Monday, April 4, 2016

చమత్కార పద్యం - గణేశప్రార్థన


చమత్కార పద్యం  -  గణేశప్రార్థన


సాహితీమిత్రులారా!
                            అల్లసాని పెద్దన మనుచరిత్రలో చేసిన గణేశ ప్రార్థన పద్యం ఇది.

అంకముఁజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బా

ల్యాంక విచేష్ట దొండము నవ్వలి చన్గబళింపఁబోయి యా 

వంక కుచంబుఁగాన కహివల్లభహారముగాంచి వే మృణా

ళాంకుర శంకనంటెడి గజాస్యునిఁగొల్తు నభీష్టసిద్ధికిన్

ఇది ఆంధ్రకవితా పితామహుని సృష్టి. ఇందులో ఆంధ్రకవితకు పితామహుడు అంటే తాత కాదు పితామహుడు అంటే బ్రహ్మ అనిఅర్థం. అంటే ఆంధ్రకవితకు బ్రహ్మ అయిన వాని సృష్టి ఈ చమత్కార పద్యం. ఇంతకూ దీని భావం కవిసామ్రాట్ విశ్వనాథసత్యనారాయణగారి మాటల్లో విందాం.

అంకము, జేరి - తొడనెక్కి, తల్లితీసి తొడనెక్కించుకోలేదు. ఇతడే ఎక్కినాడు.
శైలతనయాస్తన దుగ్ధములు - తల్లి అయిన పార్వతి చనుబాలు. ఆమె కొండకూతురు. 
                                            ఆమె యందు స్తన్యసమృద్ధి ఎంత ఉండునో తెలియదు.
బాల్యాంక విచేష్టన్ - బాల్యమునకు చిహ్నమైన విశేషమైన చేష్టతో, శైశవము కాదు బాల్యం 
                             అంటే మకురుపాలు తాగుచున్నాడేమో.
తొండమున నవ్వలి చన్గబళింపఁబోయి - పిల్లలు పాలు త్రాగుతూ విడిగా ఉన్న చేతితో తల్లి రెండవ ఱొమ్మును                                                                    స్పృశించుదురు, పుణుకుదురు. ఈ చేష్టసరియే ఈ విఘ్నేశ్వరుడు తల్లి                                                                యొక్క రెండవ చన్ను తొండంతో గ్రహించబోతున్నాడు. తనకు చేయి                                                                  ఉన్నది కదా!  ఇది బాల్యాంక విచేష్టము కాదు. ఏనుగు మొగము కలిగి                                                                ఉన్నవాని లక్షణము.
అవ్వలి చన్ కబళింపఁబోయి -  కబళించుట అనగా తినుట, కబళము - ముద్ద,  
                                            చన్నును కబళింప బోవుటయేమి సరే!
ఆవంక కుచంబుఁగాన కహివల్లభహారముగాంచి - వెదకినాడు కుచము కనిపించలేదు. హారముగా ఉన్న పాము                                                                              కనిపించింది. అహివల్లభుడే హారము. దానిని చూచినాడు.                                                                                   చూచినాడనగా తెలిసికొన్నాడని అర్థం. కాంచి అనకూడదు.                                                                                 అతడు అహివల్లభ హారముగా తెలిసికొనలేదు.
                                                                        అచట అహివల్లభ  హారము ఉండటంచేత అది
                                                                        మృణాళాంకురం అనుకున్నాడు.    
మృణాళాంకురం- తామర యొక్కతూటి మొక్క.
అహివల్లభుడు అనగా వాసుకి. సర్పములకు రాజు. అతడు శివునికి ఆభరణం. అతన్ని మృణాళాంకురంగా అనుకోవడం ఎలా ఆవాసుకి శరీరం మహాదీర్ఘము, మహాస్థూలము అయి ఉండాలి. 
ఇది అర్థనారీశ్వర మూర్తి యొక్క వర్ణన. ఇతడు గజాస్యుడు ఏనుగు మొగంవాడు.
అభీష్టసిద్ధికై ఇతనిని కొలుచుటలో అతనియందభీష్టములు సమకూర్చు లక్షణములు లేవు.
అలాంటి లక్షణాలు వర్ణింపబడలేదు. వ్యుత్పత్తి చేత గజ శబ్దం అర్థం మదంకలది - అని. యదార్థం గ్రహించలేనిది. ఇది లోకం స్వభావం. ఈ లోకమే విఘ్నేశ్వరుని ముఖం. ఈ లోకం వట్టి భ్రాంతిమయం.  తెలిసికూడా వట్టి భ్రాంతి. అర్థనారీశ్వరుడు అనగా లోకము యొక్క మహాతత్వం. పుంజీభూతమై అట్టి దేవతా రూపం కట్టినాడు. పార్వతి, దుర్గ,ప్రకృతి - పంచభూతముల సమాహారం. పరమేశ్వరుడు ఈ పంచభూతముల యందు అభివ్యాప్తమైన చైతన్యం. ముఖ్యప్రాణం. విజ్ఞానమయ బ్రహ్మ మొదలైనవి కావచ్చు.  వారికి ముఖము మదముతో నిండిన కొడుకు పుట్టాడు. మదాన్ని మినహాయిస్తే వీడు పరమ చైతన్య స్వరూపం. అతనిని కూడా దేవతగా కన్పించి - మన మదం మనకు తగ్గరాదు - మన పనులు మనకు కావాలని అలాంటి విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నాము.
ఈ విధంగా సాగింది వివరణ విశ్వనాథవారి కావ్యపరీమళం (వ్యాససంపుటి) లో. 




No comments:

Post a Comment