Thursday, November 8, 2018

కథన కుతూహలం – 3


కథన కుతూహలం – 3




సాహితీమిత్రులారా!

ఆధునిక భేతాళకథల్లో మూడవది ఆస్వాదించండి.............

పట్టు వదలని విక్రమార్కుడు, తనకు ఎదురవుతున్న ఆశాభంగాలని పట్టించుకోకుండా అలవాటయిన చోటుకే అలవోకగా తన కారులో మళ్లీ వచ్చాడు. వెలుగును చిత్తుచిత్తుగా ఓడించి పడమటి కొండల్లోకి పారిపోయేలా చేసిన చీకటి విజయగర్వంతో విర్రవీగుతోంది. దాంతో తనకు సంబంధం లేనట్లు, విక్రమార్కుడు తన కారు దీపాల వెలుతుర్లో చెట్టు కొమ్మల మీదకు నెమ్మదిగా ఎక్కాడు. అక్కడ ఉన్న శవాన్ని భుజం మీద వేసుకుని నింపాదిగా క్రిందకి దిగాడు. పగలు బేతాళుడికి ఎక్కడన్నా కావాల్సినంత ఆహారం దొరికిందేమో, అతడికి ఆశ్రయం ఇచ్చిన శవం నిన్నటి కన్నా బరువుగా ఉంది. ‘బాధ్య’తలో బాధ ఇమిడి ఉందని తెలిసిన విక్రమార్కుడు దాన్ని పట్టించుకోకుండా పట్టుదలగా తన కారుని చేరాడు. విలక్షణత కోసం అన్నట్లు, శవాన్ని ఈసారి వెనక సీట్లో పడుకోపెట్టాడు. కారు నెమ్మదిగా కదిలింది. దాంతో పాటు బేతాళుడిలో కూడా కదలిక వచ్చింది. అతడింక మాట్లాడటం మొదలవుతుందని తెలిసిన విక్రమార్కుడు ఆ మాటల్ని వినటానికి సిద్ధమయ్యాడు. కారు నడపటంలో ఏకాగ్రతను మాత్రం సడలనివ్వలేదు. సుప్తస్థితిలోంచి పూర్తిగా బయటికి రావటం కోసం అన్నట్లు లిప్తపాటు ఆగి, బేతాళుడు మాట్లాడటం మొదలు పెట్టాడు.

“రాజా! ఒక మంత్రివర్యుడు తనకు అప్పగించిన బాధ్యతలను సరిగా నిర్వర్తించకపోతే, ప్రభుత్వనేత అతడి శాఖలను పదేపదే మారుస్తాడు. అలాగే, నువ్వు నీ కార్లో నా స్థానాన్ని అదేపనిగా మారుస్తున్నావు. ఇది చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. తాను చదివే కథలని ఎన్నుకునే విధానాలని పాఠకరావు కూడా అలా మార్చుకోవటం గుర్తుకు వస్తోంది. అలసట తెలియకుండా ఉండటం కోసం, అతడు నాకు అందించిన మరో అందమయిన అనుభవం నీకు వివరిస్తాను, విను.

ఆ రోజు సోమవారం. అందువల్ల వారపత్రికలకి ఆటవిడుపు దినం. నెల మధ్య రోజులు కాబట్టి ఏ కొత్త మాసపత్రికా విక్రయవీధిలోకి వచ్చే అవకాశం లేదు. చదవాల్సిన పాత పత్రికలేవీ మిగల్లేదు. అందుకని గోడ బీరువాలో ఉన్న పుస్తకాల్లోంచి ఒక కథాసంకలనం పాఠకరావు తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఒక సంవత్సరంలో వచ్చిన కథలన్నిటినీ చదివి, వాటిలో ఉత్తమమని భావించిన కథలతో ఒక ప్రముఖ సాహితీసంస్థ ప్రతి సంవత్సరం ప్రచురించే కథల సంపుటి అది. ఈ మధ్యనే విడుదలయింది. అలవాటు ప్రకారం విషయసూచిక మీద దృష్టి సారించాడు. ఒక్కో కథ పేరూ, రచయితల పేర్లూ చూశాడు. ఏ కథని కూడా చదవటం మొదలుపెట్టకుండానే పేజీలు తిరగేశాడు. అప్పుడప్పుడు అక్కడక్కడ ఆగి తన కాలిక్యులేటర్ ఉపయోగించి ఏవో లెక్కలు వేశాడు. కథల పేర్ల ఎదురుగా ఏవో అంకెలు రాశాడు. ఇదంతా అయింతర్వాత తాను వేసుకున్న అంకెల్ని చూసి ఒక్కసారిగా ‘వామ్మో!’ అన్నాడు. తర్వాత చేతి గడియారం చూసుకున్నాడు. ఉన్నట్లుండి, కథల సంపుటిలోకి వెళ్లి, ఓ కథ చదవటంలో లీనమయ్యాడు.”

రాజా! ఇంతవరకూ నేను చూసిన దాని ప్రకారం, వార్తాపత్రికలో కథ పేరునో కాకుంటే కథ ప్రారంభాన్నో చూసి, ఏ కథ చదవాలో పాఠకరావు నిర్ణయించుకున్నాడు. ఈసారి ఈ రెండిటినీ అతడు చూడలేదు. పాఠకరావు చేతిలో ఉన్నది కథల సంపుటి. అంకగణితం పాఠ్యపుస్తకం కాదు. కథల సంపుటి చూస్తూ అతడు వేసిన లెక్కలు దేనికి? ఆ లెక్కలద్వారా అతడు తెలుసుకున్నది ఏవిటి? అయినా, ఏ కథ చదవాల్సిందో, ఏది చదవకూడదో లెక్కలు చెపుతాయా? వామ్మో! అని అతను ఎందుకు అన్నాడు? తన చేతి గడియారం ఎందుకు చూసుకున్నాడు? ఏ కారణంతో చివరకు ఒక కథని చదవటానికి ఎన్నుకున్నాడు?”

అక్కడిదాకా చెప్పి, ఇలా ప్రశ్నించాడు బేతాళుడు.

“రాజా! పాఠకరావు ప్రవర్తనని నీ అద్భుతమయిన తార్కికదృష్టితో నువ్వు ఇంతకుముందు సమర్థించావు. నీ దృక్కోణానికీ నా దృక్పథానికీ మధ్య వైరుధ్యం ఉన్నా నీ మాటల మాయలో పడి నేనేమీ మాట్లాడలేకపోయాను. ఈసారి అలా జరగనివ్వకూడదని నేను బలంగా నిర్ణయించుకున్నాను. అందుకని ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి, నేను అడిగిన పై ప్రశ్నలకు జవాబు చెప్పు. వాటికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, అధికారం కోల్పోయిన పార్టీ, ఎన్నికల ఫలితాల తర్వాత ముక్కలు చెక్కలయినట్లు, నీ తల కూడా వేయి వక్కలవుతుంది.”

ఆ మాటలు విన్న విక్రమార్కుడికి, బేతాళుడికి సమకాలీన రాజకీయాలపై కూడా మంచి అవగాహన ఉందనిపించింది. లేకపోతే ఈ స్థాయిలో వ్యంగ్యవ్యాఖ్యలు ఎలా విసరగలడు? పొగడ్తల సంగతి తర్వాత. తనముందు ఉన్న అగడ్త దాటటం ఎలా? చూపును రహదారి మీదనే కేంద్రీకరించి కాసేపు ఆలోచించాడు.

“బేతాళా! ముందుగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. పాఠకరావు చేసిన ప్రతి పనీ సమర్థించటానికి నేను రాజకీయ నాయకుడ్ని కాదు. అతడు నా పార్టీలో సభ్యుడు కాడు. పోనీ, అతడు నా సమీపబంధువా అంటే అదీ లేదు. నా అభిప్రాయం ప్రకారం అతడిని సరిగ్గా అర్థం చేసుకోవటానికి కావాల్సింది ప్రస్తుత కథాప్రపంచం పైన ఒక అవగాహన. సమ్యక్ దృక్పథంతో ఆలోచించే సమర్థత. అది ఉండబట్టి, అతడి ప్రవర్తన ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగానే ఉందని నాకు అర్థమయింది. అందుకే అతడి చర్యలని నేను సమర్థించింది.

ఒకప్పుడు కథ నిడివి ఎంత ఉన్నా పత్రికలు ప్రచురించేవి. పాఠకులూ ఆదరించేవారు. ఇప్పుడు రోజులు మారాయి. కథ చదివే పాఠకుల సంఖ్యా, వాళ్ల తీరిక సమయమూ రోజులు గడిచే కొద్దీ తగ్గుతోంది. దాంతో, నిడివి మరీ పెద్దదిగా ఉన్న కథల పట్ల కొందరు పాఠకులు ఆసక్తి చూపటం లేదు. ఒక పెద్ద కథని కొంచెం కొంచెంగా చదవటం పూర్తి చేసి, వాయిదాల పద్ధతి మీద అది ఇచ్చే అనుభూతి పొందటం కన్నా, ఉన్న సమయంలో ఒక చిన్న కథని పూర్తిగా చదవటానికి ఎక్కువమంది పాఠకులు మొగ్గు చూపుతున్నారు. దీంతో కథ నిడివి తగ్గటం, చదివించగలగటంలో ఇంతకుముందు లేనంతగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది గ్రహించే, కొన్ని అంతర్జాల పత్రికలు తప్ప; చాలా పత్రికలు తమకి పంపే కథలు ఇన్ని పేజీల కన్నా ఎక్కువ ఉండటానికి వీల్లేదు అంటున్నాయి.

ఇక నువ్వు అడిగిన ప్రశ్నల దగ్గరకు వద్దాం. ప్రతి కథల సంపుటి మొదట్లో ఏ కథ ఏ పేజీలో మొదలయిందో విషయసూచికలో ఉంటుంది. దాని ఆధారంగా, పాఠకరావు తన గణనయంత్రాన్ని (కాలిక్యులేటర్ అని భవదీయుడి సవినయ మనవి) ఉపయోగించి, ఏ కథ ఎన్ని పేజీలు ఉందో లెక్క వేసుకున్నాడు. కథ పేరుకు ఎదురుగా పేజీల సంఖ్యను రాసుకున్నాడు. మొదటి కథ అచ్చులో పదహారు పేజీలు ఉంది. ఆ తర్వాత కథలు అంతకన్నా పెద్దగా ఉన్నాయి. వాటి నిడివి, తన అభిరుచికి అనుగుణంగా లేదని తెలిసింది. అందుకని ‘వామ్మో!’ అన్నాడు.

చివరి మాట. ఆ పూట పాఠకరావు ఒక కథని మాత్రమే చదవదల్చుకున్నాడు. టైమ్ ఎంతయిందో తెలుసుకోవటం కోసం ఒకసారి గడియారం వంక చూసుకున్నాడు. తనకి అందుబాటులో ఉన్న సమయంలో ఏ కథని పూర్తిగా తాను చదవగలడో ఆ కథనే ఎన్నుకున్నాడు. దాన్నే చదవటం మొదలు పెట్టాడు. ఇందులో వింతా లేదు, విచిత్రమూ లేదు. అలాంటిదేదో ఉందని నువ్వనుకోవటమే విడ్డూరంగా ఉంది.”

అలా విక్రమార్కుడికి మౌనభంగం కాగానే, తాను ఉన్న శవం తనని గెలిపించిన ఎన్నికల ఎజెండా అని బేతాళుడికి అనిపించింది. అధికారం పోవటంతో ప్రతిపక్షంగా మారిన పార్టీలో ఎమ్మెల్యేలా అతడు దానితో సహా ఎగిరిపోయాడు. విక్రమార్కుడి కారు లోంచి ‘తలచినదే జరిగినదా దైవం ఎందులకూ, జరిగినదే తలచితివా శాంతి లేదు మనకూ!’ అని పాట మొదలయింది.
                                                                                                                                           (సశేషం)
-----------------------------------------------------------
రచన: టి. చంద్రశేఖర రెడ్డి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment