Monday, March 13, 2017

ఉపమాలంకార విశేషాలు


ఉపమాలంకార విశేషాలు




సాహితీమిత్రులారా!





సాహితీజగత్తులో ఉపమాలంకారానికి చాల ప్రత్యేకత ఉంది.
అప్పయ్యదీక్షితుల మాటల్లో చూడండి-

ఉపమైకా శైలూషీ సంప్రాప్తా చిత్రభూమికా భేదాన్
రంజయతి కార్యరంగే నృత్యంతీ తద్వించేతః

ఉపమ ఒక నటి. అదియే చిత్రవిచిత్రములైన వేషములు ధరించి కావ్యరంగమున లాస్యమాడుచు కావ్యవేత్త మనస్సులను రంజింపచేయుచున్నది అని భావం.

అసలు ఉపమాలంకారమంటే---------

ఒక వస్తువును మరొకవస్తువుతో పోల్చి చెప్పడం
ఉదాహరణ-
సీతముఖము చంద్రబింబము వలె అందముగా ఉన్నది
ఇందులో నాలుగు భాగాలున్నాయి

1. ఉపమేయము -
   వర్ణించబడే వస్తువు - సీతముఖము
   దీనికే ప్రస్తుతము, ప్రకృతముఅయినది అని కూడ అంటారు.

2. ఉపమానము-
   దేనితో పోలుస్తున్నామో దానికి ఉపమానమని పేరు
   - చంద్రబింబము
   దీనికి అవర్ణ్యము, అప్రస్తుతము, అప్రకృతమైనవస్తువు
   అని కూడ అంటారు

3. సమానధర్మము-
   ఉపమేయమునందు ఉపమానమునందు ఉన్న పోలిక
  - అందముగా ఉండటం

4. ఉపమావాచకము-
   సమానధర్మమును సూచించు శబ్దము, లేక పదము
   - వలె

ఉపమాలంకారాన్ని అనేకులు అనేకరకాలుగా వివరించారు
దండి సమానధర్మాన్ని బట్టి 32 విధములని వివరించాడు
వాటిని సోదాహరణలుగా తెలుసుకుందాము-

1. ధర్మోపమ -
   ఓ ముద్దరాల నీ అరచేయి పద్మమువలె నెఱ్ఱగా ఉన్నది

2. వస్తూపమ -
   నీముఖము పద్మమువలె ఉన్నది
   (దీనలో సమానధర్మము ప్రతీపమానము)

3. విపర్యాసోపమ -
   నీముఖమువలె అరవిందము వికసించియున్నది
   (కొందరలంకారికులు ప్రతీపాలంకారమన్నారు)

4. అన్యోన్యోపమ -
   నీ ముఖము పద్మమువలెను, పద్మము నీ ముఖమువలెను ఉన్నది
   (దీన్ని ఉపమేయోపమ అని కొందరలంకారికుల వ్యపదేశము)

5. నియమోపమ -
   నీ ముఖము కమలమునే పోలి ఉన్నది. మరి దేనిని పోలదు.

6. అనియమోపమ -
   నీ ముఖము పద్మమును అనుకరించుచున్నది. 
    దానిని అనుకరించి మరి వేరు వస్తువులుండుగాక

7. సముచ్ఛయోపమ -
   కాంతిచేతనేగాక ఆహ్లాదకరత్వమున గూడ 
   నీముఖము చంద్రుని బోలును

8. అతిశయోపమ -
   నీముఖమును నీ యెడనే చూచినాను.
   చంద్రుని ఆకసమందే చూచినాను.

9. ఉత్ప్రేక్షతోపమ-
   ఆమె ముఖశ్రీ నా యందే యున్నదని చంద్రుడు 
   గర్వపడక్కరలేదు. పద్మమునందుకూడ నది కలదు.

10. అద్భుతోపమ -
    పద్మము విభ్రాంతనయమైన యెడల నీ ముఖశ్రీని బొందవచ్చును.

11. మోహోపమ -
    కృశాంగి చంద్రుని చూచి నీ ముఖమనుకొని దానివైపు పోయినాను.

12. సంశయోపమ -
    ఇది లోపల తిరుగుచున్న భ్రమరములు గల పద్మమా
    లోలేక్షణములు గల నీ ముఖమా - అని నా మనస్సు డోలాయమానమైనది

No comments:

Post a Comment