Monday, August 29, 2016

తన్నీరుగారి కన్నీరు తుడువగలమా?


తన్నీరుగారి కన్నీరు తుడువగలమా?


సాహితీమిత్రులారా!

పద్యం మీది ఆకాంక్షతో తెలుగుతల్లి ఆవేదనను
తన్నీరు బాలాజిగారి కలంకంటినుంచి స్రవించిన
వేదనాశ్రువులను చూద్దాం
అవి తుడువగలమో లేదో
తరువాత ఆలోచిద్దాం.

ఆంధ్రదేశంబున అద్దంకిసీమలో
       పండరంగ జనిత పసిడిబాల
నన్నయ కాలాన నడకలు నేర్వగ
        కవిబ్రహ్మ పలుకుల కమ్మనిసుధ
శ్రీనాథు నీడలో సిరిమువ్వ హొయలతో
       నాట్యమాడినయట్టి నవ్యతార
పోతనకలమున పొందుగఁ జారిన
         మందారమకరంద మరుల జాణ
ముక్కుతిమ్మనార్యు ముద్దు ముచ్చట్లతో
పెద్దనాది కవుల పేర్మితోడ 
పరిఢవిల్లె తెలుగు ప్రాబంధనాయిక
కృష్ణరాయఁజేరి కృపనుఁబొంద

ముత్యపు సరులతో మోదముఁబొందగ
        గురజాడవారిచే గూర్చఁబడియె
నండూరి ఎంకితో నాయుడుబావకు
       పాటలు నేర్పించి పరవశించె
శ్రీశ్రీ యొసగినట్టి చెంగావి వన్నెల
         సింగారపు ఝరీల చీరగట్టె
భావాభ్యుదయ మేలి పరిఫుల్లరూపమై
        విశ్వంభరాలలో వినుతికెక్కె
అన్యభాష పదాలకు స్తన్యమిచ్చి
నవల, నాటక చరితల నడతఁ బెంచి
తనరె పరిపూర్ణ రాశియై తనదు యింట
నేడు తెలుగమ్మకు నిలువ నీడలేదు

అలాంటి తెలుగుమ్మ ఇలా అంటూంది.

తల్లిపాలు త్రాగి తల్లిని మరచిన 
తల్లి రొమ్ము గ్రుద్దు తనయులార
మాతృక్షీర మధురిమలను మరచినారు
దాది ప్రేమ మాటు దాగినారు

ముదుసలియగు మీయమ్మను 
ముదుసలిశాలకు తరుమగ మురుతురు కొడుకా
ముదుసలియగు ఈ యమ్మను 
ముదసలిశాలకు తరుమగ మోదములేదే

ఆ తల్లి తెలుగు బిడ్డలను 
ఇలా ప్రాధేయపడుతూంది.

చేరదీయుము నన్ను మీసేవఁజేతు
ఆదరింపుము నన్ను మిమ్మాదరింతు
అమ్మప్రేమ, అమ్మనుడియు యమృతముగను
మాతృభాషను, మాతను మరువకెపుడు 

No comments:

Post a Comment