Sunday, March 5, 2017

ఆ యిద్దరే ఈజబ్బును పోగొట్టగలరు


ఆ యిద్దరే ఈజబ్బును పోగొట్టగలరు




సాహితీమిత్రులారా!



మనిషికి గర్వాన్ని గలిగించేవి మూడు
అవి ధనం, అధికారం, విద్య
వీటిలో ధనం వల్లవచ్చిన గర్వాన్ని గురించి
కొక్కొండ వేంకటరత్నంగారు
బిలేశ్వరీయంలో
ఈ విధంగా చెప్పారు చూడండి-

కన్నులఁ జూపు గల్గిననుఁ గాంచఁగ నీ దెదురైన, వీనులన్
బన్నుగ విన్కి గల్గిన ననన్ విన నీ, దిఁక నోరు పల్కఁగా
నున్ననుఁ బల్కనీదు, మఱి యున్నను జేతులు మ్రొక్క నీదు,  సం
పన్నుని గర్వ, మత్తెవులుఁ బాపెడి లేవడియేన్ విరక్తుఁడేన్
                                                                                                       (బిలేశ్వరీయము - 3- 15)

ఏ విధంగా ధనం సంపాదించినా వానికి
అది చెప్పగరాని గర్వం కలిగిస్తుంది.
అదే అతనికి పెద్దజబ్బు ఆ జబ్బు కొన్ని లక్షణాలను
కలిగి ఉంటుంది అని వాటిని పేర్కొంటూ ఈ పద్యం చెప్పాడు కవి.


సంపన్నుని గర్వం-
కంటికి చూపు బాగానే ఉన్నా,
ఎవరైనా పెద్దలు ఎదురిగా వచ్చినా
వారిని కన్నెత్తి చూడనివ్వదు.
అలాగే చెవులు ఏలోపం లేకపోయినా
వినికిడి శక్తి ఉన్నా మనం చెప్పింది విననివ్వదు.
ఇక నోరు స్పష్టంగా మాట్లాడటానికి శక్తి ఉన్నా
ఎదుటివారితో ప్రియంగా  మాట్లాడనివ్వదు.
అలాగే చేతులున్నా కూడ పెద్దలకు మ్రొక్కనివ్వదు
డబ్బు వలన వచ్చిన జబ్బును దారిద్ర్యంగాని
లేదా వైరాగ్య జ్ఞానసంపన్నుడైన యోగిపుంగవుడైనా గాని
ఆ యిద్దరే పోగొట్టగలరు ఆ జబ్బును - అని భావం.

No comments:

Post a Comment