Saturday, October 1, 2016

శివుని పగిది నొప్పె.........


శివుని పగిది నొప్పె.........


సాహితీమిత్రులారా!

పోతన భాగవతంలో దశమస్కందము 297వ పద్యంలో
శ్రీకృష్ణుని శివునిగా వర్ణించిన పద్యం చూడండి-
హరి హరులు వేరుకాదు అనడానికా అన్నట్లు
పోతనకు బాలకృష్ణుడు శివునిగా కనిపించిన
ఈ చమత్కారపద్యం చూడండి.

తనువున నంటిన ధరణీపరాగంబు 
                       పూసిన నెఱిభూతి పూఁత గాఁగ
ముందర వెలుఁగొందు ముక్తాలలామంబు 
                       తొగలసంగడికాని తునుక గాఁగ
ఫాలభాగంబుపైఁ బరఁగు కావిరిబొట్టు 
                       కాముని గెల్చినకన్నుగాఁగఁ
గంఠమాలికలోని ఘననీల రత్నంబు 
                       కమనీయ మగు మెడకప్పుగాఁగ
హారవల్లు లురగహారవల్లులుగాఁగ
బాలలీలఁబ్రౌఢబాలకుండు
శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును,
వేఱులేమిఁదెల్ప వెలయునట్లు
                        (ఆంధ్రమహాభాగవతము - 10-297)

ఆటపాటల సమయంలో బాలకృష్ణుడు
పరమశివునిలా కనిపించేవాడు.
వాని దేహానికి అంటిన దుమ్ము విభూతి పూతవలె కనిపించేది.
ఉంగరాలజుట్టును పైకి ముడిచి ముత్యాలపేరుతో ముడివేసింది యశోద.
అది శివునితలపై ఉండే చంద్రవంకలాగా కనబడుతున్నది.
నుదుట నిలువుగా పెట్టిన ఎర్రని తిలకం మన్మథుని గెలిచిన
శివుని ఫాలనేత్రంలాగా కనబడుతోంది.
మెడలోవేసిన రత్నాలహారం మధ్యలో నాయకమణిగా
ఉన్న పెద్దనీలమణి, శివుని కంఠంలోని హాలాహలపు
నల్లని మచ్చలాగా కనబడుతోంది.
మెడలోని ముత్యాలహారాలు శివుని మెడలోని
సర్పహారాలుగా కనబడుతున్నాయి.
ఎదకకుండానే పెద్దవాడైన విష్ణువు బాలకృష్ణుని అవతారంలో
ఈ విధంగాలీలలు చూపాడు.
శివుడూ తానూ ఒకటేసుమా అని హెచ్చరిస్తున్నాడా! అన్నట్లు
చిన్నికృష్ణుడు శివునివలె కనిపించాడు - అని భావం

No comments:

Post a Comment