Monday, April 30, 2018

సుందర లోకం


సుందర లోకం



సాహితీమిత్రులారా!



దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కవిత
సందరలోకం వారిమాటల్లో
ఆలోకం అవలోకించండి-


చుక్కల కావలి దిక్కున 
             సుందరలోకం
మిక్కలి దూరం ప్రయాణ
           మెంతైనా భారం-
అక్కడ నా చిట్టితల్లి 
          హాయిగానే ఉంటుంది-
ఒక్కతే వాళ్ల మామ్మ 
          ఒడిలో కూర్చుంటుంది-
అక్కడ ఇంద్రధనుస్సులు 
          అల్లిన పందిళ్లు
అక్కడ వెన్నెల కలాపి
          చల్లిన వాకిళ్లు.....

బుద్ధ(పౌర్ణిమ)జయంతి శుభాకాంక్షలు


బుద్ధ(పౌర్ణిమ)జయంతి శుభాకాంక్షలు


సాహితీమిత్రులకు
 శ్రేయోభిలాషుకు
బుద్ధ(పౌర్ణిమ)జయంతి శుభాకాంక్షలు

దయసేయంగదవయ్య శాక్యమునిచంద్రా నీ పదస్పర్శచే
గయిసేయంగదవయ్య భారత మహీఖండంబు దీవ్యత్ కృపా
మయ మందార మరంద బిందులహరీ మందస్మితాలోకముల్
దయసేయంగదవయ్య మానవ మనస్తాపంబు చల్లారఁగన్ 
                                        - కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి

Sunday, April 29, 2018

అమరకుడు - అమరుక శతకం


అమరకుడు - అమరుక శతకం




సాహితీమిత్రులారా!

అమరుడు లేక అమరకుడు అని పిలువబడే ఈ కవి
ముక్తకకావ్యం రచించాడు దీన్నే మనం శతకం అంటున్నాము.
సంస్తృతంలో మిక్కిలి జనాదరణ పొందిన శతకాల్లో
అమరుక శతకం ఒకటి. దానిలో 115 శ్లోకాలున్నాయి.
ప్రజలలో వాడుకలో ఉన్న ఐతిహ్యం ప్రకారం శంకరాచార్యులే
అమరుకమహారాజు మృతదేహంలో ప్రవేశించి, శృంగార 
అనుభవాలను సంపాదించి ఆ కావ్యం వ్రాసినట్లు ప్రతీతి.
అమరుకంలోని శ్లోకాలు అలంకారశాస్త్ర గ్రంథాలలో లక్ష్యాలుగా
ప్రదర్శించబడినాయి. ఈ కావ్యానికి సుమారు 11 వ్యాఖ్యానాలు వెలిశాయి. 
వాటిలో అర్జునదేవుడు వ్రాసినది అత్యంత ప్రాచీనమైనది.
కొండవీటి రెడ్డిరాజు పెదకోమటి వేమారెడ్డి కూడా అమరుకానికి 
వ్యాఖ్యానం వ్రాశారు. గాథాసప్తశతిలాగానే అమరుకశతకం 
కూడా శృంగారభరితమైన ముక్తక కావ్యం. దీనిలో ప్రధానంగా 
శార్దూలవిక్రీడితవృత్తాలు ఉపయోగించబడ్డాయి. అక్కడక్కడ 
మాలినీ, శిఖరిణీ, హరిణీ, మొదలైన వృత్తాలు కూడా కనిపిస్తాయి. 
ఈ కావ్యం భాీరతదేశంలోని పలుభాషల్లోకి అనువదింపబడింది.

Saturday, April 28, 2018

భాగవతం శుకయోగి ఎందుకు చదివాడు?


భాగవతం శుకయోగి ఎందుకు చదివాడు?



సాహితీమిత్రులారా!



భాగతవతం గొప్పదనాన్ని వివరించే పద్యాలు
శ్రీమదాంధ్రమహాభాగవతం ప్రథమస్కంధంలో
చెప్పబడినవి చూడండి-

అవనీచక్రములోన నేపురుషుఁడేయామ్నాయమున్ విన్న మా
ధవుపై లోకశరణ్యుపై భవములం దప్పింపఁగాఁ జాలు భ
క్తివిశేషంబు జనించు నట్టి భువనక్షేమంకరంబైన భా
గవతామ్నాయముబాదరాయణుఁడు దాఁగల్పించెనేర్పొప్పఁగన్

భూమండలంలో ఏ మానవుడు ఏ గ్రంథంలోని విషయాన్ని
విన్నంత మాత్రం చేతనే శ్రీమహావిష్ణువుపై అచంచలమైన
భక్తి కలిగి జన్మబంధాలు తొలగిపోతాయో అలాంటి లోక
కల్యాణప్రదమైన భాగవతం అనే మహాగ్రంథాన్ని వ్యాసమహర్షి
నేర్పుతో రచించాడు.

ఇట్లు భాగవతంబు నిర్మించి, మోక్షార్థియయిన శుకునిచేఁజదివించె,
నని చెప్పిన విని శౌనకుడు నిర్వాణతత్పరుండును సర్వోపేక్షకుండు
నయిన శుకయోగి యేటికి భాగవతం బభ్యసించె ననపుఁడు సూతుండిట్లనియె.

వ్యాసుడు ఆ విధంగా భాగవతం వ్రాసి ముముక్షువైన శుకునిచే
చదివించాడు. అనగానే శౌనకుడు శుకుడు కేవలం స్వస్వరూప
జ్ఞానంకలవాడు కదా విశ్వంలోని సమస్తవిషయాలపైన ఉపేక్షభావం
కలవాడు కదా అలాంటివాడు భాగవతం మాత్రం ఎలా చదివాడు
ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు దానికి సూతుడు ఇలా చెప్పాడు.

ధీరులు నిరపేక్షులు నా
త్మారాములు నైన మునులు హరిభజనము ని
ష్కారణమ చేయుచుందురు
నారాయణుఁడట్టివాఁడు నవ్యచరిత్రా

నుతింపదగిన చరిత్రగలవాడా భగవంతుని యందే తప్ప మరే విషయంపై
 ఆసక్తి లేనివారు, ప్రాపంచిక విషయాలందు అనురక్తి లేనివారు, ఆత్మయందే
రమించువారు అయిన యోగీంద్రులు నిర్వ్యాజమైన భక్తితో హరి సంకీర్తనం
చేస్తుంటారు. శ్రీమన్నారాయణుడు అట్టి యోగ్యతకలవాడు.

హరిగుణవర్ణనరతుఁడై
హరితత్పరుఁడైన బాదరాయణి శుభత
త్పరతం బఠించెఁ ద్రిజగ
ద్వరమంగళ మైన భాగవత నిగమంబున్

శుకయోగి శ్రీహరి దివ్యనామాలను, గుణాలను గానం చేయుటయందు
ఆసక్తి కలవాడు. ఆయన యందే ఏకాగ్ర చిత్తం కలవాడు. ఆయన
భాగవతసంహితను మూడులోకాలకు శుభదాయకమైనదిగా భావించాడు.
శుభంకలగాలనే అధ్యయనం చేశాడు.

నిగమములు వేయుఁజదివిన
సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్
సుగమంబు భారత మను
నిగమంబుఁ బఠింప ముక్తి నివసనము బుధా

శౌనకముని పండితా వేలవకొలదిగా ఉన్న వేదశాఖలన్నింటిని
అధ్యయనం చేసినా ముక్తిసంపద సులభంగా లభించేది కాదు.
కాని భాగవతసంహితను అభ్యసిస్తే కైవల్యం సులభంగా లభిస్తుంది.

Friday, April 27, 2018

అవాల్మీకీయ కథ - 1


అవాల్మీకీయ కథ - 1


సాహితీమిత్రులారా!



భాస్కరరామాయణంలో వాల్మీకి వ్రాయని అనే 
కథలున్నాయి వాటిలో ఒక కథ. 
అరణ్యకాండ ప్రథమాశ్వాసంలో
జంబుకుమారుని లక్ష్మణుడు చంపినట్లు చెప్పబడింది.
ఇది వాల్మీకి రామాయణంలో లేదు. ఆ కథ 
సంక్షిప్తంగా -
రాముడు అగస్త్యుని దర్శించిన తరువాత ఆయన
సూచించిన మేరకు అరణ్యంలో నివసించే ప్రాంతం
ఎన్నుకొని అక్కడ పర్ణశాల నిర్మించుకొనుటకు
వెళ్లే దారిలో జటాయువును దర్శించిన తరువాత
వారు పర్ణశాలను నిర్మించుకొనిన తరువాత
లక్ష్మణుడు రాముని పనుపున సీతకు పండ్లు
తీసుకురావటానికి అడవిలోకి వెళతాడు.
అక్కడ విద్ద్యుజ్జిహ్వుని కుమారుడు జంబుకుమారుడు
ఘోరమైన తపస్సుకు మెచ్చిన ఇంద్రుడు
ఒక చంద్రహాసాన్ని ఇచ్చాడు దానికి తృప్తి పడని
జంబకుమారుడు దాన్ని పట్టించుకోకుండా తపస్సు 
చేస్తున్నాడు. ఆ ప్రాంతం చేరిన లక్ష్మణునికి
ఆ కత్తి మాత్రం కనిపించింది దాన్ని తీసుకుని
లక్ష్మణుడు అటు ఇటు ఝళిపించాడు.
 పండ్లు కోసుకోటాని పనికి వస్తుందని
పండ్ల చెట్లను కొడుతుంటే మునులు
వారించి చెట్లను అలా చేయవద్దని
కావాలంటే ఈ వెదురు పొదను ఒక వేటున 
తెవేయమన్నారు. దానితో వెదురు పొదను
నరుకగా అందులో నుండి తపస్సు చేసుకుంటున్న
జంబుకుమారుని తల తెగిపడింది. నేను ఒక
బ్రాహ్మణుని చంపానే అనే బాధతో అన్నదగ్గరకు
పరుగున వెళ్ళాడు. అక్కడికి మునులు వచ్చి
రామునికి జరిగిన వృత్తాంతమంతా వివరించారు
అతడు బ్రాహ్మణకుమారుడు కాదని చెప్పి
ఒక రాక్షసుడు మరణించాడని చెప్పి
రామలక్ష్మణులను శాంతింపచేశారు.
ఇది సంక్షిప్తకథ.

Thursday, April 26, 2018

పద్మిని - 1


పద్మిని - 1




సాహితీమిత్రులారా!



స్త్రీలను పద్మిని, చిత్రిణి, శంఖిని, హస్తిని 
అని నాలుగు జాతులుగా చెబుతారు.
పద్మిని జాతి స్త్రీని గురించి
ఇక్కడ తెలిసుకుందాం-
కొక్కోకము అను కళాశాస్త్రం నుండి ఈ పద్యాలను
గ్రహించడమైంది గమనించగలరు.

తామర మొగ్గచందమున మెత్తని మేను
        జలజగంధము రతిజలముఁదనరు
మాలూరఫలముల మఱపించు  పాలిండ్లు
        కొలికుల కింపైన కలికిచూపు
తిలపుష్పముల వన్నె దిలకించు  నాసిక
        గురువిపూజనాపర సునియమ
చంపకకువలయ ఛాయయుగల మేను
        నబ్జపత్రము బోలు నతనుగృహము
హంసగమనంబు కడుసన్నమైన నడుము
మంజుభాషిణి, శుచి, లఘుమధురభోజి
వెల్లచీరల యందున వేడ్క లెస్స
మానవతి పద్మినీభామ మధురసీమ

తామరపువ్వువలె మెత్తని శరీరంను,
తామరపువ్వువాసనగల రతిజలమును,
మారేడు పండ్లవంటి కుచములును,
సొగసగు చూపును, నువ్వుపువ్వువంటి ముక్కును,
గురు బ్రాహ్మణ పూజయందు ఆసక్తియు,
సంపంగి వంటియు కలువ పువ్వులవంటి
దేహఛాయ గలదియు, హంసగమనమును,
సన్నని నడుమును, మంచి మాటలును,
శుచియై కొద్దిపాటి భోజనమును, తెల్ల చీరల
యందు ప్రీతియును గల స్త్రీ పద్మిని జాతి
స్త్రీగా నెరుగవెను- అని భావం


Wednesday, April 25, 2018

బమ్మెర పోతన నారాయణ శతకం


బమ్మెర పోతన నారాయణ శతకం 


సాహితీమిత్రులారా!


"నారాయణ శతకం" పేరుతో "బమ్మెర పోతన"గారు
ఒక శతకం కూర్చానట్లు చెప్పబడుతున్నది
ఆ శతకంలోని కొన్ని పద్యాలు ఇక్కడ
ఇస్తున్నాను ఆస్వాదించండి-

శ్రీరమామణి పాణిపంకజ మృదుశ్రీతఙ్ఞ శృం
గారాకారశరీర చారుకరుణాగంభీర సద్భక్తమం
దారాంభోరుహపత్రలోచన కళాధారోరు సంపత్సుధా
పారవారవిహార నాదురితంల్ భజింపు నారాయణా                                               

మ. కడకుం బాయక వెయ్యినోళ్ళు గలయాకాకోదరాధీశుఁడున్
గడముట్ట న్వినుతింపలేక నిగుడన్ గ్రాలంగ నొప్పారు మి
మ్మడరన్ సన్నుతిసేయ నాదువశమే యజ్ఞాని లోభాత్ముడన్
జడుఁడన్నజ్ఞుడ నైకజిహ్వుఁడ జనస్తబ్ధుండ, నారాయణా.                  

శా. నే నీదాసుఁడ నీవు నాపతివి నిన్నే కాని యెండెవ్వరిన్
ధ్యానింఫం బ్రణుతింప నట్లగుటకున్నానేర్చు చందంబునన్
నీనామస్తుతు లాచరించునెడల న్నేతప్పులుం గల్గినన్
వానిన్ లోఁగొనుమయ్య తండ్రు! విహిత వ్యాపార, నారాయణా.                             

మ. నెరయ న్నిర్మల మైన నీస్తుతి కథానీకంబు పద్యంబులో
నొరుగుల్ మిక్కిలి గల్గె నేనియుఁ గడు న్యోగంబె చర్చింపఁగాఁ
గుఱుగణ్పైనను వంకబోయినఁ గడుం గుజ్జైనఁ బేడెత్తినం 
జెఱుకుం గోలకు తీపు గాక కలదే చే దెందు, నారాయణా                                

మ. చదువుల్ పెక్కులు సంగ్రహించి పిదపంజాలంగ సుజ్ఞానియై
మదిలోఁ బాయక నిన్ను నిల్పఁదగు నామర్మంబు నీక్షింపఁడే
మొదలం గాడిద చారుగంధవితతుల్ మోవంగ శక్యంబె కా
కది సౌరభ్యపరీక్ష జూడ కుశలేయవ్యక్త, నారాయణా.                             

మ. లలిఁ గబ్బంబు కరాట మివ్వసుధ నెల్లన్మించెఁ బో నీకధా
వలి కర్పూరము నించిన న్నితరమౌ వ్యర్ధార్థకామోదముల్
పెలుచం బూనినయక్కరాటము తుదిన్ బేతేకరాటంబెపో
చలదిం దీవరపత్రలోచన ఘనశ్యామాంగ, నారాయణా.                              

మ. ఘనమార న్నచలేంద్రజాధిపతికి న్మస్తాగ్రమాణిక్య మై
మునికోపానలదగ్ధ రాజతతికి న్ముక్తిస్ఫురన్నార్గమై
యెనయున్ సాయక శాయికిం జననియై యేపారుమిన్నేటికిం
జనిమూలం బగు నంఘ్రి మాదుమదిలోఁజర్చింతు, నారాయణా                       

శా. నీపుత్రుండు చరాచరప్రతతుల న్నిర్మించి పెంపారఁగా
నీపుణ్యాంగన సర్వజీవతతుల న్నిత్యంబు రక్షింపఁగా
నీపాదోదక మీజగత్త్రయముల న్నిష్పాపులం జేయఁగా
నీపెం పేమని చెప్పవచ్చు సుగుణా నిత్యాత్మ, నారాయణా.                           

శా. బ్రహ్మాండావలిలోన సత్వగుణివై బాహ్యంబునం దాదిమ
బ్రహ్మాఖ్యం బరతత్వబోధములకున్ భవ్యాధినాథుండవై
బ్రహ్మేంద్రామర వాయుభుక్పతులకున్ భవ్యాధినాథుండవై
జిహ్మవ్యాప్తుల నెన్న నాదువశమే చిద్రూప, నారాయణా                                

మ. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై
పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై
సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగసత్పుత్రియై
వరుస న్నీఘనరాజసంబు నిజమై వర్ధిల్లు, నారాయణా                           

మ. మగమీనాకృతి వార్ధిఁజొచ్చి యసుర న్మర్ధించి యవ్వేదముల్
మగుడందెచ్చి విరించి కిచ్చి యతని న్మన్నించి యేపారఁగాఁ
బగ సాధించినదివ్యమూర్తివని నే భావింతు నెల్లప్పుడున్
ఖగరాజధ్వజ భక్తవత్సల ధగత్కారుణ్య, నారాయణా                     

మ. అమరుల్ రాక్షసనాయకుల్ కడకతో నత్యంతసామర్ధ్యులై
భ్రమరీదండము మందరాచలముగా బాథోనిధిం ద్రచ్చగా
దమకించెన్ భువనత్రయంబును గిరుల్ దంతావళుల్ మ్రొగ్గినం
గమఠంబై ధరియించి మించిన జగత్కల్యాణ, నారాయణా.                 

శా. భీమాకారవరాహమై భువనముల్ భీతిల్ల కంపింపను
ద్ధామోర్విం గొనిపోయి నీరధిలో డాఁగున్న గర్వాంధునిన్
హేమాక్షాసురు వీఁకఁదాకిఁ జయలక్ష్మిన్ గారవింపగ నీ
భూమిం దక్షిణదంష్ట్ర నెత్తిన నినుం బూజింతు నారాయణా.              

శా. స్తంభంబందు నృసింహమై వెడలి యచ్చండాట్టహాసధ్వనుల్
దంభోళిం గడువంగ హేమకశి పోద్దండా నురాధీశ్వరున్
శుంభద్గర్భము వ్రచ్చి నానిసుతునిన్ శోభిల్ల మన్నించియ
జ్జంభారాతిని బ్రీతిఁదేల్చిన నినుం జర్చింతు, నారాయణా.                     

మ. మహియు న్నాకసముం బదద్వయపరీమాణంబుగాఁ బెట్టి యా
గ్రహ మొప్పం బలిమస్తకం బొకపదగ్రస్తంబుగా నెమ్మితో
విహరించింద్ర విరించి శంకరమహావిర్భూతదివ్యాకృతిన్
సహజంబై విలసిల్లు వామనల సచ్చారిత్ర నారాయణా.                            

మ. ధరణిన్ రక్తమహాహ్రదంబు లెలమిం ద్రైలోక్య నిర్దిష్టమై
పరగం బైతృక తర్పణంబుకొఱకై ప్రఖ్యాతిగాఁ దీవ్రతన్
నిరువయ్యొక్కటిమారు క్షత్రమరులన్నే పార నిర్జించి త
త్పరశుభ్రాజితరామనామము కడున్ ధన్యంబు నారాయణా                 

మ. వరుసం దాటకిఁ జంపి కౌశికు మఘస్వాస్థ్యంబు గావించి శం
కరుచాపం బొగిఁద్రుంచి జానకిఁ దగం గల్యాణమై తండ్రి పం
పరుదారన్ వనభూమికేఁగి జగదాహ్లాదంబుగా రావణున్
ధరణింగూల్చిన రామనామము కడున్ ధన్యంబు నారాయణా.             

మ. యదువంశంబునఁ గృష్ణు కగ్రజుఁడవై యాభీల శౌర్యోన్నతిన్
మదవద్ధేనుక ముష్టికాద్యసురులన్ మర్ధించి లీలారసా
స్పదకేళీరతి రేవతీవదన కంజాతాంతబృంగంబనన్
బిదితంబౌ బలరామమూర్తివని నిన్ వీక్షింతు నారాయణా                        

మ. పురముల్మూడుఁను మూఁడులోకములు నేప్రొద్దు న్విదారింపఁ ద
త్పురనారీ మహిమోన్నతుల్ సెడుటకై బుద్ధుండవై బుద్ధితో
వరబోధద్రుమ సేవఁజేయుటకునై వారిం బ్రబోదించియ
ప్పురముల్ గెల్చిన మీయుపాయము జగత్పూజ్యంబు నారాయణా                   

మ. కలిధర్మంబునఁ బాపసంకలితులై గర్వాంధులై తుచ్చులై
కులశీలంబులు మాని హేయగతులం గ్రొవ్వారు దుష్టాత్ములం
బలిగాఁజేయఁదలంచి ధర్మమెలమిం బాలించి నిల్పంగ మీ
వలనం గల్క్యావతార మొందఁగల నిన్ వర్ణింతు బారాయణా           

మ. ఇరవొందన్ సచరాచరప్రతతుల న్నెన్నంగ శక్యంబుకా
కరయన్ పద్మభవాండ భాండచయమున్నారంగ మీకుక్షిలో
నరుదార న్నుదయించుఁ బెంచు నడఁగు న్నన్నారికేళోద్భవాం
తరవాఃపూరము చందమొంది యెపుడున్ దైత్యారి నారాయణా              

మ. దళదిందీవర నీలనీరదసముద్యద్భాసితాకార శ్రీ
లలనా కౌస్తుభచారువక్ష విబుధశ్లాఘోద్భవ స్థానకో
మలనాభీ చరణారవింద జనితామ్నాయాద్య గంగా! లన
జ్జలజాతాయతనేత్ర నిన్నుమదిలోఁ జర్చింతు నారాయణా                     

మ. జగదాధారక భక్తవత్సల కృపాజన్మాలయా పాంగ! భూ
గగనార్కేందుజలాత్మ పావక మరుత్కాయా! ప్రదీపయ్రో
గిగణస్తుత్య మహాఘనాశన! లసద్గీర్వాణసంసేవితా!
త్రిగుణాతీత! ముకుంద! నాదుమదిలో దీపింపు నారాయణా                      

శా. భూతవ్రాతము నంబూజాసనుఁడవై పుట్టింతు విష్ణుండవై
ప్రీతిం బ్రోతు హరుండవై చెఱుతు నిర్భేద్యుండవై త్రైగుణో
పేతంబై పరమాత్మవై నిలుతు నీపెంపెవ్వరుం గాన ర
బ్జాతోద్భూత సుజాత పూజత పదాబ్జశ్రేష్ఠ నారాయణా                  

మ. వరనాభీధవళాంబుజోదరమునన్ వాణీశుఁ గల్పించి య
ప్పురుషశ్రేష్ఠుని ఫాలమందు శివునిం బుట్టించి యామేటికిం
మరమోత్తంసముగా వియత్తలనదిం బాదంబులం గన్న మీ
సరి యెవ్వారలు మీరుదక్కఁగ రమాసాధ్వీశ నారాయణా                

మ. ప్రభ మీనాభి జనించినట్టి విలసత్పద్మోరుసద్మంబునం
బ్రభవంబైన విరించిఫాలజనితప్రస్వేదసంభూతుఁడై
యభిధానంబును గోరి కాంచెను భవుండార్వేశులూహింపఁగా
నభవాఖ్యుండవు నిన్నె ఱుంగవశమే యాబ్జాక్ష నారాయణా     

మ. పటుగర్భాంతరగోళభాగమున నీబ్రహ్మాండభాండంబు ప్రా
కటదివ్యాద్భుతలీలఁ దాల్చి మహిమం గల్పాంత మంబోధిపై
పటపత్రాగ్రముఁ జెంది యొప్పినమిము న్వర్ణింపఁగా శక్యమే
నిటలాక్షాంబురుహాసనాదికులకు న్నిర్వాణ నారాయణా                     

మ. సవిశేషోరుసువర్ణ బిందువిలసచ్చక్రాంకలింగా కృతిన్
భవిచే నుద్దవుచేఁ బయోజభవుచేఁ బద్మారిచే భానుచే
ధ్రువుచే నా దివిధినాయకులచే దివ్యన్మునీంద్రాళిచే
నవదివ్యార్చన లందుచుందువు రమానారీశ నారాయణా                   

మ. సర్వంబున్ వసియించు నీతనువునన్ సర్వంబునం దుండఁగా
సర్వాత్వా! వసియించు దీవనిమదిన్ సార్ధంబుగాఁ జూచి యా
గీర్వాణాదులు వాసుదేవుఁడనుచున్ గీర్తింతు రేప్రొద్దు నా 
శీర్వాదంబు భవన్మహామహిమ లక్ష్మీనాథ నారాయణా             

మ. గగనాద్యంచిత పంచభూతమయమై కంజాత జాండావలిన్
సగుణబ్రహ్మమయాఖ్యతం దనరుచున్ సంసారివై చిత్కళా
సుగుణంబై విలసిల్లుదీవు విపులస్థూలంబు సూక్షంబునై
నిగమోత్తంస గుణావతంస సుమహా నిత్యాత్మ నారాయణా           

మ. ఎలరారన్ భవదీయనామకథనం బేమర్త్యుచిత్తంబులోఁ
బొలుపారం దగిలుండునేని యఘముల్ పొందంగ నెట్లో పెడున్
కలయం బావకుచేతఁ బట్టువడు నక్కాష్టంబుపైఁ గీటముల్
నిలువన్నేర్చునె భక్తపోషణ కృపానిత్యాత్మ నారాయణా             

మ. కలయం దిక్కులు నిండి చండతరమై కప్పారు మేఘౌఘముల్
వెలయన్ ఘోరసమీరణస్ఫురణచే వేపాయుచందంబునన్
జలదంభోళిమృగాగ్ని తస్కర రుజా శత్రోరగవ్రాతముల్
దొలఁగున్న్మీగదు దివ్యమంత్రపఠనన్ దోషాఘ్న నారాయణా   

మ. కలుషగాథా వినాశకారి యగుచుం గైవల్య సంధాయియై
నలి నొప్పారెడు మంత్రరాజమగు నీనామంబు ప్రేమంబుతో
నలర న్నెవ్వానివాక్కునం బొరయదే నన్నీచు ఘోరాత్మయున్
వెలయన్ భూరుహకోటరంబదియ సూ వేదాత్మ నారాయణా                

మ. పరమంబై పరతత్వమై సకలసంపత్సారమై భవ్యమై
సురసిద్ధోరగ యక్షపక్షిముని రక్షోహృద్గుహాభ్యంతర
స్థిరసుజ్జానసుదీపమై శ్రుతికళాసిద్ధాంతమై సిద్ధమై
సరిలేకెప్పుడు నీదునామ మమరున్ సత్యంబు నారాయణా              

మ. అధికాఘౌఘతమో దివాకరమునై యద్రీంద్రజా జిహ్వకున్
సుధయై వేదవినూత్న రత్నములకున్ సూత్రాభిధానంబునై
బుధసందోహ మనోహరాంకురమునై భూదేవతాకోటికిన్
విధులై మీబహునామరాజి వెలయున్ వేదాత్మ నారాయణా                    

మ. పొనరన్ముక్తికిఁ ద్రోవ వేదములకుం బుట్టిల్లు మోదంబునం
దునికిస్థానము యిష్టభోగములకు న్నుత్పత్తి యేప్రొద్దునున్
ఘనపాపంబులవైరి షడ్రిపులకున్ గాలావసానంబు మీ
వినుతాంఘ్రి ద్వయపద్మసేవనగదా విశ్వేశ నారాయణా              

మ. భవరోగంబులమందుపాతకతమౌ బాలార్క బింబంబు క
ర్మ విషజ్వాలసుధాంశుగామృతతుషార వ్రాతపాథోధిమూ
ర్తివి కైవల్యపదావలోకన కళాదివ్యాంజనశ్రేష్ఠమై
భువిలో మీదగుమంత్రరాజ మమరున్ భూతాత్మ నారాయణా            

మ. వరుసన్ గర్మపిపీలికాకృత తనూవల్మీకనాళంబులోఁ
బరుషాకారముతో వసించిన మహా పాపోరగశ్రేణికిం
బరమోచ్చాటనమై రహస్యమహిమం బాటింపుచు న్నుండుమీ
తిరుమంత్రంబగు మంత్రరాజ మమరుం దివ్యాత్మ నారాయణా       

మ. హరునిన్నద్రిజ నాంజనేయుని గుహు న్నయ్యంబరీషున్ ధ్రువుం
గరిఁ బ్రహ్లాదు విభీ'ణాఖ్యుని బలిన్ ఘంటాశ్రవు న్నారదున్
గరమొప్ప న్విదురున్ బరశరసుతున్ గాంగేయునిన్ ద్రౌపదిన్
నరునక్రూరునిఁ బాయకుండును భవన్నామంబు నారాయణా      

Tuesday, April 24, 2018

బ్రదుక నోపక యిచ్చిరొ కీర్తి కిచ్చిరో


బ్రదుక నోపక యిచ్చిరొ కీర్తి కిచ్చిరో




సాహితీమిత్రులారా!


ఈ చాటువు చూడండి దాతలను గురించి
చెప్పినది. రాయనమంత్రి భాస్కరునితో
ఏ కవి చెప్పాడొ ఈ చాటువు తెలియదుకాని
ఈ చాటువు గొప్పదనమేందో మీకే తెలుస్తుంది
చదవండి-

ఒక్కడు మాంసమిచ్చె మఱియొక్కడు చర్మము గోసి యిచ్చె వే
ఱొక్కరుడస్థినిచ్చె నిక నొక్కడు ప్రాణములిచ్చె వీరిలో
నొక్కొక పట్టునన్ బ్రదుక నోపక యిచ్చిరొ కీర్తి కిచ్చిరో
చక్కగ జూడు మంత్రి కుల సంభవ!  రాయనమంత్రి భాస్కరా!

ఓ రాయని మంత్రి భాస్కరా!
ఒకరు శరీరంలో నుండి మాంసం కోసి ఇచ్చారు
ఒకరు చర్మం కోసి ఇచ్చారు. మరొకరు వెన్నెముక
ఇచ్చారు. ఇంకొకరు ప్రాణమే ఇచ్చారు. వీళ్లంతా
బతుక లేక ఈ పనులు చేశారా కీర్తికోసం చేశారా
బాగా ఆలోచించి చూడు - అని భావం

ఇందులో కవి చెప్పిన మహాదాతలు -
మాంసంకోసి ఇచ్చినవాడు - శిబి చక్రవర్తి
(పావురాన్ని కాపాడటానికి)
చర్మం (సహజసిద్ధమైన కవచ కుండలాలు
ఇంద్రుడు అడగ్గా) కోసి ఇచ్చినది - కర్ణుడు
వెన్నెముక ఇచ్చినది - దధీచి (రాక్షస సంహారానికి
ఇంద్రుని ఆయుధంగా)
ప్రాణం ఇచ్చినవాడు - బలిచక్రవర్తి
(వామనుడు అడిగితే ప్రాణమే ఇచ్చాడు)
వీళ్లంతా త్యాగధనులు, మహాదాతలు.

Monday, April 23, 2018

ఉద్భటుడు


ఉద్భటుడు




సాహితీమిత్రులారా!



సంస్కృత లాక్షణికుల్లో సుప్రసిద్ధుడు ఉద్భటుడు.
రాజతరంగిణి ప్రకారం కాశ్మీరును పాలించిన 
జయాపీడు(770-813)ని ఆస్థానంలో సభాపతిగా
ఉన్నాడు. రోజుకు లక్షదీనారాలను వేతనంగా
అందుకొనేవాడు(దీనార లక్షేణ ప్రత్యహం కృత వేతనః).
ఆనందవర్థనుడు తన ధ్వన్యాలోకంలో ఉద్భటుని 
సగౌరవంగా పేర్కొన్నాడు. భామహ విరచితమైన 
కావ్యాలంకారానికి ఒక వ్యాఖ్యాగ్రంథం ఇతడు రచించాడు.
దానిపేరు భామహ వివరణం. ఇంతేకాకుండా
కావ్యాలంకార సార సంగ్రహం అనే పేరుతో ఒక
స్వతంత్ర లక్షణ గ్రంథాన్ని కూడా ఉద్భటుడు
రచించాడు. ఇందులో 41 శబ్దాలంకారాలు మాత్రమే
లక్ష్య లక్షణ సమన్వితంగా వివరించ బడ్డాయి.
 ఇది 6 వర్గాలుగా విభజించబడింది. ఉదాహరణ శ్లోకాలు
కాక, ఇందులో ఉన్న కారికల సంఖ్య 75. దీనికి 
లఘువృత్తి ప్రతీహరేందురాజు నిర్మించాడు. కుమార 
సంభవం అనే కావ్యాన్ని కూడా ఉద్భటుడు రచించాడని
చెప్పడానికి తగిన ఆధారాలు కావ్యాలంకార సంగ్రహంలో 
ఉద్ధరిచబడిన శ్లోకాల్లో కనబడుతున్నాయి. తెలుగులో
కుమారసంభవం రచించిన నన్నెచోడుడు కూడా
ఉద్భటుడు సంస్కృతంలో కుమారసంభవం
రచించినట్లు చెప్పివున్నాడు.


Sunday, April 22, 2018

ధూర్జటి చంద్రబింబపు వర్ణన


ధూర్జటి చంద్రబింబపు వర్ణన




సాహితీమిత్రులారా!


ప్రతి ప్రబంధంలోని అష్టాదశ వర్ణనల్లో చంద్రోదయ
సూర్యోదయ సూర్యాస్తమయ వర్ణనలు సహజం.
ఇక్కడ మనం ధూర్జటిగారి కాళహస్తీశ్వర మాహాత్మ్యంలోని
చంద్రబింబపు వర్ణనను ఒక పద్యంలో చూద్దాం. దీనికి
చీమలమర్రి బృందావనరావుగారి వివరణ(ఈమాట-మే 2008)
చూడండి -

మ. ఉదయ గ్రావము పానవట్ట, మభిషేకోద ప్రవాహంబు వా
      ర్ధి, ధరధ్వాంతము ధూపధూమము, జ్వలద్దీప ప్రభారాజి కౌ
      ముది, తారానివహంబు లర్పిత సుమంబుల్‌గాఁ దమోదూర సౌ
      ఖ్యదమై శీత గభస్తి బింబ శివలింగం బొప్పెఁ బ్రాచీదిశన్

ఈ పద్యం ధూర్జటి కవిది. శ్రీకాళహస్తి మాహాత్మ్యము అనే ప్రబంధ కావ్యం, రెండవ ఆశ్వాసం లోనిది. ఈయన శ్రీ కృష్ణదేవ రాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకడు. ధూర్జటి స్తుతమతి అనీ, ఈయన పలుకులకు అతులిత మాధురీ మహిమ కలదనీ శ్రీ కృష్ణదేవరాయ ప్రభువు అన్నట్లు ఒక చాటు పద్యం ప్రచారంలో ఉంది.
మొదట రసికుడై సుఖభోగాలు అనుభవించి, రాజాశ్రయం వల్ల వచ్చే సౌఖ్యాలన్నీ చవి చూసి, ముదిమి ముసిరే వేళకు మోక్షకామియై శివభక్తిలో పూర్తిగా మునిగిపోయిన దశలో, శివ ప్రభావాన్ని తెలిపే శ్రీకాళహస్తి మాహాత్మ్యము అనే ప్రబంధాన్నీ, శ్రీకాళహస్తీశ్వర శతకము అనే శతకాన్నీ భక్త్యావేశంలో రచించాడు ధూర్జటి. శ్రీకాళహస్తి మాహాత్మ్యము – శ్రీకాళహస్తి క్షేత్రం లోని ఈశ్వరుని లీలలూ, ఆయన భక్తుల కథలూ తెలిపే గ్రంథం. శ్రీకాళహస్తికి ఆ పేరు రావడానికి కారకాలైన సాలెపురుగూ, పామూ, ఏనుగుల శివభక్తి కథా, తిన్నడూ మరి ఇద్దరు వేశ్యా యువతుల శివభక్తి పారమ్యమూ, ఇంకా నత్కీరుడు అనే తమిళదేశపు కవి కథా, మొదలైన విశేషాలున్నాయి ఈ కావ్యంలో.
ఏనుగు వచ్చి పత్రి తోనూ, పూలతోనూ శివలింగాన్ని పూజించి పోతుంది. తర్వాత పాము వచ్చి ఆ ఆకూఅలములను పక్కకు నెట్టేసి తన వద్ద ఉండే మణిమాణిక్యాలతో శివుణ్ణి అర్చిస్తుంది. మర్నాడు పూజ చేయడానికి వచ్చిన ఏనుగు తన పూజాద్రవ్యాలు తొలిగింపబడి ఉండటం చూసి చింతిస్తుంది. రెండు మూడు రోజులు ఇలాగే జరిగే సరికి ఏనుగుకి కోపం వస్తుంది. తన పూలనూ పత్రినీ పక్కకు నెట్టేస్తున్న వారి అంతు చూడాలని నిశ్చయించుకుంటుంది. ఇక ఆ రాత్రి ఆ గజరాజుకి కోపంతో నిద్రపట్టదు. ఆ సందర్భంలో కవి చేసిన నిశా వర్ణనా, చంద్రోదయ వర్ణనల్లోనిది పై పద్యం.
ధూర్జటి గొప్ప శివభక్తుడు. ఆయనకు సర్వమూ శివమయం గానే కనిపించింది. ఆ రాత్రి ఉదయించిన చంద్రబింబమూ శివలింగం గానే తోచింది. మరి, శివలింగం అనగానే అందుకు సరిపోయిన ఇతర పరికరాలూ కావాలి. చంద్రుడు ఉదయించిన ఉదయశైలం శివలింగం వుండే వేదిక అయిన పానవట్ట మయింది. రుద్రాభిషేకం కావించగా ప్రవహించిన అభిషేక జలం తూరుపు సముద్రమైంది.సముద్రపు గట్టు మీద కనిపించే మసక చీకటి అగరొత్తుల ధూపంగా మారింది. చంద్రుడు వెదజల్లే వెన్నెలే శివ దీపారాధన వెలుతురు. ఆకాశంలో ప్రకాశించే తారలే శివపూజకు తెచ్చిన పూలు. ఈ విధంగా సర్వాంగ సహితంగా శివుడు కొలువైనాడు. తమస్సును దూరం చేసే చంద్రునికీ, తమోగుణాన్ని నిర్మూలించే చంద్ర చూడునికీ అభేదాన్ని భావించాడు కవి.
ఒక పోలిక చెప్పగానే దానికి సంబంధించిన ఇతర పోలికలను లాక్కొచ్చి, ఉపమానోపమేయాభివృద్ధిలో ఒక దృశ్యాన్ని సంపూర్ణం గావించడం, ప్రధానమైన పోలికను సమర్ధించే ఇతర పోలికలను రచించడం ఏ కవికైనా సాధారణమే. చంద్రబింబం ఎప్పుడైతే శివలింగంగా పోల్చబడ్డదో, వెంటనే పానవట్టమూ, అభిషేక జలమూ, ధూపమూ, పూలూ, దీప ప్రకాశమూ – వీటికి తగిన వస్తువులూ దొరికాయి కవికి. ఈ విధమైన పోలికలు మామూలే. ఉదాహరణకు, నరకునితో యుద్ధం చేసే సత్యభామ వర్షాకాలాన్ని సృష్టించింది అంటాడు పోతన. వర్షాకాలం అనగానే మేఘమూ, వానజల్లూ, శంపాలతా కావాలి. నీలమేఘశ్యాముడైన కృష్ణుడు మేఘం గానూ, సత్యభామ మెరుపుతీగ లాగానూ, ఆమె గుప్పించే శరపరంపరలు చినుకుల జల్లు గానూ అమరిపోయాయి కాబట్టీ ఆ పోలికలో ప్రత్యేకత ఉన్నది. అలానే ఈ పద్యంలో గొప్పతనం ఇతరపోలికలు అమర్చుకోవడంలో కాదు. అసలు ఆ రాత్రి ఉదయించిన చంద్రబింబం శివలింగంగా తోచడమే అక్కడి అందం. ధూర్జటి శివభక్తి ఎంత గొప్పదంటే ఆయనకు సర్వమూ శివమయంగానే కనిపించిందన్నమాట.
అంతే కాక, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూన్న ఆ ఏనుగు – “ప్రాణలింగ పూజనా విఘ్నమున యందు బుట్టినట్టి చింత” తో, “తనలోన తలపోతతో బ్రుంగు”తూ, ఆ నాటి సూర్యాస్తమయం ఇంకా కాక ముందే “ఎపుడు పడమటి కొండపై కెక్కు భానుడు? ఎప్పుడుదయించు, నేఁ బోదునెప్పుడు?”- అని మరుసటి రోజు కోసం తహతహ పడి శివపూజనే భావించే నేపథ్యంలో, తనకి కూడా జగమంతా శివమయమై పోయిన ఆ ఏనుగు మనస్థితిని చక్కగా పట్టుకున్నాడు ధూర్జటి. ఆయన పద్యాల్లో తరచుగా ఉటంకించబడే ఈ పద్యం, చాలామందికి నచ్చినట్లే, నాకూ నచ్చిన పద్యం.
జీవితమంతా రాజసేవ చేసి, సుకుమార వారవనితల మధురాధరోదిత సుధారసధారలు గ్రోలి, చిట్టచివరికి తన కోర్కెలు ఏదో రాజు తీర్చలేదని “రాజుల్ మత్తులు, వారి సేవ నరక ప్రాయంబు” అని రాజులందర్నీ చెడ తిట్టి ముసలితనంలో ఆక్రోశించే ధూర్జటిని తలచుకుంటే గొప్ప గౌరవమేమీ కలక్క పోగా “వృద్ధనారీ…” అనే సామెత గుర్తొస్తుంది. ఐతే, రసప్రోతంగా, భక్తి బంధురంగా, శిల్ప రమ్యంగా తీర్చిదిద్దబడ్డ శ్రీకాళహస్తి మాహాత్మ్యమూ, కాళహస్తీశ్వర శతకాల లోని దొడ్డ కవిత్వాన్ని ఆస్వాదించి తలవూపే సౌహార్దానికి ఆ చులకన భావం అడ్డం కాగూడదని నా నమ్మిక.

Saturday, April 21, 2018

గురునానక్


గురునానక్




సాహితీమిత్రులారా!

గురునానక్ సిక్కులకు మొదటి గురువు. ఈయన పంజాబ్ లోని తల్వండీ 
అనే గ్రామంలో కార్తీక పౌర్ణమినాడు జన్మించారు.
తండ్రి పేరు కాలూరామ్ వేదీ. చిన్నతనంలో పండిత్ బ్రజనాథ్,
మౌలానా కుతుబుద్దీల నుండి విద్యను అభ్యసించారు. 18 ఏళ్ళ 
వయసులో సులక్షణాదేవితో వివాహం అయింది. వీరికి  శ్రీచంద్, 
లక్ష్మీచంద్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు. నానక్ బాల్యం 
నుండి సాధు స్వభావం,వైరాగ్య ప్రవృత్తి కలవారు. ఈయన దేశ విదేశాల్లో 
5 సార్లు యాత్రలు చేసి ఎందరో జైన సాధువుల్ని, ముసల్మాను ఫకీర్లను, 
యోగులను కలుసుకున్నాడు. పంజాబీ, హిందీ, ఫారసీ, సంస్కృతాల్లో 
మంచి పాండిత్యం కలవారు. అయితే ఇవేవీ ఈయన కూర్చొని 
అభ్యసించినవికావు. కేవలం అనుభవం మీద, నలుగురితో పరిచయాలవల్ల 
సమకూరినవి. ఈయన నిర్గుణ బ్రహ్మోపాసకుడు. అవతారాలు, విగ్రహారాధన, 
కులగోత్రాలు, పేదగొప్ప తారతమ్యాలు ఇలాంటి విషయాల నెన్నిటినో వ్యతిరేకించారు.
హిందూ ముస్లిమ్ల ఐక్యతకోసం పాటుపడిన వ్యక్తి. రెండు మతాల్లోని చెడునూ విప్పి చెప్పినప్పటికి ఈయన సూక్తులు అన్నీ సులభంగా జనసామాన్యానికి అర్థమయేటట్లు ఉంటాయి.  మిగిలిన నిర్గుణోపాసకులలాగ స్త్రీలను నానక్ నిందించలేదు. గురునానక్ రచనలు జపుజీ, సిద్ధగోష్ఠి, రాగ్ అసావేరి, శబ్ద్, అష్టపదియా, శ్లోక్ వంటివి పదిహేనున్నాయి. తన రచనల్లో నానక్ నామాన్ని జపించటంలోని మాహాత్మ్యం, స్వార్జితంలోని మాధుర్యంతోపాటు
తనకున్నది పదిమందికి పంచిపెట్టి తినటంలోని గొప్పదనం వంటి
విషయాల్ని ప్రతిపాదించాడు. వేదాల, షట్ - శాస్త్రాల, ఉపనిషత్తుల,
పురాణాల జ్ఙానంతో, సారంతో ఈయన రచనలు నిండి ఉన్నాయి.
ఓం - కారానికి అత్యద్భుతమైన వ్యాఖ్య చేసిన మహానుభావుడు. ఈయన
కావ్యభాష ప్రధానంగా వ్రజభాష, సంస్కృతం, అరబీ, ఫారసీ, పంజాబీ, 
ఖడీబోలీ, సింధీ, ముల్తానీ భాషా శబ్దాలు ఎక్కువ సంఖ్యలో ఉపయోగించారు. 
ఎక్కువ సంఖ్యలో ఉపమాన, రూపకాలంకారాలను
అక్కడక్కడా అన్యోక్తి ప్రయోగించాడు. ఈయన పదాలన్నీ గౌడి, గూర్జరి,
ధనశ్రీ, తిలంగ, బలావల్, రామ్ కవీ, వసంత, సారంగ, మల్హర్ మొదలైన రాగాల్లో రచించబడ్డాయి. నానక్ వాణిలో భక్తి, జ్ఙాన, వైరాగ్యాలతో బాటు ఆనాటి, రాజకీయ, సామాజిక, ధార్మిక, పరిస్థితులను తెలుసుకోడానికి ఉపయోగపడే చక్కటి వర్ణనలూ ఉన్నాయి. ఋతువర్ణన హృదయంగమం. సిక్కుమత స్థాపకుడే కాక ఆనాటి సాంఘిక దురాచారాలను ఖండించి, దేశ సమైక్యతకోసం పాటుపడిన ధన్యజీవి నానక్. ఈయన కర్తార్ పూర్ లో తనువు
చాలించారు.

Friday, April 20, 2018

పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి?


పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి?



సాహితీమిత్రులారా!





ప్రాచీన సాహిత్యం అంటే ఏవగింపుగా తయారవుతున్న కాలమిది
మొన్నొక కవి శతకం వ్రాసి తోటి కవి, పండిత మిత్రునికివ్వగా
ఎందుకయ్యా ఇంత శ్రమపడ్డావు నువ్వు చెప్పదలచుకొన్న విషయం
మామూలు మాటల్లో వచనంలో చెబితే ఎంత బాగుణ్ణు 
ఇంత అవసరమా అని ఒక వెటకారపు చూపుతో చెప్పగా 
పాపం ఆకవి చిన్నబుచ్చు కొని
తనుచేసిన తప్పేమిటో తెలుసుకొనే ప్రయత్నంలో పడ్డాడు కాని
ఆ కవి ఇంతవరకు అదేమిటో అర్థంకాలేదు.
ఈ వ్యాసం చదవండి పరుచూరి శ్రీనివాస్ గారి వ్యాసం,
అంతర్జాల మాసపత్రిక ఈమాట సెప్టెంబర్ 2004లో ప్రచురించినది
మనకు పనికొస్తుందేమో అని ఆశతో ఇక్కడ.........

మూడు సంవత్సరాల క్రితం ఇండియా వెళ్తుంటే స్నేహితులొకరు “ఆముక్తమాల్యద” టీకాతాత్పర్య సహితంగా దొరికితే కొనిపెట్టమన్నారు. ఏ పుస్తకాల కొట్లో అడిగినా దొరకలేదు. ఈ మధ్యమరొకరు ఇరవయ్యో శతాబ్దపు ముందు నాటి సాహిత్యం ఏది దొరికినా తీసుకోమన్నారు. చెప్తేనమ్మరు కాని, గుంటూరు లాంటి పెద్ద పట్టణంలో కూడా, ఒక్క కావ్యమంటే ఒక్కటి కూడా దొరకలేదు. ఒక ప్రముఖ ప్రచురణకర్తతో అదే మాటంటే “అడిగేవారూ లేరు, చదివే వారూ లేరూ”అన్నారు. పాత సాహిత్యం అంటే ఆసక్తి ఎందుకు తగ్గిపోతుంది, దాన్ని మళ్ళీ పెంచడానికి మనం ఏం చేయాలి, పెద్దనని, శ్రీనాథుణ్ణి పక్కన పెట్టి షేక్స్పియర్‌ని, మిల్టన్‌ని ఎందుకు చదువుతాం, మొదలైన ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు లేవు కాని, నేనెందుకు చదువుతానో మాత్రం చెప్పదలచుకున్నాను.

నాకు చరిత్రంటే ఆసక్తి. తెలుగు సమాజపు సాంఘిక స్థితిగతులు గడచిన వేయి సంవత్సరాలలో ఏవిధంగా మారుతూ వచ్చాయో అర్థం చేసుకోవాలన్నది నా ప్రయత్నం. (అంతో ఇంతో తెలుగుసాహిత్యం అంటే అభిమానం ఉందనుకోండి.) ” ఆముక్త మాల్యద” పేరెత్తాను కాబట్టి ఆ పుస్తకం గురించి ముందుగా మాట్లాడుకుందాం. దాన్ని ప్రబంధయుగంలో కృష్ణదేవరాయలు రాశాడని మనందరికీ తెలుసు. అది వైష్ణవ సాంప్రదాయం నుండి మనకు పరిచితమైన “గోదాదేవి కథ” అని అందరం అనుకుంటాం. (అవునో కాదో తెలుసుకోవాలంటే ఆ పుస్తకం చదవండి మరి) అందులో గోదాదేవి కథ కంటే రాజనీతి పాఠాలు ఎక్కువని కొందరు అభిప్రాయపడ్డారు. ఇలా భక్తి కావ్యమనో, లేకుంటే రాజనీతి పాఠాలు చెప్పే పుస్తకమనో దాన్ని పట్టించుకోని వాళ్ళే ఎక్కువ. దానిలోని కవితా విలువల్ని పట్టించుకున్న వాళ్ళు కూడా చారిత్రక విలువల్ని గుర్తించలేకపోయారు. పోతే, ఆ పుస్తకం “పూర్తిగా” చదివి వుంటేనో, లేకుంటే చదివిన మనవాళ్ళు ఆంగ్లంలోకి అనువదించి పెడితేనో విజయనగర చరిత్ర కొంతైనా వేరుగా రాయబడి వుండేదని నా నమ్మకం.

కవితా పరంగా దానిలోని ఋతువర్ణనలూ, దైనందిన జీవితంలోని సంఘటనల వర్ణనలూ చూడండి. అసలు ఆయన వాడిన భాష అంతకు ముందు ఎవ్వరూ వాడలేదు. భాషకీ, సాహిత్యానికీ, సంస్కృతికీ విడదీయరాని సంబంధం వుంటుందని మనకందరికీ తెలిసిన విషయమే. “ఆముక్తమాల్యద”లో కూడా ఈ సంబంధాన్ని చక్కగా చూడవచ్చు. రాజు మారుతున్నాడు, ఒక కొత్త రాజ్యం నిర్మించబడుతుంది అక్కడ. అలాగే రాజ్యసిద్ధాంతం కూడా మారుతుంది. ఒక కొత్త రాచరికపు వ్యవస్థని రాయలు అక్కడ ప్రతిపాదిస్తున్నాడు.

“ఆముక్త మాల్యద” విషయం అలా వుంటే, మరో ప్రక్క “క్రీడాభిరామం”, “హంసవింశతి”, “శుకసప్తతి” లాంటి కావ్యాల్లో నాటి సాంఘిక చరిత్రకు సంబంధించిన ఎన్నో విలువైన విషయాలున్నాయని గుర్తించినవారు కూడా వాటిలోని కవితా విలువల్ని పట్టించుకోలేదు. (మొదటి రెండు పుస్తకాలు ఇరవయ్యో శతాబ్దపు మొదటి భాగంలో అశ్లీల సాహిత్యంగా పరిగణింపబడి బహిష్కరింపబడ్డాయన్న విషయం గుర్తించ తగ్గది)

“ఈ కాలంలో టీకా, టిప్పణీలు లేకుండా పద్య కావ్యాలను చదవడం కష్టం. అసలు మొన్నటిదాకా తెలుగులో వచనం లేదుగా” అనే చాలామందిని నేనెరుగుదును. (వీళ్ళు పల్లెటూళ్ళలో కరణాలు వందలేళ్ళుగా తమ రికార్డులు ఎలా రాశారని ఔకుంటారో మరి!) పదహారో శతాబ్దపు చివరి భాగం నుండే తెలుగులో వచనం రాయబడేదనీ (చూ : “ప్రతాపరుద్ర చరిత్రము”ఏకామ్రనాథుడు) పదిహేడో శతాబ్ది నుంచి అది విస్తృతంగానే వాడబడిందని ఎందరు గమనించారు! తెలుగుకి అంతో ఇంతో సేవ చేసిన సి. పి. బ్రౌన్‌, ఈ దేశం విడిచే ముందు కొన్ని వేల తాళపత్ర గ్రంథాల్ని, రాతప్రతుల్ని ఈరోజు Tamilnadu Archives లేక GOML (Govt. Oriental Manuscripts Library , చెన్నై) అని పిలువబడుతున్న చోట భద్రపరచి వెళ్ళాడని, ఆ సేకరణలో చరిత్రనుండి (ఉదా: హైదరు చరిత్ర) వేదాంతం (ఉదా : తారక బ్రహ్మరాజీయము) వరకు అనేక అంశాలపై గద్యరచనలే ఉన్నాయని మనవాళ్ళు గమనించలేదంటే నమ్మశక్యంగా లేదు. అలాగే మెకన్జీ సేకరించిన కైఫీయత్తులనూ, బంగోరె ఎంతో కష్టనష్టాలకోర్చి లండన్‌నుండి తిరుపతికి చేర్చిన బ్రౌన్‌ రాతప్రతుల్ని కూడా! వీటి వివరాలన్నీ చాలా యేళ్ళుగా కేటలాగుల రూపంలో అందుబాటులో ఉన్నాయన్నది ఇక్కడ గమనార్హం.

“దక్కను చరిత్ర”, “దక్షిణ భారత చరిత్ర” అన్న టైటిల్స్‌ పెట్టుకుని మహారాష్ట్ర, తమిళనాడుల చరిత్రలకే పరిమితమై పోతారని గోలపెట్టే తెలుగువాళ్ళని చూశాను. ఆ చరిత్రకారులకి తెలుగు రాకపోవడమే మన పాపం.మరి మనం అనువాదాలు అందించ వచ్చు గదా అన్న ఆలోచన మన వాళ్ళకెవరికీ వచ్చినట్లు లేదు. వాళ్ళను వదిలేద్దాం. మరి తెలుగు వచ్చినవారు కూడా అరబ్‌, ఫ్రెంచ్‌, పోర్చుగీసు, ఇంగ్లీషు పర్యాటకులు : Barbosa, Al Biruni, Bussy, Tavernier, Thevenot, S. Master , రాసిన రాతల మీదే ఎందుకు ఎక్కువగా ఆధారపడతారో కూడా నాకు బోధపడని విషయం.

పదేళ్ళక్రితం ఒక అమెరికన్‌ ప్రొఫెసరు గారు “రాయవాచకాన్ని” ఆంగ్లంలోకి అనువదించారు. విజయనగర చరిత్రపై పనిచేసే చరిత్రకారులందరూ “ఇంత విలువైన పుస్తకం తెలుగులో ఉందన్న సంగతి మాకు తెలియదే” అని విస్తుపోయారు. ఆయనే క్రొత్తగా “నౌకా వాణిజ్యం” పై రాస్తూ, శ్రీనాథుడు తన “హర విలాసం” కృతిభర్త అయిన త్రిపురాంతకసెట్టిని స్తుతించే పద్యాల్లో నుంచి ఆనాటి వాణిజ్యానికి సంబంధించిన కొంత విషయ సంగ్రహణ చేశారు. మరో అమెరికన్‌ ప్రొఫెసరుగారు”ప్రతాపరుద్ర చరిత్రా”న్ని తమ కాకతీయ చరిత్ర పుస్తక రచనలో ఎంతో సమర్ధవంతంగా వాడుకొన్నారు. వెల్చేరు నారాయణరావు, సంజయ్‌ సుబ్రహ్మణ్యం, డేవిడ్‌ షూల్మాన్‌ గార్లు తంజావూరు, మదురై సంస్థానాలలో వెలువడిన సాహిత్యాన్ని (అహల్యా సంక్రందనము, విజయ విలాసము, రాధికా సాంత్వనము, సారంగధర చరిత్ర మొ.) విశ్లేషిస్తూ 16, 17 శతాబ్దాల నాయక రాజుల చరిత్రను అత్యద్భుతంగా పునర్నిర్మించిన పద్ధతి మనందరికీ తెలుసు. ( Symbols of Substance – Court and State in Nayaka Period Tamilnadu, Oxford University Press, 1992, 1999 ) మరి తెలుగుదేశంలో వుంటున్న వాళ్ళెవ్వరూ ఇలాంటి తరహాలో పరిశోధనలు చేస్తున్నట్లుగా నాకు కనబడడం లేదు.

ఇప్పటికీ చాలామందికి “చరిత్ర” రచనంటే శిలా శాసనాలనూ, రాగి రేకులనూ, నాణాలనూ, విదేశీ పర్యాటకుల వర్ణనలనూ శోధించడం అనే అభిప్రాయం వుంది. ఆ శాసనాలలో ముఖ్యమైనవి చాలావరకు సాహిత్య రచనల లాగే చేయబడ్డాయన్న విషయాన్ని మన వాళ్ళు విస్మరించడం గమనించండి.ఇంక మనకున్న పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాలు అద్భుత వర్ణనలుగానూ, అభూత కల్పనలుగానూ అధికుల చేత కొట్టి వేయబడ్డాయి. లేదా దైవీకరించబడి అన్ని రకాలైన పరిశోధనలకూ దూరం చేయబడ్డాయి. అలా వాటిని తోసి పుచ్చకుండానో, మౌఢ్యపు నమ్మకాల్లో పూడ్చివేయకుండానో శ్రద్ధగా పట్టించుకుంటున్న వారి సంఖ్య ఇంకా తక్కువే.

“ప్రతాపరుద్ర చరిత్రం”, “రాయ వాచకం” లాంటి పుస్తకాలు రాజకీయ చరిత్రతో పాటు సాంఘిక చరిత్ర కూడా తెలుసుకోవడానికి ఉపయోగ పడతాయి. మతాలు, మతావేశాలు, వైషమ్యాలు, సాంఘిక మర్యాదలు, సంప్రదాయాలు, నగర వృత్తులు, పంటలు, ఇలా ఎన్నో విషయాలపై విలువైన సమాచారం మనకు “సాహిత్యం” నుంచి కూడా లభిస్తుంది. సమన్వయ దృష్టి, సమీకరణ సామర్య్ధాలతో లోతుకు పోయి పరిశీలిస్తే ఒక మంచి సాహిత్యం చదివామన్న అనుభూతితో పాటుగా చరిత్రకారుడికి ప్రయోజనమైన అనేక అంశాలను కూడా అందుకోగలం.

ఇంత మంచి సాహిత్యాన్ని, దానిలోనే పాక్షికంగా చరిత్రను కూడా కూర్చుకున్న మనం ఈనాడు దాన్ని ఎందుకు విస్మరించాం అన్నది క్షుణ్ణంగా పరిశీలించవలసిన విషయం. ప్రస్తుతానికి మరీ లోతుకు పోకుండా కొన్ని ముఖ్య కారణాలను మాత్రం ప్రస్తావించి వదిలేస్తాను. ఇరవయ్యో శతాబ్దానికి ముందున్నది క్షీణ యుగమని, ప్రబంధ యుగంలోనూ, దానిని మించి నాయక రాజుల యుగంలోనూ సాహిత్యం అన్న పేరుతో తయారయింది పచ్చి శృంగారమని, అశ్లీల సాహిత్యమని, ఆ కాలపు రచనలు కేవలం అనువాదాలూ, అనుకరణలే అని నమ్మకాల్ని పెంచుకుని మనకు మనం చాలా నష్టం కలగ చేసుకున్నాం. ఈ అభిప్రాయాలు బలంగా పాతుకు పోవడంలో ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు కీలకమైన పాత్ర వహించారు. ఒకరు కందుకూరి వీరేశలింగం, మరొకరు సి. ఆర్‌. రెడ్డి.(ఇది వాళ్ళని కించపరిచే ఉద్దేశ్యంతో అంటున్నది కాదు.) ఇద్దరూ అపరిమితంగా ఆంగ్లేయుల ప్రభావానికి
గురయి Victorian morals తో వ్యవహరించిన వారే. నిజానికి వీరేశలింగానికి ముందు మనది మలినమైన సాహిత్యమని అన్నవారెవ్వరూ కనపడడంలేదు. కట్టమంచిగారు విదేశాలలో చదువుకొన్న కారణంగానో, మరి ఆయన చేపట్టిన ఉన్నత పదవుల వల్లనో, లేక ఆయనకున్న రాజకీయపలుకుబడి కారణంగానో, ఆయన రాసిన “కవిత్వ తత్వ విచారం” అన్న వ్యాసం అందరికీ పాఠ్యనీయాంశమయింది. ఇంతా చూస్తే, తొమ్మిది వందలేళ్ళ తెలుగు సాహిత్యంలో ఆయనకు తిక్కన అంటే కొంచం గౌరవం. సూరన “కళాపూర్ణోదయం” కాసింత నచ్చింది. అంతే! చివరకు వీరి వాదనలవల్ల అసలు మనం ఆ కాలపు సాహిత్యాన్ని చదవనక్కరలేదు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. వీరిద్దరూ ఇలా కొట్టి పారేసుండక పోతే మనం వాటిని ఇంకా చదువుతుండేవాళ్ళమనే నేననుకుంటున్నాను. దానికి తోడు గత శతాబ్దం అధిక భాగంలో “ప్రగతిస్వామ్య వాదులమని”చెప్పుకుంటూ వచ్చిన కొందరు కవులు, కవితా విమర్శకులు వాళ్ళకున్న కారణాల వల్ల కట్టమంచిని, కందుకూరిని పొగడ్తలతో ముంచెత్తారు. వీళ్ళ హోరులో ఏమయినా అసమ్మతి ప్రకటింపబడినా అది ఎవరికీ సరిగా వినిపించకుండా కొట్టుకుపోయింది. (ఒక్క విశ్వనాథ సత్యనారాయణ కంఠాన్నిమినహాయిస్తే!) క్రమక్రమంగా అంతకు ముందు చదవదగ్గది మన సాహిత్యంలో ఏమీ లేదు అనే భ్రమలో పడి పోయాం.

నిజానికి 50-60 ఏళ్ళ క్రితం వరకు కూడా వేదం, వెంపరాల, తేవపెరుమాళ్ళయ్య, మానవల్లి లాంటి వారు “ఆముక్తమాల్యద”, “మనుచరిత్ర”, “వసుచరిత్ర” లాంటి కావ్యాలను సంశోధించి టీకాతాత్పర్య సహితంగా ప్రచురిస్తే, సంస్కృత కావ్య సంశోధకులకీ, జర్మన్‌ ఫిలాలజిస్టులకీ మనం ఏమాత్రమూ తీసిపోమని గర్వించాం కూడా. మరీనాడు అలాంటి సంశోధనలు వెలువరించగలవారున్నారా అని నాకు సందేహం. ఇది పాతని పొగడటమూ, కొత్తని తెగడటమూ కాదు. “మంచి”, “చెడ్డ” అన్న విభజనలతో మనని మనమే చాల నష్ట పరుచుకున్నట్లున్నాం. “Classics”, “modern” అనే భేదంతో కాకుండా రెండింటినీ ఆధునిక దృక్పథంతో చదవాలన్నదే నేను కోరేది.

చివరిగా వెల్చేరు నారాయణరావుగారు (పాదసూచిక చూడండి) చెప్పినట్లు “మనందరం పాశ్చాత్య ఆధునికతా ప్రభావితులమే. ఆధునికత ఒకవైపు (భావి జీవనానికి అవసరమైన) చైతన్యాన్ని అందిస్తూనే, మరోవైపు పాలితులుగా మనల్ని భావదాస్య దౌర్బల్యానికి గురిచేయడం ద్వారా రెండు విభిన్నమైన ప్రభావాలని మనపై చూపింది. ఆధునిక భావాలని వద్దనుకోవడమూ, లేదా మన చరిత్రను కాదనుకోవడమూ, ఈ రెండూ కూడా సామాజిక ప్రగతిని నిరోధించేవే. ఈ రెండింటినీ కలుపుకునే మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగాలి.” కాదంటారా?

All of us in the present century are products of a colonial modernity, which is a complex combination that gives us the energy of being modern as well as the debility of having been colonized. The debility blocks our understanding of the past. We cannot give up being modern, which would undermine the future, but losing the past will equally undermine the future. Our problem is to find ways to reconstruct with the rich modes of understanding history that were once available to us.

— Velcheru Narayana Rao, Presidential Address, A.P. History Congress, Hyderabad, 1998.

కొసమెరుపు: V. Narayana Rao, S. Subrahmanyam, D. Shulman రాసిన “Textures of Time – writing history in South India, 1600-1800” (Permanent Black, 2001) అన్న పుస్తకం ఈ వ్యాసరచనకు స్ఫూర్తి, ప్రేరణ, మూలం.

Thursday, April 19, 2018

పోతన పద్యాన్ని అనుకరించిన రాయలు


పోతన పద్యాన్ని అనుకరించిన రాయలు





సాహితీమిత్రులారా!


పోతన కూర్చిన గజేంద్రమోక్షంలోని పద్యం
కృష్ణదేవరాయలను ఎంతగా అకర్షించిందో
దాన్ని తన ఆముక్తమాల్యదలో అనుకరించారు
చూడండి-
మొదట పోతన గజేంద్రమోక్షంలోని పద్యం-

ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మై
యెవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకార ణం
బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము దాన యైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్‌

నాకు వేరు దిక్కులేదని ఆ సర్వేశ్వరుని గజేంద్రుడు శరణువేడే
సందర్భంలో ఈ పద్యం పోతన కూర్చారు.
ఇది చాలకాలం వరకు ప్రార్థనగా కూడ మన తెలుగువారు
వాడుకున్నారు వాడుతున్నారు. ఇలాంటిది అనకరించడంలో
పెద్దవింతేమీ లేదని పెద్దలు అనవచ్చు అనకపోవచ్చు
కాని నావంటి సామాన్యునికి వింతని అనిపించింది
అందుకే మీముందుంచాను.
చూడండి ఆముక్తమాల్యదలోని పద్యం-

ఎవ్వని చూడ్కి చేసి జనియించు జగంబు, వసించు నిజ్జగం
బెవ్వని యందు, డిందు మరి యెవ్వనియం దిది, యట్టి విష్ణుతో
నివ్వల నొక్క వేల్పు గణియించిన పాతకి నౌదు నేడనే
నెవ్విధినైన నిన్గదియనేని, యనన్విని బంధ మూడ్చినన్‌
                                                                                         (ఆముక్తమాల్యద - 6- 43)
ఇక్కడ మాలదాసరి కథలో మాలదాసరి బ్రహ్మరాక్షసునికి
తాను తిరిగిరాక పోయిన అని శపథం చేసే సందర్భంలో
కృష్ణదేవరాయలు వాడాడు ఈ పద్యాన్ని.

Wednesday, April 18, 2018

విష్ణుపురాణం


విష్ణుపురాణం



సాహితీమిత్రులారా!



విష్ణుపురాణం అష్టాదశ పురాణాలలో మూడవది.
మైత్రేయుని అభ్యర్థనపై పరాశరుడు చెబుతున్నట్లుంది.
విష్ణుపారమ్యాన్ని ప్రతిపాదించే పురాణమని పేరే చెబుతున్నది.
ధ్రువుడు, వేనుడు, పృథుమహారాజు, యవనాశ్వుడు, మాంధాత 
మొదలైన వారి చరిత్రలు, శంబరాసుర వృత్తాంతము, నరకుని 
వృత్తాంతము మొదలైనవి దీనిలో వర్ణించబడినాయి. కృతయుగం 
మొదలు కలియుగం వరకు మానవుల ప్రవృత్తులు, జీవన విధానాలలో 
కలిగే మార్పులను యుగధర్మాలనే పేరుతో ఈ పురాణం సూచించింది. 
ప్రాసంగికంగా వచ్చిన వృత్తాంతాలలో క్షీరసాగర మథనం, ప్రహ్లాద చరిత్ర, 
వ్యాసుడు వేదవిభాగాలను చేయడం, అష్టాదశ పురాణాల అనుక్రమణిక, 
చతుర్దశ విద్యల విభజన, వైష్ణవ లక్షణాలు, వర్ణాశ్రమ ధర్మాలు, సగర,
శ్రీరామాది సూర్య వంశ రాజుల కథలు, తారాశశాంక పురూరవవాది 
చంద్రవంశ రాజుల కథలు, శ్యమంతకోపాఖ్యానం, శ్రీకృష్ణావతార కథ, 
ఖాండిక్య కేశిధ్వజ జనకసంవాదం మొదలైనవి చెప్పబడ్డాయి. 

విష్ణుపురాణానికి మొదటి తెలుగు అనువాదం 
పశుపతి నాగనాథునిది (14వ.శ.) ఇది అలభ్యం. 
తరువాత వెన్నె కంటి సూరన(16వ.శ.), కలిదిండి 
భావనారాయణ(16వ శ.), కళ్లేపల్లి నరసింహమూర్తి, 
తాడేపల్లి సీతారామస్వామి(19వ శ.) పద్యానువాదాలు చేశారు. 
తుపాకుల అనంతభూపాలుడు(18వ శ.), నోరి గురులింగశాస్త్రి(19వ శ.) 
వచన రచనానువాదం చేశారు.

Tuesday, April 17, 2018

వేణుగోపాల శతకము - 1


వేణుగోపాల శతకము - 1

               

సాహితీమిత్రులారా!



శతకాలలో అధిక్షేప శతకాలు
పూర్వం చాల ప్రసిద్ధి చెందినవి
వాటిలో పోలిపెద్ది వేంకటరాయకవి
కృత వేణుగోపాల శతకము చాల 
పేరున్న శతకం దానిలోని కొన్ని 
పద్యాలు మీకందిస్తున్నాను
చవిచూడగలరు-

1. కౌస్తుభవక్ష శ్రీకరపాద రాజీవ, దీనశరణ్య మహానుభావ
కరిరాజవరద భాస్కరకోటి సంకాశ, పవనభు గ్వరశాయి పరమపురుష
వేదవేద్యానంతవిభవ చతుర్ధశ, భువనశోభనకీర్తి పుణ్యమూర్తి
వైకుంఠపట్టణవాస యోగానంద, విహగరాడ్వాహన విశ్వరూప

నీలనిభగాత్ర శ్రీరమణీకళత్ర
సద్గుణస్తోమ యదుకుల సార్వభౌమ
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

2. నినుసదా హృత్కంజమునఁ బాయకుండ నా, ప్రహ్లాదువలెను నేర్పరినిగాను
ఏవేళ నిను భజియించుచుండుటకు నా, ధ్రువచిత్తుఁ డైనట్టి ధ్రువుడ గాను
సతతంబ నిన్ను సంస్తుతి చేయుచుండ నా, వే శిరంబుల సర్పవిభుఁడగాను
నీవిశ్వరూపంబు సేవించుటకు వేయి, చక్షువుల్ గల్గు వాసపుఁడఁగాను

ఇట్టివారలఁ గృపజూచు టెచ్చుగాదు
దేవ నా వంటి దీనుని బ్రోవవలయు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

3. శ్రీ రుక్మిణీ ముఖసారస మార్తాండ, సత్యభామా మనశ్శశి చకోర
జాంబవతీ కుచశైల కంధర మిత్ర, విందాను సుధాధరబింబకీర
భద్రావయోవన భద్రేభరాజ క, శిందాత్మజా చిదానందనిలయ
లక్షణాశృంగార వీక్షణకాసార, హంస సుదంతా గుణాపహార

సుందర కపోలవిబుధ సంస్తుత కృపాల
వాల ధృతశైల కాంచనవర్ణ చేల
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

4. భనుకోటి ప్రభా భాసురంబగు వెల్గు, పరులు చూచినఁ గానఁబడని వెల్గు
గురు కృపచేఁ గాకగుఱ్తెఱుంగని వెల్గు, నమృతంపు వృష్టిచే నమరు వెల్గు
విద్యుల్లతాది పరివేష్టితంబగు వెల్గు, ఘననీల కాంతులఁగ్రక్కు వెల్గు
దశవిధ ప్రణవనాదములు గల్గిన వెల్గు, మౌనులెన్నఁగ రమ్యమైన వెల్గు

ఆది మధ్యాంతరరహిత మైనట్టి వెల్గు
ఇట్టి వెల్గును సేవింపనట్టి చెట్ట
వారికే లభించు కైవల్యపదము
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

5. వేదంబులును నీవె వేదాంగములు నీవె, జలధులు నీవె భూజములు నీవె
క్రతువులు నీవె సద్ర్వతములు నీవె కో, విదుఁ డటంచన నీవె నదులు నీవె
కనకాద్రి నీవె యాకాశంబు నీవె ప, ద్మాప్త సోములు నీవె యగ్ని నీవె
అణురూపములు నీవె యవనీతలము నీవె, బ్రహ్మము నీవె గోపతియు నీవె

ఇట్టి నిన్ను సన్నుతింప నేనెంతవాఁడ
గింకరుని జేసి ప్రోవు మంకించనుండ
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

6. వేదాంత మనుచు బ్రహ్మాదు లెంచిన వెల్గు, నాదాంత సీమల నడరు వెల్గు
సాధుజనానంద పరిపూర్ణమౌ వెల్గు, బోధకు నిలయమై పొసగు వెల్గు
ద్విదళాబ్జ మధ్యమం దుదయమౌ వెల్గు, సుషమ్న నాళంబునఁజొచ్చు వెల్గు
చూడఁజూడఁగ మహాశోభితంబగు వెల్గు, నిఖిల జగంబుల నిండు వెల్గు

శతకోటి సారస హితుల మించిన వెల్గు
మేరువు శిఖరంబుమీఁది వెల్గు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

7. వేదాంత యుక్తులు విని రెండు నేర్చుక, వాఁగి నాతఁడు రాజయోగి గాఁడు
కల్లు లొట్టెడు త్రాగి కైపెక్కి తెలియక, ప్రేలినంతనె శాస్త్రవేత్త గాఁడు
పట్టపురాజు చేపట్టి యుంచంగానె, గుడిసె వేటుకు బారి గుణము రాదు
ముండపై వలపున రెండెఱుంగక మోవి, యానఁగానె జొల్లు తేనెగాదు

కోఁతిపై నున్న సింగపుఁగొదమ కాదు
ఎంతచదివిన గులహీనుఁ డెచ్చుగాఁడు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

8. దండకమండలుధారులై కాషాయ, ములు ధరించిన దాన ముక్తిలేదు
భూతి గంపెడు పూసి పులిచర్మమును బూని, ముక్కుమూసిన దాన ముక్తి లేదు
తిరుమణి పట్టెఁడు తీసి పట్టెలు తీర్చి, భుజము గాల్చిన దాన ముక్తి లేదు
వాయువుల్ బంధించి ధీయుక్తి యలయఁగ, న్మూత వేసిన దాన ముక్తిలేదు

గురుపదాంబుజములు భక్తి కుదిరి తమ్ముఁ
దా యెఱుంగక ముక్తి లేదీమహి పయి
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

9. దారిద్ర్యమనెడు భూధరచయంబులు గూల్ప, హరి నీదు భక్తి వజ్రాయుధంబు
అజ్ఞానమనెడు గాఢాంధకార మణంప, నీదు సపర్య భానూదయంబు
ఘోరమౌ దుష్కృతాంభోరాశి నింకింపఁ, గా నీదు సేవ దావానలంబు
చపలం బనెడు రోగసమితిని మాన్ప న, బ్జాక్ష నీ స్మరణ దివ్యౌషధంబు

వెన్నయుండియు నేతికి వెదకి నటుల
పరులవేఁడితి నీమహత్తెఱుఁగ లేక
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

10. సూక్ష్మపానము చేసి సొక్కినవేళ సా, మిత ధారణము చేసి మెలఁగువేళ
బడలిక పైనంబు నడచివచ్చిన వేళ, సుఖమంది హాయిని సొక్కువేళ
ఒంటరిగాఁ జీఁకటింట నుండినవేళ, నలుకతోఁ బవళించు నట్టివేళ
దెఁఱుగొప్ప మనమున దిగులు చెందిన వేళ, భక్తి గన్నట్టి విరక్తివేళ

లాభ్యభావంబుఁ జూడ సలక్షణముగ
బండువెన్నెల గతిఁ గానబడును ముక్తి
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

11. అగ్రజన్మము తీరవాసమందు వాసంబును, వితరణము ననుభవించు నేర్పు
సంగీత సాహిత్య సంపన్నతయు మతి, రసికత బంధు సంరక్షణంబు
ననుకూలమైన చక్కని భార్య రాజ స, న్మానంబు ప్రఖ్యాతి మానుషంబు
సౌందర్యమతి దృఢశక్తి విలాసంబు, జ్ఞానంబు నీ పదధ్యాన నిష్ఠ

ఇన్నియును గల్గి వర్తించుచున్న నరుఁడు
భూతలస్వర్గ ముదమును బొందుచుండు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

12. అబ్బ మేలోర్వ లేనట్టివాఁడైనను, మోహంబుగల తల్లి మూఁగదైన
ఆలు రాకాసైన నల్లుఁ డనాధైనఁ, గూ్తురు పెను ఱంకుఁబోతుదైనఁ
గొడుకు తుందుడుకైనఁ గోడలు దొంగైనఁ, దనకు సాధ్యుఁడుగాని తమ్ముఁడైన
గృహకృత్యములు పొరుగిండ్ల వెంబడిఁ బోయి, చెప్పి యేడ్చెడు చెడ్డ చెల్లెలైన

నరుని ఖేదంబు వర్ణింపఁ దరము గాదు
అంతటను సన్యసించుట యైన మేలు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

13. అఱవ చెవుల కేల యరిది వజ్రపుఁ గమ్మ, లూరి తొత్తుకు విటుం డుండ నేల
గ్రుడ్డి కంటికి మంచి గొప్ప యుద్దం బేల, సరవి గుడిసెకు బల్ చాంది నేల
ఊరఁబందులకుఁ బన్నీరు గంధం బేల, బధీరున కల వీణపాట లేల
కుక్కపోతుకు జరీ కుచ్చుల జీనేల, పూఁటకూళ్ళమ్మకుఁ బుణ్యమేల

తనకు గతిలేక యొకఁ డిచ్చు తఱిని వారి
మతులు చెడిపెడి రండకుఁ గ్రతువు లేల
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

14. అలకాధిపతినేస్త మైనప్పటికిని బా, లేందు మౌళికి బిచ్చమెత్త వలసెఁ
గమలా సమున కెంత కరుణ రా నడచినఁ, గలహంసలకుఁ దూటి కాడలేదు
క్షీరాబ్ధి లంకలోఁ జేరినప్పటికైనఁ, గొంగతిండికి నత్త గుల్లలేను
పరగ సాహేబ సుబాయెల్ల నేలిన, బేగంబులకుఁ గుట్టి ప్రోగులేను

ఒకరికుండె నటంచు మేలోర్వ లేక
నేడ్వఁగ రాదు తన ప్రాప్తి నెన్న వలయు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

15. అల్పునిఁ జేర్చిన నధిక ప్రసంగియౌ, ముద్దు చేసినఁ గుక్క మూతినాకు
గోళ్ళ సాఁకినఁ బొంత కుండలో విష్ఠించుఁ, గొద్దితొత్తుల పొందు రద్ది కీడ్చు
గూబలు వ్రాలినఁ గొంప నాశముఁ జేయుఁ, జన వీయఁగ నాలు చంక కెక్కుఁ
బలువతో సరసంబు ప్రానహాని యొనర్చు, దుష్టుడు మంత్రుయై దొరను జెఱచుఁ

కనుక నీచెర్గి జాగరూకతను ప్రజలఁ
బాలనముఁ జేయు టది రాజ పద్ధతి యగు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

Monday, April 16, 2018

జాషువా పిరదౌసి


జాషువా పిరదౌసి


సాహితీమిత్రకులారా!




జాషువా కథాకావ్యాల్లో ప్రసిద్ధమైంది పిరదౌసి. అద్భుతమైన కవిత్వాన్నిరాసి అందుకు తగిన గుర్తింపునూ ప్రతిఫలాన్నీ పొందలేక పోవటం ఈ ఇద్దరు కవులవిషయంలోనూ ఉన్న సామ్యం. ఐతే జాషువా కథనంలో పిరదౌసి మరణానంతరం మాత్రమే సత్రశాల రూపంలో గుర్తింపు దొరుకుతుంది.తన పరిస్థితీ అలాటిదేనని జాషువా భావించారని నాకనిపిస్తుంది. కాని గుడ్డిలో మెల్లగా జాషువాకిచరమదశలో నైనా రసహృదయుల సన్మానాలూ స్వాగతపత్రాలూ లభించాయి.

భారతీయ సంపదల్ని పదిహేడు సార్లు దోచుకుపోయి సంతుష్టుడైన గజనీమహమ్మద్‌తన వంశీయుల చరిత్రను రాయమని పిరదౌసిని కోరి అందులో ఒక్కొక్క పద్యానికి ఒక బంగారునాణెం బహూకరిస్తానని వాగ్దానం చేస్తాడు. పిరదౌసి ముప్ఫై ఏళ్ళ పాటు శ్రమించి రాసిన అరవైవేలపద్యాల “షానామా” ని విన్న తర్వాత ఎందువల్లనో బంగారం బదులుగా వెండి నాణాలు పంపుతాడు.అందుకు పరితపించి పిరదౌసి తనని నిందిస్తే అది పరాభవంగా భావించి పిరదౌసిని చంపిరమ్మని సైన్యాన్నిపురమాయిస్తాడు.పిరదౌసి తప్పించుకుని పారసీకానికి పారిపోయి అక్కడ శేషజీవితం గడపటం,మహమ్మద్‌చివరకు పశ్చాత్తాపపడి అతనికి బంగారు నాణాలు పంపించేసరికే అతను చనిపోవటం,అతని కూతురు ఆ ధనాన్ని తిరస్కరించటంతో కథ ముగుస్తుంది.

పాత్రచిత్రణ
కథలో ముఖ్య పాత్రలు పిరదౌసి, మహమ్మద్‌లవైతే పిరదౌసి కూతురు కూడాచివరిఘట్టంలో ఒక ఉన్నత వ్యక్తిగా దర్శనమిస్తుంది. పిరదౌసిలో తనని, తనలో పిరదౌసినిచూసుకున్న జాషువా, పిరదౌసి వ్యథని, వేదనని, మానసిక స్థితిని, అద్భుతంగా కరుణరసార్ద్రంగాచిత్రించాడు. భగవంతుని మీద అతనికున్న విశ్వాసం, అత్యంత దయనీయమైన స్థితిలో కూడా ఉబికివచ్చేఊహాప్రవాహం, జాషువా హృదయస్థితికి ప్రతిబింబాలు. ఐతే నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించేది ఆయన మహమ్మద్‌ను చిత్రించిన విధానం. పిరదౌసికి మహమ్మద్‌ చేసిన దురన్యాయానికి బహుశః జాషువాకాక మరే కవైనా మహమ్మద్‌ను దుష్టుడిగా, హృదయం లేని వాడిగా చిత్రించేవాడేమో! జాషువా మహమ్మద్‌చాలాసంక్లిష్టమైన వ్యక్తి. లలితకళాపోషకుడు. దానశీలి. సాహితీలోలుడు. పిరదౌసి విషయంలో కఠినంగాప్రవర్తించినా మసీదు గోడమీద అతను రాసిన పద్యాల్ని చదివి కన్నీరు కార్చగలిగినసున్నితహృదయుడు. ఆలోచించిచూస్తే ఒకవేళ కొంతవరకు రావణాసురుడి ఛాయల్లో అతన్ని తీర్చిదిద్దాడా అనిపిస్తుంటూంది!జాషువాలోని అచంచలమైన గాంధేయ భావాలు, అహింసాప్రవృత్తి, అణగదొక్కిన వారిని కూడా ప్రేమించగలిగేదయార్ద్రత కలిసి మహమ్మద్‌ను అలా చిత్రించేట్లు చేశాయని నా విశ్వాసం.

భావనాపటిమ
జాషువా విశ్వనాథలాగా పండితుడు కాడు. దేవులపల్లి, కరుణశ్రీల లాగాపదాల్ని సానబట్టి నునుపుదేర్చి ప్రయోగించేవాడు కాడు. ఆయన పద్యాలు ఎక్కడో తప్ప కదనుతొక్కవు. ఆయన పదశిల్పం తీర్చిదిద్దినట్లు ఉండదు. ఐతే ఆయన మహోన్నత భావుకుడు. అంతరంగంలో రసగంగలు పొంగిపొరలే సహజశిల్పి. కళ్ళు మిరుమిట్లు గొలిపే భావనలు, కల్పనలు, ఊహాశక్తి ఆయన్ని ఆధునికకవులందర్లోను ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. ఒక పద్యం తీసుకుంటే దాన్లోని పదాలు,సమాసాలు, ఎత్తుగడలు, శిల్పం ఇవి కాదు మనని విస్మితుల్ని చేసేవి. ఆ పద్యం మొత్తం లోను వ్యాపించిగుప్పుమని గుబాళించే భావనాసౌందర్యం, వినూత్నమైన ఊహాశబలత, స్వచ్చంగా ప్రతిఫలించేనిజాయితీ. సుప్రసిద్ధమైన ఈ కింది పద్యాల్లో ఈ గుణాలన్నీ విస్పష్టంగా కనిపిస్తాయి. ఆస్వాదించి ఆనందించండి.

ఓ సుల్తాను మహమ్మదూ! కృతక విద్యుద్దీపముల్‌నమ్మి ఆ
శాసౌధమ్ముల కట్టికొంటి అది నిస్సారంపు టాకాశమై
నా సర్వస్వము దొంగిలించి నరకానన్‌కూల్చిపోయెన్‌వృథా
యాస ప్రాప్తిగ నిల్చినాడ నొక దుఃఖాక్రాంత లోకంబునన్‌

పూని కరాసికిన్‌మనుజ భుక్తి నొసంగెడు రాతిగుండె సు
ల్తానుల కస్మదీయ కవితాసుధ చిందిన పాతకంబు నా
పై నటనంబొనర్చినది వాస్తవ మిట్టి స్వయంకృతైక దో
షానల దగ్ధమై చనిన అర్థము నాకు లభింపబోవునే

ఇంక విషాద గీతములకే మిగిలెన్‌రసహీనమై మషీ
పంకము నా కలమ్మున; అభాగ్యుడనైతి వయఃపటుత్వమున్‌
క్రుంకె; శరీరమం దలముకొన్నది వార్థకభూత; మీ నిరా
శాంకిత బాష్పముల్‌ఫలములైనవి ముప్పది ఏండ్ల సేవకున్‌

చిరముగ బానిసేని నభిషేక మొనర్చితి మల్లెపూవు ట
త్తరు లొలికించి; మాయ జలతారున రాదు కదా పసిండి? ఓ
కరుకు తురుష్క భూపతి, అఖండ మహీవలయంబు నందు? నా
శిరమున పోసికొంటిని నశింపని దుఃఖపుటగ్నిఖండముల్‌

కృతి యొక బెబ్బులింబలె శరీర పటుత్వము నాహరింప శే
షితమగు అస్థిపంజరము జీవలవంబున ఊగులాడగా
బ్రతికియు చచ్చియున్న ముదివగ్గు మహమ్మదు గారి ఖడ్గ దే
వతకు రుచించునా? పరిభవవ్యథ ఇంతట అంతరించునా?

ప్రకృతి పదార్థజాలములపై ఉదయాస్తమయంబులందు నీ
అకలుష పాణి పద్మము రహస్యముగా లిఖియించి పోవుటొ
క్కొక సమయాన నేను కనుగొందును గాని గ్రహింపజాల నెం
దుకు సృజియించినాడవొ ననున్‌ఘనుడా అసమగ్ర బుద్ధితోన్‌

ఈ తొలికోడి కంఠమున ఏ ఇనబింబము నిద్రపోయెనో
రాతిరి; తూర్పు కొండ లభిరామము లైనవి; దీని వక్రపుం
కూతల మర్మమేమి? కనుగొమ్మని అల్లన హెచ్చరించి ప్రా
భాత సమీర పోతములు పైకొనియెన్‌తొలిసంజ కానుపుల్‌

ఏమిటి కెక్కువెట్టితివొ ఇంద్రధనుస్సును మింటిచాయ నా
సామి! పయోదమాలికల చాటున సూర్యుడు నక్కినాడు తా
నేమపచారమున్‌సలిపి ఇట్టి విపత్తును తెచ్చిపెట్టె? ఈ
భూములు నిల్చునా భువనమోహన నీవు పరాక్రమించినన్‌

“ఇది నా తండ్రిని కష్టపెట్టిన శరం; బీ స్వాపతేయంబు ము
ట్టుదునా? నా జనకుండు కంట తడి బెట్టున్‌స్వర్గమందుండి; నా
ముది తండ్రిన్‌దయతోడ ఏలిన నవాబుండైన మీ స్వామికిన్‌
పదివేలంజలు” లంచు పల్కుడని బాష్పస్విన్న దుఃఖాస్యయై

ఓయి కృతఘ్నుడా! భవమహోదధిలో నిక తేలియాడు; మా
హా! అఫఘన్‌ధరాతలము నంతయు కావ్యసుధా స్రవంతిలో
హాయిగ ఓలలార్చిన మహామహుడౌ పిరదౌసి తోడ స్వ
ర్గీయ సుఖంబు నీకు తొలగెన్‌మనుపీనుగువై చరింపుమా!



జాషువా గురించి ఆయన మాటల్లోనే

తమ్మిచూలి కేలు తమ్మిని కల నేర్పు
కవి కలంబునందు కలదు కాన
ఈశ్వరత్వ మతనికే చలామణి అయ్యె
నిక్కువముగ పూజనీయుడతడు
----------------------------------------
ఈ - మాట, (జనవరి1999) లోనిది ఈ వ్యాసం

Sunday, April 15, 2018

ఆంధ్రకవితా పితామహుడు


ఆంధ్రకవితా పితామహుడు




సాహితీమిత్రులారా!



అల్లసాని పెద్దనకు "ఆంధ్రకవితా పితామహుడ"ని పేరు
ఆయనను గురించి "శ్రీశ్రీ" వ్రాసిన కవిత చూడండి-


ఈ యఖండ ప్రతిభ విరిసి య
నేక రుచుల తురంగలించెడు 
మధువు లొలికిన మంజుకవితల
మనుచరిత్రమున..

ఆ దినమ్మున కృష్ణరాయ ధ
రాధిపుని పేరోలంగమ్మున
త్వత్కవిత్వ రస స్రవంతిని
ధార కట్టినది

మృదు మధుర గాన ధ్వనుల విని
కృష్ణ సర్పము లవశమొందిన 
విధములపు డట  నున్న పండిత
హృదయముల తోచె 

అపుడు మ్రోగెను నీదు పాదము
నందునుండి జనించి సభలో
గండ పెండారపు సముజ్జ్వల
గాన గీతములు

గౌరవము గని గరువముం గని
పారవశ్యము చెంది ఆశీ
ర్ధ్వనులతో కృష్ణరాయని
ధన్యుని చేసితివి

ఏండ్లు పూండ్లును నాడు మొ1దలు గ
తించె కాని భవద్యశస్సులు
నేటి వరకు శరత్సుధాకర
నిర్మలత తాల్చు

నీవు నాటిన తోటలోపల 
చేవ తరుగని పూల గుత్తులు
నేటివరకును తేటవలపులు
నింపెడిని దెసల

జీవచిత్ర కళారహస్యము
చిందు వార్చిన నీకవిత్వము
చిత్రకారుల చేతగల కుం
చియల విచ్చినది

తెలుగు కవనపు తీరు తీయము
నిలిచి వెలుగుట కొక మెరుంగును
చిలికి చుక్కల నడుమ మింటను
కులుకుచున్నావు.

రచన - 1928 జులై, 22
ముద్రణ - కవితాసమితి తొలివార్షిక సంచిక,1929