Tuesday, June 14, 2016

కాఖాగాఘాకిఙ కాటన్నాయాటాఙ


కాఖాగాఘాకిఙ కాటన్నాయాటాఙ


సాహితీమిత్రులారా!

1925 ప్రాంతంలో బెజవాడలో పిసుపాటి చిదంబరశాస్త్రిగారు
శతావధానం చేస్తుండగా ఒక పృచ్ఛకుడు
ఎవరికీ దిక్కుతోచని సమస్యను ఇచ్చాడు.
దీనితో సదస్యులు దిగ్భ్రాంతి చెందారు.
సమస్య ఇది-
కాఖాగాఘాకిఙ కాటన్నాయాటాఙ

చిదంబరశాస్త్రిగారు చిరునవ్వుతో
వ్రాసుకోండి అన్నారు.
అర్థరహితమైన ఈ సమస్యను ఎలా పూరిస్తారా? అని అందరూ
ఆశ్చర్యంతో చూస్తున్నారు.
శాస్త్రిగారు ఇలా పూరించారు.

చాఛాజాఝాచి ఙ చంచన్నాయా ఛీఙ
తాథాదాధాతిఙ తాతన్నాయా థూఙ
పాఫాబాభాపిఙ పాపన్నాయా పీఙ

ఇది వినేసరికి  పృచ్ఛకుడు బిత్తరపోయాడు.
కాస్తలో తేరుకొని "పూరణకేమైనా అర్థముందా?" అని ప్రశ్నించాడు.
"మీ సమస్యకు అర్థం ఉంటే మా పూరణకు అర్థం ఉంటుంది"- అన్నారు శాస్త్రిగారు.

అప్పుడు సమస్యార్థాన్ని పృచ్ఛకుడు ఇలా వివరించాడు.
              కాటన్నాయడనే ఒక ధనికుడు ఉండేవాడు. అతనికి చదువు అబ్బలేదు.
కానీ తాను గొప్పవాడినని పొగిడించుకోవాలని తపన. అలా పొగిడించుకొని
వారికి తృణమో పణమో ఇచ్చేవాడు. మిగతా వారికి పైసా కూడా విదిల్చేవాడు కాదు.
ఈ రహస్యం తెలుసుకొన్న ఒక చతుర పండితుడు అతని దగ్గరికి వెళ్ళి తాళం వేస్తూ
ఈ సమస్యను గానం చేసి గొప్ప సత్కారం పొందాడు.

అప్పుడు శాస్త్రిగారు "ఈ విశాల విశ్వంలో మీ కాటన్నాయని వంటివారు
చంచన్నాయుడు, తాతన్నాయుడు, పాపన్నాయుడు అనే లుబ్దాగ్రేసర
చక్రవర్తులు ఉన్నారు. మీ పండితుని కన్నా మా పండితులు అధిక
విద్యాప్రౌఢులు కనుకనే అన్యాపదేశంగా ఛీ, థూ - అని వారి మూర్ఖతను
నిందిస్తూనే పొగిడినట్టుల భాసింప చేసి గౌరవం పొందారు." అని వివరించేసరికి
సభ్యులంతా కరతాళ ధ్వనులతో పిసుపాటివారిని అభినందిచారు.

పృచ్ఛకుడు కూడా  తనదారంటే వచ్చిన శాస్త్రిగారి చాతుర్యానికి కాదనలేక
హృదయపూర్వకంగా సంతృప్తిని, సంతోషాన్నీ వ్యక్తపరిచాడట.







No comments:

Post a Comment