Friday, June 10, 2016

సంభవంతుమమ జన్మ జన్మని

సంభవంతుమమ జన్మ జన్మని


సాహితీమిత్రులారా!
కోటి విద్యలు కూటికొరకే ఇది అందరికి తెలిసిన సామెతే.
కానీ ప్రతి ఒక్కరు తిండి గురించి ఏదో ఒక సందర్భంలో
వారివారి ఇష్టాలు చెప్పుకుంటూ ఉంటారు.
అలానే కావ్యాలలో కవులు తిండి గురించిన విషయం కూడా రాశారు
వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.

మొదట మహాకవి జయదేవుడు చెప్పిన
శ్లోకం చూద్దాం.

కాళిదాస కవితా నవంవయ:
మాహిషందధి సశర్కరంపయ:
ఐణ మాంస మబలాచ కోమలా
సంభవంతుమమ జన్న జన్నని

(కాళిదాస కవిత,
మంచి వయస్సు,
గేదె పెరుగు,
పంచదార వేసిన పాలు,
లేడి మాంసం,
అబల అయిన కోమలాంగి
జన్మ జన్మలకు కావాలి.)

మాంసాహార ప్రియులైనవారు శాకాహారాన్ని లెక్కచేయరు.
ప్రాచీన కవులలో ఎక్కువమంది ముఖ్యంగా తెలుగు కవులలో -
శాకాహారులు కావడం వల్ల వాటి వర్ణన ఎక్కవగా కనబడుతుంది.

ఒక కవికి వంకాయంటే చాలా ఇష్టం.
ఆ ఇష్టాన్ని ఇలా పద్యరూపంలో వ్యక్తం చేశాడు.
ఇది తెలుగువారికి చాల ప్రసిద్ధమైన పద్యం.

వంకాయ వంటి కూరయు
పంకజ ముఖి సీతవంటి భామామణియున్
శంకరుని వంటి దైవము
లంకాపతి వైరి వంటి రాజుంగలడే!

(వంకాయ వంటి కూర, సీత వంటి స్త్రీ, శివుని వంటి దేవుడు,
రాముని వంటి రాజు మరెవరూ లేరని -  అతని భావన)

తెలుగు కవులలో శ్రీనాథుని వలె భోజన పదార్థాలను
వర్ణించిన కవి ఇంకొకరు లేరు.
ఆయన కావ్యాలలోని వాటిని తరువాత చూద్దాం.
ఇపుడు శ్రీనాథునుని సంచారంలోని ఒక విషయాన్ని తెలుసుకుందాం.
ఒకమారు నడగూడెం అనే గ్రామంలో రుచికరమైన భోజనం దొరికిందని
దాన్ని గురించి చెప్పిన పద్యం ఇది.

వడి నూక లేని యన్నము
వడబోసిన నెయ్యి బుడమవరుగున్ బెరుగున్
గడిమాడ సేయబెట్టిన 
నడగూడెపు నంబి పడుచు నడిగి తిననుమా!

(నూకలేని అన్నం, మంచి నెయ్యి, బుడమ దోసకాయ వరుగు,
పెరుగు, ఒక్కడికి - మాడ (ఆకాలపు నాణెం) చేసేలా
అడిగి అడిగి తినమని పెట్టిన గేస్తురాలు నడగూడెపు
నంబి పడుచును తలచు కొన్నాడు)

No comments:

Post a Comment