాదు.
*ఆదుకోవాలని విజ్ఞప్తి/విన్నపం చేసుకుంటారు గాని, ఫిర్యాదు చేస్తారా? ఆదుకోనందుకు మాత్రం ఫిర్యాదు చేసే అవకాశముంది. కాబట్టి, ఈ వాక్యాన్ని ‘విషజ్వర పీడితులను ఆదుకోవాలని విజ్ఞప్తి/విన్నపం’ అని కాని, ‘విషజ్వర పీడితులను ఆదుకోనందుకు ఫిర్యాదు’ అని కాని మార్చాలి.

*పార్టీలో బలోపేతం కోసం కృషి.
*‘బలోపేతం’ నామవాచకం కాదు. అది విశేషణం (చూ. శబ్ద రత్నాకరము). ఆమె గానంలో శ్రావ్యత ఎక్కువ అని రాసే బదులు ఆమె గానంలో శ్రావ్య ఎక్కువ అని రాసినట్టు తప్పక అనిపిస్తుంది, ఈ వాక్యాన్ని చదివితే! అయితే బలోపేతం నామవాచకం అని భ్రమపడే వాళ్లకు మాత్రం అట్లా అనిపింకచ పోవచ్చు! కాబట్టి, ‘పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి’, లేక ‘పార్టీలో బలం నిపండం కోసం కృషి’ అని రాస్తేనే వాక్యం సవ్యంగా ఉంటుంది.

*లక్షకు 25 నుండి 30 శాతం కమీషన్ వసూలు చేసిన నకిలీ కరెన్సీ గ్యాంగ్.
*శాతం అంటే వందకు. మళ్లీ లక్షకు ఏంటి? ఇక్కడ గందరగోళం ఏర్పడలేదా? లక్షకు 25 వేలనుండి 30 వేల వరకు – అని రాస్తే ఎంత అయోమయ రహితంగా ఉంటుంది వాక్యం! లేదా, ‘లక్షకు’ తీసేసి, సింపుల్ గా 25 నుండి 30 శాతం కమిషన్ వసూలు చేసిన నకిలీ కరెన్సీ గ్యాంగ్ – అంటే సరిపోతుంది.

*సాంకేతిక లోపంతో డౌన్ లోడ్ కాని హాల్ టికెట్లు.
*హాల్ టికెట్లు సాంకేతిక లోపంతో డౌన్ లోడ్ కావలసి ఉండిందా? ఏ లోపమూ లేకుండా డౌన్ లోడ్ కావడమే ఆశిస్తాం కదా. ఈ వాక్యంలో ‘లోపంలో’ తర్వాత కామా ఉన్నా కొంత బాగుండేది. ఎందుకంటే, అప్పుడు అయోమయం కొంచెం తగ్గుతుంది. వాక్యం మరింత సవ్యంగా ఉండాలంటే ‘సాంకేతిక లోపం కారణంగా (లేక మూలంగా, లేక వలన) డౌన్ లోడ్ కాని హాల్ టికెట్లు’ అని రాయాల్సి ఉంటుంది.

*కమ్యూనిస్ట్ శిఖరం (ఫిడెల్ కాస్ట్రో) ఒరిగింది.
*ఒరగడంకూ నేలకొరగడంకూ మధ్య భేదం ఉంది. ‘ఒరుగుట’ పూర్తిగా కింద పడిపోవడాన్ని సూచించదు, కేవలం పక్కకు వంగడాన్ని మాత్రమే తెలుపుతుంది. కాబట్టి, ఇక్కడ ఒరిగిందికి బదులు నేలకొరిగింది అని రాస్తేనే సరిగ్గా ఉంటుంది.

*(ఫిడెల్ కాస్ట్రో) అమెరికా గుండెల్లో సింహస్వప్నమై గర్జించిన యోధుడు.
*ఎవరైనా సింహమై గర్జిస్తారు కాని, సింహస్వప్నమై గర్జించరు. కాబట్టి, ఇక్కడ సింహమై గర్జించిన యోధుడు అంటేనే బాగుంటుంది. లేదా, సింహస్వప్నంగా మారిన యోధుడు/మారి భయపెట్టిన యోధుడు అనొచ్చు.

*నగదు రహితం కోసం కమిటీ.
*ఈ వాక్యంలో కూడా నామవాచకంకు బదులు విశేషణం ఉండటంవల్ల వాక్యంలో అపసవ్యత చోటు చేసుకుంది. ‘రహితం’ విశేషణం, ‘రాహిత్యం’ నామవాచకం. కనుక, నగదు రాహిత్యం కోసం కమిటీ అని రాస్తేనే కరెక్టుగా ఉంటుంది. లేదా, నగదురహిత లావాదేవీల కోసం కమిటీ అనొచ్చు.

*జి.హెచ్.ఎమ్. సి. వసూళ్లు 2500 శాతం పెరిగాయి.
*అర్థశాస్త్రం చదివిన గణకుల భాషను అనుసరిస్తూ 2500 శాతం అని చెప్తే మామూలు పాఠకులకు ఎలా తెలుస్తుంది? వాళ్లకు సులభంగా అర్థం కావడం కోసం ‘25 రెట్లు పెరిగాయి’ అనొచ్చు కదా. కనీసం బ్రాకెట్లలోనైనా అదనంగా రాయవచ్చు.

*ప్రపంచంలోనే ఎత్తైన భవనం.
*‘నే’ ను సాధారణంగా ‘మాత్రమే’ అనే అర్థంలో వాడుతాము. రైల్లోనే వెళ్తాను అన్నప్పుడు వేరేదాంట్లో వెళ్లను అని అర్థం. పోనీ, ఈ వాక్యంలో ‘నే’ ను ఉంచినా, ఎత్తైనకు ముందు అత్యంత/అన్నిటికన్న అని రాస్తే సవ్యంగా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం అని కాని, ప్రపంచంలో అన్నిటికన్న ఎత్తైన భవనం అని కాని రాస్తే అపసవ్యతను నివారించినవాళ్లమౌతాము.

*ఈ వార్త వాట్సప్ లో దావానలంలా వ్యాపిస్తోంది.
*వాట్సప్ అంటే What’s up (What is up) అని! కాని ఇక్కడ చెప్పదల్చుకున్నది What’s App గురించి! App అనేది Application కు పొట్టి రూపం. కాబట్టి, వాట్సాప్ అని రాస్తేనే కరెక్టు.

*ఆ రెండు సినిమా కథల మధ్య సారూప్యత ఉంది.
*సారూప్యత, తాదాత్మ్యత నైపుణ్యత మొదలైన పదప్రయోగాలు మనకు చాలానే తారస పడుతుంటాయి. ఇవి కొంత వరకు వివక్షత వంటివే. సారూప్యం, తాదాత్మ్యం, నైపుణ్యం అన్నవే నామవాచకాలైనప్పుడు, వాటికి మళ్లీ ‘త’ అనే ప్రత్యయాన్ని చేర్చి కంగాళీ చేయడమెందుకు? సారూప్యంకు బదులు సరూపత అనీ, నైపుణ్యంకు బదులు నిపుణత అని కూడా రాయొచ్చు. ‘వివక్ష’ నామవాచకం కనుక దానికి ‘త’ చేరిస్తే తప్పవుతుంది.

*ఆమె హ్రిదయం గుబగుబలాడింది.
*తెలుగు భాషలో హ్రిదయం అనే పదమే లేదు. ‘హృదయం’ ఉంది. అయితే కొందరు దాన్ని హ్రుదయం అని పలుకుతారు. అది తప్పు. హ్రిదయం అని పలకాలి. కాని, ఇది పలకడం కోసం మాత్రమే. రాయడం మాత్రం హృదయం అనే రాయాలి. తమ పేరును క్రిష్ణ కుమార్ అని రాసుకునేవాళ్లు కూడా ఉంటారు కొందరు.

*కూల్చివేతల కారణంగా ఆగిన వృద్ధగుండె.
*ఇక్కడ వృద్ధగుండె వైరి సమాసం. వైరి సమాసాలను ఉచ్చరించినప్పుడు పొసగనితనం సులభంగా తెలుస్తుంది. కాబట్టి, వృద్ధుని/వృద్ధురాలి గుండె అని రాస్తే చిక్కే ఉండదు కదా. హృదయం ‘వృద్ధ’లాగా సంస్కృతసమ శబ్దం కనుక, ఆ రెండు పదాలతో పదబంధాన్ని తయారు చేస్తే ఎటువంటి అపసవ్యతా ఉండదు.

*కాసేపయ్యక బజారుకు వెళ్లిన పిల్లవాడు తిరిగి వచ్చాడు.
*ఈ రకానికి చెందిన అపసవ్య వాక్యాల గురించి ముందు కూడా చెప్పుకున్నాం. అయినా మళ్లీమళ్లీ చెప్పుకుంటే మంచిదే. పిల్లవాడు కాసేపయ్యాక బజారుకు వెళ్లాడా? కాదే. కాసేపయ్యాక తిరిగి వచ్చాడు అన్నది చెప్పదల్చుకున్న అర్థం. కాబట్టి, బజారుకు వెళ్లిన పిల్లవాడు కాసేపయ్యాక తిరిగి వచ్చాడు అని రాయాలి.

*ఇది ప్రారంభించడానికి ముందు నేనెంతో ఆలోచించాను.
*ఈ రకమైన వాక్యాలు కూడా నేటికాలంలో తరచుగా దర్శనమిస్తున్నాయి. ఈ వాక్యంలో ‘నేను’ కర్త. కాబట్టి, నేను దీన్ని ప్రారంభించడానికి ముందు ఎంతో అలోచించాను అంటే సరిగ్గా ఉంటుంది.

*మెరీనా బీచ్ లో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని విద్యార్థుల ఆందోళన.
*మెరీనా బీచ్ లో జల్లికట్టు జరిగినట్టు/జరుగుతున్నట్టు సూచిస్తోంది ఈ వాక్యం! కాని, అక్కడ జరుగుతున్నది ఆందోళన – జల్లికట్టు కాదు. కనుక, ఈ వాక్యం ఇలా ఉండాలి: జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని మెరీనా బీచ్ లో విద్యార్థుల ఆందోళన.

*భర్తను ప్రియుడితో హత్య చేసిన భార్య
*ఇక్కడ ‘తో’ అనే ప్రత్యయం అసంబద్ధంగా ఉండటమే మొత్తం తికమకకు దారి తీస్తోంది. ‘ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసిన భార్య’ అంటే సజావుగా ఉంటుంది. లేదా ‘భర్తను ప్రియుడి చేత/ప్రియుడితో హత్య చేయించిన భార్య’ అనొచ్చు.

*మంత్రిగారు తమ శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
*ప్రభావవంతంగా, బలవంతంగా, ధనవంతుడు, గుణవంతుడు, తేజోవంతమైన, బలవంతమైన – మొదలైన పదాల్లో వంతంగా/వంతుడు/వంతమైన ఏ పదాలకైతే వచ్చి చేరుతున్నాయో అవి (ప్రభావం, బలం, ధనం, గుణం, తేజస్సు) నామవాచకాలు. కాని, సమర్థం నామవాచకం కాదు. అది విశేషణం. దాని నామవాచక రూపం సామర్థ్యం, లేక సమర్థత. నామవాచకంతో ప్రత్యయం సంయోజనం చెందుతుంది కాని విశేషణంతో చెందదు. కాబట్టి, ‘సమర్థం’కు ‘వంతం’ అతుక్కోదు. ఒకవేళ అతుక్కునేట్టుగా రాస్తే అది భాషాదోషానికి దారి తీస్తుంది. అందుకే సమర్థవంతంగా అని కాక సమర్థంగా అని రాయాలి. అంటే, మంత్రిగారు తమ శాఖను సమర్థంగా నిర్వహిస్తున్నారు అని రాయటం సరైందన్న మాట. వ్యాకరణ సముద్రపు లోతుల్ని ముట్టినవారు దీనిగురించి మరింత సమగ్రమైన వివరణను ఇవ్వగలుగుతారు. ‘సామర్థ్యవంతంగా’ అన్నది ఎందుకు ఉపయోగంలో లేదో చెప్పలేము. ఇక ప్రభావములోని ‘ము’ ను విలుప్తం చేసి ‘వంతం’ను కలిపినట్టే సమర్థతలోని ‘త’ ను విలుప్తం చేసి ‘వంతం’ ను కలుపవచ్చు కదా అనే సందేహం రావడం సహజం. కాని, ఇక్కడ ‘ము’ ప్రథమా విభక్తి ప్రత్యయం ‘త’ విభక్తి ప్రత్యయం కాదు, మామూలు ప్రత్యయం. అయితే, ఇది పూర్తిగా సంతృప్తికరమైన వివరణ కాకపోవచ్చు. సరైన వ్యాకరణ సూత్రాన్ని చెప్పి వివరిస్తేనే కరెక్ట్ గా ఉంటుంది.

*అతనిలో ఊహాశాలీనత మెండు.
*శాలిత లేక శాలిత్వమును an affix denoting possession అని వివరించడం జరిగింది బ్రౌణ్య నిఘంటువులో. గుణశాలిత అంటే the possession of virtue. ధీశాలిత్వమును ధీశాలిత అనీ, బుద్ధిశాలిత్వమును బుద్ధిశాలిత అనీ అనవచ్చు. అదే విధంగా ఊహాశాలిత్వమును ఊహాశాలిత అనడం సరైనదే. శాలి కూడా ఒక affix. బలశాలి, ధీశాలి, ధైర్యశాలి అంటే ఆ గుణాలను కలిగినవాడు అని అర్థం. ఇక శాలీనత వేరే పదం. దానికి అర్థం బిడియం, త్రప, వ్రీడ మొదలైనవి. కాబట్టి ఊహాశాలీనత తప్పు. ఊహాశాలిత, శాలీనత సవ్యమైన పదాలు.

*ఎంత ఆలోచించినా అతని మెదడుకు తరుణోపాయం తట్టలేదు.
*ఈ వాక్యంలో తరుణోపాయం తప్పు, తరణోపాయం సరైనది. తరణము అంటే దాటుట. తరణోపాయం అంటే గండం నుండి గట్టెక్కించే ఉపాయమన్న మాట. తరుణముకు సమయము, వయస్సు అనే అర్థాలున్నాయి. దీన్ని సాకుగా చూపి, సమయానికి తోచిన ఉపాయం అనే అర్థంలో తరుణోపాయం కూడా సరైనదేనని ఎవరైనా వాదించే అవకాశముంది. కాని, తరణోపాయముకు means, expedient అనే అర్థాలు కనపడుతాయి తెలుగు – ఆంగ్లం బ్రౌణ్య నిఘంటువులో. మళ్లీ ఇక్కడ ఓ సందేహం కలుగవచ్చు భాషాప్రియులకు. అదేమిటంటే, Brown ను తెలుగులో బ్రౌన్ అని ఉచ్చరిస్తాము, బ్రౌణ్ అని పలకం. మరి బ్రౌన్య నిఘంటువు అనాలి కదా? దీనికి వివరణ ఏమిటో తెలియదు. మొదట్నుంచీ పండితులు అంగీకరిస్తూ వస్తున్న పదం కనుక, గట్టిగా ఆక్షేపణ తెలుపలేము. ఇటువంటి కొన్ని పదబంధాలను ‘అనింద్య గ్రామ్యాలు’గా నిర్ణయించారు పెద్దలు. అంటే, మహాపండితులకు మినహాయింపుల వెసులుబాటు ఉంటుందన్న మాట. గర్భగుడి అన్న పదబంధం నిజానికి వైరిసమాసం అవుతుంది కాబట్టి, భాష/వ్యాకరణం ప్రకారం అది తప్పు. అయినా పూర్వం పండితులే దాన్ని ఆమోదిచిన కారణంగా, ఆక్షేపణ తెలుపక మనమూ అంగీకరించాలనేది చెప్పకనే చెప్పబడిన విషయం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ‘గర్భదేవాలయం’కన్న ‘గర్భగుడి’ ఉచ్చారణ పరంగా సాఫీగా, హాయిగా ఉంటుంది. అదేవిధంగా జీవగర్ర కూడా వైరి/దుష్ట సమాసమే. ఎందుకంటే, జీవము సంస్కృతసమ శబ్దం కాగా, కర్ర అచ్చతెలుగు పదం. కర్రకు బదులు కాష్ఠము అనే తత్సమాన్ని కలిపి జీవకాష్ఠము అని రాయొచ్చు. కాని, ఉచ్చారణ పరంగా జీవకాష్ఠముకన్న జీవగర్రనే హాయిగా, సాఫీగా ఉంటుంది. జీవగర్ర కూడా అనింద్య గ్రామ్యమే. అయితే మహాపండితులే అట్లా రాసినప్పుడు మనమెందుకు రాయకూడదు అని తర్కించకూడదు.

*కోర్టు ఇచ్చిన ఆ తీర్పు హిందూత్వ శక్తులకు చెంపపెట్టు.
*పశువుతో పశుత్వం, మృదువుతో మృదుత్వం, శత్రువుతో శత్రుత్వం ఏర్పడినప్పుడు హిందువుతో హిందుత్వం ఏర్పడాలి తప్ప, హిందూత్వం కాదు.

*పుట్టిన పాప పురిటిలోనే చనిపోయింది.
*పురిటి (పురుటి) అంటే పురుడు యొక్క అవుతుంది. కనుక, పురుడు తాలూకు వాసనను పురిటి (పురుటి) వాసన అంటాం. పై వాక్యంలో ‘యొక్క’ అన్వయం లేదు కనుక, పురుడులోనే చనిపోయింది అనాలి. అదే విధంగా ‘నీ చేయిని చాచు’ సరైన వాక్యం. ‘నీ చేతిని చాచు’ అవసవ్యమైనది. చేతిబలం, చేతివేళ్లు అనొచ్చు. ఎందుకంటే, ఆ పదాలు చేయి యొక్క బలాన్ని/వేళ్లను సూచిస్తాయి. గోతిని తవ్వారు అనకుండా గొయ్యిని తవ్వారు అని రాయడమే ఎక్కువ సమంజసంగా ఉంటుంది. మళ్లీ గోతిలోతు, గోతివెడల్పు అనొచ్చు – గోతి యొక్క లోతు, గోతి యొక్క వెడల్పు అనే అర్థాలను సూచించే విధంగా.

*జైలుకెళ్లి వచ్చాకా అదే తీరు.
*వచ్చాక బదులు వచ్చాకా అని రాయటం అప్పుడప్పుడు చూస్తుంటాం మనం. మొన్నమొన్నటి దాక ఆ దీర్ఘంవల్ల అర్థంలో మార్పు ఉండేది కాదు. ‘దాకా’, ‘లాగా’ మొదలైన పదాలలాగ అన్నమాట. కాని, పై వాక్యంలో ‘క’ కు ఆ దీర్ఘం అర్థంలో మార్పును సూచిస్తోంది. ఈ వాక్యంలో జైలుకెళ్లి వచ్చాకా అంటే వచ్చింతర్వాత కూడా అన్నది ఉద్దేశిత భావం. కాని, జైలుకెళ్లి వచ్చింతర్వాత కూడా అదే తీరు – అని రాస్తేనే సవ్యంగా ఉంటుంది. అయితే, ఆధునిక వ్యవహారంలో కొందరు కొన్ని పదాల అంతాలకు దీర్ఘాన్ని కలిపి వాడుతున్నారు, ఉదాహరణకు, ‘గురించి’కి బదులు ‘గురించీ’ అని వాక్యం మధ్యలో రాసేవాళ్లెందరినో నేనెరుగుదును.

*హోటల్ పరిసరాల్లో అపరిశుభ్రం.
*ఈ వాక్యాన్ని ‘హోటల్ పరిసరాలు అపరిశుభ్రం’ అని గానీ, ‘హోటల్ పరిసరాల్లో అపరిశుభ్రత’ అని గానీ మార్చి రాస్తే కరెక్టుగా ఉంటుంది. ఎందుకంటే అపరిశుభ్రం నామవాచకం కాదు. అది విశేషణం. ఇంట్లో dirty ఉంది అనడం తప్పు. Dirtiness ఉంది అనడమే రైటు. లేదా, ఇల్లు dirty గా ఉంది అనాలి.

*అధికారులు వ్యాపారులు కుమ్మక్కు.
*ఈ వాక్యం ద్వారా చెప్పదల్చుకున్నది, రెండు వర్గాలవారు కలిసి ఏదో తప్పు చేశారు/చేస్తున్నారు అని. కాని, ఎటువంటి గందరగోళమూ లేకుండా ఉండాలంటే, ‘అధికారులు వ్యాపారులతో కుమ్మక్కయ్యారు’ అని మార్చాలి ఈ వాక్యాన్ని. ఈ రకానికి చెందిన మరికొన్ని దోషాలను ఉదాహరించవచ్చు. ఉదాహరణకు, మనిషికీ జంతువుకూ భేదం ఉండాలి అని రాస్తారు చాలా మంది. మనిషికీ జంతువుకూ మధ్య భేదం ఉండాలి అనేదే సరైన వాక్యం.

*కాస్త పెదవులకు కోల్డ్ క్రీమ్ రాసుకో.
*ఈ వాక్యంలోని ‘కొంచెం’ (కాస్త) కోల్డ్ క్రీమ్ కు వర్తించాలి. కాని, ఇక్కడ కోల్డ్ క్రీమ్ ను మొత్తం పెదవులకు కాకుండా ‘కాస్త పెదవులకు’ మాత్రమే రాసుకో అనే అర్థం వస్తోంది! అంటే, మొత్తం పెదవులకు కాదన్న మాట. కనుక, పెదవులకు కాస్త కోల్డ్ క్రీమ్ రాసుకో – అని రాస్తేనే వాక్యం సరిగ్గా ఉంటుంది.

*అమెరికాకు భారత్ నిజమైన మిత్రుడు.
*మన దేశాన్ని భరత మాత, భారత మాత అని పిల్చుకుంటున్నాం మనం. అంటే అది స్త్రీ లింగమన్న మాట. మరిక్కడ మిత్రుడు అన్నప్పుడు పుల్లిగమవుతోంది! ఇంగ్లిష్ లో India is a true friend of U.S. అనే వాక్యంలో ఎబ్బెట్టుతనమేదీ గోచరించదు. కాని, మన దేశం వేరొక దేశానికి మిత్రుడు అనగానే ఆ ‘డు’ వల్ల ఏదోలా అనిపిస్తుంది. ఈ ఎబ్బెట్టుతనాన్ని నివారించాలంటే అమెరికాకు భారత్ నిజమైన మిత్రదేశం అనవచ్చు. మళ్లీ పాకిస్తాన్ భారత్ కు శత్రువు అని రాస్తే అందులో ఏ ఎబ్బెట్టుతనమూ స్ఫురించదు. ఎందుకంటే, ‘శత్రువు’ ఉభయ లింగం కనుక. ‘డు’ వల్లనే వచ్చింది ఈ తంటా అంతా! అమెరికాకు భారత్ నిజమైన నేస్తం అని రాస్తే కూడా ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

*పరాకాష్టకు చేరిన వికృతం.
*ఈ వాక్యభాగం (ఉపశీర్షిక) లో ముందు పరాకాష్ట తప్పు. పరాకాష్ఠ సరైన పదం. ఇక ‘వికృతం’ నామవాచకం కాదు, అది విశేషణం. వికృతం అంటే Ugly. కాని, మనం ఇక్కడ Ugliness ను తెలుగులో రాయాలి. కాబట్టి, పరాకాష్ఠకు చేరిన వికృతత్వం అనాలి. లేదా, పరాకాష్ఠకు చేరిన వికృత చేష్టలు అనొచ్చు. ‘తం’తో అంతమయ్యే ఎన్నో పదాలు నామవాచకాలు కావడం వలన, వికృతం కూడా నామవాచకం అని భ్రమిస్తాం మనం. ఫలితం, మారుతం మొదలైన చాలా పదాలు నామవాచకాలే. అలాగే నైపుణ్యం, శౌర్యం, సోయగం, దుండగం – ఈ పదాలన్నీ సున్నతో ముగుస్తాయి. ఇవి కూడా నామవాచకాలు. సున్నతో, ‘తం’తో ముగిసే ఇటువంటి పదాలెన్నటినో చాలా సార్లు నోటిద్వారా విని, అచ్చులో చూసి, వికృతం కూడా నామవాచకం అని మనసులో ఒక ఊహను బలపరచుకుంటాం. అదే ఈ తికమకకు కారణమౌతుంది.

*ఆ పాత మధురాలు
*ఆపాతము అనే ఒక పదముంది. దాని అర్థం మంచి చెడ్డలాలోచించక అనుభవించుట. కాని, ఇక్కడ ఆనాటి పాత (old) – అని చెప్పడం ప్రధానోద్దేశం. కాబట్టి, అట్లా విడిగా రాయడం సరైనదే. అయితే మధురం నామవాచకం కాదు, విశేషణం. విశేషణాలకు బహువచనాలుండవు. ఉదాహరణకు wonders ఉంటుంది కాని wonderfuls అనే పదం ఉండటానికి వీల్లేదు. అదే విధంగా beautifuls ఉండదు, beauties ఉంటుంది. కనుక పై వాక్యాన్ని ఆ పాత మాధుర్యాలు (అంటే ఆ పాత పాటలలోని తియ్యదనాలు) అని సవరించాలి. మోహనాలు, మనోజ్ఞాలు, విశాలాలు, శీతలాలు మొదలైన పదాలను చాలా మంది వాడుతుంటారు. కాని, అవన్నీ విశేషణాలు కనుక, అట్లా రాస్తే అవి తప్పులవుతాయి. మోహనత్వాలు, మనోజ్ఞతలు, వైశాల్యాలు, శీతలత్వాలు అని రాస్తేనే కరెక్టు.

*జల పిడుగు
*కావ్యరచనకు బదులు కావ్య రాత అని రాసినట్టుగా ఉంది ఈ పదబంధం. లేదా తాళపత్రాలుకు బదులు తాళ ఆకులు అన్నట్టుగా…! ఎబ్బెట్టుతనాన్ని సంతరించుకున్న ఇటువంటి వైరి సమాసాలను మానుకోవడం అసాధ్యమైన పనేం కాదు. జల పిడుగు అనే బదులు ‘పిడుగై తగిలిన జలసమస్య/నీటి సమస్య’ అనొచ్చు.

*ఆల్టర్నేట్ రూట్లు
*Alternate కు alternative కు మధ్య ఉన్న భేదాన్ని గమనించకపోవటం వల్ల వచ్చిన చిక్కు ఇది. Alternate అంటే ఒకటి విడిచి ఒకటి. ఉదాహరణకు సోమ, బుధ, శుక్ర వారాలు alternate days. అదేవిధంగా జనవరి, మార్చ్, మే నెలలు alternate months. కాని, ఈ వాక్యభాగంలో ఉద్దేశింపబడిన భావం ప్రత్యామ్నాయం అని. ఈ తెలుగు పదాన్ని ఇంగ్లిష్ లో alternative అనాలి. కాబట్టి ఆల్టర్నేటివ్ రూట్లు అనటం సరైనది. ఈ విషయాన్ని నేను భాషాసవ్యతకు బాటలు వేద్దాం అనే నా పుస్తికలో ఇదివరకే ప్రస్తావించాను. ఇక ఈ శీర్షిక కింద ఇచ్చిన విషయంలో రూట్లను రహదారులు అన్నారు. ఇది తప్పని భావిస్తారు కొందరు. రహదారి highway కు మాత్రమే సమానమైన పదమని తలుస్తారు. కాని, నిఘంటువుల ప్రకారం రహదారి అంటే అందరూ పోయేందుకు ఉద్దేశింపబడిన దారి అని అర్థం. రాచమార్గం/రాచబాట బహుశా రాజులు మాత్రమే వెళ్లేందుకు ఉద్దేశింపబడిన దారి కావచ్చు.

*చురుకైన మెదడుకు….
*మెదడు చురుకుగా ఉండాలంటే ఏమేం తినాలో కింద వివరించారు. అయితే శీర్షికలో మెదడుకు బదులు మెదడు కోసం అని రాస్తే మరింత సవ్యంగా ఉంటుందని నా అభిప్రాయం. ‘కు’ ఆంగ్లంలో to ను మాత్రమే కాకుండా for ను కూడా సూచిస్తుంది. ఈ శీర్షిక కింద రాయబడిన వస్తువుల జాబితా కేవలం మెదడు కోసం అవసరమైన తినుపదార్థాలనే తెలుపుతుంది. అంటే for అనే అర్థం అన్వయం కావాలన్న మాట. అటువంటప్పుడు ‘చురుకైన మెదడు కోసం’ అని రాస్తే అది కేవలం for ను మాత్రమే సూచిస్తుంది.

*దిక్కు మాలిన శరణార్థులను జైళ్లలో పెట్టాలని అమెరికా భావిస్తోంది.
*దిక్కు మాలిన అనే ప్రయోగం తిట్టులాంటి దాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు దిక్కు మాలిన వెధవ, దిక్కు మాలిన ఉద్యోగం, దిక్కు మాలిన సినిమా మొదలైనవి. కాని, పై వాక్యం ద్వారా చెప్పదల్చుకున్న భావం అది కాదు. నిస్సహాయులైన వాళ్లకు అనేదే చెప్పదల్చుకున్న భావం. కనుక దిక్కు లేని/దిక్కు కరువైన శరణార్థులను….. అని రాయటమే కరెక్టు.

*మూత్రం బాగా రావాలంటే సక్రమంగా పని చెయ్యాల్సింది కిడ్నే.
*మీరు వేసింది మంచి ప్రశ్నే అనే వాక్యంలో చివరి పదం ఎట్లా ఏర్పడింది? ప్రశ్న + ఏ = ప్రశ్నే అవటం వల్లనే కదా! బావిలోకి దిగడానికి మెట్లే లేవు అనే వాక్యంలో మెట్లు + ఏ = మెట్లే అయింది. అదే విధంగా సాంబారులో నాకు ఇష్టమైనది క్యారెటే అన్నప్పడు క్యారెట్ + ఏ = క్యారెటే అయింది. ఆయన మంచి మనిషే అన్నప్పుడు మనిషి + ఏ = మనిషే అయింది. అంటే అకార, ఉకార, ఇకారాలతో అంతమయ్యే హ్రస్వ పదాలు, లేక దృతము (నకారపు పొల్లు)తో ముగిసే పదాలు ‘ఏ’తో కలిసి ఏకారాంత పదాలను (ప్రశ్నే, మెట్లే, క్యారెటే, మనిషే) ఏర్పరుస్తాయన్న మాట. వీటిలోని మూలపదాలైన ప్రశ్న, మెట్లు, క్యారెట్, మనిషి హ్రస్వాంతాలు. కాని, దీర్ఘాంతాలైన పదాలకు ‘ఏ’ కలిసినప్పుడు ఏకారాంత పదం రాకుండా ‘యే’ లేక ‘నే’ చేరడం సరైనది. ఉదాహరణకు, నాకు ఇష్టమైన చెప్పుల దుకాణం బాటాయే/బాటానే అనాలి. బాటే అనకూడదు. ఆ పాటను పాడింది బాలూయే/బాలూనే అనాలి. బాలే కూడదు. అదే విధంగా, నువ్వు చెప్పాల్సింది సారీయే/సారీనే అనాలి తప్ప సారే అనకూడదు. ఈ సూత్రం ప్రకారం పై వాక్యంలో చివర కిడ్నే అని కాకుండా కిడ్నీయే/కిడ్నీనే అని ఉండటమే సమంజసం.

ఆంగ్ల పదాలను తెలుగు లిపిలో రాసేటప్పుడు ఏర్పడే గందరగోళం అంతా యింతా కాదు. ఉదాహరణకు, గోడకు ఉన్న పటాన్ని చూడు అనకుండా గోడకు ఉన్న మాప్ ను చూడు అన్నప్పుడు, మాప్ (mop) అనే మరో ఆంగ్ల పదం స్ఫురణలోకి వచ్చి గందరగొళాన్ని కలిగిస్తుంది. మాప్ (mop) అంటే తుడిచే గుడ్డ, లేక చివరన తుడుపు గుడ్డ కట్టబడి వున్న పొడవైన కర్ర. ఈ అయోమయాన్ని నివారించాలంటే మాప్ అనకుండా మ్యాప్ (map) అనక తప్పదు. ఆంగ్లంలో map, mop అనే పదాలున్నాయి కాని, భిన్నమైన అర్థానికి దారి తీసే myap అనేది లేదు. నిజానికి map కు మ్యాప్ సరైన ఉచ్చారణ కాదు. కాని, కనీసం అది మరో భిన్నమైన ఆంగ్ల పదాన్ని సూచించదు. అదే విధంగా cap ను క్యాప్ అనక తప్పదు. కాప్ అని రాస్తే అది పోలీసు (cop) ను సూచించే ప్రమాదముంది!

*ఆస్పత్రి అమానుషం
*Inhumanity of the hospital అనేది చెప్పదల్చుకున్న భావమైతే ఈ ప్రయోగం సరైనది కాదు. ఎందుకంటే అమానుషం నామవాచకం కాదు, అది విశేషణం. అక్కడ నామవాచకాన్ని ఉద్దేశించాలనుకుంటే అమానుషంకు బదులు అమానుషత్వం సరిపోయే పదం. Inhuman hospital అనదల్చుకుంటే అమానుష(మైన) ఆస్పత్రి అని రాయాలి.

*కనీసం ప్రతి మండలానికి ఒక గ్రంథాలయం ఉండాలి.
*ఇక్కడ ‘కనీసం’ ప్రతి మండలానికి అనే పదాలకు వర్తిస్తున్నది. కాని, అది ‘ఒక గ్రంథాలయం’కు వర్తించే విధంగా ఉండటమే కరెక్టు. కనుక, ప్రతి మండలానికి కనీసం ఒక గ్రంథాలయం ఉండాలి అనే వాక్యమే సరైనది. ఈ భాషాదోషం దాదాపు అన్న పదాన్ని వాడేటప్పుడు తలెత్తే దోషంలాంటిదే.

*మనిషినీ సంస్కృతినీ వేరు చేసే ధోరణులు ప్రమాదకరమైనవి.
*ఈ వాక్యం ఏం చెప్తోంది? విడివిడిగా మనిషిని దేని నుండో, సంస్కృతిని దేని నుండో వేరు చేసే ధోరణులు……. అని కదా. కాని, నిజంగా చెప్పదల్చుకున్న భావం అది కాదు. చెప్పాలనుకున్న భావాన్ని సరిగ్గా వ్యక్తీకరించాలంటే, ఈ వాక్యాన్ని ఇలా తిరగ రాయాలి: మనిషిని సంస్కృతినుండి వేరు చేసే ధోరణులు ప్రమాదకరమైనవి.

*శాఖాహారం తేవాలన్నది బీజేపీ కుట్ర.
*‘శాఖాహార, మాంసాహార భోజన హోటల్’ అనే బోర్డులను మనం తరచుగానే చూస్తుంటాం. వెజిటేరియన్ ను శాఖాహార/శాఖాహారి అనటం సరి కాదు. శాఖ అంటే కొమ్మ. మరి ఆ హోటల్లో కొమ్మలు కలిపిన భోజనాన్ని వడ్డిస్తారా? నాన్ వెజిటేరియన్ కరీ (curry) కి సరైన పదం శాకం. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ పదం ఎక్కువగా వాడుకలో ఉంది. వెజిటేరియన్ ను శాకాహార/శాకాహారి అనటమే కరెక్టు.

*తొలి అణుప్రయోగం ఇక్కడే.
*అణ్వస్త్ర ప్రయోగం ఉంటుంది కాని, అణుప్రయోగం ఉండదు. ఒకవేళ ఉన్నా ఇక్కడ చెప్పదల్చుకున్న పదం అది కాదు. కాబట్టి, అణ్వస్త్ర ప్రయోగం అని రాయాలి.

*శూన్యంలోంచి అడిగిన వస్తువును తీసిచ్చే బాబా.
*ఈ వాక్యంలో రెండు క్రియలున్నాయి. మొదటిది అడగటం (అడిగిన), రెండవది తీసివ్వటం (తీసిచ్చే). ‘శూన్యంలోంచి’ని మొదటి క్రియకు ముందు ఉంచితే కర్త శూన్యంలోంచి మొదటి క్రియను చేశాడనే అర్థం వస్తుంది. కాని చెప్పదల్చుకున్న భావం అది కాదు. బాబా శూన్యంలోంచి వస్తువును తీసిస్తాడనేది అసలైన భావం. దాన్ని ఏ గందరగోళమూ లేకుండా చెప్పాలంటే, ‘శూన్యంలోంచి’ని రెండవ క్రియ ముందు ఉంచాలి. అంటే, అడిగిన వస్తువును శూన్యంలోంచి తీసిచ్చే బాబా, అని రాయాలన్న మాట.

*శతృ దుర్బేధ్యమైన కోట గోలకొండ.
*ఇక్కడ వాక్యనిర్మాణంలో లోపమేమీ లేదు కాని, మూడు చోట్ల అక్షరాలు తప్పుగా ఉన్నాయి. శత్రువును శతృవు అని, మిత్రుడిని మితృడు అని కొందరు రాయటం అక్కడక్కడా చూస్తుంటాం మనం. అదేవిధంగా ధ్రువాలు అనేబదులు ధృవాలు అనీ, ధ్రువపరచడంకు బదులు ధృవపరచడం అనీ రాయటం అంత అరుదైన విషయమేం కాదు. కాని, అవి తప్పులు. ఇక దుర్భేద్యముకు బదులు దుర్బేధ్యము అనటం కూడా తప్పే. భేదము అని కాక బేధము అని తప్పుగా రాసేవాళ్లు చాలా మందే ఉంటారు. కాబట్టి, శత్రుదుర్భేద్యమైన కోట అని రాయడమే సరైనది. అంటే తృ, ర్బే, ధ్య – ఈ మూడు అక్షరాలు తప్పన్న మాట.

*ఇంటివద్దనే అవసరమైన పత్రాలను స్వీకరించి నల్లాలను మంజూరు చేస్తామని అధికారి చెప్పారు
*ఈ వాక్యంలో చెప్పబడిన పత్రాలు కేవలం ఇంటివద్దనే అవసరమైనవా? బయట ఆఫీసుల్లో వీటి అవసరం లేదా? ఇటువంటి అనుమానాన్ని కలిగిస్తున్నది ఈ వాక్యం. కనుక, అవసరమైన పత్రాలను ఇంటివద్దనే స్వీకరించి…..అని రాస్తే ఏ గందరగోళమూ ఉండదు.

*దిగజారిన ఎగుమతులు
*దిగజారడం అంటే సాధారణంగా నైతికంగా పతనమవటం అనే అర్థం వస్తుంది కనుక, తగ్గిన ఎగుమతులు అని రాస్తేనే సరిగ్గా ఉంటుంది. అదే విధంగా దిగజారిన బంగారం ధర అనకుండా దిగిన లేక తగ్గిన బంగారం ధర అనడమే సరైనది.

*ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడిన సిపాయి.
*ఫణము అంటే పడగ. ఫణి అంటే పాము (ఫణమును కలిగినది). పణము అంటే పందెం. ప్రాణాన్ని పణంగా ఒడ్డటమంటే/పెట్టటమంటే వేరొకరి ప్రాణాలకొరకు తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టటం కనుక, ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన సిపాయి అని తిరగరాయాలి ఈ వాక్యాన్ని.

*గన్ మెన్ లు అవసరం లేదంటూ తిప్పి పంపిన ఎమ్మెల్యే.
*పోస్ట్ మన్ (postman) అంటే తపాలా బంట్రోతు. బ్యాట్స్ మన్ (batsman) అంటే బ్యాటింగ్ చేసే క్రికెట్ ఆటగాడు. గ్యాంగ్ మన్ (gang man) అంటే రోడ్డును కానీ రేల్వే లైన్ ను కానీ సంరక్షించే ఉద్యోగులలోని ఒకడు. ఇవన్నీ ఏకవచన నామవాచకాలు. వీటికి బహువచనాలు పోస్ట్ మెన్ (postmen), బ్యాట్స్ మెన్ (batsmen) గ్యాంగ్ మెన్ (gang men). కాబట్టి గన్ మెన్ లు, బ్యాట్స్ మెన్ లు అనకూడదు. గన్ మెన్, బ్యాట్స్ మెన్ అనాలి.

*కాశ్మీర్ లో ఉద్రిక్తం
*ఈ వాక్యాన్ని ఎన్నో రకాలుగా సరైన రీతిలో రాయొచ్చు. కాశ్మీర్ లో ఉద్రిక్తత అనొచ్చు. లేదా కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితి అనొచ్చు. కాశ్మీర్ లో పరిస్థితి ఉద్రిక్తం అనేది కూడా బాగానే ఉంటుంది. ఇక ఈ మధ్య కాశ్మీర్ అని కాక కశ్మీర్ అని రాస్తున్నారు. ఇది సబబే.

*నీలాగా గట్టిగా పెళ్లి చేసుకోమని ఎవ్వరూ నాకు సలహా ఇవ్వలేదు సురేశ్! (సవరణల కోసం నాకు వచ్చిన ఒక కథలోని వాక్యం)
*ఇక్కడ ‘నీలాగా పెళ్లి చేసుకోవడం’ అనే భావమూ, ‘గట్టిగా పెళ్లి చేసుకోవడం’ అనే భావమూ – రెండూ స్ఫురిస్తున్నాయి. కాని, నిజానికి ఈ రెండింటిలో ఏదీ ఉద్దేశింపబడిన అర్థం కాదు. ‘నీలాగా సలహా ఇవ్వలేదు’ అనేదే అసలు ఉద్దేశం. కనుక, ఈ వాక్యాన్ని ఇట్లా తిరగ రాస్తే సవ్యంగా ఉంటుంది: పెళ్లి చేసుకోమని ఎవ్వరూ నీలాగా గట్టిగా సలహా ఇవ్వలేదు సురేశ్.

*అక్షయ త్రితీయ నాడు బంగారం ఎందుకు కొంటారు?
*తృతీయను ‘త్రుతీయ’ అని పలకకూడదు, త్రితీయ అని పలకాలనేది నిజమే. కాని, త్రితీయ అని రాయకూడదు, తృతీయ అనే రాయాలి. మరొక చోట అచ్చులో హ్రిదయం అనే పదాన్ని చూశాను. ఇక్కడ కూడా పైన చెప్పిందే వర్తిస్తుంది. హృదయం అని రాయాలి, హ్రిదయం అని ఉచ్చరించాలి.

*ఎంక్వైరీ జరుగుతోంది. నివేదిక రాగానే సంఘటన ఎలా జరిగిందో తెలుస్తుంది.
*నివేదిక రాగానే (వచ్చిన వెంటనే) సంఘటన జరిగిందా? అట్లా జరగటానికి వీల్లేదే! కాబట్టి, ‘సంఘటన ఎలా జరిగిందో నివేదిక రాగానే తెలుస్తుంది’ అని రాయాలి.

*స్వచ్ఛతకు ప్రజా మద్దతు
*ప్రజ సంస్కృతసమపదం కాగా, మద్దతు అన్యదేశీయం. కనుక, ప్రజామద్దతు వైరిసమాసమవుతుంది. దాన్ని నివారించాలంటే, ‘స్వచ్ఛతకు ప్రజల మద్దతు’ అని రాయాలి.

*రత్నఖచిత కుటీరం రంగులీనుతోంది.
*ఈ వాక్యంలో అర్థప్రసరణ సరిగ్గా లేదని అర్థమవడానికి ఎక్కువ సమయం పట్టదు. కోటీరంకు బదులు కుటీరం అనే పదం వచ్చిందిక్కడ. దానికి కారణం ఎడిటింగ్ చేసేవాళ్లో, డి.టి.పి. చేసేవాళ్లో అయివుండాలి. ‘ఒక మెరిసే స్వప్నవైడూర్యాన్ని పొదిగిన సొంత కోటీరం కోసం…’ అని నేను ఒక కవితలో రాస్తే, బహుశా డి.టి.పి. చేసే వ్యక్తి కోటీరంను కుటీరంగా మార్చాడు. కవిత అట్లానే తప్పుతో ప్రచురితమైంది. ఇది తెలంగాణ మీద రాసిన కవిత. కోటీరం అంటే కిరీటం. అది పరిపాలనాధికారానికి సంకేతం. అయితే, డి.టి.పి. చేసే వ్యక్తి ఆ పదాన్ని బహుశా అంతకు ముందెప్పుడూ వినలేదేమో!
-----------------------------------------------------------
రచన - ఎలనాగ, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

72వ స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు72వ స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలుఎందరివీరుల త్యాగఫలం నేటి స్వేచ్ఛకు మూలధనం
వారందరినీ తలుచుకుంటూ జరుపుకుంటున్నాం
72వ స్వాతంత్య్రదినోత్సవం-
సాహితీమిత్రులకు
శ్రేయోభిలాషులకు
శుభాకాంక్షలు

Tuesday, August 14, 2018

మేధోమథనమా?, మేదోమథనమా?, మేధామథనమా?


మేధోమథనమా?, మేదోమథనమా?, మేధామథనమా?

సాహితీమిత్రులారా!


పదాల కచ్చితత్వం పట్ల పట్టింపు ఉన్నవాళ్లకు ఏదైనా పదం తాలూకు సరైన రూపం గురించిన సందేహం వస్తే, దాన్ని నివృత్తి చేసుకునేదాకా అశాంతితో వేగిపోతారు. ఇది సాహితీపరులకు ఉండాల్సిన మంచి లక్షణమని అందరూ ఒప్పుకుంటారనుకుంటాను. భాషకు సంబంధించిన జ్ఞానం బలంగా ఉంటే, అది రచన చేసేవాళ్లకు మంచి పునాదిగా పని చేస్తుందనటంలో అనుమానం లేదు. పదాల కచ్చితత్వాన్ని నిర్ధారణ చేసుకునే క్రమంలో ఎన్నో మలుపులు ఏర్పడవచ్చు, ఎంతో శ్రమ కలుగవచ్చు, ఎంతో కాలం పట్టవచ్చు. ఈ వ్యాసకర్త అటువంటి అశాంతిని ఎదుర్కున్న సందర్భాల్లోంచి కొన్నింటిని పేర్కొని, విపులంగా చర్చించడమే ఈ రచన ముఖ్యోద్దేశం.

మేధోమథనం: మేధోమథనం, మేధోసంపత్తి, మేధోశక్తి మొదలైన పదాలను మనం అచ్చులో తరచుగా చూస్తుంటాం. అయితే అవి సరైన పదరూపాలేనా? ఈ విషయం గురించిన సందేహాన్ని నివృత్తి చేసుకోవాలంటే ఆ పదాల సరైన అర్థాన్ని, భాష ప్రకారం వాటి కచ్చితమైన స్వభావాన్ని నిర్ధారణ చేసుకోవాలి. అంటే కొంచెం లోతుగానే పరిశీలించాలన్న మాట. తెలుగు భాషలో మేధస్సు అనే పదం లేనే లేదు. మేధ, మేదస్సు – ఈ రెండు పదాలు మాత్రం ఉన్నాయి. అయితే వీటి అర్థాల మధ్య గల భేదాన్ని గుర్తించాలి. మేధ అంటే ధారణాశక్తి గల బుద్ధి అనే అర్థం కనబడుతుంది ప్రామాణిక నిఘంటువుల్లో. దీన్నే వ్యవహారంలో స్థూలంగా తెలివి అనీ, ఆంగ్లంలో intelligence అనీ అంటాము. ఇక మేదస్సుకు అర్థం మెదడు. అంటే కన్ను, చెవి, కాలు, కాలేయము, గుండెకాయ, శ్వాసకోశము వంటి శరీరావయవం అన్నమాట. మేధ చేయితో స్పృశించలేనిది కాగా, మేదస్సును మనం స్పృశించవచ్చు. ఎందుకంటే అది భౌతిక పదార్థం. మేదస్సు ఉకారాంత నపుంసకలింగ పదం. డెబ్భయ్యేళ్ల వయసొచ్చినా ఆయన కళ్లు ఇంకా బాగానే ఉన్నాయి అనే వాక్యం ఉందనుకోండి. ఇందులో కళ్లు అంటే కంటిచూపు అని అర్థం. అదే విధంగా మేదస్సు (మెదడు) పదం కొన్నిసార్లు మేధాశక్తిని కూడా సూచిస్తుంది. మేధ సంస్కృతసమ శబ్దం. అది ఆకారాంత స్త్రీ లింగ శబ్దం కనుక, మరొక సంస్కృతసమ శబ్దంతో కలిసినప్పుడు మేధామథనం, మేధాసంపత్తి, మేధాశక్తి వంటి పదబంధాలు ఏర్పడుతాయి. ఇవి వ్యాకరణం ప్రకారం సవ్యమైనవి. వైరి/దుష్ట సమాసాలు కూడా కావు. ఇక మేదస్సు అచ్చ తెలుగు పదం అనిపిస్తుంది కాని, అది కూడా సంస్కృత విశేష్యమే. కాబట్టి, దీనితో కూడా సంస్కృతసమ శబ్దాలు సంయోజనం చెందినప్పుడు, భాష రీత్యా సరైన సమాసాలు ఏర్పడుతాయి. ఆ విధంగా మేదోమథనం, మేదోసంపత్తి మొదలైన పదాలు రూపొందే అవకాశముంది. కాని మేధోమథనం లాంటి పదాలు ఏర్పడే ప్రశ్నే లేదు. అసలు మేధస్సు అనే పదమే లేనప్పుడు మేధో అనేది ఎలా సాధ్యం? మేధా మాత్రమే సాధ్యం. ‘మేదస్సు’ ఉంది కాబట్టి మేదో సాధ్యం. లలితా సహస్రనామ స్తోత్రావళిలోని 105 వ స్తోత్రపు మొదటి పంక్తి ఇలా ఉంటుంది: మేదోనిష్ఠా మధుప్రీతా బందిన్యాది సమన్వితా. ఇక్కడ మేదోనిష్ఠా అని ఉండటం, మేధోనిష్ఠా అని లేకపోవటం మనం గమనించాలి. ఎందుకు లేదంటే, అది వ్యాకరణపరంగా తప్పు కనుక. ఈ పదానికి సంబంధించిన వివాదాన్ని భాషాపండితులెవరైనా అంతిమంగా పరిష్కరిస్తే సరైన రూపమే ముందు ముందు వాడుకలో ఉంటుందని నా ఆశ.

సమిష్టి: కొన్ని సంవత్సరాల క్రితం నేను నా గేయసంపుటిని ప్రచురిస్తున్న సందర్భంలో సమిష్టి అనే పదాన్ని వాడటం జరిగింది. అయితే పుస్తకం అచ్చుకు పోకముందు ఒకాయన సమిష్టిని సమష్టిగా సవరించాడు. పుస్తకం అచ్చయింతర్వాత మరొక పెద్దాయన సమష్టి తప్పు, సమిష్టి సరైన పదం అన్నాడు. నేను మొదట అనుకున్నదే సరైన రూపమని ఉబ్బిపోయాను. కాని, తిరుమల రామచంద్ర గారు రాసిన ‘పలుకుబడి’ గ్రంథాన్ని తర్వాత చదివినప్పుడు, అందులో సమష్టి అన్నదే సరైన రూపమని రచయిత సోపపత్తికంగా నిరూపించిన విషయాన్ని గ్రహించాను. అంటే నా అవగాహనే తప్పు అని నిరూపితమైందన్న మాట. ఆ విధంగా ఈ పదానికి సందేహ నివారణ చేసుకునే క్రమంలో ట్విస్టులు (మలుపులు) సంభవించాయి.

యదార్థం: కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక కవితలో యదార్థం అనే పదాన్ని వాడాను. నా సమిష్టిని సమష్టిగా సవరించిన కవే యదార్థం తప్పు, యథార్థం సరైన పదం అని చెప్పడంతో నాకు కొంచెం అభిమానం దెబ్బ తిన్నట్టనిపించి, యదార్థం కరెక్టు అని చిన్నగా వాదించాను. నా ఆత్మవిశ్వాసానికి కారణమేమంటే, సాధారణంగా ఒకే పదంలో పక్కపక్కన వున్న అక్షరాలు వత్తులతో కూడుకున్నవి (మహా ప్రాణాక్షరాలు) కావటం చాలా అరుదు. అటువంటి పదాలకోసం ఎంత ఆలోచించినా ఝంఝ, అంభోధరము వంటి కొన్ని పదాలనే గుర్తించగలిగాను. కాని, ఈ పదం విషయంలో కూడా నా అవగాహన తప్పు అని నిరూపితమైంది. నిఘంటువులను పరిశీలిస్తే, యదార్థం తప్పు అనీ, యథార్థం కరెక్టు అనీ తేలిపోయింది. ఈ రెండు పదాల సరైన రూపాలను (సమష్టి, యథార్థం) నాకు తెలిపినవారు అమ్మంగి వేణుగోపాల్ గారు.

జగదోద్ధారణ: పురందర దాసు రచించి స్వరబద్ధం చేసిన ‘జగదోద్ధారణ ఆడిసిదళెశోదె’ అనే కీర్తన (పదము) ప్రసిద్ధమైనది. ఇది హిందుస్తానీ కాపీ రాగంలో ఉంది. అయితే జగదోద్ధారణ కరెక్టేనా? జగత్ + అంబ = జగదంబ. జగదాంబ కాదు. అదే విధంగా జగత్ + ఉద్ధారణ = జగదుద్ధారణ కావాలి. ఇవి జశ్త్వసంధులు. ‘జగద(ము)’ ఉంటే దానితో ఉద్ధారణ కలిసి జగదోద్ధారణ (గుణసంధి) అయ్యే అవకాశముంది. కాని, తెలుగులో జగదము పదం లేదు. అయితే ఇక్కడ ఒక తిరకాసు వుంది. పురందర దాసు ఆ కీర్తనను రచించింది కన్నడంలో – తెలుగులో కాదు. అందువలన, కన్నడంలో ఉన్న పదాల ప్రకారం జగదోద్ధారణ సరైనదే కావచ్చు – ఒకవేళ ఆ భాషలో జగద అనే పదం ఉంటే. కన్నడం తెలిసిన ఒకరిద్దరు మిత్రులను (అందులో ఒకరు కన్నడభాషలో నిష్ణాతులు) కోరితే వారు కన్నడ నిఘంటువులలో వెతికి, ఆ భాషలో కూడా తెలుగులోలాగా జగతి, జగత్, జగత్తు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అంటే ఏమిటి? తెలుగులో అయినా కన్నడంలో అయినా, జగదుద్ధారణ మాత్రమే సరైన పదమన్న మాట. జగదుదర అనే పదం కన్నడ నిఘంటువుల్లో ఉంది. ఈ పదానికి కూడా తెలుగులో లాగానే జగత్ + ఉదర = జగదుదర సంధి విచ్ఛేదం అవుతుంది. ఉకారంతో మొలయ్యే ఉదర, జగత్ తో కలిసి జగదుదర ఏర్పడినప్పుడు, ఉకారంతో మొదలయ్యే ఉద్ధారణ జగత్ తో కలిసి జగదుద్ధారణ ఏర్పడవలసిందే. ఎందుకంటే ఉదర, ఉద్ధారణ – ఈ రెండూ ఉకారంతో ప్రారంభమయ్యే సంస్కృత విశేష్యాలే. రెండూ నపుంసక లింగానికి చెందిన పదాలే. పాణ్యం రామశేష శాస్త్రి గారు పురందర దాసుల వారి 125 పదములను తెలుగులోనికి అనువదించారు. ఆ గ్రంథంలో పేర్కొనబడిన మూలకృతులను – కన్నడభాష లోనివి – పరిశీలిస్తే ఈ పదం (కీర్తన) మొదటి పంక్తి జగదుద్ధారన ఆడిసిదళెశోదె అనే ఉంది. జగదోద్ధారణ అని లేదు. జగదోద్ధారణ పదం వ్యాప్తిలోనికి రావడానికి మనం రెండు మూడు వివరణలను ఇచ్చుకోవచ్చు. పురందర దాసు జగదుద్ధారణ అనే రాసి, పాడి ఉండవచ్చు. తర్వాతి గాత్రసంగీత విద్వాంసులలో ఎవరో ఒకాయన జగదోద్ధారణ అని పాడితే అనంతరం అందరూ అట్లానే పాడుతూ ఉండవచ్చు. లేదా, జగదుద్ధారణ సరైన పదమని పురందర దాసుకు తెలిసినా గాయనసౌలభ్యం కోసం జగదోద్ధారణ అని మార్చి పాడి ఉండవచ్చు. దీన్ని కూడా పండితులెవరైనా  పరిష్కరిస్తే బాగుంటుంది. శాస్త్రీయ సంగీతం ప్రస్తావనకు వచ్చింది కాబట్టి, దాన్ని పాడేటప్పుడు విరుపుల కారణంగా భాషకూ, భావప్రకటనకూ భంగం వాటిల్లడం గురించి కొంచెం రాయాలనిపిస్తున్నది. అంటే పదాల ఉచ్చారణ పద్ధతిలో కచ్చితత్వం గురించి అన్నమాట. తెలుగువారు కానటువంటి గాత్రసంగీత కళాకారులు కర్ణాటక సంగీతంలోని కృతులను పాడినప్పుడు, విరుపుల దగ్గర ఎబ్బెట్టు అయిన పదరూపాలు ఏర్పడటం కొన్నిసార్లు జరుగుతుంది. ఉదాహరణకు త్యాగరాజ స్వామి వారి ‘ఏ తావునరా నిలకడ నీకు’ అనే కల్యాణి రాగంలోని కృతిలో ‘శివమాధవ బ్రహ్మాదుల యందా’ అన్నచోట బ్రహ్మా తర్వాత విరుపు కారణంగా దుల యందా అంటూ అక్కడనుండి మొదలు పెట్టి పాడుతారు. అదే విధంగా త్యాగరాజ స్వామి వారిదే అయిన శ్రీ రాగంలోని ‘ఎందరో మహానుభావులు’ ఉంది కదా. అందులోని ‘ఎందరో మహానుభావులందరీకీ’లో భావు తర్వాత విరుపు కారణంగా లందరీకీ నుండి మొదలు పెట్టి పాడుతారు. దీనికి ఆ గాయకులను ఎంతమాత్రం తప్పు పట్టలేము. ఎందుకంటే, అట్లా పాడేవారిలో దాదాపు అందరూ తమ మాతృభాష తెలుగు కానివాళ్లే. బాలమురళీ కృష్ణ గారు ఎప్పుడూ ఎందరో మహానుభావులు, అందరీకీ వందనములు అనే పాడేవారు. అదేవిధంగా సామరాగంలోని ‘మానస సంచరరే’ పాడినప్పుడు (ఇది సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన), మదశిఖి పింఛ(ఛా), అలంకృత చికురే అని ఉచ్చరించారు తప్ప మదశిఖి పింఛాలంకృత చికురే అని పాడలేదు. ‘మదశిఖి పింఛాలంకృత’ భాష దృష్ట్యా సరైనదే కాని, కీర్తనగా పాడుతున్నప్పుడు పింఛా తర్వాత విరామం ఇచ్చి లంకృత నుండి పాడాల్సి ఉంటుంది కనుక, అక్కడ ఎబ్బెట్టుతనం చోటు చేసుకుంటుంది. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అమ్మ పాడేటప్పుడు కూడా కృతులలోని, కీర్తనలలోని పదాలను ఉచ్చరించే విధానం చాలావరకు దోషరహితంగా ఉంటుంది. తెలుగును క్షుణ్ణంగా నేర్చుకోవడం కోసం ఆమె ప్రత్యేకంగా ఒక తెలుగు భాషాపండితుణ్ని నియమించుకుని, సరైన ఉచ్చారణానైపుణ్యాన్ని సొంతం చేసుకున్నదట! శాస్త్రీయసంగీత గాయకులు ప్రాచీన కావ్యాలను బాగా చదివి ఉండాలి అని విదుషి కిశోరీ అమోన్కర్ వ్యాఖ్యానించడాన్ని మనమిక్కడ గమనించాలి. నళినకాంతి రాగంలో ‘మనవి యాలకించ రాదటే’ అని ఒక కృతి ఉంది. ఇది కూడా త్యాగరాజ కృతే. దీన్ని చాలామంది మనవ్యాలకించరాదటే అని పాడుతారు. త్యాగరాజ స్వామి అట్లా రాసివుంటాడని అనుకోలేము. కాబట్టి, ఆ విధంగా మార్చి పాడటానికి గల కారణాలు జగదోద్ధారణ విషయంలోని కారణాల వంటివే అయివుండాలి. శాస్త్రీయ సంగీతాన్ని వింటున్నప్పుడు సంగీతాన్ని ఆస్వాదించాలి తప్ప, సాహిత్యపరమైన సవ్యతకోసం వెతకవద్దు అనే వాదన చేస్తారు కొందరు. అయితే భాషను బాగా ప్రేమించేవారికి సంగీతాస్వాదన చేసే క్రమంలో అపశబ్దాలు ఆటంకాలుగా పరిణమించవచ్చు. సంగీతం రాని నేను నన్ను ఆ గాత్రసంగీత విద్వాంసుల ముందు సూర్యుని ముందు దివిటీతో, పర్వతం ముందు గులకరాయితో సమానుడిగా భావిస్తాను. భాషాపరమైన చర్చను చేసి, తద్వారా భాషాప్రేమికుల్లో ఉత్సాహాన్నీ ఉత్సుకతనూ రేకెత్తించడానికి ప్రయత్నించాలనే తప్ప, ఎవరినీ తప్పు పట్టడం ఈ వ్యాసకర్త ఉద్దేశం కాదు.
--------------------------------------------------------
రచన - ఎలనాగ, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Monday, August 13, 2018

యుక్తవాక్యం – మొదటి భాగం


యుక్తవాక్యం – మొదటి భాగం


సాహితీమిత్రులారా!

వాక్యాన్ని సరిగ్గా రాయడమనేది చాలా మంది అనుకునేటంత సులభమైన విషయమేం కాదు. ఎందుకంటే, మనం రాసింది నిర్దుష్టంగానే కాక, నిర్దిష్టంగా కూడా ఉండాలి. నిర్దుష్టంగా అంటే భాషాదోషాలు లేకుండా (Flawlessly) అన్నమాట. ఇక నిర్దిష్టమనే పదాన్ని విస్తృతార్థంలో చూడాల్సి ఉంటుంది. భాషాదోషాలు లేకపోవటంతో పాటు, సరైన పదాలు సరైన స్థానాల్లో ఉన్నప్పుడే వాక్యానికి నిర్దిష్టత సిద్ధిస్తుంది. కొన్నిసార్లు వాక్యం వ్యాకరణపరంగా సరిగ్గానే ఉన్నా, అందులోని కొన్ని పదాలను, లేక వాటి క్రమాన్ని మారిస్తే అది మరింత బాగా తయారయ్యే సందర్భాలుంటాయి. అట్లాంటి సందర్భాన్ని నివారిస్తూ ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా రాయగలిగినవాళ్లు వచనరచనలో ఆరితేరిన వారవుతారు. ఈ కాలంలో చాలా మంది కవులు, రచయితలు భాషకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం. ఒక వాక్యం బహువచనరూపంలో ఉన్న కర్తతో మొదలై ఏకవచనరూపంలో ఉన్న క్రియతో అంతమవ్వడం, అవ్యయాలు (Prepositions) సరైన స్థానాల్లో ఉండకపోవడం, విరామచిహ్నాలు సరిగ్గా లేకపోవడం, అసలు పదాలనే తప్పుగా రాయడం – ఇటువంటి చిన్నచిన్న అపసవ్యతల నివారణ కోసం సైతం జాగ్రత్త పడకకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భాషలో కచ్చితత్వం (Correctness) అంత అవసరమైన విషయం కాదనే అభిప్రాయం కవుల్లో, రచయితల్లో ఉన్నంత కాలం దోషభూయిష్ఠమైన భాష కనిపించడం కొనసాగుతూనే ఉంటుంది. పెద్దపెద్ద స్ఖాలిత్యాలను (అంటే భాష పరంగా సూక్ష్మమైన భేదాలను పాటించకపోతే ఏర్పడే తప్పులను) చూసీచూడనట్టు పోవచ్చును కాని, ప్రాథమిక దోషాలను పట్టించుకోకుండా ఉండలేం – ముఖ్యంగా అవి పూర్తిగా భిన్నమైన అర్థాన్నిస్తున్నప్పుడు. ఉదాహరణకు ప్రముఖత లేక ప్రాముఖ్యం అని రాసే బదులు ప్రాముఖ్యత అని రాస్తే దాన్ని అంత సీరియస్ గా తీసుకోనవసరం లేదు. కాని, ప్రధానమంత్రికి బదులు ప్రదానమంత్రి అనీ, అర్థంకు బదులు అర్ధం అనీ, షష్టిపూర్తికి బదులు షష్ఠిపూర్తి అనీ, మద్యపానంకు బదులు మధ్యపానం అనీ (?!మధ్యమధ్య సేవించే పానం) రాస్తే అసలు భావమే పూర్తిగా మారిపోతుంది కనుక, ఆక్షేపణ తెలుపకుండా ఉండలేము.

ఏ రచనలోనైనా వాక్యాలలోని పదాలు సరిగ్గా ఉండాలని కోరుకునే భాషాప్రేమికులకు ఈ రోజుల్లో సైతం కొదవ లేదని నా విశ్వాసం. కనుక, కొన్ని పొసగని వాక్యాలను ఉదాహరించి (‘ఉదహరించి’ కాదు), చిన్నపాటి వివరణల ద్వారా భాషాపరమైన సూచనలను పాఠకులకు అందించడమే ఈ వ్యాస ప్రధానోద్దేశం. ఈ కింది వాక్యాలలోని పొసగనితనాన్ని పోగొట్టేందుకు నేను సూచిస్తున్న సవరణలను, వివరణలను గమనిస్తే ఔత్సాహికులైన యువ రచయితలకు అది ఉపయుక్తంగా ఉంటుందని విశ్వసిస్తున్నాను.

***

*అమిత్ షా కు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిని వివరించారు.

*ఈ వాక్యం ఏం చెప్తోంది? ఎవరో ఒక పరిస్థితిని అమిత్ షా కు వివరించారు, అని. అది ఏ పరిస్థితో తెలియదు. ఎవరు వివరించారో కూడా తెలియదు. దాన్ని వివరించడమనే పని మాత్రం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. కాని, ఈ వాక్యరచయిత ఇక్కడ చెప్పదల్చుకున్నది, ఆంధ్రప్రదేశ్ లో నెలకొని వున్న పరిస్థితి వివరించబడింది అని. కాబట్టి, మనసులో ఉన్న ఉద్దేశం ఏ తికమకా లేకుండా తేటతెల్లంగా వెల్లడి కావాలంటే ఈ వాక్యాన్ని ‘(ఫలానా వ్యక్తి) ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితిని అమిత్ షా కు వివరించారు’ అని తిరగ రాయాల్సి వుంటుంది. నేనైతే ఈ వాక్యంలో అమిత్ షా తర్వాత స్పేస్ ఇచ్చి ‘కు’ అన్న అక్షరాన్ని రాస్తాను. లేకపోతే ‘షాకు’ (shock) కొట్టే ప్రమాదం కొంత లేకపోలేదు! ఏమంటారు?

*నయీంకు చెందిన ఎన్నో డెన్ లను పోలీసులు గుర్తించారు.

*డెన్ (Den) అనే ఈ ఆంగ్లపదానికి ప్రత్యామ్నాయమైన తెలుగు పదం దొరకడం కష్టమేం కాదు. ఇంగ్లిష్ భాష రానివాళ్లు ఎందరో ఉంటారు. కొందరు విద్యావంతులకు సైతం డెన్ అంటే ఏమిటో తెలియకపోవచ్చు. డెన్ కు బదులు (రహస్య)గృహం లేక (రహస్య)స్థావరం అనొచ్చు. ఈ పదాలు కూడా అందరికీ అర్థం కావనుకుంటే రహస్య అడ్డా అనవచ్చు. అడ్డా స్వచ్ఛమైన తెలుగు పదం కాకపోయినా దాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడటం ఉండదనుకుంటాను.

*ప్రతి రోజూ ఉపనిషత్తులలో దాగివున్న రహస్యాల గురించి చెప్పుకుంటున్నాం కదా.

*ఈ వాక్యంలో ‘ప్రతి రోజూ’ అన్నది అర్థపరంగా ‘దాగివున్న’తో అనుసంధానమై ఉంది. కాని, అది ‘చెప్పుకుంటున్నాం’తో అనుసంధానం అయివుండాలి. అప్పుడే మన మనసులోని భావం ఎలాంటి గందరగోళం లేకుండా పాఠకులకు/శ్రోతలకు సరిగ్గా చేరుతుంది. రహస్యాలు ప్రతి రోజూ దాగివుండటం లేదు! వాటిని మనం ప్రతి రోజూ చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ వాక్యం ఇలా ఉండాలి: ఉపనిషత్తులలో దాగివున్న రహస్యాల గురించి ప్రతి రోజూ చెప్పుకుంటున్నాం కదా. ఏ పదాన్నీ సరిదిద్దే అవసరం లేదు. మొదటి రెండు పదాలను అక్కడినుండి తీసి వేరే చోట పెట్టాలి, అంతే.

*దాశరథి అగ్నిధారను చదివితే మనం ఆ పద్యాలలోని ధారను గమనించ గలుగుతాం.

*రచనాప్రక్రియకు మరీ కొత్త కానివారు కూడా కొందరు వాక్యాలను ఈ విధంగా రాస్తున్నారు. మరికొందరైతే ‘దాశరథి అగ్నిధార చదివితే….’ అని కూడా రాస్తున్నారు. ఈ వాక్యాన్ని రాసేవారి మనసులో చదవడమనే క్రియకు సంబంధించిన కర్త ‘మనం’, లేదా పాఠకులు. కాని, మొదటి రెండు విశేష్యాల (నామవాచకాల) నడుమ ప్రత్యయమో అదనపు పదమో లేనప్పుడు కర్త దాశరథి అయి, అర్థ అన్వయంలో గందరగోళం ఏర్పడుతుంది. దాన్ని నివారించడానికి రెండు మార్గాలున్నాయి. వాటిలో మొదటిది ‘దాశరథి గారి’ అని రాయడం. కాని, ఈ రోజుల్లో అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుందని అనిపించవచ్చు. అట్లాంటప్పుడు ‘దాశరథి రాసిన/రచించిన’ అనవచ్చు. ఎందుకండీ, అసలు విషయాన్ని పాఠకులు అంత మాత్రం ఊహించుకోలేరా? అంటే ఊహించుకో గలుగుతారేమో. కాని, భాష ఉన్నది దేనికోసం? వాక్యం సరిగా వుండి, అర్థప్రసరణ సాఫీగా సాగటం కోసమే కదా.

*ప్రైవేటు ఆస్పత్రుల్లో డాక్టర్లు అనవసరంగా స్త్రీల గర్భసంచీలనూ వాటితో పాటు ఉండకాలనూ తొలగించారని వెల్లడైంది.

*ఇక్కడ ఉండకాలు అంటే Ovaries అని ఉద్దేశం కాబోలు. కాని, ఉండకం అనే పదం నాకైతే ఏ ప్రధాన నిఘంటువులోనూ దొరకలేదు! బహుశా ఇంటర్మీడియెట్, డిగ్రీ కోర్సుల జీవశాస్త్ర పాఠ్యపుస్తకాల్లో అటువంటి పదం ఉందేమో. గర్భకోశము, గర్భాశయము అన్నట్టే అండకోశము, అండాశయము అని రాయొచ్చును కదా. జలమును నిలువగా కలిగి ఉన్నదాన్ని జలాశయము అంటున్నాం. మరి అటువంటప్పుడు అండములను నిలువగా కలిగి ఉన్నదాన్ని అండాశయము అనటంలో ఏ యిబ్బందీ ఉండకూడదని నా అభిప్రాయం. ఒకవేళ ఉండకాలకు అపెండిక్స్ లు అనే అర్థం ఉంటే బ్రాకెట్లో appendixes, లేక appendices అని రాసి, సందేహం తలెత్తకుండా నివారించవచ్చు.

*మా నాన్నగారికి గుండెలో స్టంటు అమర్చారు.

*స్టంటు (స్టంట్ – Stunt ) అంటే సినిమాల్లో హీరోలు చేసే సాహసకార్యం లాంటిది. హృద్రోగులకు డాక్టర్లు అమర్చేదాన్ని స్టెంట్ (Stent) అనాలి. ఇక ‘గుండెలో’ కాకుండా ‘రక్తనాళంలో’ అనాలి. కొందరు ‘నరంలో’ అంటారు. అది కూడా శాస్త్రం ప్రకారం తప్పు పదమే. నరం (Nerve – నాడి) తెల్లగా ఉంటుంది. నిండుగా కూడా ఉంటుంది. అంటే లోపల బోలుతనం ఉండదన్న మాట. నిజమైన నరంలో రక్తం ప్రవహించదు. ఇవి పూర్తిగా భాషాసవ్యతకు సంబంధించిన విషయాలు కాకపోవచ్చును. కాని, రాసేవారికి లోకజ్ఞానం (General Knowledge) అవసరం. రోజువారీ వ్యవహారంలో మనం తప్పుగా వాడే మరికొన్ని ఆంగ్లపదాల గురించి వివరిస్తాను. కోర్టు వారి ఉత్తర్వును ఇంగ్లిష్ లో Injunction అంటారు. కాని, చాలా మంది దీన్ని Injection అని తప్పుగా రాస్తారు/పలుకుతారు. అదే విధంగా కవితా వస్తువును ఆంగ్లంలో Content అంటాం కదా. దీన్ని తెలుగులో రాసేటప్పుడు చాలా మంది కంటెంట్ అంటుంటారు. కాని, కంటెంట్ మెంట్ (Contentment) అంటే సంతృప్తి. కంటెంట్ లేక కంటెంటెడ్(Content, Contented) అంటే సంతృప్తి చెందిన అని అర్థాలు. కవితా వస్తువును కాంటెంట్ (Content) అనాలి. ఆంగ్లంలో స్పెలింగ్ అదే అయినా ఉచ్చారణ మాత్రం భిన్నంగా ఉంటుంది. ఇక మద్యం తాగినవారి శ్వాసను పరీక్షించే పరికరాన్ని బ్రీత్ అనలైజర్ అని రాస్తారు కొందరు. బ్రెత్ (Breath) అంటే శ్వాస. బ్రీత్ (Breathe) అంటే శ్వాసించడం. మొదటిది నామవాచకం రెండవది క్రియ. కాబట్టి బ్రీత్ అనలైజర్ అనకూడదు. బ్రెత్ అనలైజర్ అనాలి.

*సి. సి. కెమెరాలతో దాడి చేసిన దుండగులను పోలీసులు గుర్తించారు.

*దుండగులు సి. సి. కెమెరాలతో దాడి చేశారా? ‘సి. సి. కెమెరాలతో’ను ‘గుర్తించారు’కు వర్తింపజేయాలి. కాని, ఇక్కడ ‘దాడి’కి వర్తింప జేశారు. కాబట్టి, అర్థ అన్వయం కుదరాలంటే ఈ వాక్యాన్ని ‘దాడి చేసినవారిని పోలీసులు కెమెరాలతో గుర్తించారు’ అని మార్చాలి.

*పోలీసులు ముప్పేట దాడి చేశారు. అతని ప్రతిభ ముప్పేటగా అల్లుకుంది.

*ముప్పేట అంటే మూడు పేటలు (వరుసలు) అని అర్థం. కాబట్టి, ముప్పేట పదాన్ని రచనలో ఎక్కడ వాడినా మూడు అంశాలను ప్రస్తావిస్తూ దాన్ని రాయాలి. ఉదాహరణకు, ‘భాష మీద పట్టు, శిల్పవైభవం, వస్తువిస్తృతి – వీటన్నిటినీ కలుపుకుని అతని ప్రతిభ ముప్పేటగా విలసిల్లింది’ అనాలి. ఊరికే ముప్పేటగా విలసిల్లింది అనకూడదు.

*“ఉదయం తొమ్మిది గంటలకు టిఫిన్ చేశాను” అన్నది ఆమె.

*భోజనం చేశావా?, భోంచేశాను – మొదలైన వాక్యాలను వ్యావహారిక భాషలో వాడినప్పుడు, వాటిలో అపసవ్యత అంతగా కనిపించదు. కాని, చెయ్యడమంటే తయారు చేయడం అనే అర్థం కూడా వచ్చే అవకాశముంది కనుక, టిఫిన్ తిన్నాను అని రాస్తేనే సవ్యంగా ఉంటుంది.

*విమానాశ్రయాలు పేదలు ఎక్కే స్థోమత కావాలి.

*ఈ వాక్యం చాలా గందరగోళంగా ఉంది. మొదట స్థోమత తప్పు, స్తోమత సరైన పదం. ‘పేదలకు విమానాలను ఎక్కే ఆర్థిక స్తోమత కలగాలి’ లేక ‘విమానాశ్రయాలు పేదలకు అందుబాటులోకి రావాలి’ అని రాస్తే కరెక్టుగా ఉంటుంది.

*ఆమె వస్తుంది. ఆమె వస్తున్నది. ఆమె వస్తోంది.

*ఈ మూడు వాక్యాలు ఒకే అర్థాన్నివ్వవు. మొదటి వాక్యం ఇచ్చే అర్థం తర్వాతి రెండు వాక్యాల అర్థాలకు భిన్నం. ఆమె వస్తుంది అంటే She comes. ఆమె వస్తున్నది లేక ఆమె వస్తోంది అంటే She is coming.

*ఇష్టమొచ్చినంత తాగండి. ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి.

*ఇక్కడ భాషాదోషమేమీ లేకపోయినా, ఎక్కడో ఏదో పదం లోపించినట్టు అనిపించటం లేదా? ఈ వాక్యలోని అసలు ఉద్దేశం ‘మీరు ఎంతైనా తాగండి. అది మీ ఇష్టం. అయితే, తాగింతర్వాత మీ ఇంట్లోనే ఉండండి. రోడ్డుమీదికి వచ్చి ప్రమాదానికి గురి కాకండి, ప్రమాదానికి కారణం కాకండి’ అని కదా. ఈ అంతరార్థాన్ని పూర్తిగా, సంతృప్తికరంగా వ్యక్తం చేయాలంటే ‘ఇష్టమొచ్చినంత తాగండి. కాని, ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి’ అని రాయాలి. రెండు వాక్యాల మధ్య ‘కాని’ ఉంటేనే సంపూర్ణత సిద్ధిస్తుందిక్కడ. ఇంగ్లిష్ లో అయితే రెండు వాక్యాల మధ్య ‘but’ పెట్టకుంటే మరీ అపసవ్యంగా ఉంటుంది.

*వెలుగొండ ప్రాజెక్టు వల్ల నీటి కొరత వుండదు.

*ఈ వాక్యం అన్యాపదేశంగా ఏం చెప్తున్నది? సాధారణంగా ప్రాజెక్టుల వల్ల నీటికొరత ఉంటుంది కానీ, వెలుగొండ ప్రాజెక్టు వలన మాత్రం ఉండదని కదా! అయితే ఇక్కడ వ్యక్తం చేయదల్చుకున్న భావం మాత్రం వెలుగొండ ప్రాజెక్టు మూలంగా మున్ముందు నీటికొరత ఉండబోదని. కాబట్టి, ‘వెలుగొండ ప్రాజెక్టు వల్ల మున్ముందు/ఇకముందు/భవిష్యత్తులో నీటికొరత ఉండబోదు/తీరిపోతుంది/తీరిపోనుంది’ అని వాక్యాన్ని మార్చాలి.

*దాదాపు కొత్త సచివాలయం నిర్మాణం పూర్తయింది.

*దాదాపు అన్న పదాన్ని సరైన స్థానంలో పెట్టకపోవడం ఈ రోజుల్లో అతి తరచుగా కనిపిస్తున్న విషయం. దాదాపు నేను మృత్యుముఖంలోకి వెళ్లాను. దాదాపు మా అక్క రెండేళ్ల తర్వాత మా ఇంటికి వచ్చింది – ఇట్లాంటి వాక్యాలు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. దాదాపును వాక్యంలోని ఏ పదానికి వర్తింప జేయదల్చుకున్నామో జాగ్రత్తగా చూసి, ఆలోచించి వాక్యాన్ని రాయాలి. అట్లా చూసినట్టైతే, ఈ రెండు వాక్యాలు ఇలా ఉండాలి: నేను దాదాపు మృత్యుముఖంలోకి వెళ్లాను. మా అక్క దాదాపు రెండేళ్ల తర్వాత మా ఇంటికి వచ్చింది. అదే విధంగా ‘కొత్త సచివాలయ నిర్మాణం దాదాపు పూర్తయింది’ అన్నది సరైన వాక్యమవుతుంది. మరో విషయమేమంటే, సచివాలయం నిర్మాణం అని కాక, సచివాలయ నిర్మాణం అని రాస్తేనే కరెక్టు. సమాసాలను రాయడం వదులుకోవాలనే అపోహ ఈ రోజుల్లో ఎక్కువగా రాజ్యమేలుతోంది. కాని, అర్థ అన్వయం కుదరడం లేదనిపించిన చోట సమాసాలను రాయక తప్పదు.

*రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ఒక్క హామీ పూర్తవలేదు.

*ఈ వాక్యాన్ని చదివినప్పుడు మొట్టమొదట మెదడుకు తట్టే భావం, ఒక్కటి తప్ప కేంద్రం ఇచ్చిన హామీలన్నీ పూర్తయ్యాయని! కాని, చెప్పదల్చుకున్నది మాత్రం, ఒక్క హామీ కూడా పూర్తవలేదు అని. ఒక్క లోని ‘క్క’ను ఒత్తి పలుకుతూ ఒక్కటి కూడా పూర్తవలేదు అనే భావాన్ని స్ఫురింజేయవచ్చు. దీన్నే కాకువు అంటారు. కాని, ఉచ్చారణ ద్వారా మాత్రమే అది సాధ్యం. రాయటం ద్వారా దాన్ని తెలుపలేము. ఇక ఈ వాక్యంలోని అర్థాన్ని స్పష్టంగా చెప్పాలంటే, ‘కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర లేదు’ అనో, లేదా ‘కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర లేదు’ అనో రాయాలి.
                                                                                                                           [ఇంకా ఉంది...]
----------------------------------------------------------
రచన - ఎలనాగ, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Sunday, August 12, 2018

మా అవ్వతో వేగలేం… తిరునాళ్ళలో తప్పిపోయింది


మా అవ్వతో వేగలేం…  తిరునాళ్ళలో తప్పిపోయింది
సాహితీమిత్రులారా!

1940వ దశకంలో ఆకాశవాణి వారి "వాణి" పత్రికలో
ప్రచురించబడిన దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రిగారి
కథ ఆస్వాదించండి -


మా అవ్వ నెరగరూ మీరూ, అవ్వని? హయ్యొ! సుబ్బమ్మవ్వని? మా వూళ్ళో ఆవిణ్ణి యెరుగనివాళ్ళు లేరే! అసలు వూరంతా అవ్వనే పిలుస్తారావిణ్ణి. కొద్దిమంది "సుబ్బమ్మవ్వగారూ" అని కూడా అంటారు. ఆవిడికి కోపం వొచ్చినప్పుడు, "ఆఁ ఆఁ, ఆఁ! ఎవర్రా అవ్వ! నువ్వు నాకేమవుతావురా? చస్తే దెయ్యమవుతావుగాని!" అని గద్దిస్తుంది; అప్పుడు చటుక్కున సర్దుకుని "సుబ్బమ్మగారు" అంటారు. వొక్కొక్కప్పుడు, 'సుబ్బమ్మగారూ' అని పిలిస్తే, 'హారి గాడిదా! వేలెడంతలేవు, బొడ్డుకోసి పేరెడతావురా నాకు!' అని దులిపేస్తుంది వెంటనే దిద్దుకుని "అవ్వగారూ!" అంటారు.
ఏఁవయితేనేం, ఆవిడంటే అందరికీ యిష్టఁవే. అవ్వంటే.

అవును అందరికీ యిష్టఁవే మరి! వాళ్ళకేంపోయింది. యిష్టం కాక! యెప్పుడో కనిపిస్తుంది వాళ్ళకి; కనిపించినప్పుడు యంచక్కా కుశల ప్రెశ్నలూ అవీ వేస్తుంది; సావెఁతల్తో సాతాళించి కబుర్లూ కథలూ చెబుతుంది; మాంచి ఫారంలో వుంటే, అంటే వొడుపులో వుంటే, పాటలు పాడుతుంది, పాఁవుపాటా,అవీ. ఆ కాస్సేపూ వాళ్ళకి కులాసాగా వుంటుంది. వింటారు. పోతారు.  వాళ్ళకేం. హమేషా ఆవిడితో యింట్లో వుండేవాళ్ళం, మేం వేగలేక చస్తున్నాం గాని!

అన్నట్లు--అవ్వంటే మీరెరగరన్నారు కదూ. సుబ్బమ్మవ్వ; ఆవిడ మమ్మల్నెలా యేడిపిస్తుందో చెప్పే ముందు ఆవిడా రూపురేఖలూ ధోరణీ మీకు తెలియద్దూ! మా అవ్వంటే, సుబ్బమ్మవ్వ. మా నాన్నగారి మేనత్త. ఆయన్తాలూకు అయిదెకరాల పొలఁవూ అప్పారం లోగిలీ వగైరా ఆస్తితో అవ్వకూడా నాకు సంక్రమించింది. మా నాన్న మేనత్తంటే దాదాపు డబ్బయేళ్ళపై మాట గదా! అయితేఁ? నడుం నిటాగ్గూ కదురులా నిలబెడుతుంది. యిష్టం లేనప్పుడు మాత్రం తెలుగులో 'ఐ' అక్షరం లేదూ, 'ఐ'-దానిలాగ వొంగిపోతుంది. తరుచు కంఠం రైలు గంటలాగ గణగణా పలికిస్తుంది; యిష్టం లేనప్పుడు పీలగా మూలుగుతుంది. ఈ మధ్య కొంచెం చెడ్డా, గెద్దచూపులాఁటిది అవ్వచూపు,  అయితే పళ్ళు మాత్రం తీయించెయ్యటమో రాలిపోవడఁమో జరిగింది. వొఖటే వొఖ పైపన్ను మాత్రం, ముందుది కింది పెదవి మీదికి వొంగి అక్కడ కాలూది మాట్టాడుతున్నప్పుడు రవ్వంత తలాడిస్తూ వుంటుంది. అది అందానిక్కాబోలు వుంచేసిందవ్వ, సుబ్బమ్మవ్వ. మా యింటికొచ్చిన వో పెద్దమనిషి-అప్పన్న శాస్తుర్లని మాంచి కవి గూడా- ఆయనొకసారన్నాడూ చమత్కారంగా "ప్రెపంచంలో యే ప్రభుత్వఁవూ చెయ్యలేనిపని సుబ్బమ్మవ్వగారు చేసిందండీ! వొకేవొఖటి తప్ప యే పన్నూ లేకుండా చేసిందీ!" అని, అయితే అవ్వ మాట్టాతుంటే మాత్రం అతి స్పష్టంగా తెలుస్తుంది.

కొందరు పళ్ళులేనివాళ్ళ నోరు లక్కపిడతలాగ డొల్లగా వుంటుంది. మాట్టాడుతుంటే యేఁవీ తెలీదు. రొచ్చులో నడుస్తున్నట్టు పుసుకూ పుసుకూ గాలిపోసుకుంటుంది, అంతే;

పాత రబ్బరు బొమ్మ నొక్కితే చప్పుడైనట్లు. అవ్వలాగాదు.

అయినా వో లోపం వుంది. అవ్వ మాటల్లో 'ప', 'ఫ 'అని పలుకుతుంది. "కఫ్ఫూ, పఫ్ఫూ, చెఫ్ఫూ అంటుంది- ఆ వొంటిపన్ను వల్ల.

అసలు అవ్వదీ, సుబ్బమ్మవ్వదీ పెద్ద జాతీయ నాయకుడి వుపన్యాస ధోరణి. అయితే అవ్వ తెలివిగా మాట్లాడుతుంది. వోసారీ, వుపన్యాసాల్తో దేశాన్నంతటినీ తలదిమ్మెక్కించే వో పెద్దమనిషి మా యింటికొచ్చాడు. ఆయన సభలోనే గాక, సభ యివతలకూడా సభలో అంతా మాట్టాడతాడు. మా ఇంటికొచ్చిన పదినిమిషాల్లో మొదలెట్టాడు ప్రసంగం. మరి పది నిమిషాల్లో అవ్వ కలగజేసుకుని రంగస్థలంలో విరగబడింది. ఆ నాయకుడు గారు తోకజాడించి, నాటికీ నేటికీ అవ్వకి 'నమస్తే'. అంతే! ఆవిడ సన్నిధానంలో నోరు విప్పడు.

వెనుకటికి వోకవిగాడు చెప్పినట్టు "నిప్పుల, నీళ్ళను, చప్పిడుప్పిళ్ళను, తీర్థాల, తిరునాళ్ళ త్రిప్పటలను" గడిదేరి గడ్డకట్టిన ఘటం అవ్వ.

వోపెళ్ళికి కాస్త ముందో వెనకో పోయాడు పెనిఁవిటి. డబ్భైయేళ్ళపైని యేకధాటీగా అంటే యేకటాకీని వైధవ్య రాజ్యాన్ని పరిపాలించి పారేసిన రాణీ బహద్దర్. గడ్డు బ్రహ్మచారిణి. యాక్సిడెంట్, అంటే ఏ కారో రైలో కలగజేసుకుంటే తప్ప మార్కండేయాది చిరంజీవుల లిస్టులో మనిషి, మా అవ్వ, సుబ్బమ్మవ్వ.

నాలుగ్గంటలకే లేచి తొలికోడిని లేపడం, తలుపులన్నీ తెరిచి పారేసి పాచిపనులూ అవీ చెయ్యడం, చెంబులూ గిన్నెలూ చప్పుళ్ళు చెయ్యడం, స్నానం చెయ్యటం, పత్తిరాట్టంలాంటి కంఠఁవెత్తి 'ప్రాత స్మరామి’ వగైరా శ్లోకాలు చదవటం, మా నిద్దర తగలెయ్యటం- ఇలాగ రోజంతా జరిగే తంతును గూర్చి ఆట్టే చెప్పడం నాకిష్టం లేదు.  ఈ వివరాలు కూడాచెప్పకపోదును. కాని మీకోసఁవే చెప్పా ఇదంతా. అవ్వ ధోరణిలో చెప్పవలిసివస్తే యెప్పుడయినా అవ్వ యెదురయితే చప్పున తప్పుకుని దాటి పోవచ్చని మీరు!

అంతేగాక, ఇవన్నీ చెబితే గాని మేఁవావిడితో యెలా వేగిపోతున్నాఁవో మీకు తెలీదనిగూడా ఇన్ని వివరాలిచ్చా మీకు. యింట్లో మమ్మల్ని ప్రతీ ఘడియా యేడిపించే పనుల్ని గురించి నేను చెప్పనే లేదు.

హయ్యొ, బాబో! యేఁ నవ్వండీ బాబూ! కోటయ్యగారు క్లీన్గా భోంచేసిన విస్తట్లోనే కొత్తదనుకున్నానని, మా శాషమ్మ దొడ్డమ్మకి మళ్ళీ వొడ్డించడం, నీళ్ళనుకొని చెంబుడు చామర్ల కోట పప్పునూనితో చెయ్యి కడుక్కోవడం, యెంగిలి విస్తళ్ళన్నీ కట్టగట్టి గోడమీదనుంచి వీధంట వెడ్తున్న మేస్ట్రీటు వీర్రాజుగారి తలమీద పడేటట్టు విసిరివేయడం, గోవిందరావుగారి చేతిమీద వేడిపులుసు వొడ్డించాలని వొడ్డించడం--- ఈ గొడవలన్నీ ముందు ముందు మీకు తెలుస్తాయి. అలాగే సినిమాకు వెళ్ళడం, సర్కస్ వాళ్ళ బోనులదగ్గిర కదలకుండా నిలబడి అక్కడ జెంతువుల్తో జెతకట్టడం శాసనసభ సీటు కోసం మా వూళ్ళో చేసిన పెద్ద యెన్నికల సభలో రభస చెయ్యడం-- ఇలాంటివన్నీ కూడా యిప్పుడు కాదు. తర్వాత చెప్తా.

అయితే వో చిన్న సంగతి చెప్పి- అది చెప్పి తీరాలి-- ఆవిడ తిర్నాళ్ళలో తప్పిపోవడం దగ్గిరకొస్తా.

అప్పన్న శాస్తుర్లుగారని చెప్పానే ఇందాకా, కవిగారు, ఆయన వోసారి అవ్వమీద పంచరత్నాలు చెప్పాడు. భోజనాలదగ్గిర--సరదాకి!

"సుగుణమణి గణ నికురుంబ సుబ్బమాంబ
అనిన్నీ
సుజన సేవావలంబ గం సుబ్బమాంబ
అనిన్నీ.

"గం." అంటే గంగాభాగరథీ సమానురాలనిట.

ఆయన పద్యాలు చెప్తుంటే, అవ్వ ముసిముసినవ్వుల్తో అటూ ఇటూ తిరుగుతూ, ఏదో తన గొడవ కాదన్నట్టు నిర్లక్ష్యంగా పట్టించుకోనట్లూ, విననట్లూ అంతా విని," అవి వో కాయితం మీద రాసిపారెయ్యండి బాబూ, మా నానిగాడికివ్వండి." అంది.

 నానిగాడంటే మా పెద్దబ్బాయి వాడంటే మా అవ్వకిష్టం. మా నాన్న పేరని! వాడూ గడుసురాస్కల్ యేం చేశాడూ, ఆ పద్యాలు తీసుకుని, వల్లించి, అడపా తడపా పెద్ద రాగ వరసపెట్టి అవ్వ దగ్గిర చదవడఁవూ. ఆవిడదగ్గరేదేనా కొట్టేయడఁవూ. ఈ పద్యాల వెర్రి అవ్వను ఎంతదాకా పట్టుకుందీ అంటే, వోసారి నాతో అందీ--"వోరే అబ్బాయీ! నేను పోయాక పదకొండోరోజున యీ కవుల్నదర్నీ పిలిపించి నామీద పద్యాలు చెప్పించరా" అని.

 ప్రెసుతమేఁవిటంటే, నాన్నిగాడు శివరాత్రి తీర్థానికెళ్దాఁవని అవ్వని రెచ్చగొట్టాడు. నాకిష్టం లేదు. "తీర్థములు మానసములు ముక్తిప్రదములు" అంటూ "సత్యము తీర్థము" అంటూ కవి చెప్పిన మాటల్లో నమ్మకఁవున్నవాణ్ణాయెను. అయితే యేం చెయ్యను? అవ్వా నానిగాళ్ళల్లో  యే ఒక్కళ్ళనీ లొంగదీయడఁవే కష్టం! ఇద్దరూ పట్టుకున్నారాయె!! పోనీ యిల్లేనా ఆనాటికి విశ్రాంతిగా ఉంటుందనిన్నీ దారిపొడుగునా అస్తమానఁవూ అవ్వకోసం పంచరత్నాలు పద్యాలు చదివి నాన్నిగాడి తెగులు కుదురుతుందనిన్నీ.


ఆ తీర్థానికే వెళ్తున్న రావఁయ్య కాపుని బతిమాలుకుని, అతని రెండెండ్ల బండిలో మా వాళ్ళనీ కుక్కాను. తోవలో అవ్వ కునికిపాట్లు పడి కింద పడకుండా రాఁవయ్యకాపు పెద్దకొడుకుని బండి చివర బిరడాలాగ బిగించాను. ఈ బిరడా సంగతి కూడా తర్వాత చెబ్దా.

 వాళ్ళు తెల్లారగట్లే వెళ్ళారు. సాయంకాలఁవో, రాత్రి పడుతూంటేనో రావాలి మూడు నాలుగ్గంటలకి. యేదో పనివుండి వీధుల్లోకి వచ్చా. వీధరుగు పక్కని బిక్కమొహం వేసుకుని, యేడిచి యేడిచి వాచిన యెర్రకళ్ళూ వాడూ నాన్నిగాడు వొదిగి నిలబడివున్నాడు.
"ఏమిరా? అవ్వేదిరా??" అన్నాను.

"త-త-త-" అన్నాడు.

"ఏమిట్రా త-త-త? తప్పిపోయిందా? చ చ చ కాదుగదా అంటే చచ్చిపోలేదుగదా" అనడిగాను.

"తీర్థంలో అవ్వ కనబళ్ళేదు" అన్నాడు వాడు మెల్లిగా.

"ఆఁ?!" అన్నాను. నా గుండె గుభేలుమంది. గోదార్లో పడిందేవోఁ! కారు కింద పడిందేవోఁ! గుండె ఆగి పోయిందేమో, ముసల్ది! నాకు మహ జాలి, దుఃఖం వేసుకొచ్చాయి. అసలు అవ్వంటే మా అందరికీ ఎంత యిష్టఁవో అప్పుడు తెలిసొచ్చింది నాకు. అవ్వని విడదీస్తే లోకం ఎలా వుంటుందో మాకు తెలియదు. పాపం ఆవిడకెవరున్నారు? నిజానికి నాకు ముసలాళ్ళన్జూస్తే ఎంతో దిగులు, ముందుకు చూసుకుంటే నోరుతెరుచుకుని దగ్గరగా వొచ్చే చీకటి భూతం కేఁవుందీ!

మా అవ్వ చూపులు వొక్కొక్కప్పుడు, దూరాన ఆకాశాన పోయే పక్షుల్లాగా వుంటూంటాయి. యెక్కడికో యెక్కడికో పోతూన్నట్లు, అప్పుడు నాకు భయం వేస్తుంది. అవ్వ వొక్కొక్కప్పుడు పొడుగ్గా నిట్టూర్చేది; ఆ నిట్టూర్పు చిన్నతనం నుంచీ యాభై యేళ్ళ దార్లో పడి పాకి వచ్చినట్టుండేది. ఇప్పుడు ఈ మాటలన్నీ స్తిమితంగా అంటున్నాను గానీ అప్పుడు...
 "యేఁవిట్రా. యేం జరిగిందీ?" అని నాన్నిగాణ్ణి అడిగాను.

గోదావర్లో స్నానం చేసొచ్చారట. గుళ్ళోక్కూడా వెళ్ళొచ్చారట. స్వామి దర్శనఁవయ్యాక, గుళ్ళో మండపం మీద కూర్చుని వాడిచేత సరదాగా పంచరత్నాలుగూడా చదివించుకుందిట. తర్వాత యివతలికి వచ్చాక రంగులరాట్టం   దగ్గరికొచ్చేప్పటికి నాన్నిగాడు అదెక్కుతానన్నాడట, వాడు కాస్సేపు దానిమీద తిరిగొచ్చేసరికి అవ్వక్కడ లేదు. వాడు మొదట యిక్కడా అక్కడా చూసి, కనబడకపోతే కంగారుపడి, "అవ్వా, అవ్వా" అని పిలుస్తూ తీర్థఁవంతా తిరిగీ, బళ్ళు విప్పిన చోటు దగ్గరికొచ్చీ అక్కడ కూడ ఆవిడ కనబడకపోతే అయిదుమైళ్ళూ నడిచి యింటికొచ్చేశాడు. ఇదీ కథ.
వెంఠనే రావయ్యకాపొచ్చాడేమో-వాళ్ళింటిక్కభురు చేశాను. కాఁవిగాణ్ణీ, గోవిందునీ తిర్నాళ్ళకి పరిగెత్తించాను. అవసరమైతే పోలీసులతో గూడా చెప్పమన్నా. ఇంట్లో మా ఆవిడ, పిల్లలూ నిశ్శబ్ధంగా కూర్చున్నారు. కుక్కిన పేనుల్లా. నేను శివస్మరణ చేస్తూ బయటికెళ్తూ, లోపలికొస్తూ మతిపోయినట్లు తిరగడం మొదలెట్టాను!

రాత్రి పదయ్యింది. అవ్వలేకుండా రాఁవయ్యకాపు బండి ఒచ్చేసిందిట’ కావిఁగాడూ గోవిందూ వఠిచేతుల్తో, అంటే అవ్వలేకుండా వొచ్చేశారు. ఇహ వూరుకోగూడదని. మా ఆవిడ లోపల్నించి కొంచెం కూనిరాగం యేడుపు ప్రారంభించింది. చంటిపిల్లాడు గూడా యథాశక్తి వాళ్ళమ్మకి తోడయ్యాడు. చూడ్డానికీ, ఉబుసుపోకా సొహంగ్రామం మా ఇంటి దగ్గిరచేరి, అవకాశం రాగానే సరదాగా పరామర్శలోనూ అవ్వ దివ్యస్మృతుల్ని నెవఁరువేసుకోవడంలోనూ అప్పుడే పడిపోయారు.

ఇదీ తిరునాళ్ళరోజున అర్ధరాత్రి మా స్థితి.

అంతలో “సన్యాసి రాజుగారిల్లిదేనా?" అని దూరాన్నుంచి గద్దిస్తూన్న మాటలు  వినబడ్డాయి. అందరూ అటు తిరిగి చూశారు!

"యెవరు బాబూ యేఁవిటి?" అని గావుకేక పెట్టాను నేను. చీకట్లోంచి వొస్తూ పోలీసుజెవాను కనబడ్డాడు. కూడా టీగ్గా నడుస్తూ, చీకట్లో దీపస్తంభం లాగా జెవానుకంటే ధాటీగా అవ్వ సాక్షాత్కరించింది! “అవ్వొచ్చింది" అని కేకేశాను! లోపల్నించి అందరూ "ఘొల్లు"మని యివతలికి వొచ్చారు!

కొందరు మాత్రం అవ్వ అప్పుడే దొరికేసిందే, నాల్రోజులపాటు సరదా పోయిందే" అని దిగులుమొహం వేశారు.

పోలీసు జెవాన్, "యిదుగోనండీ ముసిలావిడ. నా ప్రాణాలు తోడేసిందీ! యీవిణ్ణి తిర్నాళ్ళకీ, తీర్థాలకూ పంపి, దేశం మీద వొదుల్తారేఁవిటయా? యీవిడకంటె మా సూపరెంటు నయం" అని చీదరించుకుంటూ అన్నాడు!

"పోరా! నే సూపరిండెంటునే, నాకేం రా బహద్దర్ని. శెలవిచ్చాను. ఫో" అంది అవ్వ. వాడు పళ్ళు బిగించి కొర కొర చూచి, చీకట్లోకి నడిచి, అక్కడ ఖాండ్రించి వుమ్మేశి చక్కా పోయాడు!

ఇహ తీర్థంలో జరిగిన కథేవిఁటంటే-

నాన్నిగాడు రంగులరాట్టం తిరుగుతూంటే పిల్లలందరికీ జీళ్ళూ, జంగిడీ మిఠాయీ, తొక్కుడుండలూ కొందామని, ఆ కొట్లకెళ్ళి వొక్కొక్కళ్ళకీ పేరు పేర్నా వొక్కొక్క పొట్లాం కట్టించిందిట. అక్కడ చిల్లర విషయంలో కొట్టువాడితో పేచీ వొచ్చి, వాణ్ణి భూశెయనం చేసిపారేసి, దమ్మిడీలతో సహా వాడిదగ్గర్నుంచి రాబట్టి పాత్ర సాఁవాను దుకాణంవైపు దండయాత్ర మళ్ళించి, అక్కడ ఆ దుకాణం మీద పడిందట! అక్కడ రాగిచెంబూ గరిటా బేరం తేల్చడానికి రాఁవరావణ యుద్ధం చేసి, రాచ్చిప్పల కొట్టువైపు ద్రుష్టి తిప్పి, అటు దాడి చేసింది! దారిలో డక్కీ డమడమల బండీవాడు తారసిల్లితే అన్నీ వాయించీ నడిపీ చూసీ, అమ్మేవాడు బారుమని యేడ్చేదాకా వాణ్ణి ఆపి, అంతలో వుప్మాకయ్యగారి కుటుంబం కనబడితే వాళ్ళతో వూసులాడి అట్టే నాలుగడుగులేసేసరికి నాన్నిగాడు జ్ఞాపకానికొచ్చాడు. అప్పటికప్పుడే పొద్దు వాల్తోంది!

"నాన్నిగా నాన్నిగా" అని తీర్థఁవంతా తిరగడం మొదలెట్టింది! బళ్ళ దగ్గరికొచ్చి చూస్తే, రాఁవయ్యకాపు బండీ వెళ్ళిపోయింది! మళ్ళీ తీర్థం లోకి వొచ్చింది! "మా నాన్నిగాడు కనబడ్డాడా?" అనడుగుతూ! ఎవళ్ళనడిగినా వాళ్ళు పట్టించుకోలేదు! అప్పటికి కంగారుపడ్డం మొదలెట్టిందవ్వ. ఇంతలో కనబడిన పోలీస్ జెవాన్ ని కూడా అడిగింది! వాడు వూరూపేరూ అన్నీ అడిగి పోలీస్ స్టేషన్ దగ్గిర కూచోబెట్టాడు!

"అమ్మా! భైపడకండి, ఇంటికి తీసికెడతాం" అని పోలీసువాడంటే, "ఎవడికిరా భయం?" అని ధీమాగా మొదట అన్నప్పటికీ, నాన్నిగాడి కోసం లోపల్లోపల కంగారు పడిపోయింది అవ్వ! ఆవిడ పోలీస్ స్టేషన్ లో కూచున్న సమయంలోనే, కాఁవిగాడూ గోవిందూ ఆఁవె కోసం గాలించి పోయారు! యిదంతా చెప్పాక యిలాగంది అవ్వ! "ఆ రాచిప్పలదుకాణం దగ్గిరాలస్యఁవయి పోయిందర్రా! అక్కడే వొళ్ళు మరిచిపోతూంటాను! ఏమిరా నాన్నిగా. శివరాత్రి గూడాను. అప్పన్నశాస్తుర్లుగారి పద్యాలు నా మీద రాసినవి చదవరా" అంది! అందరూ పకపకా నవ్వారు! నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చింది! ఆవిడ గొంతుక పట్టుకుని ఆ రాత్రి ఆఁవెని శివసాయుజ్యం  పొందిద్దాఁవనుకున్నాను! దిక్కుమాలిన పాపభయవో, దండన భయంఁవో వొచ్చిపడి మళ్ళీ తఁవాయించుకున్నాను! అంతకంటే గూడా లోపల పిచ్చి యిష్టం గూడా యేడిసిందాయెను ఆవ్వమీద, సుబ్బమ్మవ్వమీద!

Friday, August 10, 2018

ఉత్తరసీతాచరితం- హృదయాహ్లాదిని కుందమాల


ఉత్తరసీతాచరితం- హృదయాహ్లాదిని కుందమాల
సాహితీమిత్రులారా!ఈ మల్లెపూలదండ చల్లటి ఉపశమనాన్ని ఇస్తుంది- ఆ ప్రేమికులతోబాటు, వారి విరహం దహించే మన మనసులకి కూడా… తాత్కాలికంగా కాదు, ఎప్పటికీ. దయలేని మనుషుల వలన పడిన అన్ని ఇడుములూ ఈ ముగింపులో విచ్చిపోతాయి. అమ్మా నాన్నా కలుసుకోవటమే – కుశలవులకి లాగే మనకీ , రాజ్యాభిషేకం.

ఉత్తరకాండ చివరలో సీత విరక్త అయి తల్లి దగ్గరికి వెళ్ళిపోవటం, ఎంత కాదనుకున్నా , విషాదాంతమే- మనుష్యలోకపు కథగా చదువుతున్నప్పుడు . మానవాతీతమైన భాష్యాలు ఎన్ని వెతకబోయినా, ఆ మర్యాదా పురుషోత్తముడి చరిత్ర పురుషార్థాని కి కూడా సంబంధించినది కాదా?

అసలు వాల్మీకి రచన యుద్ధకాండ వరకేననీ, తర్వాతి కథ చాలా కాలం తర్వా త చేర్చబడిందనీ బలమైన వాదనలు ఉన్నాయి. అవి ఎంత తీవ్రమైనవంటే- సీతారాముల ఆ యాతన – ఆత్మ హింస ను సమర్థించే జైనానికీ సంసార విసర్జనను బోధించే బౌద్ధానికీ అనుగుణంగా, ఆ మతాలు ప్రారంభమైన అనంతరం సీతారాములని అలాగ యాతన పెడుతూ ఉత్తరకాండను చేర్చారని అనే వారున్నారు. జీసస్ క్రైస్ట్ మానవుల కోసం శిలువ మీద మరణించినట్లు శ్రీరాముడు ప్రజల కోసం భార్యను వదిలి జీవన్మృతుడవటాన్ని – క్రైస్తవం ప్రవేశించిన తర్వాత రామాయణం లో ప్రక్షిప్తం చేశారనీ ఉంది. కొందరు శ్రీ వైష్ణవుల ఇళ్ళలో రామాయణ పారాయణమంటే కేవలం బాలకాండను పఠించటం.ఆనంద స్వరూపుడైన పరమాత్ముని అవతారాన్ని కల్యాణాంతంగా మాత్రమే వారు గ్రహిస్తారు. భారతీయ కావ్యశాస్త్రాల దృష్టితో చూస్తే శోకం తో ఏ కృతీ ముగియదు. ఇతిహాసమైన మహాభారతం శాంత రసం లో పర్యవసిస్తుంది. శ్రీరామ పట్టాభిషేకం తో కాక మరొకలాగా రామాయణం అంతమవటం, [ కేవలం ] కావ్యగతబుద్ధులైనవారికి , కనీసం – కొంగున కట్టుకున్న నిప్పు. ఆ నిష్కారుణ్యాన్ని భరించలేక రాముడిని దూరం పెట్టుకున్నవారున్నారు.

ఏది సత్యం, ఏది అవాల్మీకం అన్న విచికిత్సను పక్కన ఉంచితే- ఆ కథ అలాగ సౌఖ్యంగా పరిణమించటాన్ని తమ హృదయం లో దర్శించి నాటకాన్ని సృజించిన కవులు ఇద్దరు. ఒకరు ప్రసిడ్ఢులైన భవభూతి. ఆ ఉత్తరరామచరితం కరుణరసప్రధానమయి కూడా సుఖాంతమైన నాటకం. అక్కడ రాముడు భగవంతుడు, ఆయన చర్య అనివార్యం .అందులోని సీతారాముల అనురాగాన్నీ అవిభాజ్యతనూ భారతీయులంతా ఎప్పటికీ స్మరించుకుంటారు.

అయితే అటువంటి ముగింపును మొదట ఊహించినది భవభూతి కారు. ప్రసిద్ధిలో రెండవవారైనా ఆ కల్పనను తొలుత అక్షరాలలో పెట్టినది దిజ్ఞాగుడు. ఆయన కురిపించిన కరుణ అందరిమీదా…తుడిచిన కన్నీరు మనందరిదీ. ఆయన సృజించిన సీత – భర్త పైన ఆరాధన తోబాటు అనురక్తి కలిగిన ఇల్లాలు.’ సీత – [కుందమాల ] ‘ అన్న అపురూపమైనవ్యాసం రాసిన విశ్వనాథ -”…. ఆమె రామచంద్రుని యందు శృంగార ప్రవృత్తి తప్ప మఱొకండెఱుగదు ” అంటారు. ఆమె బెంబేలు పడనిది, తన మీద తనకు ప్రత్యయం చెడనిది. వేదన పడదని కాదు, దానిని భరించుకోగలిగినది. అన్నింటి కన్నా మించి- తామిద్దరూ తప్పక కలుసుకుంటారనే ఆశా విశ్వాసమూ అంతరాంతరాలలో ఉన్నది. ఆ ఎడబాటు ఎంత మాత్రమూ సహజంగా ఉండదు, కనుక అంతరించవలసినదే- ఆమెకి. తన పాతివ్రత్యాన్ని తిరిగి ప్రకటించుకొమ్మంటే అలిగి భూమిలోకి వెళ్ళిపోదు, ఆమెకు రాముడితో కలిసి ఉండటం పరమావధి.

కుశలవులు ఎంతమాత్రమూ ఉద్ధతులు కారు, తండ్రి అని తెలియకపోయినా, మహారాజుతో యుద్ధమాడరు , వారు సీత పుత్రులు.

రాముడు అవతారపురుషుడని నాందీ శ్లోకాలలో చెప్పి ఉన్నా, నాటకంలో ఆయనను మానవాతీతుడుగా చిత్రించరు. తన ప్రాధాన్యాలను నిర్వచించుకోలేని మహారాజు ఆయన ఇక్కడ. తన కాఠిన్యానికి తానే నలిగిపోయే జీవుడు.
ఉత్తరరామచరితం లో రాముడు ప్రధానం. కుందమాలలో సీత ప్రధానం .
ఈ దిజ్ఞాగుడు కాళిదాసుకు సమకాలికుడనే ఆధారం మేఘసందేశం [పూర్వ మేఘం- పధ్నాలుగవ శ్లోకం ] లో ఉందని పండితులు చెబుతారు. ఆ శ్లోకం ఇది -

స్థానాదస్మా త్సరసనిచుళా దుత్పతో దఙ్ముఖఃఖం
దిఙ్నాగానాం పథి పరిహరన్ స్థూలహస్తావలేపాన్

“ఓ మేఘమా, నువు ఈ పర్వతం మీదినుంచి కదులుతుంటే – పవనుడు పర్వతశిఖరాన్ని పెకలించి తీసుకుపోతున్నాడా అని సిద్ధ స్త్రీలు చకితలై, ముఖాలు పైకెత్తి అమాయకంగా చూస్తారు. దానితో ఉత్సాహంవస్తుంది నీకు . సరస నిచుళాలున్న (తడిసిన నేల ప్రబ్బలి చెట్లున్న) ఈ చోటినుంచి నువు ఉత్తరం వైపుకి వెళ్ళే దారిలో – దిగ్గజాల లావుపాటి తొండాల విదిలింపులను తప్పించుకొని ఎగిరిపో”

దీనిలో దాగి ఉన్న అర్థం- “సరస నిచుళుడి (రసికుడైననిచుళుడు, కాళిదాసుకు సఖుడు) నివాసం నువు వెళ్ళేదారిలో ఉంది. అతన్ని దర్శించు. అక్కడ దిజ్ఞా గుడనే మహాపండితుడు, కాళిదాసుకు ప్రత్యర్థి, ఉన్నాడు- అతని లావుపాటి చేతి [హస్తం అన్న మాటకు తొండం, చేయి అని రెండు అర్థాలూ ఉన్నాయి ] విదిలింపులను [ నువు కాళిదాసుకు దగ్గర కనుక నిన్నూ ఆక్షేపిస్తాడు ] తప్పించుకు వెళ్ళు” ఈ విషయాన్ని కాళిదాస వ్యాఖ్యాత మల్లినాథసూరి ధృవపరిచారట.

కాళిదాస శాకుంతలం లో బాలుడైన భరతుని చేతి నుంచి కిందపడిన రక్షను తల్లిదండ్రులు కాక మరెవరు తాకినా అది పామయి కాటువేస్తుందని అన్నట్లే , కుందమాలలో అయోధ్యాసిం హాసనం మీద రఘువంశీయులు కానివారెవరు కూర్చున్నా వారి తల వ్రక్కలవుతుందని చెప్పబడుతుంది . ఇది ఒక పోలిక, కాళిదాసు రచన తో . అధవా దిజ్ఞాగుని పద్ధతి ఎక్కువ సూటిగా ఉంటుంది. భవభూతి లాగా దీర్ఘమైన వర్ణనలు కూడా ఆయన చేయరు, కథానుగుణమైనవి , అదీ క్లుప్తంగానే తప్ప. అన్వయం సులువుగా ఉంటుంది. ఇలాగ సరళంగా రచించినంత మాత్రాన తక్కిన ప్రసిద్ధ నాటక కర్తల ముందు తేలిపోరు. ఆ పాత్రలు ఎంతో సజీవంగా ఉంటాయి , ఆ ఉదాత్తత అతి సహజంగా ఉంటుంది. కథనం ఎత్తు మీదే నడిచినా, పాఠకులకు చాలా దగ్గరగా వస్తుంది . దిజ్ఞాగుని వాక్కు ఎంత స్పష్టంగా, నిండుగా- ఉంటుందంటే, ఈ నాటకం లోని కొన్ని శ్లోకాలు, కొన్ని శ్లోకాల పాదాలు- సుభాషితాలుగా నిలిచి ఉన్నాయి. ఆయన శైలి ప్రసన్నమూ గంభీరమూ అని అనువదించిన బులుసు వెంకటేశ్వర్లు గారు అంటారు. గొప్ప మాట అది.

తాను కాంచీపురం సమీపం లోని సిం హ వక్త్రపురానికి [అరారాలపురం ] చెందినవాడినని చెప్పుకున్నారు. భదంత ధీరనాగుడన్న నామాంతరం గల దిజ్ఞాగుడు బౌద్ధ పండితుడనే ధృఢమైన నమ్మకం ఉంది. ఎన్నో బౌద్ధ గ్రంథాల కర్త కూడా. తార్కిక చక్రవర్తి . బౌద్ధుడయి రామకథను ఎందుకు రచించారు ? ప్రారంభం లో గణేశ, జటాజూట- స్తుతులు ఎందుకు చేశారు ? ఈ ప్రశ్నలకు పెద్దలు చెప్పే సమాధానాలు ఇలా ఉన్నాయి – ఈయన కొంతకాలం పిమ్మట బౌద్ధం వదిలి వేదధర్మం లోకి వచ్చిఉంటారు. లేదా, మొదట హీనయాన బౌద్ధుడు, ఆ తర్వాత మహాయానం లోకి వచ్చారు. [ రెండవ సంప్రదాయం శ్రీరాముడిని బుద్ధుని అవతారంగా స్వీకరించింది ] కుమారదాసు అనే బౌద్ధపండితుడు జానకీహరణం అనే కావ్యాన్ని రచించి ఉండటాన్ని దృష్టాంతంగా చూపుతారు. ఇక్కడ విశ్వనాథ తన వ్యాసం లో అన్న మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు.

“దిజ్ఞాగుని గురించి యొక్కమాట. బౌద్ధులు పూర్వము మన దేశమునందు విజృంభించిరి. నేటి సర్వసమత్వమతమువలె నాడు బౌద్ధమతము కూడ మన ధర్మములను కుళ్ళగించినది. కాని బౌద్ధులు మన వేదాంతములు తలక్రిందులు చేయుటకు బ్రయత్నించిరిగాని సారస్వతము జోలికి రాలేదు. దీనికి మహాతార్కికుడై సనాతనధర్మమునకు గొప్ప ప్రత్యర్థియైన దిజ్ఞాగుని ‘ కుందమాల ‘ సాక్షి. ఎన్ని బౌద్ధమతసూత్రములున్నను, తేజోవంతములైన నాటకములను- రసపర్యవసాయులై ,,మనవారు గూడ దిరస్కరించలేదు. ఇందుకు ‘ నాగానందము ‘ నిదర్శనము. మతమేదియైనను జాతికి రసబుద్ధి పోలేదు. నేటికి దేశమున రసబుద్ధి యొత్తిగిలినది”

ఏ కారణం చేతనో, చాలాకాలం మరుగున పడిన ఈ రసవంతమైన నాటకాన్ని మానవల్లి రామకృష్ణకవి గారు పరిష్కరించి ప్రచురించారు. తెలుగు లోకి నాలుగు అనువాదాలు వచ్చాయి. ఆ నలుగురు అనువాదకులు- కాలక్రమంలో వడ్డాది సుబ్బరాయకవి గారు, గట్టి లక్ష్మీనరసిం హ శాస్త్రి గారు, బులుసు వెంకటేశ్వర్లు గారు , వేదం వెంకటకృష్ణశర్మగారు.

నాటకపు నాందిలో లో చేసిన జటాజూట స్తుతి లో శివజటాజూటాన్ని- పరిపక్వమై, జ్వాలలాగా పైగి ఎగసి ఉపశమించిన తపోధనుని తపస్సు గానూ , గంగానది మీదినుంచి వీచే గాలితెరలతోనూ పన్నగాలతోనూ విలసిల్లే వల్మీకంగానూ , చల్లని చక్కని చంద్రుడి నిత్యమైన ఉదయంగానూ, బాలసూర్యుడి ని పోలిన అరుణకాంతి నివాసంగానూ, పోల్చి చెబుతారు. కథ అంతా ఈ వర్ణనలో ధ్వనిస్తుంది. తీవ్రమైన ధర్మాచరణా తపస్సు, భగ్గున ఎగసే వియోగ జ్వాల- దాని ఉపశమనం- గంగాతీరంలో , వాల్మీకాశ్రమం లో. ఆపైన సూర్యచద్రుల లాగా వెలిగే బాలకుల ఆగమనం – అంతా స్ఫురిస్తుంది. ఈ నాటకమంతా శివేచ్ఛకు నమస్కరిస్తుంది.

ప్రారంభం లో, లక్ష్మణుడు సీతను అడవిలో దిగవిడిచే ఘట్టం లో- గంగాతరంగ శీకర వాయువుల స్పర్శను సీత కన్నతల్లి చేయి తాకినట్లుందని అనుకుంటుంది. నాటకం అంతా ఇంచుమించుగా , వీలైనప్పుడల్లా , ఉపశాంతి మీదే నడుస్తుంది – కష్టాన్ని మాత్రమేనొక్కి చెప్పకుండా.

రాముడు సీతను పరిత్యజించిన మాట చెప్పలేని లక్ష్మణుడు “సరస్వతీదేవి నా నోరు కట్టి వేసింది” అంటాడు. ఆ వార్త అంత అపశబ్ద భూయిష్టం అన్నమాట. తెలుసుకున్న సీత అంటుంది, స్పృహ కోల్పోతూ – “దశరథ మహారాజా ! నువ్వు ఇప్పుడు మరణించినట్లయింది” అంటుంది – [ఆయనే ఉంటే పెద్దవాడుగా రాముడిని వారించి ఉండేవాడు కదా, ఈ అధర్మకృత్యం ఆయన స్మృతికి అపచారం కదా ! దశరథుడు తీసుకోలేని ఆ బాధ్యతను ఆయన స్నేహితుడైన వాల్మీకి తీసుకున్నట్లు చివరలో వస్తుంది.]

ఆయనకేమైనా చెబుతావా అని లక్ష్మణుడు మళ్ళీ మళ్ళీ అడిగితే, ముందు అంటుంది-

“ఆ నిష్ఠురుడికి నా సందేశం , లక్ష్మణుడి బలవంతం చేత ఇస్తున్నాను అంతే- దురదృష్టవంతురాలిని, నా గురించి వ్యధపడుతూ శరీరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ధర్మాన్ని అతిక్రమించవద్దు, పరిపాలనను ఆటంకపరచుకోవద్దు”…అంటూనే, తనకు తెలియని నిష్ఠూరమేమైనా తన మాటలలో ధ్వనించిందా అన్న అనుమానం తో – “నేను జనపాలుడినేమైనా [రాముడు అనదు, ఆర్యపుత్రుడనదు, రాజు అంటోంది ] నిందించానా?” అని లక్ష్మణుడిని అడుగుతుంది.

“అమ్మా, నీకు ఆమాత్రం అధికారం ఉంది” అని మాత్రం అంటాడు లక్ష్మణుడు.[ కి మేతావత్యపిన ప్రభవతి దేవీ]

అప్పటి సీత మాటలు దిజ్ఞాగుడు కాక మరి ఎవరూ రాయలేదు.

“ఏవమపి మమ వచనా ద్విజ్ఞాపయితవ్యః సా తపోవనవాసినీ సర్వధా సీమంత నిహితే నాంజలినా యద్యహం నిర్గుణా చిరపరిచితేపివా అనాథేతి వా సీతేతి వా స్మరణ మాత్రకేణానుగృహీత వ్యేతి”

[ ఇవి నా మాటలుగా విన్నవించు. ఆ తపోవనవాసిని పాపిటలో దోసిలి ఉంచి నమస్కరిస్తూ చెప్పుకుంటోంది. తాను నిర్గుణ అయినప్పటికీ [ గుణం లేనిదని, గుణాతీత అని కూడా ] , చిరపరిచితను అని అయినా, అనాథను అని అయినా…కనీసం సీతని అని అయినా తలచుకొమ్మను. ఆ మాత్రపు అనుగ్రహం నా పైన చూపవచ్చును ]

సీతారాముల మధ్యన ఉన్న బంధానికి గుణాలతో సంబంధం లేదు. ఇదే భావాన్ని రాముడితో అయిదో అంకం లో కవి పలికిస్తారు

“ఇక నేను ఉండనుగా, ఆయన బాగోగులు నువ్వొక్కడివే చూసుకోవాలి” – సీతాలక్ష్మణులిద్దరికీ రాముడి క్షేమం గురించే ఆలోచన.

దిక్పాలకులకూ అరణ్యానికీ పర్వతాలకూ గంగానదికీ ఆమెను అప్పగించి- “ఈ ఘోరం చేసేందుకేనా, ఆంజనేయుడు నన్ను ఆ మూర్ఛనుంచి తేర్చి బ్రతికించినది?” అని వాపోతూ నిష్క్రమిస్తాడు లక్ష్మణుడు.

వాల్మీకి సీతను రక్షించి తీసుకువెళుతూ “ఉత్తములైన పుత్రులను కంటావు, భర్తను మళ్ళీ కలుసుకుంటావు” అని వాల్మీకి దీవిస్తాడు. మొదటి దీవెన వాల్మీకమే, రెండవది దిజ్ఞాగం.

“నేను సుఖంగా ప్రసవిస్తే నీకు రోజూ ఒక కుందమాలను అల్లి సమర్పించుకుంటాను” అని గంగకు మొక్కుకుంటుంది సీత. ఇటువంటి మొక్కునే వాల్మీకి రామాయణం లో వనవాసానికి రామలక్ష్మణులతో గంగ దాటి వెళ్ళే సీత మొక్కుతుంది. తాము క్షేమంగా తిరిగివస్తే నైవేద్యం పెడతానని.

ఆ తర్వాత వచ్చే ప్రవేశికలో కుశలవుల జననం చెప్పబడుతుంది. వారిద్దరూ ‘రామశ్యాములు’ [ రామునివలె నల్లనివారు ]. లేడిపిల్లతో పరుగులుపెడుతూ, సిం హపు పిల్లలతో ఉట్టుట్టి యుద్ధాలు చేస్తూ, మునిపత్నుల ముద్దులు కుడుస్తూ పెద్దవారవుతున్నారు. వాల్మీకి వారికి రామాయణ గానం నేర్పుతున్నాడు. నైమిశారణ్యంలో శ్రీ రామచద్రుడు యజ్ఞం చేయ తలపెట్టాడు. ఋషులందరినీ భార్యలతో కలిసి రమ్మని ఆహ్వానం.[ ఇలా ' సపత్నీకులై ' ఋషులను రమ్మన్నారనటం లో ఆయనా ఆ యజ్ఞ సంకల్పఫలంగా సపత్నీకుడు కాబోయే సూచన ఉంది ] వాల్మీకి మహర్షికీ పిలుపు వచ్చింది.

రెండవ అంకం లో సీత సాలవృక్షం కింద ఒంటరిగా కూర్చొని ఆలోచనామగ్న అయిఉంటుంది.

ఆమె అనుకుంటూ ఉంది “పార్వతీపరమేశ్వరుల పక్కనే సీతారాములనూ శాశ్వత ప్రేమాసక్తులుగా చెప్పి ఉన్నారే..ఇదేమిటి, ఇలా అయింది ! ఏ తప్పూ చేయకుండానే ఆయనకు ఇంత దూరంగా ఉన్నాను….ఎన్నాళ్ళు ఇలాగ ? ఒకరికి ఇద్దరుయోగ్యులైన కుమారులు జన్మించారు, వాల్మీకి మహర్షి కన్నబిడ్డ లాగా ఆదరిస్తున్నారు, చాలదా ? ఈ తపోవనంలో నేను ఇలా [విరహిణినై ]నిట్టూరుస్తూ కూర్చోకూడదు.కాని నావల్ల అవటం లేదు. అయోధ్యాప్రజల నుంచి అమితమైన గౌరవాన్ని పొందీ అపనిందనూ భరించవలసి వచ్చింది. పోనీ ప్రాణత్యాగం చేస్తే…అది మంచిదేనా ? నా అవమానం నిలిచిపోదా ? ప్రియసఖి వేదవతి తో మాట్లాడనేలేదు”

కొంతకాలం పాటు ఎక్కడికో వెళ్ళి ఉన్న వేదవతి వస్తుంది.

“సీత..ఎంత చిక్కిపోయింది..ఎలా పాలిపోయింది…” అని బాధ పడుతూ సమీపించి
“కుశలవులకు కుశలమే కదా ?” అని అడుగుతుంది.

“వనవాసోచితంగా” అని అర్థోక్తిలో ఆగుతుంది సీత. అడవుల పాలైన రాజకుమారులు ఎలా ఉంటారో అలాగే ఉన్నారని.[ కుశలం అంటే దర్భలను సేకరించే సామర్థ్యం అని ప్రత్యేకమైన అర్థం కూడా ఉంది ]

“మరి నువ్వు ? ఎలా ఉన్నావు ?”

సీత తన జడ చూపుతుంది. “ఇది ఎలా ఉంది?” అని అడుగుతుంది. మారీచాశ్రమం లో శకుంతల లాగా ఆమె ఘృతైకవేణి. ఆ ఒంటిజడ దీర్ఘవిరహానికి చిహ్నం.
వేదవతి నొచ్చుకుని , “నీ మీద అపేక్ష లేని ఆ నిరనుక్రోశుడికోసం అమావాస్య ముందరి చంద్రలేఖలాగా క్షీణించిపోతావెందుకు?” అని అడుగుతుంది.

సీత- “ఆయన నిరనుక్రోశుడా?”

“నిన్ను పరిత్యజించలేదా మరి ?”

” నేను పరిత్యక్తనా ? ”

” కాదా ? ”

” శరీరంతో అవునేమో, హృదయం తో కాదు ”

” అతని పరకీయమైన హృదయం నీకెలా తెలుసు ?”

” ఆయన హృదయం నాకు పరాయిదేమిటి ? ”

” ఏమి విడని అనురాగం ! ”

” ఆయనది మాత్రం వీడిన అనురాగమా ? నాకోసమే కదా, సముద్రం మీద సేతువు నిర్మించాడు ?”

” పిచ్చిదానా, అది క్షత్రియధర్మంగా చేసిన పని ”

” ఇంకొక విషయం ఉంది చూడు ”

” ఏమిటి ? ”

” నన్ను గాక వేరెవరినీ ఎప్పటికి వక్షానికి హత్తుకోడు కదా …

ఎప్పటికైనా కుశలవుల తండ్రి నాకు కనిపిస్తారా ? ”

***

యజ్ఞనిమిత్తమై వాల్మీకాశ్రమం ఉన్న నైమిశారణ్యానికి రాముడు రానేవస్తాడు. ఆ అడవిలో అడుగుపెడుతూనే సీతను త్యజించిన శోకం హెచ్చవుతుంది. వెళ్ళవలసిన దారి వదిలి వికలుడయి సంచరిస్తుంటాడు. సీతకు చెప్పినట్లే లక్ష్మణుడు ఇప్పుడు అన్నగారికీ గంగాతరంగ శీతల స్పర్శను అనుభవించమని చెబుతాడు. నది మీదినుంచి వీచే గాలి ఆయనకీ అదే సాంత్వన ఇస్తుంది. మల్లెపూలమాల ఒకటి అలలమీద తేలుతూ వచ్చి రాముడి పాదాలకు చుట్టుకుంటుంది. ఒక్కసారిగా ఒళ్ళు జలదరిస్తుంది. ఆ అల్లిక పరిచయమైనదిలాగా ఉందని లక్ష్మణుడితో అంటాడు. లక్ష్మణుడికి మాత్రం సీత ధ్యాస లేకుండా ఉందా ? అయినా, ” ఎవరిది ? ” అని అడుగుతాడు.

” ఇంకెవరిది ? ” అని మాత్రం అనగలుగుతాడు రాముడు.

” అయితే ఈ నది నడకను అనుసరించి వెనక్కువెళదామా ? ”

” ఈ సృష్టిలో పోలికలు ఉంటూనే ఉంటాయి…మనకంత అదృష్టమెక్కడిది ? ఇక్కడెక్కడుంటుంది సీత ? అయినా అలాగే…ఈ మాల చాలా ప్రీతికరంగా ఉన్నా, గంగాదేవికి అర్పించినది కదా, వదిలివేస్తాను ”[ దేవతాప్రసాదంగా స్వీకరించకూడదా ? వదిలివేయటం ఎంత సులువో, ఎంతగా ధర్మభ్రాంతిని ఇస్తుందో- ఆయనకి…]

నడుస్తూ ఉండగా నది ఒడ్డున ఇసుకలో స్త్రీ పాద చిహ్నాలు. లక్ష్మణుడికి అనుమానం వస్తుంది. సీతాదేవి పాదాలు కదా, బాగా తెలిసినవి. రాముడూ గుర్తు పడతాడు.

అటువైపునుంచి సీత పూలు కోసేందుకు వస్తుంది. రామలక్ష్మణులు వెంబడించిన అడుగుజాడలు ఆగిపోతాయి. రాముడికి దుఃఖం వస్తుంది. బాధగా ” వత్సా ! ” అంటాడు లక్ష్మణుడిని. సీతకి వినిపిస్తుంది. ఉలిక్కిపడుతుంది. శరీరం పులకరిస్తుంది. మరొకరి కంఠధ్వని తనను వివశను చేయదు …అటువైపు చూడకుండా ఉండగలిగేందుకు ప్రయత్నిస్తుంది- ఓడిపోతుంది. పొదమాటునుంచి చూసి ” కనులపండుగయినందుకు గాఢమైన సంతోషం…ఇంతకాలపు ఎడబాటుకి గొప్ప దుఃఖం…ఆయన చిక్కిపోయాడని ఉద్వేగం….నిర్దయుడు కదా , నాకెందుకు అని గట్టి పట్టుదల…చిరపరిచితుడని అంతులేని అనురాగం… చూడగగినవాడని, సౌందర్యవంతుడని ఉత్కంఠ…భర్త అని గౌరవం…కుశలవుల తండ్రి అని , నా కుటుంబపు యజమాని అని మన్నన…..నా మీద పడ్డ అపవాదుకు లజ్జ….ఈయనను చూసి నాకేమి అనిపిస్తోందో నాకే తెలియటం లేదు కదా ” అనుకుంటుంది. ఇన్నిటిలో పట్టుదల, లజ్జ మాత్రమే అస్వాదుభావనలు…తక్కినవన్నీ కలిపి ఆమె ప్రేమ తీవ్రత. .. ఆమె దిజ్ఞాగుని సీత.

రాముడికి దండకారణ్యం లోని వనవాసం జ్ఞాపకం వస్తుంది. అందులో తలచుకోవలసినది ఏమున్నదని లక్ష్మణుడు అంటాడు. ” ఏముందని అంటావేమిటి ? ఎన్ని లేవు !! సుకుమారమైన ఆమె చేయిపట్టుకొని , ఇష్టంగా మాట్లాడుకుంటూ, సాయంకాలాలు నది ఒడ్డున తిరిగినది గుర్తొస్తోంది. మా పాదాల ఒత్తిడికి ఇసుకలోంచి నీరు ఊరుతుండేది అప్పుడు ”…ఆశ పడుతున్నాడు రాముడు, ఈ విరహం లోనుంచీ రాగం రారాదా అని.‘’ నన్ను చేపట్టి ఆమె ఏమి సుఖపడింది ? ముందు వనవాసం, ఆపైన అశోకవనవాసం, ఇప్పుడు ఈ ప్రవాసం …జానకీ, ఎక్కడున్నావు ? ” – అక్రోశిస్తాడు రాముడు. ఆయన బాధ చూడలేక ” ఇక్కడే ఉన్నాను ” అంటుంది సీత, అగుపడదామనుకుంటుంది, ఊహూ, వద్దని నిష్క్రమిస్తుంది. వాల్మీకి మహర్షి తపోప్రభావం తో ఆ నదీతీరంలో [స్నానం కోసం రాగల ] స్త్రీలెవరూ పురుషులకి కనిపించకుండా , మాటలు వినిపించకుండా ఉండేట్లు చేసిఉంటాడు. అందువలన- సీత , పరిసరాలలోనే ఉన్నా, కనిపించని రామలక్ష్మణులు ఆశ్రమానికి చేరుతారు.

రామాయణ గానాన్ని వినేందుకు వచ్చిన అప్సర, తిలోత్తమ- సీతను రాముడు గుర్తుంచుకున్నాడో లేదో పరీక్షించుదామని సీత రూపాన్ని ధరించాలనుకుంటుంది. ఒక మునికన్యతో ఆమాటలు అంటూ ఉండగారాముడి విదూషకుడు వింటాడు .విన్నాడని తెలిసి తిలోత్తమ ఆ ప్రయత్నాన్ని విరమిస్తుంది

చలిగా అనిపించి- సీత , వనవాసకాలం లో వనదేవత మాయావతి ఇచ్చి ఉన్న ఉత్తరీయాన్ని ధరిస్తుంది. అది వెన్నెలలాగా తెల్లనైన, సుగంధభరితమైన దివ్యోత్తరీయం . సీతారాములిద్దరికీ దానితో అనుబంధం ఉంది. అక్కడే ఉన్న ఆయనను కలుసుకోలేక వేదన పడు తూ రాజహంసల జంటను తిలకించి తృప్తి పడుతూ ఉంటుంది . ఆ హంసమిథునం ఎడబాటు ఎరగదు .రాముడూ ఆ కొలను దగ్గరకే వస్తాడు. సీత నీడ ను గుర్తిస్తాడు. నీడ కు వాల్మీకి కల్పించిన మాయ వర్తించదు. ” ఇదేమిటి, నన్ను పలకరించదు, బింబం లేని ప్రతిబింబం ఎలా సాధ్యం ? ” అని ఆశ్చర్యం తో ఆ నీడనే పట్టుకోబోతాడు రాముడు. తను ఆయనకు కనిపించటం లేదని అప్పటికి అర్థమవుతుంది ఆమెకి. నీడ కనబడకుండా దూరంగా వెళుతుంది. నీడ కూడా మాయమయిన అఘాతం తో రాముడు మూర్ఛ పోతాడు. సీత ప్రాణం కొట్టుకుపోతుంది. ఎవరేమైనా అనుకోనిమ్మని , ఆయనే తెప్పరిల్లి ఆజ్ఞమీరినందుకు నిందిస్తే నిందించనిమ్మని…వెళ్ళి కౌగలించుకుంటుంది. వెంటనే ఆయనకు స్పృహ వస్తుంది. దేహమంతా గగుర్పొడుస్తుంది. విడివడిన ఆమెను వెళ్ళిపోకు, ప్రసన్నవు కమ్మని వేడుకుంటాడు.

ఆమె అంటుంది ” నేనెప్పుడూ ప్రసన్ననే, నీ ప్రసన్నతే నాకు కావలసినది ” అని. ఆమె కనిపించనట్లే మాటలూ వినిపించవు. గుండె అవిసి మళ్ళీ ఆయన మూర్ఛ పోతాడు. ఆమె ఉత్తరీయం తో విసురుతుంది, తిరిగి లేస్తూ, ఆ చెంగు ఆయన పట్టుకుంటాడు. సందేహం లేదు, ఆమెదే. ఎక్కడ ఆమె ? కనబడదు. కళ్ళలో నీటి వల్ల చూపు మసకబారిందేమోనని ఉత్తరీయం తో ఆయన కళ్ళు తుడుచుకుంటాడు. ” పరకీయను, నా ఉత్తరీయం తో నువ్వు అలా చేయరాదు కద ” అని ఆమె ఉత్తరీయాన్ని వదిలివేస్తుంది. పూర్తిగా దాన్ని ధరించి, ఆమెను దగ్గరగా తీసుకున్నట్లే తృప్తి పడి , రెండు ఉత్తరీయాలు ధరించి ఉంటే చూసినవారేమనుకుంటారోనని, గాలిలోకి ఎగరవేస్తాడు. ఆమె మహాప్రసాదంగా అందుకుంటుంది.

జనం ఏమనుకుంటారోననే నిరంతరమైన అనుమానం రాముడిలో ఇక్కడా పనిచేస్తున్నట్లే. ఎందుకో తెలియకపోయినా సీత ను గుర్తు చే స్తూ ఉన్న ఆ ఉత్తరీయాన్ని ఆయన దాచుకోవచ్చు కదా. సీత ప్రేమావేశానికి మాత్రం ఏదీ అడ్డురాదు. గాలిలోకి ఎగిరిన ఉత్తరీయం మాయమవటాన్ని రాముడు చూసి అది ఏదో సిద్ధుల మాయ అనీ ఆమెను ఎవరో దాస్తున్నారనీ అనుకుంటాడు.

” కనిపించు, సీతా ! గడిచిన రోజులు గుర్తు లేవా నీకు ? అప్పుడు అరణ్యంలో పుష్పాలు కోసి ఉత్తరీయపు చెంగులో నింపుకుంటున్నావు. నేను ఇలాగే దాన్ని లాగాను, పూలు నేలరాలాయి, జ్ఞాపకం లేదూ ? ”
ఇక్కడ సీత స్పందించిన తీరులో ఆమె ప్రణయినీత్వం పూర్తిగా ఉట్టిపడుతుంది. ఆ ఉత్తరీయం ద్వారా మళ్ళీ దగ్గరైన ఆయన స్పర్శ అందుకు ప్రేరేపించిందనుకోవచ్చు. ఏమైనా- ఆ దుర్భర వియోగం లేనట్లే, ఆయన చేసినదేదో అల్పపు దోషమైనట్లే, ఆ దూరం అదొక నెయ్యపుకినుక గానే ఆమెకి అనిపిస్తుంది.
నవ్వుతూ అంటుంది -” సాహసికుడా, అందుకే కదా నాకు దూరమైనావు ”

ఈమె దిజ్ఞాగుని సీత.

అప్పుడు అక్కడికి రాముడి చెలికాడు, విదూషకుడు కౌశికుడు వస్తాడు. తిలోత్తమ సీత రూపం లో రాముడికి కనిపించాలనుకుంటోందని విన్నానని చెబుతాడు. తిలోత్తమ నిజానికి , ఇతను విన్నాడనే అందుకు పూనుకోదు. జరిగినదంతా ఆ మాయ అవునా అని అనుమానం వస్తుంది రాముడికి.

” హృదయానికి ఆహ్లాదం ఇచ్చే మల్లె దండను సీత అల్లినట్లే తిలోత్తమ అల్లిఉండవచ్చు. ఇసుకలో సీత పాద చిహ్నాలనూ కల్పించి ఉండవచ్చు. నీటిలో నీడనూ చూపించి ఉండవచ్చు. కాని, తృప్తాత్మ అయిన సీతలాగా అలా నాకు వీచగలదా ? ‘’ . లేదనే ఆయన తలపు. తెగని ఆయన ఆలోచనను గమనించి , కౌశికుడు అడుగుతాడు – ” సీతను తలచుకుంటున్నావా ? ”

” అవును ”

” ఆమె సుగుణాలనా, దోషాలనా ? ”

‘’ వేటినీ కాదు’’

” రెండూ కాక మరేమి ఉంటాయి ?”

” సామాన్యుల ప్రేమకు గుణదోషాల విచారణ , సీతారాముల ప్రేమ కు ఉండదు.

దుఃఖే సుఖేష్వ ప్యపరిచ్ఛదత్వా
దసూచ్య మాసీ చ్చిర మాత్మనీవ
తస్యాం స్థితో దోషగుణానపేక్షో
నిర్వ్యాజసిద్ధో మమ భావబంధః

[సుఖమునందు దుఃఖమునందు సువ్యక్తమై చెప్పనక్కరలేనిదై (ఆమె ) ఆత్మయందున్నది. దోషమునకు గాని గుణమునకు గాని సంబంధములేని కారణరహితమైన యొక భావబంధము నాకామె యందున్నది ]

” నన్ను మోసగించకు నీ మాటలతో. ఆమె లేకుండా నీకు కాలక్షేపం అవటం లేదూ ? అవుతోందిగా ? ” విదూషకుడు పదునుగా ఎత్తిపొడుస్తాడు.
ఎప్పుడూ విప్పని మనసును ఇప్పుడు మిత్రుడి దగ్గర బయటపెడుతున్నాడు రాముడు. చెప్పలేక చెప్పుకుంటున్నాడు.

” అనురాగం మానసస్థం. వెలుపలి కర్కశత్వం కనిపించి పోతుంది…లోపల ఆర్ద్రత ఉన్నదయ్యా, ఉన్నది. నా ప్రేమభావనలు తామరతూడులోని దారాలంత సూక్ష్మమైనవి, సుకుమారమైనవి. పూజ్యమైనవి ”
విదూషకుడు , బడబానలం దాచుకున్నసముద్రం వంటి మిత్రుడిని చూసి, ఆ అగ్ని సోకిన మంచుబిందువు లాగా ఆవిరవుతున్నానని , సీత ను తలచుకుని ఏడుస్తాడు….పేదగుండెవాడు ,అతనికి ఆమె మీద అంత అభిమానం.

అక్కడికి లవకుశులు వస్తారు. కుశుడు కొంత దుడుకువాడు. అందుకని, వాళ్ళు బయలుదేరేప్పుడు లవుడిని సీత ఎడంగా పిలిచి, కౌగలించుకుని ముద్దాడి, రాజుకు నమస్కరించి కుశలమడగమని చెప్పి పంపుతుంది. రఘువంశీయులు ఎవరికీ నమస్కరించరని ఆమె ఇదివరలో పిల్లలకు చెప్పిఉంది. ఆ మాటే పట్టుకుని కుశుడు రాముడితో అగౌరవంగా ప్రవర్తిస్తాడేమోనని ఆమె భయం. వారిద్దరినీ చూస్తూ ఉన్నవారికి, రాముడితో సహా, రాముడి బాల్యరూపం స్ఫురిస్తుంది. నమస్కరిస్తారు, బ్రాహ్మణ నమస్కారమని క్షత్రియుడైన రాముడు స్వీకరించడు. కౌగలించుకుని ఆసనం మీద తనపక్కన కూర్చోబెట్టుకుంటాడు. వాళ్ళు సిగ్గుపడిపోతారు. విదూషకుడు రఘువంశానికి చెందనివారు ఆ సిం హాసనం అధిష్టించరాదని, ప్రమాదం కలుగుతుందని జ్ఞాపకం చేస్తాడు. పిల్లలకి ఏమీ కాలేదు, అయినా ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు, నేల పైన కూర్చోనీయక.

తండ్రి పేరు ‘ నిరనుక్రోశుడు ‘[నిర్దయుడు ] అని చెబుతారు. వాళ్ళు అల్లరి చేసినప్పుడు అమ్మ, ‘ నిరనుక్రోశుని బిడ్డలారా, చాపల్యం వదలండి ” అని మందలిస్తుంది కనుక ఆయన పేరు అదే అని.
రావలసినవారంతా వస్తారు. రామాయణగానం మొదలవుతుంది. కైకేయి దశరథుడిని వరమడిగే సందర్భాన్ని దాటించి చెప్పమంటాడు రాముడు, ఆమె నొచ్చుకుంటుందని. ఆప్తుల వేదన పట్ల ఆయనకు అంత అక్కర. సీతాపరిత్యాగం తో కుశలవుల గానం ముగుస్తుంది. తర్వాతి కథ ఏమైందో వారికి తెలియదు, రాముడికి అవేదన.పుత్రులతో సహారామపత్నికి భద్రమని వాల్మీకి కబురు పెడతాడు. ఒకదానితో ఒకటి పొసగించుకోగా సత్యం అర్థమై ఒకరినొకరు కౌగలించుకుని మూర్ఛ పోతారు.ఆ మూర్ఛ ఎంతకూ విడదు. శ్వాస మాత్రం ఆడుతూ ఉంటుంది. వార్త తెలిసి సీతతో వాల్మీకి వస్తాడు.
సీత అడుగుతుంది, ” రాఘవులు సజీవులేనా ? ”

వాల్మీకి – ” అవును, సమీపించమ్మా ”

” ఆయన నాకు ఆ ఆజ్ఞ ఇవ్వలేదు కదా ”

” నేను అనుమతి ఇస్తున్నాను ” వాల్మీకి నొక్కి చెబుతాడు. [ నాటకమంతా, ముఖ్యంగా చివరి అంకం లో- వాల్మీకి సర్వాధికారిగా కనిపిస్తాడు.తపోధనుడుగా, పెద్దవాడుగా, బుద్ధిగరపవలసినవాడుగా వాల్మీకి కథను ఒక కొలిక్కి తీసుకువస్తాడు. అసలు కథ లో ఎవరైనా ఇలా న్యాయం చేసిఉండకూడదా అని కవి భావించి ఉండవచ్చు]
ఆమె వింటుంది, కాని విలపిస్తుంది.

ఆమె లాలించగా కుశలవులు లేస్తారు. వాల్మీకి ఉపచరిస్తే రాముడూ కళ్ళు తెరుస్తాడు.

కుశలవులు ప్రణామం చేసి ,రాముడినే చూస్తూ ఉంటారు.

సీత అడుగుతుంది – ” ఏషయో యువాభ్యా మేవం ప్రేక్షితః ‘’ [ఎవరురా ఆయన ? అలా చూస్తున్నారు ? ]

తమ కు చాలా ప్రియమైనవారిని బిడ్డలు చూస్తూ ఉంటే, అది ఎవరో వారి నోటనే చెప్పించే ముచ్చట ఇళ్ళలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అదే పద్ధతిలో, ఎవరో చెప్పించుకుని వినేందుకు , విని ఆనందించేందుకు- సీత వాళ్ళను అడుగుతోంది. విశ్వనాథ ఇక్కడ సీత గృహిణీత్వం ప్రకాశిస్తోందని అంటారు. రాముడు అది ఆమె ఉదాసీనత అనుకుంటాడు, ఖిన్నుడవుతాడు

” రావణవధ అనంతరం ఈ మహాదేవి పవిత్రతను అగ్నిదేవుడు నిరూపించి ఉండలేదా ? నీకు సరిపోలేదా ? మళ్ళీ అనుమానం ఏమిటి ? ” అని వాల్మీకి రాముడిని కోపంగా అడుగుతాడు. రాముడు ఆయన పాదాల మీద పడతాడు. వాల్మీకి శాంతించడు. ఆయనకు కావలసింది సీతా పరిగ్రహణం కాని తనను గౌరవించటం కాదు.

వాల్మీకి పరమప్రాకృతుడు ఒకనాడు…అందుకే అంటాడు ” జానపదుల మనసులకి అనురాగం వికాసాన్నీ, సుఖాన్నీ, సంతోషాన్ని ఇస్తుంది. రాజుల హృదయాలలో అదే అనురాగం మలినమైపోతుంది. ఇసక నేలలో పంటలు పండవు. కుశలవులను స్వీకరించు, నేను వెళతాను ” – వెనుదిరగబోతాడు. రాముడు వారిస్తాడు. వాల్మీకి, ఇక తప్పక, సీతను తన పవిత్రతను తిరిగి నిరూపించి చెప్పు కొమ్మ ని అడుగుతాడు.సీత లోకాలనూ లోకేశులనూ దిక్పాలులనూ మహర్షులనూ సంబోధిస్తుంది.

సృష్టి అంతా ఒక్కసారి నిశ్చలమూ నిశ్శబ్దమూ అయిపోతుంది.సీత భూదేవిని సాక్ష్యం కోరుతుంది. గొప్ప సం రంభం తో ఆవిడ వస్తుంది, సీత అడిగినట్లే ఆమె పునీత అని అందరికీ ఉద్ఘాటిస్తుంది.

” చాలా ? నమ్మారా ” అని అడుగుతుంది, భూదేవి, అందరినీ, స్వయంగా.

” సీతను గ్రహించు ”- వాల్మీకి ఆదేశిస్తాడు.

రాముడు- ” లక్ష్మణుడా, నమస్కరించు ”

” అమ్మా, పాపిని, చంపదగినవాడిని, ప్రణమిల్లుతున్నాను ”

సీత అతన్ని సమాదరించి దీవిస్తుంది. వాల్మీకి రాముడిని తిరిగి ఆజ్ఞాపిస్తాడు.
ఆయన తడబాటుతో, సంకోచం తో – ఇంటికి వెళదాం రమ్మని అడుగుతాడు. ఆమె మన్నిస్తుంది.

రాజ్యాధికారం మీద రాముడికి విరక్తి పుట్టిందా అనిపిస్తుంది. అక్కడికక్కడ కుశుడికి రాజ్యాభిషేకమూ లవుడికి యౌవరాజ్యాభిషేకమూ వాల్మీకితో జరిపిస్తాడు.. తనూ లక్ష్మణుడూ వారికి సహాయకులుగా మాత్రమే ఉంటామని ప్రకటిస్తాడు.

కుందమాల రాగరంజితమై ముకుందమాల అయింది.
-----------------------------------------------------------
రచన - మైథిలి అబ్బరాజు, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో