Sunday, August 7, 2016

ఖండిత మాడినన్ మిగుల దండమె వచ్చను


ఖండిత మాడినన్ మిగుల దండమె వచ్చను


సాహితీమిత్రులారా!

ఎవరితో ఎలా మాట్లాడాలో ఈ పద్యంలో కవి వివరించాడు చూడండి.

వండెడివాని, సత్కవిని, వైద్యుని, మంత్రిని, మంత్రవాదినిన్
కొండెము చెప్పువాని, రిపుగూడినవాని, ధనేశునిన్, ధరా
మండలమేలువాని, తన మర్మమెరింగినవానితో, వెసన్
ఖండిత మాడినన్ మిగులదండమెవచ్చు నెంతవానికిన్

ఒక్కొక్కప్పుడు కొందరితో కచ్చితంగా మాట్లాడితే
అది దండుగగాను ఉండవచ్చు, శిక్షనుకూడ కలిగించవచ్చు.
నిజం మాట్లాడితే నిష్ఠూరం అనే లోకోక్తి ఉండనే ఉందికదా!
కాబట్టి వీరితో మాట్లాడే సందర్భంలో కొంచెం జాగ్రత్తగా
మాట్లాడితే మంచిదని కవి చెబుతున్నాడు.
వంటవాడు, మంచి కవి, వైద్యుడు, మంత్రి,
మంత్రాలుచ్ఛరించేవాడు, చాడీలు చెప్పేవాడు,
తన శత్రువులతో చేయికలిపినవాడు, మిక్కిలి ధనం కలవాడు,
భూమండలాన్ని పాలించేరాజు, తన రహస్యం తెలిసినవాడు,
మొదలైనవారితో తొందరపడి నిజం కూడా తెగవేసినట్లు
మాట్లాడకూడదు. తానెంతటి వాడైనా
వాళ్ళకు తప్పకుండా చేటు వస్తుంది - అని భావం.

No comments:

Post a Comment