Saturday, February 16, 2019

ఆమె నా దేవత సొంత ఊరు


ఆమె నా దేవత సొంత ఊరు

సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి...................

వాయనాడ్ కొండలమీద
మన ప్రేమ గుర్తులు చెరిగిపోయాయి
ఆ వాలు దారుల్లో రాలే సంపెంగలిపుడు
నవ్వితే వచ్చే పచ్చి వాసన రావట్లేదు
మనిద్దరి మబ్బుల లోకమంతా చీకటి మూగి
ఎక్కడచూసినా నీళ్ళొచ్చేశాయి

ఇటుక పెంకుల పాత ఇంటి చూరు కింద
వర్షంలో కాలాన్ని కాఫీతో చప్పరించిన
అరుగుమీద ఇప్పుడెవరూ కూర్చోలేదేమో
నోట్లో సగం నమిలిన సజ్జలతో
నువ్ సాకిన కోళ్ళు అక్కడే పడి ఉన్నాయి.

ఆదిరప్పళ్ళి తలపోత తుంపరలకింద
వళ్ళంతా తడిసి ముద్దైన తీయటి కలలు
పిల్లల్లా తుళ్ళి ఆడటం మానేసి
పక్కపక్కనే పడుకున్న చెక్క గది కిటికీలోంచి
ఊగే వక్క చెట్లపై పడి వెన్ను విరిగిపోయాయి

దిగుడుబావిలో నీళ్ళన్నీ పైకి తేలి
చేపలు చేరి ఉంటాయి
ఎండబెట్టిన పురిడీ కాయలు నానిపోయి
బూజు పట్టిన జ్ఞాపకాల్లా మళ్ళీ
తడి ఆరుతుంటాయి
తొల్తొలి రాత్రుల్లో వెలిగే దీప ప్రమిదల కౌగిలింతలన్నీ
లంగరు సడలిన పడవల్లా ఎటోకటు కొట్టుకునిపోగా…
ఏటిలోని కలువ పూలనిప్పుడు
ఏరుకోవడం వీలు కాని పని!

నీ అల్లరి అరేబియా సముద్రాన్ని ఊపిరాడనివ్వనట్టున్న ఒక రోజు
నేన్నీకోసమొస్తే, ఉప్పుడు బియ్యం ఎసట్లో పోసి సన్నని సెగ పెట్టేవు.
అసలీ నీళ్ళన్నీ ఏ చేద గుప్పెట్లో దాచావిన్నాళ్ళూ?

జాలర్లు ఇంటికి చేరి ఉండరు
దేవగిరి చర్చి గంట కూలిపోయి గుడిసెల్లోని వాళ్ళంతా దేవుడి ముందేడుస్తూ ఉంటారు
దేవలోకమంతా సంయోగ దాహం తీరని శరణార్థ భూమి కోసం ప్రార్థనలు పాడుతారు.

నీ బొట్టు చందనం ముక్క
త్రిస్సూర్ లోని శివుడి కోవెల
కోనేటి మెట్ల మీద మునిగిపోయింది.
దిగువ ములప్పెరియార్ రెండు నీటి పాయల్ని
అటూ ఇటుగ లాగి మధ్యలోకి ముడి వేసిన
నీ జుట్టు కోయిల గూడు ఏ పదును ఈదురుగాలికో
చెల్లాచెదురుగ విడివడిపోయింది.

శ్రీకుమార్ గొంతులోని
చెమ్మగిల్లిన ఉత్తరాల్ని సంచీలో సర్దుకుని
దారి తెగిపోయిన వంతెన మీద కొచ్చాక
ఏకధాటిగా కురుస్తున్న అనంత దుఃఖంలో
చలికి వణుకుతూ
నువ్వూ… పక్కన్నేనూ…!
----------------------------------------------------------
రచన: శ్రీరామ్, 
ఈమాట సౌజన్యంతో

Friday, February 15, 2019

ప్రహ్లాదుడు


ప్రహ్లాదుడు
సాహితీమిత్రులారా!

ఈ  పద్యకవితను ఆస్వాదించండి.................

చంటిమేనిపై పైతృపిశాచి మదము
వ్యధను సంధింప కర్తయు, హర్తయు హరి
దక్క వేరొండు కాదంచు దనువు మరచు
నతడు అద్వైతకళల ప్రహ్లాద మూర్తి.

విమల రోగఘ్న గంధమ్ము విరగజిమ్ము
లేత ఐదేండ్ల గుండెలో లేలిహాన
దంష్ట్ర బల్మారు పోనివ్వ తరగబోని
మంచిగంధపు మారాకు మది జయించు.

తెలియనితనమే తెలియగ
తెలివి తనువగు హరి తెలివి తెలియును, తెలిసీ
తెలియవలసినది తనువను
తెలివిని తొలగించు తెలివి తెలియగ వశమే.

జాబిల్లి వెన్నెల్లు జలజాక్షుడైనంత హాలాహలోద్భీతి యేల రాదు?
నేర్పించు చదువుల్లు నిటలాక్షుడైనంత వేదండవిభ్రాంతి యేది లేదు?
మేలిల్లు, దేవుళ్లు మీనాక్షుడైనంత కుధ్రసంభ్రమమేల గురుతురాదు?
దేశమ్ము కాలమ్ము దీర్ఘాక్షుడైనంత సింధువిభ్రమమేల చెంత రాదు?

నీకు తెలిసిన దైవమ్ము మాకు తెలియు
నీకు తెలిసిన భక్తులు మాకు కలుగు
నీదు నునులేత గుండెలో నిష్ఠచేత
వెలుగు శూలంపుపదును మావలన కాదు.

‘రారా బంగరుకొండ! దగ్గరకు రారా కంజపత్రాక్ష! నీ
మారామింక కుదించు, ఆఖరిదెపో మామంచి గోర్ముద్ద’యం
చో రావింప యతించు తల్లి పటిమన్ శోధింప పర్వెత్తు నీ
గారాబంబుల బుర్రలోనమరెనే కాఠిన్యవేదాంతముల్

అరిపాదమ్ములు లేచివుళ్లు, విరినేత్రాంకాలు రాత్రిప్రసూ
న రమాసంకులకోమలాలు దరవిన్యాసాతిరేకంబులా
పరమానందపతాకభూమికలు రా ప్రహ్లాద! వర్ణింప, నీ
పరమాత్మాంకితచిత్తసంగతులు జెప్పన్ సాధ్యమే నేటికిన్

లలితనికాయకాయమున రంజిలు శింజిని భూషవోలె శ్రీ
లలనపథానుయానమున లక్షితచిత్తముకంటుకున్న దే
హ లవనివేశమే ఇదను హార్దికభావము ఉండుగాక, నీ
పలుచనిదేహఘట్టనలు పంచును క్షోభము తల్చుకొన్నచో.

నిన్ను మృదూపలార్ద్రగణనీయవిదేహుని చీదరించి సం
పన్నదురాభిమానమయపాశము పట్టిన కన్నతండ్రి శ
శ్వన్నిధనానుకూల ఖలశాసనలేఖకుడైన తీరు లో
గొన్న యెడంద నీదిగని కూలును నా హృది స్వప్నసౌధముల్.

పరువము తారసిల్లు విరి పాలగు మెత్తదనాల పొంగు; తె
మ్మెరపసికూన తూలి పొడమించెడు సౌఖ్యము, గుండెలోని ప్రే
మ రొదను చెప్పువేళ ముఖమందున దొర్లెడు తప్పుసోకు నీ
వరమగు చిన్నిమోమువలపంటిన భక్తికి సాటివచ్చునే.

వయసు వరేణ్యమై పొరలు వారిన మోహపు మానరాగసం
చయములతో మదించి తమిచాలక మగ్గెడు మాదుగుండెలో
నయముగ చల్లరా పసితనాల వినిర్మలబీజరాజి, చా
లు, యనుగమించు దేశగతి రోదసివైపుకి సాంద్రదీప్తమై.
------------------------------------------------------
రచన: పరిమి శ్రీరామనాథ్, 
ఈమాట సౌజన్యంతో

Thursday, February 14, 2019

ఎఱ్ఱన ప్రాభాత వర్ణనం


ఎఱ్ఱన ప్రాభాత వర్ణనం

సాహితీమిత్రులారా!

చం.
స్ఫురదరుణాంశు రాగరుచి బొంపిరివోయి నిరస్త నీరదా
వరణములై దళత్కమల వైభవజృంభణ ముల్లసిల్ల, ను
ద్ధురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ సెలంగగా
గరము వెలింగె వాసర ముఖంబులు శారదవేళ జూడగన్.
మహాకవి ఎఱ్ఱాప్రగడ పద్యం ఇది. నన్నయభట్టు మిగిల్చిన భారతారణ్యపర్వపు శేషభాగాన్ని పూరిస్తూ ఎఱ్ఱన వ్రాసిన తొట్టతొలి పద్యం. నన్నయ శరత్కాలపు రాత్రులను వర్ణిస్తూ తన కవిత్వాన్ని ముగిస్తే, ఎఱ్ఱన దానికి కొనసాగింపుగా శరత్సమయ ప్రాభాత వేళలను కళ్ళక్కడుతూ వ్రాసిన పద్యం. శారద రాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్ అంటూ ప్రారంభించి, సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాగ పాండు రుచిపూరములంబరి పూరితంబులై అంటూ ఎంతో మనోహరంగా శరద్యామినీ వేళలను చక్కని పద్యంలో రూపుకట్టించాడు నన్నయ. అంతే మనోజ్ఞమైన మరో పద్యంలో రాగరంజితమైన సూర్యప్రకాశాతిశయాన్ని వర్ణిస్తూ–మబ్బులూ, విచ్చుకునే తామరలూ, తెల్లవారేవేళల్లో పక్షులూ తుమ్మెదలూ చేసే మధురనాదాలూ–వీటితో కళ్ళకూ చెవులకూ విందుచేశాడు ఎఱ్ఱన. నిరస్తనీరదావరణములై… శారదాకాశంలో మబ్బులుంటాయి. కానీ నిర్జలాలు. స్వచ్ఛమైన, ప్రశాంతమైన, ఆకాశంలో తెల్లగా మెరిసిపోయే నిరస్తనీరదాలు. రిత్త మబ్బులు. పర్యావరణమంతా ప్రశాంతంగా ఉండే ప్రొద్దు. పిట్టల కువకువలూ, తుమ్మెదల ఝాంకృతులూ–ఆ ప్రశాంతతకు మాధుర్యాన్ని అద్దేవేగాని భంగం చేసేవి కావు. ఇంత చక్కని దృశ్యాలతో, ఇంత హాయైన పద్యంతో ఎఱ్ఱన తన భారత పూరణాన్ని ప్రారంభించాడు. సుధాంశుని నుంచి నిమ్మళంగా అరుణాంశుని వద్దకు కథను జరిపాడు.

పదకొండో శతాబ్దపు మొదటి సగంలో నన్నయ ప్రారంభించిన భారతానువాదం అరణ్యపర్వం నాలుగో ఆశ్వాసం సగం దాకా సాగి ఆగిపోయింది. ఆ పిమ్మట పన్నెండో శతాబ్ది ఆఖర్లోంచి పదమూడో శతాబ్ది తొలి ఏడాదులవరకూ– విరాట పర్వం నుంచి చివరిదాకా–తిక్కన పూర్తిచేశాడు. ఆ తర్వాత దాదాపు వందేండ్లకుగాని నన్నయభట్టు విడిచిన అరణ్యపర్వ శేషాన్ని స్పృశించే మహానుభావుడు రాలేదు. ఎఱ్ఱన పూనుకొని ప్రయత్నించేవేళ ఆయన ఒక చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కేవలం పూరణం అయిందనిపించడం ఆయన ఉద్దేశ్యం కాదు. తాను చేసే పూరణ నన్నయ తిక్కనల కవిత్వాలకు ఒక అందమైన అనుసంధానంగా కుదిరిపోవాలి. ఆ ఇద్దరివీ రెండు విభిన్న శైలులు. ఐనా దేనికదే ఉత్కృష్టమైనది. ఆ మహనీయుల మధ్యలో తన కవిత పేలవంగా ఉండిపోరాదు. నన్నయ కవిత్వంలోని మృదు సంస్కృత పదాల బాహుళ్యమూ, ప్రసన్నతా; తిక్కన శైలిలోని నాటకీయతా, నిరాడంబరంగా, నిసర్గంగా ఉంటూనే ప్రౌఢిమను నింపుకున్న అద్వితీయ ధోరణీ; ఈ రెంటిలో దేన్నీ వదలడం కుదరదు. ఎఱ్ఱనకు నన్నయ అన్నా, తిక్కన అన్నా మహా గౌరవం. వారిపేర్లు వింటే చాలు, పరవశించేంత మన్నన. వారు ‘ఆద్యులు, అబ్జాసనకల్పులు’. వారి కవిత్వాన్ని హృద్గతం కావించుకున్నాడు. మరీ తిక్కననైతే ‘తను కావించిన సృష్టి తక్కొరుల చేతంగాదు’ అని స్పష్టమైన అభిప్రాయం చెప్పాడు. అరణ్యపర్వం నన్నయ ప్రారంభించాడు కాబట్టి ఆయన పేరుతోనే వ్రాసి పూర్తి చేద్దామనుకున్నాడు. ‘నన్నయభట్ట మహాకవీంద్రు సరస సారస్వతాంశ ప్రశస్తి తన్ను చెంది’నట్లు అనుభూతి పొందినాడు. అందుకని ‘తత్కవితా రీతియు గొంతదోప-తద్రచనయకా’ అరణ్యపర్వ శేషపూరణకు ఉపక్రమించాడు. సందేహం లేదు. ఆ కార్యం జయప్రదంగా నిర్వహించాడు.

ఎఱ్ఱన గొప్ప వినయ సంపన్నుడు. నన్నయ తిక్కనల ఎడల ఆ వినయం మరీ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అది అతి వినయం ధూర్త లక్షణం లాంటిది కాదు. కొందరు తమ గర్వాన్ని వినయంగా ప్రదర్శిస్తుంటారు. ఇది అలాంటిది కాదు. తన సమర్థత తాను ఎరిగి, మరి ఇరువురు మహా సమర్థులతో సహమాన్యత పొందగోరుతున్న ఒక మనీషి యొక్క నైజ వినయం. లేకపోతే ‘కతిపయాక్షర పరిగ్రహ జనితంబైన నైసర్గిక చాపలంబు కతంబున’ అనీ, ‘రాయంచలు గూయుచుండ క్రౌంచమును నావల కూయదొడంగు భంగి’ అనీ, చెపుతూ ‘ప్రౌఢాంచిత శబ్దసారులు మహాకవులాద్యులు కావ్య శయ్య గీలించిన కీర్తి సంగసుఖలీలకు నేనును కాంక్షజేసితిన్’ అనగలడా! కీర్తిసంగ సుఖలీలకు నేనూ కాంక్షించాను అని అనడం ఆయన సహజ మానవీయ స్వభావం. అరమరికలు లేని ఆయన అంతరంగానికి అద్దం పడుతున్నది.

ఎఱ్ఱన భారతారణ్యపర్వ శేషాన్ని నన్నయభట్టులాగా ప్రారంభించి క్రమంగా తిక్కన సోమయాజి శైలితో ముగించాడని కొందరు పెద్దలు చెపుతారుగాని అంత స్పష్టంగా విభాజనం చేయలేమనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇద్దరి పద్యాల శైలీ ముందూ వెనకా అని లేకుండా చాలా చోట్ల కనిపిస్తాయి. అయినా నన్నయ శైలీ తిక్కన శైలీ అని అంటం పోలికకేగాని ఎఱ్ఱన పద్యాలు ఆ కవులకు అనుకరణలు కావు. ఆయన స్వీయ ప్రతిభాజనితాలు. ఖచ్చితంగా ఎఱ్ఱాప్రగడ పద్యాలు అని తన ముద్రను కనిపించీ కనిపించకుండా చూపించడం కేవలం తాను నిర్ణయించుకున్న అసిధారా చలన ధోరణి వల్లనే. చదువుతుంటే ప్రాణం లేచొచ్చేంత ముచ్చటగా ఉండే పద్యాలు వ్రాశాడు ఎఱ్ఱన కవి. ఉదాహరణకు పై పద్యం చూడండి: ‘స్ఫురదరుణాంశు రాగరుచి, పొంపిరివోవు – నిరస్తనీరదావరణములు, వైభవజృంభణము – వాసర ముఖంబులు లాంటి పదబంధాలు పద్య ధారనూ ధోరణినీ ఎంతో హాయిగా సంపద్వంతం గావించాయనిపిస్తుంది.

ఎఱ్ఱన పద్య శైలికి మరో ఉదాహరణ మనవి చేస్తాను. పాండవులు ఆశ్రమంలో లేనపుడు ద్రౌపది ఒంటరిగా ఉండగా సైంధవుడు వచ్చి కామించి, తిరస్కరించబడి, ఆమెను బలాత్కారంగా తన రథం మీద పెట్టుకొని బయలుదేరుతాడు. ద్రౌపది కొంత ప్రకంపితచిత్త అవుతుందిగాని పెద్దగా భయపడదు. ఈ దౌర్భాగ్యుడు ఎట్లయినా తన భర్తల చేతుల్లో తన్నులు తింటాడని నమ్మకం ఆమెకు. అప్పుడు తన భర్తలను గురించి వాడికి చెపుతుంది. ధర్మజుని గురించి రెండు పద్యాల్లో, భీమార్జునులను గురించి చెరో పద్యంలో, మాద్రేయులిద్దరిని గురించీ ఒక వృత్తంలో వివరిస్తుంది. ఎంత అద్భుతమైన పద్యాలవి! విరాట పర్వంలో కీచకునితో తన భర్తలందరి పరాక్రమాన్ని గురించి ఒకే పద్యంలో ‘దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ‘ (తిక్కన) చెప్పిందిగాని, ఇక్కడ సమయముండటంవల్లా, సైంధవుడు కీచకుడంతటి భయంకరుడు కానందువల్లా, తమ ఉనికి వెల్లడౌతుందేమోననే భయం అప్పుడు లేనందువల్లా, తీరిగ్గా తన భర్తలను ఒక్కొక్కళ్ళను గురించి వివరించింది. అంతే కాదు, ఆమెకు తన భర్తల ఎడ ఉండే మహా ప్రేమాతిశయం వల్లా, వారి ఎడ ఉండే గౌరవం వల్లా, తనకు వారిపై ఉండే నమ్మకం వల్లా, అదే సందర్భంలో మళ్ళీ మరోసారి వాడికి పరిచయం చేస్తుంది. తన భర్తల వ్యక్తిత్వాలను మహాద్భుతంగా మూర్తి కట్టిస్తుంది. సంగతి తెలిసి వెంటపడి తరుముకుంటూ వచ్చే పాండవులను చూసి ‘వీరు నీ మగలేనా, వీరెవ్వరు ఏవిధమువారు చెపుమ’ అని అడిగితే, ‘అనాదర క్రోధ ఘూర్ణిత’ అయి ‘ఇంక వీరినెఱిగితేనియు నెఱుగకనుండితేనియు చేయునొండుగలదె’ అని ‘అయినను నన్నడిగితివి గావునం జెప్పెద నింతియగాని నీవలన నాకు భయంబించుకంతయు గలుగదు’ అని వారి మూర్తిమత్వాన్ని మురిసిపోతూ చెపుతుంది. ఈ రెండుసార్లూ చెప్పిన పద్యాలు మణిమకుటాయమానాలు. కొన్ని పద్యాలు అలా కుదిరిపోతాయి. నన్నయభట్టు ఉదంకోపాఖ్యానంలో ‘బహువన పాదపాబ్ధి’ ఆదిగాగల నాగస్తోత్రం చేసేటప్పటి పద్యాలూ, రామాయణ కల్పవృక్షంలో శ్రీరాముడు శివధనుర్భంగం కావించినప్పటి ఐదారు విశ్వనాథవారి పద్యాలూ, తిరుపతి వేంకట కవుల పాండవోద్యోగ విజయాల్లోని ‘చెల్లియొ చెల్లకో, అలుగుటయే ఎరుంగని, జెండాపై కపిరాజు, సంతోషంబున సంధి సేయుదురె’ అనే నాలుగు పద్యాలు–లాగా ఎఱ్ఱనగారి పైన పేర్కొన్న పద్యతతి అలా కుదిరిపొయ్యాయనిపిస్తుంది.

ఎఱ్ఱనగారికి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు వుంది. మనకాలంవారు ఏర్పాటుచేసిన కొలతబద్దల ప్రకారం చూస్తే భారతంగానీ హరివంశంగానీ ప్రబంధాలు కావు. అప్పటివారు ప్రబంధం అనే పదాన్ని కావ్యం అనే సామాన్యార్థంతోనే వాడారు. ఎఱ్ఱన వ్రాసిన కావ్యాల్లో నృసింహ పురాణము ఒక్కటే ప్రబంధం అనిపించుకునే కొలబద్దలకు సరిపోతుంది. అయినా నృసింహ పురాణం వ్రాయకముందే, భారతారణ్యపర్వ పూరణం వల్లనే ఆయనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు వచ్చింది. చూడండి: ‘ప్రబంధ పరమేశుడనంగ నరణ్యపర్వ శేషోన్నయ మంధ్రభాష సుజనోత్సవ మొప్పగ నిర్వహించితివి’ అని ఎఱ్ఱన తాతగారు ఎఱపోతన సూరిగారు అన్నారు.

ఎఱ్ఱన హరివంశంలోని పద్యాలూ, నృసింహ పురాణంలోని పద్యాలూ భాగవతంలో పోతన్నకు స్మరణీయాలూ, అనుసరణీయాలూ అయినవి. అందుకు అనేక ఉదాహరణలు చూపించవచ్చుగాని ఇది సందర్భం కాదు.

ఎఱ్ఱాప్రగడ రామాయణం కూడా రచించాడనీ, అది లభ్యం కావడంలేదనీ అంటారు. ఎఱ్ఱాప్రగడ రామాయణంలోవని ఒకట్రెండు పద్యాలు కొందరు లక్షణ కర్తలుదాహరించడమే ఈ అపోహకు ఆధారం. ఆ ఊహ నిజమై, ఇరవైయవ శతాబ్దపు తొలి సంవత్సరాల్లో హఠాత్తుగా నన్నెచోడుని కుమారసంభవం ప్రత్యక్షమైనట్లు ఎఱ్ఱన రామాయణం కూడా మున్ముందెపుడైనా ప్రత్యక్షమైతే తెలుగు భాషా, తెలుగు జాతీ చేసుకున్న అదృష్టం పండినట్లే.

ఎఱ్ఱనను కేవలం నన్నయ తిక్కనల మధ్య కొంతభాగాన్ని అతుకువేసినవాడిగా చూడగూడదు. నన్నయ తిక్కనలతో సమాన స్కంధుడైన మరో మహాకవి కవిత్వం కేవలం అతుకు కాదు. అదీ మూడున్నర ఆశ్వాసాల విస్తృతి కలిగిందే. అతుకులు వేసిన కవులూ ఉన్నారు. వెలిగందల నారయ, ఏల్చూరి సింగన పోతన భాగవతంలో శిథిల పూరణం చేశారు. భాస్కర రామాయణంలో కూడా భాస్కరుడు కాక ఇతరులు చేయిచేసుకున్నారు. వారెవ్వరికీ రాని మహాకీర్తి ఎఱ్ఱనకూ ఆయన పద్యాలకూ వచ్చిందంటేనే ఆయన ప్రాముఖ్యం తెలుస్తుంది.

నేను చాలా గొప్పగా అభిమానించే కవుల్లో ఎఱ్ఱన మొదట మొదట్లోనే పేర్కొనబడే మహనీయుడు. ఆయన ప్రారంభించి సాగించిన దీర్ఘ కవితా ప్రయాణంలో తొట్టతొలి పద్యం–పైన పేర్కొన్నది–కేతనప్రాయమైందని చెప్పొచ్చు.

అన్నట్టు ఇంకో ముచ్చట చెప్పి ముగిస్తాను. నన్నయభట్టు ఆఖరి పద్యంలో ‘పాండు రుచిపూరములంబర పూరితంబులై’ అనే చోట రుచిపూరములం-బర పూరితములై అని విరిచి, తద్వారా ఇక భారతం పరులచే పూరించబడుతుందని ఆయన సూచించాడని కొందరన్నారు. అలాగే ‘స్ఫురదరుణాంశురాగరుచి’ అనే పద్యంలో, తాను ఇక రంగం మీదికి వచ్చానని ఎఱ్ఱన సూచించాడనీ అంటారు. అయితే అక్షరాల మధ్యలోంచి ఏదో ఒక వింతను బయటకు లాగే ప్రయాసే గాని అలాంటి సూచనలు వారు ఉద్దేశించి ఉండకపోవచ్చు!

మొన్న ఒక మిత్రుడు మాట్లాడుతూ శారదరాత్రుల పద్యంలో నన్నయ 16 రకారాలు ప్రయోగించాడు గమనించారా? అని అడిగాడు. అదొక తమాషా. అందులో పెద్ద విశేషం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. నన్నయే దానిని గమనించి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. నేను వెంటనే ఎఱ్ఱన ‘స్ఫురదరుణాంశు…’ పద్యంలో లెక్కిస్తే 15 రకారాలు ఉన్నాయి!
---------------------------------------------------------
రచన: చీమలమర్రి బృందావనరావు, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, February 13, 2019

రుబాయీలు


రుబాయీలు
సాహితీమిత్రులారా!

ఈ రుబాయిలను ఆస్వాదించండి...........

1
మెలకువలో మత్తు
మెలికతోవ తప్పి
నిలుస్తాను నీడలా
ఖయ్యాం!నాపని ఖాళీ

2
మంచురెల్లు పూలు
కంచుచేతుల తడిమినా
ఇంచుక లేదు తడి
ఖయ్యాం!నాపని ఖాళీ

3
ముందుకు పోనివ్వదు
సందు మొగదల కుక్క
పొందలేక పోయినాను
ఖయ్యాం!నాపని ఖాళీ

4
నిమిషమైనా ఆగని
ఈ మగ్గాల ధ్వని
మామూలునూలు,కానీ
ఖయ్యాం!నాపని ఖాళీ

5
కలగానే బ్రతికాను
కలలో మునిగితేలి
తెలవారుతోంది;చలి
ఖయ్యాం!నాపని ఖాళీ

6
పాదమంతాచితికి
దూదినిచ్చిన వారిని
ఆదమరచినాను
ఖయ్యాం!నాపని ఖాళీ

7
సోదాలన్ని మాని..
నాదొక్కటే మతమని
అదేవిధిగా నమ్మినాను
ఖయ్యాం!నాపని ఖాళీ

8
వానరాకగానక
స్నానమాడినాను
ఈనిలువనీటితోటి
ఖయ్యాం!నాపని ఖాళీ

9
ఈసడించినాను
పిసరంత తప్పు గని
మసిబారిన ముఖాన్ని
ఖయ్యాం!నాపని ఖాళీ

10
ఉలికిపడిలేచినాను
తొలగిన వస్త్రాలు
కళవళ పడినాను
ఖయ్యాం!నాపని ఖాళీ

11
పగటికోసం రాత్రి
సగంనిద్రలో తూలి
వేగిపోయినాను;వెలి
ఖయ్యాం!నాపని ఖాళీ

ఖైర్‌కు

రుబాయీలురాజామోదం,పరుల మెప్పు కోసం కాక ఆత్మచింతనలో భాగంగా రాసినవి. ఇవి బుద్ధిప్రధానాలు కావు, వీటిలో ఇంద్రియపారవశ్యత స్పష్టంగా,మూర్తంగా గోచరిస్తుంది. బలమైన శతక సంప్రదాయం ఉన్న మనకు కవిత్వంలోని ఈ పాయ కొత్త కాదు.ఐతే,ఇందులో నీతిబోధ అసలు కనిపించదు.చాలా అత్మీయంగా,ప్రియంగా చెబుతారు.ఒక రకమైన చార్వాకం అన్నమాట. ఏ అడ్డంకిని సహించరు,ఉన్నదున్నట్టు ముక్తంగా వ్యక్తం చేయడమే.ఈ ప్రక్రియను మక్కీకి మక్కీ (అలా అయే పక్షంలో అంత్యప్రాసలు,హడావుడి ప్రవేశిస్తాయి )కాకుండా, ఆంధ్ర పారశీకాలకు మధ్యేమార్గం అనగా,ఫార్సీ లోని ఆత్మీయగుణం,తెలుగు లోని నిసర్గ సౌందర్యం అవలంబించినాను.
-----------------------------------------------------------
రచన: తమ్మినేని యదుకులభూషణ్, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, February 12, 2019

శబ్దాలంకారపు సంగీత మాధుర్యం


శబ్దాలంకారపు సంగీత మాధుర్యం

సాహితీమిత్రులారా!


సీ.
లలనా జనాపాంగ వలనావసదనంగ
తులనాభికాభంగ దోఃప్రసంగ
మలసానిల విలోలదళ సాసవ రసాల
ఫల సాదర శుకాలపన విశాల
మలినీ గరుదనీక మలినీకృత ధునీ క
మలినీ సుఖిత కోకకులవధూక
మతికాంత సలతాంత లతికాంతర నితాంత
రతికాంత రణతాంత సుతనుకాంత
తే.
మకృత కామోద కురవ కావికల వకుల
ముకుల సకల వనాంత ప్రమోద చలిత
కలిత కలకంఠకుల కంఠకాకలీ వి
భాసురము వొల్చు మధుమాస వాసరంబు!
పదాలకుండే సౌందర్యాన్ని ఎరిగి, వాటిని ఉచిత స్థానంలో పొదిగి, ఆ సౌందర్యాన్ని దిగంత ప్రదర్శనం చేసే కళను స్వాధీనం చేసుకున్న కవి వ్రాసింది ఈ పద్యం. శబ్దాలొలికించే సంగీత మాధుర్యాన్ని ఆకళింపు చేసుకుని, వాటి ప్రవాహపు ఒరవడిని ఒక క్రమవిభక్తమూ, సమవిభక్తమూ చేసి, పద్యగతిని హయగతిలోనూ, గజగతిలోనూ నిబంధించగలిగిన కవి వ్రాసిందీ పద్యం. తెలుగు సాహిత్యంలో బాగా ప్రసిద్ధమైన వాటిలో ఒకటైన ఈ పద్యాన్ని వ్రాసింది భట్టుమూర్తి అనే నామాంతరం కలిగిన రామరాజభూషణ కవి. ఆయన వసుచరిత్రలోని వసంత వర్ణన ఇది.

కవి ఏమి చెపుతున్నాడు అనేది తరవాతి సంగతి. పద్యం చదువుతుండగానే శభాష్ అనిపించే పద్యం ఇది. సీస పద్యంలోని తొలి మూడు పాదాల్లో ఒక్కోదాంట్లో నాలుగేసి అంత్యప్రాసలూ, నాలుగోపాదం ఎనిమిది అంత్యప్రాసలూ పొదిగించి గొప్ప శ్రవణసౌఖ్యాన్ని కలిగించాడు కవి. పై ఎత్తుగీతిలో రెండుమూడేసి అక్షరాలను అవికల, వకుల, ముకుల, సకల- అనీ, చలిత కలిత- అనీ, కలకంఠ కులకంఠ- అనీ, భాసురము వాసరము- అనీ పునరావృత్తి గావించి, చక్కని శబ్దాలంకారంతో రమణీయతను దృశ్యమానం కావించాడు. భట్టుమూర్తి వసుచరిత్రములో పరమ సంగీతమయంగా శిల్పించిన వందలాది పద్యాల్లో మకుటాయమానమైనదీ పద్యం. అన్నట్టు భట్టుమూర్తి సంగీత విద్వాంసుడు కూడానట. అందుకే ఆయన పద్యాలన్నీ సంగీతం వినిపిస్తుంటాయి. కొందరు సంగీతవేత్తలు, ఈతని పద్యాలకు రాగాల వరసలు కట్టి వీణమీద వాయించేవారట.

రామరాజభూషణుడు కృష్ణరాయల భువనవిజయంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకడు అంటారు. ఈయన అల్లసాని పెద్దన వద్ద ప్రత్యక్ష శిష్యరికం చేశాడు అంటారు. వసుచరిత్రము తిరుమలదేవరాయలు అనే రాజుకు అంకితం ఇవ్వబడింది. కృష్ణరాయలు 1530 ప్రాంతాల్లో మరణిస్తే, ఆయన కుమార్తె భర్త అయిన అళియరామరాజు విజయనగర సామ్రాజ్యంలో పెత్తనం చేస్తూ వచ్చాడు. కృష్ణరాయల మృతి అనంతరం మిగిలిన దిగ్గజాలు చెల్లాచెదురైపోయారేమోగానీ భట్టుమూర్తి మాత్రం రామరాజును కనిపెట్టుకొని ఉండి రామరాజభూషణుడైనాడు. 1565లో తల్లికోట యుద్ధం విజయనగర సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసింది. రామరాజు మరణించాడు. ఆయన తమ్ముడైన తిరుమలరాయలు పగ్గాలు స్వీకరించి రాజ్యంలో కొంత స్థిమితం సాధించినట్లున్నాడు. అయితే రాజధానిని విజయనగరం నుంచి పెనుగొండకు మార్చింది ఈయనే. ఈయన పట్టాభిషేకం కూడా పెనుగొండలోనే జరిగింది. ఈ తిరుమలరాయలే వసుచరిత్రమునకు కృతిభర్త.

వసుచరిత్రము తెలుగు పంచకావ్యాల్లో ఒకటి. కవిత్రయ భారతమూ, పోతన భాగవతమూ తరువాత ఈ పంచకావ్యాలూ సాహిత్య విద్యార్థికి అవశ్యపఠనీయాలట. ఆ పంచకావ్యాలు: మనుచరిత్రము, వసుచరిత్రము, పారిజాతాపహరణము, పాండురంగ మాహాత్మ్యము, శృంగారనైషధము. సంస్కృతంలోనూ వ్యాసవాల్మీకుల రచనల పిమ్మట చదివి తీరాల్సిన పంచకావ్యాలంటూ రఘువంశము, కుమారసంభవము, మేఘదూతము, కిరాతార్జునీయము, శిశుపాల వధము అనే ఐదింటినీ చెపుతారు. అయితే ఈ ఎంపిక శిలాక్షరమేమీ కాదు. ఎవరికి ఇష్టం వచ్చినవి వారు ఆ జాబితాలో కలుపుతూ మరోదాన్ని తొలగిస్తూ వుంటారు, వారి వారి ఇష్టాలనుబట్టి.

భట్టుమూర్తి పద్యాల్లోని పదాల పోహళింపు సొగసునూ, శబ్దాలంకారాల వైచిత్రినీ, గేయ సౌలభ్యపు సేరునూ చెప్పాలంటే ఆయన వసుచరిత్రములోని వందలాది పద్యాలను ఉటంకించాల్సివస్తుంది. అన్ని వందల పద్యాలు అంత నైపుణితో శిల్పించడం సామాన్య కవికి సాధ్యం కాదు. భట్టుమూర్తిలాంటి విశేష ప్రతిభాశాలికే అది సాధ్యం. ఆయన శైలిని అనుకరించడానికి ఎందరో ప్రయత్నాలు చేశారు. ఎన్ని పిల్ల వసుచరిత్రలో వచ్చాయి. కాని, ఆయన పద్యరీతిని సాధించినవారు లేరు. ఎంతమందిచేతనో అనుకరించబడటం నిస్సందేహంగా భట్టుమూర్తి గొప్పతనమేగదా. పిల్ల వసుచరిత్రలు వచ్చాయిగాని, పిల్ల మనుచరిత్రలూ, పిల్ల పాండురంగమాహాత్మ్యాలూ, పిల్ల పారిజాతాపహరణాలూ రాలేదు మరి.

కొన్ని మనోహరమైన పద్యాలను సూచించి వదిలిపెడతాను. తెలుగు సాహిత్యం మీద అభిరుచి వుండి, భట్టుమూర్తి కవిత్వంతో అంత ఎక్కువ పరిచయం లేనివారి పిపఠిషను ఎగసనద్రోయడానికి పనికివస్తాయి.

ఇమ్ములై మరుహజారమ్ములై పొదలుండ పూజవికలు వేఱ పూనవలదు
తెప్పలై నెత్తావి కుప్పలై పుప్పొళ్ళు రుల గందవొడి త్రోవ జిలుకవలదు
ఒక చాయ ననపాయ పికగేయ సముదాయ, మొక సీమ నానా మయూర నినద
మొకవంక నకలంక మకరాంకహయహేష, లొక క్రేవ వనదేవ యువతిగీతి
కనకవల్లిమతల్లికల పెంపు జడగుంపు, పుష్పపరాగసంభూతి భూతి
కమనీయ శాఖాప్రకాండంబు దండంబు, తరుణ పల్లవకోటి ధాతుశాటి
మందయానము నేర్పు నిందిందిరాజీవ రాజీవరాజన్మరాళ రాజి
కలికి పల్కులు నేర్చు లలిత నానావాసనావాస నికట కానన శుకాళి
తలిరుబ్రాయమువాని వలరాజు నలరాజు నలరాజు దెగడు సోయగమువాని
పసిడి చాయలవాని బగడంబు జగడంబు జగడంబుగల మోవి సొగసువాని
ఏపారు పొదరిండ్ల నాపాటలాశోక దీపార్చి కనక కలాపమరసె
సాలావలులు దాటి ఏలాలతావార బాలాతతి పరాగ పటము లూడ్చె
పవమాన మానస ప్లవమాన కైరవ చ్యవమాన రజము మైనంట దివురు
గరసారసాగ్ర తామరసాతిసాంద్ర సీధురసాప్తి కన్నీరు దుడువగోరు
ఇలా చెప్పుకుంటూనే పోతుండవచ్చు. ఇలాంటి పద్యాలు చదివి పరవశించకుండా ఉండటం సాధ్యమా? ముఖ్యంగా తన కౌశలం విశాలంగా చూపడానికి సీసాలను ఎన్నుకొన్నట్టు కనిపిస్తుంది కాని, ఆయన వృత్తాలు కూడా మనోజ్ఞమైనవి చాలా ఉన్నాయి.

ఈయన కేవలం అందంగా పద్యం వ్రాయడంలోనే కాక శ్లేషను కూడా రమ్యంగా మెప్పింపగలిగిన ప్రోడ. పింగళి సూరన రాఘవ పాండవీయం అని రామాయణ భారత కథలు రెండూ వచ్చేట్లు కావ్యం వ్రాస్తే, ఈయన హరిశ్చంద్ర నలోపాఖ్యానం వ్రాశాడు. ఒక్క పద్యం రసోచితంగా శ్లేషలో ఒప్పించడమే మహా కష్టమైతే, రెండు దీర్ఘ కథలను, అవీ ప్రసిద్ధమైన వాటిని, ఒకే కావ్యంలో రెండూ చెపుతూ, కవనంలో మెప్పించడం సామాన్యమైన నైపుణ్యమా! వసుచరిత్రములోనే ఒక పద్యం కవి శ్లేషచమత్కార వైఖరి వెలార్చేది మనవి చేస్తాను. నాయిక గిరిక తన చెలికత్తెలతో వనంలో ఉండగా, వసురాజు నర్మ సచివుడు (విదూషకుడు) మునివేషంలో వచ్చి, ఏమీ తెలియనట్లు- ఈమె ఎవరు? సింధు నందన(లక్ష్మీదేవి) లాగానూ, అచలేంద్ర నందన (పార్వతీదేవి) లాగానూ ఉంది, ఈమె పావన కులగోత్రభూతి తెలపండి (అంటే ఆమె పుణ్యవంశ వైభవాన్ని గురించి చెప్పండి) అని అడుగుతాడు. అప్పుడొక చెలికత్తె ‘అయ్యా, సింధు నందన, అచలేంద్ర నందన అని అంటూనే ఎవరు అని అడగడం మీ కూరిమి పెంపునగదా’ అంటూ, ‘నిజంగా ఈమె సింధు నందనే – శుక్తిమతీ నది కూతురు (సింధు అంటే నది అని కూడా అర్థం), అచలేంద్ర నందనే – కోలాహల పర్వతం కూతురు (అచలేంద్రం అంటే గొప్పపర్వతం)’ అని వివరించి, ఆమె ‘పావన కులగోత్రభూతి’ని – అంటే నీటికీ (పావనం అంటే నీరనే అర్థం కూడా ఉంది), కొండకూ (కులగోత్రం అంటే పర్వతం) పుట్టిన వైనాన్ని వివరిస్తుంది. ఇలాంటి అందమైన శ్లేషలు చాలా పద్యాల్లో కనిపిస్తాయి.

అల్లసాని పెద్దన వ్రాసిన మనుచరిత్రమునూ, దిగ్దిగంతాల్లో ఆ కావ్యానికి వచ్చిన ప్రశస్తినీ చూసిన తర్వాత, అంతకన్నా గొప్ప ప్రబంధాన్ని, అంతకన్నా గొప్పగా వ్రాయాలనుకున్నాడు భట్టుమూర్తి. ప్రారంభించాడు. పెద్దన హిమాలయాల్లో ఒక కొనను వర్ణిస్తే; తాను కోలాహల పర్వతం మీది ఒక కొనను వర్ణించాడు. ప్రవరుని ఒక తాంబూలపు తావి ఆకర్షిస్తే; వసురాజును ఒక గానం ఆకర్షించేట్లు చేశాడు. ప్రవరుణ్ణి చూసిన వరూధిని అతని అందానికి ముగ్ధురాలై ఇతన్ని ‘నేరెటేటియసల్ దెచ్చి, నీరజాప్తు సానబట్టిన రాపొడి జల్లి మెదిపి, పదను సుధనిడి జేసెనో పద్మభవుడు’ అనుకుంటే; గిరికను ‘మేటిజమ్మేటి యసట గ్రొమ్మించు మించు, బొదవి ప్రతాపాగ్ని పుటమువెట్టి, తమ్మిగద్దియ దాకట గ్రెమ్మి యిట్టి కొమ్మ గావింపబోలు నెత్తమ్మి చూలి’ అనిపిస్తాడు. అక్కడ బ్రాహ్మడు వరూధినిని చూడగానే ఎలావుందో ఒక వృత్తంలో ‘శతపత్రేక్షణ, చంచరీక చికురన్, చంద్రాస్య, చక్రస్తనిన్, నతనాభిన్’ అంటూ వర్ణిస్తే; ఇక్కడ రాజసఖుడైన బ్రాహ్మణుడు గిరికను చూచి ‘తరుణి, తమోవినీలకచ, తామరసామరసోదర ప్రభన్, దరళవిలోచనన్, దత నితంబ, దటిన్నిభ గాత్ర’ అంటూ అలాగే అంగాంగ వర్ణన చేశాడు. భట్టుమూర్తి వ్రాసిన ఆ పద్యాలన్నీ గొప్పగానే ఉన్నాయిగాని ఇంత సమర్థత కల్గిన తాను మరొకరిని అనుకరిస్తున్నానే అనే సంగతి గమనంలోకి రానీయలేదు. ఇంకా చాలా చోట్ల ఈ అనుకరణ కనిపిస్తుంది. ఈ అనుకరణప్రియత్వం భట్టుమూర్తికి నిజంగానే కొంత లాఘవం ఆపాదించింది అనేది కాదనలేని నిజం. కొద్దిపాటి అనుకరణ అయితేనేం అమోఘమైన కవిత్వంగదా, అనేవాళ్ళూ, ఎంత అద్భుతమైనా అనుకరణ అనేది స్వీయ గౌరవం తగ్గిస్తుందిగదా అనేవాళ్ళు కూడా ఉన్నారు.

తన పద్యాల్లో శబ్ద సౌందర్యాన్నీ, శబ్ద ప్రసన్నతనూ, విస్ఫోట శక్తినీ, పదప్రయోగ కుశలతనూ బాగానే ప్రదర్శించాడు గాని సూక్ష్మేక్షికకు శబ్ద ప్రాధాన్యం భావ ప్రాధాన్యాన్ని బాగానే మరుగుపరచిందనిపిస్తుంది.

ఇంతకూ వసుచరిత్రంలో ‘కథ’ అనబడే పదార్థమేమీ లేదు. గిరికా వసురాజులు కలుసుకోవడమూ, ప్రణయమూ, విరహమూ, చెలికత్తె దౌత్యమూ, పెండ్లీ–ఇంతే. పూర్వరంగంగా శుక్తిమతీ కోలాహలుల కథ కొంత ఉన్నది. ఈ శూన్యం చుట్టూ ఎంత అందమైన కవిత్వం అల్లాడు భట్టుమూర్తి అనుకుంటే మహాశ్చర్యం కలుగుతుంది. భట్టుమూర్తిని చదవకపోతే, తెలుగు సాహిత్యంలోని ఒక మనోహర ఘట్టాన్ని గమనించకుండా వెళ్ళిపోయినట్లే.

ఇక మనం ఉల్లేఖించుకున్న పద్యాన్ని గురించి కొద్దిగా.

లలనా జనాపాంగ/ వలనావసదనంగ/ తులనాభికాభంగ అంటూ అన్ని పాదాల్లోనూ సమాసాలను సరిగ్గా విరవడం కుదరదు. అలసానిల, విలోల దళ, సాసవ, రసాలఫల, సాదర, శుక, ఆలపన, విశాలము అనీ; అలినీ, గరుత్ అనీక, మలినీకృత, ధునీ, కమలినీ సుభిత, కోకకుల, వధూక అనీ విడదీసుకుని చదువుకుంటేగాని అన్వయం అర్థంకాదు. ఇది వసంతకాలపు వర్ణన అనుకున్నాంగదా, అది ఎలా ఉందంటే:

లలనాజన అపాంగ వలనా వసత్, అనంగతులన, అభికా, అభంగ దోః ప్రసంగము: తరుణుల కడగంటి చూపుల కదలికల్లో కాపురముండే మన్మథ సములైన కాముకులు కావించే బిగి కౌగిలింతలను కలిగి ఉన్నది. (మొదటి పాదం)

అలస అనిల విలోల దళ సాసవ రసాలఫల సాదర శుక ఆలపన విశాలము: మెల్లగా వీచే పిల్లగాలికి మామిడి చెట్ల చివురాకులు కదుల్తుండగా తీయ తేనియల్లాంటి మామిడిపళ్ళ రసాన్ని ఆస్వాదిస్తూ గోముగా పలికే చిలుకలు కలిగి ఉన్నది. (రెండో పాదం)

అలినీ గరుత్ అనీక మలినీకృత ధునీ కమలినీ సుభిత కోకకుల వధూకము: తుమ్మెదగుంపుల రెక్కల వల్ల నల్లబడిన సరోవరాల్లోనూ, నదుల్లోనూ ఉన్న తామర కొలనుల్లో సుఖంగా చొక్కుతున్న ఆడ చక్రవాక పక్షులు కలిగినది. (మూడవ పాదం)

అతికాంత, సలతాంత లతికాంతర, నితాంత, రతికాంత రణతాంత సుతనుకాంతము: అత్యంత మనోజ్ఞంగా తీవతీవకూ కుసుమించి వికసించిన పూలుగల పొదరిండ్లలో ఎడతెగకుండా జరిపే రతికేళి వలన అలసిన ప్రేమికులు గలది. (నాలుగో పాదం)

వనమంతా గోరింటలు పూచాయి. పొగడలు మొగ్గలు వేశాయి. కోయిలలు అవ్యక్తమధురంగా గానం చేస్తున్నాయి. మధుమాస వాసరము అంటే వసంత సమయము భాసురంగా ఒప్పి ఉన్నది.

ఇదీ పద్యం యొక్క పిండితార్థం.

ఏమాటకామాటే చెప్పుకోవాలిగదా! ఈ పద్యంలో వసంతాన్ని గురించి భట్టుమూర్తి కొత్తగా చెప్పిందేమీ లేదు. ఒక క్రొత్త ఊహగానీ, ఉత్ప్రేక్షగానీ ఏమీ లేదు. వసంతం గురించి ఏ కవి చెప్పినా యువతుల కడగంటి చూపులూ, ప్రేమ ప్రసంగాలూ, పొదరిండ్ల రతికేళీ, మావి చివుర్లూ, తేనె మామిడిపండ్ల రసాన్ని గ్రోలి అవ్యక్త మాధుర్యంతో పలవరించే చిలుకలూ, కోయిలల గానాలూ, గోరింటలూ, పొగడలూ ఇవే చెపుతాడు. భట్టుమూర్తి కూడా ఇవే చెప్పాడు. కానీ చెప్పడం ఎంత అందంగా చెప్పాడు! ఎంత అద్భుతంగా, ఎంత స్వభావోక్తి రమ్యంగా, ఎంత అనితరసాధ్యంగా చెప్పాడు! అందుకే ఈ పద్యం అంత ప్రసిద్ధి పొందింది.

ఇలాంటి పద్యాలను ఆస్వాదించాలంటే ఓపిక, తీరిక రెండూ చాలా అవసరం. ఉదాహరణకు, మొదటి పాదం మాత్రమే తీసుకుని దాన్ని మనసులో చర్వణ చేసిన కొద్దీ అందులో కవి చెప్పక చెప్పిన విషయాలెన్నో స్ఫురిస్తాయి. స్త్రీల కడకంటి చూపులలో మన్మథుడు ఉన్నాడన లేదు కవి! వారి కడకంటి చూపుల కదలికల్లో ఉన్నాడన్నాడు. అంటే ఆ చూపుల కదలికల్లో కోరిక ఉంది, తమ ప్రియుల గూర్చిన వెదుకులాట ఉంది. మనసుని మథించే మదనుడు ఆ కడకంటి చూపులను కూడా అంతగా చలింపజేశాడన్న మాట! అలాగే అక్కడున్న కాముకులైన యువకులు, సాక్షాత్తుగా కాముని పోలిన వారు. యువకులను మన్మథునితో పోల్చడం మామూలు విషయమే. అది వారి సౌందర్య, యౌవనాల మహత్తును సూచించే పోలిక. ఇక్కడున్న యువకులు ఎలాంటి మన్మథుని పోలి ఉన్నారు? యువతుల కడకంటి చూపుల కదలికలలో కాపురమున్న మన్మథుని పోలి ఉన్నారు. అంటే ఆ యువతులకు కూడా వారు మన్మథుల వలెనే కనిపిస్తున్నారు. వారు ఆ యువతుల కడకంటి చూపులలో కాపురమున్నారు! ఇదంతా కలుపుకుని చూస్తే – ప్రియుల కోసం కోరికతో వెతుకులాడే యువతులు, వారి కంటికి చిక్కిన మదనుని వంటి కాముకులు, తుదకు వారి కలయిక సుఖాంతమై ఆ ప్రియుల బిగికౌగిళ్ళలో చిక్కువడ్డ యువతులు – ఇలా ఒక చలనచిత్రం కనులముందు కదలాడుతుంది.

ఈ కాలంలో చిలకలూ కనిపించవు, కోయిల పాటలూ వినిపించవు. తుమ్మెద గుంపులూ, తామర కొలనులు, గోరింటలూ, పొగడలూ, పూపొదలూ, ప్రకృతి ఒడిలో ఉవ్వెత్తున ఎగసే కోరికలతో ప్రేయసీప్రియుల గాఢాలింగనాలు, సంగమాలు – ఇవేవీ ఇప్పుడు సగటు మనిషికి తెలియని అనుభవాలు, అనుభూతులు. అందుకే అవి వట్టి పాతబడిన, పాచిపట్టిన మాటలుగా మిగిలిపోయాయి. మహా అయితే – యివి ఒకానొక కాలంలో యీ జాతి జీవన విధానంలోని కొన్ని లక్షణాలకు మాసిపోతున్న సాక్ష్యాలు మాత్రమే.

మనసుకి భావాలందక పోయినా, చెవులకందే శ్రుతి మాధుర్యం ప్రశస్తం. లలనాజనాపాంగ అనే పదం ఎంతో ముచ్చటగా ఉంది కదూ! అందుకే అన్నమయ్య కూడా తన ఒక కీర్తనలో ‘లలనా జనాపాంగ లలిత సుమచాపా’ అని గండవరంలోని బాలకృష్ణుడిని కీర్తించాడు. సాదా సీదా తెలుగు పదాలలోని పరమ సౌందర్యాన్ని తన కీర్తనల నిండా నింపిన అన్నమయ్యలాంటి మహాత్మునికి నచ్చిన మాటగల ఈ పద్యం ఎవరికైనా నచ్చకుండా ఎలా ఉంటుంది!
----------------------------------------------------------
రచన: చీమలమర్రి బృందావనరావు, 
ఈమాట సౌజన్యంతో

Monday, February 11, 2019

నా కుంచె రంగులు…


నా కుంచె రంగులు…సాహితీమిత్రులారా!


ఈ కవితను ఆస్వాదించండి...............

బంగారు వెలుగులు ఎర్రగా సూరీడు
రాచిలకల గుంపులు పచ్చగా ఆకాశం
నింపాదిగా పారుతూ నీలంగా ఏరు
పసుపు పచ్చని పూలు
రేకూ రేకూ విచ్చుకొంటూ

ఝుంఝుంఝుంఝుం
చెంగావిరెక్కల తుమ్మెదలు
తామరతూడు ఊయలబల్ల
వెండి చెన్నుల చిట్టి చేపపిల్ల
గాలిబుడగల తాళం వేస్తూ

తెల్లని జాజుల గంధం మోస్తూ పిల్లగాలి
వయ్యారంగా ఊగిసలాడే వంగపూలు
ఊసులలో తేలిపోతూ నల్లటి హంసల జంట
హరివిల్లు పానుపు పవ్వళిస్తూ మేఘమాల

అటూ ఇటూ ఎటూ వెలలేని
కదిలే రంగులు
వెలవెలబోతూ
కదలని నా కుంచె రంగులు.
---------------------------------------------------------
రచన: సాంఘిక, 
ఈమాట సౌజన్యంతో

Sunday, February 10, 2019

జిహ్వకో రుచి


జిహ్వకో రుచిసాహితీమిత్రులారా!

“ఎవ్వరైనా అరటి పండుని ఎలా తింటారబ్బా! తొక్క ఒలిచిన అరటి పండు ఆకారం చూస్తే చాలు, నాకు దానిని నోట్లో పెట్టుకో బుద్ధి పుట్టదు!” అంటూ అరటి పండు ఇష్టంగా తినే నా బోంట్లని చూసి ఆశ్చర్య పడ్డది ఒక గృహిణి.

నేను అప్పుడే నోట్లో పెట్టుకుని ఒక కొరుకు కొరికిన అరటి పండు ముక్కని మింగాలో కక్కాలో తెలియని తికమక పరిస్థితిలో పడ్డాను. అరటి పండు నాకు ఇష్టం. రోజుకో పండైనా తింటాను. అరటి పండు ఎంత ఇష్టమైనా ఎవ్వరైనా ప్రసాదం అంటూ చేత్తో చిదిమి, ఒక ముక్కని నా చేతిలో పెడితే నాకు తినబుద్ధి కాదు.

కొందరు అరటి పండు తొక్కంతటినీ ఒలిచేసి, తొక్కని పారేసి అప్పుడు పండుని తింటారు. కొందరు పండుని చక్రాలులా కోసుకుని, ఒకొక్క చక్రాన్నే ఫోర్కుతో తింటారు. వెంకట్రావు పండు మొదటి భాగాన్నీ, చివరి భాగాన్నీ విరచి పారేసి, మధ్య భాగాన్నే తింటాడు. సూజన్ ‘మీట్ అండ్ పొటేటో’ పిల్ల. ఆమెకి పళ్ళల్లో కాని, కాయగూరల్లో కాని గింజ కనబడ కూడదు. ఒక సారి ఇండియన్ రెస్టారాంటుకి తీసికెళ్ళి బైంగన్ బర్తా తెప్పిస్తే వేలేసి ముట్టుకో లేదు – వంగ గింజలని చూసి. కడుపుతో ఉన్న కేటీ సాల్ట్ బిస్కట్ మీద పీనట్ బటర్ రాసుకుని, దాని మీద టూనా ఫిష్ పెట్టుకుని, దాని మీద నిలువుగా కోసిన అరటి పండు బద్దని పేర్చి తింటూంటే చూసే వాళ్ళకి కడుపులో తిప్పిందంటే తిప్పదూ?

పళ్ళన్నిటిలోనూ అగ్రగణ్యమైన మామిడిపండు అంటే మా అన్నయకి ఇష్టం లేదు. కాదు, కూడదు అని మొహమాట పెడితే కోసుకు తినే ఏ బంగినపల్లి పండో ఒక ముక్క తింటాడు తప్ప పిసుక్కు తినే పళ్ళంటే అస్సలు పడదు. మూతి చిదిమి, జీడి పిండేసి, సువర్ణరేఖ పండుని తింటూ ఉంటే రసంతో పాటు మామిడి పండు గుజ్జు చిన్న చిన్న ముక్కలుగా నోట్లోకి వస్తూ ఉంటే దాని రుచితో స్వర్గానికి ఒక మెట్టు దిగువకి చేరుకుంటాను నేను. అదే పండుని నోట్లో పెట్టుకుని వాంతి చేసుకున్నంత పని చేసేడు మా అన్నయ్య.

లోకో భిన్న రుచి అన్నారు. మనుష్యులు ఎన్ని రకాలు ఉన్నారో వాళ్ళ రుచుల ఎంపకాలు, తిండి అలవాట్లు కూడ దరిదాపుగా అన్ని రకాలూ ఉన్నాయి. మా పెద్దన్నయ్య కూతురు లక్ష్మి చిన్నప్పుడు కందిగుండ అన్నంలో కలుపుకు తినేది తప్ప కంచంలో ఉన్న మరొక వస్తువుని ముట్టుకునేది కాదు. నూనెలో వేసి సాతాళించిన చిక్కుడు కాయలని తప్ప మరేదీ ముట్టుకునేవాడు కాదు మా అబ్బాయి సునీలు. యోగర్టు అంటే అసహ్యించుకునేవాడు. ఇప్పుడు నాకు అరటి పండు ఎంత ఇష్టమో వాడికి యోగర్టు అంత ఇష్టం. వయస్సుతో పాటు రుచులు, అభిరుచులు మారతాయి మరి.

ప్రజలని వేలి ముద్రలతో ఎలా పోల్చుకో వచ్చో అలాగే వ్యక్తుల మధ్య తారతమ్యాన్ని “నాలుక ముద్రలు” తో పోల్చుకో వచ్చేమోనని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. వేలి ముద్రలు జీవితాంతం ఒకేలా ఉంటాయి. కాని, “నాలుక ముద్రలు” జీవితంలో క్రమేపీ మారుతూ ఉంటాయి. “నాలుగు రుచులూ తినటం అలవాటు చేసుకోవాలి” అంటూ మా మామ్మ మా చేత తను కాచిన వేప పళ్ళ పులుసుని బలవంతాన్న తినిపించేది. అప్పుడు ఈసురో మంటూ ఆ చేదు పులుసు తిన్నా, ఇప్పుడు అలాంటి పులుసు ఎవ్వరైనా కాచిపెడితే తిందామని కలలు కంటూ ఉంటాను.

కారానికి రుచేమిటి అని మీరనొచ్చు కానీ, అలవాటు పడని నోటికి కారం కారంగానే అనిపిస్తుంది; అలవాటు పడ్డ తర్వాత కారంలో కారం కంటే “రుచిని” నాలుక ఎక్కువగా పోల్తి పడుతుంది. కాఫీ కాని, కారం కాని, కాకరకాయ వేపుడు కాని – ఇవేవీ కూడా మొదటి సారి రుచించవు. అలవాటు పడ్డ తర్వాత వాటిని వదలబుద్ధి కాదు. కుంకుడుకాయ రసంలా ఉందని ఒకప్పుడు బీరుని చీదరించుకున్న నేను ఇప్పుడు బీరులలో రకరకాలని గుర్తించి, వాటిలో తేడాలు చెప్పగలను.

ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉన్నట్లే ఆ వ్యక్తి తినే ఆహార పదార్ధాలలలోనూ, తినే విధి విధానాలలోనూ కూడ ఒక ‘వ్యక్తిత్వం’ ఉంటుంది. మనం ఎక్కువ ఇష్టపడి తినే వస్తువులు, మనకి ఇష్టం లేని వస్తువులు, మనకి అసహ్యమైన వస్తువులే కాకుండా మనం తినే పదార్ధాలని మనం తినే విధానం కూడ మన జఠర వ్యక్తిత్వాన్ని (గేస్ట్రొనోమిక్ పెరసనాలిటీ) వెల్లడి చేస్తుంది. కొన్ని ఉదాహరణలు చెబుతాను. “నేను శాకాహారం అయినంత సేపూ, ఏది ఎలా వండి పెట్టినా సమదృష్టితో రుచులు ఎంచకుండా తింటాను” అని అందరితోటీ చెప్పేవాడిని. అంటే నాకు ఒక జఠర వ్యక్తిత్వం అంటూ లేదని గొప్పగా చెప్పుకునేవాడిని. నాకు పెళ్ళయిన తర్వాత నా శ్రీమతి వచ్చి, నేను అనుకున్నట్లు నాకు అన్నీ సాయించవనిన్నీ, నాకు కూడా ఇష్టమైనవీ, ఇష్టం లేనివీ ఉన్నాయనీ సోదాహరణంగా రుజువు చేసింది. నేను ఎప్పుడు ఇండియా వెళ్ళినా నా అక్క చెళ్ళెళ్ళు, “నీకు చేగోడీలు ఇష్టంరా, అందుకని చేసేం” అని చేసి పెట్టేవరకూ నాకు చేగోడీలు ఇష్టమనే తెలియదు. అయినా ఇంత అమెరికా వచ్చీ ఏ ఫేషనబుల్ గా ఉన్న తిండినో ఇష్టపడాలి కానీ ఈ నాటు వంటకం ఇష్టం అని నలుగురికీ తెలిస్తే నా పరువు పోతుందో ఏమో.

ఈ జఠర వ్యక్తిత్వం అనే ఊహనాన్ని వ్యక్తిగత స్థాయి నుండి జాతీయ స్థాయికి లేవనెత్తవచ్చు. మానవుడు సర్వాహారి. దేశ, కాల పరిస్థితులని బట్టి ఏది దొరికితే అది తిని బతకనేర్చిన జీవి. అయినా సరే కొన్ని కొన్ని జాతులు ఒకొక్క రకమైన జఠర ముద్రని ప్రదర్శిస్తాయి. హిందువులు ఆవుని తినరు. ముస్లింలు పందిని తినరు. కొరియా వారు కుక్కలని, చైనా వారు పాములనీ తింటారు కాని, అమెరికాలో కుక్కలని, పాములని తినరు. కీటకాలనీ, వానపాములనీ చాల మంది తినరు. ఫ్రాంసులో నత్తలని గుల్లల పాళంగా వేయించి, దాని మీద వెల్లుల్లి జల్లి ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి ఆయా సంస్కృతుల జఠర వ్యక్తిత్వాలు.

ఈ విపరీతమైన ఉదాహరణలని అటుంచి, మనం సర్వ సాధారణంగా తినే వస్తువుల సంగతి చూద్దాం. మా చిన్న బావ కొత్తిమిర దుబ్బు కనిపిస్తే చాలు మైలు దూరం వెళ్ళిపోతాడు. ఇలాగే బెండ కాయలు, టొమేటోలు, బ్రోకలీ, కేబేజీ, కొబ్బరికాయ మొదలైనవి తినలేని వాళ్ళు మనకితరచు తారస పడుతూ ఉంటారు.

ఈ అయిష్టతలు అన్నీ పుట్టుకతో వచ్చినవి కావు. పిల్లలందరికీ పుట్టగానే తెలిసేది తల్లి పాల రుచి. తర్వాత నెమ్మదిగా ఆవు పాలో, డబ్బా పాలో మొదలు పెట్టేసరికి కొంచెం తీపి అలవాటు అవుతుంది. ఆ తర్వాత సంస్కృతులకి అనుగుణంగా రుచులు అలవాటు అవుతాయి. మన దేశంలో అయితే అన్నంలో వాము నెయ్యి కలిపి కొత్త రుచులు అలవాటు చేస్తాం. సాధారణంగా పిల్లలు ఏ కొత్త రుచిని పరిచయం చేసినా మొదట్లో నచ్చుకోరు. మనం వాళ్ళ నోట్లోకి కుక్కటం, వాళ్ళు దాన్ని ఉమ్మెయ్యటం, మనం దానిని మళ్ళా చెంచాతో నోట్లోకి తొయ్యడం – ఈ తంతు ప్రతి తల్లికి తెలిసినదే.

పుట్టుకతో పసి పాపలు తీపిని నచ్చుకోవటం, చేదుని ఏవగించుకోవటం సర్వసాధారణంగా జరిగే పని. నాలుగు నెలల ప్రాంతాలలో ఉప్పదనం మీద మోహం పెరుగుతుంది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా రకరకాల రుచులు అలవాటు అవుతాయి. పాపకి భవిష్యత్తులో ఏయే రుచులు అలవాటు అవుతాయో ఆ పాప గర్భంలో ఉన్నప్పుడు తల్లి తినే రుచుల మీద కూడ ఆధారపడి ఉంటుందిట. తల్లి వెల్లుల్లి తింటే పిల్లలకి కూడ వెల్లుల్లి మీద ఇష్టత పుట్టటానికి సావకాశాలు ఎక్కువట. ఈ సిద్ధాంతం ఎంత శాస్త్రీయమైనదో చెప్పలేను కాని, నా శ్రీమతికి వంకాయ ఇష్టం, మా అమ్మాయి సీతకి వంకాయ అంటే అసహ్యం.

కొత్త రుచులని ప్రయత్నించటానికి కూడ భయపడే పరిస్థితిని ఇంగ్లీషులో నియోఫోబియా అంటారు. ఈ భయమే పెద్దయిన తర్వాత “పికీనెస్” గా మారుతుంది. ఈ పికీనెస్ ని తెలుగులో ఏమంటారో ప్రస్తుతానికి స్పురించటం లేదు కాని, ఈ రకం వ్యక్తులు మనకి తరచు తారసపడుతూ ఉంటారు. కొందరు కంచంలో వడ్డించిన వస్తువులని వేళ్ళతో కోడి కెక్కరించినట్లు కెక్కరించి, ఏదీ సయించటం లేదని లేచి పోతారు. ఇలాంటి వాళ్ళతో రెస్టారెంటుకి వెళితే మన పని గోవిందా. వీళ్ళకి మెన్యూలో ఉన్నవి ఏవీ నచ్చవు. నూనె ఎక్కువ వేసేడనో, కారం సరిపోలేదనో, సరిగ్గా ఉడకలేదనో, అన్నం మేకుల్లా ఉందనో, ముద్దయిపోయిందనో, మరీ కరకరలాడుతోందనో, మాడిపోయిందనో, ఏదో ఒక వెలితి కనిపిస్తుంది వీరికి. వీరిని చూసి జాలి పడాలి కాని కోపగించుకునీ, విసుక్కునీ లాభం లేదు. మనందరికీ భక్ష్యాలూ, భోజ్యాలూ, చోష్యాలూ, పానీయాలు లా కనిపించేవే వీరికి ఏకుల్లాగో, మేకుల్లాగో కనిపిస్తాయి. అందుకని తినలేరు.

జేన్ కావర్ అనే ఆవిడ ఇటువంటి పికీ ఈటర్స్ మీద పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా కూడ పుచ్చుకుంది. ఫిలడెల్ఫియాలో 500 మందిని కూడగట్టి వారికి ఒక ప్రశ్నావళి సమర్పించింది. వీటికి ప్రజలు ఇచ్చిన సమాధానాలు చదవటం ఒక అనుభూతి. “నేను కరకరలాడే వస్తువులని తినలేను.” “నారింజ రంగులో ఉన్న తినుభండారలనే నేను తినగలను.” “పళ్ళెంలో వడ్డించిన వస్తువులని ఎల్లప్పుడూ అనుఘడి దిశలోనే తింటాను.” “నేను ఇంట్లో వండినవి తప్ప బయట వండినవి తినలేను.” ఇవీ ఆమె సేకరించిన సమాధానాలలో కొన్ని మచ్చు తునకలు. ఆవిడ పరిశోధనలో తేలిందేమిటంటే ప్రతి వ్యక్తీ ఏదో ఒక విధంగా పికీ ఈటరే. ఆవిడ వరకుఎందుకు. అమెరికాలో మన తెలుగు వాళ్ళల్లో నేను చూసేను. బయటకి వెళ్ళి ఏది తిన్నా ఇంటికివచ్చి ఆవకాయ డొక్క తో ఇంత మజ్జిగ అన్నం దబదబా తింటే కాని నిద్ర పోలేరు.

కొన్ని అలవాట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. కొన్నింటికి మనం అలవాటు పడిపోయి పట్టించుకోము. కార్న్ ఫ్లేక్సు, ఓట్ మీలు మొదలైనవి ఉదయమే తినాలని ఎక్కడైనా నియమనిబంధనలు ఉన్నాయా? ముందు పప్పూ అన్నం, ఆ తర్వాత కూర, ఆ తర్వాత పచ్చడి, ఆఖరున పులుసు, చారు, మజ్జిగ తినాలని ఎవరు నియంత్రించేరు? మా ఇంట పురోహితులు సోమయాజులు గారు ముందు కూర, పచ్చడి తిని, తర్వాత పిండివంటలు తిని, అప్పుడు పప్పు అన్నం తినే వారు. ఎందుకు అలా తిరకాసుగా తింటున్నారని నేను చిన్నతనంలో మర్యాద తెలియని రోజులలో అడిగేసేను. “పప్పు అన్నం ముందు తినెస్తే కడుపు నిండిపోతుంది. అప్పుడు మిగిలినవి తినటం కష్టం. అందుకని” అని ఆయన చెప్పేసరికి మా అమ్మ, నాన్నగారు కూడ తర్కబద్ధంగా ఉన్న ఆ సమాధానం విని ఆశ్చర్యపోయేరు.

నేను అమెరికా వచ్చిన తర్వాత తిండి తినే పద్ధతిలో ఒక కొత్త బాణీ ప్రస్పుటం కావటం మొదలైంది. ఇంటి దగ్గర అన్నంలో కలుపుకుందుకి పప్పు, కూర, పచ్చడి, తర్వాత పులుసు, చారు, మజ్జిగ – ఆ వరసలో తినేవాళ్ళం. ఆయ్యరు హొటేలుకి వెళ్ళి తిన్నా దరిదాపు అవే వంటకాలు తగిలేవి. మొన్న వాషింగ్టన్ వెళ్ళినప్పుడు వెతుక్కుంటూ ఇండియన్ రెస్టరాంటు కి వెళ్ళేను. వాడు ఒక కప్పు అన్నం, దానితో తినటానికి బైంగన్ బర్తా ఇచ్చేడు. ఎంతకని బైంగన్ బర్తా తింటాను? మర్నాడు చైనా వాడి దగ్గరకి వెళ్ళేను. వాడూ కప్పుడు అన్నం తో పాటు మరొక పాత్ర నిండా వేయించిన చిక్కుడు కాయలు పెట్టేడు. ఎంతకని చిక్కుడు కాయలు తింటాను? పోనీ అని రాత్రి పీట్జా తినటానికి వెళ్ళేను. అక్కడా అంతే. అంటే ఏమిటన్న మాట? ఒక్కళ్ళం రెస్టరాంటుకి వెళితే, వెళ్ళిన చోట మనకి థాలీ లాంటిది దొరకక పోతే మనకి నాలుగు రకాల ఆధరువులు లేకుండా “ఏక భుక్తమే” గతి.

ఇలాంటి ఇబ్బందులనుండి తప్పించుకోవాలంటే చైనా రెస్టరాంటుకీ, ఇండియన్ రెస్టారాంటుకీ, ఒక్కళ్ళూ వెళ్ళకూడదు, ఒక చిన్న మందలా వెళ్ళాలని ఒకడు నాకు హితోపదేశం చేసేడు. ఇంట్లో మా ఆవిడ చెప్పినట్లు, ఆఫీసులో మా సెక్రటరీ చెప్పినట్లు వినటం అలవాటయిపోయిందేమో మనమంచికే చెబుతున్నాడు కదా అని ఆ హితైషి చెప్పినట్లు ఒక సారి అరడజను మంది సహోద్యోగులతో చైనా రెస్టరాంటుకి వెళ్ళేను. వాళ్ళంతా బాతులని, కుక్కలని, పందులనీ ఆర్డరు చేసుకుంటున్నారు. నేను బితుకు బితుకు మంటూ బుద్ధాస్ డిలైట్ ఆర్డరు చేసేను. అందరివీ ఒకటీ ఒకటీ వస్తున్నాయి. నేను తప్ప అందరూ వడ్డించుకుని లొట్టలు వేసుకుంటూ తింటున్నారు. నేను బిక్క మొహం బైటకి కనిపించకుండా బింకంగా పోజు పెట్టి బుద్ధాస్ డిలైట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆది వచ్చే సరికి ఒక వాయి భోజనాలు కానిచ్చేసిన నా సహోద్యోగులు దీని మీద కలబడి పంచేసుకుని, “రావ్, మేము కూడ నీలాగే వెజిటేరియన్ ఆర్డర్ చెయ్యవలసింది, ఇది చాలా బాగుంది” అంటూ ఆ ప్లేటుని ఒకరి చేతుల మీదుగా మరొకరు నా దగ్గరకి పంపేసరికి అది కాస్తా ఖాళీ అయిపోయింది. నేను మొర్రో మొర్రో అంటే మరొక ప్లేటు తెప్పించేరు. ఆది వచ్చేసరికి అందరి భోజనాలు అయిపోయాయి.

నా తిండి అలవాట్లని తలచుకొని నా మీద నేను జాలి పడిపోయేలోగా మరొక సంగతి. కొందరికి అన్ని రకాల తిండి వస్తువులు పడవు. అంటే ఎలర్జీ. అమెరికాలో నాలుగింట ఒక వ్యక్తికి ఎదో విధమైన తిండి ఎలర్జీ ఉందిట. ఈ ఎలర్జీలలో కూడ రకాలు ఉన్నాయి. కొంతమందికి నువ్వులు, వేరుశనగ తింటే నోరు పూసెస్తుంది. మరికొందరికి వేరుశనగ పొడ తగిలితే చాలు ప్రాణాంతకమైన పరిస్థితి ఎదురౌతుంది.

అందుకోసం ఎవరినైనా ఇంటికి భోజనానికి పిలచినప్పుడు వారిని అడగెయ్యటమే. నిషిద్ధం కావచ్చు, పడక పోవచ్చు, ఇష్టం లేక పోవచ్చు. మతం ఒప్పుకోకపోవచ్చు. మా చిన్న బావని ఎవ్వరైనా భోజనానికి పిలిస్తే, మొహమాటం లేకుండా,”అమ్మా! దేంట్లోనూ కొత్తిమిర వెయ్యకండి. కొత్తిమిర వాసన కూడ దేనికీ తగలకుండా చూడండి” అని చెప్పెస్తాడు.

ఇంకో రకం ప్రజలకి మరొక సమస్య. వీరి నాలుక రుచులలో అతి చిన్న తేడాలని కూడ ఇట్టే పట్టేయగలదు. వీరి రుచి బొడిపెలు అతి సున్నితం. మన బోంట్లకి చక్కెర లేని కాఫీ, టీ లు కొద్దిగా చేదనిపిస్తే వీరికి పరమ చేదుగా ఉంటాయి. అదే టీ లో ఒక చెంచాడు పంచదార వేసుకుంటే మనకి సరి పోతుందికాని వీరి నోటికి ఆ టీ పానకంలా అనిపిస్తుంది. వీళ్ళని ఇంగ్లీషులో “సూపర్ టేస్టర్స్” అంటారు. మామిడి పండు ఇష్టం లేని మా అన్నయ్య ఒక సూపర్ టేస్టర్. వంట వండి వాడిని మెప్పించటం ఆ బ్రహ్మ దేవుడి తరం కాదు. ఉప్పు ఎక్కువైంది, పులుపు సరిపోలేదు, కారం మరి కాస్త పడాలి అంటూ వాడి గొణుగుడు భరించటం మాకు అలవాటైపోయింది. కాని ఆవకాయలు పెట్టే రోజులు వచ్చినప్పుడు మాత్రం పాళ్ళు సరిగ్గా పడ్డాయో లేదో చూడటానికి వాడు లేకపోతే ఆవకాయ సరిగ్గా వచ్చేదే కాదు. ఇండియాలో పుట్టి గుర్తింపు లేక, రుచులు ఎంచుతాడని నలుగురి చేత చివాట్లు తినేవాడు కాని, వాడి వంటి సూపర్ టేస్టర్స్ కి అమెరికాలో మంచి ఉద్యోగాలే దొరుకుతాయి.
---------------------------------------------------------
రచన: వేమూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో