Friday, April 15, 2016

శ్రీరామనవమి శుభాకాంక్షలు



శ్రీరామనవమి శుభాకాంక్షలు

చాప చ్ఛాత్ర నిషంగ భంగ కుపితక్ష్మాభృద్ధను: పంచవ
క్త్రీ పంచాలికదృఙ్నియుక్త హుతభుగ్గ్రీవాద్వయీపంచక
వ్యాపాదభ్రమకారిపంక్తిగళగళ్యాఖండంనాఖండదో
ర్నైపుణ్యప్రదరౌఘ రాఘవపరబ్రహ్మన్! స్తుమస్త్వామనున్

చాప = ధనుస్సుయొక్క, ఛాత్ర = శిష్యుడగు పరశురామునియొక్క, 
నిషంగ = తూణీరమగు సముద్రముయొక్క, భంగ = భంజన పరాజయ బంధ 
రూపకాపకారములచేత, కుపిత = కృద్ధుడైన, క్ష్మాబృద్ధను: = ఈశ్వరునియొక్క, 
పంచవక్త్రీ = వదనపంచకమందలి, పంచ = అయిదయిన, అలిక = ఫాలభాగములయందలి, 
దృక్ = నేత్రములవలన, నియుక్త = నియోగింపబడిన, హుతభుక్ = అగ్నులయొక్క, 
గ్రీవాద్వయీ = కంఠద్వంద్వములయొక్క, పంచక = ఐదింటియొక్క, అనగా పదింటియొక్క, 
వ్యాపాద = ఖండనరూపవ్యాపారముయొక్క, భ్రమ = భ్రాంతిని, కారి = చేయుచున్న, పంక్తిగళ = రావణాసురునియొక్క, గళ్య = గళ(కంఠసమూహముయొక్క), ఖండన = ఛేదంచుటయందు, 
అఖండ = అప్రతిహతమగు, దో: = బాహువుయొక్క, నైపుణ్య = శరసంధానాది
కౌశలముతోకూడుకొన్న, ప్రదరౌఘ = బాణసమూహముగల, రాఘవపరబ్రహ్మన్ = 
రఘుకులసంభవుడవగు శ్రీకామచంద్రపరమేశ్వరా, త్వాం = నిన్ను,
స్తుమ: = స్తోత్రముచేయుచున్నారము.

రాముడు, తన విల్లువిఱిచియు, తన శిష్యునడైన పరశురాముని అవమానించియు, 
తన అంబులపొదియైన సముద్రమును బంధించియు, తనకు మహాపకారము 
చేసినాడన్న కోపమున ఈశ్వరుడు ప్రయోగించిన పంచఫాల నేత్రములలోని 
పంచాగ్నుల పదికంఠములో యన నొప్పు పంక్తికంఠములను శ్రీరాముడు అవలీలగా 
దురిమినాడని తాత్పర్యము.

శ్రీరాముడు శివుని విల్లును విరచిన బలశాలి అని, పరశురాముని మించిన 
పరాక్రమవంతుడని, సముద్రుని బంధించిన మహిమ కలవాడని భావం.

No comments:

Post a Comment