Saturday, June 11, 2016

విధి చక్కగ జేసె సతీ తటాకమున్


విధి చక్కగ జేసె సతీ తటాకమున్


సాహితీమిత్రులారా!

ఒక రసజ్ఞ మిత్రుని రసరమ్యభావన -
ఏమిటంటే మన్మథుడు తన పూలబాణాలతో
కాముకుల్ని దహిస్తుంటే వారి దేహతాపాల్ని
చల్లార్చటానికి బ్రహ్మ స్త్రీ అనే సౌందర్య భరితమైన
సరోవరాన్ని సృష్టించాడు.
ఆ శ్లోకం చూద్దాం.

బాహు ద్వౌ చ మృణాళకాస్య కమలం లావణ్య లీలాజలం
శ్రోణీ తీర్థశిలా చ నేత్ర శఫరీ ధమ్మిల్ల శైవాలకమ్
కాంతాయా: స్తనచక్రవాక యుగలం కందర్పబాణానలై
ర్దగ్ధానా మవగాహనాయ విధినా రమ్యం సరోనిర్మితమ్
                                                           (శృంగారతిలకం -1)

అనువాద పద్యం
కరములు తమ్మితూడులు ముఖం బరవిందము సౌరు నీరముల్
పిరుదులు తీర్ధ హట్టములు వేణియె నాచు కనుల్ ఝషంబులున్
తరుణి యురోజ యుగ్మము రథాంగ యుగంబయి పూరుషాళికిన్ 
స్మరశరతామార్ప విధి చక్కగ జేసె సతీ తటాకమున్

(యువతుల బాహువులే తామర తూళ్ళు,
లక్ష్మీ కళ ఉట్టిపడే ఆమె ముఖమే కమల సంపద.
ఆమె యౌవన కాంతులు లీలా విలాసాలె అందులోని శీతల జలాలు,
అందమైన ఆమె కటి ప్రదేశమే స్నానఘట్టం,
చంచలమైన కనులే బేడిస చేపలు,
ముచ్చటగొలిపే ఆమె వాలు జడే శైవాలము(నాచు),
వటృవలైన స్తనాలే ప్రేమకు ప్రతిరూపాలై విహరించే చక్రవాకాలు,
మన్మథబాణాలతో పరితపించే వ్యక్తులు సుస్నాతులై తాపం
తీర్చుకోవటానికి ఇలా స్త్రీనే అందమైన సరస్సును బ్రహ్మ సృష్టించాడు.)

No comments:

Post a Comment