Tuesday, August 23, 2016

భానుబింబంబు గన్నుల పండువయ్యె


భానుబింబంబు గన్నుల పండువయ్యె


సాహితీమిత్రులారా!


సూర్యోదయాన్ని ఒక్కొక్క కవి ఒక్కోరకంగా వర్ణించాడు.
ఇక్కడ మనం నాచనసోముని
ఉత్తరహరివంశములోని సూర్యోదయాన్ని చూద్దాము.

కుంకుమ హత్తించి కొనగోరఁ దీర్చిన
       పుహూతునిల్లాలి బొట్టనంగఁ
జక్రవాకములకుఁ జల్లఁగా మందు ద్రా
      గించిన చెంద్రంపు గిన్నెయనఁగఁ
బార్వతీ బతికిఁ బ్రభాత భూపతి గొన్న
      యలరు గెందమ్మి కోహళి యనఁగఁ
తొలిదిక్కు తొయ్యలి చెలులపైఁ జల్లంగ 
       నిండ ముంచిన పైడికుండ యనఁగ
మేరు ధరణీధరంబుతో మేలమాడ
నుదయగిరిరాజు దల యెత్తెనో యనంగ
గ్రమముతో నించుకించుక గాన నగుచు
భానుబింబంబు గన్నుల బండువయ్యె
                                        (ఉత్తరహరివంశము 3-86)

నొసటియందు కుంకమను అత్తి అలంకరించి కొనగోటితో
దానిని గుండ్రంగా ఉండునట్లు సవరించిన ఇంద్రుని ఇల్లాలైన
శచీదేవి యొక్క ఎఱ్ఱని సింధూరతిలకము వలెను.

ఎడబాటు చెంది తపించుచున్న చక్రవాకపు జంటకు
చల్లదనము పొందుటకు అవసరమైన పానీయమును
త్రాపింప జేసిన ఎర్రని పాత్రవలెను.

శివునకు ప్రభాతకాలమనెడు రాజు పూజకై గ్రహించిన
వికసించిన ఎర్రదామర మొగ్గవలెను.

తూర్పుదిక్కాంత తన చెలికత్తెపై
జలక్రీలలో పాల్గొనంటూ,
వారిపై చల్లుటకు నీరు ముంచిపెట్టిన
బంగారు కుండ కుండవలెను.

మేరుపర్వతరాజుతో సల్లాపము చేసి
పరిహసించుటకు తన ఎత్తును పెంచుటకై
ఉదయగిరులరాజు తల పైకెత్తినట్లును,

ఆకాశముపైకి క్రమక్రమముగా వచ్చుచు,
సూర్యబింబము,
కన్నులకు మహానందము కూర్చెను - అని భావం.

No comments:

Post a Comment