Saturday, November 30, 2019

హత్య కేసి వేగంగా


హత్య కేసి వేగంగా





సాహితీమిత్రులారా!


కారులు, విమానాలు, మెషీను గన్నులు … మధ్య లో కూర్చుని నవ్వుతూ ఆడుకుంటున్న ఒక రెండు మూడేళ్ళ పిల్లవాడు. వాడు ఆడుకునే ఆ కాస్త జాగా తప్పిస్తే హాలంతా తీర్చి దిద్దినట్లుంది చాలా యేళ్ళుగా శ్రమించి సమకూర్చుకుని, పొందికగా ఎంతో అందంగా సర్దుకుని అలంకరించుకున్న సామానులతో.

ఒక వైపు గోడ మీద వ్రేళ్ళాడుతున్న గీతోపదేశం పెయింటింగు, దాని ప్రక్కనే పారుతున్న సెలయేరులో నీళ్ళు త్రాగుతున్న జింకపిల్లతో ఒక ప్రకృతి దృశ్యం. మరో గోడ మీద నలుపు తెలుపు రంగుల్లో ఒక పాత ఫోటో.

గోడ గడియారంలో టైము సరిగా కనిపించడం లేదు.

అద్దం పగిలినట్లుంది…అయినా టైమ్‌ ఆగినట్లు లేదు!

ఎవరో తలుపు కొడుతున్నారు…గట్టిగా…పిల్లవాడు జడుసుకునేట్లుగా! గబగబా వెళ్ళి తెరిచి చూసాను. ఎవరూ లేరు. గుమ్మంలోంచి అడుగు బయటకు జారింది.

ఎక్కడున్నానో తెలియడం లేదు.
అది ఏ దేశం? ఏ ఊరు? ఏ వీధి? అస్సలు ఊరేనా?! వూళ్ళో అది వీధేనా!?!?
గజిబిజిగా ఉంది. రయ్యి రయ్యిన రొద చేస్తూ విమానాలు ఎగురుతున్నాయి. మారుతున్న ట్రాఫిక్‌ సిగ్నల్‌ రంగులను ఖాతరు చేయకుండా, ప్రళయం తరుముకొస్తున్నట్లు డ్రైవర్లు లేని కారులు మహా వేగంతో దూసుకుపోతున్నాయి. ఆనకట్ట తెగిపోయినట్లు, నేలంతా పల్లానికి ఒరిగిపోయినట్లు … ప్రవాహం! ఆ జనంలో పడి కొట్టుకుపోకుండా ప్రక్కనే ఉన్న స్తంభాన్ని గట్టిగా వాటేసుకున్నా …

పదడుగుల దూరంలో ఎవరో ముసలాయన మట్టితో ఏదో చేస్తున్నాడు. చేసిన దాన్ని మళ్ళీ ముద్దగా చేస్తున్నాడు. మళ్ళీ జాగ్రత్తగా ఏకాగ్రతతో అదే మట్టి ముద్దతో మరేదో చేస్తున్నాడు…మరలా అదే మట్టిని పిసికేసి పెద్ద ముద్దగా చేస్తున్నాడు. మొహంలో అలసట లేదు, విసుగూ లేదు. దగ్గరగా వెళ్ళినా, నా వునికిని గుర్తించకుండా తన పని తను చేసుకుపోతున్నాడు.

ఎక్కడి నుంచో పెద్ద శబ్దం…వెనక్కి తిరిగి చూశాను

రోడ్డు మీద చాలా మంది చాలా చాలా హడావిడిగా తిరుగుతున్నారు. తెలిసిన మొహం ఒక్కటీ లేదు. నన్నెవరో పిలిచినట్లనిపించి, తల తిప్పి చూసాను. ఎవడో అచ్చు నా రూపంలో!
వాడు నాలాగే మాట్లాడుతున్నాడు. నేనే అక్కడ నవ్వుతున్నాను. ఇక్కడి నేనే అక్కడి నన్ను చూస్తున్నాను! అక్కడి నేను, ప్రక్కనే వున్న మరో ఇద్దరితో కలిసి నడుస్తున్నాను.

చుట్టూ గోడలు మొలుస్తున్నాయి. ఇనుప గొలుసుల్లా మెరుస్తున్నాయి. జాగిలాల్లా నన్ను తరుముతూ నా వెంట పడ్డాయి. కనుచూపు మేరలో అన్నీ గోడలే! ఎదురుగా సన్నటి దారి అంచెలంచెలుగా గోడగా మారి, ఎత్తుగా నిటారుగా మేఘాలను తాకుతూ నిల్చుంది.
నా వెనుక వస్తున్న వాళ్ళు, నా ముందు వెళ్ళిన వాళ్ళూ ఏమయ్యారు? గోడలయ్యారా…గోడలను మోస్తున్న పునాదుల క్రింద సమాధులయ్యారా? కాలి కింద నేల కృంగిపోతోంది. పడి పోతూ…గాలిలో తేలిపోతూ…మళ్ళీ లోపల్లోపలికి చీకట్లోకి మాయమౌతూ జారిపోతున్నాను.

డైనోసార్లూ, రాకాసి బల్లులూ, భల్లూకాలు … వాటితోబాటు గర్జించే సింహాలు, గాండ్రించే పులులూ, ఘీంకరించే ఏనుగులూ, బుసలు కొట్టే పాములూ… చిన్నా పెద్దా జంతువులు. ఎడారి లోకి అడవి దారితప్పి వచ్చినట్లుంది. ఓ ప్రక్క సింహం ఏనుగుతో కలబడుతోంది, ఏనుగు కాళ్ళకు చుట్టుకుని పాములు పైపైకి ప్రాకుతున్నై. పులి జింకపిల్లను నోట కరుచుకుని పరుగెడుతోంది. కుందేలు వెనుక నుంచీ ఓ నక్క నక్కినక్కి చూస్తోంది. కోతిపిల్లలు కొన్ని గంతులు వేస్తున్నాయి. ఖడ్గమృగం ఒకటి నన్నే చూస్తూ మెల్లిగా వెనక్కి కదిలింది. నన్ను చూసి పారిపోడానికో లేక రెండడుగులు వెనక్కివేసి, ఒక్క ఉదుటన పైన పడ్డానికో! ఎందుకైనా మంచిదని పరుగందుకున్నాను.

మట్టి ముద్దలు చేసే ముసలివాడు ఇంకా అక్కడే రోడ్డు ప్రక్కన మట్టి పిసుకుతూనే వున్నాడు.

ఆత్మ ప్రదక్షణాలతో అలసి వొళ్ళు విరుచుకున్నట్లుంది నేల. జుట్టు విరబోసుకున్న మంత్రగత్తెలా ఊగుతోంది వేపచెట్టు. దూరంగా ధ్వంసమైన వంతెనకటు వైపు ఏముందో కనిపించడంలేదు. చుట్టూ శిధిల చిహ్నాలు. అంతటా కప్పేసిన ధూళి మేఘం. చంద్రుడి జాడ లేదు. సూర్యుడు ఏ పరాయి ఊరు పారిపోయాడో ఆచూకీ లేదు. తారలు ఏ తెరల చాటున దాగున్నాయో తెలియదు.

పిల్లవాడు దాహమని ఇంటి ముందు కూర్చుని ఏడుస్తున్నాడు. వాడికి మాటలెప్పుడొచ్చాయా అని ఆశ్చర్యమేసింది. “నీళ్ళు నేనిస్తా రా” అంటూ వాడిని భుజాన వేసుకుని, ఎదురుగా కనిపిస్తున్న ఇంట్లోకి వెళ్ళాను. ఆశ్చర్యం అది మా ఇల్లే!

సామానులన్నీ చెల్లా చెదురుగా పడున్నాయి. మసిబారిన మొండి గోడల మధ్య, సగం కాలిన శవంలా ఉంది వంట గది. నా శరీరంలో సగ భాగం తగలబడుతున్నట్లనిపించింది. గుండెలోని దుఖం కళ్ళ లోంచి తోసుకొస్తోంది. పిల్లవాడి ఏడుపు హెచ్చింది. పగిలి పోయిన నీళ్ళ కుండ పెంకుల్ని తొక్కుకుంటూ సింకు దగ్గరకు వెళ్ళాను. పంపులోంచి నీళ్ళొస్తున్నాయేమోనని టాప్‌ తిప్పాను. బురద నీళ్ళు…వాటి వెంట ఎర్ర నీళ్ళు …నీళ్ళ ధారా లేక నెత్తుటి వరదా? దాంతో పాటు చిన్న చేప! గభాల్న దోసిటను చేతులుగా విడగొట్టుకుని వెనక్కి తీసుకున్నా. చిన్న చేప వెనుకే తరుముకొస్తున్నట్లు పెద్ద చేప…దాని వెనుకే మరో పెద్ద చేప! ఎలా పట్టిందో అది ఆ సన్నని గొట్టంలో. అస్సలు అది ఎలా వచ్చిందో టాప్‌ లోంచీ బయటకి! ఇంకొకటి తొంగి చూస్తోంది… తిమింగలమా… భయమేసింది! వెనక్కిపడిన పాదానికి మెత్తగా శరీర స్పర్శ…తిరిగి చూస్తే… అక్కడ ఒక పండు ముసలి “దాహం దాహం ” అని మూలుగుతున్నాడు. ఈ ముసలివాడి మొహంలో పిల్లవాడి పోలికలు…మరి నేనేమిటిలా?!

గోడ మీది గడియారం స్పష్టంగా కనిపించడం లేదు.

ఎన్నేళ్ళ నుంచో పరిచయమున్న వాళ్ళ లాగ, ఇంట్లోకి అపరిచితులు వస్తున్నారు.
“సిగరెట్టు లైటరు వుందా?” అడిగాడొకడు ఆ గుంపులోంచి.
నేను సిగరెట్టులు తాగనని చెబితే, ఒకడు కోపంగా చూసాడు. మరొకడు పళ్ళు కొరుకుతూ, కత్తి బయటకు తీసాడు. ఇంకొకడు నేల మీది గీతోపదేశం చిత్రానికి దణ్ణం పెడుతున్నాడు. నెత్తుటి మడుగులో పడున్న జింకపిల్ల దృశ్యం జాలిగొలుపుతోంది. పాత ఫోటో మీద దుమ్ము పేరుకుంది.
ఆ గుంపంతా టీవీని చూపించి ఇదేమిటని అడిగారు. అదేమిటో తెలిసినా, చెప్పడానికి నోరు పెగల్లేదు.
“పోనీ అగ్గి పెట్టైనా వుందా?” అడిగాడు మరొకడు.
“వెదకాలి” అంటూ వంట గది షెల్ఫుల దగ్గరకు వెళుతూంటే, నన్ను వెనక్కి వెనక్కి గుంజేసి, బలంగా విసిరేసి, వంట గదిలోకి చొచ్చుకు పోయారు.

చుట్టూ జనం. లాప్‌ టాప్‌ కంప్యూటర్‌కు తాడు కట్టి లాగుతూ, బుర్రు బుర్రని నోటితో శబ్దంచేస్తూ పరుగెడుతున్నారు కొందరు మధ్య వయస్కులు. దారి ప్రక్కనే కొంత మంది ఓ పెద్ద గొయ్యి తవ్వుతున్నారు. కొందరు గోతిలోకి, మరి కొందరు ఆకాశంలోకి నాలుకలు సాచి చూస్తున్నారు. అక్కడకు కాస్త ఎడంగా ఒకావిడ అగ్గిపుల్లలు తయారు చేసే విధానం గురించి ఉపన్యాసమిస్తోంది. ఎదురుగా ఒకడు ఆకలి నోటితో ప్రక్కనున్న అమ్మాయి వైపు చూస్తున్నాడు. ఒకదానికొకటి గుద్దుకొని, వాళ్ళ చుట్టూ అడ్డదిడ్డంగా గుట్టలు పడున్నాయి కారులూ, ట్రక్కులూ.

నేల నుంచి, ఆకాశంలోకి కనిపించినమేరకు పెద్ద సాలెగూడు. నేనా గూటి లోపల బందీనయ్యానో లేక బందీలైన వాళ్ళను చూస్తూ బయట వున్నానో తెలియడం లేదు.

ఒక పెద్దాయన “ఇంకో అడవి ఎక్కడుంది?” అని అడుగుతున్నాడు బిగ్గరగా. ఒక ప్రక్కన కూలిపోయిన విమానం చుట్టూ కాకులూ గద్దలూ రాబందులూ చేరి అరుస్తూ, విమానాన్ని ముక్కులతో పొడుస్తున్నాయి. మధ్య మధ్యలో వాటిల్లో అవే పొడుచుకుంటూ అరుస్తున్నాయి. సగం కాలిన ఆలివ్‌చెట్టు కొమ్మకు కట్టిన చిరిగిన పేలికల ఉయ్యాల చుట్టూ కోతులు విన్యాసాలు చేస్తున్నాయి. దూరం నుంచీ ఓ గుంపు తప్పెట దరువులు వేస్తూ, ఎగురుతూ పాడుతూ వస్తోంది … ఆడా మగా అందరూ ఒకే మొహంతో, నగ్నంగా! మెడల్లో ఎముకల దండలు, పుర్రెల హారాలు!! చాలా మంది చేతుల్లో రాళ్ళు, కర్రలు, బరిసెలూ! తప్పెట దరువుకు నా కాళ్ళు కూడా ఊగుతున్నాయి.
చేతుల్లోని వేప మండలతో ఒకావిడ గుండెల మీద బాదుకుంటూ, బలంగా తలను వూపుతూ కోరికల పట్టీ చదువుతోంది. చుట్టూ నిల్చున్న వాళ్ళ తలలు, ప్రక్క నుంచీ ప్రశ్నార్ధకాల్లా కనిపిస్తున్నాయి.
చుట్టూ చేరిన గుంపును అదిలిస్తున్న బుర్ర మీసాల ఆసామి చేతిలోని కొరడా, అప్పుడే కోరలొచ్చిన పాములా బుసలు కొడుతోంది.

నా ఇంటి స్థానంలో ఓ మట్టి దిబ్బ… దిబ్బ మీద ఎగురుతున్న చిరుగుల మాసిన గుడ్డ పీలికలు! ఒకడు వాటికెదురుగా నుంచుని సెల్యూట్‌ చేస్తున్నాడు. ప్రక్కనే సగానికి విరిగిన చెట్టు మీద, ఓ గుడ్లగూబ కూర్చొని కునికిపాట్లు పడుతోంది.

రెండు చేతులూ సాచి ఆకాశంలోకి చూస్తూ నిలబడ్డ పొడవాటి గడ్డం మనిషి, ఆ వెనుక కూలిన చెట్టు మొదలు మీద కూర్చుని ప్రేమతో గొర్రెపిల్ల తలనిమురుతున్న నడి వయస్కుడు, అతడికి మరి కాస్త వెనుక ఒక రధం, దీర్ఘ సంభాషణలో లీనమైనట్లు కనిపించే ఇద్దరు మనుషులు.
నా చిన్నప్పుడు చూసిన ఒక రామాయాణం సినిమాలోని పుష్పక విమానం లాంటిదే ఒకటి పైన ఎగురుతోంది. సూర్యోదయమో సూర్యాస్తమయమో తెలియడం లేదు. ఆ వైపు ఆకాశం, సన్నటి గాలి అలకు చెదిరిన నివురుగప్పిన నిప్పుల కుప్పలా వుంది. పంది పిల్లొకటి ఉత్తరం వైపు బెదురుగా పరుగెడుతోంది. చెవులు కత్తిరించబడ్డ గొర్రె దిక్కులదిరిపోయేలా అరుస్తోంది. గుంజకు కట్టేయబడ్డ తెల్ల ఆవు దూడ కోసం చుట్టూ చూస్తోంది. ఆ దృశ్యం ఫ్రేములో బందించబడ్డ తైల వర్ణ చిత్రంలా వుంది.

బస్టాండో, రైల్వే స్టేషనో … ఏర్‌ పోర్టో… ఒక ప్రయాణ స్థలి!
నా చిటికెన వ్రేలు పట్టుకుని నిల్చున్న పిల్లవాడు, ఎదురుగా నెత్తుటి మరకలంటిన రాయిని చూస్తూ, నా కాళ్ళను గిల్లుతున్నాడు.
ప్రక్కనున్న జులపాల మనిషి చెంపలేసుకుని దణ్ణం పెడుతూ, మా వైపు కర్కశంగా చూస్తూ ఏవేవో సైగలు ఎవరెవరికో చేస్తున్నాడు. చుట్టూ కదలిక…రక్తమంటిన బాకుల్లాంటి రాళ్ళతో, ఎర్రని మండే కళ్ళతో మా వైపే వస్తున్నారు.

భయం…భయం…భయం!
నా వణకే కాళ్ళను గట్టిగా వాటేసుకుని పిల్లడు …
వేగంగా ఒక్కో అడుగూ మాకేసి వేస్తూ జులపాల మనిషి!

పారిపోయే మార్గం లేదు. చుట్టూ రాళ్ళతో తెలిసిన మొహాలే – శతృ సైనికుల్లా! క్రిందకు వంగి, నా కాళ్ళను బలంగా గుంజుతున్న పిల్లవాడి వైపు చూసాను. చేతిలో మెరుస్తున్న రాయితో, నేను వారించేలోపే, నా కాళ్ళను విదుల్చుకుని జులపాల వాడి పైకి దూకాడు.
ఏం జరుగుతుందో తెలిసి వారించే లోపే నా ఎదుట ఒక హత్య జరిగింది.

మట్టి ముద్దలు చేసుకునే ముసలాయన, నన్ను చూసి నవ్వి, చిన్న చిన్న మట్టి ముద్దలన్నింటినీ కలిపేసి ఓ పెద్ద ముద్దగా చేసేడు.

చాలా మంది గుంపులు గుంపులుగా చేరి ఎవరికోసమో వెదుకుతున్నారు. వాళ్ళలో పిల్లవాడు నాకు కనబడలేదు.
ఆ గుంపుకు కనిపించకుండా మాయమౌదామనుకున్నాను. వాళ్ళు నన్ను చూసి కూడా పట్టించుకోకుండా రోడ్డు మధ్యలో గుమికూడారు.
వాళ్ళ మధ్యలో కుప్పగా పోసిన తలలు, మొండేలు, శరీరాంగాలు
ఎటు వెళ్ళాలో తెలీక నెత్తుటి సరస్సులో గిలగిల కొట్టుకుంటూ
ఏ తల ఏ మొండేనిదో? ఏ అంగం ఏ శరీరానికి చెందిందో??
నా తల ఎక్కడ?!
అంతటా అంధకారం అలముకుంది.
-----------------------------------------------------------
రచన: కె. వి. గిరిధరరావు, 
ఈమాట సౌజన్యంతో

Thursday, November 28, 2019

నా పల్లెటూరు


నా పల్లెటూరు




సాహితీమిత్రులారా!

పుట్టితి పల్లెటూర మదిపూనిక వార్థక మొందుదాక అ
ప్పట్టున పెర్గినాడ నతిప్రాభవ వైభవ గౌరవంబులన్‌
బెట్టుగ ధర్మ మార్గమున విత్తము కూర్చితి తృప్తి మీర నా
కెట్టకు ప్రాప్తిలెన్‌నగర హృద్యపు కృత్రిమ జీవితంబిటన్‌

తాతల తండ్రులన్‌దనుక ధర్మపథంబున గ్రామవాసమున్‌
ప్రీతిగ సేద్యపుం కృషిని వృత్తిగ చేకొని చేయుచుండితిన్‌
వేతన వృత్తికిం తవిలి స్వేఛ్ఛ పణంబుగ నేడు పట్నవా
సాతప తాపమున్‌పొగులుటయ్యెను చల్లని పల్లె వీడుటన్‌

ఎంత ధనమున్న భోగములెన్ని యున్న
మేని శ్రమ లేని వసతులుం పెక్కులున్న
పారతంత్య్రపు కృత్రిమ పట్టణంపు
వాసమెంతయు పల్లెకు సాటియౌనె!

పట్నవాసపు సుందర భవనమందు
శయనమొందగ మృదు తల్ప శయ్య యందు
ప్రతిఫలించును నా మనఃఫలకమందు
పుట్టి పెరిగిన మాయూరి పూర్వస్మృతులు!

దోగియాడగ నింట ధూళి మేనున నంట
కాయంబు వజ్రమై గట్టివడియె
పిన్నవయసు నందు వీధుల పరుగిడ
వీధి దుమ్ములు మేన పేరుకొనియె
సంధ్య వేళల క్రమ్ము సారంపు గోధూళి
తనువును ధూసరితమ్ము చేసె
పూటపూటను పంట పొలముల తిరుగాడ
శివధూళి రేగి నా శిరము నంటె

మసలి పెరిగితి మాయూరి మంటి పైన
నాటి మాయూరి మృత్తికే నాదు మేను!
తృప్తి త్రావితి మాయూరి తీపి నీరు
త్రేవ గుడిచితి మాయూరి తిండి రుచుల.

మలయపవనముల్‌మాయూరి మారుతములు
గాంగ పావన జలము మాయూరి జలము
కాలు న్యాయపు తీర్పు మా కాపు తీర్పు
పౌర ధర్మాను బద్ధము ప్రజల వృత్తి

ప్రాతరమందునన్‌వెలుగు పారగ చల్లని పిల్ల తెమ్మెరల్‌
ప్రీతిని హాయి గొల్ప చిరుబెత్తము చేగొని శాలి సస్య ప
ర్యాతత మాన్యముల్‌కనగ హాలికవృత్తిని పోవుచుందు నే
నాతరి చూడగన్‌పొలము, హర్షము పొంగును మానసంబునన్‌

పైరు వేత కోత పరువు వచ్చినపుడు
కర్షక జనాళి సందడి కనగ ప్రీతి
పల్లెపాటల లయలతో భావగతుల
సంబరంబులు వేడ్కతో సల్పుచుంద్రు

పుష్య మాసము చొరబడ పుష్కలముగ
పైరు ఫలియించి కోతకు పరువు నొందు
హిమముతోడుత వెచ్చని యెండ కాయ
చూడ చూడంగ ప్రకృతియు శోభ గొల్పు

పంటలు నూర్చు కాలమున పల్లెల పెండిలి సందడేర్పడన్‌
వంటల పాయసాన్నములు భక్ష్యములెప్పటి కంటె మిన్నగా
ఇంట గలట్టి యాండ్రు తినిపింతురు పంటల నూర్చు వారికిన్‌
కంటికి విందు సేయు నిలుకప్పులు దాకెడు ధాన్య రాశులున్‌

మెదలుచుండును మనమున ప్రీతి గూర్చ
నాటి పల్లెలు సౌహార్ద న్యాయ వృత్తి
సిరుల వైభవ శోభల చెలగి యుంటి
కాని నేడవి కళ దప్పి కానుపించు

ఎన్నగ రాజకీయముల హెచ్చుగ పాల్గొని దేశపాలనన్‌
మిన్నగ నేడు చేయునది మిత్రులు పల్వురు పల్లె రైతులే
ఎన్నడు రైతు కష్టములొకింతయు వారు తలంపరైరిగా
మన్నన రైతుబాంధవులె మాటల; శూన్యులు సేతలన్‌తగన్‌

హాలిక వృత్తి నేడు కడు దైన్యము బొందెడు నార్థికంబుగా
జాలిని గొల్పు రైతు అగచాట్ల తలంచిన చీడ పీడలన్‌
చాలయె పంట నష్టములు, వల్లని ఖర్చులు, కల్తి యెర్వులున్‌
చాలని అమ్మకంపు ధర శక్తికి మించిన అప్పు బాధలున్‌

ఈ రీతిం కడు దైన్యపు స్థితిని నేడీ రైతు గాసింబడన్‌
కారుణ్యంబున ఈ ప్రభుత్వమయినన్‌సాయంబు చేకూర్చమిన్‌
నైరాస్యంబున ప్రత్తి రైతు తనువున్‌త్యాగంబు చేసెన్‌తుదన్‌
దారింగానక రైతు లోకమిపుడున్‌దౌర్భాగ్యమున్‌చెందెడిన్‌
-----------------------------------------------------
రచన: నీలంరాజు నరసింహారావు, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, November 26, 2019

పందెం ఎలకలు


పందెం ఎలకలు





సాహితీమిత్రులారా!

అనిల్‌ కుమార్‌!
ఆఫీసులో స్టాక్‌మార్కెట్‌ గురించిన చర్చలన్నిట్లో అతనే లీడర్‌!
కంపెనీ సియీవో దగ్గర్నుంచి గెరాజ్‌లో జానిటర్ల వరకు అతని సలహాలు తీసుకోని వాళ్ళు పాపాత్ములు!
అతను అనర్గళంగా స్టాక్‌ మార్కెట్‌ బిహేవియర్‌ని విశ్లేషిస్తూ ఎప్పుడెప్పుడు ఎలా వుండబోతుందో, ఎప్పుడు ఎంతెంత కరక్షన్లు రాబోతున్నాయో ఏయే స్టాక్‌లు ఎప్పుడెప్పుడు ఎలా పెరగబోతున్నాయో ఉపన్యసిస్తుంటే అందరూ చెవులప్పగించి వింటూ నోట్స్‌ రాసుకుంటూ ఉంటారు.
స్టాక్‌ల లాంగ్‌లు, షార్ట్‌లు, ఆప్షన్ల కాల్స్‌, పుట్స్‌ వాటిని కొనటాలు, రాయటాలు, వీటన్నిటి కాంబినేషన్స్‌,వాటిని వాడే స్ట్రాటజీలు అతను వర్ణించి చెప్తుంటే అందరూ భక్తి భావంతో అరమోడ్పు కన్నుల్తో ఆనందంగా వింటూ వుంటారు.
సిస్కో, ఇంటెల్‌, మైక్రోసాఫ్ట్‌, యాహూ, క్వాల్‌కాం లాటి ఆకాశసంచారుల చార్టులు, వాటిలో ఎత్తుపల్లాల తేదీలు, కారణాలు అతని బుర్రలో సదా ఆనందనాట్యాలు చేస్తూంటాయి.

రోజులో సగం సమయం అతను స్టాక్‌ల వెంట తిరుగుతూ గడుపుతాడు.
రోజుకు కనీసం అరడజను ట్రేడ్స్‌ చెయ్యకపోతే అతనికి ఆనందం కలగదు.
క్రితం అర్నెలల్లోనూ కలిసి తన నిర్విరామ స్టాక్‌ మార్కెట్‌ కార్యకలాపాలకు గాను అతనికి వచ్చింది
యాభై వేల డాలర్ల
నష్టం!
అతను కొన్న వెంటనే యాహూ నలభై పాయింట్లు పడిపోయింది.
దాంతో తిక్కరేగి దాన్ని అక్కడికక్కడే అమ్మేసి షార్ట్‌ చేసిన ఈబే యాభై పాయింట్లు పెరిగింది.
ఈలోగా యాహూ కూడా ఓ నూట డెబ్భై పాయింట్లు పెరిగిందనుకోండి, అది వేరే విషయం.
అతను కొన్న నాలుగు నెల్ల పాటు ఎటూ వెళ్ళకుండా చదికిల పడి కూర్చున్న సన్‌ మైక్రో అమ్మిన మర్నాటి నుంచి ఏదో పూనకం వచ్చినట్టు పెరిగి యిప్పటికి అతను అమ్మిన కన్నా డెబ్భై మూడు పాయింట్ల ఎత్తున ఉంది.
ఇవేళ పొద్దున అతను కొన్న ఓ ఇంటర్‌నెట్‌ ఐపీవో అక్కడి నుంచి ఓ పాతిక పాయింట్లు పెరిగి అమ్ముదామా అని ఆలోచిస్తూండగానే ఆ పాతికా గాక మరో ముప్ఫై పాయింట్లు పడిపోయింది. అదింక కొన్న చోటికి యీ జన్మలో వస్తుందో రాదో!
ఇవన్నీ తల్చుకుంటూ అతను చిరాగ్గా ఉండగా
స్టాక్‌బ్రోకర్‌ నుంచి మార్జిన్‌కాల్‌ వచ్చింది!
మూడు రోజుల్లో పదిహేను వేలు అందకపోతే తన ఇష్టం వచ్చిన వాటిని అమ్మేసి సొమ్ము చేసుకుంటానని బెదిరించాడు వాడు!

అనిల్‌కుమార్‌కి దేవుడి మీద నమ్మకం లేదు!
ఎవరైనా తన ముందు విధి గురించి మాట్టాడితే విరుచుకు పడిపోతాడు!
స్వయం కృషిని మించింది లేదని, మనిషి తన జీవిత గమనానికి తనే బాధ్యుడని బల్లలు విరగ్గొట్టి మరీ వాదిస్తాడతను!
ఐతే
ఈ మధ్య అతనికి గుడికి వెళ్ళక తప్పటం లేదు.
అభిషేకాలు, గ్రహశాంతులు హడావుడిగా చేయించక తప్పటం లేదు.
ఏ దేవుడిలో ఏ మహత్యం ఉందో అని అనుమానించక తప్పటం లేదు.
ఎందుకంటే
అతనికి పట్టలేనంత నవ్వూ ఏడుపూ ఒకేసారి వస్తున్నాయి తన పరిస్థితి తల్చుకుంటోంటే!
తనకి తెలియని శక్తులేవో తనకి వ్యతిరేకంగా పనిచేస్తుంటే తప్ప, తనంత నాలెడ్జ్‌ ఉన్న వాడు ఇంతగా ఎలా డబ్బు పోగొట్టుకోగలడో అర్థం కావటం లేదు, ఎంత బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించినా.
తన సలహాలు విన్న వాళ్ళంతా బాగుపడుతుంటే తనకి మాత్రం ఈ శని ఎందుకో ఏ మాత్రం ఊహకందటం లేదు!
ఓ వైపు మార్కెట్‌ నక్షత్రాల కేసి దూసుకుపోతుంటే తన లైఫ్‌ సేవింగ్స్‌ పాతాళానికి పరుగులు తియ్యటం ఏమిటి?
తనకేదో ప్రత్యేకత ఉంటే తప్ప యిలా తను చెయ్యి వేస్తే అలా అది భస్మాసుర హస్తం కావటం అసాధ్యం!

ఇంకా ఎవరికీ తన అసలు కథ తెలీదు గాని తెలిస్తే ఈ పాటికి ఎన్ని జోకులు తయారయ్యేవో! జీవితం ఎంత దుర్భరమై పొయ్యేదో!
ఏమైనా, ఇవేళ శుక్రవారం కావటం కొంతలో కొంత మేలు రెండు రోజుల పాటు యీ స్టాక్‌మార్కెట్‌ గొడవల నుంచి కొంచెం విశ్రాంతి (ఆ మార్జిన్‌కాల్‌ సంగతి ఒకటి మాత్రం చూడాల్సుంది).

రాత్రికి నరేన్‌ యింట్లో పార్టీ. వాడు తనకి కాలేజ్‌మేట్‌.
ఎనిమిదేళ్ళ పాటు యిండియాలో బాంక్‌ ఆఫీసర్‌గా పనిచేసి ఇలా కాదని మూడేళ్ళ క్రితం భార్యా, తనూ ఓరకిల్‌ ఫైనాన్సియల్స్‌ కోర్సులు చేసి యిక్కడికి వచ్చిందగ్గర్నుంచి ఇద్దరికిద్దరూ రెండు చేతులా సంపాయించేస్తున్నారు వాళ్ళు వర్క్‌లోనూ స్టాక్‌ మార్కెట్లోనూ.

అనిల్‌కుమార్‌ అక్కడికెళ్ళేసరికి usual suspects అందరూ అప్పటికే వచ్చేశారు. రంగనాథం, కృష్ణమాచారి,రవీంద్ర, మదన్‌, పశుపతి ముఖ్యులంతా ఓ చోట చేరి ఇండియా రాజకీయాల్ని చుట్టబెట్టేస్తున్నారు. ఇంటర్‌నెట్‌ పుణ్యవా అని ఆఫీసుల్లో అంతగా పనిలేని వాళ్ళంతా నడుస్తున్న న్యూస్‌పేపర్లే కదా!

అక్కడ తనకి తెలీని వ్యక్తి ఒక్కడే డాక్టర్‌ శేఖర్‌ట. దాదాపుగా యాభై వయసు. జుట్టంతా తెల్లబడిందప్పుడే. ఈ దేశం వచ్చి ఇరవై ఏళ్ళ పైగా ఐందట. అందరి మాటలూ వినటం తప్ప సొంతగా ఏమీ మాట్టాడేట్టు లేడు. నరేన్‌కి అతన్తో ఏదో దూరపు చుట్టరికం వుండటంతో ఈ పార్టీకి పిలిచాడతన్ని.

అలా రాజకీయాలు మాట్టాడుతూ ఉండగా దుమారంలా దూసుకొచ్చాడు శ్రీనివాస్‌.
“ఇవేళ ఐపీవో వచ్చిన సికమోర్‌ నెట్‌వర్క్స్‌ ఎలా పెరిగిపోయిందో చూశారా! దాంట్లో నేను పాతిక వేలు సంపాయించా!” గావుకేక పెట్టాడు లోపలికి అడుగుపెడుతూనే.
“కంగ్రాచ్యులేషన్స్‌! మీకు దొరికిందా అది? నేనెంత ట్రై చేసినా మంచి ప్రైస్‌కి దొరకనే లేదు” అందుకున్నాడు అనిల్‌కుమార్‌ (అమ్మ గాడిద కొడకా! సుడంటే నీదేరా! నేనూ కొందామనుకున్నా గాని మార్జిన్‌ కూడా పూర్తిగా వాడేసుకుని అన్నిట్టో ఇరుక్కుపోయి ఉంటిని!)
“శ్రీనివాసంటే ఏమనుకున్నారు మరి? నూట యాభైకి కొన్నా. చూస్తుండగానే యాభై పెరిగింది. లాభం తీసుకుని బయటికొచ్చేశా. అరగంట పనికి పాతిక వేలు. నాట్‌ బేడ్‌ ” తృప్తిగా గర్వంగా చెప్పాడు శ్రీనివాస్‌.
“అదసలు నూట యాభైకి వచ్చినట్టు లేదే! దాని రేంజ్‌ అంతా రెండొందల్లోనే ఉందని గుర్తు.” (కట్టింగ్‌ కొడుతున్నావా ఏంటి బాబూ? మేం మరీ అంత చెవుల్లో పూలు పెట్టుకుని కనపడుతున్నామా?)
“అబ్బే, వొచ్చిందొచ్చింది. ఇలా వచ్చింది, అలా వెళ్ళిపోయింది.. ఇంతకీ ఏ వెబ్‌సైట్‌లో చూశారు మీరు?”
“యాహూలో” (నాబొంద. నా గోలతో నేను చస్తుంటే దాన్ని చూసే తీరిగ్గూడానా?)
“అదీ విషయం. యాహూలో ఇన్ఫర్మేషన్‌ యాక్యురేట్‌గా ఉండదు”
“నిజమే, నాకోసారి ఏవైందంటే …” (ఇంక దొరికావ్‌ చూడు!)

అంత తేలిగ్గా దొరకటానికి శ్రీనివాస్‌ తక్కువ తిన్నాడా! తన ప్రతాపాన్ని వర్ణించి చెప్పటానికి కాస్త అవతల ఉన్న ఇంకో గ్రూప్‌ దగ్గరికెళ్ళాడు. అక్కడ కొత్తగా వచ్చిన హిందీ సినీ తారల శృంగార లీలల్ని గురించిన రసవత్తరమైన చర్చ తీవ్రంగా జరుగుతున్నా అతన్నాపలేకపోయిందది!
ఇక్కడ కూర్చున్న గ్రూప్‌ కూడ అప్పటి దాకా మాట్టాడుతున్న రాజకీయాల్ని వొదిలి స్టాక్‌మార్కెట్‌లోకి వచ్చేసింది.
“డెల్‌ స్టాక్‌ ఎలా ఉందండీ,  యీ మధ్య నేను ఫాలో కావటం లేదు?” అంటూ మొదలెట్టాడు పశుపతి, వచ్చే ముందే చూసుకుని వచ్చినా.
“నలభై ఒకటో నలభై రెండో ఉన్నట్టుంది” టక్‌ మని చెప్పేశాడు తనకి స్టాక్‌ మార్కెట్‌తో ఎలాటి సంబంధమూ లేదనీ తన డబ్బంతా కేవలం మ్యూచువల్‌ ఫండ్స్‌లోనే ఉండి బ్రహ్మాండంగా పెరుగుతుందనీ బల్లగుద్ది చెప్పే రంగనాథం.
“స్టాకంటే డెల్‌ స్టాకండీ.మూడేళ్ళలో ముప్ఫై రెట్లు పెరిగింది. అప్పుడు ఎందుకు రెండొందలే కొని ఊరుకున్నానా అని ఎప్పుడూ బాధపడుతుంటా” అంటూ ఆ సంభాషణలోకి గెంతేడు అనిల్‌కుమార్‌ (వెర్రి వెధవని కాకపోతే అలా పెరిగే స్టాక్‌నా షార్ట్‌ చేసేది? చేసినా యాభై పాయింట్లు పెరిగే దాకానా కవర్‌ చెయ్యకుండా కూర్చోవటం? మిగిలిన వాళ్ళంతా కొంటున్నప్పుడు షార్ట్‌ చెయ్యటం, అది బోలెడు పెరిగాక వాళ్ళు అమ్మేటప్పుడు కవర్‌ చెయ్యటం. ఇదేగా మన డెల్‌ అనుభవం!)
“అప్పట్నుంచీ అమ్మలేదా మీరు దాన్ని?” అసూయని వినిపించనివ్వకుండా తిప్పలు పడుతూ అడిగాడు మదన్‌.
“అది అమ్మటవే, ఇంకేవన్నా ఉందీ! వచ్చే రెండు మూడేళ్ళలో కనీసం ఇంకో పదిరెట్లు పెరిగితే రిటైర్‌మెంట్‌ గురించి ఆలోచించొచ్చని చూస్తున్నా” (నాలాటి వాళ్ళు షార్ట్‌ స్క్వీజుల్లో పోగొట్టుకున్న డబ్బుతో యిప్పటికి ఎంతమంది మిలియనీర్లై రిటైరయ్యారో!)
“అసలు, డబ్బులు సంపాయించాలంటే ఇంటర్‌నెట్‌ స్టాక్‌లండీ అసలైన దారి! ఒక్కొకటి ఎట్లా పెరుగుతుందో చూశారా? నేను పోయిన ఏడు యాభైకి కొన్న యాహూ రెండు స్ప్లిట్‌ల తర్వాత యిప్పుడు మళ్ళీ నాలుగొందలు ఉంది. దాన్లోనే ఓ హండ్రెడ్‌ తౌజెండ్‌ లాభం వొస్తుంది నాకు” అంటూ మళ్ళీ వచ్చి జాయినయ్యాడు శ్రీనివాస్‌.

తను ముప్ఫై మూడుకు కొన్న ఓరకిల్‌ ఎలా వంద దాటిందో కృష్ణమాచారి వర్ణిస్తోంటే సన్‌ మైక్రోలో తనకి ఎంత లాభం వచ్చిందో పైకే లెక్కేస్తున్నాడు రవీంద్ర. ఇంటెల్‌లో తనెంత సంపాయించిందీ చెప్పటానికి ప్రయత్నిస్తూ చాన్స్‌ దొరక్క నోరు తెరుస్తూ మూస్తూ ఉన్నాడు మదన్‌.

ఇదంతా వింటూ కూర్చున్న డాక్టర్‌ శేఖర్‌కి మతిపోతోంది. తను కొన్న స్టాక్‌లన్నీ కంపెనీలు దివాళా తియ్యటమో కొన్న ధరకి సగానికి సగం పడిపోవటమో తప్ప ఒక్క దాన్లో కూడ ఒక్క డాలర్‌ లాభం వచ్చిన పాపాన పోలేదు గత పదేళ్ళలోనూ.

పార్టీ ఐపోయి అందరూ  ఇళ్ళకి బయల్దేరుతున్నారు.
శ్రీనివాస్‌ కారెక్కటంతోటే వాళ్ళావిడ అందుకుంది “అదేమిటి, నేను ఇందాక అడిగితే సికమోర్‌ కొంటానికి కుదర్లేదన్నావ్‌, ఇప్పుడిక్కడ అందరికీ దాంట్లో పాతిక వేలొచ్చినయ్యని చెప్తున్నావ్‌! నాకు తెలీకుండా ఏవన్నాకథలు నడుపుతున్నావా ఏంటి? ఇంటికెళ్ళటంతోటే యీ రోజు ఎకౌంట్‌ యాక్టివిటీ ఏమిటో చూస్తా. దాన్లో సికమోర్‌ కనపడిందో, నిన్నింటోకి రానీను”.
దిమ్మతిరిగింది శ్రీనివాస్‌కి. “వాళ్ళకి చెప్పింది నువ్వూ నమ్మావా? అబ్బే ఉత్తినే, ఊరికినే! లేకపోతే ప్రతివాడూ నాకు దాంట్లో అంతొచ్చిందీ దీంట్లో ఇంతొచ్చిందీ అని కొయ్యటమే కదా! నేనూ నోటికొచ్చింది చెప్పా. వాళ్ళంతా ఎలా ఏడ్చుకుంటున్నారో చూశావా! హహ్హహ్హ..”
“మరి ఆ యాహూ సంగతేవిటి? అదీ ఇట్లాటి కథేనా?”
“మరీ పూర్తిగా కథ కాదు. నూట డెబ్భైకి కొని నూట యెనభైకి అమ్మా. కాస్త తగ్గితే మళ్ళీ కొందామని రోజూ చూస్తూనే ఉన్నా గాని అది అలా పైకే పోతుంది ఇంతవరకూ” నీళ్ళు నవుల్తూ అన్నాడతను.
“ఎవరికెన్ని కథలు చెప్తే నాకేం గాని నాకు నిజం చెప్పకపొయ్యావా నీ బతుకు కుక్క బతుకే!”  ఆఫీసులోని తన అధికార దర్పాన్ని ఎప్పట్లాగే మొగుడి మీద ప్రదర్శించింది సుభాషిణి.
“నీ మీదొట్టు. నీకెప్పుడూ స్టాక్‌ల గురించి అబద్ధం చెప్పను” గబగబా అనేశాడు శ్రీనివాస్‌ స్టాక్‌ బ్రోకరేజ్‌ ఎకౌంట్‌  జాయింట్‌ ఎకౌంట్‌ ఐనందుకు మరో సారి జుట్టు పీక్కుంటూ. ఐతే తనకొచ్చిన లాభాలూ నష్టాలూ అన్నీ కలిపి చూసుకుంటే ప్లస్‌ సైడ్‌ పెద్దగా వుండకపోయినా పార్టీల్లో మిగిలిన వాళ్ళందర్ని జెలసీతోచంపుతున్నందుకు తనని తను కంగ్రాచ్యులేట్‌ చేసుకుంటూ తృప్తిగా ఇంటి దారి పట్టాడు శ్రీనివాస్‌.

అనిల్‌కుమార్‌ కూడ ఆ రోజు హాయిగా నిద్రపోయాడు. సికమోర్‌ విషయంలో శ్రీనివాస్‌ కోతలు కోశాడని అర్థమై పోయిందతనికి. అంతేకాదు. మూడు నెలల క్రితం మరో పార్టీలో ఎప్పట్నుంచో యాహూ కొనాలని ఎదురుచూస్తున్నట్టు శ్రీనివాస్‌ చెప్పిన విషయం మర్చిపోలేదు అనిల్‌కుమార్‌! కనక తనే కాదు, ఇంకా చాలా మంది తనలాగే పైకి ఇకిలించుకుంటూ స్టాక్‌ మార్కెట్లో బోలెడు సంపాయిస్తున్నట్టు కబుర్లు చెప్తున్నారన్న మాట!
ఇక మిగిలింది ఒక్కటే తన ప్లాన్‌ ప్రకారం తొందర్లో ఎలాగోలా అప్పుచేసి ఓ  మాంచి బి.ఎం.డబ్య్లూ. కారు కొంటే తను నిజంగానే బోలెడంత సంపాయిస్తున్నా డనుకుని వాళ్ళు ఏడిచే ఏడుపుకి అంతుండదు. అప్పుడు గాని తనకి పూర్తిగా హాయిగా తృప్తి కలగదు!

ఇల్లు చేరిన డాక్టర్‌ శేఖర్‌ పరిస్థితి మాత్రం చాలా అధ్వాన్నంగా తయారైంది. అతనికి ఆ రాత్రంతా నిద్ర పట్టనే లేదు.తను నానా తిప్పలూ పడి జీవితంలో సగం కాలం కాలేజీల్లోనే గడిపి ప్రాక్టీసులో కూడ రోజుకి పదహారు గంటలు పనిచేస్తూ malpractice insurance కీ ఆఫీస్‌ ఖర్చులకీ, టాక్సులకీ బోల్డంత వదిలించుకుని నెలంతా చచ్చీ చెడీ సంపాయిస్తున్నంత డబ్బు నిన్న గాక మొన్న ఏదో కంప్యూటర్‌ కోర్స్‌ చేసి వచ్చిన వాళ్ళు ఒక్క రోజులో స్టాక్‌ మార్కెట్‌లో సంపాయించేస్తున్నారు!

ఇన్నాళ్ళూ ఎంత పరువుగా బతికాడు తను?
తెలుగు కమ్యూనిటీలో ఎంత గౌరవం ఉండేది తనకి?
అదివరకు తను పార్టీలోకి నడిస్తే ఒక్కసారిగా అందరూ వచ్చి తన చుట్టూ మూగిపోయే వాళ్ళు!
వాళ్ళ కళ్ళలోంచి గౌరవం పొంగి ప్రవహించేది తన కాళ్ళ వైపు!

ఈ స్టాక్‌మార్కెట్‌ దెబ్బతో అంతా ఊడ్చిపెట్టుకు పోయింది!
మొన్నటి దాకా తనని గౌరవించిన వాళ్ళంతా ఇప్పుడీ స్టాక్‌రాక్షసుల చుట్టూ మూగిపోతున్నారు!
ఆఖరుకి యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడ తనని పట్టించుకోవటం లేదిప్పుడు!
దేశం నాశనం ఐపోతోంది!

ఏమిటీ జీవితం?
ఎన్నాళ్ళిలా ఎవరికీ పట్టకుండా బతకటం?

తెల తెల వారుతుండగా ఓ ముఖ్యమైన నిర్ణయానికి వచ్చాక గాని అతనికి కాస్త కునుకు పట్టలేదు.
మర్నాడు డాక్టర్‌ శేఖర్‌ వర్క్‌ కి ఫోన్‌ చేసి తను ఆర్నెల్లు వెకేషన్‌ తీసుకుంటున్నానని, తన పేషంట్స్‌ని మిగిలిన పార్న్టర్స్‌ చూసుకోవాలని చెప్పేశాడు!

ఆ రోజే వెళ్ళి Day-Trading Training లో చేరి పోయాడు!

………………………………………………………

తొందర్లో డే ట్రేడర్‌ శేఖర్‌ని కూడా టీవీలో చూడబోతున్నామా?!
------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు, 
ఈమాట సౌజన్యంతో

Sunday, November 24, 2019

నాతి నోట నువ్వు గింజ


నాతి నోట నువ్వు గింజ




సాహితీమిత్రులారా!


నాతి నోటిలో నువ్వుగింజ నానదు,” అని నానుడి. అంటే, ఆడ కూతురు దగ్గర రహస్యం దాగదు అని అర్థం. రహస్యం దాచలేని సంగతి అలాఉంచి, నువ్వుగింజ నానదు అనెందుకన్నారో, నాకు ఇప్పటికీ బోధపడలేదు. నువ్వుగింజలు అలా నీళ్ళల్లో వెయ్యంగానే నాని పోవే? నువ్వుపప్పు, అవే తెల్ల నువ్వులు నల్లనువ్వులకన్నా కాస్త తొందరగా నానుతాయేమో! అంతే. నల్లనువ్వులు నోటిలో వేసుకోని చూశా. అవి నానటానికి చాలాకాలం పట్టింది. నీళ్ళల్లో వేసి కూడా చూశాను. అప్పుడు అవి ఏమీ తొందరపడలేదు, నానటానికి. అంతకన్నా పెసలు తొందరగా నానాయి. ఇది స్వానుభవం. మరి ఈ నువ్వుల నానుడి ఎలావచ్చిందో నాకు అంతుపట్టలేదు.

పోతే, ఆడవారు రహస్యం ఎంతమాత్రం దాచలేరు అన్న విషయం. ఆ కథ తరువాత చెపుతా. “ఇదిగో! ఏవమ్మోయ్! మళ్ళి ఎవ్వరితో అనబోకేం! నీకు ఒట్టేసి చెపుతున్నా,” అని చెప్పిన మరుక్షణమే ఆ రహస్యం మనోవేగంతో, ఏతత్బృందంలో జట్టుగాఉన్న ఆడవాళ్ళందరికీ, ఒకరినించి మరొకరికి, నోటిమాటగా చేరిపోతుంది. కాదు కాదు, జారిపోతుంది. ఆహా! తెలిసెన్ అనుకున్నా.

నా ఉద్దేశంలో, నువ్వుగింజ నానడం నానుడి, ఇలా సవరించాలి. ” నొటిలో నువ్వుగింజ ఆనదు,” అని. అంటే, జారి పడిపోతుందీ అని అసలు అర్థం. అయితే, ఆడవారికి రహస్యం చెప్పడంలో ఒక సుఖం ఉంది. ఎవరికి వారే, వాళ్ళొక్కళ్ళకే ఈ రహస్యం తెలిసినట్టు, అవసరమైతే గుట్టుగా ఉంచగలరు. అక్కడే, మగవాళ్ళకీ, ఆడవాళ్ళకీ ఉన్న పెద్ద తేడా. మగవాళ్ళు పబ్లిగ్గా, గ్రూపులో వాగేస్తారు. అందుకని, ఏ ముఖ్య రహస్యమూ మగవాళ్ళకే చెప్పకూడదు, ఎందుకంటే, వాళ్ళు బాకా రాయుళ్ళు కాబట్టి.

ఆడవాళ్ళు రహస్యం దాచలేకపోవడం అనే కథకి శ్రీమాన్ వేద వ్యాసుడు గారే కారణం.

మహాభారత యుద్ధం ముగిసింది. జ్ఞాతులు, సామంతులు, మొత్తం కురువంశం పాండవుల చేతిలో కృష్ణుడి చేతిచలవవలనా, స్వర్గస్థులయ్యారు. కర్ణుడి మరణంతో అసలు కథ ముగిసిందనే అనచ్చు.

శాంతి పర్వం ప్రారంభంలో, శోకవ్యాకులుడై పరితపిస్తున్న ధర్మరాజుకి, నారదుడు కర్ణుడి కథ యావత్తూ చెపుతాడు. కర్ణుడి పుటుక రహస్యం, అతనికి జరిగిన అన్యాయం, శాపాలు, వగైరా అన్నీ పూసగుచ్చినట్టు చెపుతాడు. ఇది వింటున్న కుంతి తాను ఎందుకు కర్ణుడి పుటుక గురించి ఏ శాపకారణంగా చెప్పలేకపోయిందో వివరిస్తూ, ధర్మరాజుని ఉపశమింప చేయ పోఓనుతుంది. ధర్మరాజుకి కుంతిపై కోపం వస్తుంది, అసహ్యం పుడుతుంది. కుంతి కర్ణుడి గురించి ఎంత బాధ పడిందో ధర్మరాజుకేం తెలుస్తుంది?

ధర్మరాజు చేత వేదవ్యాసుడుగారు పలికిస్తున్నాడు:

భవత్యా గూఢా మంత్రత్వాత్ పీడితో స్మిత్యువాచతాం
శశాప చ మహాతేజాః సర్వలోకేషు చ స్త్రీయాః
న గుహ్యం ధారయిష్యన్ తిత్యతి దుఃఖ సమన్వితః — 12.6.10

అంటే స్థూలంగా అన్వయం : నీవు (కుంతిని ఉద్దేసిస్తూ) ఈ రహస్యం దాచిపెట్టి ఇంత అనర్థం తెచ్చిపెట్టావు. అందుకుగాను ఇకముందు స్త్రీ జాతి అంతా, రహస్యం దాచలేని శక్తిహీనులుకావాలని శపిస్తున్నాను, అని.

తిక్కన గారు తెలుగులో చక్కటి తేటగీతిలో ఇదేవిషయం చెప్పారు.

అంగజానమ్ములకు రహస్య రక్ష-
ణంబునందలి శక్తి మనంబులందు
కలుగ కుండెడు మెల్ల లోకముల నని శ-
పించె నా ధర్మదేవతా ప్రియ సుతుండు. — 12.1.41

దీనికి తాత్పర్యం చెప్పడం అవమానించడమే అవుతుంది. ధర్మజుడి శాపకారణంగా నాటినుంచి, స్త్రిలు రహస్యం తమలో దాచుకోలేరుట. అది కథ.

ఈ శాపం కూడా ఒకందుకు మంచిదే. రహస్యాలు, అందులోనూ, యుద్ధ ప్రేరణకి వినాశానికీ తెరువైన రహస్యాలు, దాచకపోవడమే మంచిది కదూ! కుండ బద్దలుకొట్టి రహస్యాలు బయట పెడితే, అసలు యుద్ధాలు వచ్చేవే కావేమో! లేదా, అన్యాయంగా ఉత్తిపుణ్యానికే కాలుదువ్వి మొదలెట్టే యుద్ధాలు, స్త్రీ జాతి ఆపగలదేమో! అలా మొదలైన యుద్ధాలు స్త్రీలే అంతం చెయ్యగలరేమో, చూడాలి.
---------------------------------------------------------
రచన: వేలూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో

Friday, November 22, 2019

ఒక నవ్వునొప్పి


ఒక నవ్వునొప్పి




సాహితీమిత్రులారా!

నాకొక్కటివ్వవా…
ఒక చిత్రమనిపించే నవ్వు
పలవరింతలాంటి పలకరింత
ఏదో చోటనించి కబురెంతో కొంత

చిన్నదైనా పర్లేదు మంత్రదండం
పెద్దదైనా పర్లేదు అబద్ధ వాత్సల్యం
బరువైనా పర్లేదు గుప్పెడాలోచన

ఈ మసకలోంచి చూసినవన్నీ చూసినప్పుడల్లా
కుదుపుతూనే కదుపుతూనే ఉన్నాయనుకో
ఐనా ఒకప్పుడు చూర్లకిందా వరండాల్లోనూ
కుడుతున్న దోమల్ని తోలుకుంటూనూ
వంటింట్లో వాసనల్ని పోల్చుకుంటూనూ
మమతలు మెలిబెట్టుకోలేదా
మో మన మాటల్లో దొర్లాడా లేదా
విప్పిన మనసులొకటయ్యాయి కదా
చప్పున ఆశలెగిరాయి కదా…

అప్పట్లో
ఆరిన తడి తుడిచిందీ
ఏడ్చి మెచ్చుకుందీ
మెచ్చినట్టు ఏడ్చిందీ
నువ్వేనని తెలిసినా పర్లేదులే
ఇప్పట్లో…

కొంచెం తుళ్లి కొంచెం మళ్లి
కొంచెం నువ్వంటే తెలిశాక మరి కొంచెం వెనక్కెళ్లి
అలలన్నీ ఆపేసి చేతలన్నీ చెరిపేసి
మామూలుగానే తింటో తాగుతో తిరుగుతో అరుగుతో
కళ్లవెనుక చూపు మందగించినా పైకి
పళ్లబిగువున భలేగా నవ్వుతో భరిస్తో

మిత్రమా –
తెరిచిన ముడులు బిగిసేనా
దూసిన మాటలు చెదిరేనా…
నవ్వులు నిండేనా దుఃఖపు దోసిట్లో?
-----------------------------------------------
రచన: ఎస్. ఆర్. బందా, ఈమాట సౌజన్యంతో

Wednesday, November 20, 2019

నెలబానిస


నెలబానిస




సాహితీమిత్రులారా!


ముఖం చూడు…
ముఖానికేం? ముఖారవిందం.
ముఖమా? అరవిందమా?
అరబిందెనా?
పూర్తి బిందెనా?
ఎటో వెళ్ళిపోతోంది మనసూ…
ఎందుకిలా బ్రో?
బ్రో…చే…వారెవరురా బ్రో…

అయిదొకటి. ఆరొకటి. పదకొండొకటి.
ఒక్కొక్కటి మహా ఇక్కట్టు.
డౌటు పడకు. డేటు మారరాదు. కట్టవలె.
అవునూ, అలహాబాదు బాంకు హిందీలో ఇలాహాబాదు బాంకు ఎట్లగును?
నేను కట్టను.
గట్టిగా అనకు. మెర్జయిపోతుంది.
కొండొకచో ఇట్లగును.
కాదు.
ఎప్పుడూ ఇంతే.
ఖాళీ బిందె.
జమా కీ గయీ రాశి నుండి ఆహరిత రాశి పోగా
ఖాతా శేషము దాదాపు నిశ్శేషము.

పదిహేనేళ్ళు, పంద్రా సాల్, ఫిఫ్టీన్ యియర్స్.
సృష్టిలో చేదయిన పదములేనోయీ
ఇంకోటి కలుపు వాటికి. ఒకే ఒక్కటి.
ఓన్లీ!
ఈఎమ్ఐ వదలని ప్రియమైన దయ్యమై…
మధ్యలోని దళసరి గీత క్రమంగా చెరిగిపోయి,
మోజే అవసరమై, ప్చ్!

నువ్వొక్కడివేనా?
బయటికి చూడు
ఎన్నో ముఖాలు
లోపల విలవిలా వలవలా
బయటకు తళతళా…
కదం తొక్కుతూ ఆన్‌లైన్లో
కిస్తీలన్నీ కట్టేస్తూ…
-----------------------------------------------
రచన: శ్రీకాంత్ గడ్డిపాటి, 
ఈమాట సౌజన్యంతో

Monday, November 18, 2019

‘మంచి’ కథ


‘మంచి’ కథ



సాహితీమిత్రులారా!


ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్లనూ ఊళ్లనూ దేశాన్నీ వదిలిపెట్టి కాందిశీకులుగానో శరణార్థులుగానో మరో ప్రదేశానికి, మరో దేశానికి వెళ్లిన మనుషులు ఆ వెళ్లిన దేశానికి వరమా, శాపమా?


జీవితాలు అతలాకుతలం అయినపుడు మనుషులు చెల్లాచెదురై శరణుకోరుతూ పరాయి ప్రాంతాలకు వెళ్లడమన్నది అప్పటికీ ఇప్పటికీ ప్రపంచానికి కొత్తేమీ కాదు. ఈ వలసలూ శరణుకోరడాలూ ఎంతలేదన్నా ఐచ్ఛికం. యుద్ధాల్లో ఓడిపోయినవారినీ, అడవుల్లో వేటాడి పట్టుకొన్నవారినీ, వలస రాజ్యాలలో బతికేవాళ్లనూ బానిసలుగానూ, అర్ధబానిసలుగానూ చేసి పిరమిడ్లకు పునాదిరాళ్లుగానూ, పంటపొలాలకు ఎరువుగానూ, రైలు మార్గాలకు స్లీపరు బద్దెలుగానూ వాడుకోవడమన్నది నాగరికత నేర్చిన సమాజాలకు బాగా అలవాటయిన పనే. నిన్న మొన్నటిదాకా, ఆ మాటకొస్తే ఈ రోజున కూడా ఆధిపత్య సమాజాలు ఆమోదించి ఆచరిస్తోన్న పనే. కానీ ఆ బానిసల, నిస్సహాయుల శ్రమా శక్తీ తమ తమ సమాజాల అభివృద్ధికి పునాదులు వేశాయంటే నాగరికత ఒప్పుకోదు. అది దాచలేని సత్యమే అయినా ఆ సత్యానికి మసిపూసి మారేడుకాయ చెయ్యటం వక్రభాష్యాలు చెప్పడం సభ్యసమాజపు సహజ ప్రకృతి.

2011లో మొదలయిన సిరియా అంతర్యుద్ధానికి ఎనిమిదేళ్లు నిండాయి. లక్షన్నరమంది ప్రాణాలు పోయాయి. లక్షన్నర కాదు, నాలుగు లక్షలు అన్నది మరొక అంచనా. ఏభై లక్షలమంది దిక్కులు వెతుక్కుంటూ ప్రపంచమంతా చెల్లాచెదురైపోయారు. మరో యాభై లక్షలమంది తమ దేశంలోనే ఇల్లూ వాకిలీ లేనివాళ్లయ్యారు. అంతర్యుద్ధం కాస్తా సహజంగానే ప్రపంచ సమస్య అయింది. అసలా పరిణామాలకు బయట శక్తులే కారణం అన్న అభిప్రాయం ఒకటి ఉంది. ఆ వివాదంలోకి వెళ్లడం ఇక్కడి ఉద్దేశ్యం కాదు. ఈ ‘మంచి’ కథకు అది వస్తువు కానే కాదు.

సిరియా వదిలిన ఏభై లక్షలమందీ టర్కీ, లెబనాన్, జోర్డాన్, ఈజిప్ట్ లాంటి పరిసర దేశాల్లోకీ, జర్మనీ లాంటి యూరోపియన్ దేశాల్లోకీ, కెనడాలాంటి సుదూర తీరాలకూ వెళ్లారు. ఈ పరిణామం ఒక అనవసరపు ఉపద్రవం అని భావించిన దేశాలు వాళ్లను కాంపుల్లో ఉంచి చావకుండా చూశాయి. విషయాన్ని మూలాలలోంచి చూసిన దేశాలు మరికాస్త సానుకూలంగా స్పందించాయి. జర్మనీ పదిహేను లక్షలమంది శరణార్థులను ఆదరించింది. సుదూరపు కెనడా కూడా పాతికవేలమందికి ఆశ్రయం ఇచ్చింది.

పరిణత దేశాల సానుకూల స్పందనలతోపాటు ఆయా దేశాల్లోని అతిమితవాదులు అగ్నిహోత్రావధాన్లవడమూ జరిగింది. ఎంతో సహజంగా జరిగింది. మన సంస్కృతి, మన భాష, మన మతం, మన ఆర్థిక వ్యవస్థ అంతా కలుషితమవుతాయి, ధ్వంసమవుతాయి అని దేశభక్తులు నినాదాలు చేశారు. అడ్డుకోడానికి నడుముకట్టారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీలాంటి దేశాల్లో వారికి రాజకీయంగా గొప్ప ఊపు దొరికింది. తమదేశపు ఉదారవైఖరికి కారణభూతమై ప్రపంచపు ప్రశంసలు అందుకొన్న జర్మనీ ఛాన్సెలర్ ఆంగెలా మెర్కెల్ రాజకీయంగా పెద్ద మూల్యమే చెల్లించుకోవలసివచ్చింది.

ఈ నేపథ్యంలో… నాలుగేళ్ల క్రితం. 2015 వేసవి కాలం.

జర్మనీలోని తూర్పు సరిహద్దు ప్రాంతపు గోల్ట్సావ్ అన్న గ్రామంలో కలకలం, కలవరం.

పాతికేళ్లనాడు బెర్లిన్ గోడ కూలి రెండు జర్మనీలూ ఒకటే అయ్యాక ఊళ్లోని పడుచువాళ్లంతా కొత్త అవకాశాలను వెదుక్కుంటూ దూరదూరాలు వెళ్లిపోగా, అప్పటిదాకా పన్నెండువందలమంది ఉన్న ఆ గ్రామపు జనాభా ఒక్కసారిగా ఎనిమిది వందలయింది. కమ్యూనిస్టు పాలన ఉచ్చదశలో ఉన్నపుడు ‘గోల్ట్సావ్ బాలలు‘ అన్న ప్రఖ్యాత డాక్యుమెంటరీ చిత్రానికి నేపథ్యంగా నిలచిన ఆ గ్రామంలో ఇప్పుడు చదువుకోడానికి పిల్లలే లేరు. ఊళ్లోని స్కూలు మూతపడే పరిస్థితి. అదే సమయంలో ఊళ్లోకి పరాయివాళ్లను రానీయకూడదు అన్న మితవాద భావన ప్రబలమైన పరిస్థితి. స్థానిక ఎన్నికల్లో పాతిక శాతం అక్కడి అతిమితవాద పార్టీకి ఓటేసిన సందర్భం.


ఆ సమయంలో గ్రామపెద్ద, ఫ్రాంక్ షూట్జ్‌కు పైనుంచి వర్తమానం వచ్చింది. మన దేశానికి సిరియా నుంచి వలసవచ్చిన లక్షలాదిమందిలో పదహారుమందిని మీ గ్రామానికి తరలిస్తున్నాం, అని. ఏంచెయ్యాలో పాలుపోని పరిస్థితి ఆ గ్రామపెద్దది. ఆ పదహారు మందిని గ్రామంలోకి తీసుకువస్తే స్థానికులకు అది సహజంగానే పుండుమీద కారం అవుతుందని తెలుసు. ‘వెర్రితనం’ అని అననే అన్నాడు ఆ ఊరి క్షురకుడు. ‘అసాధ్యం’ అని తీర్పు ఇవ్వనే ఇచ్చాడు, పెద్దవయసు రైతు ఒకాయన.

ఫ్రాంక్ షూట్జ్ నిర్ణయం తీసుకొన్నాడు. సిరియన్లను ఆహ్వానించాడు. అప్పటికే ‘ఐక్యమైన జర్మనీ దేశంలో మన తూర్పు జర్మన్లమందరం రెండో తరగతి పౌరుల్లా జీవిస్తున్నాం’ అని మథనపడే ఉదారహృదయపు గ్రామస్తులకు కూడా ఈ పని నచ్చలేదు. సహాయనిరాకరణకు నడుంకట్టబోయారు. అందర్నీ ఒకచోట చేర్చి పరిస్థితిని వివరించాడు షూట్జ్. పైనుంచి వచ్చిన తాఖీదు కదా తప్పదు అన్నాడు. ఆ దిక్కులేనివాళ్లకు ఆశ్రయమిచ్చి చూద్దాం అన్నాడు.

పదహారుమంది ఊళ్లోకి రానేవచ్చారు. అందులో పెద్ద మహమ్మద్, చిన్న మహమ్మద్, తస్నీన్, రితజ్ అంటూ పదిమంది పిల్లలు. వాళ్లకుతోడు ఆరుమంది పెద్దలు, ఆ పిల్లల తల్లిదండ్రులు. ‘మన వూరి నవబాలలు’ అంటూ ముచ్చటపడ్డాడు ఫ్రాంక్ షూట్జ్. వచ్చినవాళ్లకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికాడు.

నిజానికి ఆ పదహారుమంది సిరియన్లకు కూడా ఆ మారుమూల గ్రామం రావడమన్నది కాస్తంత ఇబ్బంది కలిగించిన విషయమే. ‘ఆ మారుమూల తూర్పు జర్మనీ గ్రామమా! మీకేమన్నా మతిపోయిందా? అదంతా కరుడుగట్టిన ప్రదేశం. మన పొడ వాళ్లకు గిట్టదు. చాలా ప్రమాదం. జర్మన్ అధికార్లను బ్రతిమాలుకొని మరో ఊరు వేయించుకోండి.’ అని సాటి శరణార్థి స్నేహితులు బలమైన సలహాలు ఇచ్చారు. అయినా ఆ పదహారుమందీ గోల్ట్సావ్ వచ్చారు. మరోదారి ఎలానూ లేదాయె!

అప్పటిదాకా ఖాళీగా పడివున్న గ్రామపు ఇళ్లు కొత్త అతిథుల రాకతో కళకళలాడాయి. ఊళ్లోని కొంతమంది సహృదయులు వచ్చినవాళ్లు సులభంగా స్థిరపడటానికిగాను చిన్నచిన్న వంటపాత్రలూ, ఇతర పనిముట్లూ ఇచ్చి సాయపడ్డారు. స్కూలు తెరచిన మొదటిరోజున జర్మను పిల్లల తలిదండ్రులు సిరియన్ అతిథుల గౌరవార్థం అతి చక్కని కేక్ తయారుచేసి తెచ్చారు; తెచ్చాక తెలిసింది అది రంజాన్ మాసమనీ, సిరియన్లకు ఉపవాసమనీ! ముందుగా బిత్తరపోయినా క్షణాల్లో అంతా తమాయించుకొని కడుపారా నవ్వుకున్నారు. ముగ్గురు సిరియన్ పిల్లల తల్లి తాహ కేక్ కట్ చేసింది.

మన భాష, మన సంస్కృతి, మన మతం, మన జీవనసరళి, చిల్లర దొంగతనాలు–అంటూ మొదట్లో మథనపడిన ఊరివాళ్లలో వాళ్లకు తెలియకుండానే క్రమక్రమంగా మార్పులు చోటుచేసుకొన్నాయి. సిరియన్ అతిథులు కూడా ఊరితో మమేకం అవసాగారు. స్కూలు ఆవరణలో పోగుపడిన ఆకూ అలముల్ని శుభ్రం చెయ్యడంలో సిరియన్ పిల్లలూ వాళ్ల తల్లిదండ్రులూ ముందుండసాగారు. ఏడాదికోసారి గ్రామంలో జరిగే ఫలపుష్ప ప్రదర్శనలో జర్మన్ తినుబండారాలతోపాటు సిరియన్ వంటకాలూ కనిపించసాగాయి. తన పిల్లలూ, మనవలూ ఎంతో దూరాన ఉన్న ఓ పెద్దాయన ముగ్గురు సిరియన్ పిల్లల్ని చేరదీశాడు. వాళ్లకు ఈత కొట్టడం, చేపలు పట్టడం నేర్పించసాగాడు. ఆ పిల్లలు ఆ పెద్దాయన్ని తాతా అని పిలవసాగారు.

నాలుగేళ్లు గడిచేసరికి ఊళ్లోకి వచ్చిన ఆరుగురు పెద్దాళ్లూ తమకు తగ్గ పనులు వెదుక్కుని ఆ పనుల్లో నిలదొక్కుకోగలిగారు. పదిమంది పిల్లలూ ఊరికి చిరుదివ్వెలయ్యారు, ఆశాదీపాలయ్యారు…

ఈ పరిణామం ఒక్క గోల్ట్సావ్ గ్రామానికే పరిమితం కాదట.


శరణార్థులు రావడం వల్ల సగటు జర్మన్లలో దేశవ్యాప్తంగా భయాందోళనలు కలిగాయి. మితవాద పక్షాలు విద్వేషకీలలు ఎగద్రోశాయి. అయినా లక్షలాదిమంది శరణార్థులు స్థానిక జీవనస్రవంతిలో కలసిపోయి అందులో విడదీయలేని భాగమయిపోవడమన్న ప్రక్రియ నిశ్శబ్దంగా కొనసాగుతోందట. ప్రభుత్వంవారి లెక్కల ప్రకారం ఈ నాలుగేళ్లలో ఇప్పటిదాకా జర్మనీ వచ్చిన శరణార్థుల్లో మూడోవంతుమంది ఏదో ఒక కొలువులో చేరుకొని ఆర్థికవ్యవస్థలో భాగమయ్యారట.

లోతుకు వెళ్లి చూస్తే ఇదేమీ వింతా విడ్డూరం అనిపించదు.

రంగు, భాష, సంస్కృతి, మతం, జాతి అన్న పొరలు దాటివెళితే మనిషికీ మనిషికీ మధ్య మరీ మనం అనుకునేంత దూరం లేదన్న వాస్తవం కనిపిస్తుంది.

జర్మనీ అయినా అమెరికా అయినా; భారతదేశంలోని అనేకానేక రాష్ట్రాలు అయినా; కారణాలు వేరువేరు అయినా; భిన్న జాతులవాళ్లూ భాషలవాళ్లూ కలసిపోయి బతకడం అన్నది ఈ కాలపు అవసరం.

నిజానికి అదో గొప్ప అవకాశం.
(ది న్యూయార్క్ టైమ్స్ లోని వార్తాకథనం ఆధారంగా.)
---------------------------------------------------------
రచన: దాసరి అమరేంద్ర, 
ఈమాట సౌజన్యంతో

Saturday, November 16, 2019

నిద్రరాని రాత్రి


నిద్రరాని రాత్రి





సాహితీమిత్రులారా!

గది కిటికీ నిశ్శబ్దంగా తెరుచుకుంటుంది
శూన్యంలోకి చూపుల వలలు విసిరి
తెలియని దేనికోసమో వేట ప్రారంభిస్తుంది

హృదయకవాటాలను తోసుకుంటూ
జ్ఞాపకాల గాలివాన వస్తుంది
గుండెగోడకు కాలం మేకుని కొట్టి
మనసుదారంతో అనుభవాలను గుచ్చి వేలాడదీస్తుంది

నిముషాలు గంటలై ఘనీభవించిన రాత్రి
అతిమెల్లగా కరుగుతూ వుంటుంది
వేటాడిన చూపులు అలిసిపోతాయి
విచ్చుకుంటున్న వెలుగురేకల్లో
ఎర్రబారి మండిపోతాయి

మూసిన కిటికీ రెక్కల వెనకనుండి
పాదుకున్న పాదాలు కదల్లేక కదుల్తాయి
అంతవరకూ నిట్టూర్పుల వడగాలిలో
వేగిపోయిన చువ్వలు బరువుగా నిశ్వసిస్తాయి
--------------------------------------------------
రచన: కుదరవల్లి కృష్ణకుమారి, 
ఈమాట సౌజన్యంతో

Thursday, November 14, 2019

డిటెక్టివ్‌ నీలూ


డిటెక్టివ్‌ నీలూ



సాహితీమిత్రులారా!


గురువారం పొద్దున్న నేను నిద్ర లేచేప్పటికే గోపాల్‌ఆఫీసు కెళ్ళేందుకు రెడీ అవుతున్నాడు. నేను కాఫీ పెట్టుకుని (“మా అల్లుడు కాఫీ అన్నా తాగడు, మహా బుధ్ధిమంతుడు” అని మురిసిపోతుంది మా అమ్మ, అతను తాగేవి ఆవిడకి తెలీదు పాపం!), మొహం కడుక్కొచ్చి కాఫీ చప్పరిస్తూ ఈమెయిల్‌చూస్తుంటే, బాసు బూట్లేసుకుని “ఏయ్‌నీలూ, కారు తాళం!”అని ఎదురు చూస్తున్నాడు. ఆరు నూరైనా, రోజూ కారు తాళంతో బాటు ఈ బుధ్ధావతారానికి ఒక ముద్దిచ్చి సాగనంపటం నా దినసరి కర్తవ్యం అయి కూర్చుంది. గోపీ ముద్దు పుచ్చేసుకుని వెళ్ళి పోబోతుంటే సడన్‌గా గుర్తొచ్చింది, అతని టై పట్టుకుని ఆపేశాను,

“ఏయ్‌గోపూ, ఇవ్వాళ్ళ దైరకుందానా డాన్స్‌కంపెనీ వాళ్ళ జపనీస్‌ డాన్స్‌ ప్రోగ్రాముంది సాయంత్రం ఏడింటికి. మర్చిపోక తొందరగా వచ్చెయ్యి. నేను డిన్నర్‌రెడీగా వుంచుతా,” అని చెప్పాను. తను తలూపి వెళ్ళిపోయాడు.

నేను ప్రతి రోజూ విధిగా దర్శించే వెబ్‌సైట్లన్నీ చూసుకుని, ఇక లాబ్‌కి పోవాలి అనుకుంటూ చివరిగా మళ్ళీ ఈమెయిల్‌చూడబోతే, గోపాల్‌ దగ్గర్నించి, “సారీ డియర్‌, సాయంత్రం ప్రోగ్రాముకి రాలే”నంటూ ఈమెయిల్‌!

నాకు వొళ్ళు మండుకొచ్చింది. మళ్ళీ ఏదో ప్రాజెక్టు నెత్తిమీది కొచ్చి వుంటుంది. డాక్టరైతే వేళా పాళా లేకుండా రోగులసేవలో పడివుంటారని చెప్పి కంప్యూటర్‌ఇంజనీర్‌ని చేసుకుంటే .. ఇతగాడి పనీ అలాగే వుంది, రోజుకి ఇరవై నాలుగ్గంటలు చాలవు పనికి! సరే, ఏం ముంచుకొచ్చిందో కనుక్కుందామని ఫోన్‌ చేశా.

“గోపాల్‌ హియర్‌”

“ఆ, నేనే. ఏంటి సాయంత్రం రాలేనంటావ్‌? మళ్ళా ఏదన్నా ప్రాజెక్టు డెడ్‌లైనా?”

“ఓ, ఈమెయిల్‌చూశావా? అదీ .. ప్రాజెక్టు కాదు. నువ్వు చెప్పినప్పుడు గుర్తుకి రాలేదూ, వర్కుకి డ్రైవ్‌చేస్తుంటే గుర్తు కొచ్చింది, కారుకి బ్రేక్స్‌ మార్పించాలి. ఇవ్వాళ సాయంత్రం షాపు వాడి దగ్గర ఎపాయింట్‌మెంట్‌ తీసుకున్నాను. మరి ఆ పని పూర్తయ్యేప్పటికి లేటవ్వచ్చు అందుకనీ ..”

“అబ్బ, ఆ బ్రేకులేదో ఇవ్వాళ్ళే చెయ్యాలా? రేపో ఇంకో రోజెప్పుడైనా ..”

“అహా, నీకు తెలుసుగా అది రెండు వారాలుగా ట్రబులిస్తోందీ .. అప్పుడు కాల్‌ చేస్తే షాపు వాడు ఇవ్వాళ్టికి ఇచ్చాడు డేటు. ఇది గనక మిస్సైతే .. ఏ క్షణాన నడి రోడ్డులో అది విరిగి చస్తుందోనని భయపడి చస్తున్నాను ..”

“అయ్యా, బాబూ, నువ్వేమీ చచ్చిపోవద్దు .. బాంకు సేఫ్టీబాక్సులో దాచిపెట్టిన నా తాడు ఇంకా గట్టిగానే ఉందిలే,” అన్నాను కసిగా. ఇంతలో ఒక బ్రిలియంటైడియా తట్టేసింది నా బుర్రకి.

“అవునూ, నువ్వెందుకు సాయంత్రం షాపుకి పోయి కూర్చోవడం? లంచి టైములో కారిచ్చేసి వొస్తే వాడే చేసి వుంచుతాడుగా, హాయిగా సాయంత్రం వచ్చేప్పుడు తెచ్చేసుకోవచ్చు. ఉన్నాడుగా నీ శిష్యుడు శేషు, నిన్ను షాపుకి తీసుకెళ్ళి తీసుకొస్తాడు”

“అవుననుకో, కానీ లంచి మానుకోవాలి వెళ్ళి రావాలంటే. నేనైతే మానేస్తా ననుకో. పాపం శేషుని గూడా మానెయ్య మంటే .. బావుండదేమో? అందుకే ఇలా సాయంత్రం కానిచ్చేస్తే సరి. ప్రోగ్రాముకి నువ్వెళ్ళొచ్చెయ్‌”

“పోనీ ఒక పని చెయ్‌, ఏ మాత్రం వీలున్నా డైరెక్టుగా థియేటర్‌దగ్గిరి కొచ్చెయ్‌. నేను షో మొదలయ్యే దాకా నీ కోసం చూస్తాను.”

“ఎందుకులే నీల్‌స్‌. నువ్వు హాయిగా కూర్చుని ఎంజాయ్‌చెయ్యి. నాకెలాగూ కుదర్దులే!”

అంటూ వేరే మాటకి తావులేకుండా హడావుడిగా ఫోన్‌ పెట్టేశాడు.

నాకు పిచ్చి కోపమొచ్చింది నా మొగుడి మీద. అసలు నా మొగుడికి వుంటే గదా, పెళ్ళాంతో కలిసి ప్రోగ్రాము కెళ్ళాలీ అని. మనిషికి మళ్ళీ మంచి టేస్టే వుంది, బాలమురళి గానాన్ని చెవులప్పగించి వింటాడు, కూచిపూడి భరతనాట్యం ప్రోగ్రాములేవన్నా వూళ్ళో జరిగితే తప్పకుండా వెళ్ళి ముందు వరసలో కూర్చుని గుడ్లప్పగించి చూస్తాడు. ఎటొచ్చీ విదేశీ నాట్య సంగీతాల దగ్గరే వస్తుంది గొడవంతా .. నాకేమో, ఎట్లాగూ ఈ దేశంలో వున్నాం గదా, అందులోనూ యూనివర్సిటీలో బోలెడు దేశ దేశాల ప్రోగ్రాములు జరుగుతుంటాయి, నాలుగూ చూసి ఆనందించాలని. గోపీకి అవి అంతగా నచ్చవు, “ఆ ఏవుంది, ఆ డాన్సుల్లో, ఓ అభినయమా, ఓ భావమా? పిచ్చిగా తైతెక్కలాడ్డం .. దానికి తోడు ఆ సంగీతం వొకటి, ఏనుగులు ఘీంకరిస్తున్నట్టూ, కుక్కలు మూలుగుతున్నట్టూనూ,” అని తీసి పారేస్తాడు. ఐనా నేను బెదిరించో బెల్లించో నాకిష్టమైన ప్రోగ్రాము లన్నిటికీ తనని లాక్కుపోతూనే వుంటాను. ఈ రోజసలు ఈ కారు సర్వీసు భాగోతమంతా గోపీ ఈ మోడర్న్‌డాన్స్‌ఎగగొట్టటానికేసెటప్‌ చేశాడేమో? ఏబ్బే, మనిషికి అంత తెలివి గూడానా. పుంఖానుపుంఖాలుగా కంప్యూటరు కోడ్లు రాసేస్తాడు గానీ, యిలాంటి దుర్మార్గపు తెలివితేటలు లేవు గోపీకి!

‘మీరజాల గలడా నా యానతి ‘ అని నాకు నేనే కూని రాగం తీసుకుంటూ స్నానాని బయల్దేరాను. నే నొక్కదాన్నే వెళ్ళలేనా అంటే .. మహరాణిలా వెళ్ళగల్ను, కానీ వొక్కదాన్నీ ఎందుకెళ్ళాలి? అక్కడ అందరూ జంటలు జంటలుగా వస్తారు, నేను మాత్రం ఏక్‌ నిరంజన్‌ అంటూ పోతే .. అదేం బావుంటుంది? నాకంటూ ఇంచక్కటి ఎస్కార్టు ఒకడుండగా! దానికి తోడు మనం చూసిన అనుభవాన్ని ఇంకొకళ్ళతో .. ముఖ్యంగా ప్రియమైన మొగుడితో పంచుకున్న అనుభవం వేరు కదా.

స్నానం ముగించి పని కెళ్ళేందుకు తయారవుతుండగా, నా కోపం అతగాడి శిష్య పరమాణువూ, జిగురు దోస్తూ ఐన శేషునాయుడి మీదికి తిరిగింది. శేషు బాబు పసి పాపాయి, పాపం ఒక పూట లంచి మానుకోలేడు గురూగారి కోసం! అతగాడు ఈ దేశంలో దిగినప్పణ్ణించీ ఈయన గారు ఎన్ని చేసిపెట్టలేదు, డ్రైవింగ్‌ నేర్పించడం దగ్గర్నించీ, టాక్సులు ఫైల్‌చెయ్యడం, గ్రీన్‌కార్డుకి అప్లై చెయ్యడం దాకా .. ఇంకా, ఎన్నిసార్లు మా యింట్లో లంచికి తయారై పీకల్దాకా మెక్కలేదు .. ఎన్నిసార్లు వర్కునించి రాత్రి పది దాటాక వొచ్చి, “శేషుని కూడా తీసుకొచ్చానోయ్‌, ప్రాజెక్ట్‌ ఫినిషింగ్‌లో బాగా లేటైంది. తనొక్కడూ ఇప్పుడు యింటికెళ్ళి ఏం వొండుకుంటాడనీ,” అంటూ మొగుడు ఈ తోకతో సహా దిగబడితే అప్పటికప్పుడు మళ్ళీ అన్నం వొండి పెట్టలేదూ .. ఆ మాత్రం కృతజ్ఞత లేదు మనిషికి .. ‘రానీ, రానీ ఈసారి భోజనానికి రానీ, బియ్యంతో బాటు కడిగి పారేస్తా నాయుణ్ణి ’ అని పళ్ళు నూరుకుంటూ ఇల్లు వొదిలి లాబుకి బయల్దేరాను.

ఆ రోజు సాయంత్రం థియేటర్‌దగ్గర గోపాల్‌వస్తాడేమోనని ఎదురు చూస్తూనే వున్నా. ఎక్కడో చిన్న ఆశ, ఆ వెధవ కారు పని తొందరగా పూర్తయ్యి రాకూడదా అని. ఇంక ప్రదర్శన మొదలవుతున్నట్టు బెల్‌ మోగేసరికి ఆశ వొదిలేసుకుని నా సీట్లో వెళ్ళి కూర్చున్నా. ఇలాంటి ప్రోగ్రాముల్లో ప్రదర్శన మొదలు పెట్టాక ఎవర్నీ లోపలికి రానివ్వరు. ఇక ఇవ్వాళ్టికి ఇంతే. కాసేపు విచారంగానూ, కోపంగానూ వుంది గానీ, డాన్సు మొదలయ్యేప్పటికి ఆ విచిత్ర దృశ్య కావ్యంలో లీనమై పోయాను.

నేను యూనివర్సిటీ బస్సు పట్టుకుని ఇంటికి చేరేప్పటికి పదైంది. గోపీ డైనింగ్‌టేబుల్‌దగ్గర లాప్‌టాప్‌మీద పని చేసుకుంటున్నాడు. నేను లోపలికి రాగానే హడావుడిగా లేచి, “చూడు, నీ కోసం ఏం తెచ్చానో” అంటూ కిచెన్లోకెళ్ళి కృష్ణా స్వీట్స్‌డబ్బా తెచ్చి నా ముందు తెరిచాడు. అందులో నాకెంతో ఇష్టమైన జిలేబీలు. నా కింకా తను ప్రోగ్రాముకి రాలేదన్న కోపం పోలా. నేను నిర్లక్ష్యంగా సోఫాలో కూలబడి చురచురా చూస్తూ, “సడన్‌గా పెళ్ళామ్మీద ఏంటి అంత ప్రేమ? ప్రోగ్రాముకి రాకుండా ఎగ్గొట్టినందుకు లంచమా ఇది?” అన్నా.

తను సహృదయంతో చేసిన మంచి పనికి నేను ఇలాంటి విపరీతార్థం తియ్యగలనని ఊహించలేదు కాబోలు, బాసు తత్తర పడి, మహా అమాయకంగా మొహం పెట్టి,

“ఛ ఛ, అది కాదు నీల్స్‌ సర్వీస్‌స్టేషన్నించి వస్తుంటే .. దార్లోనే గదా, నీ కిష్టమని ఆగి కొనుక్కొస్తే ..ఆ, అది సరే, నీ ప్రోగ్రాం బాగుందా?” అన్నాడు. మాట మారుస్తున్నాడని తెలుస్తూనే వుంది.

“ప్రోగ్రాం కేవీ? బ్రహ్మాండంగా వుంది. నువ్వు అక్కడికి రాలేదు సరే, రానందుకు బ్రేకుల పనైనా ప్తూౖరెందా?” అన్నాను నేను తీవ్రత ఏమాత్రం తగ్గించ కుండానే.

“ఆ, ఆ, అందుకోసమనే గదూ నేను వాడి దగ్గర కూర్చుని మరీ పని పూర్తి చేయించుకుంది. అందుకే బాగా లేటయింది. ఎనీవే, ఇంకో యాభై వేల మైళ్ళ వరకూ బ్రేకులకి ఢోకా లేదు. ప్రోగ్రాముకెళ్ళే హడావుడిలో నువ్వు గూడా తిన్నట్టు లేదు, రా భోంచేద్దాం,” అన్నాడు.

నాకప్పటికి అర్థమైంది గోపీ కూడా, డిన్నర్‌రెడీగా వున్నా, అన్నం తినకుండా నా కోసం కనిపెట్టుకు కూర్చున్నాడని. నా మనసు కరిగి పోయి కోపం గాలికెగిరి పోయింది. తన చేతులో వున్న స్వీట్ల డబ్బాలోంచి ఒక జిలేబీ ముక్క తీసుకుని, ముని పంట కొరికి దాన్నలాగే నా గోపీ నోటికి భాగం అందించాను, అతన్ని క్షమించేస్తూ.

మర్నాడు నేను లాబుకి నడిచి వెళ్తుంటే మా పక్క ఎపార్ట్‌మెంట్లో వుండే లీ పెంగ్‌అనే చైనీస్‌అమ్మాయి తోడు తగిలింది. పలకరింపులైనాక తను అన్నది,

“నిన్న సాయంత్రం నా యింటి పీసీలో ఏదో వైరస్‌వచ్చినట్టుంది. నా దగ్గర ఇంట్లో వైరస్‌క్లీనింగ్‌సాఫ్ట్‌వేరేదీ లేదు. నీ దగ్గర వుందేమోనని నీకు కాల్‌చేస్తే నువ్వు బయటి కెళ్ళావల్లే వుంది. ఇవ్వాళ్ళ ఒక ఇంపార్టెంట్‌పేపరొకటి సబ్మిట్‌చెయ్యాలి. నాకు బలే టెన్షనై పోయింది. డిన్నరయ్యాక నేను చెత్త బయటపారేసి వొస్తుంటే గోపాల్‌ అప్పుడే కారు పార్క్‌చేసి వొస్తున్నాడు. చాలా లేట్‌గా పని చేస్తాడల్లే వుందే .. దానికి తోడు డ్రైక్లీనింగ్‌కూడా పికప్‌ చేసుకున్నాడల్లే వుంది. అబ్బ, నువ్వెంత అదృష్టవంతురాలివో నీలిమా! నా మొగుడూ వున్నాడు ఎందుకు, చెత్త పారేసి రమ్మంటే టీవీలో ‘ఫ్రెండ్స్‌ షో చూస్తూ కూర్చున్నాడు. గోపాల్‌పాపం ఆ డ్రైక్లీనింగ్‌తో అవస్థ పడుతూ వస్తున్నాడు. నేను ఆఫర్‌చేశాను నేనొక వస్తువు పట్టుకొస్తానని .. అతనికి చాలా మొహమాట మల్లే వుందే .. ఎనీవే, తనని అడిగాను ఏదన్నా ఏంటీ వైరస్‌సాఫ్ట్‌వేర్‌వుందా అని .. వెంటనే వచ్చి పాపం చాలా సాయం చేశాడు ..”

ఇలా ఆ అమ్మాయి మా దార్లు వేరయ్యే వరకూ ఛాటర్‌బాక్సులా వాగుతూనే వుంది. మేం విడి పోయేటప్పుడు, “గోపాల్‌కి మళ్ళీ నా తరపున థాంక్స్‌చెప్పు,” అని వెళ్ళిపోయింది. నేను లాబుకి చేరుకుని నా పని చేసుకుంటుండగా ఎందుకో లీ అన్న మాటలు మనసులో మెదిలాయి. అలా ఒక ప్రశ్న రూపు దిద్దుకుంది గోపీ నిన్న డ్రైక్లీనింగ్‌ పికప్‌ చేసుకున్నాడా? అదెలా సాధ్యం?

మేమెప్పుడూ డ్రైక్లీనింగ్‌మా యింటికి దగ్గర్లో వుండే ఒక షాపులో ఇస్తాం. ఆ షాపు పని వారపు రోజుల్లో సాయంత్రం ఏడింటికల్లా మూసేస్తారు. నిన్న గోపీ సర్వీస్‌స్టేషన్నించి వూళ్ళో కొచ్చేప్పటికి ఏడు దాటి వుండాలి కదా, ఏడింటికి ముందే వూళ్ళోకొస్తే తను ప్రోగ్రాముకే వచ్చి వుండచ్చు కదా, పోయి డ్రైక్లీనింగ్‌పికప్‌ చేసుకోడానికి ఎందుకు వెళ్తాడు? ఒకవేళ గోపీ కోటు విప్పి భుజమ్మీద వేసుకుంటే దాన్ని చూసి లీ డ్రైక్లీనింగ్‌అని పొరపడిందేమో? ఎందుకు పొరపడుతుంది .. డ్రైక్లీనింగ్‌ఐతే షాపువాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్‌రాప్‌లో వుంటుందిగా? ఇలా అనుమానాలు ఒకదాని వెనక ఒకటి చేరి కవాతు చేస్తున్నై నా మనసులో. లాభం లేదు, ఈ సంగతేంటో తేల్చుకోవాల్సిందే.

లంచికి ఇంటికెళ్ళి ముందు బెడ్రూమ్‌ క్లోసెట్‌ తెరిచి వేళ్ళాడుతున్న బట్టల్ని పరిశీలించాను. లీ చెప్పింది నిజమే. కొత్తగా డ్రైక్లీన్‌ చేసిన బట్టలు నీట్‌గా పాలిథీన్‌రాప్‌లో హేంగర్లనించి వేళ్ళాడుతున్నై, నా స్వెట్టరూ, బ్లేజరూ గోపీ సూట్లతో బాటు. నిన్న సాయంత్రం నేను ప్రోగ్రాముకి డ్రెస్‌చేసుకుంటున్నప్పుడు ఇవిక్కడ లేవు ఖచ్చితంగా. గోపీయే వీటిని పికప్‌చేసుకుని వుండాలి. నిన్ననే పికప్‌చేసుకుని వుండాలి. అంటే .. ఈ మనిషి ఏడింటికి ముందే వూళ్ళోకొచ్చి వుండాలి.

కళ్ళెదురుగా సాక్ష్యం కనిపిస్తున్నా అమాంతం ముద్దాయి అనే ముద్ర గోపీ మీద వేసెయ్యటానికి నాకు మనసొప్పకుండా వుంది. నిన్నటి జిలేబీల కరకర ఇంకా తీపిగా గుర్తొస్తోంది. ఏమో, నిన్న డ్రైక్లీనింగ్‌ షాపు వాడు లేటుగా తెరిచి వుంచాడేమో .. ఎలా నిర్ధారించుకోవడం? ఇలా ఆలోచిస్తుంటే ఒక లైటు వెలిగింది బుర్రలో. వెంటనే కంప్యూటర్లో నెట్‌స్కేప్‌తెరిచి మా ఇద్దరికీ జాయింటుగా ఉన్న క్రెడిట్‌కార్డ్‌ఎకౌంట్లో లాగిన్‌ అయ్యాను. అప్‌టుడేట్‌ ఇన్ఫర్మేషన్‌! క్రెడిట్‌కార్డుతో చేసిన ప్రతి ట్రాన్సాక్షన్‌ఎంత ఖర్చు ఏ షాపులో ఏ రోజున జరిగిందో చూపిస్తున్నది. ఏ రోజున అనే కాదు, ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకు జరిగిందో కూడా చూపించే మహత్తరమైన మంత్ర దర్పణమిది! ఇలా స్క్రోల్‌డౌన్‌ చేస్తే .. అదుగో నిన్న .. సర్వీస్‌స్టేషన్లో అక్షరాలా నూటెనిమిద డాలర్ల యాభైమూడు సెంట్లు. అది జరిగింది సాయంత్రం ఐదూ నలభై మూడుకి! అంటే .. అయిదుమ్ముప్పావుకే సర్వీస్‌ స్టేషన్లో పనైపోయిందన్న మాట. అక్కణ్ణించి వూళ్ళోకి డ్రైవ్‌ చెయ్యటానికి సుమారు ఇరవై నిమిషాలు .. మహా ఐతే అరగంట. ఇంకొంచెం స్క్రోల్‌డౌన్‌ చేసి చూద్దాం .. అదుగో .. డ్రైక్లీనింగ్‌ షాపులో ఇరవై రెండు డాలర్ల నలభై సెంట్ల ఖర్చు .. నమోదైంది ఆరూ ముప్ఫయ్యారుకి! హమ్మ దొంగ, దొరికి పోయాడు!! డ్రైక్లీనింగ్‌ పికప్‌చేసుకున్నాక గూడా గోపీ ప్రోగ్రాముకి ఈజీగా అందుకుని వుండచ్చు. కావాలని, డెలిబరేట్‌గా ఎగ్గొట్టాడన్న మాట! ఎంత ఘోరం .. ఎంత మోసం? పైగా నా కళ్ళ తుడుపుకి జిలేబీలు!! జిలేబీల కరకరతో నా కళ్ళు కప్పుదా మనుకున్నాడూ .. రానీ, తన పని చెబుతా. మన డిటెక్షన్‌ దెబ్బకి ఆ కంప్యూటర్‌బుర్ర అదిరిపోవాలి. “గోపాల, గోపాల, దొరికేవు గోపాలా” అని “ప్రేమికుడు” పాట స్టైల్లో కూనిరాగం తీస్తూ కిచెన్లో కెళ్ళాను.

నేనిలా విజయగర్వంతో విర్రవీగుతూ, ఒక కప్పుడు హెర్బల్‌టీ పెట్టుకుని వెచ్చగా చప్పరిస్తూ కూర్చుంటే .. ఇంకో అనుమానం భూతంలా తలెత్తింది. లీ పెంగ్‌చెప్పిన ప్రకారం గోపాల్‌వచ్చేప్పటికి టీవీలో ‘ఫ్రెండ్స్‌’ వస్తున్నది .. అంటే ఎనిమిది దాటి వుండాలి. డ్రైక్లీనింగ్‌షాపులో పని ఆరూ ముప్ఫయ్యారుకే ఐపోతే .. ఎనిమిది దాటిందాకా గోపీ ఎక్కడున్నట్టు? ఏం చేస్తున్నట్టు? నాకెందుకో ఒక్కసారిగా వెన్నులో చలి పుట్టుకొచ్చి వొళ్ళు జలదరించింది.

నిన్న కరకర్లాడుతూ మురిపించిన జిలేబీలు ఇవ్వాళ్ళ కడుపులో వానపాముల్లా మెలిదిరుగుతూ వెక్కిరిస్తున్నై. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. ఎప్పుడైనా గోపాల్‌శేషుబాబుతో కలిసో, ఇంకెవరన్నా కొలీగ్స్‌తోనో బారుకెళ్ళి బీరు కొట్టి వస్తుంటాడు. అలాంటప్పుడు తను నాకు ముందే ఫోన్‌ చేసి చెప్పటమో, లేకపోటే వెల్లొచ్చాకనైనా చెప్పటమో చేసేవాడు. అది నాకు పెద్ద పట్టింపు కాదు. మరెందుకు నిన్న తనేవీ చెప్పలేదు? ఐదూ పది నిమిషాలు కాదు .. గంటన్నర పైగా .. అంత నాకు చెప్పకుండా చేసే పని ఏమై వుంటుంది? పోనీ తన ఆఫీసుకి ఫోన్‌చేసి డైరెక్ట్‌గా అడిగేస్తే ..

.. ఊహూ .. గోపీ ఇలా రహస్యంగా ప్రవర్తించడం నా తెలివి తేటలకే సవాల్‌గా అనిపించింది .. దీన్ని నా డిటెక్షన్‌తోనే పట్టుకోవాలి! లాజికల్‌గా ఆలోచిస్తే .. ఈ కుట్రలో శేషుబాబుకీ ఏదో భాగం వుండే వుంటుంది. సో, నాయుడి దగ్గర్నించే ఈ సమాచారం రాబట్టాలి .. ఇంకెప్పుడూ మా యింట్లో తనకి పులిహోర వొండి పెట్టనని బెదిరిస్తే .. తనే దార్లోకొస్తాడు.

అనుకున్నదే తడవు, ఆఫీస్‌లో శేషునాయుడికి కాల్‌చేశాను.
“శేషు హియర్‌”
“ఏయ్‌నాయుడూ, నేను, నీలిమని.”
“అమ్‌బాబోయ్‌ ఏటండొదిన గారూ, ఏటి మామీద్దయొచ్చీసింది?”
“చాల్లే వేషాలు. ఏంటి, కొంచెం టైముందా మాట్లాడ్డానికి?”
“మీరు కాల్జెయ్యటవేటి, నాకు టైములేక పోడమేటి? చెప్పండి. గురూగార్ని పిలవమంటారా?”
“కాదులే, అసలీ మధ్య నువ్‌కనపడ్డం లేదు, ఎలాగున్నావో పలకరిద్దామని. నిన్న పులిహోర చేశాను, నువ్వే గుర్తొచ్చావు. ఆ మధ్య వైకుంఠ ఏకాదశికి చేసినప్పుడు లొట్టలేసుకుంటూ తిన్నావుగా! అందుకని. ఇంకా కొంచెం మిగిలింది, ఇవ్వాళ్ళ నీకు పేకెట్‌కట్టి పంపిద్దా మనుకున్నా. ఇంతలోకే మీ గురూగారు ఉరుకులూ పరుగులూనూ. నీకు చెప్పలేదా?”
“అమ్‌బాబోయ్‌ మీ పులిహోరే! అదెట్టా మర్చిపోతాను? చూశారా, చూశారా, గురుడు కూడా ఒక్క మాటైనా చెప్పలేదు. నిన్న ఆ యెదవ షాపులో బ్రేకులు మారుస్తానికి కంపెనీ ఇచ్చాను గదా. ఛ, బలే ఛాన్సు మిస్సై పోయానన్నమాట.”
“పులిహోర దేముందిలే, వొచ్చే ఆదివారం లంచికి రా, చేసి పెడతా. నువ్వు కూడా వెళ్ళావా షాపుకి గోపీతోబాటు ?”
“మరి? గంట సేపు బోరు కొడుతుంది భాయ్‌అని గురుడు రిక్వెష్టు జేస్తే! గురుడు రిక్వెష్టు జెయ్యడం, మనం కాదంటామా ?”
“అవున్లే, గొప్ప గురుభక్తి పరాయణుడివి. పోనీ ఆ పనయ్యాక నువ్వూ ఇంటికొచ్చి ఉండచ్చుగా ? డిన్నర్‌కేం చేశావు మరి ?”
“ఆ, ఏదో లెండి, మామూలే. బ్రేకుల పనయ్యాక .. దార్లో జిలేబీలు కొనుక్కుని .. మీ యింటి దగ్గిరి కొచ్చీసరికి డ్రైక్లీనింగ్‌అన్నాడు గురుడు. మీరేదో తందనానా డాన్సు కెళ్ళారంటగా నిన్న.”
“అవును, ఏడింటికి షో. షోకి తనక్కూడా టిక్కెట్టుందని మర్చిపోయాడా మీ గురువు? ఇంకా నేను మీకు సర్వీస్‌స్టేషన్లోనే లేటయ్యి ప్రోగ్రాముకి రాలే దనుకుంటున్నా !”
“అమ్‌బాబోయ్‌ వొదిన గారూ, మీ కొశ్చెన్జూస్తే ఇదేదో పితలాటకం లాగుంది. నన్నొదిలెయ్యండి.”
“అబ్బ, పర్లేదు చెప్పవోయ్‌ ఏవన్నాడేంటి మీ గురుడు.”
“ఏబ్బే, లాభం లేదు వొదిన గారూ. మీ ఆయన్నే అడగండి. మై లిప్స్‌ఆర్‌ సీల్డ్‌”
“ఏయ్‌నాయుడూ, ఆ రోజు పులిహోర రుచి గుర్తుందిగా? ఇంకోసారి మా యింటో పులిహోర తినాలని ఉంటే .. మర్యాదగా చెప్పేసెయ్‌”
“అబ్బా, నా వీక్‌పాయింటు మీద నొక్కేశారే .. మీ పులిహోర కోసమనీ .. గురూ, ఈ గురుద్రోహిని క్షమించు.”
“ఆ, ఆ, క్షమిస్తాళ్ళే, ఏం జరిగిందో చెప్పు.”
“షో ఆరింటికే మొదలై పోయిందీ, మనం గూడా వెళ్ళాలిగాని టైమై పోయిందిగా అన్నాడు గురుడు. మీరెట్టాగా యింటో వుండరన్జెప్పీసి .. ఆ డ్రైక్లీనింగ్‌పక్కనే స్పోర్స్ట్‌బారుకి పోయి బాస్కెట్‌బాల్‌గేము చూస్తా కూర్చున్నాం. ఆయనేమో వీక్‌డేస్‌లో మందు కొట్టడుగా, కోకు తాగుతా కూర్చున్నాడు. మనకట్టాంటి ప్రాబ్లం లేదుగాబట్టి ..”
“బీరు తాగుతూ కూర్చున్నావు. అంతేనా?”
“అంతే! ఎనిమిదింబావుకో ఎప్పుడో గేమై పోయింది. ఇక ఆయన మీ యింటికీ, నేను మా యింటికీ!”
“థేంక్స్‌, నాయుడూ.”
“ఐతే వొదిన గారూ, నా పులిహోర .. ”
“నాకు నువ్వెంత సాయం చేశావో నీకే తెలీదు. ఇంకొక్క సాయం కూడా చేసిపెట్టు. మనం ఇలా మాట్లాదుకున్న సంగతి మీ గురుడికి చెప్పకు. నేనొక చిన్న సర్ప్రైజ్‌ఇస్తాను. నీ పులిహోర కేం ఢోకా లేదు.”
“ఏటో, మీ దయ, మా ప్రాప్తం!”
“సర్లే. వొచ్చే ఆదివారం లంచికి రా. చేసి పెడతా. వుంటా, బై.”
గోపీ మీద నాకెంత నమ్మకమున్నా, తలెత్తిన అనుమానపు పెను భూతాన్ని వొదుల్చుకోలేక పోయాను. శేషుబాబు చెప్పిన సాక్ష్యంతో నా గుండె బరువు దిగిపోయింది. నానుంచి దాచిపెట్టినది “స్పోర్స్ట్‌ బారుకి వెళ్ళడం” కంటే భయంకరమైనది కానందుకు నేను ఆనందించినా, గోపీ అసలు విషయం నాకు చెప్పకుండా దాచి పెట్టాలని ప్రయత్నించినందుకూ, నాకు ఇలాంటి భయాన్ని కలిగించినందుకూ అతన్ని క్షమించలేక పోయాను. తగిన శాస్తి జరగాల్సిందే. జస్టిస్‌ మస్ట్‌ బె సెర్వ్డ్‌.
్‌్‌్‌*** ***
సాయంత్రం గోపాల్‌యింటికొచ్చే లోపల అవసరమైన రంగాన్ని సిద్ధం చేసుకున్నాను. ఆరింటికల్లా వొచ్చేశాడు గోపీ. తను బూట్లు విప్పి వచ్చి సోఫాలో కూర్చోగానే, శుక్రవారం సాయంత్రం గదా, చల్లటి హైనెకిన్‌ బీరు సీసానీ, ఒక ప్లేట్లో వేడి వేడి పకోడీల్నీ అందించి పక్కనే కూర్చున్నా. తను పకోడీల్ని చూసి “ఏవిటి విశేషం” అన్నట్టు చూశాడు నావేపు.

“ఇంట్లో టిఫిన్‌ చేసి చాలా రోజులైంది గదా, ఇవ్వాళ్ళ డిన్నర్‌కి ఎటైనా బైటికెళ్దా మనుకున్నా, అంత దాకా ఇది ఉపశమనం అనుకో!” అన్నాను చిరునవ్వుతో.
“కారు బ్రేకులు సరిగ్గా పని చేస్తున్నయ్యా?” అనడిగా, తను పకోడీలు నంచుకుంటూ బీరు సేవిస్తుండగా.
“ఆ, ఆ, బానే వుంది.” అన్నాడు.
“నిన్న డాన్సు పోతే పోయింది, పాపం, ఆ సర్వీస్‌స్తేషన్లో కూర్చుని నువ్వు మంచి బాస్కెట్‌బాల్‌ గేమ్‌ మిస్సయినట్టున్నావే.” అన్నా చాలా కేషువల్‌గా.
గోపాల్‌ మొహంలో చిన్న కలవరపాటు ఒక్క క్షణంలో అలలాగా దొర్లిపోయింది. సర్దుకుని, “అవునుట, ఇవ్వాళ్ళ ఆఫీస్‌లో విన్నాను. నీకెప్పణ్ణించీ బాస్కెట్‌బాల్‌ మీద ఇంట్రస్టు? ” అని ఎదురు ప్రశ్న వేశాడు. ‘ఐ సీ ’ అనుకున్నా. బాసు ఇంకా దాచిపెట్టాలనే చూస్తున్నాడన్న మాట. ఇక బ్రహ్మాస్త్రం వెయ్యాల్సిందే. కాసేపు అదీ ఇదీ మాట్లాడి సడన్‌గా మాట మార్చి, “నీకు చాలా థేంక్స్‌చెప్పుకోవాలి, డార్లింగ్‌ నిన్న డ్రైక్లీనింగ్‌పికప్‌ చేసుకున్నందుకు. ఇవ్వాళ్ళ మా స్పాన్సర్లతో మీటింగుకి సరైన డ్రెస్‌ లేదే అని విచార పడ్డాను పొద్దుట. తీరా క్లోజ్సెట్‌లో చూస్తే డ్రైక్లీన్‌ చేసిన బ్లేజర్‌వుంది. థేంక్యూ సో మచ్‌” అన్నా, తన దగ్గరగా జరిగి బుగ్గ మీద ముద్దు పెడుతూ.

“నో ప్రాబ్లం” అన్నాడు బాసు అమాయకంగా. ఆ అమాయకత్వం చూస్తే అమాంతం ఆ బుగ్గ కొరికెయ్యా లనిపించింది. ఉగ్గ బట్టుకుని దూరంగా జరిగి తననే చూస్తూ అస్త్రం సంధించాను.

“అవునూ, డ్రైక్లీనింగ్‌వాడు ఏడింటికల్లా షాపు మూసేస్తాడు కదూ. నిన్న సాయంత్రం లేటుగా తీసుంది కాబోలు!” అన్నా, నేను కూడా అతనంత అమాయకంగానూ మొహం పెట్టి.
బాసు ఎవరో లాగిపెట్టి లెంపకాయ కొట్టినట్టు అదిరిపడ్డాడు.
“ఇవ్వాళ్ళ మధ్యాన్నం నాయుడితో మాట్లాడా, ఆదివారం లంచికి పిలుద్దామని. నిన్న గేం బాగా ఎంజాయ్‌చేశావా?” అన్నా నాకు సాధ్యమైనంత మృదువుగా.

ఇక మొదలు పెట్టాడు కన్ఫెషన్‌.
” .. ఆ తందనానా డాన్సులంటే నాకు తలనొప్పని నీకు తెల్సుగా. నేను మామూలుగా రానంటే నువ్వు కష్ట పెట్టుకుంటావు. ఏదో కారు సర్వీసు అలా దైవికంగా కలిసింది అనుకున్నా. తీరా అది కాస్తా తొందరగా ఐపోయింది. ఇంటికొస్తే నువ్వు తప్పకుండా డాన్సుకి లాక్కెళ్తావు. అందుకని, దార్లో ఆగి జిలేబీలు కొనడమూ, డ్రైక్లీనింగ్‌ పికప్‌ చేసుకోడమూ చేసినా కూడా .. ఇంకా టైమ్‌మిగిలిపోయింది. నువ్వు అప్పటికి ఇంట్లోంచి బయల్దేరావో లేదో తెలీదు. డ్రైక్లీనింగ్‌నించి బయటికొస్తే పక్కనే స్పోర్స్ట్‌బార్‌కనిపించింది .. ”
నాకు ఈ సమస్య సులభంగా విడిపోయినందుకు ఒక పక్క మనసు తేలిక పడినా, ఇంకో పక్కన మధ్యాన్నం తలెత్తిన అనుమానపు పెనుభూతం గుర్తొచ్చి, అనుకోకుండా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అప్పటిదాకా తలొంచుకుని సంజాయిషీ ఇస్తున్న గోపీ నేనేమీ మాట్లాడక పోయే సరికి తలెత్తి చూశాడు. చూసి కంగారు పడుతూ, “ఏయ్‌నీల్స్‌ ఛ ఛ, ఏంటిది. ఇంత సీరియస్‌గా తీసుకుంటా వనుకోలేదు,” అన్నాడు నా వేపు తిరిగి చేతులు చాస్తూ.
నేను తన వేపే చూస్తూ, “నన్ను చాలా భయపెట్టావ్‌ గోపీ. ప్ల్లీీజ్‌, ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు,” అన్నాను.
ఎంత నిగ్రహించుకుంటున్నా, నా గొంతు వొణికి పోయింది .. నీళ్ళు కళ్ళలో నిండిపోయి గోపీ రూపం వంకర్లుగా కనిపిస్తోంది. తను పూర్తిగా చలించిపోయాడు. గభాల్న ముందుకు వంగి నా చేతులు పట్టుకుని, “అయామ్‌ సారీ, నీలూ. ప్లీజ్‌ ఏడవొద్దు. ఛ, అయామ్‌ ఏనిడియట్‌!” అన్నాడు దీనంగా.
అంతగా నన్ను కదిలించిన ఎమోషన్లోనూ నాకు గోపీ మొహం చూస్తేనవ్వొచ్చింది. ఐనా సీరియస్‌గా కనపడ్డానికి ప్రయత్నిస్తూ,
“యెస్‌ యూవార్‌ఏనిడియట్‌! అందుకు పనిష్మెంట్‌అనుభవించక తప్పదు,” అన్నాను.
“పనిష్మెంటా?” అన్నాడు గోపీ విస్మయంగా. నాకింకా నవ్వొచ్చింది.
“ఆ! ఈ పూటంతా నీకు బందిఖానా!!” అని గోపీని నా చేతుల్తో కట్టి పడేశాను. దొంగ దొరికి పోయాడు!
----------------------------------------------------
రచన: కరుణ, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, November 12, 2019

కల చెదిరింది


కల చెదిరింది





సాహితీమిత్రులారా!


వినయ్‌ ఉద్యోగం లో చేరి అప్పుడే ఆరు నెలలైంది..
అది ఊడి కూడా రెండు రోజులు కావొస్తోంది.

ఈ దేశం కాని దేశంలో, ఈ కాలం కాని కాలంలో తనకున్న క్వాలిఫికేషన్‌కి ఉద్యోగం వేటలోనే దాచిన డబ్బంతా ఐపోయేట్టు కనిపిస్తోంది. తనకి తెలిసిన వాళ్ళు చాలా మంది చేస్తున్నట్టు ఈ ముసురు తగ్గేవరకు ఇండియా గూట్లో తలదాచుకుంటే ఎలా ఉంటుంది?
తీవ్రంగా ఆలోచిస్తున్నాడు వినయ్‌.
ఇది చావు బతుకుల సమస్య.

ఇంతలో
ఎప్పుడూ లేనిది ఇండియా నుంచి నాన్న ఫోను చేసి, వెంటనే తిరిగి చెయ్యమని చెప్పి ఫోన్‌  కట్‌ చేశాడు.
అలాగే చేశాడు వినయ్‌.

“హల్లో, నాన్నా నేను, వినయ్‌ని”
“ఆ..ఏరా బాగున్నావా..”
“నేను బాగానే ఉన్నా.. అమ్మెలా ఉంది?”
“బాగానే ఉంది గానీ నీతో ఒక విషయం మాట్లాడాలని ఫోన్‌ చేశాన్రా”
“డబ్బేమన్నా కావాలంటాడా?” గతుక్కుమన్నాడు మనసులోనే.
“అదేరా.. మీ కృష్ణమూర్తి మామయ్య వాళ్ళ అమ్మాయ్‌ ని నీకిస్తానంటున్నాడు .. ఓ నలభయ్‌  లక్షల దాకా ఇస్తాడంట ..ఏ విషయం చెప్పమని ఫోన్‌  చేశాడు. నిన్నడిగి చెప్తామని చెప్పా .. తెలిసిన సంబంధం, మేనరికం! అదీ కాక అమ్మాయి కూడ చిన్నప్పటి నుంచి మన కళ్ళ ముందే పెరిగిన పిల్ల. ఏమంటావ్‌ ?” నాన్‌ స్టాప్‌ గా చెప్పుకుంటూ పోతున్నాడు..

ఆలోచనలో పడ్డాడు వినయ్‌.

“నేననే దేముంది గాని అమ్మేమంటుంది?” అంతిస్తామంటే అమ్మ మాత్రం వద్దంటుందా?!
“మీ అమ్మ ఓ .. సంబరపడి పోతున్నది. సొంత అన్నకూతురే కదా! ఒద్దంటుందా?”
“అది సరే, బైటైతే ఇంకా ఎక్కువిస్తారేమో?”
“అదీ నిజమే ననుకో! కాకపోతే చిన్నప్పట్నుంచీ అనుకుంటున్నాం కదా! ఇంకో విషయం వాళ్ళ కొడుకు రాంబాబు గాడెటూ అమెరికా లోనే సెటిల్‌ ఐపోయే! వీళ్ళిక్కడ సంపాయించింది అంతా ఇంక ఆ అమ్మాయికే కదా వస్త? ఇప్పుడు నలభై ఇచ్చినా, తరవాత చాలానే వస్తుంది..”
“అమ్మ నా నాన్నా … ఎంత దూరం అలోచించావ్‌ ? ఈ ఐడియా నాకు తట్టనేలేదు” మనసులో అనుకున్నాడు.
“ఏమాలోచిస్తున్నావ్‌?” సమాధానం రాకపోవడంతో రెట్టించాడు తండ్రి.
“ఆలోచించేందుకు ఏముంది? మీ ఇష్టం!”
“మరి నువ్వు రావడానికి ఎప్పుడు కుదురుతుందో చెప్తే, అప్పుడు ముహూర్తాలు పెట్టిద్దాం”
“ఒక నెల రోజుల్లో ఇక్కడ నా కాంట్రాక్ట్‌ ఐపోతుంది. అప్పుడు రావటానికి కుదురుద్ది”
“కాంట్రాక్ట్‌ ఏమిటి? పరిమినెంట్‌ ఉద్యోగం కాదా?”
“ఇక్కడలా ఉండదు”
“ఐతే తరవాత వెంటనే ఇంకో ఉద్యోగం దొరుకుద్దా?”
“ఏదొకటి దొరుకుద్దిలే!”
కొద్ది సేపు ఊర్లో విషయాలు మాట్లాడి ఫోన్‌ పెట్టేశాడు.

ఒక వైపు ఆనందం. మరో వైపు బాధ. ఎంతలో ఎంత మార్పు!

పుట్టగొడుగుల్లా లేచిన డాట్కాంలు కాంగా సర్దుకుంటున్నయ్‌. ఇప్పట్లో ఉద్యోగం దొరక్కపోతే? తలచుకోవడానికే భయంగా ఉంది.

ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే, తన లాటి వాళ్ళే! ఒకళ్ళకొకళ్ళు వీళ్ళే పోటీ ఏ ఉద్యోగానికి వెళ్ళినా! చూస్తుంటే తనే అందర్లోకీ ఆలస్యంగా వచ్చినట్టున్నాడు!

నాలుగైదేళ్ళ క్రితం చేపల చెరువులు వేసిన వాళ్ళు లక్షలు, కోట్లు సంపాయిస్తున్నారని ఊర్లో పొలాలన్నీ చెరువులుగా మార్చి చివరకు ఇళ్ళు కూడా అమ్ముకున్నారు జనం. ఆ తరవాత కోళ్ళ ఫారాలు .. ఆ తర్వాత రొయ్యల చెరువులు .. ఆపైన నాపరాళ్ళు .. ఆ అన్నిట్నీ మించింది ఈ కంప్యూటర్‌ పిచ్చి. డిమాండ్‌ బాగా ఉన్నప్పుడు అందరూ అదే చెయ్యబోవటం మనవాళ్ళ స్వభావంలా ఉంది. ఎవరో ఒకడు ఏదో కొత్తదాన్లో ఎంతోకొంత సంపాయిస్తే ఓ వంద మంది అదే బిజినెస్‌ చేసి మనం కూడా సంపాయిద్దాం అనుకుంటారే గాని దాన్లో ఇంతమందికి అవకాశం ఉందా లేదా అని ఆలోచించరు.

కాకపోతే తండ్ర్రితో మాట్టాడిన తరవాత వినయ్‌కి కొంత ధైర్యం వచ్చింది. ఉద్యోగం దొరక్కపోయినా, కట్నం డబ్బుతో ఏదో బిజినెస్‌ ఐనా పెట్టుకోవచ్చు! తిరుగు ప్రయాణం వైపుకి మళ్ళినయ్‌ ఆలోచనలు.

వినయ్‌ తండ్రి శేషగిరి రావు కూడ అదే సమయంలో ఆలోచనల్లో విహరిస్తున్నాడు.
ఎంతలో ఎంత మార్పు! నిన్న గాక మొన్నలా ఉంది వినయ్‌ కాలేజ్‌ డిగ్రీ పూర్తిచేసి పనేం లేక ఊళ్ళ మీద తిరగటం.
ఆ రోజు ..

కాలింగ్‌  బెల్‌  మోగుతుంటే, నిద్రలోంచి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు తను. గోడ గడియారం మూడు గంటలైనట్టు చూపిస్తోంది. ఇప్పుడెవరై ఉంటారబ్బా అనుకుంటూ కలేమో నని ఆలోచిస్తుంటే మళ్ళీ బెల్‌ మోగిన శబ్దం. పక్కనే ఉన్న భార్యను నిద్ర లేపబోయాడు. బెల్‌ మోగిన శబ్దం కూడా వినిపించనంత గాఢ  నిద్రలో  ఉంది. కళ్ళు  నలుపుకుంటూ.. అడుగులో అడుగు వేసుకుంటూ అతికష్టం  మీద తలుపు వైపు నడిచాడు. తన  ప్రమేయం  లేకుండానే కుడిచేతి చూపుడు వేలు స్విచ్‌  మీద  పడింది. లైటు వెలిగింది. తలుపు  తెరిచి ఎదురుగా నిల్చుని వున్న కొడుకుని చూడగానే కళ్ళల్లో ఆనందం..

“ఏరా. ఇదేనా  రావడం..”
నవ్వుతూ  “అవును” అంటూ లోనికి నడిచాడు, “ఏమేవ్‌ . అబ్బాయొచ్చాడు లే..” తట్టి లేపాడు పార్వతమ్మను. చివుక్కున లేచి కూర్చుంది. ఆమె కళ్ళు కొడుకుకోసం వెతికాయి.
కుర్చీలో కూర్చుని షూస్‌  విప్పుతున్న అతన్ని చూడ్డం తోనే, “ఏరా..భోజనం చేసే బయల్దేరావా?” అని అడిగింది.

“ఆ, తిన్నానమ్మా”
“ఏరా ఇలా చిక్కి పోయావు .. వేళకి తింటున్నావా లేదా?”
“నేను చిక్కి పోవడం ఏమిటమ్మా?”   “ఏం తింటున్నవ్‌ రా? రోజు రోజుకూ తెగ బలిసిపోతున్నావ్‌ ?” నవ్వుతాలుగా రోజూ ఫ్రెండ్స్‌ అనే మాటలు గుర్తొచ్చినయ్‌ .

ఉదయం తొమ్మిది గంటలైంది. అసలు విషయం మెల్లగా బయటపెట్టాడు వినయ్‌.
శేషగిరి రావుకి తిక్కరేగింది. “చదువు అయిపోయి రెండేళ్ళయింది. ఆ సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తయ్యీ కావటంతోటే ఉద్యోగం వొచ్చేస్తుంది, ఆ తర్వాత, ఓ.. వొరగ  బెట్టేస్తా నన్నావ్‌ .. సరే అని వేలకు వేలు పోసి ఆ డిగ్రీ పూర్తిచేయించా! ఆ తరవాత మళ్ళీ ఏవో జాంగ్రీలనీ గీంగ్రీలనీ ఇంకో లక్ష వాటిమీద తగలేశావ్‌! ఇప్పుడు అమెరికా పోవటానికి వాడికెవడికో రెండు లక్షలివ్వాలని వచ్చి కూర్చున్నావ్‌! ఇక్కడ డబ్బులేమన్నా చెట్లకి కాస్తున్నయ్యా? ఇక నా వల్ల కాదు. ఒక్క పైసా కూడ ఇవ్వను. నీ తరవాత చదువులు ఐపోయిన వాళ్ళు బోలెడు మంది పైసా ఖర్చు పెట్టకుండా అమెరికా వెళ్ళి లక్షలు సంపాయిస్తున్నారు. వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకో.”

“ఎవరినో చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం నాకులేదు, నా ఇండివిడ్యువాలిటీ నాకుంది..” మెల్లగా అన్నా అవి శేషగిరి రావు చెవుల్ని చేరినయ్‌.
“ఆ.. తల్లి దండ్రుల్ని పోషించాల్సిన ఈ వయసులో కూడా వాళ్ళ మీద ఆధారపడడమేనా నీ ఇండివిడ్యువాలిటీ? …ఇంతవరకు తగల బెట్టింది చాలు, పెట్టే బేడా సర్దుకోనొచ్చెయ్‌ , ఇక్కడే వ్యవసాయం చేసుకుని బతకొచ్చు”.

అప్పటి దాకా మాట్లాడకుండా అన్నీ వింటున్న పార్వతమ్మ ఇక తప్పదని రంగం లోకి దూకింది.

“అయిందేదో ఐంది. చెట్టంత కొడుకుని పట్టుకుని ఎందుకండీ అలా అంటారు? మనకున్నది వాడొక్కడే. రేపైనా వాడికివ్వాల్సిందే కదా? మీ మాటలకు నొచ్చుకుని రేపు వాడేమన్నా చేసుకుంటే?”
“చాలు ఆపు. దరిద్రపు నోరూ నువ్వూ!”
“ఆ.. నాది దరిద్రపు నోరే.. మరి మీ ఆలోచనలు ఏమయ్యాయ్‌? ఒక్కసారి ఆలోచించండి.. వీడు ఒక్కసారి అమెరికాలో అడుగుపెట్టి ఉద్యోగంలో చేరాడంటే చాలు.. వీడి  రేటు  ఇప్పుడున్న  దానికి  నాలుగు  రెట్లవుతుంది.”
“ఆ.. ఇక్కడ  రెండేళ్ళుగా  రాని  ఉద్యోగం  అక్కడకెళ్ళగానే ఒచ్చి ఒళ్ళో పడుతుందా? వీడు అక్కడకు వెళ్ళాక కూడ  ఖర్చులకు  మనం  పంపాల్సిందే. ఇక్కడైతే  నెలకు రెండు మూడు వేలు అక్కడైతే, ఒకటి రెండు లక్షలు. అంతే తేడా!”

“మీరు మరీ విడ్డూరంగా మాట్లాడకండి.. మా అన్న కొడుకు రాంబాబు . వాడేం పెద్ద తెలివైనోడా.. అమెరికా వెళ్ళి హాయిగా ఉద్యోగం చేసుకోవడం లేదూ? వాడికిచ్చినోళ్ళు మనోడికివ్వరా? ఆరునెల్ల  క్రితం  వాడికి పిల్లనివ్వడానికే రానివాళ్ళు, ఇప్పుడు ఇరవై లక్ష లిస్తామంటున్నారు.. మనోడికి ఉద్యోగం లేకపోయినా పిల్లనిస్తామని బోలెడు మంది అడుగుతున్నారు.. వీడొక్క సారి అమెరికా వెళ్ళాడంటే… ఇంకేమన్నా ఉందా!”

“నీ మొహం.. వీడికి పిల్లనిస్తామంటున్నది వీడి ముఖం నీ ముఖం చూసి కాదు! వీడికి ఉద్యోగం లేకపోయినా, నేను సంపాయించింది ఉందిగా, దాన్ని చూసి”

“అంటే, మీ ఆలోచనలు మీవేగానీ వాడి భవిష్యత్తు గురించి ఆలోచించరన్న మాట! ఒరే.. వినయ్‌  ఆయన మాటలు నువ్వేమి పట్టించుకోకు”
“ఆ . వాడినట్లా వెనకేసుకో నొచ్చే ఎందుకూ పనికిరాని వెధవని చేశావ్‌ ..” పైకలా అన్నా తను ఓడిపోయానని ఆయనకీ అర్థమై పోయింది.

సాఫ్ట్‌ వేర్‌ కి బోలెడు డిమాండ్‌ ఉందన్న విషయం విని కూడా ఇంతకు ముందెప్పుడూ దాన్ని గురించి ఆలోచించ లేదు వినయ్‌.. అనుకోకుండా ఇంకేదో పని మీద ఓ సారి హైదరాబాద్‌ వెళ్ళటం జరిగింది. అక్కడ దిగగానే ఎక్కడ చూసినా ముప్ఫై రోజుల్లో అది నేర్పుతాం, ఇది నేర్పుతాం అంటూ పెద్ద పెద్ద బానర్లు! పేపర్‌ తీస్తే ఫ్రీ ప్రాసెసింగ్‌ అంటూ కన్సల్టెన్సీల యాడ్స్‌! అంతా చూస్తుంటే ఏదో ఓ కన్స్ర్టక్షన్‌ కంపెనీలో చేరి ఎండలో మాడే కంటే ఓ రెండు మూడు నెలలు కష్టపడితే ఎంచక్కా సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీరై పోవచ్చు ననిపించింది. బాగా డిమాండ్‌ ఉన్న జావా ఐతే బెటర్‌ .. ఆలోచన రావడమే తరువాయి. ఇంటికి బయల్దేరటం, తండ్రి దగ్గర డబ్బు సంపాయించి తిరిగిరావటం, ఫీజు కట్టడం, అన్నీ చకచక జరిగి పోయినయ్‌ ..

మొదటి రోజు క్లాసులో అడుగు పెట్టాడు. క్లాసు రూం చూడగానే ఆశ్చర్యం.. ఓ పెద్ద హాలు. మూడొందల దాకా చైర్స్‌ . హాల్‌లో నాలుగు వైపుల స్పీకర్లు.. మధ్యలో ఓ కంప్యూటర్‌కు కనెక్ట్‌ చేసి ఓ చిన్న ప్రొజెక్టర్‌.. గోడకు వేలాడుతూ ఓ స్క్రీన్‌. చూస్తుంటే చిన్నతనంలో డేరా హాల్లో సినిమా రోజులు గుర్తొచ్చినయ్‌ ..

క్లాసు మొదలయ్యే టైంకి హాలంతా నిండిపోయింది.. కొందరైతే కూర్చునేందుకు చోటు లేక నిల్చునే క్లాసు వింటున్నారు.. ఇంతకుముందు కొంచెం కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉన్నా వాళ్ళు చెప్పేదేవీ అర్ధం కావడం లేదు. “ఇలా ఔతోంది నాకేనా?” అని అనుమానం వచ్చి ఓ ఇద్దరు ముగ్గురిని అడిగాడు.. వాళ్ళూ తన టైపే! మనసు కాస్త కుదుట పడింది.

క్లాసు ఐపోగానే లాబ్‌ లోకి వెళ్ళి చూస్తే.. అక్కడ ఓ యాభై కంప్యూటర్‌ లున్నై. ఓ రెండొందల మంది జనం. ఒక్కో సిస్టమ్‌ ముందు నలుగురైదుగురు. ఏదేదో చేసేస్తున్నారు. ఎవరేం చేస్తున్నారో వాళ్ళకైనా తెలుసో లేదో!

ఓ ఐదు నిమిషాల తరవాత వాళ్ళ టైం ఐ పోయింది. వెళ్ళి ఓ సిస్టం ముందు కూర్చున్నాడు. ఏమి చెయ్యాలి? చేసేదేమీ లేదు. ఇంతలో చుట్టూ ఓ ముగ్గురు చేరారు. ఓ అరగంట టైం పాస్‌ తరువాత నలుగురూ కలిసి బైటకు నడిచారు. అదీ ఆరోజుకు ట్రైనింగ్‌!

రోజుకు ఒక్కో ఇన్‌స్టిట్యూట్‌లో నాలుగైదు బాచ్‌లు. బాచ్‌ కి రెండు మూడొందల మంది. రెణ్ణెళ్ళకో కొత్త బాచ్‌.

ఓ వారం తరువాత ఉదయం క్లాసు టైంలో గేటు దగ్గర టికెట్లు చింపే వాడొకడు ప్రత్యక్షమయ్యాడు. వాడి పేరు నరేంద్రట. వాడి పని మొత్తం ఫీజు కట్టిన వాళ్ళను మాత్రమే లోపలికి పంపడం…

మెల్లగా నరేంద్రతో పరిచయమైంది. దాని వల్ల ఎన్ని లాభాలున్నాయో తొందర్లోనే అర్థమైంది ఇన్‌స్టిట్యూట్‌కి కొంత మాత్రం ఫీజు కడితే, మిగిలిన దాంట్లో సగం ఫీజుకే రాత్రి వేళల్లో లాబ్‌లోకి పోనివ్వటం నరేంద్ర సైడ్‌ బిజినెస్‌!

రోజులు గడుస్తున్నయ్‌, కోర్సులు ఐపోతున్నయ్‌. నరేంద్ర పుణ్యమా అని ఫీజు కట్టకుండా ఒకదాని తరవాత మరొకటిగా ఇన్‌స్టిట్యూట్‌ మార్చకుండా రెండు సంవత్సరాల పాటు పది వేల ఫీజుతోటే చాలా కోర్సులు పూర్తిచేశాడు, సర్టిఫికెట్లు సంపాయించాడు. ఇంటి దగ్గర తెచ్చుకున్న డబ్బుతో బ్రహ్మాండంగా ఎంజాయ్‌ చేశాడు.

ఉద్యోగం కోసం ఊరంతా తిరిగి ఉపయోగం కనపడక ఇక లాభం లేదని ఓ తెలిసిన కన్సల్టెన్సీ ని ఆశ్రయించాడు. రెండు లక్షలు కడితే పేపర్లు ఫైల్‌ చెయ్యడానికి ఒప్పుకున్నారు వాళ్ళు.
ఆ విషయం నాన్నతో చెప్పి డబ్బు తీసుకెళ్దామని వచ్చాడు. ఇక్కడి పరిస్థితి ఇలా ఉంది. ఆయననే మాటల్లో కొంత నిజం వున్నా, ఇలా అమెరికా వెళ్ళే అవకాశం చేతి దాకా వస్తే ఎలా వొదులుకోవటం?

మూడు నెలల తరువాత అమెరికా వెళ్ళే ఫ్లైట్‌లో ఉన్నాడు వినయ్‌. వెళ్ళిన పదిహేను రోజులలోనే పెద్దగా కష్టపడకుండానే జాబ్‌ దొరికింది. కల ఫలించింది!
ఇక్కడ జాబ్‌ రావడం ఇంత సులభంకాబట్టే అమెరికా, అమెరికా అంటారందరూ! అనుకున్నాడు ఆనందంగా.
తన అదృష్టానికి మురిసిపోయాడు వినయ్‌.

ఇంట్లో తల్లిదండ్రులు కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
ఇన్నాళ్ళూ ఎక్కడున్నారో కూడా తెలియని చుట్టాలకి కూడా హఠాత్తుగా వాళ్ళు గుర్తుకొచ్చారు ముఖ్యంగా ఆడపిల్లలున్న వాళ్ళకి!

శేషగిరి రావుకి నిజమైన పుత్రోత్సాహం అంటే ఏమిటో ఇప్పుడు అనుభవమయ్యింది!

వినయ్‌ మేనమామ కృష్ణమూర్తి ఇంట్లో ఫోన్‌ మోగింది.

“హల్లో నాన్నా! నేను, రాంబాబు ని..”
“ఏరా బాగున్నావా?”
“ఆ..బాగానే ఉన్నా.”
“ఎలా ఉంది నీ ఉద్యోగం?”
“అది చెపుదామనే ఫోన్‌ చేసా. నిన్ననే ఓ పెద్ద కంపెనీలో చేరా. ఓ ఆరునెల్ల దాకా పరవాలేదు.”
“మరి అందరూ ఉద్యోగాల్లోంచి పీకేస్తున్నా రంటున్నారు నిజమేనా?”
“ఏమీ నేర్చుకోకుండా డబ్బుల్తోటే సర్టిఫికెట్లు సంపాయించిన వాళ్ళ పని అలాగే అయిందిలే! అన్నట్టు చెల్లి పెళ్ళి విషయం ఏమౌతున్నదీ?”
“ఏమయ్యేదేముంది! వినయ్‌ రాగానే ముహూర్తాలు పెట్టుకోవడమే!”
“దాని గురించే ఆలోచించమంటున్నా.. వాడికిక్కడ జాబ్‌ పోయిందని ఎవరో అంటే విన్నా. అలా ఐతే మళ్ళీ ఇప్పట్లో రావటం కూడా కష్టం. అసలు వాడు ఇండియా వస్తున్నది అందుకనుకుంటా!”
“నువ్వేమంటున్నావో నాకర్ధం కావడం లేదు.”
“వాడు అక్కడ జాబ్‌ రాక వీసాకి రెండు లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడి కొచ్చాడు. ఇక్కడ కూడ జాబ్‌ పోవడంతో అక్కడి కొస్తున్నాడు. వాడు మనం ఇస్తామన్న డబ్బుల్తో ఏదో బిజినెస్‌ పెట్టాలని ఆలోచిస్తున్నట్టు స్నేహితుడొకడు చెప్పాడు..”
“అంటే మళ్ళీ వాడు అమెరికా రాడా?”
“అదే కదా నేను చెప్పేది! అక్కడే బిజినెస్‌ చేసుకునేట్టయితే
వాడికే ఇవ్వాలనేముంది? మీరు ఊ అనండి, ఇక్కడ కాస్త దిట్టంగా సంపాయించి మంచి ఉద్యోగంలో ఉన్న వాణ్ణి నేనే చూస్తాను.. నిదానంగా ఆలోచించండి. ఈ విషయంలో తొందరపడొద్దు”

ఐతే కృష్ణమూర్తికి నిదానంగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ కనపడలేదు ఈ విషయంలో.
వెంటనే శేషగిరి రావుకి ఫోన్‌ చేశాడు ఈ మోసం తేల్చేసి సంబంధం మానేస్తున్నామని చెప్పటానికి.
----------------------------------------------------
రచన: కె . యస్ . వరప్రసాద్, 
ఈమాట సౌజన్యంతో

Sunday, November 10, 2019

ముఖం కడగని అందగత్తె


ముఖం కడగని అందగత్తె



సాహితీమిత్రులారా!


ఒక చలికాలంలో, బాస్టన్ నగరంలోని హైవే ఇరవై మీద, ఉదయం సుమారు 11:30 గంటల ప్రాంతంలో పోలీసువాళ్ళతో నాకు మొట్టమొదటి ఎన్‌కౌంటర్ జరిగింది. నేను ఊహించని ఒకానొక సందర్భంలో, అజాగ్రత్తగా ఉన్న రోజున జరిగిన సంఘటన అది. ఇన్నేళ్ళుగా కారు నడుపుతున్నా ఒక్కసారి కూడా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి ఎరుగను నేను. స్పీడ్ లిమిట్ కంటే తక్కువగానే నడుపుతుంటాను. ఇప్పటిదాకా కనీసం పది దేశాల్లో కారు నడిపాను. అయితే ఆ రోజు ఆదుర్దాలో ఉన్నానేమో… నాలుగేళ్ళ అప్సర నాకోసం బడిలో ఎదురుచూస్తూ ఉంటుంది. రెండు నిముషాలు ఆలస్యమయినా సరే పైకి వినిపించకుండా కళ్ళల్లో నీళ్ళు నింపుకొని ఏడుస్తుంటుందన్నది గుర్తు రాగానే… కారు వేగం కాస్త పెంచాను. అదే క్షణంలో, దుప్పి కోసం మాటువేసి వున్న మృగంలా, నల్ల దుస్తుల్లో ఉన్న ఆ పోలీసు, రోడ్డు మీద ప్రత్యక్షమై కారు ఆపాడు. ఆరడుగుల ఆజానుబాహుడు. దగ్గరకొచ్చి నా డ్రైవింగ్ లైసెన్స్, ఇతర వివరాలు అడిగినప్పుడు ఆ క్షణాన నాకొచ్చిన భాషలన్నీ మరిచిపోయాను. ఒంటి మీద లెదర్ కోటు, కారులో హీటర్ ఉన్నా కూడా నా ఒళ్ళు ఆగకుండా వణికింది.

ఇదంతా నా కూతురు తెచ్చిపెట్టిన తంటా. రెండు నెలలపాటు మనవరాలితో గడుపుదామని వచ్చాను నేను. ఈ రెండు నెలలూ మనవరాలిని బడి నుండి తీసుకొచ్చే బాధ్యతని నాకంటగట్టింది నా కూతురు. నాకు గుబులు. నావల్ల కాదన్నా వినలేదు. రోడ్డు మీద రద్దీ తక్కువున్నప్పుడే ఇంటినుండి బడికి వెళ్ళడానికి ఇరవై నిముషాలు పడుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఇహ చెప్పనే అక్కర్లేదు. బాస్టన్ నగరంలో రోడ్లను అస్సలు నమ్మలేము. వంపులు తిరిగి, హెచ్చు తగ్గులుగా ఉంటాయి. ఉన్నట్టుండి ఫ్రీవేలనుండి కలుసుకునే రోడ్లు. ఎక్కడ చూసినా ఎడమ వైపుకి, కుడి వైపుకి వెళ్ళే ర్యాంపులు- గందరగోళంగా ఉంటుందంతా. అసలే నేను తరచుగా రోడ్లమీద తప్పిపోయే ఘన చరిత్రను సొంతం చేసుకున్నవాడ్ని. అందుకే జంకాను.

నా కూతురేమో ఏదైనా అనుకుంటే దాన్ని చేసితీరవలసిందేననే రకం. బాస్టన్ సిటీ మ్యాప్ తీసి టేబుల్ మీద పరచి మార్కర్ పెన్నుతో దారి గీసింది.

“చూడు నాన్నా! రెండు లెఫ్ట్‌లు, మూడు రైట్‌లు. చాలా సులువు. నువ్వేమీ రాకెట్ సైంటిస్ట్‌వి కానక్కరలేదు.” అంది.

ఆమె అలా ఒప్పించడమే ఇప్పుడు ఈ పోలీసువాడు నన్నిలా ఆపడం దాకా తెచ్చింది.

అప్సర బడి కాస్త కలిగినవాళ్ళుండే ఏరియాలో ఓ కాలువను అనుకుని ఉంటుంది. కిండర్‌గార్టెన్‌లో అప్సర చదువు. అప్సర తరగతిలో 18 మంది పిల్లలు; తరగతికి ఇద్దరు టీచర్లు. బడయ్యాక చాలామంది పిల్లలను వాళ్ళవాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి తీసుకువెళ్తారు. సరిగ్గా 12.30 గంటలకు బడి విడిచిపెడతారు. పిల్లలు ఒకరి వెనక ఒకరు వస్తారు. అప్పటికే కార్లు వరుసగా బారులుతీరి ఉంటాయి. కార్లలో ఉన్న పెద్దలు కార్లలోనే ఉండాలి. టీచరే ఒక్కొక్క బిడ్డనీ తీసుకొచ్చి కారు తలుపు తీసి కార్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి పంపుతారు. ఎటువంటి హడావిడీ, గాభరాలూ లేకుండా క్రమ పద్ధతిలో ఒక్కో కారూ కదిలి వెళ్ళిపోతుంది.

నేనీ బాధ్యతను ఒప్పుకున్న మొదటి రోజునే ఆలస్యం కాకూడదని ముందు జాగ్రత్తగా సరిగ్గా 12 గంటలకే బడికి చేరుకున్నాను. వరుసలో ముందు నా కారే ఉంది. కొన్ని నిముషాల తర్వాత ఏడుగురు కూర్చునే ఒక మినీవ్యాను వచ్చి ఆగింది. ఆ కారు నడుపుకొచ్చింది ముప్పై, ముప్పై రెండేళ్ళ వయసున్న ఓ అమ్మాయి. ఆమె కార్లో నాలుగు చైల్డ్ సీట్లున్నాయి. మూడిట్లో ముగ్గురు పిల్లలకూ సీటు బెల్టులు వేసివున్నాయి. ఆమె నాకేసి చూడటమూ, నేను రియర్ వ్యూ మిర్రర్లో ఆమెను చూడటమూగా కాసేపు సాగింది.

మరి కాసేపటికి వ్యాను దిగి వచ్చి నా కారు తలుపు తట్టింది. నేను కిటికీ అద్దం దించాను. సోప్స్‌లో వచ్చేలాంటి అందగత్తె ఆమె. అయితే మేకప్ అలవాటు లేని ముఖం; ముఖాన్ని సరిగ్గా కడుక్కుందో లేదో అనిపించేలా ఉంది. జుత్తంతా చెదిరిపోయుంది. మాసిన దుస్తులేమీ కాదు గానీ సాదా సీదాగానే ఉంది. తనకున్న సహజమైన అందాన్ని ఏమేం చేస్తే దాచేయొచ్చో అవన్నీ చేసి కప్పిపుచ్చడానికి ప్రయత్నించినదానిలా ఉంది.

“ఓ సహాయం చెయ్యగలరా?” అడిగింది.

“తప్పకుండా!” అన్నాను నేను.

“మామూలుగా నేను పన్నెండుకే వచ్చేసి కారు ఇక్కడే ఆపుకుంటాను. నేను మూణ్ణెల్ల పాపడికి పాలివ్వాలి. ఈ చెట్టుకింద నాకు సౌకర్యంగా ఉంటుంది. మీరు కారు తీస్తే నేను ఇక్కడ పార్క్ చేసుకుంటాను,” అంది.

నేను సరేనని కారు స్టార్ట్ చేసి ఒక రౌండ్ వేసి వచ్చి ఆమె కారు వెనుక నిలిపాను. ఆమె పిల్లాడికి పాలిస్తోంది.

ఆ పరిచయం తర్వాత ఆ చెట్టు కింద చోటుని ఆమె కోసం అట్టిపెట్టి ఆమె రాగానే ఆమెకిస్తుండేవాడిని. ఓ చిరునవ్వు, చేయూపు, ఓ పలకరింపు… ఇలా సాగుతూ ఉండింది. ఆమె పేరు ఒలీవియా. కవలపిల్లలతో కలిపి ఆమెకు నలుగురు పిల్లలు. పెద్దకూతురి పేరు అనా. అప్సర, అనా ఒకే తరగతిలో చదువుతున్నారు. అనా తన బెస్ట్ ఫ్రెండ్ అని అప్సర చెప్తుంటుంది.

పిల్లలను తీసుకెళ్ళడానికి ఆ బడికి వచ్చే తల్లుల్లో అందరిలోకీ ఈ ఒలీవియా కొంచం తేడాగా అనిపించింది. అందరూ పసితల్లులే. బాగా చక్కగా అందంగా మస్తాబయ్యి వచ్చే తల్లులే. ఏదైనా పార్టీకి వెళ్తున్నారా అన్నట్టు అలంకరించుకుని వస్తారంతా. దుస్తులు కూడా ఖరీదైనవన్నది చూడగానే చెప్పేయొచ్చు. నేను వీళ్ళకు భిన్నంగా ఉంటాను. నా తర్వాత ఒలీవియా. జుత్తు చిందరవందరగా ఉంటుంది. ముఖం పొద్దునో సాయంత్రమో లేక రెంటికి మధ్య సమయంలోనో నీళ్ళన్న పదార్థం ఏదీ తాకనిదానిలా ఉంటుంది. ఆమె చిందించే ఆ క్షణకాలపు చిరునవ్వు మాత్రం ఎయిర్‌హోస్టెస్‌నో, రిసెప్షనిస్టునో లేక ఇంకో పైస్థాయి ఉద్యోగినో తలపించేలా ఉంటుంది.

ఒక రోజు ఒలీవియా మళ్ళీ నా కారు కిటికీ తట్టింది. నేను ఏంటని అడిగాను. మర్నాడు అప్సరని తీసుకెళ్ళడానికి వచ్చినపుడు అనాని కూడా మా ఇంటికి తీసుకెళ్ళడానికి వీలవుతుందా అని అడుగుతూ, తనకి డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉందనీ, మూడింటికి మా ఇంటికి వచ్చి అనాని తీసుకెళ్తాననీ చెప్పింది.

నేను ‘మీరు నా కుతురితో మాట్లాడితే మంచిద’ని చెప్పాను. ఆమె నా కూతురితో మాట్లాడానని, స్కూల్ పికప్ సమయంలో ఇవ్వడానికి పింక్ స్లిప్ కూడా రాసుకొచ్చానని చెప్పింది. పిల్లల తల్లిదండ్రులు ఒక స్లిప్‌లో వివరాలవీ రాసి ఇస్తే తప్ప పిల్లలను వేరేవాళ్ళతో పంపరు.

మరుసటి రోజు నేను అప్సరని, అనాని కారులో ఇంటికి తీసుకువచ్చాను. ఆ రోజు మంచు ఆగకుండా కురుస్తూ ఉంది. అనా, అప్సర వెనక సీట్లో కూర్చుని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. బాస్టన్ నగరంలో ఎనిమిది లక్షల కార్లున్నట్టు ఈ మధ్యే ఒక వార్త చదివాను. ఆ రోజు ఆ కార్లన్నీ నిజంగా ఒక్క హైవే ఇరవై మీదనే ఉన్నాయనిపించింది. పిల్లలిద్దరూ ‘ఇల్లొచ్చిందా ఇల్లొచ్చిందా’ అని అడుగుతూనే ఉన్నారు. చాలాసేపటికి ఎలాగోలా ఇల్లు చేరుకున్నాము.

చెప్పిన సమయం దాటి గంటయినా ఒలీవియా రాలేదు. ఇద్దరు పిల్లలతో ఇల్లంతా గందరగోళంగా ఉంది. నా భార్య ఈ అనుకోని ప్రళయానికి విసుగొచ్చి తలపట్టుకుని కూర్చుంది. అప్సర ఎంతో సౌమ్యమైన పిల్లే. అనా కూడా అలానే కనిపించింది. అయితే ఇద్దరు సౌమ్యులు కలిస్తే ఇల్లు పీకి పందిరెయ్యగలరని తెలిసొచ్చిందిప్పుడు. నేను చదువుకునే రోజుల్లో కెమిస్ట్రీ లేబ్‌లో నీళ్ళలాగా ఉండే రెండు ద్రవాలను కొంచం కొంచంగా కలుపుతూవుంటే ఉన్నట్టుండి ఊదా రంగులోకి మారిపోవడం గుర్తుకు వచ్చింది. అప్సర ఒక బొమ్మ తీసుకుంటే అనాకీ అదే కావాలి. అనా మరొకటి తీసుకుంటే దానికోసం అప్సర పేచీ. నవ్వేప్పుడు ఇద్దరూ ఒకే శ్రుతిలో నవ్వారు, ఏడ్చేప్పుడూ అంతే. అయితే ఎప్పడు బాగుంటారు, ఎప్పుడు తగువుకు దిగుతారో తెలుసుకోలేక నేనూ నా భార్యా జుత్తు పీక్కున్నాము.

ఒలీవియా ఉరుకులు పరుగులుగా గస పోసుకుంటూ వచ్చింది. మామూలుగానే చెదిరిపోయినట్టు కనిపించే జుత్తు ఇంకాస్త చెదిరిపోయి వుంది. చేతిలో పసిపాపడు. ఆమె కాళ్ళకు ఇరువైపులా ఇద్దరు కవలలు అంటి పెట్టుకుని వచ్చారు. అనా ఆమెను చూడగానే, ‘మమ్మీ నేను నీ పిల్లిపిల్లను’ అంటూ ఆమెను హత్తుకుంది. ఒలీవియా అనాని పట్టించుకోకుండా మాకు క్షమాపణలు చెప్పింది. మంచు కప్పేసి ఉండటం మూలాన వేరే ఏవో దార్లు పట్టుకుని వచ్చానని వివరించింది. పాపడికి పాలిచ్చే సమయం దాటిందనీ, ఇక్కడ ఇవ్వచ్చా అనీ అడిగింది. మేము సరేనన్నాము. గది చూపించేందుకు మేము తడుముకునేలోపే ఆమె కంటికి కనిపించిన మొదటి ఆసనంలో కూలబడి రొమ్ము బైటకు తీసి పాపడికి పాలుపట్టడం మొదలుపెట్టింది.

ఇప్పటిదాక ఇద్దరు పిల్లల్నే మేనేజ్ చెయ్యడానికి అష్టకష్టాలు పడిన మేము ఇప్పుడు నలుగుర్ని అట్టిపెట్టుకోవలసి వచ్చింది. వాళ్ళు మొదలెట్టే ఏ ఆటైనా సరే పరుగుతో మొదలయ్యి పరుగుతోనే అంతమయ్యేది. పరుగెడితే నలుగురూ నాలుగు వైపుల్లో పరుగెట్టారు. ఆ పరుగుని కూడా వాళ్ళంతట వాళ్ళు ఆపలేదు. ఏ గోడో, సోఫానో, ఛెయిరో, టేబులో, వంట గదో అడ్డుండటం వల్లే ఆగుతుందది.

ఒలీవియా ఒక రొమ్ము పాలు పట్టడం అవ్వగానే దాన్ని లోపలైనా పెట్టుకోకుండా మరో రొమ్ము బైటకు తీసి పాపడికి పాలు పట్టడం కొనసాగిస్తూ, ఇక్కణ్ణుండి వెళ్ళడానికి దగ్గర మార్గం ఏదైనా ఉందా, అని వివరాలడిగింది. మామూలుగానే నాకు మ్యాపులంటే మహా చిరాకు. అయితే అప్పటికే ఆ ప్రాంతపు మ్యాపును వల్లె వేసేశాను కనుక నాకు తెలిసిన దారి చెప్పగానే ఆమె అది వ్యతిరేక దిశ అని చెప్పింది. నేను మ్యాపు తీసుకుని గీసి చూపించినా ఆమెకు నమ్మకం కలగలేదు. చివరికి నేను “నన్ను మీరు నమ్మవచ్చు. రెండు లెఫ్ట్ టర్న్‌లు. మూడు రైట్ టర్న్‌లు. మీరు హైవే ఎక్కేయగలరు,” అని మ్యాపులో చూపిస్తూ “చాలా సులువు. దీన్ని తెలుసుకోడానికి మీరు రాకెట్ సైంటిస్ట్ అయుండక్కర్లేదు,” అన్నాను. ఆమె ముఖం ఒక్క క్షణం రంగు మారిపోయి మళ్ళీ యథాస్థితికి వచ్చింది.

గొర్రెల కాపరి తన గొర్రెలను చేతుల్లో పొదువుకున్నట్టుగా ఆమె తన పిల్లలను పొదువుకొని తన మినీవ్యాను దగ్గరకు నడిచింది. ఒక్కొక్కర్నిగా కూర్చోబెట్టి సీట్ బెల్ట్ బిగించింది. చిన్నపాపడ్ని మాత్రం వెనక్కి తిరిగున్న సీట్లో పెట్టి బెల్ట్ వేసింది. నా వైపుకు చూసి “రెండు లెఫ్ట్ టర్న్‌లు, మూడు రైట్ టర్న్‌లు. కరెక్టే కదా?” అని అనుమానంగా అడుగుతూ నిస్సత్తువగా నవ్వింది. ఆమె చెంపల మీద రాలిన మంచు చుక్క ఒకటి ఆమె ఒంటి వెచ్చదనానికి కరిగిపోతూ ఉంది. చేసిన సాయానికి చాలా కృతజ్ఞతలూ, కలిగించిన శ్రమకు క్షమాపణలూ చెప్పి కారు రివర్స్ చేసుకుని వెళ్ళిపోయింది. జెట్ విమానం టేకాఫ్ అయ్యి వెళ్ళిపోయినంత నిశబ్దం ఇప్పుడు.

నేను అప్సర చేయి పట్టుకుని లోపలికి వెళ్ళాను. లోపల ఇల్లంతా చెల్లాచెదరుగా బొమ్మలు, వస్తువులు పడున్నాయి. వీటన్నిటినీ సర్దిపెట్టాలంటే కనీసం రెండు రోజులైనా పడుతుంది. హాలు నడిమధ్యన తల మీద చేతులు పెట్టుకుని నా భార్య కూర్చుని ఉంది. ఆమె కళ్ళల్లో అయోమయం. నిజానికి కథ ఇక్కడితో శుభం అయ్యుండాలి. కానీ కథ ఇంకా ముగియలేదు.

రెండు వారాల తర్వాత ఇంటికి చేరిన నా కూతురితో ఒలీవియా ఓ గంట ఆలస్యంగా వచ్చిన సంగతి చెప్తూ, ఈలోపు పిల్లలు ఇల్లు పీకి పందిరేసిన వైనం, మేము సర్దటానికి పడిన పాట్లను వివరించాను. ఆ రోజు కాస్త వేగంగా కారు నడిపిన విషయమూ, నేను ఫైన్ చెల్లించిన సంగతీ చెప్పలేదు.

“ఎందుకు ఆలస్యంగా వచ్చింది?” అని ఏదో మామూలుగా అడిగింది నా కూతురు.

ఆమె దారి తెలీక తిప్పలుపడి వచ్చిందనీ, మాకు జరిగిన సంభాషణంతా పూసగుచ్చినట్టు వివరించాను. ఓ మాటకు మాత్రం నా కూతురు “ఏంటి?!” అని కళ్ళు పెద్దవి చేసి చేతులు తన నోటికడ్డం పెట్టుకుని లేచి నిల్చుంది.

“నాన్నా! ఏమన్నారు?” అని మళ్ళీ అడిగింది.

నేను మళ్ళీ చెప్పితే నడుమ్మీద చేతులు పెట్టుకుని పడీపడీ నవ్వింది. నాకేమీ అర్థం కాలేదు.

“అమ్మాయ్! నవ్వు ఆపి చెప్పు లేదా చెప్పేసి నవ్వు,” అన్నాను.

ఆమె నవ్వాపుకోలేక “నాన్నా, మీరు… మీరు… ‘రాకెట్ సైంటిస్ట్ అయుండక్కర్లేదు’ అన్నదాన్ని తలచుకుంటే నవ్వాగడం లేదు,” అంది.

“ఎందుకూ?”

“నాన్నా, ఒలీవియా నాసాలో ఉద్యోగం చేసే రాకెట్ సైంటిస్ట్. ఇప్పుడామె ఆరు నెలలు మెటర్నిటీ లీవులో ఉంది.”

ఒలీవియా ముఖం ఓ క్షణంపాటు నల్లబడింది గుర్తొచ్చింది. ఇప్పుడు నేనే చేతులు నోటికడ్డుపెట్టుకుని నవ్వుకున్నాను.
-------------------------------------------------------
రచన: అవినేని భాస్కర్
మూలం: ఎ. ముత్తులింగం
[మూలం: ముగం కళువా అళగి (ముఖం కడగని అందగత్తె) అన్న కథ. 
భూమియిన్ పాది వయదు (2007) అన్న సంపుటం నుండి.]
ఈమాట సౌజన్యంతో
-------------------------------------------------------

Wednesday, November 6, 2019

జీవన తీరాలు


జీవన తీరాలు




సాహితీమిత్రులారా!


పావు తక్కువ పదకొండు.  క్వాలిటీ ఐస్‌ క్రీం, శ్రీ వెంకటేశ్వర, హోటల్‌ న్యూ వెంకటేశ్వర, క్రంచీస్‌ ఎన్‌ మంచీస్‌  అన్నీ మూసీసేరు.  పేవ్‌ మెంట్‌ మీద పిట్టగోడని ఆనుకుని ఒక నడివయస్సు మనిషి ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకుని తదేకంగా కుంపటి విసురుకుంటూ మొక్కజొన్న పొత్తులు కొనే బేరం కోసం ఇంకా కనిపెట్టుకుని వుంది.  మురీ మిక్చర్‌ అమ్ముకునే  వాళ్ళ దీపాలు నది ఒడ్డున కొరివి దెయ్యాల్లాగ ఎర్రగా మండుతూ  డిగ్రీ కాలేజీ దగ్గర ఒకటి, జగన్నాధ స్వామి గుడి దగ్గర వొకటి.  ఉమా గారు ఇసకలో ప్లాష్టిక్‌ కుర్చీలో ఒక్కడే కూర్చుని తాగుతున్నాడు.  ఎప్పుడూ వేసుకునే తెల్ల బట్టలు లెదర్‌  బెల్ట్‌తో టక్‌ చేసుకుని. కౌంటర్లో స్టీరియోలో ఇళయరాజా పాటలు ఆగిపోయి ఇప్పుడు
“నిత్య బ్రహ్మచారులే అయ్యప్పా స్వాములే
స్వామి చిక్కడ కోం కోం
అయ్యప్ప చిక్కడ కోం కోం…”
అని అదే భజన మళ్ళీ మళ్ళీ మళ్ళీ వస్తోంది.

నరహరి ఖాఖీ చొక్కా మీద గళ్ళ తువ్వాలు కండువా లాగ వేసుకుని కౌంటర్‌ ఎదురుగా టేబిల్లో ఒక్కడే కూర్చుని సమోసా ముక్క మీద కెచప్‌  ఎక్కువగా పోసుకుని అసహనంగా తింటున్నాడు.  కౌంటర్లో అయ్యప్ప స్వామి డ్రస్‌ లో ఉన్నతను   కేషియర్‌    నరహరి కేసి ఫ్రెండ్లీగా చూసి “ఏటి జూట్‌ కంపెనీ వోలా స్వామీ?” అని అడిగేడు.  నల్లటి చొక్కాని నల్ల లుంగీలో మడిచి కట్టుకుని మెడ చుట్టూ తెల్లటి సన్నంచున్న నల్ల తువ్వాలు వేసుకున్నాడు.  గడ్డాలు చక్కు దవడలు వేసుకుని ఆసక్తిగా చూస్తున్నాడు.   నరహరి ప్రీమియర్‌  పద్మినీ కీని చెవిలో తిప్పుకుంటూ ముభావంగా నీకెందుకు అన్నట్టు “లేద్‌ ..” అని తెగ్గొట్టేడు.  ఉమా గారు ఆపకుండా తాగుతున్నాడని అతనికి ఆదుర్దాగా ఉంది.  కేషియర్‌ స్వామి మర్యాదగానే “వూ?  గవరమెంట్‌  ఎంప్లాయీషా స్వామీ??” అని రెట్టించేడు మళ్ళీ.  నరహరి ఇంక తప్పదన్నట్టుగా పొడిగా “ఆయను మా అయ్యగారు వై…ఇక్కడ పీజీ సెంటర్‌ మీటింగు లోన వారూ గూడా మెంబరు …?” అన్నాడు ఇంక చాలా అన్నట్టు.
“పీజీసెంట్రా?  ప్రిన్సపాల్‌ గారు వూళ్ళో లేరు సార్‌!…..ఏటి స్వాం మీటింగు?”
“రస సాహితీ….”
“ఏంటి వారు రైటర్సా స్వామీ?” అన్నాడు ఉమా గారికేసి చూపించి.
“అవును వై….” అని చిరాగ్గా ఇంకా అనబోయేడు.
అతను మధ్యలో మాటకి అడ్డం పడి “స్వామి మీరు ఏటనుకోమంటే సింపుల్‌  రిక్వష్టు..దీక్షలో వున్నాను స్వామి..వయ్యా అండీ వొండీ అనకుండ స్వామీ అని పిలవాల…ఇరుముడి దీక్షలో వున్న వారిని స్వామీ అని పిలాల, వారూ గూడా ఇవతలోలకి స్వామీ అనే పిలాల….” అన్నాడు.  నరహరి  ముభావంగా నిరసనగా నవ్వుకున్నాడు, ఏమీ మాట్లాడకుండా.  అంత దీక్ష గల వోడివయితే బ్రాందీ షాపులో ఎందుకున్నావు అనుకున్నాడు.  బార్లో తను, అయ్యప్ప స్వామి, వెనక ద్వారం దగ్గర  గోలేల్లో కప్పులు ప్లేట్లూ కడుగుతూ ఒక పది పన్నెండేళ్ళ కుర్రాడు. బయట ప్లాష్టిక్‌ కుర్చీలో మఫ్లర్‌ చుట్టుకుని చలికి కాళ్ళు ముడుచుకుని విచారంగా మందు కొడుతూ ఉమా గారు.  చంద్రుడు లేడు.  చుక్కలు లేవు.  కుక్కలు రోడ్డవతల కోలనీ నుండి వచ్చి నదిలో కలిసే పెద్ద కుళ్ళు కాలవ పైపులో పడుక్కుని నిద్రపోతున్నాయి.  పొయ్యి మీద టీ, పక్కన గ్రిల్‌ మీద కవ్వా పుల్లలు నెమ్మదిగా మగ్గుతున్నాయి.
“ఏంటి వారు రైటర్సా స్వామీ?”
“అవును స్వామీ….ఉమా గారనీసి విన్నారా?”
“లేదు స్వామీ… పీజీసెంట్ర వారంటే ఎవ్విరి మంత్‌  ఫష్ట్‌  వీక్‌ లో వస్తారు స్వామీ.  వీరిని ఇదే చూట్టము….శానా తాగుతారు…స్వామి…పెద్దవారు కదా..ఏంటో బిజినస్‌  పీపుల్సో ఏంటో  అనుకున్నాము…..సర్వా సాదారనంగ టీచింగ్‌ స్టాఫ్సంటె  ఇంతలెక్కన  తాగరండి……” అని తమాయించుకున్న నవ్వు కళ్ళల్లో పెట్టుకున్నాడు. ఈ దునియాలో అన్నీ ఆ స్వామి ఆధీనమే కదా అన్నట్టు ముందరి ద్వారం మీద ఫొటోలో గొంతుకిళ్ళా కూర్చుని దీవిస్తున్న అయ్యప్పకేసి చూపించి “స్వామి శరణం..” అని భక్తిగా కళ్ళు మూసుకున్నాడు.

నరహరి “నీకేం తెలుసు లేవై?” అన్నట్టు నిర్లక్ష్యంగా పెదవి విరిచి “రైటర్సన్నాను గాని బిజినస్‌  లేదన లేదు కదా!  వారు రైటర్సే గాని చాలా యేపకాల్లెండి.  లా కాలేజిలోన లెక్చిలేరు!..చిట్టి వలస ఉమా టాకీస్‌ వీరిదే…?!” అని ఇది చాలా ఇంకా చెప్పమంటావా అన్నట్టు చూసి ఆపేడు.  అయ్యప్ప చిప్పలు కడుగుతున్న కుర్రాడ్ని “మస్తాన్‌ స్వామీ…  ఏ మస్తాన్‌  స్వామి!” అని కేకేసి, “వారు స్వామికి కవ్వా పుల్లలో ఏంటో వారి ఐటమ్స్‌  ఏంటో కనుక్కో స్వామీ…. క్లీనింగొక్క దానికయితె నువ్వెందుకూ…కష్టమర్లకీ చూసుకోవాల….” అని గద్దించేడు.  మస్తాన్‌  ఉత్సాహంగా చేతులు తుడుచుకుని రెండు కవ్వా  పుల్లలు ఎర్రగా కాలినవి తీసి ఇసకలోకెళ్ళి “సార్‌..కవ్వా పుల్లలు స్వామీ…” అని నిలబడ్డాడు.  ఉమా గారు ఆ పుల్లలు రెండూ అందుకుని వంద నోట్లు వాడి చేతికిచ్చి నరహరి కేసీ కౌంటర్లో స్వామి కేసి అరిచినట్టు ముద్దగా “జానీ వాకరు…జానీ…జానీ…” అని మోచేత్తో సంజ్ఞలు చేసేడు.   కేషియర్‌ స్వామి మస్తాన్‌  చేత బాటిల్‌ పంపించి అనుమానంగా “ఇది మూడోది స్వామీ.  మాకూ గూడా క్లోజింగ్‌ టైము……” అన్నాడు వాచీ చూసుకుని.

నరహరి లేచి ఇసకలోకెళ్ళి “అయ్యగారు!  అయ్యగారు… ఇంక చాలు ఇంక ఆపీయండి….చిలకమ్మగారు చూస్తే బేజారయిపోతారు.  ఇంకెల్దాం రండి బాబూ…” అని నచ్చ చెప్పడానికి ట్రై చేసేడు.  ఉమా గారు “నువ్వెల్రా నువ్వు….దానూసు ఇప్పుడెందుకు…” అని కసురుకున్నాడు.  నరహరి చేసేది ఏం లేక వచ్చి కూర్చున్నాడు.  కేషియర్‌ స్వామి మళ్ళీ క్యూరియస్‌గా “మరి అంత కలిగున్న వోరయితే ..ఏటి ప్రోబ్లమ్సా స్వామీ?  ఈ ఏజ్‌ లోన….ఏడున్నర కాడ్నించి తాగుతూనే వున్నారు…” అని అడిగేడు.

“ప్రోబ్లమ్స్‌ కాదు స్వామీ..ఇక్కడ ఆఫీసర్స్‌ కోలనీ లోన జ్ఞాన ప్రెకాష్‌  గారనీసి ఎరుగుదువా?  … వారింటి కాడ ఆడటోరియంలోన ఇవాళ ఆదివారం మధ్యానం కవుల మీటింగు పెట్టేరు. దన్లో పెద్దలందర సమక్షాన  మా ఉమా గారు మాట్లాడుతుంటె…..మీటింగులోన వేరే రైటర్స్‌ తోటి వారికి మాటా మాటా వొచ్చింది ..మా అయ్యగారసలే సున్నితము.  అవతలోడెవడొ “నువ్వూ ఒక్కవ్వేనా నీదీ ఒక్కవిత్వమేన” అనీసి తగులుకున్నాడు.”  ఎవలో డీయెస్సార్‌  గారంట….రేచు కుక్కలాగ పడిపోయేడు…..కవులు పెద్దలు ఆడోలు అందరు కల్సి ఎంత ఆపినా విన్నాడు కాదు.  నీ కదలు పుస్తకం అయితే ఏస్సేవు కాని నీ కదల్లోన ఇలాగ బాగోలేదు..అలాగ  బాగున్నాది  కాదు..బీదోల మీద రాయడానికి నువ్వేటి బీదోడివా?  నీ బతుకూ వొక బతుకేనా అన్నట్టుగ రూపించేడు.  మా ఉమా గారు ఉడికిపోయి ఆయనికి ఏదో అనరాని మాట అనీసి తిట్టడం తిట్టేడు.. నీనూ అక్కడే గుమ్మంల కూసోనున్నాను.  ఆల్లు పెద్దలే లంజకొడక లంబ్డి కొడకనీసి మీటింగులోన కొట్టీసు కుంతంటే డ్రైవర్ని మనమేటి చేస్తాము?…..మా అయ్యగారికి వార్ని ఏమన్న పర్వా లేదు గాని వారి పుస్తకాన్ని ఏటేన్నా అంటే ఇల విల్లాడిపోతాడు…” అన్నాడు.
“ఐతే అవతలాయను  వూరుకున్నాడా…?”
“ఆడెందుకూరుకుంటాడు?  ఇది సభా హాలయిపోనాది..బైటికి రారా నీ అంతూ చూస్తానన్నాడు…నీనే కలగ చేసుకుని ఈయన్ని బండ్లేసుకుని వొచ్చీసేను…”
కేషియర్‌ ఆశ్చర్యంగా “ఏటి స్వామీ పుస్తకము?  …మీటింగు పెట్టుకోని పుస్తకాల కెవులేనా తిడతారా…” అన్నాడు.  మస్తాన్‌  పని ఏం లేక వాళ్ళ ఎదురుగా చెక్క బెంచీ మీద కూచుని ఆసక్తిగా వింటున్నాడు.

నరహరి “అమ్మా అలాగనీకు.  నీకూ నాకూ డబ్బు దస్కమంటె ఎంత పట్టో ఆలకి పుస్తకాలంటె పేపర్లోన ఎయ్యడాలంటె అంత పట్టు….ఉండు తెస్తాను…” అని బార్‌ ముందు రోడ్డు  మీద  పార్క్‌  చేసిన  ఫియట్‌  డిక్కీ తీసి లోపల్నుండి ఒక పుస్తకాల కట్ట పైకి తీసి దుమ్ము దులిపి, ఒక పుస్తకం తీసుకుని తెచ్చి కేషియర్‌ కిచ్చి గుంభనంగా నవ్వుతూ “ఇదా… జీవన తీరాలు..ఈ పుస్తకాన్ని గాని పొగిడేవంటే…మా ఉమా గారు నీకు ప్రానాలన్నా ఇచ్చెత్తాడు…” అని అతని ఎదురుగా బెంచీ మీద ఇటో కాలూ అటో కాలూ వేసుకుని కూచున్నాడు.  కేషియర్‌  స్వామి ఆ పుస్తకాన్ని ఆసక్తిగా ఇటూ అటూ తిప్పేడు.  దానిమీద నీలి రంగు నది ఆకాశం మనిషి తొడలు  ఒక పెద్ద కన్ను వాటి చుట్టూ సాలిగూడు పడవల బొమ్మలూ ఉన్నాయి.  దాన్ని విచిత్రంగా చూసి  కూడబలుక్కుని “జీవన తీరాలు…. ఉమా కధలు…పితాన ఉమా మహెస్వర రావు, M.L. ” అని చదివేడు. అట్ట వెనకాల ఉమా గారు సూట్‌  టై  వేసుకుని  బింకంగా  నవ్వుతున్న  ఫొటో వుంది.  మస్తాన్‌  కేషియర్‌ స్వామి వెనకాలే చేరి ఆ పుస్తకంలోకి ఆసక్తిగా చూస్తున్నాడు.

“ఈ ఫొటోలో అయ్యగారికీ ఆ కుర్చీలోనయ్యగారికీ ఎంత డిఫరన్సు స్వామీ?” అని ఆశ్చర్యంగా అని  ఫొటో కింద వాక్యాలు చదువుతున్నాడు.  “ఇవి కధలు కావు.  జీవన తీరాల్లో పావన శకలాలు…..అటు న్యాయ శాశ్త్రంలో దురీ…దురీనత, అటు వానిజ్య రంగంలో పారి…పారీనత….ఇటు రచనా రంగములో అభిజ్ఞత, మూడూ ముప్పిరిగొన్న మనీషి ఈ ఉమా మహేస్వర రావు.  ముచ్చటగా మా ఉమా.  ఇతని కధలు మట్టిలోంచి వస్తాయి… చెమట లోంచీ కన్నీళ్ళ లోంచీ కలిసి వస్తాయి…అందుకే వీటి నిండా మట్టి వాసన, మట్టి జీవితాల కన్నీటి చెమట వాసన…”   కేషియర్‌ స్వామి చదవటం ఆపీసి పుస్తకం వాసన చూసేడు.   కొత్త కాగితం వాసన వేస్తోంది.  ఏమీ అనకుండ పేక దస్తా కలిపినట్టు కాగితాలు పర్రుమని తిప్పి మళ్ళీ  నరహరి చేతికి ఇచ్చీసి “స్వామి శరణమ్‌…ఇరుముడి మాలయే శరణం….” అన్నాడు, ఒక అర్ధం కాని అనుభవాన్ని పైకి చెప్పలేకుండా తనలో తానే సర్ది చెప్పుకున్నట్టు.

మస్తాన్‌  నరహరి చేతిలో పుస్తకం అట్టని మళ్ళీ చూసి “అబ్బహ్‌….అట్ట మీద బొమ్మ బలేగున్నాది సార్‌” అన్నాడు మెచ్చికోలుగా.  కేషియర్‌  వాడిలా అనవసరంగా జోక్యం చేసుకోటం ఇష్టం లేక అసహనంగా “నీకెందుకురా పెద్దవారి విషయాలు?” అని కసిరేడు.  వాడు నవ్వుతూ దాన్ని దులిపేసుకుని “స్వామి గురూ…క్లీనింగయిపోయింది గురూ…పన్నెండూ…” అని నసిగేడు.  వాడికి ఇంటికెళ్ళి అన్నం తిని  పడుక్కోవాలని ఉంది.  కేషియర్‌ స్వామి గోడ వాచీకేసి చూసి “పన్నెండయిపోయింది…..షాపు కట్టెయ్యాల స్వామీ… వారికి చెప్తార నన్ను చెప్మంటారా?” అన్నాడు.  నరహరి లేచి అతన్ని తన వెనకాలే రమ్మని చెప్పి సంజ్ఞ చేసేడు.  ఉమా గారు కుర్చీలోంచి జారిపోతూ ఇసకలోకి జోగుతున్నాడు.  కవ్వాపుల్ల ఒకటి తెల్లటి చొక్కా మీంచి పడి ఎర్రటి మరకలయ్యేయి.  నరహరి  ఆయన్ని నమ్రతగా తట్టి “రండి సార్‌ అయ్య గారు..మళ్ళీ ఇంటికెల్లే సరికి వొంటిగంటయిపోద్ది…చిలకమ్మ గారు గాబరా పడిపోతారు బాబూ..” అని బతిమాలేడు.  ఉమా గారు లేవకుండానే కళ్ళెత్తి కష్టం మీద చూసి “యితణెవళ్రా నర్రా?” అన్నాడు.
“ఇతను  ఈ బారు స్వామి…కొట్టు కట్టీయాలంట రండి సార్‌..అయ్యగారూ? ఆయ్‌గారు! రండి బాబూ..”

అలా పరిచయం అయ్యేక కేషియర్‌ స్వామి చనువుగా ముందుకొచ్చి ఒక రకంగా ఎడ్యుకేటెడ్‌గా గొంతు పెట్టుకుని “ఇదుగో జీవన తీరాలు బుక్కు సానా ట్రాఫిగ్గా వున్నాది సార్‌..శానా బాగా రాసేరు స్వామీ…” అన్నాడు.   ఉమా గారు చర్రుమని అతని చేతిలోంచి ఆ పుస్తకం లాక్కుని ” ఎవల్రా ఇమ్మెచ్యూరు?  నీ ఎదవ కేష్టు ఫీలింగు ఎదవ….నువ్వే ఇమ్మెచ్యూర్‌…నీ కధలేటి వల్ల కాడు…వరష్ట ఫెలో” అని గాల్లోకి చేతులు విసిరి కొట్టబోయి నిలదొక్కుకోలేక కుప్పకూలి ఇసకలో పడిపోయేడు.     కేషియర్‌ స్వామి అతన్ని లేవనెత్తడానికి చంకలో చెయ్యి వేసి “ఒకళ్ళంటే మనం వరష్టయిపోతామేంటి  స్వామీ.  మన వేల్యూ మంది…మన ఎడ్యుకేషన్‌  మంది….ఇంకెవల్తోటి మనకేంటి సార్‌ నూసెన్సు.. పెద్దవారు తమరికి మేము చెప్పాలా?” అన్నాడు.  నరహరి అతనూ ఇద్దరూ రెండు చంకల్లో చేతులు వేసి కష్టం మీద ఆయన్ని లేవనెత్తి బార్లోకి తీసుకొచ్చేరు.  ఈ మాటలకి ఆయన మొహంలో చిన్న సంతోషం లాగ విచ్చుకుంది.   “అదే నేనన్నాను…మధ్యాన్నం మీటింగ్‌కి నువ్వు రాలేదేమి?  పూజలో వున్నావా..?” అని కేషియర్‌  మీద చెయ్యి వెయ్యబోయి నిభాయించుకోలేక అతని చెయ్యి లాక్కుని కుర్చీలో కూలబడ్డాడు.

కేషియర్‌  వినోదంగా ముద్దులాడుతున్నట్టు “రమ్మంటే వచ్చే వాడ్నే స్వామీ.. షాపు చూసుకోవాల కదా! ఈ సుట్టు తప్పకుంట వస్తాను… స్వామీ? స్వామి! ఇంటికెల్లి రెష్టు తీసుకోండి బాబూ.. నా మాటినండి సార్‌…” అన్నాడు.  బార్లో బాగా తాగి పడిపోయే వాళ్ళని బుజ్జగించటం అతనికి సరదాగా వుంటుంది.  ఉమా గారు ఇంకా ముద్దుగా అతని గడ్డం పట్టుకుని “ఎల్లకపోతే నీ కాడే వుండిపోతాననుకున్నావా?…ఏదీ…ఒక్క కోర్టర్‌  నీనేం ఎక్కువ తాగలేదుర నర్రా!  ఓర్నర్ర… చెప్పితనికి….ఈలిద్దరికి చెప్పు మన్సంగతి…ఒక్కటి…” అని ఒకటి అంకె వేలితో చూపించి బతిమాలటం మొదలెట్టేడు.  మస్తాన్‌ గాడు అల్లరిగా అతని ఎదురుగా వచ్చి “షాపు కట్టెస్తనాం సార్‌..ఇంకెల్లకపోతే మూసెస్తారు స్వామీ…” అన్నాడు.  నరహరి కలగజేసుకుని వాడ్ని రెక్క పట్టుకుని పక్కకి లాగి “పదండి సార్‌ అయ్యగారు.  ఆళ్ళు షాపు కట్టీయాల పాపం..నా మాటినీసి కార్లోకి రాండి సార్‌..” అన్నాడు.

“నీ మాటినీ యినగానే కారెక్కిపోడానికి నువ్వేటి పద్మావతీవా?  పద్మావోతీ….మీటింగులోన నా దుక్కు చూసి నవ్వుతావే…పద్మావోతీ…ఏంటే..ఏటి మీ డిపార్టమెంటు దుక్కు నీనొచ్చేనా?  నా వూసు నీకెందుకే?…” అని బల్ల గుద్దేడు.  నరహరి ఏం చెయ్యలేక టేబిల్‌ మీద చెయ్యి ఆన్చుకుని నిలబడిపోయేడు.  కేషియర్‌  కౌంటర్‌ మీదున్న జీవన తీరాలు తెచ్చి పట్టుకుని “సార్‌ స్వామీ గారు…పన్నెండూ ఇరవయ్యి….మా వోనరు గారో యెస్సయ్‌ గారో చూసేరంటే మా వుద్యోగాలుండవు బాబూ…ఇదిగో పుస్తకము…మంచి వెరయటీగా వున్నాది..మీయంతటి వారు మీరు మిమ్మల్నెవులన్నారు స్వామీ…. సార్‌.”
“వూఁ ..?”
“పదండి కార్లోకి పదండి…”
“వూఁ ..?”
“పదండి బాబూ..మల్లొద్దురు గాని పదండి సార్‌.”
“ఎలిపోమంటావా గుడి కట్టీసేవా..?”
“గుడేటి బాబూ.. గుడి కాదు నీను దీక్షలో వున్నాను….లెగండి స్వామీ…”
“పదా…..”
ఇద్దరూ చెరో రెక్కా పట్టుకుని కారు దాకా ఈడుస్తున్నట్టు నడిపించుకెళ్ళేరు.  మస్తాన్‌ ముందెళ్ళి బేక్‌ డోర్‌ తీసి పట్టుకుని, ఉమా గారు లోపల కూర్చున్నాక డోర్‌ బలంగా వేసేడు.  నరహరి డ్రైవర్‌ సీట్లో కూర్చుని దేవుడి ఫొటోకి దండం పెట్టుకుని బండి స్టార్ట్‌ చేసి, రివర్స్‌ చేసుకుని వాళ్ళకి టాటా చెప్పినట్టు చెయ్యూపి ఫాస్ట్‌ గా వెళ్ళిపోయేడు.  మస్తాన్‌ ఉషారుగా లోపలికొచ్చి కౌంటర్‌ ఎదురుగా నిలబడి “ఏటి గురూ అంత లాగ పట్టీసేడు…” అని బొటకన వేలు నోటిమీద పెట్టుకుని గటా గటా తాగుతున్నట్టు ఏక్షన్‌ చేసి “పద్మావోతీ…పద్మావోతీ..” అని పగలబడి నవ్వేడు.  కేషియర్‌ స్వామి ఆ సీన్‌ ఎంజాయ్‌ చేస్తూనే వాడ్ని చివాట్లు పెడుతున్నట్టు “తప్పురా..నీ కెందుకురా ఒకల గొడవ?  ఆయను తాగేడు కాబట్టె నీకూ నాకూ జీతాలు… నోరు మూసుకోని తిన్నగ ఇంటికెల్లు..” అని డబ్బులు వాడి చేతిలో పెట్టేడు.  వాడు ఆ నోట్లు నిక్కర్‌ జేబులో పెట్టుకుని తాగీసి పేల్తున్నట్టు “పడ్మావోషీ…రాయే వొలే పడ్మావోషీ….” అని కేకేసుకుంటూ ఉత్తుత్తి స్కూటర్‌ “బుర్ర్‌ బుర్ర్‌ ..” అని స్టార్ట్‌ చేసి వేగం పరుగెట్టుకుంటూ సాయిబుల పేట రోడ్డు వైపు చీకట్ల్లోకి కలసి పోయేడు.  కేషియర్‌  కౌంటర్లోని విభూతి తీసి అడ్డంగా బొట్టు పెట్టుకుని దాని మధ్యలో కుంకుమ పెట్టుకుని అయ్యప్ప పటానికి నమస్కరించి బయటికొచ్చి తాళం  పెట్టి సైకిల్‌  మీద పెడల్‌ వేసి ఏదో జ్ఞాపకం వచ్చినట్టు ఆగి తాళం తీసి లోపలికెళ్ళేడు.  జీవన తీరాలు కౌంటర్‌ మీదనే వుంది.  దాన్ని తీసి ఇటూ అటూ తిప్పి  ఘాటుగా వాసన చూసి భుజానికున్న నల్లటి ఖాళీ సంచీలో పెట్టుకున్నాడు.  బయట చలిగా వుంది.  అప్పు మీద సత్తువ కొద్దీ తొక్కుతుంటే ఖాళీ సంచీలోంచి పుస్తకం మక్కమీద టప్‌ టప్‌ మని తగుల్తోంది.
-------------------------------------------------------
రచన: కనకప్రసాద్, 
ఈమాట సౌజన్యంతో