Friday, September 9, 2016

ప్రపంచం లయంకాక తప్పదు


ప్రపంచం లయంకాక తప్పదు


సాహితీమిత్రులారా!

ప్రపంచం నిలవాలంటే చెట్టు- చేమ, నీరు -
నిప్పు, ఆకాశం ఇంతెందుకు
పర్యావరణం సమతౌల్యంగా  ఉండాలి.
అందుకే మనవారు అంటూంటారు
వృక్షోరక్షతి రక్షిత: అని ఇది అక్షరాలా నిజం.
ఎంతమంది ఎన్ని చెప్పినా మనమానవులు వినడం లేదు
అందుకే పిడుగు పాపిరెడ్డిగారు పిడుగులాంటి నిజం
చెప్పారు అదేమంటారా
ఇదిలాగే కొనసాగితే ప్రపంచం లయంకాక తప్పదు - అని.
కాదంటారా ఆయన ఆవేదన మనం ఒకసారి చూద్దాం.

సతత హరితం సకల ప్రాణికోటికి సంచాలన చక్రం
చరాచర జగత్తుకు ప్రకృతి ప్రసాదించిన ప్రగతి రథం
చెట్టు పుట్ట, కొండ, కోన, వాగు, వంక 
సరితా సాగరాలు, వసంత సమీరాలు
అరణ్యాలు శరణ్యాలై జీవజాలానికి ప్రాణం పోస్తున్నాయి
కోయిల కూనిరాగాలు శుకపిక శారికాది సరాగాలు
వన్యమృగాల విహారాలు, వనమయూరాల నాట్యాలు
ప్రాణాపాన వ్యానసమానాది వాయు తరంగాలు
పర్యావరణ పరిరక్షణకు ప్రకృతి ప్రసాదించిన వరాలు
కాని మనీషి మాయమై, మనిషి మరబొమ్మగా మారి
ఆకుపచ్చ విధ్వంసానికి అంకురార్పణ చేశాడు
పారిశ్రామికీకరణ పట్టణీకరణాది వశీకరణాదులతో
మనిషిలోని మానవత్వం మాయమై
దానవుడిగా మారాడు
నేల నింగి నిప్పు నీరు గాలి పంచభూతాలను వంచించి
పచ్చనోట్లు పోగుచేసి నిత్యజీవితంలో నిప్పులు పోసుకొన్నాడు
నిధినిక్షేపాలు నీళ్ళ కోసం నేలతల్లి వళ్ళు గుల్ల చేశాడు
రాకెట్లు రాడార్లు ఖండాంతర క్షిపణులతో రోదసి రోదిస్తోంది
అణువిద్యుత్కేంద్రాలతో అవని అగ్నిగుండమైంది
అరణ్యాల హననం వల్ల అతివృష్టి అనావృష్టి యేర్పడి
ప్రాణికోటి బ్రతుకు ప్రమాదంలో పడింది
సింహ శరభ శార్దూల మాతంగ వానరాది వన్యమృగాలు
క్షుదార్తితో జనారణ్యంలోకి వలసజీవులై వస్తున్నాయి
ఇప్పుడైనా కళ్ళు తెరచి పంచభూతాలను రక్షించకపోతే 
ప్రకృతికి పచ్చల పతకం తొడిగి
పర్యావరణానికి ప్రాణం పోయకపోతే
మనిషి పతనం మరెంతో దూరంలోలేదు
ప్రళయమో విలయమో వచ్చి 
ప్రపంచం లయంకాక తప్పదు. 
                                 (నేటినిజం - 25-08-2016)


ఇంటింటా చెట్టు ఊరంతా వనం -  అనే నినాదం కొన్నాళ్ళు వచ్చింది 
ఇటీవలి కాలంలో లక్షల మొక్కలను ఒకేరోజు నాటారు. 
నాటడమైతే జరిగింది వాటిని నిలుపోకోవలసినది 
ప్రజలే అన్నది తెలిసేదెప్పటికి. 
ప్రభుత్వం ఎన్నిచేసినా ప్రజల్లో 
మార్పు రాకపోతే జరిగేగి ఇదే - ప్రపంచం లయం

No comments:

Post a Comment