Tuesday, June 7, 2016

చిత్రము శైలములో యురోజముల్


చిత్రము శైలములో యురోజముల్


సాహితీమిత్రులారా !

ప్రణయ కోపంతో  ప్రియురాలు మూతిముడుచు కుంది.
చందమామలాంటి ముఖం కందగడ్డ చేసుకుంది.
దానితో ఆమెకు ప్రీతి కలిగించడానికి ప్రియుడు
ఆమె ప్రత్యంగ సౌందర్యన్ని పదేపదే ప్రశంసిస్తున్నాడు.
పొగడ్తలకు పరవశించని వారు ఉండరుకదా!
ఈ శ్లోకం(శృంగారతిలకంలోనిది)
పద్యం(శ్లోకానికి అనువాదం)
చూడండి.


ఇందీవరేణ నయనం ముఖమంబుజేన
కుందేన దంత మధరం నవపల్లవేన 
అంగాని చంపకదలై: స విధాయ వేధా:
కాంతే కథం ఘటితవా నుపలేన చేత:?

(కలువలతోడ కన్నులు ముఖంబును తామరపూవుతోడ మ
 ల్లెల రదవారమున్ పెదవి లేజిగురాకుల చంపకంబులన్ 
 బలు సొబగైన యంగముల బ్రహ్మ సృజించి త్వదీయ చిత్తమున్ 
 శిలగ సృజించెనో యతివ! చిత్రము శైలములో యురోజముల్! )

ఓ కాంతా! ఆ సృష్టికర్త అందమైన కలువలతో నీ కళ్ళను కాంతివంతంగా సృజించాడు.
చల్లని పరిమళాలను వెదజల్లే పద్మాలతో నీ ముఖాన్ని మనోహరంగా మలిచాడు.
తెల్లని మల్లెమొగ్గలతో నీ పలువరుసను తీర్చాడు.
ఎర్రటి నవపల్లవాలతో నీ పెదవులను అతిసుందరంగా తయారు చేశాడు.
సుకుమారమైన చంపకదళాలతో నీ ఇతర అవయవాలను అతి లావణ్యంగా శిల్పీకరించాడు.
ఇలా సుకుమార కుసుమ పేశలమైన వస్తు సంపదతో నీ దేహనిర్మితి చేసిన ఆ విధాత,
నీ చిత్తాన్ని మాత్రం కఠిన శిలతో చేశాడెందుకో?
ఆ రహస్య మేమిటో మరి.

(ఆమె కఠిన స్తనాల ప్రభావంతో మనసు రాయిగా మారిందని భావం)

No comments:

Post a Comment