Thursday, November 29, 2018

తమాషా దేఖో 6


తమాషా దేఖో 6




సాహితీమిత్రులారా!

(జరిగిన కథ వర్ధమాన హోంబిల్డర్‌ కోటీశ్వర్రావు, అతని బావమరిది కృష్ణ కస్టమర్ల కోసం తిరుగుతుంటారు. అమెరికా నుంచి వచ్చి సరదాగా ఇళ్ళ కోసం చూస్తున్న
నాగేశ్వరిి, ఆమె భర్త గోపాలరావు, వాళ్ళ బావగారు రవణరావు గారింట్లో ఉంటారు.గోపాలరావు కి ఆంధ్రాలో “అసలైన మనుషుల” జీవితాన్ని కళ్ళారా గమనించాలని
కోరిక. అలా కృష్ణతో డంగలా దగ్గరకి వెళ్తారు గోపాలరావు, అతనికి పరిచితుడైన రాఘవరావు. రాఘవరావు కవి కూడా. అక్కడ ఆంజనేయవిగ్రహం దగ్గర సిందూరం
బొట్టు పెట్టుకోవాలంటాడు కృష్ణ. రాఘవరావుకి అది నచ్చదు.

వాళ్ళు డంగలాలో ఆదిబాబుని, జానీ ఎడ్విన్‌ ని, వాళ్ళ గురువు వస్తాదు అప్పలనారాయణనీ, కాకా హోటల్లో రుద్రమూర్తినీ కలుస్తారు. తరవాత క్రిష్ణతో బర్మాకోలనీలో
సైటు మీదకి వెళ్తే అక్కడ ఎల్లమ్మ ఒక పాట పాడుతుంది. అక్కడ సన్యాసి రావుని కలిసేక శివాలయంలో ఆదివారం సాయంత్రాలు జరిగే మీటింగ్‌ గురించి తెలుస్తుంది. అక్కడ వెంకటేశ్వర్లు, తదితరులు వాతావరణ కాలుష్యం గురించి చర్చిస్తారు. ఇక చదవండి.)

(రుద్రమూర్తి బయటికి నడుస్తాడు)

మంగ (చెట్ల పంతులుతో) ఆయన్నెందుకు కదిల్చేరు…

చెట్ల మాట వరసకన్నాను….ఇలాగ తగులుకుంటాడని అనుకోలేద్సుమీ. (గోపాల్‌ తో) ఆయన ఎప్పుడేం అన్నా మనసులో పెట్టుకోకండి……ఒక్కోమాటు ఏ నిభం నేరం లేకుండానే ఇలాగ మొహమ్మీద పేడ్ణీళ్ళు జల్లెస్తాడు…..ఒక్కోసారి ఎంతభిమానంగా మాటాడతాడంటే…….

గోపా లాష్ట్‌ వీక్‌ డంగలా దగ్గిర చూసేనీయన్ని! ఆయన తిడుతున్నా…తిట్టినట్టుండదు….ఏదో తెలియని నిజం చెపుతున్నాడనిపిస్తుంది….and… with what authority…!

మంగ నిజఁవేనండి. రుద్రా గారు……. తనంతట తను చెప్పడానికి ఏఁవీ లేదంటాడు. మనం మాటాడించి నప్పుడే మాటాడతాడు. …..కానీ మనం చాలా సార్లు…మర్యాదల మాటున ఒకలకొకళ్ళం నిజం చెప్పుకునే ధైర్యం లేనట్టు….ఏదో అబద్ధం పొలైట్‌ నెస్‌ ఒకటి పోషిస్తూ ఉంటాం…కదా? ఆయన్దగ్గర అది లేదు! సమ్‌ హౌ………… ఆయన కేకలేసినా……..

నర తలంటుపోసినట్టుంటుంది?! He has freed himself of that sort of falsehood…..

రవి Because he is a nobody……!?

రాఘ ఆయనకి మన వ్యూ పోయింట్‌ గింజుకున్నా అర్థం కాదు…..Boredom?….Who is bored? I am not bored! He hardly knows us……how can he be so rude? నేను చిన్నప్పుడు చాలా సాధారణమైన పరిస్థితుల్లో పెరిగేను. ఇంట్లో తిండికీ బట్టకీ చాలీ చాలకుండా అవస్థలు పడ్డ వాళ్ళు…. ఆడవాళ్ళనీ పిల్లల్నీ కొట్టేవాళ్ళూ…..హైస్కూల్‌ చదువుకోడానికి ఎనిమిది మైళ్ళు రానూ పోనూ నడిచే వాళ్ళు….వైద్యం కోసం కుళ్ళు కాలవల పక్కన నులక మంచాల మీద మూలుగుతూ వెయిట్‌ చేసే వాళ్ళు (జుట్టు పట్టుకుని చూపించి) ఇంత మంది తెలుసు నాకు. ఆధునిక మానవుడు సంఘ జీవి. ఆలోచనాపరులు సృష్టించే సాహిత్యం అధ్యయనం చెయ్యటం ద్వారా ఈ సమస్యలకి పరిష్కారాలు వెతుక్కొనే క్రమంలో, ఆ భావాలన్నీ ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో చర్చించుకోవటం ఇవాల్టి చారిత్రక అవసరం. (నరసిమ్మూర్తితో) మీరో? వెంకటేశ్వర్లు గారో?? మీరు బోరు కొట్టి ఇంక ఏం పనీ పాట్లేకే మీటవుతారా….?

నర రుద్రమూర్తి మాటలు మీరు పెర్సనల్‌గా తీసుకోకండి. His indictment is not against you or me…! Its against our accumulated cultural burden…… వాడు నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు…..చెత్తలు తుడిచే చెత్తల దొర లాటి వాడు. వాడు తిట్టి తిట్టి దిగబారపోస్తే ఇల్లూ వాకలీ తుడిచి వెళ్ళినట్టుంటుంది. He can never be nice to any one the way we know ‘nice’. I can’t figure him out….I stopped trying…..

విమ కల్చరల్‌ బర్డెన్‌ ఏంటి మేషారు? అర్ధం లేకండా! కల్చర్‌ భారం ఎలా అవుతుంది….సంస్కృతి, కళా రూపాలు లేకుండా మానవత్వం మంచితనం సాధ్యం కాదు. ఆయనంతా అద్వైతం మాటాడతాడు…!

రాఘ Exactly! How is culture a burden? ఇది మన సంస్కృతి అని గర్వంగా celebrate చేసుకుంటారు ఎవరైనా! మా అమ్మాయినీ (గోపాల్ని చూపించి) వీళ్ళమ్మాయినీ every year…..we send them here to learn classical dance…. మన సంస్కృతి మీద ఇష్టంతో…అభిమానంతో….

(సిష్టర్‌ అసింతా లేచి నిల్చుంటుంది)

అసింతా మంగ?! నాకు సాయంకాల ప్రార్ధన సమయము! నేను వెల్లాలి?

రాఘ మేం డ్రాప్‌ చేస్తాం సిష్టర్‌…..If you can wait? (రుద్రమూర్తి మాటలు గుర్తు తెచ్చుకున్నట్టు నవ్వి) If God can wait…..

అసింతా లేదు బాబు. I am a Benedictine nun. Prayer is very important to us. దేవుని కొరకు కాదు….మన కొరకు……

నర (ఆలోచనగా) రుద్రమూర్తి ఏదీ ఒద్దంటాడు. వాడికి చెల్లింది……..ఏదో ఒకటి ఉండాలి కదండి….ఏదీ లేకుండా ఏం లేదు కదా! A secular mind cannot accept God…… so Art is all we got- not Mind, as he says! సంస్కృతి లేని శూన్యాన్ని తట్టుకోడం ఎలాగ? కష్టం సుఖం చెప్పుకోవాలా ఒద్దా? చెప్పుకోకపోతే తెలిసేదెలాగ? చెప్తేనే కదా….తెలుస్తుంది! అందుకే…….. (గోపాల్‌ తో, రాఘవతో) This is the predicament of all immigrants………I see so many of you. ఒక సారి మీ అమెరికాలో గేంగ్‌ వార్స్‌ గురించి ఓ ఫీచర్‌ ఆర్టికల్‌ చేసేఁవు. బ్రూక్లిన్‌ లో గేంగ్‌ స్టర్స్‌ లాగ తిరుగుతున్న టీనేజ్‌ పిల్లల్ని స్టడీ చేస్తే…do you know their primary reason for turning to crime? Boerdom! In a majorty of cases….its a cultural vaccuum…having nothing to do….. (మంగవేణితో) పుస్తకాలు ఎందుకూ అన్నావు కదా? ఆ వేక్యూమ్‌ నింపుకోడానికి. Through art-books, music, pictures, poetry……through these symbols we create our culture, we fill our void. ఏది పడితే దానితో కాదు. కళా కారులు సంస్కృతిని సృష్టించే వాళ్ళు… ఒళ్ళు దగ్గిర పెట్టుకుని, జాగర్తగా క్రియేట్‌ చేసే ఊహలతోటీ, ప్రతీకలతోటీ. ఏఁవీ లేకుండా ఒదిలెస్తే మిగిలేది degradation…apathy…….Without culture we’re just dead in the water……….

గోపా అంటారు కదా! There is an element of divine in art, in music, poetry….. అందుకే…. Art is almost God….

రవి కూచిపూడి నాట్యఁవే కల్చర్‌ ఎందుకయ్యింది? రుద్రా గారు చచ్చడి బాజాలో కూడా గొప్ప సౌందర్యాన్ని చూడగలడు. Because….. అతను ఆర్ట్‌ అని, కల్చర్‌ అని, సౌందర్యం అని దేన్నీ పనికట్టుకుని assert చెయ్యడు కాబట్టి. When you revere nothing you celebrate everything. (నరసిమ్మూర్తితో) Void ఎందుకు fill చెయ్యాలి? Because we are too chicken to face it?………What if you face it and…..find out that the culture you refer to is a poor alternative….!

నర Then..its just a cultural wasteland… ముందు పనంటూ చేస్తే కదా వంకలు పెట్టడానికి? గాలీ వానా వొస్తే కధే లేదు! Individuals may revel in your void. నువ్వు చెప్పే మాట ఎవరో చలానికో రుద్రమూర్తికో వాళ్ళకి చెల్లింది….అది మనుషులందరికీ పనికిరాదు…..సంఘానికి పనికి రాదు……

రవి అలాక్కాదు! అప్పుడు పుట్టే సంస్కృతి వేరు……….

విమ ఇతనొకడు…మిష్టిక్‌ బాబా బయల్దేరేడు. ఈ ఉన్నోళ్ళందరూ చాల్రా? చరిత్రలో జరిగిన ఘోరాలు నీకు కనిపించవు. దూరపు కొండలు నునుపు కదా? (రాఘవతో, గోపాల్‌ తో) నిబద్ధతతో రాసే సీరియస్‌ రైటర్‌ అని పెద్ద రెప్యుటేషన్‌ మళ్ళీ…పంచమ సంచయం The Fifth Chronicle అనే పేరుతో అనువదించాక ఇంక చేతులు ముడుచుకు కూర్చున్నాడు……

రాఘ అది ఆదిత్య కదూ?

మంగ మా రవే ఆదిత్య!

వాచ్‌ మేన్‌ (పొలైట్‌ గా వచ్చి నించుంటాడు)

రవి అవన్నీ డూబులు. నేను దళితుడ్ణి కాదు, వాళ్ళ కష్టం గురించి నాకేం తెలుసు? I couldn’t even begin to understand! నేను ఆడదాన్ని కాదు. ఆడవాళ్ళ కష్టాల మీద కధలు రాసేను….అబద్ధం కదూ! ఎందుకు…? రుద్రా గారు అన్నట్టు…ఉండబట్టకా?? God knows why?!The fact is…..I lust after women. ఆడవాళ్ళ మీద గౌరవం అన్నది నిజంగా అనుభవంలోకి వచ్చిన వాడు…ఇంక స్త్రీల కధలూ అవీ రాయక్ఖల్లేదు. నిజంగా మంచి వాళ్ళు…they are just good without organizing, touting their goodness….. అలాటివాళ్ళు మనకందరికీ తెలుసు…….they are faceless…

వాచ్‌ మేన్‌ తలుపులేసెస్తనాం సార్‌..! అమ్మా….?! తలుపులు…..

నర (రవితో) Creating culture…Its no easy task! Its an equally sacred task. చెయ్యకూడని పన్లు చెయ్యడఁవే కాదు, చెయ్యవలిసిన పన్లు చెయ్యకపోవటం కూడా తప్పే! Intellectuals శక్తిని తక్కువంచనా వేసుకోకు. ఫ్రెంచ్‌ రెవల్యూషన్‌ కాఫీ షాపుల్లో చెప్పుకునే కబుర్లలోంచే వొచ్చింది. మాటాడేవాళ్ళలోనూ మహానుభావులుంటారు……(భుజం మీద చరిచి) మీ బుద్ధుడో…..(అసింతాని చూపించి) వీళ్ళ ఏసు ప్రభువో? (హడావిడిగా బయటికి నడుస్తాడు.)

చెట్ల మా బాగా అన్నావు!

(గుడి తలుపులు వేసిన చప్పుడు.)

మూడవ స్థలం

(మెయిన్‌ రోడ్డు పక్కన ఒక పెద్ద బట్టల షాపు. తీగెల బ్రదర్స్‌ వస్త్ర చందన్‌ అని బోర్డ్‌ ఉంటుంది. బయట ఆడవాళ్ళు, మగాళ్ళు వేరే వేరే లైనుల్ల్లో నిలబడి ఉంటారు. మైకులో ‘ సౌందర్య లహరీ స్వప్న సుందరీ..’ అనే పాట, మధ్య మధ్య ఒకతను మైకులో అరుస్తూ అదిలిస్తుంటాడు.)

మైకు సౌందర్య శారీస్‌ ఒక వ్యక్తికి ఒకటి మాత్రమే!
చెప్పులు మెట్ల వద్ద విడిచి నెంబరు తీసుకోండి!
సౌందర్య శారీస్‌ ఒక కష్టమర్‌ కి ఒకటి మాత్రమే!!

(కౌంటర్‌ దగ్గర సన్యాసి రావు, కోటీశ్వర్రావు కూర్చుని ఉంటారు. క్రిష్ణమోహన్‌ నిలబడి సేల్స్‌ మన్‌చూపించే బట్టలు చూస్తుంటాడు.)

సన్యా (సేల్స్‌ మన్‌తో) ఖాదీ పోలిష్టర్‌ చూపించు! (క్రిష్ణతో) కాలేజీకొచ్చేవు! ఖద్దరు బట్టలు కుట్టించు. (కోటితో) ఖాదీ సఫారీ తీయించండి…..పార్టీలో ప్రైమరీ మెంబర్షిప్‌ ఇప్పించెస్తాను.

కోటి ఇక్కడెందుకూ? ఖాదీ భండార్లో తీద్దాఁవు.

సేల్స్‌ నిజం ఖాదీ ఎవలు వాడతనార్సార్‌? ఇమిటేషన్‌ ఖాదీ అయితే బెష్టు……చూడ్డానికి ఖాదీలాగుంటాది, ఒంటి మీద స్మూత్‌ క్వాలిటీ ఉంటాది. (తాను తడిమి చూపించి) దిన్లో వున్న స్మూత్‌ పోయింటు మీకు ఖద్దర్లోన లేదు కదండి!

కోటి (క్రిష్ణతో) ఏంవై ఖాదీ తీస్తావా? మూడు చొక్కాలు తీస్సేవు…… ఎప్పుడూ పువ్వులు పువ్వుల చొక్కాలే తీస్తావేఁవీ?

సేల్స్‌ (నవ్వుతూ) కుర్రాల్లెక్క వేరు సార్‌ ! ఫ్లవర్సు, లూజు పిట్టింగు ఇప్పుడు లేటెష్టు ఫేషను. పువ్వుల చొక్కాలయితే లేడీస్‌ లైక్‌ చేస్తారు….

క్రిష్ణ ఎల్లవై ఇతనొకడు…!

కోటి అతను ఉన్నమాటే అన్నాడు. అమ్మాయిల్దెగ్గిర ముద్దరాలు సిద్ద లాగ ఎలాగేక్షన్‌ చేస్తావో నాకు తెలీదనుకున్నావా…?

సన్యా అమ్మా నీ చొక్కాలెనకాల ఇంత కహానీ దాచీసేవా?

కోటి (సన్యాసిరావుతో) ఇదుగో పెదాలు ఇలా తడుపుకున్నవ్వుతాడు. అమ్మ పుట్టిల్లు మేనమాఁవ దెగ్గిరా? ప్లాటో పుస్తకాలు చదివి చదివొచ్చీసి ప్లాటో లాగ ఫీలయిపోతావు గానీ….దొంగా! నువ్వు ఉట్టి కిష్టుడివి కావు సుమీ! నటశేఖర క్రిష్ణవి!

క్రిష్ణ మీరే ఉట్ఠమాయకులు!

సన్యా (వినోదంగా) అమాయకుడే మీ బావ! అత్యంత మాయ కలవాడు!!

కోటి అన్నేనన్నానా? నీలాగ ‘ఉత్తమ సత్తముడు’ అని కవుల మీటింగులంట పిల్చి నన్నెవడూ ముద్దించలేదు….

క్రిష్ణ …అనే మీ కుళ్ళు. నాకు తెల్సు.

సన్యా అవతలోడి కన్నెర్ర ఆసుకోవాలి. కంప్లెయిన్‌ చేస్తే ఏటి లాభం? పోల్టిక్సంటే అంత సుళువనుకున్నావా? నటశేఖర క్రిష్ణవైతే మంచిదేలే! Politics is perception అన్నాడు విన్నావా? అంటే మనం ఎంతో మహానుభావుల్లాగ అవతలోడికి రూపించటం లోనే ఉన్నాది పోల్టిక్సు మహిమంతా. ఖద్దరు బట్టలు కుట్టిస్తే సగం లైన్లో పడ్డట్టే! కవ్వి కాబట్టి ఉపన్యాసాలికి ఢోకా లేదు! ఇంకా…….అవతలోడికి మన మొహంలో హావ భావాలేమీ తెలీకుండా పోకర్‌ ఫేస్‌ పెట్టుకోవాలి.

కోటి పోకర్‌ ఫేసంటే ఏటో తెలుసా?

క్రిష్ణ ఉఁఊఁ..??

సన్యా పేకాటాడీ టప్పుడు మీ బావలాటోడితోటి ఆటక్కూచున్నావనుకో. అతను మన కాడ ముక్కలేటున్నాయో నెక్స్టు ముక్కేటేస్తాఁవో అన్నీ మన మొహం లోని హావ భావాల్ని బట్టే టప్మని చెప్పెస్తాడు….

కోటి (గర్వంగా) దాన్నే పరేంగితావగాహనా అన్నారు.

క్రిష్ణ అపరోక్ష జ్ఞానం?

కోటి అపరోక్ష జ్ఞానం వేరూ! మాట బావుంది కదా అని ఒదిలీకు. ఆలోచించి మరీ అనాలి!

సన్యా ఊఁ అలాటవగాహాలు తెలిసిపోకుండా ఇదుగో….మొహం బిగించుకుని కూచోవాలి. చచ్చినా మన కడుపులో సంగతి అవతలోడికి తెలీనివ్వకూడదు. ఏం?

కోటి గురువు గారు వానా కాలంలో కూడా రేబాన్‌ గ్లాసెస్‌ తియ్యకుండా ఎందుకు తిరుగుతారనుకున్నావు? (సన్యాసిరావుతో) మెంబర్షిప్పు కాదు. యూత్‌ కాంగ్రెస్‌ లో పోష్టేదేనా చూడండి. దిగిపో దిగిపో అంటే మరి మాకు పెట్రోల్డబ్బులేనా రావాలా వొద్దా? మావోడికి మీరు చెప్పక్ఖల్లేదు. ఒక కధో కవిత్వమో అల్లేడంటే (ముక్కు మీద వేలేసుకుని) ‘ఆహా ఇతని వంటి ముద్రుడు మరి లేడు సుమా…..’ అన్నట్టుగ రూపిస్తాడు!

క్రిష్ణ అన్నీ అబద్ధాలు!

కోటి అబద్ధం సుబద్ధం కుంతీ పుత్ర వినాయకహా!

సన్యా అందరూ లీడర్లే అయితే ఇంక కేడర్లెవరు? (క్రిష్ణతో) సాయంత్రం రా!

క్రిష్ణ సాయంత్రం కుదరదే….

కోటి ఏఁవీ?

క్రిష్ణ సుబ్రమణ్యం గారింట్లో మీటింగున్నాది.

కోటి గోపాలు గారూ రాఘవ గారూనా?

క్రిష్ణ ఊఁ..

కోటి కవుల మీటింగులా…

క్రిష్ణ అలాగనేం కాదు. సుబ్రమణ్యం గారు సావనీర్‌ కొత్తిస్యూ తెస్తునారు….మానవ సంబంధాల విశేష సంచిక.

కోటి ఆళ్ళకి నిన్ను నేరకపోయి పరిచయం చేసేను నాదే బుద్ధి తక్కువ. బుద్ధి: కర్మానుసారిణీ అని నీ బుద్ధి జాగాలమ్మవై అంటే కాతర్లేకుండా కవిత్వాల మీదికే పోతోంది…

సన్యా హ్యూమన్‌ రిలేషన్‌షిప్స్‌ మీదంట! ఎళ్నివ్వండి పోనీ!! ఇంపార్టెంటు…

కోటి ఏం రిలేషన్‌షిప్సండి! మా అమ్మన్నట్టుగ….ఇరుక్కి దండం పొరుక్కి దండం ఇటు నమస్కారం అటు నమస్కారం!! నా మానవ సంబంధం నేను ఫిగరౌట్‌ చేసుకోడానికే గింజుకుంటునాను. ఇతగాడు లోకంలో ఎల్లపోటు ప్రజల మానవ సమంధం మీదా థీరీ తీసి కధలు రాస్తాడంటే……. (పట్టుచీరల సెక్షన్‌ వైపు చూసి, ఆగి) ఆ పరుపుల మీద ఎవరమ్మా అది? నాగేశ్వరీ గారు కదూ?

(లేచి నిలబడిపోయి) హలో హలో మేడమ్‌ ! హవ్వార్యూ? (దగ్గరగా వెళ్ళి, మేఘనతో) Hello Paapaa? How are you doing today?

(నాగేశ్వరి, మేఘన పరుపుల మీద కూర్చుని పట్టు చీరలు చూస్తున్న వాళ్ళు ఇటు తిరిగి)

మేఘ Hai Uncle!

నాగే హెల్లో కోటీ గారూ! ఏంటెక్కడా దర్శనాల్లేవు?

కోటి మీరు తీర్థయాత్రల మీదెళిపోయి మమ్మల్నంటారేటండి? మీరు కాకి చేత కబురు పెడితే ఒచ్చి వాలిపోతాఁవు……

నాగే (అల్లరిగా) కాకుల్తోటి టచ్‌ ఎప్పుడో పోయింది కోటీ గారూ! స్టేట్స్‌ లో కాకులుండవుగా!

కోటి అక్కడన్నీ హంసలేనా? పొనీ కాకులూ హంసలూ ఎందుకండి? తల్చుకోండి చాలు క్రిష్ణ పరమాత్మ లాగ నెమిలి పించం కట్టుకుని పిన్నల గర్రూదుకుంటూ ప్రత్యక్షఁవైపోతాను….

నాగే ఇప్పుడే మా మెగ్‌ కి డ్రెసెస్‌ కొంటూ అనుకుంటున్నాను….ఆరంగేట్రం ఎరేంజ్‌ మెంట్స్‌ కి ఈ పన్లన్నీ పెట్టుకున్నాం ఈ పెద్ద మనిషి ఎక్కడా అయిపు లేదేం చెప్మా అని?

కోటి మరి ఆ థాట్‌ వేవ్స్‌ తగిలీ తగలకుండానే వెంటనే ప్రత్యక్షఁవయ్యేఁవా లేదా?

నాగే (పరీక్షగా చూస్తూ) అంతేనంటారు…..నమ్మ మంటారు??

కోటి నమ్మి చెడ్డవాడు లేడు…..ఏటి మేడం అలాగ చెఁవట్లు కారిపోతున్నారు? ఆ అమ్మాయైతే మరీనీ? (డోర్‌ దగ్గర గూర్ఖాని కేకేసి) ఏయ్‌ ఇధరావో…..సాబ్‌ కో బోల్కే అమ్మాకో దో కూల్‌ డ్రింక్‌ లానా కర్కే బతావో…..జల్దీ జల్దీ….

గూర్ఖా అచ్చా బాబూ!

నాగే ఇప్పుడెందుకండీ…….

కోటి ఊళ్ళో ఎండలెలాగున్నాయో చూసేరా? మీ జర్నీ బాగా జరిగిందా?

నాగే బాబా నన్ను చూసి నవ్వేరు కోటీ గారూ!

మేఘ He waved at mommy! That was really kool… (పక్కనే ఉన్న పెద్ద పార్సెల్‌ చూపించి) Uncle you must see this……

కోటి వాటీజ్‌ దిస్‌ ?

మేఘ (proudly) Nata Raja! For my dance teacher…!

నాగే నటరాజ విగ్రహం! ప్యూర్‌ బ్రాంజ్‌ …… కోటీ గారు మీతో చాలా పనుంది….మా అమ్మాయి డాన్స్‌ ప్రొగ్రాం ఏర్పాట్లు మరి ఎలా చేస్తారో ఏం చేయిస్తారో……మా గోపీ ఇదేం పట్టించుకోడు! మా బావగారొట్ఠి బండ మొద్దు.

కోటి ఓస్‌ దానికేటున్నాది ధూం ధాంగా చేయిద్దాఁవు ఆ భారం మా మీద పడీసి మీరు హేపీగా సైట్స్‌ మీద ఫోకస్‌ చెయ్యండి!

నాగే పెద్దవాళ్ళెవర్నేనా చీఫ్‌ గెష్ట్‌ గా…….

క్రిష్ణ (కలగజేసుకుని) సౌందర్యా షూటింగున్నాది….

కోటి సౌందర్యా కాదమ్మా! పెద్దవాళ్ళెవర్నేనా రప్పించి ఆశీర్వదించమంటారు! (నాగేశ్వరితో) కళా తపస్వి టైపులో పెద్దవాళ్ళని ఎవర్నేనా సెట్‌ చేద్దాం లెండి! You please don’t worry about paapaa’s program..!

గూర్ఖా లిమ్కా లాయాహూఁ బాబూ…!

కోటి మేమ్‌ సాబ్‌కో దేనా! మీరు తీసుకోండి మేడం. షో రూం మనోల్దే కంగార్లేకుండా తాపీగా ఏం కావాలో చూజ్‌ చేసుకోండి! (సేల్స్‌ గర్ల్‌ తో) అమ్మగారు మన ఫ్రెండ్సే…కొంచెం చూడమ్మా! మేడమ్‌ ఈజ్‌ ఫెయిర్‌ కాంప్లెక్షన్‌ ! డార్క్‌ కలర్సయితే బాగుంటాయి…. (నాగేశ్వరితో) మరి మేం ఎళ్ళొస్తాం మేడం!

మేఘ (ఆశ్చర్యంగా) What does uncle say?

కోటి (బోధ పరుస్తున్నట్టు) హియర్‌ ఇన్‌ ఇండియా వియ్‌ సే “We will go and come again!” దిసీజ్‌ అవర్‌ గ్రేట్‌ ఇండియన్‌ కస్టమ్స్‌……..

నాగే (నవ్వుతుంది) He is just being nice…. థేంక్స్‌ కోటీ గారూ!

కోటి యువార్‌ వెరీ వెల్కం మేడమ్‌ !

(కోటేశ్వర్రావు, సన్యాసిరావు, క్రిష్ణ మోహన్‌ నిష్క్రమిస్తారు.)

నాలుగవ అంకం
ఒకటవ స్థలం

(సుబ్రమణ్యం గారి ఇల్లు. రెండు వాటాల ఇంట్లో ఎడం వాటా. గోపాల్‌ , రాఘవ, క్రిష్ణ మోహన్‌ తలుపు దగ్గర బెల్‌ కొట్టి నిల్చుంటారు. ఒక పాప పాఠాలు కంఠస్థం చేస్తున్నట్టు వినిపిస్తుంది. వాళ్ళమ్మ చేతులు తుడుచుకుంటూ వచ్చి తలుపు తీసి…….)

రండ్రండి! మీరొస్తారని శెలవు పెట్టేరు. స్నానం చేస్తునారు…రండి!
(హడావిడిగా కుర్చీలు సర్ది, కుర్చీల మీద ఉన్న కాయితాల కట్టలు, ఏష్‌ట్రే,
మాసిన బట్టలు తీసి, కర్టెన్‌ ఎత్తి వెనక గదిలోకి విసిరి, లోపలికి వెళ్తుంది. కర్టెన్‌ వెనక పాప గొంతు )

పాప నుత జల పూరితంబులగు నూతులు నూరిటి కంటెను సూనృత వ్రత యొక బావి మేలు….

అమ్మ సాహితీ?! సాహితి!! (కర్టెన్‌వెనక, మందలింపుగా) ఇదిగో! ఎప్పుడూ తెలుగేనా? ఇంగ్లీష్‌ సైన్స్‌ చదవమని డాడీ చెప్పేరా లేదా? అమెరికా మాఁయ్‌ గారూ వాళ్ళొచ్చేరు. డాడీని వేగం రమ్మను…..తమ్మూ ఏడీ? ఆభిషేక్‌ ! అభిషేకూ? (పిలుస్తూ లోనికి వెళ్తుంది. సాహితి లేచి పెరట్లోకి పరిగెట్టిన చప్పుడు. మళ్ళీ వచ్చి గోడకి ఆనుకుని కూర్చుని పెద్దగా పాఠం కంటస్థం చేస్తూ, మధ్య మధ్య ఆసక్తిగా ముందు గదిలో కూర్చున్న వాళ్ళని చూస్తుంటుంది.)

సాహి The hardware are the parts of computer itself including the Central Processing Unit (CPU) and related microchips, keyboards, monitors, case and drives. Other extra parts or peripheral components or devices include mouse, printers, modems, scanners, and cards. Together…. they are often referred to as a personal computers or PCs………….

(కర్టెన్‌ తీసి సుబ్రమణ్యం కళ్ళీ లాల్చీ తల మీంచి తొడుక్కొంటూ ప్రవేశం.)

సుబ్ర వొచ్చేరు మొత్తం మీద! (డెస్క్‌ వెనక్‌పుస్తకాల కట్టలు పక్కకి తోసి, రివాల్వింగ్‌ చెయిర్‌ లో కూర్చుని…) సాహీ! ఏయ్‌ … అమ్మని ఏసీ ఆన్‌ చెయ్యమన్చెప్పు! snacks, drinks ….?! (సౌంజ్ఞ చేస్తాడు.) (సిగరెట్‌ వెలిగించి పెదాల మధ్య పెట్టుకుని, రాఘవతో) మొట్టానికొచ్చేరు…..!!

రాఘ (టేబిల్‌ మీద పుస్తకం పేజీలు తిప్పుతూ) ఎక్కడేదీ?! ఈయన బిజీ నేను బిజీ క్రిమో బిజీ బిజీ!

క్రిష్ణ సుబ్రమణ్యం గారు మనందరికన్నా సూపర్‌ బిజీ!

సుబ్ర (పలకరింపుగా) ఏం క్రిమో?! కేప్షన్స్‌ రాసిస్తావని జానీ చేత కబురు పెట్టేను? ఆడు చెప్ప లేదా?

(సాహితి ట్రేలో కూల్‌ డ్రింక్స్‌ తెస్తుంది. వెనగ్గా వాళ్ళమ్మ మొహమాటంగా వచ్చి నించుంటుంది.)

సాహి (నిష్టూరం నటిస్తూ) చూస్కో డాడీ! గ్లాసుల్లో తొక్కులూ చీమలు ఏం లేకుండా శుభ్రంగా కడిగి తెచ్చేను…….

అమ్మ ఏయ్‌ ఏంటా మాటలు!

సాహి (గారాలు పోతూ) మా డాడీ పేరు శుభ్ర కధకుడు సుబ్రమణ్యం కద్‌…….దా! గ్లాసులు సుబ్బ…….రంగా కడక్కపోతే కోంపడతా…….రు!

అమ్మ (రాఘవతో, నవ్వుతూ) ఆయనెప్పుడేనా శుభ్రత లేదని తిడతారు. అదీ దీని బాధ…..!ఇదుగో..నువ్వు డాడీ వాళ్ళనీ డిస్టర్బ్‌ చెయ్యకుండా బుద్ధిగా ఇక్కడొచ్చి కూర్చోవే…..(ఇంట్లోకి వెళ్తారు).

రాఘ సాహిత్యంలో శుభ్రత కోసం అంకిత భావంతో కృషి చేస్తారు కాబట్టి శుభ్ర కధకుడు అన్నారు….

సుబ్ర అది మా ఇంటి బాస్‌ ! దాన్నేం అన్లేంలే…! (డెస్క్‌ డ్రాయర్‌ లో వెతుకుతూ) ప్రూఫ్‌ లొచ్చేయి చూస్తారా? ‘మంచి కధ నుండి గొప్ప కధ దాకా మానవ సంబంధ నేపధ్యం’ అని థీమ్‌ ఎస్సేస్‌ రాసిమ్మని పెద్ద వాళ్ళందర్నీ ఆడిగేను. మన కళా కిరీటం పురస్కార సమారోహం, ఊకా గారి షష్టిపూర్తి సభలూ రెండూ కంబైన్‌ చేయిస్తే బావుంటుందని ఇక్కడ మనవాళ్ళందరూ అంటున్నారు?! (డ్రాయింగ్స్‌ తీసి చూపించి) ఇదుగో ఆర్టిష్టు కిరీటాలకి డిజైన్‌ ఇచ్చెళ్ళేడు……..(గుమ్మంలో అలికిడి విని ఆగిపోతాడు)

(చేతిలో హెల్మెట్‌ పట్టుకుని కోటీశ్వర్రావు ప్రవేశం.)

కోటి (చనువుగా లోపలికొచ్చి) ఏటండీ సుబ్రమణ్యం గారు కులాసా? (గోపాల్‌ రాఘవతో) హలో సార్‌ ?!

క్రిష్ణ (ఆశ్చర్యంగా, కొంచెం ఇబ్బందిగా) ఏఁ….ఏంటి బావగారూ?

కోటి (సుబ్రమణ్యంతో) వీర్ని మీటవ్వాలంటే ఎక్కడా చాన్స్‌ కుదరటం లేదు…..మా ఇంటికెళ్ళే తోవే కదా మిమ్మల్నీ ఓ మాటు చూసినట్టుగుంటుందనొచ్చేను….

సుబ్ర రండి కూచోండి. ఊరికే రారు మహాత్ములు!

కోటి అంత డైలాగెందుకు లెండి? వారూ మీరూ మహాత్ములు. మేం ఏదో ఒట్టి మామూత్ములం……(గోపాల్‌ చేతిలో డిజైన్స్‌ చూసి చదువుతూ) కళా కిరీటం కళా పురస్కార సమారోహం…….(సమాధానంగా) ఆఁహాఁ…డిజైన్సా? సింపుల్‌ గా బావున్నాయండి!

గోపా (సందేహంగా) మరీ కిరీటాలెందుకు? Shawl, cash award చాలవా?

సుబ్ర ఆ రెండూ అందరూ ఇస్తనారు. ఇది మనం నేమ్‌ రికగ్నిషన్‌ ఒచ్చేటట్టుగ కొంచెం టేష్ట్‌ ఫుల్‌ గా చేస్తేనే చెయ్యమని ఇక్కడ మనవాళ్ళందరూ అంటున్నారు….. కిరీటాలంటే ఏం లేదు….జష్ట్‌ చిన్న మిస్‌ యూనివర్స్‌ గోల్డ్‌ బేండ్‌ లాగ చేయించి…..బిళ్ళ మీద ఏ ఆర్టయితే దానికి తగ్గట్టు ఒక సింబల్‌ లాగ చెక్కించాలని…….స్వీటెండ్‌ సింపుల్‌ ….

రాఘ పోన్లే మెడల్‌ బదులు ఇలాగ వెరైటీగా ఉంటుంది!

కోటి (కలగచేసుకుని) వారన్న ముక్కా నిజఁవేనండి. మామూలు శాలువలూ, పువ్వల్దండలూ అందరూ ఇస్తున్నారు. మీరు అబ్జర్వ్‌ చేసేరో లేదో…….ఈ మధ్యన మన వాళ్ళు పెద్ద వాళ్ళెవరు పోయినా ఆబ్దీకం పెట్టీ బదులు ఆ డబ్బేదో ఓ సుబ్బరఁవైన కవినో కళా జీవినో పిల్చి ప్రైజూ శాలువా కింద ఇచ్చెస్తనారు. పుణ్యం పురుషార్ధం! అంత దూరం నుండొచ్చినందుకు మీ ప్రత్యేకత తెలియాలీ అంటే ఇలాటి వెరయిటీ ఐటం ఉండటఁవే బెష్టండి! (సుబ్రమణ్యంతో) ఎక్కడ బెత్తాయిస్తున్నారు?

సుబ్ర ఆర్ట్‌ వర్క్‌ అనేసరికి మజూరి చాలా అడుగుతునారండి. గున్నయ్‌ గుప్త గారి షాపులోన ఆరో వంతిమ్మన్నాడు…

కోటి ఎందుకూ? ఆరోవంతు?? చింతాడ రండి….మా అత్తగారు వీర భద్రుడి దుకాణంలో మీ డిజైను ప్రకారం దగ్గిరుండి చేయిస్తారు…

సుబ్ర వీరభద్రుడా? అతను సింహాసనాలు చేస్తాడు కావోలు??

కోటి సింహాసనాలు చేసినోడు కిరీటాలు చెయ్యలేక పోతాడా? (రాఘవతో, గోపాల్‌ తో) అతనయితే మా నాన్న గారి టైం నుండీ మంచి నమ్మకస్తుడయిన కంసాలి. సరుకు దెగ్గిర తేడా రాదు. (తగ్గిపోయి) అహఁ ఇటీజ్‌ జష్టే సజెషన్‌ …… చూడండాలోచించుకుని మరీ నిర్ణయం తీసుకోండి…!

గోపా (గుర్తు చేసుకుని) చింతాడంటే…క్రిష్ణమోహన్‌ ? మీ నాన్నగారూరు కదూ?

క్రిష్ణ ఔనండి! ఇక్కడికి గంటన్నర…అంతే!

సుబ్ర (టాపిక్‌ మార్చి) క్రిమో? పేజీ కిందన ఫిల్లర్స్‌ లాగ మంచి థీమ్‌ కేప్షన్స్‌ రాసిమ్మని అడిగేను? (ప్రశ్నార్ధకంగా చూస్తాడు).

క్రిష్ణ (చేతిలో నోట్‌ బుక్‌ లోంచి తీసి) ఇవిగోండి!

రాఘ (చేతిలో కాయితాలు తీసుకుని, ఒక్కొక్కటీ చదువుతాడు…..)

“మంచి కధ జీవితాన్ని చీల్చుకుంటూ మొలకెత్తే మనిషి
గొప్ప కధ మనిషితనానికి అరుదుగా పూసే మట్టి పువ్వు”

బావుంది! చాలా సటిల్‌ గా అన్నావు! Its a very fine difference, but……
a very important difference! (చదువుతాడు)

“మంచి తనం బాటలలో మానవత్వ రధాన్నెక్కి
రండి మాష్టారూ! రాయాలి మాష్టారూ!!”

“యువతకు స్ఫూర్తి
భవితకు కీర్తి
సమతకు ఆర్తి
నవతకు……???”

ఇక్కడ గేప్‌ ఒదిలేశావేం?

కోటి (క్రిష్ణతో) రైమింగ్‌ వర్డు కుదర లేదా? మూర్తి? కార్తి?? (చిన్నగా) కక్కూర్తి!

క్రిష్ణ (అసహనంగా) మీకెందుకు?

(పక్క వాటాలోంచి విసురుగా కేకలు వినిపిస్తాయి)
ఎవరండీ గుమ్మానికడ్డంగా కారు పెట్టేరు? మా స్కూటరుకడ్డం తియ్యండీ…..
మీ గుమ్మాలంట పెట్టుకోండి……ఇవతలవాళ్ళ గుమ్మాల ముందు పెట్టకండి…

గోపా (కంగారుగా లేచి) అయ్యో కారడ్డంగా పెట్టేనా?

సుబ్ర (కోపంగా లేచి) అడ్డం లేదూ గిడ్డం లేదూ వోన్‌ బ్రదరు కదా ఎందుకెందుకని ఊరుకుంటుంటే తమాష్‌ చేస్తనాడు! ఇప్పుడే ఒచ్చెస్తానుండండి! (లేచి విసురుగా పైకి వెళ్తాడు.)
(ఇంకా ఉంది)
-----------------------------------------------------------
రచన: కనకప్రసాద్, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment