Thursday, April 30, 2020

చంపినవారే మహాభక్తులా?


చంపినవారే మహాభక్తులా?




సాహితీమిత్రులారా!

ఈ చమత్కార శ్లోకం చూడండి.

భ్రాతృహంతా పితృహంతా మాతృహంతా చయ:పుమాన్
త్రయేతేచ మహాభక్తా: ఏతేషాంచ నమామ్యహమ్

అన్నను చంపినవాడు,
తండ్రిని చంపినవాడు,
తల్లిని చంపినవాడు
ఈ ముగ్గురు మహాభక్తులు.
వీరికి నమస్కారం.
ఎట్లా
అన్నను చంపినవాడు, తండ్రిని చంపినవాడు, తల్లిని చంపినవాడు
మహాభక్తులా?
ఎవరువారు?

అన్నను చంపినవాడు(విభీషణుడు),
తండ్రిని చంపినవాడు (ప్రహ్లాదుడు),
తల్లిని చంపినవాడు(పరశురాముడు)
ఈ ముగ్గురు మహాభక్తులు.
వీరికి నమస్కారం.

Tuesday, April 28, 2020

నిజమేకదా!


నిజమేకదా!




సాహితీమిత్రులారా!

ఒక కవిగారు చెప్పిన
ఈ చమత్కార పద్యం చూడండి.

అనిబారిన విధి నవ్వును,
ధనసంపద నవ్వు  నుచిత దానహీనున్
తనయుని ముద్దాడంగా
పెన్మిటిగని జారనవ్వు పిచ్చెయ రేచా!

ఓ పిచ్చయరేచా!
యుద్ధంనుండి పారిపోతే విధి నవ్వుతుందట.
ధనసంపదలతో ఉండి తగినరీతి దానం చేయనివాని
చూచి ధనం నవ్వుతుందట.
కొడుకును భర్త ముద్దాడుతుంటే, తన కొడుకేనని భ్రమతో
ఎంత ముద్దాడుతున్నడు అని జారస్త్రీ నవ్వుతుందట.

Saturday, April 25, 2020

లోకరీతి - 2


లోకరీతి - 2





సాహితీమిత్రులారా!

ఈ కమనీయ చమత్కార పద్యం చూడండి.
ఒక భోజనపంక్తిలో ఒక ఉన్నతస్తని అన్నం వడ్డిస్తుంటే
పంక్తిలో తింటూఉన్న వాళ్ళలో ఒక యువకుడు
వడ్డించే  ఆవిడను ఈ విధంగా అడిగాడు
ఆ పద్యం.......

పద్మ కోశాభినయ హస్త వల్లపంబు
చూపె నావేళ రమణికి సాబగు డొక్క
డంత యోగిర మడిగెనో యంతలేసి
మెరుగు పాలిండ్ల నడిగెనో మెలతనతడు

వడ్డించే యువతికి భోజనంచేసే యువకుడు
చేతిని తామర మొగ్గలా చూపాడట అంత అన్నమే అడిగాడో,
ఆమె పాలిండ్లనే అడిగాడో - అంటున్నాడు కవి.

Thursday, April 23, 2020

లోకరీతి - 1


లోకరీతి - 1




సాహితీమిత్రులారా!


ఈ చమత్కార శ్లోకం చూడండి

అరసిక జనై: సంభాషణత:
రసిక జనైస్సహ కలహం శ్రేయ:
లంబకుచాలింగనత: లికుచ
కుచాయా: పాదతాడనం శ్రేయ:

రసజ్ఞత ఎరుగని వారితో మాట్లాడటం కంటె,
రసికులైన వారితో కలహము మేలు.
వ్రేలాడు కుచములున్న ఆమెను కౌగిలించుటకంటె,
గజనిమ్మలవంటి చన్నులున్న
ఆమెతో తన్నులు తినటం మేలు - అని భావం.

Monday, April 20, 2020

లోకరీతి


లోకరీతి



సాహితీమిత్రులారా!

లోకరీతిని తెలిపే ఈ చమత్కారశ్లోకం చూడండి.

వైద్యా: వదన్తి కఫ పిత్త మరుద్వికారాన్
జ్యోతిర్విదో గ్రహగతిం పరివర్తయన్తి
"భూతాభిషంగ" ఇతి భూతవిదో వదన్తి
ప్రాచీనకర్మ బలవాన్ మునయో వదన్తి

మానవలోకంలో శారీరక బాధలు వచ్చినపుడు
వైద్యులు కఫ - వాత - పిత్త వికారాలని అంటారు.
జ్యోతిష్యులు గ్రహస్థితి గురించి చెబుతారు.
భూతవైద్యులు భూతసంబంధమైందని అంటారు.
పూర్వజన్మ కర్మము అని మునీశ్వరులు అంటారు.
ఏది నిజమో దేవునికే తెలుసు
- అని భావం. 

Saturday, April 18, 2020

బొమ్మలాంతరు


బొమ్మలాంతరు





సాహితీమిత్రులారా!

శ్రీశ్రీ - ఖడ్గసృష్టి నుండి
ఈ కవిత ఆస్వాదించండి

దిదుతూన్న గుంట ఓనమాలు చెరిపేసి
చేతిలో ఉన్న బలపం విరిచేసి
కొత్తపలక కొనుక్కొచ్చాడు కుర్రాడు
పాగాచుట్టుకొంటూన్న రోకలి పారేసి
తెలివితక్కువ తనాన్ని గొయ్యితీసి పాతేసి
పొరుగువాడెలా ఉన్నాడని భోగట్టాచేశాడు వెర్రివాడు

ఆడుతున్న నాటకం ఆపేసి 
పెట్టుకున్న గడ్డం కుళ్ళాయీ లాగేసి
ఆడియన్సులో కలిసిపోయాడు విదూషకుడు

నిన్నటి వాగ్దానాన్ని నేటి ఉపన్యాసంలో కాల్చేసి
నేటి ఫోర్జరీని రేపటి సంతకంతో మార్చేసి 
ఇక్కడే వుండు వొస్తానని ఎక్కడికో పోయాడు వినాయకుడు

తన చుట్టూ తాను తిరుగుతూ 
సూర్యుని పరిభ్రమించే భూమిలాగ
ఆశయంచుట్టూ తిరుగుతోంది ఆవేశం

(చీట్లాటలో ఒక చేతిని అన్నీ పొడిముక్కలే అయి
ఒక బొమ్మలేకపోవడం బొమ్మలాంతరు. అప్పుడు 
ఆటకలిపి మళ్ళీ ముక్కలు కలపటం ధర్మం)

Wednesday, April 15, 2020

బందీ


బందీ




సాహితీమిత్రులారా!
Acharya Athreya Songs Download | Acharya Athreya New Songs List ...
ఆచార్యఆత్రేయ గారి కవిత
బందీ ఆస్వాదించండి-

బోసినోటి నవ్వుచూచి
బందీ నైతిని!
బుడుబుడుమను నడకచూచి
పొంగిపోతిని!
వచ్చి నన్ను పిలిస్తే
ముగ్ధుడైతిని!

కావాలీ నాన్నంటే 
కరగిపోతిని!
కన్నీరు పెట్టినపుడు
కలగిపోతిని!
ఎన్నివేల మైళ్ళైనా
ఎగిరి వస్తిని!
విరిచుట్టూ తేటివలె
తిరుగుచుంటిని!

బోసినోట పళ్లొస్తే
ముత్యాలనుకొంటిని!
బుజ్జిబుజ్జి పాదాలకు
బూట్లు తెస్తిని!

పరుగెడితే పడతావని 
భయం పడితిని!
పసిడిబొమ్మ బోసి అని
పందెమేస్తిని!
ఎవరైనా కొర చెపితే
మండిపడితిని!

Monday, April 13, 2020

విమర్శకుని ప్రత్యేకత


విమర్శకుని ప్రత్యేకత



సాహితీమిత్రులారా!


నన్నయ రాజరాజును సంబోధిస్తూ రాసిన పద్యం ఇది.

శ్రీరమణీప్రియ, ధర్మవి
శారద, వీరావతార. సౌజన్య గుణా
ధార భువనైక సుందర
వీర శ్రీరమ్య బుధ వివేక నిధానా (సభా-2-1)

నన్నయ సామాన్యంగా శ్లేషనుగాని, చమత్కారాన్నిగాని పాటించడు.
మరి ఈపద్యంలో నన్నయ వాడిన విశేషణాలు రాజరాజు గుణగణాలను
కీర్తించినవే కానీ ఓప్రతిభా విమర్శకుడు చేసిన విమర్శను చూడండి.

శ్రీరమణీప్రియ - శ్రీకృష్ణుడు,
ధర్మవిశారదుడు - ధర్మరాజు,
వీరావతారుడు - భీముడు,
సౌజన్యగుణాధారుడు - అర్జునుడు,
భువనైకసుందరుడు - నకులుడు,
బుధవివేకనిదానుడు - సహదేవుడు - అని వివరించాడు.
కవి భావనలోని విశేషాలను చమత్కారాలను విమర్శకులు చాతుర్యంగా
విపులీకరించగలరని దీన్ని బట్టి అర్థమౌతుంది.

అందుకేనేమో
"కప్పిచెప్పేవాడు కవి - విప్పి చెప్పేవాడు విమర్శకుడు" -  అనే  నానుడి వచ్చింది

Saturday, April 11, 2020

కవిచమత్కారం - 3


కవిచమత్కారం - 3



సాహితీమిత్రులారా!

కూచిమంచి తిమ్మకవి రచించిన రసికజనమనోరంజనం చదివిన
ఒక వేశ్య ఒకానొకరోజు తిమ్మకవి ఆదారి వెంబడి పోతూ ఉండగా చూచి
పరుగెత్తుకుంటూ వెళ్లి ఆయన్ను వాటేసుకుందట
దానితో ఏమీ అర్థంకాని ఆయన మొగం పక్కకు తిప్పుకున్నాడట.
దాని ఆవేశ్య ఇలా అన్నది.

"చతురులలోన నీవు కడు జాణవటంచును నెంచి కౌగిలిం
   చితి నిటు మారుమోమిడగ చెల్లునె యో రసికాగ్రగణ్య?" - అన్నదట.
                                            దానికి తిమ్మకవిగారు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చారు.
                                                                                                                                "అ
ద్భుతమగునట్టి బంగరపు బొంగరపుంగవబోలు నీ కుచ
ద్వితయము ఱొమ్మునాటి అల వీపున దూసెనటంచు చూచితిన్" - అని అన్నాడట.

Thursday, April 9, 2020

కవుల చమత్కారం


కవుల చమత్కారం




సాహితీమిత్రులారా!

అడిదము సూరకవి, రేకపల్లి సోమనాధకవి 
ఇద్దరూ ఒకసారి ఒకరికొకరు తారసపడ్డారు.
సూరకవి సోమకవిని ఇలా పరామర్శించారు.

ఏమేమో శాస్త్రంబులు
తామిక్కిలి సతికెనంట తద్ధయుఁగవితా
సామర్ధ్యమెఱుంగ నేరని
సోముని జృంభణము గలదె సూరుని యెదుటన్
(సోముని - చంద్రుని - విజృంభణం సూర్యుని ఎదుట ఉండదని అర్థం)
సోమకవి విజృంభణం సూరకవి ముందు సాగదని అర్థం.
దీనికి సమాధానంగా సోమకవి ఈవిధంగా బదులిచ్చాడు.

సోమ శబ్దర్థ మెఱుఁగని శుంఠవగుట
పదిరితివి గాక సూర్యుని రదనములకు
భంగకరుఁడగు సోము జృంభణము లీలఁ
దెలియ వయ్యొయొ నీ గుట్టు దెలిసెఁ గుకవి

( సోమ అనే శబ్దానికి అర్థం ఈవిధంగా తీసుకుంటే - సోమ = స + ఉమ = శివుడు. దక్షయజ్ఞసమయంలో శివుని విజృంభణతో సూర్యుని రదనము(దంతము)లకు భంగంవాటిల్లింది. దాన్ని కవి ఇక్కడ ప్రస్తావించాడు చమత్కారంగా.)

Tuesday, April 7, 2020

తెలివి


తెలివి





సాహితీమిత్రులారా!

Acharya Athreya Songs Download | Acharya Athreya New Songs List ...
ఆచార్య ఆత్రేయ గారి 
తెలివి అనే చిన్న కవితను
ఆస్వాదించండి -

విడిపోయి తెలుసుకొంటిని
కలిసుండు టెంత బాధని
ఆనాడు ఎరుగనైతిని 
విడిపోతే ఇంత సుఖమని
నీకు ప్రేమన్న దెరులేదని
నిన్ను ప్రేమించి తెలుసుకొంటిని
అసలు ప్రేమించుటే పెద్ద తప్పని
నిన్ను ద్వేషించి దిద్దుకొంటి

Sunday, April 5, 2020

స్త్రీల జాతుల చిత్రాలు


స్త్రీల జాతుల చిత్రాలు




సాహితీమిత్రులారా!

మన శాస్త్రకారులు స్త్రీలను
పద్మిని, చిత్రిని, శంఖిని, హస్తిని అని
నాలుగు రకాలుగా నాలుగు జాతుల వారిని పేర్కొన్నారు
వారి చిత్రాలను కొక్కొకం ఆంగ్లానువాద ప్రతిలో ఇవ్వగా
దాన్ని మీ ముందుచుతున్నాను గమనించండి-





Friday, April 3, 2020

విప్పిచెప్పిన తార


విప్పిచెప్పిన తార




సాహితీమిత్రులారా!

తెలుగు కావ్యజగత్తులో సుప్రసిద్ధములై శతాబ్దాలుగా
సాహితీ రసికుల ఆస్వాదములై వస్తూన్న వాటిలో
"శశాంకవిజయం, రాధికా సాంత్వనం, బిల్హణీయం, వైజయంతీవిలాసం,
అహల్యా సంక్రదనం" మొదలైనవి. వీటిని ఎవరంటే వారు చదవకూడదని
వీటిపై బ్రిటిషువారి కాలంలో నిషేధం విధించబడునది. దాన్ని
తొలగించడానికి అనేకులు అనేకరకాలుగా శ్రమించారు.
అది గతం ఇప్పుడో వీటిని సదివే ఆసక్తిఉన్నా అర్థం చేసుకోగల సామర్థ్యం తగ్గి
వీటిని చూడటం తగ్గిందనవచ్చు.
అసలు విషయానికొస్తే శశాంకవిజయంలో తార చంద్రునికి తనపై మోహం
కలిగేలా తన గురువు గారైన బృహస్పతి తదితరుల రహస్యకార్యకలాపాపాల చిట్టా
ఈ విధంగా విప్పింది. చూడండి.

కన్నకూఁతు రటంచు నెన్నక భారతీ
           తరణిఁ గూడఁడె నీ పితామహుండు?
మేనత్త యను మేర మీఱి రాధికతోడ
           నెనయఁడే నిన్న నీయనుఁగు బావ?
వదినె యంచు నొకింత వావి లేకయె జ్యేష్ఠు
          నెలతతోఁ బొందఁడె నీ గురుండు?
ముని పత్ని యన కహల్యను బట్టఁడే నీదు
          సహపాఠి యౌ పాకశాసనుండు?
ఇట్టి మీవారి నడతలు కట్టిపెట్టి
యమ్మ నేఁజెల్ల! న్యాయంబు లాడె దౌర!
కడకు నీ రంకు నీ వెఱుంగని వితాన
దూరెదవు నన్నుఁ, జలహారి దోసకారి! (3-81)

Wednesday, April 1, 2020

గిరిజా కల్యాణం ఛలోక్తులు


గిరిజా కల్యాణం ఛలోక్తులు





సాహితీమిత్రులారా!
Girija Kalyanam Tanjore Painting, Size: 18 X 24 Inches, Rs 17500 ...
సామాన్యమానవులు పరిహాసాలాడడం, ఛలోక్తులు విసరడం
మనం గమనించేవే కాని దేవతలు సైతం పరిహాసాలాడడం
మనం ఇక్కడ గమనించ వచ్చు.
గంటి కృష్ణవేణమ్మగారు "గిరిజా కల్యాణము" -  అనే కావ్యంలో
 "బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు" వివాహభోజన సమయంలోని
సరససంభాషణలు ఛలోక్తులు ఇలా చిత్రించారు చూడండి.

విష్ణువు శివునితో-

విసము తిన్ననోట కసవయ్యె కాబోలు
భక్షణంబులెల్ల పార్వతీశ!
అట్టి దివ్యమైన ఆహారంబులు లే
వటంచు బల్కె విష్ణు డభవుతోడ-

అప్పుడు శివుడు-

నిక్కము నీవు పల్కినది నీరజనాభ! ఇటెందు మ్రుచ్చిలన్
చిక్కదు వెన్న తెత్తుమన చిక్కవు ఎంగిలి కాయలెందు నీ
కెక్కడఁ దెత్తుమయ్య అవి యిప్పుడటంచు శివుండు నవ్వి నన్
అక్కడ పంక్తిభోజనమునందు పకాలున నవ్విరందఱున్


విష్ణువు బ్రహ్మతో-

వండి వడ్డింప దొకనాడు వనిత నీకు
అంటు తలవాకిటనెగాన - ఓ విధాత!
భుక్తి సలుపుమ యిపుడైన బొజ్జనిండ
అనుచు పరిహాసమాడె నా హరియు నపుడు