Saturday, July 23, 2016

తెల్పగరాదె! నిజంబు నీశ్వరా?


తెల్పగరాదె! నిజంబు నీశ్వరా?


సాహితీమిత్రులారా!

వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెలుపుడీ - అని
స్వాతంత్ర్యసమరంలో గంధం పట్టుక తిరిగిన
మన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారి
సూతపురాణంలోని పద్యం చూడండి.

ఒకరుడు "వేదమే భగవదుక్త" మటంచు నుపన్యసించు, నిం
కొకరుడు "బైబిలే భగవదుక్త" మటంచును వక్కణించు, వే
రొక్కురుడుమా "ఖొరాన్ భగవదుక్త" మటంచును వాదులాడు, నీ
తికమక లేల బెట్టెదవు? తెల్పగరాదె! నిజంబు నీశ్వరా!
                                                                (సూతపురాణము -3-1)

ఈశ్వరా! ఒక ఛాందసుడు వేదాలనే భగవంతుడు అన్ని ధర్మాలను
భవ్యంగా వివరించాడు కావున వాటినే సదా సేవించాలంటాడు.
మరొకడు బైబిలు గ్రంథమే భవ్యమైనది అదే భగవత్ కైంకర్యంగా
కర్తవ్యమని కంకణం కట్టుకొని బోధిస్తాడు.
వేరొకడు అవేవీకావు మా ఖురాన్ గ్రంథమే ఖుద్దున(స్వయంగా)
ఖుల్లను(వివరంగా), ఖుషీగా ఖుల్లమము(రాచబాట)ను చూపిస్తుందంటాడు,
ఇలా ఇంతమంది ఇన్ని విధాల మా చెవులు గింగిరులెత్తించి, గిజగిజలాడించి,
గింజుకొనేట్లు చేస్తుంటే, హే భగవాన్! దేవా! అల్లాహో అక్బర్! ఎంగుకిలా ?
మమ్ములను తికమక పెట్టి చంపుకుతింటావు.
ఓ కరుణామయా! కనికరించి, అసలు నిజమేదో నిగ్గుతేల్చి చెప్పి,
మా సందేహాలను పటాపంచలు చేయరాదా? -
అని కరుణాక్రందన చేస్తున్నాడు కవిగారు.

1 comment:

  1. చిన్న తరగతుల్లో ఉన్నప్పుడు చిన్నచిన్నవి కూడికలూ తీసివేతలలే కష్టంగా ఉంటాయి. ఇంక భాగహారాలూ వర్గమూలాల గురించిన బాధలు చెప్పనలవి కాదు. మరి మనకు అప్పుడు అలా అనిపించటం గణితశాస్త్ర్రం తప్పు కాదు కదా.

    ఎదిగినకొద్దీ మనకే మనోవికాసమూ బుధ్ధికుశలతా పెరిగి అప్పటితిప్పలు తలచుకొని నవ్వుకుంటాం కదా?

    అలాగే మన ఙ్ఞానం వికసించినకొలదీ‌ భగవత్తత్త్వం మనకు అవగాహన అవుతూ వస్తూ ఉంటుంది.

    అంతేకాని భగవంతుడు తికమకలు పెడుతున్నాడని అనుకోకూడదు. కాని మనం ఆ దివ్యతత్త్వం ముందు ఎప్పటికీ‌ చిన్నపిల్లలమే! కాబట్టి అదే మనస్తత్త్వంతో 'ఏం తికమక పెట్టేస్తున్నావయ్యా' అని తరచుగా అనుకోకుండా ఉండలేం.

    ఏకం సత్ విప్రాః బహుథా వదంతి అన్నట్లుగా ఆ తత్త్వం అర్థం చేసుకొనే ప్రయత్నంలో మన అభూతులూ వాటి వ్యక్తీకరణలూ రకరకాలుగా ఉంటాయి. అది సహజం. కాని మూలతత్త్వం అదే కదా. ఐనా చిన్నపిల్లలం‌ కదా, తెలిసీ తెలియక మా పధ్దతే సరైనదని కొట్టుకు చస్తూ ఉంటాం అంతే. అంతకన్నా మరేమీ‌లేదు.

    ReplyDelete