Wednesday, January 11, 2017

కలకాలము నిల్చునే మాయసంపదల్


కలకాలము నిల్చునే మాయసంపదల్




సాహితీమిత్రులారా!


వింటే భారతం వినాలి తింటే గారెలే తినాలి
అని అంటూంటారు మన తెలుగువారు
ఎంత మంది ఎన్నిరకాలుగా చెప్పినా
భారతం అంతగా విసుగు పుట్టించదు.
మరీ జంధ్యా పాపయ్యశాస్త్రిగారి పద్యాలైతే
ఇంకెంత బాగుంటాయో వారు వ్రాసిన
ఈ పద్యం చూడండి-
ఇది పాండవదూతగా కౌరవసభకు
కృష్ణుడు రాయబారిగా వెళ్ళి సంధి
ప్రయత్నాలు చేసి అవి విఫలంకాగా
తిరిగి పాండవులను చేరిన కృష్ణుడు
వారితో చెప్పిన పద్యం -

కాలుని దున్నపోతు చిరుగంటల మ్రోతకు గాక సంధివా
క్యాలకు వీనులొగ్గుదురటయ్య మదాంధులు గుండె గాలమై
యాలము దాపురించె దొరలందరకున్ కురుచక్రవర్తికిన్
కాలము దాపురించె, కలకాలము నిల్చునె మాయసంపదల్

అధికార, బలగర్వంతో గుడ్డివారైన దుర్యోధనాదులు
మీ సంధి వాక్యాలను వింటారా వారు వినదలచింది
యమధర్మరాజు వాహనమైన దున్నపోతు మెడలోని
గంటల చప్పుడునే అంటే మరణానికి సిద్ధం
కాబోతున్నారన్నమాట. వారి మూర్ఖత్వానికి గుండెలు
గాలంగా మారి ఇరుపక్షాల నభిమానించే రాజులందరికి
యుద్ధం దాపురించింది. కురుచక్రవర్తి దుర్యోధనునికి
తన వారితో కూడ వినాశకాలం సమీపించింది. మోసంతో
మాయలతో జూదంలో జయించి సంపాదించిన
సంపదలు ఎక్కువ కాలం ఉంటాయా - అని పద్యభావం

No comments:

Post a Comment