Friday, November 16, 2018

కొత్తకవులుకొన్ని సంగతులు


కొత్తకవులుకొన్ని సంగతులు




సాహితీమిత్రులారా!

కవిత రాయడం తోటి కవి బాధ్యత తీరిపోదు.. రాసిన ప్రతి ఒక్కటి కవిత ఐపోదు. ఇదో జీవసంకటం!రాసిన కవితకు ఎలాంటి మార్పుచేర్పులు అవసరం? కవిత ఎప్పుడూ అసంపూర్ణమే, అపరిపూర్ణమే అనే అతివాదులతో పనిలేదు..అలాగే ఆశువుగా వెలువడిన ప్రతి శబ్దం కవిత్వమే అన్నది కూడా అతివాదమే.మధ్యే మార్గం తొక్కాలి బ్రతికి బట్టకట్టాలంటే !

ప్రేమ విషయాల్లో సలహా ప్రమాదకరం..కవిత్వం దీనికి భిన్నం కాదు.నీలో కవిత్వం తలెత్తిన సందర్భం గురించి నీకే ఎక్కువ తెలిసివుంటుంది..కాబట్టి మార్పుచేర్పుల్లో తుదినిర్ణయం మటుకు నీదే.ఇతరుల సలహాల కోసం ,మెప్పు కోసం ఎదురుచూడటం..సరైన పద్ధతి కాదు.ఏదో సామెత చెప్పినట్టు ఒకరు పెట్టిన గోచీ ఎంతసేపు నిలుస్తుంది?? నీ వల్ల కొద్ది నీవు కట్టుకోవడం సముచితం. అలాగని అనుభవజ్ఞుల అభిప్రాయాన్ని పెడచెవిన పెట్టడం అవివేకం..

” సత్కవులు సరైన పదం కోసం పడిగాపులు పడతారు ” అంటాడు ఇండో ఆంగ్లియన్‌ కవి నిస్సిమ్‌ ఎజెకిల్‌. అది నిజం కూడా.కవిత్వరచనలో భిన్నకవులవి భిన్న మార్గాలు .బ్రాడ్స్కీ ఒకపట్టాన కవిత్వాన్ని అచ్చుకిచ్చేవాడు కాడు..(కృష్ణశాస్త్రి,అజంతాల్లా)ఏళ్ళూ,పూళ్ళూ అలా గడుస్తూ ఉండవలసిందే..ఆంగ్లకవి ఆడెన్‌ తన చిన్న నాటి కవితలను కూడా తిరగరాస్తూ ఉండేవాడు..అదంత మంచి అలవాటు కాదని వేరే చెప్పనవసరం లేదు.కాలం గడిచే కొద్దీ భాష పట్ల అవగాహన పెరిగే కొద్దీ తన అంతగా బావోలేని పూర్వకవితల మీద ఏవగింపు కలగడటం సహజమే..కానీ ఆనాటి అవగాహనకు మైలురాయిలా వెనుకటి కవితల మీద చేయి వేయకపోవడమే సబబు.డైలాన్‌ థామస్‌ “అలా పాతవే పట్టుకొని కూచుంటే ఇక కొత్తవెల్లా రాయను” అని ప్రశ్నించేవాడు.స్పానిష్‌ కవి హిమనెస్‌ తనకవితల పరిపూర్ణత విషయంలో ఒక తరహా ఉన్మాదాన్ని ప్రదర్శించేవాడు.ఎక్కడెక్కడి పూర్వకవితలను తెచ్చి గుట్టలుగా పోసి తగుల బెట్టి ఇల్లు పీకి పందిరేసినంత పని చేసి.. ప్రాణాంతకమైన obsession తో తనబాధను సర్వుల బాధ గా మార్చే వాడు..పలువురి అనుభవాల వల్ల తెలిసి వచ్చేది ఏమిటంటే కవిత్వం అన్నిసార్లు సద్యోభవం కాదు..భవ్యకవితావేశం కొరవడిన అనేక పర్యాయాలు కవి కలుగచేసుకొని ముడివజ్రాన్ని సాన పెట్టవలసి వుంటుంది..

కవితావేశం

అంతలావు ” కవిత ఓ కవితా ” పద్యాన్ని పెన్ను ఎత్తకుండా రాసి వేశాను అని శ్రీ.శ్రీ స్వయంగా చెప్పుకొన్నాడు.అయితే “మరో ప్రపంచం ” కవితకు చాలా దిద్దుబాట్లే ఉన్నాయి.దీన్ని బట్టి కవి సర్వవేళలా కేవలం కవితావేశాన్నే నమ్ముకోడు అన్న విషయం తేటతెల్లం.కవిత్వం రాసేటప్పుడు కవి మానసికస్థితి ఏమిటి ? అదే మానసిక స్థితి కవితకు దిద్దుబాట్లు చేసేటప్పుడు అవసరమా?కవి తన కవితని వస్తుగతదృష్టితో పరిశీలించగలడా? లేదంటే ఆత్మాశ్రయ ధోరణికి లోనై తను రాసినదంతా అద్భుతమేనని పొంగిపోతాడా?

కవిత్వరచనపలురీతులు

కవిత్వం రాయడంలో ఒక్కొక్కరిది ఒక పంథా.అయితే స్థూలంగా రెండు విధాలు.. 1.త్రుటిలో రాయడం 2.కొన్నిరోజుల/వారాల తరబడి రాయడం.ఈ రెండు పద్ధతుల్లోనూ కవిత పూర్తయాక మార్పుచేర్పులు ఉండవచ్చు,లేకపోవచ్చు.

జపనీస్‌ కవులు ఉన్నఫళాన కవిత్వరచన జరగాలంటారు.రసమయఘడియల్లో ఆలస్యం పనికిరాదంటారు. స్ఫురణ,రచన ఏకకాలంలో జరగాలంటే మాత్రం చాలా సాధన అవసరం.ఎటువంటి సాధన ? అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. యవ్వనంలో కవితావేశం బలంగా ఉండటం సాధారణమైన విషయం..కాబట్టి తొలినాళ్ళ కవిత్వాలు ఎక్కువగా మొదటిపంథాకు చెందుతాయి.. తర్వాత కవిపరిపక్వమయేకొద్దీ అంతవరకూ పరిపాలించిన కవితావేశం లుప్తమై పోవచ్చు.పోతే అనుభవవైశాల్యం తోడుగా నిలవవచ్చు.అప్పుడు కవి ఎంచుకునే పంథా రెండవది.తొలినాళ్ళ కవి దర్శనం ద్వారా అనుభవగర్భాన్ని తాకలేడని కాదు.తదుపరి కవి అనుభవ విస్తృతి వల్ల తీక్ష్ణతను కోల్పోతాడని కాదు.ఏది ఏమైనా ఒక కవిలో కాలం తెచ్చేమార్పులు అవశ్యం అధ్యయనం చేయవలసిన విషయాలే..కవులు ఎవరికి వారు తమపై కాలప్రభావాన్ని గహనంగా చింతించి ఒక అంచనాకు రాగలగాలి.

కవిత్వం జ్ఞాపకముంచుకోవాలి !

అది కవిత్వమైతే జ్ఞాపకముంటుంది కృష్ణశాస్త్రీయం.అజంతా తన స్వప్నలిపికి ముందుమాటలో జ్ఞాపకదీపం ముందు కూచుని రాశానని చెబుతాడు.రష్యన్‌ కవులు కవిత్వం కంఠస్థం కావలసిందే అనేవారు.”మా దేశంలో కాగితానికి కొరత లేదు” జవాబిచ్చేవారు అమెరికన్‌ విద్యార్థులు తరచు బ్రాడ్స్కీ ఈ అభిప్రాయాన్ని ఉటంకిస్తే.మన సంప్రదాయంలో జ్ఞాపకశక్తికి ఉన్న ప్రాధాన్యత అందరూ ఎరిగినదే..అందునా మనకు సాహిత్యం ఆలోచనామృతమాయె.కవిత్వానికి మంచి ధారణ కావలసిందే.పద్యగద్య విభజనరేఖ వెనుక ఈ జ్ఞాపకసూత్రం బలంగా పనిచేస్తుంది. కవిత్వానికి ఒక నిర్దుష్టరూపం ,నియమితాకృతి ఉంది కాబట్టే గుర్తుంచుకోవడం తేలిక.గద్యం ఎంత కవితాత్మకంగా, సంగీతాత్మకంగా ఉన్నా ఈ వాకిట్లో తలబొప్పి కట్టించుకొని బోల్తా పడవలసిందే.వచనానికి ,కవిత్వానికి గల తేడా తెలుసు కాబట్టే తదుపరి తాళ్ళపాక కవులు శుభ్రంగా వచనాలు రాసుకొన్నారు.అవి ఎంత కవితాత్మకంగా,సంగీతాత్మకంగా ఉన్నా వాటిని బుద్ధున్నవాడు సంకీర్తనలు అనడు.ఈ పిడకలవేటను అవతలకు నెడితే, కవిత్వాన్ని జ్ఞాపకముంచుకోవడం  కవికెంతో మేలు చేస్తుంది.కవి భిన్న కాలాల్లో,భిన్న పరిస్థితుల్లో తన కవితను మననం చేసుకుని , అర్థగమనాన్ని ఆచూకీ తీసి,దానికి  ఒక స్థిర రూపాన్ని  సంతరించిపెడతాడు.అప్పుడే కవిత్వం వచనశృంఖలాల నుండి బయట పడినట్టు.ఇకపోతే,ప్రపంచంలో చాలామంది గొప్పకవులకు తమ కవిత్వాలు నిండు వృద్ధాప్యంలో కూడా గుర్తుండటం గమనార్హం.

కవిత్వంమానసికావస్థలు

తరచు కొందరు కూడబలుక్కుని మేము ఈ వాద కవులం ఆ వాద కవులం అని వాదులాడుకోవటం పరిపాటి.కవిత్వ ఘడియల్లో కవి మానసికస్థితి ఏమిటి ? అప్పుడు అతనిలో మిగిలిన పై పై వాద ప్రాబల్యమెంత?

కవినామధేయుడు జీవితంలో కొన్ని సమయాల్లోనే కవి.మిగిలిన కాలమంతా సాదాసీదా మనిషే.ఆ ప్రత్యేక క్షణాల్లో అతని మనసు లోనయ్యే అవస్థలేమిటి? అది ఇంకా పరిమిత వాదాలు,ఆలోచనల్లో పడి కొట్టుమిట్టాడుతుందా?(అలాంటప్పుడు కవిత్వం హుళక్కి!)అన్నీ అవతలకు నెట్టి,అనంతమైన స్వేచ్ఛను అనుభవిస్తోందా ? ఆ స్వేచ్ఛానందంలో లేదా దుఃఖంలో నాలుగుమాటలు రాల్చగలుగుతోందా ?

కవితను రాసింది తనే ఐనా తను కాదు.తన స్వరం తనది కాదు.(దీన్నే Octavio Paz, Other voice  గా నుడివి వున్నాడు.)ఉత్సవమూర్తిని మోసే ఏనుగు ఉత్సవమూర్తి  కానట్టు.ఉత్సవకోలాహలం కొలదిక్షణాలే..! అది ముగిశాక అది మామూలు గడ్డితినే ఏనుగే. అలాగే కవి కూడా.మరి తనది కాని కవితను కవి ఎలా మెరుగులు దిద్దగలడు?

అమెరికన్‌ కవి Wallace Stevens  తనలోని స్త్రీ కవిత్వం రాస్తోంది..తను కాదనేవాడు.ఈ భావన మనకు కొత్త కాదు.కాళిదాసాదుల సరస్వతి ఇదే భావనను మరింత ఉజ్వలంగా తెలుపుతోంది.పోతన కూడా “పలికించెడు వాడు ” తనకు భిన్నుడనే విన్నవించుకున్నాడు.ఎవరు ఏవిధంగా పేర్కొన్నా సారాంశం ఒక్కటే. సృజనాత్మక ఘడియల్లో కలం పట్టిన కవి,రోజువారీ గొడవల్లో తేలిపోయే వ్యక్తి ఒకరు కారు.పైకి విరోధాభాసలా కనిపించినా ,ఇది పచ్చినిజం.కాబట్టి కొన్నిసార్లు తన కవిత్వం తనకే మింగుడు పడకపోవటం కవికి అనుభవంలోని విషయమే. ఇన్ని భ్రమప్రమాదాలకు లోనయ్యే అవకాశాలు మెండుగా వున్నాయి కాబట్టే సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్‌? అని ఏనాడో వాక్రుచ్చాడు భర్తృహరి!

కవి తన కవిత్వానికి తొలి పాఠకుడు ..

కవి ఆత్మాశ్రయత్వంలో పడి కొట్టుకపోతే తన కవిత్వంలోని దోషాలను గుర్తించలేడు.ఒకరు ఎత్తిచూపినా గ్రహించలేడు.విమర్శ తననుంచే మొదలు కావాలి.తను రాసిన కవితలను ప్రపంచంలో పేరొందిన కవితలతో పోల్చు కొని చూడాలి.అంతేకాదు తొలినాళ్ళలో రాసిన కవితలకన్నా తను గొప్పగా/చెత్తగా రాస్తున్నాడో బేరీజు వేసుకోవాలి. ఒక్కోసారి తాను కవిత్వం ఇంకా రాయవలసిన అవసరం ఉందా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవడం ఆవశ్యకమవుతుంది.ఎడతెగకుండా ఉత్పత్తి చేయడానికి కవిత్వం కుటీర పరిశ్రమ కాదు.కవిత్వం రాయలేనప్పుడు హాయిగా ఆపివేయడం ఉత్తమం ,క్షేమం కూడా.కవి రాసిన ప్రతి అక్షరం కవిత్వ గౌరవాన్ని ఇనుమడింపచేయాలి.

కవిత్వం కాలక్షేపం కాదు

ఉబుసుపోక రాతలు కవిత్వాలు కావు.సంఘటనలకు “స్పందించి” రాయడం కవిత్వం కావడం అరుదు.అవధానిలా “మెయిన్‌ వేయిపద్యములు” శుద్ధ వేస్టు.దీర్ఘంగా రాయడం నేరం.పళ్ళు తోముకోవడం,నాలుక గీచుకోవడం..ఈ జాబితాలోకి కవిత్వం రాయడం చేర్చిన వాడు అధముడు.సంకలనాలు తేవడం వ్యసనం కారాదు.ఇలా ఎన్ని కవిత్వాలు వెలిగించినా చివరకు మిగిలేవి చక్కని కవితలు అర డజను. కవిత్వం రాయడంలో బలవంతం ఏమీలేదు. వమనం,వామాచారం కానే కాదు. ఉద్యమం ,విప్లవం గురించి ఈ శతాబ్దంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. ప్రగల్భాలు, ప్రపంచ రాజకీయాలు,అనంతరానంతరాల్లో మునిగితేలేవారు వేరే ప్రక్రియల్లో వేలూనితే మహబాగు.జలుబైనా,జ్వరమైనా తనదాకా వస్తేనే తెలిసేది.కడుపులో లేనిది కావలింతల్లోకి రాదు..కవిత్వంలోకి అంతకన్నా రాదు. గాయం మీద టించరులా ఎద మండినపుడు.. వసంతపుష్పాలతో మనసు నిండినపుడు ప్రవహించేది కవిత్వం..కాదేది కవితకనర్హం అన్నవాడే అవునవును శిల్పమనర్ఘం అన్న విషయం మరువరాదు.

ఛందో బందోబస్తులు

అభివ్యక్తికి అడ్డురానంతవరకు చందస్సును ఆడి పోసుకోరాదు.చారిత్రకంగా ఆంధ్రకవులు ఎన్నుకున్న ఛందస్సులు ప్రపంచంలో మరే భాషా కవి కనీ వినీ ఎరుగనంత కష్టమైనవి.మనవాటితో పోలిస్తే పాశ్చాత్యులవి బహుతేలిక.అందుకే ఈనాటికి ఆంగ్లంలో, ఇతర ఐరోపా భాషల్లో.. కొంచెం అటూఇటుగా ఏదో ఒక rhyme scheme  లో కవిత్వశకటం నడవడం కనిపిస్తుంది. Auden  లాంటి ఆధునికులు ఛందస్సుకు పెద్ద పీట వేశారు.  Robert Frost free verse  ను నెట్‌ లేకుండా టెన్నిస్‌ ఆడటమని ఎగతాళి చేసేవాడు. మనభాషలో మాత్రాబద్ధ ఛందస్సుల గతులు గ్రహించడం సులువు.ముత్యాలసరాలు ముచ్చటైనవే.. ఛందస్సును తలకెత్తుకోకపోయినా కనీసం మన భాషకు ఏది అందమో కాదో పసిగట్టగల భాషాపాటవం లేకపోతే భరించడం బహుకష్టం..చందస్సులోని గుణమల్లా కవిత్వాభివ్యక్తికి మార్గాంతరాన్ని సూచించడమే అంటాడు ఆడెన్‌.పలువురు కవులు ఆయన అభిప్రాయాన్ని గౌరవించారు.అందుకే త్వరపడి దేన్నీ తృణీకరించవద్దు.ప్రయోగ ప్రియత్వం,స్వతంత్ర ఆలోచన ఏదో ఒకదశలో అందిపుచ్చుకోవాలి.చారిత్రకదృష్టి అలవడితే గాని రూపం విషయంలో సందేహాలు పటాపంచలు కావు.

దీర్ఘకవితలు,వెతలు
చాలా కాలం నుండి మనజాతిని పట్టిపీడిస్తున్న మాయరోగం పాండిత్య ప్రదర్శన (pedantism). (మనస్తత్వశాస్త్రరీత్యా ఇదేమంత మంచిది కాదు..అక్కరకురాని anancasams, obsessions ..తో అలమటించడం తప్ప.)అవధానాల్లో కనిపించేది,ఆశుకవిత్వాల్లో వినిపించేది..నానా వాద కవిత్వాల్లో దర్శనమిచ్చేది ఇదే వారసత్వమే.జన్యుపరంగా సంక్రమించినట్టుంది ఈ వ్యాధి..ఈ వ్యాధికి ఇటీవలి వికటరూపం..దీర్ఘకవిత..తిమ్మమ్మ మర్రిమానులా మొదలూ చివరా తెలియకుండా పాకి అయోమయాన్ని ప్రోది చేయడంతో దీని కథ ముగుస్తుంది.దీర్ఘకవితలు రాసే సత్తా ఏ పాజ్‌ ,నెరుడా, శ్రీ శ్రీ లాంటి మహాకవుల్లోనో  కనిపిస్తుంది..అయినా దీర్ఘకవిత self contradictory  అని కొట్టిపారేస్తాడు Edgar Alen Poe .అది అలా వుండనిస్తే,దీర్ఘ కవితను రాయవలసింది భాష మీద,భావం మీద అనితర సాధ్యమైన ప్రభుత్వం నెరపగల మహాకవులుగాని,నాలుగు వాక్యాలు మూర్తంగా స్పష్టంగా రాయలేని దద్దమ్మలు కాదు.చేతికందినవన్నీ పడవేస్తే తయారయ్యేది కవిత్వం కాదు…అరవ్వాడి కలగాపులగపు సాంబారు.

చివరి మాటలు

నీవు రాసిన కవితలు ఒక నలభై యాభై నీ చేతిలో ఉన్నాయనుకొందాం.అప్పుడు నీవు చేయవలసిందల్లా వాటిలో శ్రేష్ఠము,సౌష్ఠవమైన కొన్ని కవితలను ఏరగలగాలి.అలా ఎంపిక చేసిన  కవితల్లో బావున్న కవితలు ఎందుకు బావున్నాయో  నీకు తెలిసి తీరాలి.వంద మైళ్ళ దారిలో తరచూ ప్రయాణించే వారికి ఏ మలుపు, ఏ సొరంగం ఎక్కడ వస్తుందో సాకల్యంగా తెలుసు.అదే రకంగా నిరంతర మననాభ్యాసం వల్ల నీ కవిత్వంలోని లోతుపాతులు,లోటుపాట్లు నీవు కూలంకషంగా తెలుసుకోగలుగుతావు.అదృష్టవశాత్తు దీనికి  దగ్గరి దారి లేదు.కవి దాటు,గొర్రె దాటు ఎన్నడూ ఒకటి కావు..
---------------------------------------------------------
రచన: తమ్మినేని యదుకులభూషణ్, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment