Tuesday, October 12, 2021

చేమకూర వెంకటకవి - కీర్తికాంత

చేమకూర వెంకటకవి - కీర్తికాంత




సాహితీమిత్రులారా!



విజయవిలాసము కృతిభర్త రఘునాథని కీర్తిని చేమకూర వెంకటకవి

ఎలావర్ణించారో ఈ పద్యంలో గమనించవచ్చు ఆయన చమత్కారాన్నీ

గమనించవచ్చు 

రసికుడౌ రఘునాథుని కీర్తి యౌరా తొల్త వాగ్బంధమున్

రసవాదంబును, రాజ్యవశ్యవిధి నేరంబోలుఁ గాకున్న, వె

క్కసపుం బ్రౌఢి వహించి, శేషఫణి మూఁగంజేయఁ, దారాద్రి ను

ల్లసము ల్వల్కఁగ ఛత్ర చామర మహాలక్ష్ముల్ నగన్ శక్యమే


తాత్పర్యం-

రఘునాథుని కీర్తి - కీర్తి తెల్లగా ఉంటుంది కాబట్టి - తెల్లదనమునకు ప్రసిద్ధిపొందిన సరస్వతీదేవిని, పాదరసమును, చంద్రుని, ఆదిశేషుని, వెండికొండను శ్వేత ఛత్రచామరాలను మించినదని భావం

ఈ పద్యంలో విద్యావతియైన ఒకకాంత 1. వాగ్బంధము, 2. రసవాదము, 3. రాజవశ్యము అనేవిద్యలను మొదట అలవరచుకొని ఆ తరువాత అత్యంత నిపుణతతో విజయయాత్రకు బయలుదేరి వేయినాలుకలుగల భాషానిధియైన ఆదిశేషుని నోరెత్తకుండా చేసి, వెండికొండను అల్పమైన విలువగలదానిగా పరిహసించి, రాజలాంఛనాలైన ఛత్రచామరముల ఆధిక్యాన్ని ఈసడిస్తున్నట్లున్నది అని చమత్కారం

Sunday, October 10, 2021

శివుడా ఏకాంతం ఎక్కడ?

 శివుడా ఏకాంతం ఎక్కడ?




సాహితీమిత్రులారా!



ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు

"శివుడు పార్వతితో ఏకాంతంగా మాట్లాడే వీలులేదని" చెప్పే

ఈ పద్యం చూడండి.

ఎంత

చమత్కారంగా ఉందో!


జుట్టున గంగయున్ మరియు సోముడు మేల్కొని యుందు రక్కునన్

కట్టడి పాపరేడు, అలికంబున నగ్ని శివుండు పార్వతీ

పట్టపుదేవితో సరస భాషణ కేనియు నోచుకోడటే!

గుట్టుగ జెప్పికొన్న పలుకుల్ బహిరంగములౌను వెంటనే


(శివుడు, పార్వతి ఏకాంతంగా రహస్యంగా

మాట్లాడుకోవటానికి నోచుకోలేదట

ఎందుకంటే .........

తలమీద గంగ, చంద్రుడు, మెడలో పాము, నొసట అగ్ని

- ఇన్ని విడవనివి ఉంటే

ఇక ఇక ఏకాంతం ఎక్కడ)


Saturday, October 9, 2021

నా ప్రేమ

నా ప్రేమ




సాహితీమిత్రులారా!



దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి

కృష్ణపక్షం నుండి నా ప్రేమ - అనే

ఈ కవిత ఆస్వాదించండి-

క్రౌర్య కౌటిల్య కలుష పంకంబు వలన

మలినమౌ నా హృదయము ధామ మెటులయ్యె

నతి విశుద్ధము  మధురము నఘరహితము

ప్రణయమున కంచు సందియ పడుదువేమొ


ప్రేయసీ! శర్వరీ తమోవీధుల బడి

చంద్రుడు రాడె పూర్ణతేజస్వియగుచు

అఘవిదూషిత మీ హృదయంబునందె

ప్రేమ కోమల తమము పవిత్రమయ్యె

Wednesday, October 6, 2021

చిత్తరువైతివిగాదె కోమలీ!

 చిత్తరువైతివిగాదె కోమలీ!




సాహితీమిత్రులారా!



ఒక చిత్రకారుడు గీచిన చిత్తరువును చూచి ఒక కవి 

తనకు కలిగిన భావనను తన కవిత్వంలో ఎలా వెలార్చారో 

చిత్తగించండి-

పలుకక పల్కరించుగతిఁ బాడక పాడినరీతి తేనియల్

చిలుకఁగ నవ్వకే నగిన లీలఁగనుంగొనుచున్న నాదు క

న్నుల కతిసుందరంబగు మనోజ్ఞపు చిత్తరువందు నున్న నీ 

చెలువముగాంచి నేనొక చిత్తరువైతిని గాదె కోమలీ


అని కొనియాడి అంతటితో ఊరుకొనక మరీ ఇట్లంటున్నాడు-

వలుద నిగారింపు బటువు వట్రువ యబ్రపు నిబ్బరంపు గు

బ్బలు తెలినీటి పోల్కిఁగను పట్టెడు సన్నని జిల్గు పయ్యెద

న్వెలువడి త్రుళ్ళి పైకుబికె వీలఁటె గోలలకేల చేలముం

గలికిరో కేలఁ గప్పవు  -

అని సిగ్గు విడిచి అడిగి చప్పున తెలివి తెచ్చుకొని-

                                                        అటుగాదఁటె చిత్తరువందు కోమలీ!

అని సరిపుచ్చకొనెను

ఆహా చిత్రకళా ప్రభావము పామరులకే గాదు పండితులను సైతము

మోహింప చేయజాలును కదా

Monday, October 4, 2021

నా దోషం ఏముందీ?

 నా దోషం ఏముందీ?




సాహితీమిత్రులారా!



తంజావూరును పాలించిన విజయరాఘవుని
ఆస్థానంలో మన్నారుదాసవిలాసం(యక్షగానము) అనే
శృంగార కావ్యరచయిత్రి రంగాజీ (రంగాజమ్మ)
ఆస్థాన కవయిత్రిగా ఉండేది. చక్కని కవిత్వం చెప్పగలదిట్ట.
విజయరాఘవునిచేత కనకాభిషేక గౌరవాన్ని పొందినది.
ఆమె అంటే ఎక్కువ ప్రేమతో రాజుగారు ఎక్కువగా
ఆమెతోటి కాలం గడిపేవాడు. ఒకరోజు విజరాఘవుని భార్య
రంగాజమ్మ దగ్గరికి ఒక దూతికతో నిందా పూర్వకంగా
తన భర్త సాంగత్యము వదలుకొమ్మని సందేశం పంపినది.
దానికి రంగాజమ్మ ఈ పద్యంతో సమాధానం చెప్పింది.
చూడండి ఆ పద్యం -

ఏ వనితల్మముం దలపనేమి పనో! తమరాడువారు గా
రో వలపించు నేర్పెరుగరో! తమ కౌగిటిలోన నుండగా
రావది యేమిరా! విజయరామ! యటం చిలుదూరి బల్మిచే
దీవరకత్తెనైపెనగి తీసుకువచ్చితినా? తలోదరీ!

ఎవరైనా స్త్రీలు మావిషయం
స్మరించవలసిన అవసరంమేమి?
వారు స్త్రీలు కారా తమ భర్తను అనురాగంతో
వశపరచుకునే తెలివి వారికి లేదా?
నేను విజయరాఘవుడు ఆమె కౌగిలిలో ఉండగా
తీసుకొని వచ్చినానా? నన్ను నిందించటం ఎందుకు - అని భావం.

రాయలు తనంత తానే నా దగ్గరికి వస్తున్నాడు
రాణి తన ప్రేమతో ఆయనను బంధించలేనప్పుడు
నా దోషం ఏమున్నది అది ఆమె లోపమే
అని యుక్తిగా సమాధానమిచ్చింది.

Saturday, October 2, 2021

కవి ఎవరు?

కవి ఎవరు?




సాహితీమిత్రులారా!



మొట్టమొదట కవి లేడట ఎవరితో కవి ప్రాంభమయ్యాడో

ఈ శ్లోకం వివరిస్తుంది గమనించండి-

జాతే జగతి వాల్మీకౌ కవిత్వభిధా2భవేత్

కవీ ఇతతితో వ్యాసే కవయస్త్వయి దండిని

జగత్తులో వాల్మీకి పుట్టగానే కవి అనే ఏకరూప శబ్దం వచ్చిందట

అంతకుమునుపు కవి అనేవాడు లేడని భావం

తరువాత వ్యాసుడు పుట్టగనే కవీ అనే ద్వివచన రూపం

దండి పుట్టగనే కవయః అనే బహువచన రూపం వచ్చాయట

అని శ్లోక భావం

అయితే కొంత మంది దండి మీద అభిమానంతో 

ఎవరో కూర్చరీ శ్లోకం అని అంటున్నారు

వాల్మీకి, వ్యాసుల తరువాత దండి వారిఅంత కవి అనిమరి కొందరి భావన.