Saturday, July 9, 2016

వెక్కించి మెడసాచి నిక్కి మిన్సూచి


వెక్కించి మెడసాచి నిక్కి మిన్సూచి


సాహితీమిత్రులారా!

వేకువజామున అంటే తొలిజామున మొట్టమొదట
కూసే కోడిని తొలికోడి అంటారు. పండితారాథ్య చరిత్రలో
పాల్కురికి సోమనాథుని వర్ణన చూడండి.
ఇది ద్విపద.
ఎంత అద్భుతంగా కళ్ళకు
కట్టినట్టు వర్ణించాడో తెలుస్తుంది.

తొలుకోడి కనువిచ్చి నిలిచి మైవెంచి
జలజల ఱెక్కలు సడలించి నీల్గి

గ్రక్కున కాలార్చి కంఠంబు విచ్చి
ముక్కున నీకెలు జక్కొల్పి కడుపు

వెక్కించి మెడసాచి నిక్కి మిన్సూచి
కుక్కురో కుఱ్ఱని కూయకమున్న

ప్రబ్బతనాథ ప్రబ్బతనాథ యనుచు
నుబ్బి నీర్కోళ్ళుకూయుడుగక మున్నె
                                                  (పండితారాధ్యచరిత్ర)

తొలికోడి కన్ను తెరిచింది.
ఒకచోట నిలబడి తన శరీరాన్ని పెంచింది.
ఱెక్కలు టపటపలాడించి ఒళ్ళు విరుచుకొని
గబుక్కున కాలాడించి కదిలింది.
ముక్కుతో ఈకలన్నీ ఒకసారి సవరించుకుని(జక్కొల్పి),
కడుపును - లోనికి బిగబట్టి(వెక్కించి),
గొంతు విప్పి, మెడను సాగదీసి,
నిటారుగా నీల్గి, ఆకాశం వైపు చూసి,
కొక్కురోకో యని కూసింది.
ఇలా తొలికోడి ఇంకా కూయకముందే
ప్రబ్బతనాథ ప్రబ్బతనాథ అనే శబ్దం వచ్చేలా  ...
పొంగి(ఉబ్బి) కూస్తున్న నీర్కోళ్ళ కూతలు
ఇంకా పూర్తికాకముందే(కూ - ఉడుగక మున్నె) ..
అని తరవాతి పాదంలోనికి అన్వయము.
(భక్తులు గమ్యస్థానాలకు చేరుకున్నారని.)

పాల్కురికి సోమనాథుడు ఎంత సహజంగా
ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాడు
అందుకే ఇది స్వభావోక్తి - అలంకారంగా చెప్పవచ్చు.
దీనికే ప్రతాపరుద్రయశోభూషణంలో జాతి అని అన్నారు.

No comments:

Post a Comment