Wednesday, August 3, 2016

ప్రభాతలక్ష్మి కబరిభారంబు మీఁది చెంగలువ కచ్చు


ప్రభాతలక్ష్మి కరిభారంబు మీఁది చెంగలువ కచ్చు


సాహితీమిత్రులారా!

కాశీఖండంలో శ్రీనాథుని
సూర్యోదయ వర్ణన చూడండి.

ధరణీధరములందు ధాతు పాషాణంబు
       పాదపంబులయందుఁబల్లవంబు
పాథోనిధులయందుఁబవడంబు లేఁదీగ
       కాలాభ్రములయందుఁగోల మెఱపు
హరిదంత నాగంబులందు సింధూరంబు
        భూమి యొడలి యందు హేమభూష
యాకాశవీథియం దవతంసరత్నంబు
       నబ్జజాండగృహంబునందు దివియ
యగుచు బాలాతపము జగం బాక్రమింప
నంధకారము దిక్కుల నస్తమింప
భానుబింబము వొడిచెఁ బ్రభాతలక్ష్మి
కబరిభారంబు మీఁది చెంగలువ కచ్చు
                                          (కాశీఖండము 3-239)


వేకువ అనే లక్ష్మి (ప్రభాతలక్ష్మి) సిగలో ఉండే
ఎర్రకలువల పూబంతి(కచ్చు)
అన్నట్లుగా సూర్యబింబం ఉదయించింది.
సూర్యబింబం ఉపమేయం.
ఇది ఏ ఏ స్థలాలలో ఎలా ఉందో శ్రీనాథుడు
ఉపమాన ఉపమేయాలకు భేదంలేకుండా
అంటే రూపకాలంకారంలో చెప్పాడు.
సూర్యబింబం -
1. పర్వతాలమీద(ధరణీధరం) ఉండే జేగురురాయి(ధాతుపాషాణం)
2. చెట్ల మీద (పాదపం) ఉన్న చిగురుటాకు.
3. సముద్రాలలో (పాథోనిధి) దొరికే పగడపు తీగ.
4. నల్లని మేఘాలలో (కాల - అభ్రము) సన్నని (కోల) మెరుపు.
5. దిగంతాలలో ఉండే ఏనుగులకు (హరిదంత నాగ)
     కుంభస్థలంమీద ఉండే సింధూరం.
6. భూదేవి శరీరం పైన మెరిసే బంగారు నగ(భూష)
7. ఆకాశవీథిలో శిరోరత్నం (కిరీటంలోని రత్నమని).
8. బ్రహ్మాండమనే (అబ్జజ - అండ - గృహంబు) మందిరంలోని దివ్వె.

ఉపమానాలన్నీ ఎర్రనివే. ఉదయించే సూర్యబింబం వీటిలా ఎర్రగా ఉందని.
లేత ఎండ జగత్తును ఆక్రమిస్తూ ఉండగా
సూర్యబింబం ఉదయించింది(పొడిచెన్) -
ప్రభాతలక్ష్మి కొప్పులో (కబరిభారంబు మీఁది) ఎర్రకలువ పూబంతిలా. 

No comments:

Post a Comment